30-12-2018, 07:53 AM
(This post was last modified: 02-01-2019, 10:02 PM by Vikatakavi02.)
Episode 112
అప్పుడే సుజాత ఒకటి గుర్తించింది. సామిర్ పేంట్ జిప్ తెరిచి వుండటం!!!
అతడి నీలం రంగు డ్రాయర్ కొద్దిగా బయటకు వచ్చి ఆమెకు కనపడుతోంది. కన్నార్పకుండా అటేపు చూస్తూ వెనక్కు నడవసాగిందామె.
సామిర్ ఆమె ముఖంలో మార్పుని గమనించి ఆమె చూపుని అనుసరిస్తూ ఒక్కసారి క్రిందకి చూసుకున్నాడు. చప్పున వెనక్కి తిరిగి తన జిప్ ని పైకి లాగుకుని 'ఛ... ఇది వేసుకోడం మర్చిపోయానేఁ! సుజాత ఏమనుకుందో ఏమో?' అనుకుంటూ ముందుకి తిరిగాడు.
సుజాత, నాస్మిన్ లు కనపడలేదు!
ఇద్దరూ కాలేజ్ లోనికి వెళ్ళిపోయారు.
★★★
అజయ్ కి ఏం చెప్పాలో అర్ధంకాలేదు. 'ఏదో చాలాకాలం తర్వాత కలిసినట్లు 'ఏంటి విశేషాలు' అంటాడేంటి గురూ!' అని అనుకున్నాడు.
శిరీష్ వెంటనే అజయ్ భుజాన్ని తట్టి, "హ్మ్... పద టిఫిన్ చేద్దాం," అంటూ ఠక్కున లేచి నిల్చున్నాడు.
అజయ్ శిరీష్ ని అయోమయంగా చూసి తను కూడ లేచాడు.
ఇద్దరూ డైనింగ్ టేబిల్ దగ్గరకు వెళ్ళారు.
శిరీష్ అజయ్ కి టిఫిన్ ని వడ్డిస్తూ, "హ్మ్... నిన్న ఏమీ లేదని నాతో వాదించి, ఇవాళ వాణీతో ఒక్కసారిగా 'వదిన' అనేశావేఁ! ఒక్క రాత్రిలో ఇంత మార్పుకి గల కారణమేంటో నేను తెలుసుకోవచ్చా?" అన్నాడు.
"నీకన్నీ తెలిసిపోతాయన్నావ్ కదా గురూ!" కాస్త దెప్పుడు ధోరణిలో అన్నాడు అజయ్.
శిరీష్ తన కనుబొమ్మని ఎగరేసి సన్నగా నవ్వుతూ, "నీ మాటల్లో తెలుసుకోవాలనుంది!" అన్నాడు.
అజయ్ ఒకసారి శిరీష్ ని తదేకంగా చూశాడు. అతను ఎగతాళిగా ఏమీ అనటంలేదని అ(క)న్పించటంతో రాత్రి తనకు ఏమనిపించిందో మొత్తం వివరించి చెప్పాడు.
శిరీష్ ఆసక్తిగా అతను చెప్పేదంతా వింటున్నాడు.
సౌమ్య నగుమోము తన మష్తిష్కంలో మెదలగానే తన మనసు స్పందించిన తీరుని గురించి అజయ్ చెప్పటానికి ఇబ్బంది పడ్డాడు. దాన్ని ఎలా వివరించాలో అర్ధంకాక అతను తడబడుతుంటే శిరీష్ చిన్నగా నవ్వుతూ, "సుప్త-చేతన స్థితి," అని అన్నాడు మెల్లగా.
"హ్...ఏంటి?" చప్పున అడిగాడు అజయ్.
"సుప్తచేతన స్థితి... ఐ మీన్... సబ్-కాన్షస్ స్టేట్! మన జ్ఞాపకశక్తికి సంబంధించి మెదడు పనితీరుని రెండు రకాలుగా చూస్తాం, అజయ్! అందులో ఒకటి కాన్షస్ మెమరీ అయితే మరోటి సబ్-కాన్షస్ మెమరీ. సాధారణంగా... మనం రోజూ చేసే పనులూ... అంటే ముఖ్యమని తలిచేవన్నీ కాన్షస్‌మైండ్ లో ముద్ర పడిపోతాయి. ఇక మిగతా విషయాల గురించీ మనం పెద్దగా పట్టించుకోం కాబట్టీ అవన్నీ మెల్లగా మరుగునపడిపోతాయి. అలాగే క్రమంగా వాటిని మరచిపోవటం అనేది జరుగుతూ వుంటుంది. అయితే... మన మనస్సు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు... అంటే — నిద్రపోతున్నప్పుడో, లేదా ధ్యానస్థితిలో వున్నప్పుడో... అవి మరలా జ్ఞాపకం వచ్చేందుకు ఆస్కారం వుంది. అలా అవి గుర్తుకు రావటానికి కారణం — ఈ సబ్-కాన్షస్‌మైండ్. అది అవిశ్రాంతంగా పనిచేస్తూ మనకు తెలీకుండానే మన చుట్టూ వున్న పరిసరాలనీ, విన్న చిన్న చిన్న విషయాలనీ గమనిస్తుంది.
ఇక నీ విషయానికే వస్తే... నిన్న నీకు ఎదురయిన పరిణామాలు కొద్ధిసేపు నిన్ను కుదురుండనీయలేదు. ఒక్కసారిగా పుట్టెడు తలపులు తెరిపినివ్వకుండా చుట్టుముట్టడంతో ఒక విధమైన సందిగ్ధత నీలో నెలకొంది. అయితే, చివరికి నీకలవాటైన యోగా ప్రక్రియ ద్వారా మరలా నీ మనస్సు తేలికవ్వడంతో అంతకుమునుపు నీ కనులముందు జరిగిన దృశ్యం మరింత విశదమై నీకు కనిపించిందంతే!"
అజయ్ నోరు తెరుచుకుని శిరీష్ ని చూస్తూ, " గురూ... నువ్వు సైన్స్ టీచరువా... సైకియాట్రిస్టువా? మరీ ఇంత థియరీయా...?! లేకపోతే ఇవ్వాళ కాలేజ్ కి వెళ్ళడం మానేసినందుకు నాకు స్పెషల్ గా క్లాస్ తీసుకుంటున్నావా? హుఫ్...!!!" అన్నాడు.
శిరీష్ తేలిగ్గా నవ్వేస్తూ— "అదేం లేదుగానీ, ఇంతకూ ఆ అమ్మాయికి నీ మనసులో మాటని చెప్పావా మరి?" అని అడిగాడు సడెన్ గా; సమాధానాన్ని ముందే ఊహిస్తూ.
అజయ్ ఏమీ బదులివ్వలేదు.
"లేదు కదూ...!" అన్నాడు శరీష్ మళ్ళా.
మౌనంగా తలూపాడు అజయ్.
"ఏఁ?"
గొంతుకి ఏదో పెద్ద గడ్డ అడ్డుపడినట్టు అనిపించింది అజయ్ కి. చిన్నగా గుటకవేశాడు. గుండె వేగంగా కొట్టుకోసాగింది.
శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి, తల్లి బిడ్డని లాలనగా అడిగినట్టు, "ఏంట్రా... చెప్పు!" అన్నాడు.
మెల్లగా తన గొంతుని సవరించుకొని, "అఁ...మ్..హ్...ఆమె ముందుకి వెళ్ళాలంటే... ఎందుకో... బ్-భయ్యంగా...హ్... వుంది గురూ...! ధైర్యం చాలట్లేదు," చెప్పాడు అతికష్టంమీద.
శిరీష్ కళ్ళెగరేస్తూ అజయ్ ని వింతగా చూస్తూ—
"హ్మ్... టఫ్ కి భయం. వినటానికి చాలా చిత్రంగా వుందే...!" అన్నాడు. అజయ్ ఇబ్బందిగా కదిలాడు. "అయితే... ఇది మరీ అంత అసహజమైనదేమీ కాదులేఁ!" అన్నాడు శిరీష్ వెంటనే.
అదేమిటని అడుగుదాం అనుకున్నా మళ్ళా శిరీష్ ఏ పాఠాన్ని ఎత్తుకుంటాడో అనిపించి ఆ ప్రయత్నాన్ని మానివేశాడు అజయ్.
"హ్మ్... భయపడుతూ కూర్చుంటే ఆమెకు ఎలా చెప్తావ్ అజయ్.? ఎలాగోలా ధైర్యం కూడగట్టుకొని ఆమెకు నీ మనసులో మాట చెప్పేయ్..!"
లేదన్నట్టు తలూపుతూ, "ఆమెను గురించి ఆలోచిస్తే కోపంతో కణకణలాడుతున్న ఆమె ముఖమే గుర్తుకొస్తోంది. నిన్న అంత సీన్ అయ్యాక ఇప్పుడు వెళ్ళి చెప్పటం—"
"అలాగని ఎంతకాలం నీ మనసులోని మాటని అలా దాచుకుని వుంటావ్..."
"ఏమో గురూ...!"
"చాలా కన్ఫ్యూజన్ లో వున్నావుగా! హుఫ్... ఐతే ఏం చేద్దామిప్పుడు?" అంటూ తనూ ఆలోచించసాగాడు శిరీష్.
"గురూ... పోనీ, నువ్వెళ్ళి చెప్తావా? నువ్వయితే ఏదైనా బాగా వివరించి చెప్తావ్ కదా?"
శిరీష్ ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి, "చెప్పొచ్చురా... కానీ ఆమెకు పొరపాటున నేను చెప్పింది నచ్చేసి నన్ను ప్రేమించేస్తే! అసలుకే మోసం వస్తుందేమో! నేనసలే పెళ్ళయినవాణ్ఞి—"
"గురూ...!"
శిరీష్ సన్నగా నవ్వి— "అన్నిటికీ మధ్యవర్తిత్వం కూడదు అజయ్. ముఖ్యంగా ప్రేమ విషయంలో. నీ మనసులోని మాట నీద్వారానే ఆమె మనసును చేరాలి. అప్పుడే ఆమెకు నీ ప్రేమలోని నిజాయితీ తెలుస్తుంది. అన్నట్టూ... ఆ అమ్మాయి గురించి డిటెయిల్స్ ఏమైనా నీకు తెలుసా?"
"హా... తెలుసు గురూ! తను చదువుతున్న కాలేజీ డిటెయిల్స్ నాదగ్గర వున్నాయి. అలాగే తన ఫోన్ నెంబర్ కూడ."
"మ్... గుడ్. తన ఫోన్ నెంబర్ వుందిగా. అయితే, ఫోన్ చేసి మాట్లాడు. మంచిగా పరిచయం చేస్కో..."
అజయ్ వెంటనే తన ఫోన్ తీసి డయల్ చేసాడు.
ఒక రెండు రింగుల తర్వాత అట్నుంచి, "హలో...ఎవరూ—?" అంటూ శ్రావ్యమైన గొంతు వినపడింది.
ఠక్కున కాల్ కట్ చేసేసాడు అజయ్. అతనికి నుదురంతా చెమట పట్టేసింది.
"ఏమైంది? కాల్ కనెక్ట్ అవ్వలేదా?" అంటూ కళ్ళెగరేసాడు శిరీష్.
అడ్డంగా తలూపుతూ, "అయ్యింది... కానీ, నావల్ల కాదు గురూ...!" అన్నాడు అజయ్. "ఆమె గొంతు వింటే... నిన్న తను నాతో అన్న మాటలు గుర్తుకొస్తోంది. ఒళ్ళంతా గ-గగుర్పాటు కలుగుతోంది!"
శిరీష్ అసహనంగా, "అబ్బా... డైరెక్టుగా మాట్లాడమంటే కళ్ళలో చూడలేను అంటావ్. పోనీ, ఫోన్ ద్వారా ప్రొసీడ్ అవ్వమంటే గొంతు వింటే గుండె దడ అంటావ్... ఇలాగైతే నీ ప్రేమరథం ఎలా కదులుతుందిరా!" అంటూ మెల్లగా తన గెడ్డాన్ని పాముకుంటూ, "మ్... ఇక ఒక్క మార్గమే తోస్తుంది. లెట్స్ రైట్ ఏ లెటర్ టు హెర్!"
"లెటరా..?!"
"హా... లెటరే... లవ్ లెటర్!! ఉమ్... ఈ వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్కుల యుగంలో ప్రేమలేఖ వ్రాయమని చెప్పడానికి నాకే కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది. కానీ, ఇది తప్ప వేరే మార్గం లేదు!"
అజయ్ కి కూడా ఇది అనువుగా అనిపించింది. కానీ—
"గురూ... నేను రాయగలనంటావా...? అంటే, ఇన్నాళ్ళూ చార్జ్ షీట్లు, ఎఫ్. ఐ. ఆర్ లు రాసిన చేత్తో ఇప్పుడు లవ్ లెటర్ రాయటమంటే... అఁ... అసలు లవ్ లెటర్ రాసేంత భాష నాలో వుందంటావా?"
"ఏమో! మొదలుపెట్టి... ఊహు... మనసుపెట్టి చూడు. అసలు నువ్వేమి వ్రాయగలవో నీకే తెలుస్తుంది!" అంటూ చప్పున లేచి పక్కనే వున్ షెల్ఫ్ లోంచి ఓ దస్త వైట్ పేపర్ల కట్టని తీశాడు.
.
.
.
.
.
ఆరోజు మధ్యాహ్నం 2.30 గంటలకి రాజ్యలక్ష్మీ కాలేజీలో లాస్ట్ అవర్ క్లాస్ మొదలవుతుందనగా అటెండర్ రాంబాబు వచ్చి ఎమ్. ఏ ఎకనామిక్స్ స్టూడెంట్ అయిన సౌమ్యకి ఓ లెటర్ ని ఇచ్చాడు. ఆ లెటర్ ఎన్వలప్ పై 'ప్రేమతో... నీ అజయ్' అని వ్రాసి వుండటం చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK