24-12-2018, 10:15 PM
Episode 104
లత, వాణీలకు వీడ్కోలు పలికి ముగ్గురూ అక్కడినుంచి బయలుదేరారు. జీప్ ని నడుపుతూ మాటిమాటికీ సైడ్ మిర్రర్ లోంచి సౌమ్యను చూడసాగాడు అజయ్. ఆమె తన తలను దించుకుని కూర్చుని వుంది. మధ్యలో ఓసారి ఆమె ముఖం తనవైపు తిరగ్గానే ఎందుకో అజయ్ కి మళ్ళా గుండె వేగం హెచ్చింది. అయితే, ఆమె క్షణకాలం అజయ్ ని చూసి మళ్ళా తన తల దించుకున్నది.
అజయ్ వాళ్ళని తిన్నగా ఇంటికి తీసుకువెళ్ళకుండా కాస్త అటు తిప్పి ఇటు తిప్పి తీసుకెళ్ళడంతో అరగంట తర్వాత వాళ్ళు ఇల్లు చేరారు.
జీప్ ఆగగానే అమ్మా కూతుర్లిద్దరూ చకచకా దిగిపోయి వెనుదిరిగి చూడకుండా వడివడిగా తమ ఇంటి వైపు నడిచారు.
"ఓ...అమ్మగారూ...! భద్రంగా మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాను. కనీసం ఇంట్లోకి రమ్మని కూడా అనట్లేదు..." అంటూ వెనకనుంచి కేకేశాడు అజయ్. ఎందుకో.... వాళ్ళతో మరికాస్త సమయం గడపాలని అనిపిస్తోంది అతనికి.
ఆ పెద్దావిడ ఆగి అజయ్ వైపు తిరుగుతూ, "అ-హ..అబ్బే... అదేం లేదు బాబు. మాలాంటివాళ్ళ యిళ్ళలోకి మీరేం వస్తారులే అనీ...!" తన కూతురికి తలుపు తీయమని ఇంటి తాళం చెవులు ఇస్తూ, "రండి బాబూ...!" అని అజయ్ ని ఆహ్వానించింది.
సౌమ్య ఓసారి వీధి వైపు చూసింది. చుట్టుప్రక్కల ఇల్లల్లోంచి జనాల చూపులు మాటిమాటికీ తమవైపు తిరుగుతున్నాయి. ఇవాళ పొద్దున్నుంచీ సెక్యూరిటీ ఆఫీసర్ల రాకపోకలతో తమ పేర్లు ఇరుగుపొరుగు వాళ్ళ నోళ్ళలో బాగా నానిపోయి వుంటాయని ఆమెకు తెలుసు. ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఆఫీసర్ తమ ఇంట్లోకి కూడా రావడం తనకి అస్సలు నచ్చటంలేదు.
అజయ్ తన జీప్ ని రోడ్డుకి ఓ ప్రక్కన పార్క్ చేశాడు. అక్కడే టీ షాప్ లో వున్న కానిస్టేబుల్ పరుగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చి సెల్యూట్ చేశాడు. అజయ్ జీప్ కీస్ వాడికిచ్చి బయటే వుండమని చెప్పి అతను ఇంట్లోకి ప్రవేశించాడు. ముందు గదిలోకి అడుగుపెడుతూనే చుట్టూ పరికించి చూశాడు. ఈ యిల్లు వారి ప్రశాంత జీవనాన్ని ప్రతిబింబిస్తోంది. ఎక్కడి సామాన్లు అక్కడ చక్కగా సర్ది వున్నాయి. గదిలో ఓ మూలన టేబిల్ వుంది. ప్రక్కనే నాలుగు కుర్చీలు గోడకు ఆన్చి వున్నాయి. టేబిల్ మీద కొన్ని పుస్తకాలు ఒకదానిమీద ఒకటి పేర్చి వున్నాయి. బహుశా అవి సౌమ్య కాలేజీ పుస్తకాలు కావచ్చు! మరో మూల దేవుని పటాలు వరుసగా గోడకి తగిలించి వున్నాయి.
ఆ ప్రక్కనే మరొక గది కనిపిస్తోంది. చూడ్డానికి వంటగదిలా వుంది. సౌమ్య వాళ్ళ అమ్మ ఒక కుర్చీని తీసుకొచ్చి అజయ్ ముందు పెట్టి, "కూర్చోండి బాబు... టీ చేసి తీసుకొస్తాను!" అంటూ వంటగదిలోకి వెళ్ళబోయింది. సౌమ్య ఆవిడని మధ్యలో ఆపి తను వంటగదిలోకి వెళ్ళింది.
ఆవిడ మళ్ళీ అజయ్ దగ్గరకు వచ్చి నిల్చుంది. అజయ్ కుర్చీలో కూర్చుంటూ ఆమెతో, "మీరూ కూర్చోండమ్మా...!" అన్నాడు.
"పర్వాలేదు బాబూ...!" అందామె.
అజయ్ అందుకు ఒప్పుకోక వెంటనే కుర్చీలోంచి లేచి ఆవిడకి ఇచ్చి తనకోసం మరో కుర్చీని తెచ్చుకోవటానికి వెళ్ళాడు.
కుర్చీని తెస్తూ అక్కడ గోడకి తగిలించి వున్న ఒక ఫొటోని చూశాడు. సుమారుగా ఒక పాతికేళ్ళ వయసున్న కుర్రాడి ఫొటో అది. దానికి దండ వేసివుంది.
"ఆయన నా భర్త, బాబు. చనిపోయి పదహారేళ్ళవుతోంది!" అజయ్ ఆ ఫొటో వంక చూడ్డం గమనించి చెప్పిందావిడ.
అజయ్ చప్పున ఆమెను చూసాడు.
పదహారేళ్ళు!!!
పదహారేళ్ళుగా మగతోడు అండ లేకపోయినా ఎంతో గుండె ధైర్యంతో సమాజపు సవాళ్ళను ఎదుర్కొంటూ సమర్థవంతంగా ఇంటిని నడిపించిన ఆ పెద్దావిడకి మనసులోనే సెల్యూట్ చేశాడు. మెల్లిగా తలాడిస్తూ కుర్చీని తెచ్చుకుని ఆవిడ దగ్గర వేసుకుని కూర్చున్నాడు.
అతని చూపు వంటగది వైపు పోయింది. సౌమ్య అటు తిరిగి టీ పెడుతోంది. జీవితంలో మొదటిసారి ఒక ఆడది వెనక్కి తిరిగి వున్నప్పుడు ఆమె వెనక అందాల్ని కాకుండా ఆమె ముఖంలోని భావాల్ని చూడాలనిపించింది అజయ్ కి.
అప్పుడే అతనికి మెల్లగా వాణీ మాటలు జ్ఞాపకం వచ్చాయి. 'అన్నయ్యా... సౌమ్యగారు అచ్చం లతక్క లాగే చాలా అందంగా వున్నారు కదా...!'
"ఔను! నిజమే...!" అన్నాడు ఇంకా సౌమ్య వంక చూస్తూ.
"ఏంటి బాబూ?" అంది సౌమ్య వాళ్ళ అమ్మ, అతనేమన్నాడో అర్ధంకాక.
అజయ్ ఏమీ లేదన్నట్టుగా తలూపాడు. సౌమ్య ఒక పళ్ళెంలో టీ పట్టుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది.
"అయ్యో నా మతి మండా! ఉండు బాబు. ఇప్పుడే వస్తాను," అంటూ ఆ పెద్దావిడ చప్పున తన కుర్చీలోంచి లేచి వీధి గుమ్మం గుండా బయటకు వెళ్ళిపోయింది.
అజయ్ తో ఒంటరిగా గదిలో వుండటం సౌమ్యకి ఏదోలా వుంది. తన మస్తిష్కంలో అంతకుముందు జరిగిన సంఘటనలన్నీ కదలాడుతున్నాయి. అజయ్ లాఠీతో తన కాళ్ళను తడమటం, కళ్ళముందు తిప్పడం, తనతో కౄరంగా ప్రవర్తించడం— అదంతా తానని కలల్లో కూడా వెంటాడేలా వుంది. గుండెల్లోంచి తన్నుకొస్తున్న కోపాన్ని అణుచుకునే ప్రయత్నంలో చేతిలో వున్న పళ్ళాన్ని గట్టిగా పట్టుకుని నేలను చూస్తూ నిల్చుంది.
అజయ్ ఓసారి తలెత్తి సౌమ్య వంక చూసి, "సౌమ్యగారూ...—!" అన్నాడు. ఆ మాట జీరగా రావడంతో ఓసారి చిన్నగా దగ్గి, "నన్ను క్షమించండి," అన్నాడు. ఆమె మాట్లాడితే వినాలని అజయ్ ఎదురుచూస్తున్నాడు. అయితే, ఆమె ఇంకా అలాగే మౌనంగా నిలబడి వుంది.
ఇంతలో సౌమ్య వాళ్ళ అమ్మ వీధి తలుపులోంచి లోపలికి వచ్చింది. ఆవిడ చేతిలో ఓ బిస్కెట్ ప్యాకెట్, ఓ మిక్చర్ ప్యాకెట్ వున్నాయి. చకచకా వంటగదిలోకి పోయి వాటిని ఓ ప్లేటులో సర్ది తీసుకొచ్చి అజయ్ ముందు పెడుతూ, "అయ్యో! టీ చల్లారిపోయినట్టుందే," అంది. అజయ్ పర్లేదన్నట్టుగా చెయ్యూపి సౌమ్య వైపు తిరిగి, "సౌమ్యగారూ... దయచేసి నా తప్పుని క్షమించండి... మీరలా మౌనంగా వుంటే ఏదోలా వుంది నాకు. చెప్పాను కదా... నేనలా చెయ్యక తప్పలేదు. ఒక పసిపాప ప్రాణాలు కాపాడాలనీ, నా డ్యూటీలో భాగమే తప్ప మరేమీ కాదు. ప్లీజ్... మా పరిస్థితిని అర్ధం చేసుకోండి," అంటూ మరోమారు ఆమెకు క్షమాపణ చెప్పాడు.
సౌమ్య చప్పున తలెత్తింది. ఆమె కళ్ళు అగ్నిగోళాల్లా ఎర్రగా వున్నాయి. అంతవరకూ తనలో అణుచుకున్న కోపం కాస్తా లావాలా బయటకు చిమ్మింది. చేతిలోవున్న పళ్ళాన్ని బలంగా నేలకేసి విసిరి కొట్టి, "ఏం అర్ధం చేసుకోమంటారు సార్? హా... మాకూ ఓ జీవితం వుంటుందనీ, పరువుగా బ్రతికే హక్కు వుంటుందనీ... మీరు అర్ధం చేసుకున్నారా...? వీధిలో నలుగురూ చూస్తుండగా నన్ను కొట్టినప్పుడు, లాఠీని ఎక్కడబడితే అక్కడ తగిలించినప్పుడు నేను మీకు మనిషిలా కనిపించలేదా..? అదే... నా స్థానంలో ధనవంతుల బిడ్డలుంటే, వాళ్ళకీ మీరు ఇలాగే చేసేవారా...? మాలాంటి పేదవాళ్ళంటే మీకు చులకనభావం. ఏం చేసినా నోరు మెదపమని. అంతేగా! మేము పేదవాళ్ళం కావచ్చుగాని, పరువు తక్కువ వాళ్ళం కాము సార్!" అంటూ గద్గద హృదయంతో తీవ్రంగా ఆక్రోశించింది.
అజయ్ జరిగినదాని గురించి పశ్చాత్తాపపడుతున్నాడని సౌమ్యకు తెలుసు. అతను రెండుసార్లు క్షమాపణ చెప్పినప్పుడే ఆమె అది గ్రహించింది. అదే, అతను అంతకుముందు తనతో దురుసుగా ప్రవర్తించిన సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యుంటే తను ఇప్పుడు ఇన్ని మాటలు అంటున్నా అలా మౌనంగా ఉండేవాడు కాదు. సౌమ్య వాళ్ళ అమ్మ కుర్చీలోంచి లేచి తన కూతురి దగ్గరకి వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకుంది. బైటకి ప్రకటించకపోయినా ఆవిడ కూడా మనసులో ఇలాగే అనుకుంటోంది. కళ్ళలో నీరు పొంగుతుండగా ప్రేమగా సౌమ్య తలని నిమిరింది.
అజయ్ నిశ్చేష్టుడై సౌమ్యవంక చూడసాగాడు. ఆమె అన్న ఒక్కొక్క మాటా అతని గుండెల్లోకి సూటిగా చొచ్చుకుపోయింది.
సౌమ్య ఇంకా అజయ్ ని అలా చూస్తూనే, "మీకు మీ డ్యూటీ ముఖ్యం. మా బతుకులు ఏమైపోతే మీకేంటి, సార్! మేం చచ్చినా మీకేం నష్టం లేదు. దయచేసి మా యింటి నుంచి వెళ్ళిపోండి... గెటౌట్ ఆఫ్ మై హౌస్!" అంది కర్కశంగా.
అజయ్ నెమ్మదిగా కుర్చీలోంచి లేచాడు. మాట్లాడటానికీ అతనికి ఏమీ పదాలు దొరకలేదు. చేతులు జోడిస్తూ వాళ్ళిద్దరికీ దణ్ణం పెట్టి బయటకు నడిచాడు.
సౌమ్య లోపలే వుండిపోగా వాళ్ళ అమ్మ అతని వెనకే బయటకు వచ్చింది. అజయ్ ఆవిడని చూసి, "వెళ్ళొస్తానండీ...!" అనేసి మళ్ళా ఓసారి నమస్కరించి జీపెక్కాడు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK