07-11-2018, 06:15 AM
నా కథ...11
అమ్మ వాళ్ళకి ఎదురెళ్లి లోపలికి తీసుకొచ్చింది...
అక్క ఆవిడకి నమస్కరించి, నాకు సైగ చేయడంతో నేను వంగి ఆవిడ కాళ్ళకి నమస్కరించబోయాను...
ఆవిడ నన్ను పట్టుకొని వద్దులేమ్మా అంటూ ఆపింది...
సోఫాలో తన పక్కన కూర్చోమంది...
పైనుండి కింది వరకు పరిశీలనగా చూస్తుంది...
ఆమె వెనకాల వచ్చినతను మరో సోఫాలో కూర్చున్నాడు...
"ఈ అబ్బాయి ఎవరు" అని ఆవిణ్ణి అడిగింది అక్క..
"మీకు చెప్పలేదు కదూ.. వీడి పేరు రాజు .. నా పెద్ద కొడుకు " అందావిడ..
"మీకు ఒక్కడే కొడుకు అన్నారుగా" అడిగింది అక్క...
" సొంత కొడుకు కాదు కానీ నాకు వాడెంతో వీడూ అంతే.. అందుకే పెద్దకొడుకని చెప్పాను... వివరాలన్నీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది.. మీకు తర్వాత చెప్తాను.." అంది..
ఇంతలో అమ్మ కాఫీ తెస్తే అందరం తాగి షాపింగ్ కి వెళ్లాం...
"అబ్బాయిని కూడా తీసుకురావలసింది వదిన గారూ" అంది అమ్మ వెళ్లే దారిలో...
"వాడు ఊళ్ళో లేడు వదినా.. బిజినెస్ పనిమీద ముంబై వెళ్ళాడు... ఉన్నా వచ్చేవాడు కాదు.. వాడికి ఈ షాపింగ్ అదీ బోర్... ఇదిగో పెద్దోడే అన్నీ చూసుకుంటాడు... వీడు లేకుంటే చిన్నోడికీ నాకు చాలా కష్టం " అంది రాజును చూపిస్తూ...
ఆవిడతో పాటు అందరం మెచ్చుకోలుగా రాజువైపు చూసాం...
అతనివేమీ పట్టనట్టు కారు డ్రైవ్ చేస్తున్నాడు...
సిటీలోనే పెద్ద మాల్ ముందు వెళ్లి ఆగింది కార్..
మెమెప్పుడూ అంత పెద్ద మాల్ కి వెళ్లి షాపింగ్ చేయలేదు...
వాళ్ళు బాగా తెలుసేమో..మా మేనేజర్ వచ్చి సాదరంగా మమ్మల్ని లోపలికి తీసుకెళ్లాడు..
చాలా కాస్ట్లీ చీరలు, నగలు చూపించారు..
నేను పెద్దగా వాటిని పట్టించుకోలేదు... కానీ వాళ్ళకి అనుమానం రాకుండా మాములుగా ఉండే ప్రయత్నం చేసాను.. అక్కా, అమ్మ , ఆవిడ కలిసి సెలక్షన్ చేశారు...
ఆ రోజు షాపింగ్ పూర్తయ్యేసరికి రాత్రి తొమ్మిదయ్యింది....
అక్కడే రెస్టారెంట్ లో అందరమూ డిన్నర్ చేసాము.. తరువాత మమ్మల్ని ఇంటిదగ్గర దింపేసి వాళ్ళు వెళ్లిపోయారు..
అందరూ పెళ్లి ఏర్పాట్లు చేయడంలో బిజీ అయిపోయారు...
నేను పుస్తకాల్లో లీనమయ్యాను...
ఆలోచించడం మానేసాను...
ఏది జరిగినా స్వీకరించాలని నిర్ణయానికి వచ్చాను..
అలా అనుకున్నాక మనసుకి కాస్త ప్రశాంతత లభించింది...
ఇప్పుడు నాకు జరిగిన దాని గురించి బాధ లేదు...
జరగబోయే దాని గురించి భయం లేదు....
అందరితోనూ వీలైనంత మామూలుగా ఉంటున్నాను...
నా పెళ్లి అని తెలిసిన ఫ్రెండ్స్ వచ్చారు...
"అబ్బాయి ఎలా ఉంటాడే" అని అడిగితే... పుస్తకంలో ఉన్న కవర్ చూపించా...
వాళ్ళు దాన్ని తీసి చూసి "చాలా బాగున్నాడే" అన్నారు...
వెళ్తూ మళ్లీ కవర్లో పెట్టి పుస్తకంలో పెట్టి వెళ్లారు...
అయినా నాకు ఆ ఫోటో చూడాలనిపించలేదు..
అందులో ఉన్నది ఎవరైనా, ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలని ముందే అనుకున్నాను...
పెళ్లిరోజు రానే వచ్చింది...
ఇంటిని ఎలా అలంకరించారో.. నన్ను కూడా అలాగే (నా ప్రమేయం ఏమీ లేకుండా) అలంకరించి కూర్చోబెట్టారు..
బయట పంతులుగారు ఏవో మంత్రాలు చదవడం వినబడుతుంది నాకు...
పెళ్లికూతుర్ని తీసుకురండి అని పంతులుగారు చెప్పగానే అక్క నన్ను పట్టుకుని తీసుకెళ్లింది...
నేను తల దించుకొని వెళ్ళాను... ఎవర్నీ చూడాలనిపించలేదు... బలివ్వడానికి తీసుకెళ్తుంటే ఎలా వెళ్తామో అలా ఉంది నా పరిస్థితి... నేనూ బలిస్తున్నాను అనే అనుకున్నాను.. కాకపోతే ప్రాణానికి బదులు జీవితం బలి ఇవ్వాలి..అంతే తేడా...
మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య పెళ్లిపీటలనే బలిపీఠం మీద కూర్చోబెట్టింది అక్క...
పక్కన తలనరికే(తాళి కట్టే) కసాయి ఉన్న ఫీలింగ్ కలిగింది మనసులో...
ఒక సారి అతనివైపు చూద్దామా అనిపించింది.. కానీ... కసాయివాడు అనుకున్నప్పుడు ఎవరైతేనేమి, ఎలా ఉంటేనేమి అనుకున్నా...
నిశ్శబ్దంగా తలదించుకొని పంతులు చెప్పిన పనులు చేస్తూ కూర్చున్నా...
కాసేపటికి మా ఇద్దర్నీ ఎదురెదురుగా ఉండేట్టు కూర్చోబెట్టి మధ్యలో తెర పట్టుకున్నారు...
పంతులుగారు నా చేతిలోను అతని చేతిలోను జీలకర్రా బెల్లం ఉంచి ఒకరి తల మీద మరొకరిని పెట్టమని చెప్పాడు...
ముందుగా అతని చెయ్యి నా తలమీదకి వచ్చి జీలకర్ర బెల్లాన్ని తలకేసి అదిమింది...
పంతులుగారు నన్ను కూడా పెట్టమనడంతో నేను నా చెయ్యిని అతని తలమీద ఉంచాను...
ఇద్దరిమధ్యా ఉన్న తెరను తీశారు... సరిగా పెట్టమ్మా అని పంతులుగారు చెప్పడంతో సరే అని తలెత్తిచూస్తూ సరిగా పెట్టబోయాను...
అంతే వెయ్యి వోల్టుల కరెంటు తీగను తాకినంతగా షాక్ తగిలింది నాకు... ముందరున్నది ఎవరో కాదు .. ఒక్క రాత్రితో నా జీవితాన్ని తలకిందులు చేసిన రవి... చెయ్యి గబుక్కున వెనక్కి లాగబోయాను.. కానీ అప్పటికే పంతులు గారు నా చెయ్యి మీద అతని చెయ్యిని వేసి అతని తలకేసి వత్తుతుండడంతో అది వెనక్కి రాలేదు..
రవి చెయ్యి ఇంకా నా తలమీద ఉంది..నా చెయ్యి రవి తలమీద ఉంది.. నా చెయ్యి విపరీతంగా వణుకుతుంది... పంతులుగారు వదలగానే నా చెయ్యిని లాక్కున్నా...
పెళ్లిపీటలమీదకు వచ్చేప్పుడు ఎందుకు అనుకున్నానో తెలియదు గానీ... నిజంగా నేను కసాయి వాడి వద్దకే వచ్చాను అనిపించింది...
మనసంతా అల్లకల్లోలంగా ఉంది...
నెలరోజులుగా నేను అనుభవించిన నరకానికి కారణమయిన వాడితోనే నేను నా మిగతా జీవితం అంతా గడపాలనే ఆలోచన మనసులో వేల సునామీలని సృష్టిస్తోంది...
నా కళ్ళు చూస్తున్నాయి... కానీ నాకేమీ కనబడడం లేదు.. అంతా తెల్లగా ఉంది...
చెవులకి మంత్రాలు వినబడుతున్నాయి.. ఏదేదో చెయ్యమంటున్నట్టు వినబడుతోంది.. నేనూ వణుకుతున్న చేతుల్తో చేస్తున్నాను.. కానీ ఏం చేస్తున్నదీ నాకు తెలియట్లేదు...
కళ్ళు తిరుగుతున్నట్టనిపించింది...
కాసేపటికి గట్టిమేళం అన్న మాట వినబడింది...
దాని అర్థం తెలిసి వచ్చేప్పటికి రవి నా మెళ్ళో మూడుముళ్లు వేస్తున్నాడు... అతను తిరిగి సరిగా కూర్చున్నాడో లేదో.. నాకు మరింతగా కళ్ళు తిరిగినట్టయి అతని వళ్ళోనే పడిపోయాను...