Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మైదానం BY చలం

Showing only the posts of sweet1guy: 134 of 134 posts. Show all posts
#61

    "ఎంత గొప్పదానివి!" అని కళ్ళ కద్దుకున్నాడు.
    అట్లా పదిరోజులు గడిచింది. దాని యింటినించి యిద్దరమూ ఒకరి పక్కన ఒకరం చీకట్లో నడుస్తూ వూరివీధులకీ, దీపాలకీ దూరమౌతూ తుమ్మల్లోంచి మెల్లిగా ఒక్కమాట లేకుండా నడిచి వొచ్చేవాళ్ళం. ఊరు దాటగానే, తాత్కాలికంగా అతను లోకంలో యితరులతో కలిసినా; ఆ మైదానంలో, వొంటరితనంలో అమీరిప్పటికీ నావాడేనని ధైర్యం కలిగేది. ఒకరోజు యింటికి చేరగానే అమీర్ నా మీద యెంతో ప్రేమా, కృతజ్ఞతా చూపాడు. అప్పుడు నాకెట్లా అనిపించిందంటే-అతన్ని చూడగానే యెట్లా అయిపోయిందంటే నా మనసు 'అతని కోసం, అతని సంతుష్టి కోసం ఏం చెయ్యగలను. ఇంకా ఏం చెయ్యగలను? ఏ త్యాగం నావల్లనౌతుంది? ఏ స్త్రీలని అతనికోసం తీసుకురాగలను? నా ప్రాణాన్ని, మౌనాన్ని దేన్ని అర్పించను? నే నెటువంటి బాధపుపడి అతనికి ఆనందం కలిగించను?" అని ఊరికే తపన పడేదాన్ని. నా హృదయంలో మండే ప్రేమాధికారాన్నీ యెట్లాగో అతనికి అర్థమయ్యేట్టు చెయ్యాలనిపించేది. వూరికే కావలింతల వల్ల వ్యక్తమౌతుందా ప్రేమ? అంతా సర్వమూ త్యాగంచేసి యేమీ అతనినించి నేను అనేది లేకుండా నా అహాన్ని చంపుకుంటేనే గాని?
    నేననుకున్నట్టే పన్నెండోరోజు సాయంత్రం నేను అతన్ని ఆమె దగ్గిరికి రమ్మంటే,
    "రాను....ధూ....ధాం...." అన్నాడు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62

    ఆలోచించాను-అమీర్ దాన్ని యెట్లాకోరాడా? యింత స్వల్పంలో విసుక్కునేవాడు అంత తీవ్రమైన బాధ యెందుకు పడ్డాడా అని. మొగవాళ్ళు యెంత యెదిగినా పసిపిల్లలే యీ విషయంలో అనిపించింది. వాళ్ళకి కలిగిన బాధ యేమిటో, యెందుకో, వాళ్ళ వాంఛల కర్థమేమిటో తెలుసుకోలేరు. వారిని ప్రేమించే స్త్రీలు వారి తల్లులై వారినర్థం చేసుకోవాలి. మొగవాళ్ళకి అట్లాంటి మార్పులు సహజంగా కావాలనిపిస్తాయి గావును- స్త్రీ నెంత ప్రేమించినా, ప్రేమ యెక్కువైన కొద్దీ దాన్ని భరించలేక.... అనుకున్నాను. కొందరు స్త్రీలు మొదట్లో నావలె మూఢులై తమపైని మొగవారి మనసు పోయిందని యేడుస్తారు. అమీర్ హృదయం నాదైనప్పుడు అతనెందరు స్త్రీలతో వుంటే నాకేం? అతని కానందం కలిగిస్తున్నాననే ఆనందం కన్న వున్నతమైన దేమున్నది నాకు? అమీర్ నాకంత సౌఖ్యమిచ్చాడే నేనీ చిన్న సౌఖ్యాలతనికి సమకూర్చలేనా?
    తరవాత నాలుగు రోజులకి ఒకరాత్రి చీకట్లో పడుకుని అమీర్ తన మోచేతి మీద ఆనుకుని నా మొహం వెతుక్కుంటున్నాడు. కొండల్లో నక్కలు కూస్తున్నాయి. మిణుగురులు యెగురుతున్నాయి. గడ్డిలో అప్పటిదాకా వెలిగిన కొండమంటలు చల్లారి చీకటి నెక్కువ చేశాయి. ఆ చీకట్లో నల్లని ఆకారం మావేపు నడిచి వొచ్చింది. అమీర్ చెయ్యి కింద నా భుజం వొణికింది.
    "అమీర్".
    ఆ దూదేకుల మనిషి! తురక!
Like Reply
#63

అమీర్ నన్ను చప్పున వొదిలి, లేచి కూచున్నాడు. నేను దూరంగా జరిగి చీరె కోసం వెతుక్కున్నాను. ఆమె వొచ్చి అమీర్ దగ్గిరగా కూచుంది. నేను లేచి యేటి దగ్గిరికి వెళ్ళి, నీటి వొడ్డునే యిసకలో కూచున్నాను. ఏటి ప్రవాహంలో చుక్కలు పువ్వుల్లా కొట్టుకొని పోతున్నాయి. ఇసికలోంచి యీడ్చుకుంటూ పోయే గాలి చప్పుడూ, గులకరాళ్ళ మీద దొర్లే నీళ్ళ గలగలా వినబడుతున్నాయి. వొంటరిగా కూచున్న నన్ను రాత్రీ ఏరూ గుర్తుపట్టాయి. నా ముందరి పెద్ద ఆకాశం. విస్తీర్ణ మైదానం చీకట్లో ఆ మూల ప్రేమించుకునే వాళ్ళిద్దరూ-అంతా ఈశ్వరుడి సౌందర్యాన్ని నాకు దగ్గిరగా తీసుకొచ్చాయి. నా హృదయం ఆనందంతో నిండింది. అమీర్ కోసం నేను ఆ నిమిషాన చేసిన త్యాగం పరమేశ్వరుడి కరుణని నామీద వర్షింప చేసిందేమో అన్నంత ఔచిత్యాన్ని కలిగించింది. నా కింకేం కావాలి లోకంలో! నా ప్రేమని, నా గతిని, నా ఆనందాన్ని తలుచుకున్నన్నాళ్ళు నా హృదయం మండి అమీర్ని తలుచుకున్నప్పుడల్లా ద్వేషంతో వుడికి, బాధతో తపించాను. కాని ఎప్పుడు నా స్వంతసౌఖ్యాన్ని, స్వంత బాధ్యతని మరిచి అమీర్ ఆనందంతో నా జీవిత సమస్యల్ని ఐక్యం చేశానో, ఎప్పటినించి నా జీవితోద్దేశ్యం అతని ఆనందానికి త్యాగమేనని నిశ్చయించుకున్నానో ఆ నిముషాన్నించి ఆ కోపమే ద్వేషమే అమృతంగా, మాధుర్యంగా మారి నన్ను దివ్య ప్రేమానుభవంలో ఓలలాడించింది. ఆ యిద్దర్నీ అక్కడ, నాచోట, నా మైదానంలో నా భుజమానుకున్న చోటనే ఆమె భుజం.
Like Reply
#64

పెదవులు అతని పెదవుల మీద వొదిలి వొచ్చిన నా ప్రేమ రెక్కలు విచ్చి నన్ను నక్షత్ర మండలంలోకి తీసుకుపోయింది. మెల్లిగా నా దృష్టి, నా దృష్టి వెంట నా ఆత్మా, మైదానపు చీకట్లో ప్రసరించి, వ్యాపించి ఆక్రమించుకుని అంతా తానై కొండలమీదనుంచి కొండశిఖరాన మెరిసే నక్షత్ర కాంతిలో లీనమయింది. అమీర్నేకాదు- అమీర్ని, అతని ఔన్నత్యాన్నీ ప్రేమించి అతనికోసం విరహపడి ఆ అర్థరాత్రి వొచ్చిన ఔన్నత్యాన్నీ ప్రేమించి అతనికోసం విరహపడి ఆ అర్దరాత్రి వొచ్చిన ఆ తురకదానితో, దాని ప్రేమతో సానుభూతి కలిగింది, నా ఆత్మలో. నేనూ, యే స్వల్పత్వాన్నీ యెరగని ఆ రాత్రి సౌందర్యమూ వొకటేననిపించింది. నా వలనే ఆ నీలాంబరం, తనకింద కలుసుకునే ప్రియులకి చల్లని ఆనందాన్ని కల్పిస్తోంది. అమీర్నించి నా ప్రేమత్యాగపు పక్షాలమీద విస్తీర్ణమై, లోకాన్నంతా ఆవరించింది. మన బాధతో యింకొకరికి ఆనందాన్ని కల్పించామనే జ్ఞానంకాన్న గొప్ప ఆనందం లోకంలో లేదు అనిపించింది.
నా ఆత్మనంతా ఆ విస్తీర్ణపు అంధకారంలో కలిపి నన్ను నేనే మరిచి కూచున్న నన్ను, వెనకనే రెండు చేతులు కావలించుకున్నాయి. నా జుట్టులోంచి వొచ్చి నా మెడని రెండు పెదవులు ముద్దు పెట్టుకున్నాయి.
    "ఎందుకు వొచ్చేశావు, నన్ను దాంతో వొదిలి?"
    "పాపం. నీమీద యెంత యిష్టం లేకపోతే, బంధువుల్నీ, మర్యాదనీ, యీ అర్థరాత్రి తన యింటినీ వొదిలి వొస్తుంది?"
Like Reply
#65

    "నా కఖ్కర్లేదది."
    "దానికోసం నువ్వుపడ్డ బాధ జ్ఞాపకం లేదూ?"
    "అయితే-"
    "దానికిప్పుడల్లా వుండదూ? మూలనున్నదాన్ని లాక్కొచ్చి, మనసు లాగి నువ్విప్పుడు వొదిలేస్తే-"
    కొంచెం వూరుకున్నాడు.
    "నువ్వు రోషపడక, దానివేపు మాట్లాడటం నాకు బావుండలేదు. కోపంతో తగూలాడితే, నిన్ను ఓదార్చాలనిపిస్తోంది....ఈసారి వొస్తే దాన్ని తన్నేస్తాను. దానికి సిగ్గూ, గిగ్గూ యేమీలేదు."
    మొగవాళ్ళ హృదయం యెంతలో కఠినమౌతుందో, కాని స్త్రీలట్లా అమీర్ని ప్రేమించడం నాకు చాలా సహజంగా కనపడ్డది. ఒకవేళ నామీద ప్రేమ పోయినా, నన్నూ అమీరిట్లానే అంటాడా అని భయమేసింది. జాలీ ప్రేమా యెంత దగ్గిరిగా వుంటాయి! ప్రేమ పోయిం తర్వాత, పోనీ జాలికూడా చూపరు.
    "అమీర్, నీకెందుకు ఆమెమీద అంత అసహ్యం కలిగింది?"
    "ఏం చేస్తుందంటే! నన్నంతా నలిపేస్తుంది. నాకు వూపిరాడనీదు. నా కాలు...."
    నాకు నవ్వొచ్చింది. సిగ్గుపడుతూ "నన్ను నువ్వు? అమీర్?" అన్నాను.
    "కాని ఆడది...."
    ఆ చీకట్లో యేడుస్తూ నన్ను తిడుతూ, బెదిరిస్తూ వొచ్చింది ఆ మనిషి. తనూ మంచిదే. అమీర్ మంచివాడే. నేను చెడ్డదానినైనాను.
    పాపం, ఒకత్తా, వొచ్చిన దోవనే తిడుతూ వెళ్ళేదాన్ని చూసి చాలా జాలేసింది నాకు ఏం చెయ్యను పాపం!
Like Reply
#66

                               5
 
    ఆనాడు శరద్రాత్రి. అమీర్ వేళ్ళు నా మెడమీద శ్రుతులను నొక్కుతున్నాయి. నా జుట్టు గాలిలో అతని మొహంమీద ఆడుకుంటోంది. ఇద్దరూ ఆ వెన్నెల ప్రపంచంలో నీడలేని ఆ కొండమీద భూసౌందర్య మీక్షింప వచ్చిన దేవతలవలె నుంచున్నాము. కిందికి కళ్ళు తిప్పితే మా చిన్ని గుడిశా. నదీ, పటాలలోని బొమ్మలవలె కనిపించాయి. ఆనందంతో నా మనసు పరవశత్వం చెందింది. వరుసగా తరుముకుంటూ పావురాల్లాగు తెల్లనియీకెలమబ్బులు యెగుర్తున్నాయి. మా వెనక ఆ పాత కోట వుంది. తిరిగిచూసి, దాంట్లో మా సైన్యమూ, మంత్రులూ పరిజనమూ నిద్రపోతున్నట్లు మేము మాత్రం అర్థరాత్రి లేచి బైట నుంచుని మా వెన్నెల రాజ్యాన్ని పరీక్ష చేస్తున్నట్టూ; అప్పుడే లోపలికి పోయి హంసతూలికా పాన్పుపైన విశ్రమింప బోయేట్టూ అనుకుని ఆ సంగతులు అమీర్తో చెపుతున్నాను. ఇద్దరమూ తురకంలో మాట్లాడుతున్నాము.
    నా తురకం యేడిసినట్టే వుంది. కాని అమీర్ తురకం మాత్రం అద్భుతంగా వుంది. అట్లాంటి దర్జా రాజభాషకి తురకమే తగును.
    "సార్వభౌమా! భుజబలంతో జయించి, శత్రువుల దునుమాడి, బీడుపరిచిన యీ మహారాజ్యాన్ని అర్దరాత్రి నా కన్నుల పండువుగా ఒక్కసారి వీక్షింపనియ్యండి. కాని ఆ యేటి పక్కనున్న చిన్న కుటీర వాసుల్ని, ఆ నిర్భాగ్యుల్ని నా ప్రార్థనను మన్నించి ప్రాణాలతో వొదిలినందుకు సమస్త రాజమస్తక విరాజిత మకుటమణిమయ కాంతితేజములైన మీ పాదాలకు నమస్కరిస్తూ యున్నాను. ఆ క్షుద్ర కుటీరమున నున్న ఆ దంపతులెవరో మీరెరుగుదురా?"
    "ఆ, మన అమాత్యవరుడు చెప్పగా వింటిని. ఆ పురుషుడు మర్యాదయు, నీతియులేక కులాంగనల చెరువుటయే వ్రతముగా గల తుర్ ష్కాధముడట."
    "ఆ స్త్రీ...."
    "అది సిగ్గును, అభిమానమును త్యజించిన కులట....వారిని శిక్షింపక వదలగలనా?"
"మహారాజా! దుర్గంధమున నివశించు పురుగులవలె వారిని ఆ పాపమున బ్రతుకనిచ్చుటే మహాశిక్ష."
    "రాజ్ఞీ! వారితో నేమి! తలచుకొనుటకైన తగని ఆ తుచ్చుల ప్రస్తావన మానుము...."
Like Reply
#67

    "నీ ముఖ సౌందర్యాన్ని కోరి, చంద్రుడు మేఘముల మాటున దాగుకొన్నాడు. నీ ముద్దు పెదవులు తాకి, ఆ పరిమళము వల్ల యిదేదో కొత్త పుష్పమును భ్రాంతితో ఆనిలుడట్టే నీ చుట్టూనూ మూగుచున్నాడు. నీ చుట్టూనూ వెన్నెల కొంచె మెర్రకాంతిని పొందుటచేత సూర్యోదయ మయిందా అని కోవెల మేల్కొనది. నీవీ ప్రపంచము నిట్లు క్షోభపెట్టుట న్యాయము కాదు. నీవు లేక చిన్నపోయి విచారగ్రస్తమైన శయ్యాగృహాన్ని నీ నేత్ర కాంతులతో వెలిగించుము."
    "మీ నేత్ర ప్రతాపాగ్నిని చూచి భయపడి సర్వ ప్రపంచమునూ నిశ్శబ్దమయినది. చిరకాలము మేఘముల వెనక దాగుకున్న చంద్రుడు సోమరి అని, మీరాగ్రహించెదరని బయటకు పరుగెత్తి మీ కళ్ళవంక భయంతో వీక్షించుచున్నాడు. మీ భారమును మోయలేక మన పాదముల కింద ఈ నగాధిపతి వణుకుచున్నాడు. మీ సౌందర్య మహిమను ప్రేమించి మ్లేచ్చాధముని కుటీరంబున బంధింపబడ్డ యింతి విరహతావమున యేడ్చుకన్నీళ్ళే ఆ యేరు. ఆమె నిట్టూర్పు....
    అమీర్ కొట్టవచ్చాడు. నేను పరుగెత్తాను. తొరలోనే అలిసిపోయి ఆగాను. ఎందుకో అమీరు నన్ను అందుకోవడమంటే భయమేసింది.
    కొండ అంచున నుంచుని "యింక వొస్తే దూకేస్తాను" అన్నాను.
Like Reply
#68

    "దూకు చూస్తాను" అంటూ వొస్తూ వున్నాడు. నాకు నిజంగా దూకెయ్యాలనిపించింది. దూకి అతని కళ్ళల్లో బాధని చూడాలని కోర్కె కాబోలు! అతనికి నామీద వ్యధ కలిగించి, మోహపు అంతుని కనుక్కోవాలనే ఆశ గావును. తప్పించుకో చూసే నన్ను పైకెత్తి మేకపిల్లని లాగు మోస్తూ తీసుకొని వెళ్ళాడు. గట్టిపడ్డ అతని దండలమీద చేతులువేసి పట్టుకుని కిలకిలనవ్వుతూ యిటూ అటూ చంటిపిల్లవలె తన్నుకుంటున్నాను. అతనికి యెదురుదెబ్బ తగిలి 'అబ్బా' అంటే కొంచెం సంతోషం వేసింది. దెబ్బ బాధతో పళ్ళు బిగించి నన్నాడనీకుండా తన రొమ్ముకి నా ఎముకలు విరిగేటట్టు వొత్తుకుని, వెళ్ళి చదునుగావున్న రాతిమీద పడుకోబెట్టాడు.
    'నీ మూలంగా నాకెంత దెబ్బ తగిలిందో చూడు' నేను పకపక నవ్వాను. ఎత్తయిన ఆ ప్రదేశంలోంచి లోయలోకి నా నవ్వు ప్రతిధ్వనించి మూడుసార్లు నవ్వులు దూర దూరంగా వినబడ్డాయి. అమీర్ రొమ్ముపైన తల పెట్టుకుని వెన్నెలలో నిండిన దక్షిణ దిక్కుకేసి చూస్తూ శాంతంగా పడుకున్నాను.
    సంపూర్ణమైన సంతుష్టితో నా చెయ్యి గరుకైన అతని చంపల్ని రాస్తూ అతని మొహంమీద జుట్టును తాకుతోంది. చల్లగా, తెల్లగా. మా వొంటినిండా, కళ్ళనిండా, గాలినిండా వెన్నెల వుక్కిరిబిక్కిరయింది. కోట గోడలకింద దాక్కున్న చీకట్లు గంభీరంగా కనపడ్డాయి. ఆ కొండపైన నివశించి యీ వెన్నెల్ని అనేక శరత్కాలాలు అనుభవించిన రాణుల ఆత్మలు నా చుట్టూ మూగినట్టు అయింది.
Like Reply
#69

ఈ పర్వత రంగంమీద ఎందరు వెన్నెలలో కూడా కందగల లావణ్యంగల రాచ స్త్రీలు, ప్రియులకోసం విరహాలు పడ్డారో, ఎన్ని రహస్య సంకేతాల నేర్పరచుకున్నారో, వాళ్ళలో అదృష్టవంతులెందరు ప్రియుల్ని కలుసుకుని, శీఘ్రరహస్య గాఢాలింగనాన్ని అనుభవించారో, ఎన్ని భగ్నమైన హృదయాలో, వెన్నెలి వేడెక్కించే నిట్టూర్పులో, కన్నీళ్ళో, నవ్వులో - ఏమైనారు వాళ్ళందరూ! ఇక్కడే యీ కొండచుట్టూ వేళ్ళాడుతున్నారా? నేను అమీర్ కూడా అంతేనా, అట్లానే కాలంలో మాయమైపోతామా?
    అమీర్ పెదిమెలు నా ముఖాన్ని గట్టిగా ఆఘ్రాణిస్తున్నాయి తుఫాను మొదలని వాకర్థమవుతోంది. ఇంత శాంతంగా పాల సముద్రంలో తేలే పర్వత శిఖరాలమీద నిద్రపోతున్నట్టు వున్న ఆ మధురమైన శాంతాన్నెందుకు అతను కలవరపరచడం?
    "ఇంత వెన్నెలలో నిన్ను చూడాలి. నీటి చిన్ని అలమీద వలె నాట్యమాడే వెన్నెల నీ జుట్టుమీద చిన్న చిన్న చిందులు తొక్కితే చూడాలి. అలిసి నీ పక్షాల నీడలకింద నిద్రపోతాను" అని నన్ను ఒక్క నిముషంలో వివస్త్రను చేసి చూశాడు ఆనంద ముద్రిత నేత్రాలతో.
    అమీర్ తెలుగుదేశంలో పుట్టి, నన్ను పట్టుకుని యీ యెడార్లలో పడివుండక, యే పారవీక దేశంలోనో పుట్టివుంటే మహాకవి అయ్యేవాడని నా ఉద్దేశ్యం.
    "నల్లని గోదావరీ తరంగాలమీద చూశాను. మళ్ళీ నీ జుట్టుమీద చూస్తున్నాను, యీ వెన్నెల చిందులు" అంటాడు.
Like Reply
#70

    జుట్టు నా మొహం మీదపడే వొంపుని చూసి "నల్లని సముద్ర తరంగాలు వంపు తిరిగి తెల్లని నదురుమీద పరుగెత్తుతూ మీద పడేందుకు వస్తున్నట్లు భయమేస్తుంది" అంటాడు. ఆ రాత్రి మాత్రం చిత్రకారుడై వుంటాడనిపిస్తోంది. నన్నట్లా చూసి పొట్టదగ్గర చెయ్యేసి 'ఇక్కడ యీ యెత్తేమిటి? యిట్లా సాగిందేం?" అన్నాడు.
    ఇంకా నాకే నిశ్చయం లేందే, యెవరూ కనిపెట్టటం సాధ్యంకాక ముందే, కళారసజ్ఞుడు అందమైన వొంపులకీ కానివాటికి నూరోవంతు భేదమయినది తెలియగల అతని కళ్ళకి తెలిసింది.
    వూరికే గుడ్డిగా ప్రేమించబడటం ఒక విషయం, ప్రేమిస్తున్నారని సంతోషంగా వుంటుంది. కాని అటువంటి రసజ్ఞుడు సౌందర్యారాధకుడు ప్రేమిస్తూ యెందుకు ప్రేమిస్తున్నాడో, దేన్ని ప్రేమిస్తున్నాడో తెలుసుకుని ప్రేమించి ప్రేమని పొంది, అతను ప్రేమించగల సౌందర్యాన్ని కలిగి ఉన్నాననే జ్ఞానం గొప్ప గర్వాన్నిస్తుంది. అమీర్ చూపుల్ని నిలిపివేయగల నా శరీరంమీద నాకంత ప్రేమ!
    "నా కోసం, నా కళ్ళని మెరిపించేందుకు నా చేతుల్ని లావణ్య వరాలతో నింపేందుకు మీ వాళ్ళు, మీ బ్రాహ్మలు తపస్సులుచేసి, దేవతల్ని మెప్పించి నిన్ను కన్నారు" అనేవాడు. ఆ అమీర్ నా అందాన్ని తప్పుపట్టాడిప్పుడు కాని నాకది బాగానే వుంది. గంతులేసే నా మనసు అతన్ని కంఠంలోని బాధని వినదలచుకోలేదు.
Like Reply
#71

    "అమీర్ అది ఇంకా యెక్కువయేటట్టు వుంది. లోపల ఎవరో స్థలం కోసం వెతుక్కుంటున్నారు" అన్నాను.
    ఎంతో సంతోషంగా అమీర్ నన్ను మీదపడి నలిపేస్తాడో చీల్చేస్తాడో అనే భయంతో చేతులడ్డంగా పెట్టి కళ్ళు మూసుకున్నాను. ప్రళయాన్నెదురు కోడానికి తయారౌతున్నాను. కాని అతను తలవంచుకుని ఆలోచిస్తూ పెదవి కొరుకుతూ నుంచున్నాడు.
    'ఇంక రా యింటికి వెడదాం' అని నిరుత్సాహమైన గొంతుకతో నెమ్మదిగా అన్నాడు. నా మనసులో రాయి పడ్డది. వెన్నెల మాయమయింది. నా అమీర్ ముఖంలోని ఆ ఒక్క నిర్ణయం అయిన చూపుతోనూ, 'ఈ ఎత్తేమిటి?' అన్న ఆ ఒక్క మాటతోనూ నా జీవితాకాశం మీద నల్లని మేఘాలు కమ్మాయి.
    "చూడు. ఆ పొట్ట దగ్గిర వ్యవహారం నాకేమీ బావుండలేదు. దాన్ని ఎట్లానన్నా వొదిలించుకో-"
    "యేం చెయ్యను?"
    "పోగొట్టుకో"
    "నీ బిడ్డ అమీర్!"
    "నా బిడ్డ కాదు, దెయ్యం. బిడ్డ వొద్దూ, మొద్దూ వద్దు చంపెయ్యి."
Like Reply
#72

    నేను మాట్లాడలేదు. ప్రేమకోసం అమీర్ తో వచ్చేశాను. ఇక రెండో ఆలోచనలేదు. కాని యిప్పుడా పని చెయ్యడమంటే పెద్ద భయం మొదలుపెట్టింది. దేనినన్నా చంపడం, ఎవరి డబ్బన్నా దోచుకోడం, అన్యాయంగా సాక్ష్యం చెప్పి ఖైదుకు పంపడం-యీ పనులు చెయ్యవలసి వస్తే ఎట్లాంటి పాపభయం తోస్తుంది? అట్లా వుంది. ఈ పనితో దేవుళ్ళందరికీ నా మీద కోపం వస్తుందనీ, అమీర్ ని నన్నూ ఎట్లానో శిక్షిస్తారని వొణుకు పట్టుకుంది. ఇప్పుడూ అట్లానే అనిపిస్తోంది. నిజంగా శిక్షించారేమో-
    అదిగాక ఏదో ప్రేమకూడా అప్పుడే ఉదయించింది. దేనిమీదనో తెలియని దానిమీద. అమీర్ పడే అసహ్యంకూడా నా యీ భయాన్ని జయించలేకపోయింది. తల్లి తన పిల్లలకైపడే రక్షణోద్రేకం నా కప్పుడే కలిగింది. అమీర్ హంతకుడైనట్లూ, నేను ఆ అనాధ శిశువుని రక్షించవలసినట్లూ, రక్షణ కోసం అది నన్ను వేడుకొంటున్నట్లూ తోచిందిప్పుడు. ఏమైనా సరే నన్ను అమీరు ఒదిలివేసినా, నా బిడ్డని రక్షించుకోవాలని నిశ్చయించుకున్నాను. అతనెంత బతిమాలినా నేను వొప్పుకోలేదు. నాకే అర్థంకాని, ఎన్నడూలేని మొండిపట్టు ఒకటి బయలుదేరింది నాలో. అతని మీది నా గొప్ప మోహాన్ని మింగివేయగల యింకోశక్తి నాలో పెరిగింది.
Like Reply
#73

ఆ కోపంతో అమీరు అక్కడక్కడ తిరుగుతున్నాడు. నే ఒంటరిగా కొండమీద తేలే నీడల్ని చూస్తూ కూచునేదాన్ని. కాని అంత వొంటరి అనిపించేది కాదు. అమీరు ఒకరోజు తాగివచ్చి నన్ను కొడ్తాడు. కాని తరవాత పశ్చాత్తాపంతో ఎంతో ప్రేమ చూపాడు. ఒకనాడొక దక్షిణాది చీర తీసుకొచ్చి నాకిచ్చాడు. నేను యిదేమిటా యితనికి యీ చీరలమీద శ్రద్ధ అనుకున్నాను.
    "నాకు కనబడకుండా యిది కట్టుకో" అన్నాడు. నా మొహంమీద ఉమ్మేసినట్లయింది.
    నా జీవితం యేం కావాలి? విచారం గట్టిగా పట్టుకుంది. అమీర్ నాలుగైదు రోజుల నుంచి అసలే కనబడడంలేదు. నేను ఆ పనిని వొప్పుకుంటేనే కాని అతనితో యింక సఖ్యంలేదని తెలియజేశాడు. నన్నీ విధంగా ఒంటరిగా నమ్మించి, తీసుకొచ్చి, యెంత చెప్పినా నా భయాన్ని అర్థం చేసుకోక నన్ను యిట్లా వదిలివేసే అతని కఠినత్వానికి యెంతో కోపం వచ్చింది. యేడుపొచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం పెద్ద పోట్లాటయింది.
    ఆ ఆరునెలలూ తాను యెక్కడికో వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళవద్దని నేనేడ్చాను. అయితే తన మాట వినమన్నాడు. వినకపోవడానికి కారణం చెప్పమంటాడు. చెప్పడం యెట్లానో నాకు తెలీదు. మొండికేసి మాట్లాడకుండా మూలకూచున్న నన్ను చూసి పళ్ళు కొరికి కర్ర తీసుకొని బాదాడు. నేను మాట్లాడలేదు. చప్పున పెద్దగా ఏడ్చాడు.
    "దీని మూలాన్నే, యీ పాడు పిశాచం మూలానే నీకూ నాకు చెడిందని" నా డొక్కలో ఒక తన్ను తన్నాడు; ఎందుకో అతని మీద అంత కోపంలోనైనా అతని కాలుని ముద్దు పెట్టుకోవాలనిపించింది. అదుగో తృణీకారం కనబడుతోంది నీ ముఖంలో కాని అమీర్ని చూశావా?
Like Reply
#74

    కోపంలో కళ్ళు యెర్రగా రుద్రుడివలె మెరుస్తూ, ఆ పెద్ద చేతులు బిగించి-అట్లాంటివాడికి అంత ఆగ్రహం తెప్పించేటంత అదృష్టం ఎవరికి కలుగుతుంది? కోపం వచ్చింది. కాని అతనిపైన గౌరవం అధికమైంది. దృఢంగా కోపం తెప్పించుకుని నిస్సంశయంగా కొట్టగలిగిన వాళ్ళని చూస్తే ఉండదూ మరి....?
    హత్య అయినా సరే. ఆత్మహత్య అయినా సరే చెయ్యమంటారు. తమ కోసమూ, నీ కోసమూ తాము చేస్తారు. యే చిన్న భయాలూ, సందేహాలూ, పాపాలూ, వాళ్ళనేమీ అంటవు. వాళ్ళకి అర్థంకావు. వాళ్లు ప్రేమ చూపినా, ద్వేషం చూపినా దేవతలే. ఆ దేవతలకి చేసినట్లే ఆత్మార్పణం చెయ్యాలి. దేహాన్నీ, ప్రాణాన్నీ, పిల్లల్ని అర్పించాలి, వాళ్ళ పాదపీఠాల వద్ద. ఈ చచ్చు మొగుళ్ళు అట్లాంటి త్యాగం అడిగేటంత సమర్థులు కారు. గయ్యాళిగంప భార్య రోడ్డుమీద పడి అరిస్తే నోరు మూసుకున్నాడు. మా వూరి కరణం. బళ్ళో కుర్రాడితో తన కళ్ళముందు కాపరం చేస్తున్నా బయటికెక్కడ కొస్తుందోనని కనిపెట్టి కడుపులో దాచుకున్నాడు హెడ్మాష్టరు. నేనే ఇంకోడి కోసం కన్నెత్తితేనా ఇక్కడే నరకడూ అమీర్? నన్నే యింకొకడు కన్నెత్తి చూస్తేనా? వాడి కళ్ళు పెరికి పాతిపెట్టడూ? పదిమంది వొచ్చి మీదపడ్డా, తనని నరికినా, నన్ను వాళ్ళకి వొదిలి పరిగెత్తుతాడా? విస్తరినిండా తుంపర్లు పడేట్లు తిడతారు. దొంగతనంగా బుగ్గలు మెలేస్తారు, అంతేకాని దిమ్మతిరిగేట్టు అమీర్ మల్లే కొట్టమను మన మొగాళ్ళని.
Like Reply
#75

అసలు వాళ్ళ చేతుల్లో సత్తువ ఏడుస్తేగదా! ప్రతిష్ట దేవతని పూజ చెయ్యడం తప్ప యింకేమీ చాతకాదు మన పురుషులకి.
    ఆ రాత్రి పెద్దవాన, సాయంత్రం నించి యెడతెరిపిలేక కురుస్తోంది. దీపమన్నా లేని ఆ చిన్న గుడిసెలో యిద్దరమూ కూర్చున్నాము. ఏ నిమిషాన ఆ పైకప్పు ఎగిరిపోతుందో అనుకుంటున్నాను. జగమంతా జలమయమయినట్టూ, మేమిద్దరమే ఆ చిన్న నావలో అనంతయాత్ర చేస్తున్నట్టు అనిపించింది. ఇంక తెల్లవారదు. తేలుతో యే లోకానికో, యే ఒడ్డునో చేరుకుంటాము అనుకున్నాను. ముందేదో అపాయం రాబోతుందనిపించింది. అప్పుడన్నా అమీర్ ఆ రాయివంటి మౌనాన్ని వదులుతాడా! ఎంత రాత్రి అయిందో తెలీదు. అప్పుడప్పుడూ యోచనలోనూ, కునికిపాట్లలోనూ తూగుతున్న నాకు రోజులో, వారాలో జరిగిపోయినట్టు తోచింది. ఇంత ఆ చిక్కని వూపిరాడని నిశ్శబ్దాన్ని భరించలేక పిలిచాను. జీర్ణమైన ఆ గుడిశని చలిగాలి, చినుకులతో సహా యీ మూల నించి ఆ మూలకి వూడ్చుకుంటూ పోతోంది.
   "అమీర్!" మాటలేదు.
    "అమీర్!", అంతే-
    మెల్లిగా కదులుతో, చేతులతో, తడుముతో వెళ్ళాను.
Like Reply
#76

    నా కాళ్ళు అతని కాళ్ళకు తగిలి ముందుకు తూలిపడ్డ చేతులమీద అనుకున్నాను. అతను కదలక అట్లాగే పడుకున్నాడు. కోపంతో మండిపోవడంలేదు గదా? నేను మోకాళ్ళ పక్కనే కూచున్నాను. అతని శ్వాసా, వానహోరు చప్పుడూ? ఆకాశం భగ్గుమని వెయ్యి కాగడాలతో వెలిగింది. ప్రళయం వొచ్చింది. మేమిద్దరం నాశనమనుకుని వొణికాను. పెళ పెళ ఆకాశం విరుచుకుపడుతూ వుంది.
    "అమీర్! చచ్చాను" అని అతన్ని కావలించుకున్నాను.
    "రాజా!" అని నన్ను గట్టిగా కావలించుకున్నాడు.
    ఏటి ప్రవాహం మోగుతోంది. గాలి గుడిశ గడ్డిలో నుంచి దూసుకుపోయింది. మెరుపురానీ, ఉరుములు రానీ ప్రళయమే రానీ యింక భయం లేదు, ఆ రెండు చేతులూ నన్ను రక్షిస్తున్నంతసేపు.
    "యెన్నాళ్ళకి! మళ్ళీ యెన్నాళ్ళకీ"
    దగ్గిరిగా, యింకా దగ్గిరిగా జరిగి, వొత్తుకుని, అణిగి, ఐక్యమై పోయినాను.
    మాట్లాడలేనంత ఆనందంలో మునిగిపొయినాను.
    "అమీర్!" "అబ్బా భరించలేను" అంతే.
    వాన మళ్ళీ యింకా నాలుగు రెట్లుగా ప్రారంభించింది.
    అమీర్ 'నా మాట వినవా?' అన్నాడు. తన చేతులతో రొమ్ములో నన్ను అదుముతూ-
    "ఈ మెత్తని శరీరంలో ఎక్కడ వుంది ఆ పట్టుదల, ఆ పెంకితనం?"
    "పెంకితనం లేదు" అన్నాను.
Like Reply
#77

    'అవును.' పెంకితనం కాదనీ, నా శక్తికి మించిన ప్రోద్భలమనీ చెప్పాలనుకుంటాను. మాటలు తెలీవు. అమీరుకి తెలిసేట్టు యెట్లా చెప్పాలో తెలీదు. మాట్లాడలేదు. కాని అతనినట్లా బతిమాలుకుంటే నా కోసం, మా ప్రేమకోసం, మా ఆనందం కోసం-
    మాట్లాడలేదు. నా కంఠం విచారంతో పట్టుకుపోయింది.
    "నీకు నా మీద ప్రేమ వున్నదన్న మాట అంతా అబద్ధం. నీకోసం నన్ను చావమను. నా రక్తమంతా కార్చమను. నా తండ్రిని నరకమను వెనుతీస్తానా?"
    ఉత్త ప్రగల్భాలు కావనీ, వెనుతీయడనీ నాకూ తెలుసు.
    "ఇంతేనా? ఇంత క్రూరమైనదానివా? నా మీద అసహ్యం పుట్టి నన్ను వొదుల్చుకోడానికి చూస్తున్నావా?"
    క్రూరమైన మాటలవి. కాని అమీర్ కంఠంలోని జాలి వాటికి భయంకరమైన లోతును కలిగిస్తూ వుంది-
    "రాణీ! ఇంతేనా మనకి?"
    రెండు వేడి కన్నీటి చుక్కలు పడ్డాయి. అవి అతని కళ్ళలోనించి రక్తపు చుక్కలయినట్టు భయపడ్డాను. అమీర్ కళ్ళలోంచి నీళ్ళా౧ నల్లరాతిలో నించి! యింక ఆగలేను. పోనీ సరేనంటా. యే త్యాగమైనా యింకా సంకోచింపగలనా?
Like Reply
#78

    మెల్లిగా గుండ్రంగా నా పక్క ఎముకల్ని-కాదు నా గుండెల్ని- నా ఆత్మని-తాకుతూ తన చిన్న కాళ్ళతోనూ, పెదిమలతోనూ రాసుకుంటూ కదిలింది. నా మొహం తిరిగింది. యేమనను? ఎట్లా? తన ప్రాణం కోసం, పాపం ఆ నోరులేని దిక్కుమాలిన ఆ చిన్నకూన తన ప్రాణం కోసం వేడుకొంటోంది?
    అమీర్ బిడ్డ?
    "నా చేతకాదు అమీర్?"
    మొహంమీద ఉమ్మి పడ్డవాడివలె లేచాడు అమీర్. ఆకాశం మెరిసింది. అమీర్ ముఖాన నిప్పులు రాలుతున్నాయి. ఏం చేస్తాడో, యేమంటాడో అనుకుంటూ వున్నాను.
    ఆ పెద్ద ఉరుము మధ్య పిడుగువలె అతని మాటలు నా చెవిమీద పడ్డాయి.
    "నేను వెడుతున్నాను."
    సీత నడివికి పంపించ నిశ్చయించుకున్న రామున్ని కన్నీళ్ళెంత మాత్రం కరిగించగలవో అమీర్ నీ అంతేనని తెలుసు. ఇద్దరూ ధీరోదాత్తులు, కాని మాట్లాడకుండా యెట్లా వూరుకోను?
    "యెక్కడికీ!"
    "యెక్కడికైతేనేం! ఇంకా ఆర్నెల్లకి వొస్తాను."
    "అమీర్ నువ్వు కనబడక ఒంటరిగా నేనిక్కడ...."
    "నీకు బియ్యమూ అవీ మీరా యిస్తాడు."
[b] ఇదే చివరిమాట. నేను యెంత గోలపెట్టినా, ఏడ్చినా ఒక్కమాట మాట్లాడక ఒక్కసారి నా వేపు కన్నెత్తి చూడక వెళ్ళిపోయినాడు నా అమీర్. ఆ వానలో, ఆ చీకట్లో, ఆ అర్థరాత్రి![/b]







Like Reply
#79

                              6
    అమీర్ ఒక్కరోజు కనబడకపోతే ఒక్కరోజయినా యెట్లా బతకనా అనుకునేదాన్ని, వెళ్ళింతరవాత నేననుకున్నంత ఒంటరిగా లేనేలేదు.
    నన్ను అన్యాయం చేసి వొదిలాడే అనే రోషం, నా అభిమాన నష్టమే నన్ను బాధపెట్టాయి. అమీర్ మీద కోపం కలిగింది. ఎట్లానన్నా అతను నా కోసమే పరితపించి బాధపడేటట్టు చెయ్యాలనిపించింది. ఇంక అతనికి కనపడకుండా వెళ్ళిపోతే. దేంటోనయినా పడి చచ్చిపోతే? మళ్ళీ వెళ్ళి అమ్మదగ్గిర చేరితే? ఇన్నీ అనుకున్నాను.
    మీరా పదహారేళ్ళ కుర్రవాడు. చాలా నాజూకైనవాడు. తరతరాల నించి వొచ్చే గొప్ప వంశపు లక్షణాలు అతనిలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఆ వేళ్ళ యెర్రని చివర్లలో, ఆ కళ్ళ కొలుకుల తేటలో, ఆ చంపల పాల మెత్తదనపు నునుపులో, మాట్లాడేప్పటి వొంపు ధీరత్వంలో, చేతుల నెమ్మదీ, గంభీరమూ అయిన ఊపులో, మర్యాదలో, గౌరవంలో, ధీయుతమైన కాంక్షలో సహజంగా పుట్టిన 'నొబిలిటీ' తోస్తుంది. వందల కొలది యేళ్ళనించీ నీచమైన తలంపులు లేనటువంటి వాళ్లూ, సౌందర్యాన్నే ఆరాధించి, దేహాన్నీ, ఆత్మనీ మెరుగుపెట్టి తేజస్సుతో నింపినవాళ్ళూ మీరాని కన్నట్టున్నారు. అట్లా సుందరమైన పటంలాగ, విగ్రహంవలె, ప్రపంచాత్మానందం కోసం ఉండిపోవలసిన వాడుగాని, సామాన్య మానవుల వలె పనికీ వ్యవహారానికీ ఉపయోగపడవలసినవాడుగా కనబడడు. నాలుగు రోజుల్లో నాకు వశుడైనాడు. భోజనానికీ, నిద్రకి ఇంటికి వెడతాడు. తక్కిన సమయాలలో యెప్పుడూ నాకెదురుగా మాటలు చెపుతూ కూచుంటాడు. నేనేమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా చెవులూ, కళ్ళూ వొప్పజెప్పి ఒక్కమాటెక్కడ మాయమౌతుందో, ఒక్క చూపెక్కడ జారిపోతుందో అన్నట్టుంటాడు. త్వరలో అమీర్ నాకు జ్ఞాపకం రావడమూ, నేను విచార పడడమూ తక్కువై పోయినాయి. నా కళ్ళవెంబడి నీళ్ళచుక్క చూశాడంటే మీరా గిలగిల లాడేవాడు. నా ఆలోచనలోకి కొంచెం విచారం తోచగానే నా ముఖాకాశం మీదికి మబ్బు వొచ్చిందని, తాను గాలిననీ, వీచి మబ్బుల్ని తరిమేస్తాననీ మాటలు చెప్పి నవ్విస్తాడు. నా వొళ్ళో పడుకుని వూరికే పాటలు పాడుతూ యిటూ అటూ దొర్లుతాడు. నా కళ్ళలో పడే జుట్టుని పైకి తోస్తూ, దాంతో  'సీరియస్'గా పోట్లాడతాడు. నా నవ్వును దాచుకుంటానని అల్లరి యత్నాలు చేస్తాడు. నా వేళ్ళు బొమ్మలైనట్టు గంటలకొలది ఆడుకుంటాడు. పది వేళ్ళకీ పది ముద్దు పేర్లు పెట్టాడు. వాటిని పిలుస్తాడు. మాటాడతాడు. అతని అందమైన బుగ్గలు నిమురుతూ, అతన్ని కావలించుకుంటూ వుడికిస్తూ, నేను కాలం గడిపేదాన్ని.
Like Reply
#80

అతని ఆటలూ, స్నేహితుల అల్లర్లూ, చిన్నపిల్లలమీద చిన్నప్పటి ప్రేమలూ, అన్నీ సంతోషంగా వినేదాన్ని. ఆ చేతులు కొంచెంగా వూయిస్తూ రాజఠీవితో తల ఆడిస్తూ మాట్లాడుతూ వుంటే యీ నవాబు నా వొళ్లో కెట్లా వొచ్చాడనిపించేది. ఎక్కడనించో తెచ్చేవాడు కూరలూ, ఫలహారాలూ, పాలూ, పళ్ళూ, ఇంటిదగ్గిర పెట్టినవన్నీ దాచి నాకు పట్టుకొచ్చేవాడేమో? రోజూ సాయంత్రం పూలదండ చేతిలో లేనిది నాకు కనపడడు. నన్ను రాత్రి పడుకోబెట్టిగాని యింటికి పోడు. నాకు వొంటరిగా భయం వేస్తుందని యింటికి వెళ్ళడు, నేనెంత బతిమాలినా.
అయినప్పటికి వెన్నెలరాత్రులు నీటికి వెళ్ళినప్పుడు చందమామ యేటినీటిలో కనబడితే, అర్థరాత్రి నక్క అరుపుకి మెలుకువ వొస్తే, అరుద్ర పడమట పెద్దగా అస్తమిస్తూ వుంటే, అమీరులేని లోటు నన్నావరించి బాధపెట్టేది. మీరా నన్నెంత వుత్సాహ పెట్ట ప్రయత్నించినా వ్యర్థమయ్యేది.
    "నిన్నంత బాధపెడుతున్నాడు. వాడు నీ శత్రువు" అంటాడు మీరా.
    "నేను పెద్దవాణ్నయితే నాకోసం యెవరన్నా యింత బాధపడతారా, నువ్వు అమీర్ కోసం పడుతున్నట్టు?" అన్నాడొక రోజు.
    ఒకసారి యాలక్కాయలన్నీ జేబులో పోసుకొస్తే వాళ్ళ పిన్ని చూసి "అది నీ చేత దొంగతనాలు కూడా చేయించుకుంటోందా? ఉండు ఒకసారి నౌకరిని పంపి తిట్టిస్తానంది."
Like Reply




Users browsing this thread: 1 Guest(s)