నా కథ...26
ప్రకాష్ తో కలిసి ప్రారంభించిన వ్యాపారాన్ని మధ్యలోనే ప్రకాష్ కి అమ్మేశాక రవి, రాజులు మళ్లీ అదే వ్యాపారం సొంతంగా ప్రారంభించారు...
ఆల్రెడీ ఆ ఫీల్డ్ మీద చేసిన శ్రమ, రీసెర్చ్ అంతా వృధా కావద్దని వాళ్ళ ఉద్దేశ్యం... రవి పాత బిసినెస్ చూసుకుంటే రాజు ఈ కొత్త బిసినెస్ చూసే వాడు..
తక్కువ కాలం లొనే ప్రకాష్ కి పోటీ ఇచ్చే స్థాయికి పెరిగేలా చేసాడు రాజు ... అయితే ఎప్పుడూ ప్రకాష్ కి పోటీగా అనుకునే వాడు కాదు.. ఎవరి బిసినెస్ వారిది అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు...
అత్తయ్య సిక్ అయినప్పట్నుండీ అంటే ఇంచు మించు ఏడాదిగా రాజు సరిగా ఆఫీస్ కి వెల్లకపోవడం వల్ల ఆ బిసినెస్ కూడా రవే చూసుకుంటున్నాడు... రవికి తన బిసినెస్ పెంచుకోవడమే కాకుండా ప్రకాష్ ని ఆ బిసినెస్ లో లేకుండా చేయాలని మొదట్నుంచీ కసిగా ఉంది... కానీ రాజు వారించడంతో ఊరుకునే వాడు...
ఇప్పుడు రాజు రాకపోవడంతో తానే ఆ బిసినెస్ చూడడం మొదలు పెట్టినప్పట్నుండీ ప్రకాష్ ని ఎలాగైనా దెబ్బకొట్టాలని చూస్తున్నాడు...
అత్తయ్య పోయాక రాజు ఒంటరి వాణ్ణి అని ఫీల్ అవడానికి లావణ్యతో పాటు ప్రకాష్ కూడా కారణం అని రవి ప్రకాష్ మీద ఇంకా కోపం పెంచుకున్నాడు.. రాజు ఎలాగూ ఆఫీసుకు వెల్లకపోవడం వల్ల రవి ప్రకాష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు...
కార్పొరేట్ సెక్టార్ లో తనకు ఉన్న పలుకుబడిని అంతా ఉపయోగించాడు... ప్రకాష్ కి ముడి సరుకు సరిగా దొరకకుండా చేసాడు.. దొరికినా ఎక్కువ రేట్ పెట్టి కొనవల్సి వచ్చేది ప్రకాష్ కి..
కష్టపడి ఏదోలా ప్రొడక్ట్ తయారు చేసినా మార్కెటింగ్ లో కూడా ప్రకాష్ కి చిక్కులు తెచ్చి పెట్టాడు రవి...
ఆ విధంగా కొద్ది రోజులకే ప్రకాష్ తన బిసినెస్ ని నడపలేక అమ్ముకునే స్థితికి తీసుకొచ్చాడు... ప్రకాష్ అమ్మకానికి పెట్టాక కూడా ఎవరూ దాన్ని కొనేందుకు ముందుకు రాలేదు.. చివరికి రవే తక్కువ రేట్ కే ప్రకాష్ బిసినెస్ మొత్తం కొనేశాడు... రాజు తిరిగి ఆఫీస్ కి వెళ్లే సమయానికి ప్రకాష్ బిసినెస్ కూడా రాజు చేతికి వచ్చింది..
అయితే తన బిసినెస్ నష్టాలకు కారణం రవే అనే విషయం ప్రకాష్ కి తర్వాత తెలిసింది... అప్పటికే అంతా అయిపోయింది.. తనని నష్టపరిచిన వాడని తెలిసీ రవికే తన బిసినెస్ అమ్మాల్సి రావడం ప్రకాష్ కి చాలా అవమానంగా తోచింది...
దెబ్బకు దెబ్బ తీయాలని అనుకున్నాడు ప్రకాష్..
కానీ రవిని బిసినెస్ లో దెబ్బ తీయడం తన వల్ల కాదని ప్రకాష్ కి బాగా తెలుసు... రాజు, రవి ల సామర్థ్యం ఏంటో ప్రకాష్ దగ్గరనుండి చూసాడు..
కాబట్టి బిసినెస్ లో వాళ్ళను దెబ్బ కొట్టడం అతనికి అసాధ్యం...
అందుకని ప్రకాష్ ఇంకో మార్గాన్ని ఎంచుకున్నాడు...
ఒకరోజు రవి ఏదో పని మీద తాండూర్ వెళ్ళాడు..... పని ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల వద్ద.. ప్రకాష్ పంపిన రౌడీలు రవి కార్ ని ఆపారు... డ్రైవర్ ని, రవిని పక్కనున్న అడవిలోకి తీసుకెళ్లారు.. బలవంతంగా ఏదో ఇంజక్షన్ ఇవ్వడం వల్ల డ్రైవర్ స్పృహ కోల్పోయాడు...
తర్వాత వాళ్లు తమతో తెచ్చుకున్న కర్రలతో రవిని ఇష్టారీతిగా కొట్టడం మొదలు పెట్టారు... అప్పటికే చీకటి పడడంతో ఆ అడవిలో రవి కేకలు ఎవరికీ వినబడలేదు... ప్రకాష్ ఆ రౌడీలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టున్నాడు.. వాళ్ళు ఎక్కువగా కాళ్ళ మీదా, చేతుల మీద, నడుము మీద కొట్టారు.. తలకి దెబ్బలు తగలకుండా చూసుకున్నారు.. ప్రకాష్ ఉద్దేశ్యం రవి చనిపోకూడదు కానీ తిరిగి లేవకూడదు అని...
ఒక అరగంట పాటు దెబ్బల్ని తట్టుకున్న రవి స్పృహ కోల్పోయాడు... తర్వాత కూడా వాళ్ళు కొట్టారా లేదా అనేది ఎవరికీ తెలియదు...
ఇంజక్షన్ ప్రభావం తగ్గాక డ్రైవర్ మేల్కొనే సరికి రవి రక్తపు మడుగులో స్పృహ లేకుండా పడి ఉన్నాడు... వెంటనే డ్రైవర్ రాజుకి కాల్ చేసి విషయం చెప్పి రవిని వికారాబాద్ లోని ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లాడు... అక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లమని డాక్టర్స్ చెప్పారు... ఈ లోపు రాజు వికారాబాద్ చేరుకొని రవిని హైదరాబాద్ కి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ లో చేర్చాడు..
ఇంటికి వచ్చి నన్ను కార్ లో తీసుకెళ్లాడు...
ఎక్కడికి అంటే చెప్తాను ముందు పద అంటూ ఏమీ చెప్పకుండా హాస్పిటల్ కి తీసుకెళ్లాడు...
ఏమైంది రాజు హాస్పిటల్ కి ఎందుకు తీసుకొచ్చావ్ అని అడిగా...
చెప్తా రా అంటూ లోపలికి తీసుకెళ్లాక అప్పుడు చెప్పాడు...
"రవిని ఎవరో కొట్టారు అక్షరా... బాగా దెబ్బలు తగిలాయి.." అని...
నాకు గుండె ఆగినంత పనయింది... రాజు చెప్పగానే గాభరాగా కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యింది... ఐసీయులో రవి ని చూడగానే భోరున ఏడ్చేశాను...
"నువేం భయపడకు అక్షరా... డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు... మరేం ఫరావాలేదు అన్నారు.." అన్నాడు రాజు నన్ను ఓదారుస్తూ..
దెబ్బలు విపరీతంగా తగలడంతో రవి కొలుకోడానికి రెండు నెలల పైగా పట్టింది..
కాళ్ళకి చేతులకి సర్జరీ చేశారు..
డిశ్చార్జ్ చేసే సమయానికి కూడా రవి లేచి నడిచే పరిస్థితి లేదు...
బిసినెస్ తో పాటు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు రవిని కూడా చూసుకోవడం రాజుకి కష్టంగా ఉండేది... మొదటి వారం రోజులు నన్ను కూడా రాజే చేసుకోవలసి వచ్చింది... రెండు మూడు రోజులు నేనేమీ తినలేదు... రాజే బతిమాలి తినిపిస్తే ఏవో నాలుగు మెతుకులు తిని లేచేదాన్ని... రాజు ఎప్పుడూ నన్నే కనిపెట్టుకొని ఉండేవాడు.. దగ్గర కూర్చుని ఏమీకాదు అక్షరా..రవి తొందరగానే కొలుకుంటాడు అంటూ ధైర్యం చెప్పేవాడు... అమ్మా, నాన్న లు వచ్చినా రాజు ఇచ్చిన ధైర్యంతోనే నేను త్వరగా కొలుకున్నాను.. కొన్నాళ్ళకి రవిని నేను చూసుకుంటాను అన్నా కూడా రాజు రోజు హాస్పిటల్ కి వచ్చి వీలైనంత ఎక్కువ సేపు ఉండి వెళ్లేవాడు..
డిశ్చార్జి చేసేముందు డాక్టర్ నన్ను, రాజుని పిలిచి మాట్లాడాడు..
"రవికి తగిలిన దెబ్బలు చాలా తీవ్రమైనవి ...
లేచి నడవడానికి, తన పనులు తాను చేసుకోడానికి ఇంకో నెల రోజులైనా పట్టొచ్చు...
అయితే ఇంకా హాస్పిటల్ లో ఉంచవలసిన అవసరం లేదు.. ఇంటికి తీసుకెళ్లి మెడిసిన్ వాడితే సరిపోతుంది..." అన్నాడు...
సరే డాక్టర్ థాంక్యూ అంటూ మేం లెవబోతుంటే .." ఆగండి మీతో ఇంకో ముఖ్య విషయం చెప్పాలి.." అంటూ ఆపాడు..
మేం మళ్లీ కూర్చున్నాం...
" రవికి తగిలిన దెబ్బలు తీవ్రమైనవని ఇందాకే మీకు చెప్పాను... కాళ్ళు, చేతులకైతే సర్జరీ చేయగలిగాం... కానీ నడుము దగ్గర తగిలిన దెబ్బల వల్ల నరాలు బాగా దెబ్బతిన్నాయి.. ఇంకొంచెం ఎక్కువగా తాకి ఉంటే నడుము కింది భాగానికి మిగతా శరీరంతో కనెక్షన్ కట్ అయ్యేది... అంతవరకు మనం అదృష్టవంతులం..." అని చెప్పి కాసేపు ఆగి .. "దురదృష్టం ఏంటంటే కొన్ని సున్నిత ప్రాంతాల్లో తగిలిన దెబ్బల కారణంగా రవి ఇక సంసారానికి పనికి రాకపోవచ్చు... "
నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.. ఈ విషయం తెలిస్తే రవి ఎలా రియాక్ట్ అవుతాడా అని ఆలోచిస్తున్నాను నేను...
"ట్రీట్మెంట్ ఏమీ లేదా డాక్టర్" అని అడిగాడు రాజు...
"చాలా కష్టం ... మందులు వాడితే ఫ్యూచర్ లో ఏమైనా మార్పు రావచ్చు... కానీ గ్యారెంటీ గా చెప్పలేం... తొంభై శాతం అవకాశం లేదనే చెప్పాలి... ఆ పది శాతం మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది..."...
"ఈ విషయం ఆయనకి చెప్పారా డాక్టర్..." అడిగా నేను...
"లేదమ్మా..."
"సర్ ఒక హెల్ప్ చేస్తారా... దయచేసి ఆయనకి ఈ విషయం చెప్పకండి... "
"కానీ కొన్నాళ్లయితే రవికి తెలిసిపోతుంది కదమ్మా..."
"తెలిసే సరికి కొంచెం టైం పడ్తుంది గా డాక్టర్... అప్పటికి ఆయన కొలుకుంటాడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు గా... మెల్లిగా నేను టైం చూసుకుని చెప్తాను... కొన్నాళ్ళు నాకు దూరంగా ఉండాలని మాత్రం చెప్పండి చాలు... ప్లీస్"..
సరేనంటూ డాక్టర్ ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు... రాజు కూడా డాక్టర్ వెంబడే వెళ్ళాడు... నేను ఆ గదిలోనే కాసేపు మౌనంగా కూర్చున్నా... రవి ఎలా రియాక్ట్ అవుతాడా అనేదే నా మనసుని తొలుస్తున్న ప్రశ్న... సమాధానం నా ఊహకు అందడం లేదు...