Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

మైదానం BY చలం

Showing only the posts of sweet1guy: 134 of 134 posts. Show all posts
#21

    'నిన్ను - నిన్ను - నాదాన్ని - వాడి దగ్గిరికి. ఆ బొండు వాడి దగ్గిరికీ బలవంతంగా లాగారా? ఆ రాత్రి, పాపం, చిన్నదాన్ని - సహాయం లేనిదాన్ని - నిన్ను వాడి చేతల్లోకీ-వాడి-గదిలోకి- నరుకుతా, ఒక్కొక్క ముండనే కొప్పుపట్టుకు లాగి-ఒక్కొక్క'.... ఇంకేమేమో అన్నాడు. ఆ మాటలే దుర్గమ్మత్తా, ఆ తాసీల్దారుగారి భార్య వింటే? నాకు చాలా నవ్వొచ్చింది.
    'కాని నాకు వెళ్ళాలనీ వుందిగా! ఊరికే సిగ్గుపడుతున్నాను-అంతే!'
    నా నోరు గట్టిగా మూశాడు. 'అనకు, ఆ మాట అనకు, వాడి మీద ఆ పంది మీద, ఆ కుళ్లు సిబ్బిమీద నీకు నీకు....
    పక్కున నవ్వాను. ఆయన్నంటే కోపమే రాలేదు. అదేదో పూర్వజన్మ లాగుంది ఆయనతో కాపరం.
    "కుళ్లు సిబ్బేమిటి, అమీర్...." నవ్వుతున్నాను. ఆ నీటి మీద నించి నా నవ్వు బ్రిడ్జికింద ఆ చీకటిలో మారుపలికింది. అమీర్ కి అంత యీర్ష్య. సహించలేడు. ఆయన్ని గురించి ఒక్క మంచి మాట మాట్లాడితే!
    విను, యెంత సంతోషంగా వుండేది అట్లా స్నానాలు చేస్తే. స్వర్గంలో సౌఖ్యాలంటే ఇదేగావును అనిపించేది. స్వర్గ నరకం సంగతెత్తితే అమీర్ కి కోపం. మన స్వర్గం అదీ అంతా అబద్దమంటాడు.తనతో కూడా నన్ను వాళ్ళ తురక స్వర్గానికి తీసుకుపోతా ననేవాడు.
    'నేను ముందర చస్తే?'
    'నేను చస్తా!'
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22

    'రెండో మాట నేననలేక వూరుకుంటే, అతనే -
    'నేను చస్తూవుంటే, నిన్నూ చంపుకుంటా' అన్నాడు.
    'పోనీలే పాపం నీకోసం నేనూ చస్తాలే' అన్నాను నవ్వుతో.
    'చావకపోతే చంపుతా'
    'కాని అమీర్ మనం చేసిన ఈ ఘనకార్యానికి మనకి స్వర్గమిచ్చే దాత యెవడు?'
    'మా స్వర్గంలో ఫరవాలేదు. నేను మాట్లాడతాగా?'
    'ఎవరితో?'
    'మా స్వర్గం వాళ్ళతో'
    'తమాషాగా వుందే, మీ స్వర్గం సన్గథి౧ మీ నరకంలో ఎవరుంటారు?'
    "హిందూ ప్లీడర్లు, కాఫర్లు" అని రాయిపెట్టి కుండ పగలగొట్టాడు. నవ్వెట్లా ఆపుకోను?
    "ఆయన మూలకంగా ప్లీడర్లందరికి యిప్పించావా నరకం?"
    "కాకపోతే నా దగ్గర వ్యాజ్యానికని ముగ్గురు ప్లీడర్లు గాడ్దె కొడుకులు మూడు ఆర్లు పద్దెనిమిది రూపాయలు లాగారు. వాళ్ళందరికీ బాధ.... నరకమే"
    "నీ పెత్తనమే!"
    "చూస్కో, అబద్దమేమో!"
    "ఇంకేం మాట్లాడను?"
Like Reply
#23

    అట్లా గడిచేవి మా స్నానం సంభాషణలు. ఒకరినొకరు నీళ్ళ కింద తాకుతో, ఒకరిని ఒకరు రుద్దుతో, తోసుకుంటూ యెన్నో గంట లాడుకునే వాళ్ళం. అమీర్ నాకు యీత నేర్పాడు. ఎవరన్నా కొత్తవాళ్ళు వొంతెన మీద నించి వెడుతోవుంటే, ఇద్దరం కదలకుండా దానికింద యిమిడి, వాళ్లు వెళ్ళగానే పెద్ద నవ్వు నవ్వుతాము. నా జుట్టు నీళ్ళలో నల్లగా తేలుతూ చేతులు నీళ్ళకింద వొంకరగా కనపడేట్టు నీళ్ళు తోసుకుంటూ యీత్తే అమీర్-అలా నిలిచి నన్ను చూస్తూ,
    "ఆగకు. అలానే తేలుతూ వుండు. అలానే యెప్పుడూ.... ఆ జుట్టెక్కడిది? ఎలా తెచ్చుకున్నావు? అరేబియాలో రాత్రి వీచే యీదురు గాలి నీ జుట్టు రూపం దాల్చింది!"అని వూరికే బాధతో మురిసిపోతాడు. ముణిగివొచ్చి నా కాళ్ళని పట్టుకుని నీళ్ళల్లోకి లాగి ముంచి కావిలించుకుంటాడు. ఇద్దరం అల్లానే ముణిగిపోయినాము అడుక్కి. నల్లని యిసిక మీద పడుకుని పైకి నీలంలోకి చూశాను ఒక నిమిషం. అతని చేతుల్లో అతని కింద అక్కడే వుండాలనుకుంటున్నా. ఇంతలో నీళ్ళు తాగేశాను ఒక్కొక్క రాత్రి వెన్నెట్లో స్నానం చేస్తాము. అమీర్ ఆ వొడ్డుకి యీది, దూరమై నీళ్ళకింద దాక్కుని భయపెడతాడు. యెవరూ లేక యిద్దరమే ఆ నీళ్ళ నిశ్శబ్దంలో కూచుని ఒకరి మొహాలొకరకం చూసుకోవడం నాకు భయం. కాని అమీర్ దగ్గిరిగా వుండి చెయ్యేసినంతసేపూ యేదో నీళ్ళ లోకంలో వున్నట్లుండేది. ఒక రోజు నన్ను 'ఉలూపి' అని పిలవమన్నాను, నా అర్జునుణ్ణి. అర్జునుడూ, అదంతా అబద్ధమంటాడు అమీర్.
Like Reply
#24

    పూర్వం మా మరిదిన్నీ, అతని పెళ్ళామున్నూ బట్టలిప్పేసుకుని ఒకరికెదురుగా ఒకరు కూచుని స్నానాలు చేస్తారని విని నాకు పరమ అసహ్యం వేసేది. కాని యేటిలో రాత్రులు యిద్దరం బట్టలన్నీ యివతల పారేసి స్నానం చేసేవాళ్ళం. నీకర్థమౌతుందా ఆ ఆనమ్దమ౧ కామం పశు కామమంటున్నాయి నీ కళ్ళు! కామం కాదు, ఈ ఆకాశంకింద ఆ నీళ్లలో బట్టలెందుకు! బట్టలు వేసుకున్నా గాలీ, నీళ్లూ వొంటినంతా తాకుతాయి.... అమీర్ కూడా అంతే. ఇద్దరం నీళ్లలో దొర్లుతూ వుంటే అమీర్ వేళ్ళు నా జుట్టునీ, భుజాల్నీ, రొమ్ముల్నీ, తొడల్నీ తాకితే నాకు చెరువులో తామర కాడలు వొంటికి తగిలినట్టుండేది. అతడు మగవాడనే భావంగాని,అతని స్పర్శవల్ల కామ వికారం గలగడంగాని ఏమీ వుండేది కాదు. రాత్రులు అతను నన్ను కోరేప్పటి స్పర్శకీ, తక్కిన రోజుల్లా నాతో ఆడుకునేప్పటి స్పర్శకీ స్పష్టమైన భేదం వుంది. సమయాలను బట్టి అమర్ నా స్నేహితుడుగా, అన్నగా, తండ్రిగా, బిడ్డగా, గురువుగా, భర్తగా, ప్రియుడిగా, అధికారిగా మారేవాడు. నేనూ అంతే. ఒకప్పుడు అతి చనువు! ఇంకోసారి కారణం లేనిదే బింకం. కొత్త లేనిదే అమితమైన సిగ్గు. పిచ్చి దయ. కపటమైన కోపం. తల్లి చూపే లాలన. బోగందానిబెట్టూ, సత్యభామ ధూర్తత్వమూ, కలహమూ అన్నీ రకరకాల మారి చూపేదాన్ని.
Like Reply
#25

. కానీ, సాధారణంగా యిద్దరమూ మా స్త్రీ పురుష భేదం మరిచి మిత్రులవలె ఆడుకునేవాళ్ళం. అలాకాక ప్రతినిమిషమూ ఒకరికొకరికి కామ వికారం కలుగజేస్తూవుంటే, ఇరవై నాలుగు గంటలూ కలసి జీవించగలమా? ప్రతి సంజ్ఞా, చూపు, కామ వికారంతో స్ఫురించటం, గాలిలేని ఇళ్లల్లోనూ, ఈగలు ముసిరే భోజనాల సావిళ్ళలోనూ, పవిత్ర ప్రేమమయ సంసారాల్లోనూ, అంతేగాని స్వచ్చమైన నీళ్ళల్లోనూ, ఎడార్లలోనూనా? అమీర్ అవతల వొడ్డుకి యీది నుంచుంటే ఆ రాత్రి నిశ్శబ్దంలో యెవరో గంధర్వ కుమారుడు వొచ్చి నుంచున్నట్టు కనపడేవాడు. స్నానం అయిం తరవాత తుడుచుకోము. కొంచెం అటూ ఇటూ పరుగెత్తి బట్టలు వేసుకొంటాము. బావుండలేదూ? అదుగో "ఏం బావుండడంలే!" అంటోంది నీ పెదిమల వొంపు. "నీకేం తెలుసు." అని ధైర్యంగా అనగలను నేను.
ఇంక భోజనం భోజనమంటే, ఒకరికెదురుగా ఒకరం కూచునీ, ఒకరి నొకరం కళ్ళతో తాగెయ్యడమన్నమాట. మెతుకులమీద బతికామా, ఆనందంమీద కాని....రుషులు వాయుభక్షణ చేసి జీవించినట్టు! మొదట్లో నేనే వేరే తినేదాన్ని. కాని తన యెంగిలి మూతితో నన్ను ముద్దు పెట్టుకుంటూ వుంటే,ఏం లాభం మడిగా వేరే మూకుట్లో తిని? నాకు చేతకాలేదు' వేశ్యల ఎంగిలి రుచులు చవిచూసి కూడా కులం నిలుపుకునే నేర్పరితనం మీ శ్రోతీయులకి మాత్రమే చాతనవును. ఏం తిన్నానో, యెలా తిన్నానో ఆ భోజనం యెలా సయించిందో నాకు జ్ఞాపకం లేదు; అర్థంకాదు.
Like Reply
#26

ఈనాడు మళ్ళీ మా ఆయన యింట్లో నేను వుండడమే తటస్థిస్తే మళ్ళీ నెయ్యీ, పప్పూ, పులుసూ వుంటేగాని ముద్ద దిగదు. కాని అమీర్ చూపుల కలవరంలో నా మనసు నిండి, అతని పెదవుల రుచి నా నోటిని కరిగిస్తూ వుంటే ఏం తింటున్నానో స్ఫురణకి వస్తుందా?
    మధ్యాహ్నమంతా గొంగళి వేసుకుని చింతచెట్టు కింద పడుకుంటాము. మన దొడ్లల్లో చింతచెట్లున్నాయి. కాని చింత చిగురుకీ కాయలకీ తప్ప యెన్నడన్నా వాటివంక చూస్తామా? ధైర్యముంటే, యింటికి వెళ్ళగానే, నువ్వు మధ్యాహ్నం దానికింద గొంగళి వేసుకొని వెల్లకిలా పడుకుని ఆకాశంవంక చూడు. ఆ సన్నని ఆకులు కట్టే ఆకుపచ్చ అద్దాల మెడలోంచి ఆకాశ నీలపు నిగ్గుల కప్పులమీద తెల్లమేఘాలు తేలిపోతూ వుంటే....కాని లాభంలేదు. ఆ అందం కనబడ్డానికీ, కారణంలేని ఆ ఆనందం గుండెల్లో పొంగి, ఆ రంగుల బాధని స్ఫురింప జెయ్యడానికీ, అమీర్ చెయ్యి నీ నడుంమీద వుండాలి! నీ వేళ్ళు అతని మెత్తని జుట్టులో ఆడుకుంటూ వుండాలి. కాంతి పల్చని ఆకుల్లో పడితే పెద్ద మందిరాల్లో కిటికీల్లోనుంచీ, తలుపుల్లో నుంచీ లోపలికి పాకి, తివాసీలు, అద్దాలు, పటాల మీదనించి, అందాన్ని పొందే విచిత్రమైన మెత్తనికాంతి వుంటుందే, అలా కనపడేది ఆ చెట్ల కొమ్మల మధ్య వెలుతురు ఒక్కటే. తమాషా రంగుల పిట్టలు వచ్చి కూచుని, తొంగిచూసి, చిన్న చిన్న పలుకులూ, యీలలూ ఆ ఆకుల గుహల్లోంచి పలికేవి.
Like Reply
#27

ప్రేమ చూపుకునేవి, నిశ్చలలైన మధ్యాహ్నం కునుకుపట్టే వేళ ఆప్టిలు పలుకుతో పాడుతో వుంటే మనుషులదికాని గొప్ప సంతోషం కలిగి దాన్ని భరించలేక అమీర్ని కావలించుకుంటాను....చూడు అర్ధరాత్రి చిన్న వాయువులమీద నువ్వెన్నడూ వినని కొత్తపాట చెవిని తాకితే, యేటి నీటిలోంచి నువ్వెన్నడూ యెరుగని యేదో కొండ గడ్డివేళ్ళ వాసన వస్తే, యెలాగో యేదో మరచిపోయిన సుందరానుభవాలు మనసుకి తట్టవా? అలా స్ఫురించేది ఆశ్చర్యంగా, ఆ పక్షి రెక్కల్లోంచి చిన్న యీకె గాలిలో సోమరిగా తేలుతూ వచ్చి వాలేది నామీద. దాని పాటలతోకూడా ఎక్కడో, ఎప్పుడో, ఏ జన్మలోనో అనుభవించి, అధికానందం పొందిన విషయాలు అలా బాధపెడతాయి గావును మనసుని! ఆ పిట్టలన్నీ నాకు గుర్తు. ప్రతి మధ్యాహ్నమూ యెదురు చూసేదాన్ని. ఏదో బంధుత్వం నాకూ వాటికీ వున్నట్లే తోచేది.
    అన్ని దిక్కులా రాత్రి కమ్ముకున్నప్పుడు, యీదురు గాలిలో నిప్పు ముట్టించి మళ్ళీ బియ్యం వండేదాన్ని. అంత చీకట్లోనూ, గాలిలో వూగే- వొకటే మంట వెలిగించడం యెంతో గంభీరంగా వుంటుంది. ఇద్దరి మొహాలమీదా వెలుగు చీకట్లు వుయ్యాల లూగుతూ, ఆ పొయ్యి దగ్గర కూచుని వుడికే అన్నపు సంగీతానికి ఆకలితో వుడికే పొట్టలు గంతులేస్తో.... వొంటరిగా లోకానికంతా చక్రవర్తులవలె కూచుంటాము. ఎందుకో విశాలమైన మైదానంలో రాత్రులు ఆకాశంకింద మంట, యేవో యెరగని భావాల్ని కలిగిస్తుంది. 
Like Reply
#28

ఒక్కొక్కరోజు అమీర్ మధ్యాహ్నమప్పుడు యేట్లో చాపలు పడతాడు. ఆ చాప బైట గిల గిల కొట్టుకోవడమూ, దాని ముక్కులోంచి నెత్తురు రావడమూ చూస్తే నేను భరించలేను. అతని పక్కన భుజంమీద చెయ్యేసుకుని, బెండు కదిలే సమయానికి అతని తలని లాక్కుని వొదలక గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకునేదాన్ని. ఉత్తగాలం అతను పైకి లాగినప్పుడు సంతోషిస్తాను. కాని చాలాసార్లు వెర్రిచాప దాన్ని కరుచుకొనే వుండేది. ఒకసారి నాలుగు చాపల్ని అతను చూడకుండా నీళ్ళలో వొదిలి పెట్టాను. ఏవి అని అతను అడిగితే పొదలోకి పారిపోయాయి అన్నాను. ఎట్లా నవ్వాము౧ మేము స్నానం చేసేటప్పుడు ఆ చాపలు మమ్మల్ని నీటి అడుగున తాకితే, దూడలూ, కుక్కపిల్లలూ అనేదాన్ని. స్వచ్చమైన నీళ్ళల్లో ఆడే వాటి తోకల్ని చూసి, నేను పరిగెత్తేప్పటి నా పిరుదుల కదలికలాగా వుంటుందని ముచ్చటపడేవాడు అమీర్. అన్నం పడేస్తే అన్నీ వచ్చి మూగేవి. పిచ్చి మూతులు చాచుకుని, వాటి నెట్లా గాలంతో చంపేవాడో!
    'వాటిని చంపడం పాపం కదూ!'
    'పాపమేమిటి? దేముడే చంపుతున్నాడు ప్రతి నిమిషమూ లోకాన్ని!'
    'అయితే మనుషుల్ని కూడా తిను.'
    'కొందరు మనుషుల్ని తప్పకుండా తింటారు. ముఖ్యంగా బొర్ర ప్లీడర్లు బహురుచిగా వుంటారు.'
Like Reply
#29

చాపలు దొరికిన రోజున వేరే పొయ్యి పెట్టి వొండుకుంటాడు. కాని తరవాత వాసన! నా కడుపులో వికారం పెట్టేది. అది చూసి క్రమంగా చాపలు తినటం మానేశాడు. కాని ఆధ్యాత్మిక ప్రేమగల నా భర్త, ఎన్నిసార్లు నేను యేడ్చినా, ఆ ముక్కు పొడుం మాత్రం మానలేదు. 'చాపల వాసన అమీర్, నా దగ్గిరికి రావొద్దు' అంటే ఆ రాత్రంతా దూరంగా కూచుని నన్ను చూస్తూ తృప్తిపడేవాడు. నేనే వుండలేక అతన్ని లాక్కుని వికారపడి కక్కేసేదాన్ని పశుకామం! ఏం చెయ్యం?
    మధ్యాహ్నం గాలం యేట్లో వేసుకుని, గానుక చెట్టు నీడలో కూచుని కునికిపాట్లు పడడం యెంత హాయిగా వుంటుందని! ఎండ మచ్చలతో పోట్లాడే నీటి కెరటాలనీ, తొరగా కొట్టుకువచ్చే చెత్తనీ, నురుగునీ, అవతలవేపు నీళ్ళలో వొంగుతూ లేస్తున్న తుంగనీ, దూరపు కొండల మారే రంగుల్నీ, అట్లా సోమరిగా చూస్తూ కళ్ళు సగం మూసుకుని, నా జుట్టు అమీర్ మెడమీద యెగురుతోంటే, అట్లానే యేమీ ఆలోచనలన్నా లేకుండా, యింకా కావాలనే కోర్కె, ఆధారాలు ఏమీ లేకుండా పడుకోడం, సుఖాలు వొదిలి పరమాత్మలో యేకమయే ఆనందమంటారే- అలాంటిదేగావు ననిపిస్తుంది.
    ఇంక రాత్రులు. యేం రాత్రులని? మాకు వెన్నెల వొచ్చినా సంతోషమే, చీకటిగా వున్నా సంతోషమే. మబ్బుపట్టినా సరే అన్నిట్లోనూ ఆనందం కనపడేది. కూచోడం కష్టమైనట్టు కాళ్ళూ, చేతులూ ఆడబోతాయి.
Like Reply
#30

ఏదో ఆనందం, యేమిటో చెయ్యమని పురిగొల్పుతుంది. కూచుని వూరికేనా లేక నవ్వుతో పరిగెత్తడం, తప్పించుకోవడం, దాక్కోడం, అందినా అందుకోనట్టూ అందనట్టూ నటించడం, అంతా అనుభవం కలిగినా, ఇష్టంలేనట్టూ, కొత్తవారైనట్టు నటించడం, అలిసి కిందపడగానే రెండోవారు కూడా అక్కడే పడి.... మనుషుల కుండే బద్ధకాలూ, చికాకులూ మర్యాదలూ పోయి అందమైన మృగాలమల్లే, పిల్లి పిల్లలవలె ఆడుకునే వాళ్ళం.
    మొదట నా సౌందర్య బాధని పొందినవాడు అమీర్. ప్రపంచమంతా వెతికి నన్నేరుకున్నట్టున్నాడు. ఆనాటి ఉదయం ఆఫీసు గదిలో నా వీపు చూడగానే నేనే తనకి కావాలని, నేను తప్ప ఎవ్వరు అక్కర్లేదనిపించిందని చెప్పాడు.
    ఆ రాత్రులు ఈ భూమి మీదేనా, యే ఇంద్రజాల లోకాలలో నన్నాననా, అదంతా కలా, భ్రాంతా, ఈ ప్రపంచమే యింత అందంగా వుండగలదా అనిపించేది నాకు. కాని అమీర్ మాత్రం అమితమైన బాధపడేవాడు. ఒక్కొక్కప్పుడు జాలి వేసేది. భయమేసేది. కాని ఆ బాధే తన ఆనందమంటాడు. ఏమిటంటే- ఆనందం చూసి వెర్రెత్తిపోతాడు అతడు. ఒక్క నిమిషం నా వొంటిమీద బట్టని నిలవనియ్యడు. నా రెవికలన్నీ ఒక్క పదిరోజులలో చించేశాడు. మళ్ళీ కుట్టుకోలేదు. ఏం లాభం? చీరెలు చిరిగిపోయినాయి. కాని ఏమైతేనేం? చీరెలు చూస్తాడా అమీర్.
Like Reply
#31

నా వొంటిని చూస్తాడు గాని, అక్కడ పేరంటాలా భోజనాలా? చీరెల విలువనిబట్టి మనుషుల విలువ నిర్ణయిస్తారా, మీ వూళ్ళల్లో మల్లే!"
    వెన్నెల వొచ్చిందంటే ఆ బయలంతా క్షీరసముద్రమూ, స్వర్గమూ, ఆకాశమూ అయిపోయేది. అమీరంత గొప్ప హృదయం కలవాడు, సౌందర్య పిపాస గలవాడు, అన్నాళ్ళు మా ఊళ్ళో పని లేకుండా ఊరికే ఎలా పడివున్నాడా అని ఆశ్చర్యం వేస్తుంది ...... కొంతసేపు తాకితే నలిగిపోతానేమో, మల్లెపువ్వునో వెన్నెల రేఖనో అన్నట్టు పెదవుల చివర్లతో, గాలిమల్లేనూ, మల్లెపువ్వుల మల్లేనూ, వేళ్ళకొనలతో నీటి, అలల వలెనూ, కుక్కపిల్లలవలెనూ తాకి ఒళ్ళంతా తిమ్మరింతలు పరిగెత్తిస్తాడు. ఊరికే యెదురుగా నుంచుని నన్ను చూసి, వెర్రెత్తిన వాడివలె నా పేరు పిలుస్తూ కూచుంటాడు. చేతులతో నా తలని రెండువేపులా పట్టుకుని నన్నేదో ప్రశ్నిస్తున్నట్టు నా కళ్ళలోకి చూస్తూ అరగంట నుంచుంటాడు. వున్నట్టుండి నా చీరెనీ ఒక్క ఊపుతో లాగేసి నిర్జీవమైన మైదానం మధ్య నుంచోపెట్టి, చేతులు పైకెత్తించి నా చేతుల్ని, నా రొమ్ముని, అన్నివేపుల్నించీ అలా రెప్పవేయక చూస్తూ నుంచుని నన్ను పక్కలకి వొంచి నా నడుం దగ్గర సాగే వొంపుల్ని తాకి, వెనకనుంచి నన్ను తనకేసి వొంచుకుని, నా గడ్డం కింద వేళ్ళు కదిలిస్తూ, మెడ నున్నతనానికి మురిసి ఆనందించేవాడు. నా భుజాల వెనక చూస్తే నల్లని మబ్బుల్లోని నీటిభారం తోస్తుందిట.
Like Reply
#32

నా నడుం వొంపుల్ని చూస్తే మా యేరు చప్పున వొంగి తిరిగినచోట కలవరపడే ప్రవాహపు నునుపు తోస్తుందిట. నా మెడమీద రేఖలు చూస్తే సోమరి అలలమీద మెత్తని యెండ ప్రతిఫలించి మెల్లిగా పైకి ప్రాకే కాంతి గీతలు కనపడతాయట.
    అలా అంటూ అంటూ చప్పున గోదావరి మీద లేచే ఎండాకాలపు తుఫానువలె విజృంభించి నన్ను కావలించుకుని, వూయించి, తిప్పేసి అలవ కొడతాడు. ఒక్కక్కప్పుడు అతను నన్ను విరిచేస్తాడేమో, తినేస్తాడేమో అన్నంత భయమేసేది. నా మొహాన్ని ఆ వెన్నెట్లో ముద్దు పెట్టుకున్నాడంటే, నా వూపిరి ఆగి, కళ్ళు తిరిగి చెమటలు పోసేవి. నన్ను అదుముకుని, యింకా అదుముకుని, ఇంకా తనలో నన్ను కలిపేసుకోవాలని అతను పడే బాధని చూస్తే నేను బతకడమే ఇతనికి ఇష్టంలేదా? ఆ కళ్ళలో వెలిగేది ద్వేషం కాదా అనిపించేది. తన పెదవులతో తన చేతులతో నా నున్నటి శరీరాన్ని వొత్తెయ్యడం, నలిపెయ్యడం, తన కాళ్ళతో నా కాళ్ళని మెలిపెట్టి విరిచెయ్యడం చూస్తే, యితనికి సౌందర్యం విరోధమా, దాన్ని ధ్వంసం చెయ్యాలని చూస్తున్నాడా అని అనుమానపడతాను.
Like Reply
#33

    ఇలా ఒక్క నిమిషం వ్యవధి లేకుండా బాధపడి అలిసిపోయి నిరాశ చెంది, నా పాదాల మీద పడి 'ఎలా? యేంచెయ్యను? యెంతసేపు?' అని యేడుస్తాడు. నిజంగా యేడుస్తాడు. మళ్ళీ చప్పున పళ్ళు పటపట కొరికి, దడిసి వెనక్కి తగ్గే నన్ను యీడ్చి కావలించుకొని, లాక్కుని, పర్వతపు గుహల్లో వీచే సముద్రపు తుఫాను గాలివలె వూపిరి పీలుస్తూ నన్ను భుజం మీద, చంపలమీద యెక్కడపడితే అక్కడ, సున్నితమైన స్థలాల కొరికి చంపేస్తాడు. అతని బరువును భరించలేక కిందపడి పోతాననుకుంటాను. నేను బాధతో అరిచిన కొద్దీ నా పెదిమల రక్తం అలా పీల్చి చంపేసే రాక్షసి కాదుకదా! అని వొణుకుతాను.
    సగం చచ్చి పడుకున్న నాకు యెడంగా పడుకుని చేతిమీద తల నానుకుని నా వంక చూస్తూ వుంటాడు. నాకు సిగ్గయి అతని చెంపలమీద చేతులు వేసి, 'ఏమిటి అలా చూస్తావు?' అని అడిగితే యేమీ మాటాడడు. నేనట్లా నిద్రపోయి యే మూడు జాములకో లేచి చూస్తే, ఇంకా అట్లా చూస్తూనే పడుకొని వుంటాడు. దుప్పటికిందనుంచి గుండ్రంగా యెత్తుకున్న నా రొమ్ము గర్వాన్నీ, నా భుజాల దగ్గరనించి పిరుదల కిందకి తిరిగే విల్లువొంపునీ, నా చేతుల సన్నతనపు జారునీ, నా వొంటిమీద పాకే నా జుట్టుని, దోసెళ్ళలో వుంచుకొని, వేళ్ళలో నుంచి జారుస్తూ భుజాలమీదా. మొహం మీదా కప్పుకుంటూ గడిపాడు నాలుగు గంటలసేపు. ఏటిలో రోజూ కడిగి నూనె నెరగని జుట్టు నా మెడమీద అల్లరిగా పడడం అతనికెంతో యిష్టం. నా జుట్టు అతనికి కొత్తగా కోసిన వరిగడ్డి వాసనా, అరేబియా గుర్రపు శుభ్రమయిన పరిమళమూ తలపింప జేస్తుందట.
Like Reply
#34

చిన్నప్పుడు మా యింట్లో శాస్తుర్లు భాగోతం చదువుతోంటే విన్న సంగతులు జ్ఞాపకం వొచ్చాయి. విష్ణు భక్తుడికి సర్వ ప్రపంచమూ లీలగా, అసత్యంగా తోస్తుందిట. ఈ భూమీ, ప్రాణులూ, వాళ్ళ సుఖదుఃఖాలూ, సర్వమూ మాయగా, అశాశ్వతంగా తోస్తుందనీ, ఒక్క విష్ణుభక్తి మాత్రమే నిత్యమయినదీ, అర్థవంతమయినదీ, తనకి సంబంధించిందిగా కనబడుతుందని చెప్పేవాడు. నా మనోస్థితి సరిగా విష్ణుభక్తుడిలాగు వుంది? నా యిల్లూ, బంధువులూ, యీ వూళ్ళో ప్రజలూ వాళ్ళ అభిప్రాయాలూ, అన్నీ మాయ. నా పూర్వ జీవితమంతా ఒక దుష్ట స్వప్నం. శాశ్వతమూ, సత్యమూ అయినది నేనూ, నా అమీర్. నిత్య నిరంతరానందదాయకమయినది, మా నిశ్చల ప్రేమ సంబంధం. ఆ కొండలూ, ఆకాశమూ, నదీ, బయలూ, స్వచ్చ మారుతమూ, మేము మా లీలకోసం సంకల్పించుకున్న రంగస్థలము-అంతే. ఇంక తక్కిన ప్రపంచమంతా మాయ. మేమే యీ సృష్టీ, దాని వుద్దేశ్యమూ, మమ్మల్నీ, మా ప్రేమనీ సృజించడానికే ఈశ్వరుడు ఈ లోకాలన్నిటినీ యేర్పరిచాడు.
Like Reply
#35

                                                  3
 
    కాలం ఆగిపోయింది మాకు. తొరగానూ కాదు. ఆలస్యంగానూ కాదు.
    వారాలు తెలీవు. నెలలూ తెలీవు. మామయ్య వొచ్చి చెప్పిందాకా. సాయంత్రం మేము భోజనం వొండుతూ వుండగా వూళ్ళోనుంచి ఓ కుర్రాణ్ణి వెంటబెట్టుకుని తన మామూలు పచ్చ రూలు సంచీ, తానూ-మామయ్య తయారైనాడు. అతన్ని చూడగానే అమీర్ తురకంలో 'పో, పో ఇక్కణ్ణించి' అన్నాడు. మామయ్య భయంతో నా వంక చూశాడు. నేను బిగ్గిరిగా నవ్వి.
    "నా మామయ్య అమీర్, పొమ్మనకు మరి" అన్నాను.
    నాకెందుకో అతన్ని చూసి భయం వెయ్యలేదు. అమీర్ మొహంలో మాత్రం యిబ్బంది కనబడ్డది నాకు.
    "మామయ్యా! ఏమిటి? మీ మామయ్యా? ఎట్లా వొచ్చాడు? ఎందుకొచ్చాడు?"
    "...కనుక్కుందాము కూచోనీ .... కూచో మామయ్యా! రాకరాక వొచ్చావు."
    అని మళ్ళీ గొంతుమార్చి "బాగానే వుంది. మా పుట్టింటి బంధువులు వొస్తే, యిదేనా మర్యాద!" అన్నాను.
    "ఎప్పుడు రావటాలు! వివేషాలేమిటి? అందరూ బావున్నారా!" అని అడిగాను మర్యాదగా.
    "ఎవరు యామైతే నీకేం? నువ్వు సుఖంగా వున్నావుగా!" అంటూ చుట్టూ చూశాడు.
    "మామయ్యా! ఆ ధోరణికేంగానీ తొరగా బైట పడెయ్యి. ఎందుకు వొచ్చావో?"
    నా మాటల ధోరణీ నా కొత్త ధైర్యమూ ఆశ్చర్యపడి చూశాడు.
    "ఎట్లా మారిపోయినావో?" అన్నాడు మెల్లిగా.
Like Reply
#36

    "మరణంలోంచి జీవనంలో పడ్డాను. మరి మారిపోనూ!"
    "తురక కూడులో పడ్డావు."
    మామయ్యకి మాటల దగ్గిర యెన్నడూ మొహమాటం లేదు.
    "మా యింటికి వొచ్చి తురకవాళ్ళని యేమన్నా అంటే, తురక తడాఖా తగుల్తుంది. మర్యాదని యింటి దగ్గిర వొదిలి వచ్చావా" అన్నాడు అమీర్. మామయ్య తృణీకారంగా మాట్లాడకుండా వూరుకున్నాడు.
    మెల్లిగా కళ్ళనీళ్లు పెట్టుకున్న నావంక యెగాదిగా చూశాడు. నాకు రెవిక లేదు. జుట్టు దువ్వక రేగివుంది. ముతక చీరె. అన్నంకుండ పొయ్యి మీద. చేతిలో కొయ్యతెడ్డు.
    "ఇదిగో! ఏడుపులూ, గోలలూ సాగించి క్షోభపెట్టి నిన్ను లాక్కెల్లాలని వొచ్చాడు. వీడివెనక తక్కిన మనుషులు వొస్తారు. ఆమూట భుజాన యెత్తుకుని వెంటనే నడవమను" అన్నాడు తురకంలో అమీర్.
    "ఏమీ భయంలేదు. ఎవరొస్తే నన్నేం చేస్తారు? మావాళ్ళ విషయం నాకు వొదిలెయ్యి. నువ్వు కొంచెం అట్టా తిరిగిరా. నువ్వుంటే సంగతి చెప్పడు."
    "నువ్వు కొంచెం తొరగా కానీ. ఆకలేస్తోంది" అని అమీర్ వెళ్ళాడు.
    "నేనిక్కడ వున్నానని నీకెట్లా తెలిసింది?"
    "ఎలాగో వోలాగు. కాని నీ సంగతి చెప్పు."
    "నా సంగతి ఏముంది? హాయిగా, మహారాజులా వున్నాను."
Like Reply
#37

    "అంతేనా!" అని కళ్లు వురిమి చూశాడు. నేను జంకకపోవడం చూసి కళ్ళు 'స్విచ్ ఆఫ్' చేసి,
    "ఎంతదానవైనావే....! పోనీ అమ్మ సంగతి తలుచుకున్నావా! నీ సుఖం నువ్వు చూసుకున్నావుగాని! ఇలాంటి పని చేస్తే మా అందరికీ యెంత సిగ్గు కలుగుతుందో...."
    "నా మామయ్యని, నువ్వు ఇలా ఆ పిలక వేళ్ళాడేసుకొని, ఆ పాతరైలు సంచీ చంకనెత్తుకుని ఒస్తే నాకెంత సిగ్గుగా వుంది! అమీర్ తో నా మామయ్య నువ్వని యెలా చెప్పుకోను? నీ సుఖమూ, నీ అందమే నువ్వు చూసుకున్నావు గాని, ఆ పాడు మొహం...."
    "ఏమిటి! నీకు పిచ్చి పట్టలేదు కద!"
    "కాదు, మామయ్యా మీ అందరూ మన బంధువులలో ఎవరికి ఏమి కష్టం కలుగుతుందో అని ఆలోచించి చేస్తున్నారా మీ పనులన్నీ? చిన్నప్పణ్ణుంచి నువ్వు మీ అమ్మని యెన్నివిధాలా ఏడిపించావో నీకు జ్ఞాపకం లేనేలేదా!"
    "దానికీ దీనికీ సాటి ఏమిటి? మేము యామన్నా తురకాళ్ళతో."
    "నాకు తెలుసు మామయ్యా! ఆ యేడిపించడాలు లోకం ఒప్పుకున్నవీ, మర్యాదైనవీ. ఇది కానిదీ! అంతే భేదం. అవన్నీ యెందుకుగాని యిప్పుడు నువ్వు వచ్చిన పనేమిటో చెప్పు తొరగా. మళ్ళీ అమీర్ వస్తాడు. నన్ను ఒదిలి నాలుగు నిమిషాలు విడిగా నిలవలేడు."
Like Reply
#38

మామయ్య మాటాడకుండా నా వంక రెండు నిమిషాలు చూశాడు. చిన్నప్పుడు నేను పెంకి మాటలు మాటాడినప్పుడు బెదిరించడానికి చూసినట్టు. కాని ఈ తురక రాజ్యంలో ఆ మంత్రం పారక, పైపెచ్చు నేను నవ్వడం చేత, అతనికి తీవ్రమైన ఉక్రోషం ఒచ్చింది. తన బాణాలన్నీ రావణుడి యడల వ్యర్థమయినప్పటి రాముడివలె.
    "సిగ్గులేదుటే. నీ మొహానికి! అంత మరీ చెడిపోయినావుటే! ఆ తురక వెధవ నిన్ను ఒదలలేకపోవడం ఒక గొప్పగా, బడాయిగా...."
    "ఒక్క నిమిషం వదలలేని ప్రేమ ననుభవించడం కన్న అదృష్టం యేముంది స్త్రీకీ! నీ కర్థం కాదులే"
    పళ్లు పటపట కొరికాడు. ఇంకేం చాతగాక!
    "ఎందు కర్థమైతుంది? కుక్కలమల్లే, పందులమల్లే-"
    ఇంకేవో మాటలన్నాడు. చెడిపోయినదాన్ని నా నోటి నుంచి కూడా రావు ఆ మాటలు.
    "పుణ్య పురుషులు, బ్రాహ్మణులు మీరుమాత్రం అంతేగా! కుక్కల కన్న, పందులకన్న, అధమంగా. ఆ మాత్రం చాతగాక-"
    ఇంక కోపం చూపించే విధం తోచలేదు మామయ్యకి.
    "పాపం, పుణ్యం-సిగ్గూ, యెగ్గూ లేకుండా రాత్రులనక, పగలనక యీ అడవిలో దున్నలవలె పడి-యెందుకు యీ బతుకు బతకడం యింతకంటె దేంట్లోనన్నాపడి చావరాదూ?"
Like Reply
#39

    "మొదట్లో నా ప్లీడరు పెనిమిటీ ఓ వారం యిట్లానే వుండేవారు. తరవాత శక్తీ, రసికత్వమూ తగ్గి పవిత్ర పురుషుడైనాడు. ఆయన్ని యేమీ అనరేం!"
    "పవిత్రమయిన కాపరానికీ, యీ గుడిసేటితనానికీ సాటి తీసుకొచ్చావా? నీ నోరుపడ?"
    "మరి ఆ పవిత్రమయిన కాపరంలో కంటె, యిక్కడే ఆనందంగా ఆరోగ్యంగా వున్నానే!"
    "ఉండదూ? ఆనందంగా వుండదూ మరి! అడ్డూ, ఆటంకమూ లేకుండా కులమూ, గోత్రమూ లేకుండా...."
    "ఎంత అసహ్యంగా, క్షోభగా కుళ్ళుగా వుంటే అంత పుణ్యమన్నమాట!"
    "ఎందుకు అసహ్యంగా వుంటుంది. దుర్భుద్ధికి అలా తోచింది గాని"....
    "ఆ దుర్భుద్ధి మీ పెంపకం వల్లనా? లేక అలాంటిదాన్ని మీ అక్క కన్నదా? దేవుడిచ్చిన బుద్ధికి ఇంక మీరు యేడ్చి యేం ప్రయోజనం?
    "వీపు చీలిస్తే బుద్ధి కుదుట పడుతుంది."
    "సమయం మించిపోయింది."
    ఆలోచిస్తున్నాడు.
    "వూరికే పేర్లతో మనకీ తగాదా యెందుకు మామయ్యా!"
    "అంటే."
Like Reply
#40

    "అదే! పవిత్రం, అవినీతి, పశువులమల్లే పాతివ్రత్యం .... యిలాంటి మాటలకి శాశ్వతంగా అర్థాలు ఏర్పడ్డాయి. వాటి నిజమయిన అర్థమేమా అని మనుషులు ఆలోచించడం మానేశారు.... నిజం చెప్పినా- మనుషులమయిన తరవాత మనం వాంఛలన్నీ వొకటే. తురకాడైతేనేం, బ్రాహ్మణుడైతేనేం. కాని ఇక్కడ సంతుష్టిగా, నిర్భయంగా అనుభవించడానికి వీలుంది. అక్కడ మాయమాటలతో, ఆధ్యాత్మికమని, యీశ్వరుడి మీద భారంవేసి, చివరికి అనుభవించడానికి జంకుతాము. ఇంత కామమూ, పోనీ అనుభవించడం చాతనైతే బావుండుననే కోర్కె అక్కడా వుంది. కాని ఈ రసికత్వమూ, ఈ సత్తువా అక్కడ లేవు. అందుకనే కుళ్ళు వాయువులూ, బోధనలూ, వేదాంతాలూ, మర్యాదలూ, కచేరీ కబుర్లూ ఎక్కువ అక్కడ...."
    "వూరికే యింక మనసెలా యీడిస్తే అలా పోయి, బాగా యీ శరీర సుఖాలు అనుభవించడమేనన్నమాట యీ బతుక్కి అంతం?"
    "అక్కడ వున్నా అంతేగా? తినడమూ, నిద్రా, మర్యాదా, చాకిరీ, అంతేగా! వాటివల్లే ఏదో పుణ్యలోకాలు వొస్తాయని దొంగ బోధనలు పైగా."
    "మరి ధర్మమూ, పతిభక్తీ, సంసారమూ ఇవన్నీ?"
    "ఎందుకు మామయ్యా, ఆ పేర్లన్నీ యాకరువు పెడతావు? ఎవరికి కావాలి అవన్నీ! తంతాడనీ, తిండి పెట్టడనీ, వేరు గతిలేకా, అనుభవించడం చాతకాకా. అంతమాత్రం ధైర్యమూ, రసికత్వమూలేకా, మొహాన్ని, చూసి ముచ్చటపడేవారు లేకనేగా ఆ పతిభక్తీ, పవిత్రతా! ఆ మొగుడి నించే తిట్లూ తన్నులూ తిని అడ్డమయిన చాకిరీ చేసి, తగాదాలు పడి, పోట్లాటలతో కాలం గడుపుతూ చస్తే, మోక్షమా! ఏ దేవుడు చెప్పాడు."
Like Reply




Users browsing this thread: 1 Guest(s)