21-12-2018, 11:41 PM
(This post was last modified: 21-12-2018, 11:56 PM by Vikatakavi02.)
Episode 96
టైం మధ్యాహ్నం రెండు గంటలవుతోంది.
అజయ్ తన పనిని ముగించుకొని మరలా అమలాపురానికి బయలుదేరాడు. ఆ నెంబర్ గురించి వివరాలను శంకర్ కి ఫోన్ చేసి చెబుదామని ముందు అనుకొన్నా, పర్సనల్ గా కలిసి చెప్పడం మంచిదనిపించి వాయిదా వేశాడు.
ఇంటికొచ్చి తలుపు తట్టాడు. లోపల అందరూ అప్పుడే భోజనం ముగించి లివింగ్ రూమ్ లో కూర్చున్నారు. శంకర్ మాత్రం తన గదిలోకి వెళ్ళిపోయాడు.
గిరీశం వెళ్ళి తలుపు తెరిచాడు. అజయ్ ని అక్కడ చూడగానే అతనికి ఒళ్ళంతా వణుకు మొదలైంది. "వీడేంటిలా తగలడ్డాడు?" అనుకున్నాడు మనసులో.
అజయ్ గిరీశాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. "హా... గిరీశంగారూ...! మీరు హైదరాబాద్ వెళ్ళారని అంజలిగారు చెప్పారే....?" అని అడుగుతూ లోపలికి అడుగుపెట్టాడు.
"అదీ... న్-నే-ను....నా పని అవ్వలేదు.... అందుకనీ...వెనక్కీ.... తిరిగొచ్చేశాను!" అన్నాడు గిరీశం కాస్త తడబడుతూ.
మిగతావాళ్ళ ముందు ఎంత బడాయిగా మాట్లాడినా అజయ్ ని చూడగానే గిరీశంలోని గాంభీర్యం సగం ఎగిరిపోయింది.
"అదేమిటీ...! మీ ఫ్రెండుకు అప్పగించానని చెప్పారుగా... ఆ డీల్ ని...?" అంది అంజలి అజయ్ ని చూసి పలకరింపుగా ముందుకు వస్తూ.
"హా... అవునూ... అదే... న్-నా ఫ్రెండుకు.... అదే.... నా ఫ్రెండు చూస్కుంటున్నప్పుడు నా పని ఉండదు కదా.... అ-అందుకే... న్-నా పని లేదన్నాను. ఇప్పుడేంటీ.... అందరికీ అన్నీ మొత్తం విడమర్చి చెప్పడానికి అదేమైనా భారతమా?" అన్నాడు అంజలితో విసుగ్గా మొహం పెట్టి.
అంజలి నిర్లిప్తంగా, "లేదు లెండి...!" అని గిరీశంతో అనేసి అజయ్ తో, "భోం చేశారా...?" అనడిగింది.
అజయ్ 'ఔన'న్నట్టుగా తలూపి, "శంకర్ యేడి...?" అనడిగాడు గిరీశాన్ని ఆసక్తిగా గమనిస్తూ. "తన గదిలోనే వున్నాడు. పిలవమంటారా?" అంటూ సమాధానం కోసం వేచి చూడకుండా శంకర్ గది వైపు నడిచింది తను. అజయ్ తన జేబులోంచి మెల్లగా సిగరెట్ పేకెట్ తీసి వెలిగించుకుంటూ ఇప్పుడు జరిగిందంతా ఆలోచించసాగాడు.
తలుపు తెరిచినప్పుడు గిరీశం ముఖంలో కనిపించిన ఒకలాంటి బెదురు... తర్వాత అతని మాటల్లో తడబాటు... ఇంకా అకారణంగా కోపాన్ని ప్రదర్శించడం.... గిరీశం గురించి తనకు పెద్దగా తెలియకపోయినా, ఎందుకో గిరీశం ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తోంది.
అప్పుడే ఏదో గుర్తుకొచ్చి గిరీశంతో, "ఇదిగోండి, తీస్కోండి!" అంటూ ఆ సిగరెట్ పేకెట్ ని అతని ముందుంచాడు.
గిరీశం వెంటనే ముఖం చిట్లిస్తూ, "సారీ! నేను సిగరెట్లు తాగను," అన్నాడు చెయ్యి అడ్డంగా పెడుతూ.
"ఓహో...సారీ!" అంటూ ఆ పేకెట్ ని తిరిగి జేబులో పెట్టుకుని ఇలా అనుకున్నాడు. 'గిరీశానికి సిగరెట్లు త్రాగే అలవాటు లేదు. మరి, ఆరోజు తను చూసిన నికొటిన్ ఫిల్డ్ సిగరెట్స్...?'
అలా యోచిస్తూ,
"ఆ... గిరీశంగారు, మీ ఫ్రెండ్ పేరేమన్నారు...?" అన్నాడు సడెన్ గా.
గిరీశం అనాలోచితంగా, "దుర్గా-... అఁ.మ్.... ధర్మారావ్...ధర్మారావ్!" అని తడబడుతూ అన్నాడు.
కొంచెం కొంచెంగా అజయ్ కి గిరీశం పై అనుమానం బలపడుతూ వుంది.
తన ఫోన్ తీసి ఫేక్ కాల్ ని సెట్ చేశాడు. అప్పుడే శంకర్ తన గదిలోంచి బయటకు వచ్చి, "అజయ్... ఏమైంది... ఆ నెంబర్ గురించి తెలిసిందా...?" అనడిగాడు డైరక్టుగా.
"హా... అదే పనిలో వున్నాం.!" అంటూ ఓరకంట గిరీశాన్ని చూస్తూ, "శ్రీదేవిగారికి ఏం కాదు. నువ్వేం కంగారు పడకు... శ్రీదేవిగారి గురించి ఏమైనా తెలిస్తే చెప్పమని నా సబార్డినేట్ కి చెప్పాను, శ్రీదేవిగారికి ఎవడైనా ఏమైనా చేస్తే వాడి తాట తీసేవరకూ వదిలేది లేదు," అంటూ కావాలనే 'శ్రీదేవి' పేరుని మాటిమాటికీ ప్రస్తావించాడు. గిరీశానికి ఒళ్ళంతా చెమట్లు పట్టేయడం ఓరకంట గమనించాడు. అతని అనుమానం మరింత బలపడింది.
అప్పుడే తన సెల్ లో ముందుగా సెట్ చేసిన కాల్ రింగయింది. "ఇదుగో... కాలొచ్చింది," అంటూ ఎత్తి, "చెప్పు పాణి... ఏంటీ...? శ్రీదేవిగారు దొరికారా...?" అన్నాడు. గిరీశానికి నెత్తి మీద పిడుగుపడినట్టయింది.
అంజలి, "హమ్మయ్య! దొరికారా—" అనబోతుండగా అజయ్ ఆమెను ఆపమన్నట్టుగా చెయ్యెత్తి ఫోన్ లో కొనసాగిస్తూ, "ఎక్కడా...? ఓహో...అలా జరిగిందా? ఇంకేం చెప్పారావిడ..? ఊ.... అవునా...—?" అంటూ చప్పున గిరీశం వంక చూశాడు. గిరీశం నిలువెల్లా వణికిపోతూ నించుండిపోయాడు.
"ఇంకా...? మ్.... సరే... ఓకే...! నేను చూసుకొంటాను," అంటూ అజయ్ ఫోన్ ని చెవి దగ్గర నుంచి తీసేసి గిరీశం వంక చూస్తూ, "హ్మ్... గిరీశంగారూ... అయితే మొత్తం మీరే—" అనబోతుండగా, గిరీశం భయపడుతూ కంగారుగా, "న్-నేనేం చెయ్యలేదు. అ-అంతా వ్-వాడే చేసాడు... న్-నేనొద్దనే చెప్పాను. వినలేదు దుర్గాదాస్... న్—"
అతను మరో మాటని పూర్తిచేసేలోపు అతని చెంపని ఛెళ్ళుమనిపించాడు టఫ్.
ఆ దెబ్బకి విసురుగా నేలమీద పడ్డ గిరీశాన్ని కాలరు పట్టుకొని పైకి లేపి, "ఇప్పుడు చెప్పు.. ఏం చెప్పాలనుకుంటున్నావో.!" అన్నాడు అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ...
గిరీశం వణికిపోతూ జరిగిందంతా పూసగుచ్చినట్లు అక్కడున్నవారిందరికీ చెప్పేశాడు.
తర్వాత అజయ్ గిరీశాన్ని అలాగే పట్టుకుని తన జీప్ లో పడేసి శంకర్ తో కలిసి ఫాం హౌస్ కి బయల్దేరాడు.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK