Thread Rating:
  • 3 Vote(s) - 4.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Comedy హాస్య కథలు - అరటి పూలుRunning

వైఫ్ – వై...ఫై - Padma Chillarige
[Image: Y.jpg]
నా బెడ్ రూమ్ లో చాలా ఏకాగ్రతగా రెండు కళ్ళూ మూసుకుని, పాట ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతలో నన్నెవరో గట్టిగా కుదిపి నట్లయింది.
కళ్ళు తెరచి, అయోమయంగా చూస్తున్న నన్ను మరోసారి బలంగా కుదిపి, “మెలకువ వచ్చిందా ? మొబైల్ లో పాట పెట్టుకొని, కూర్చుని నిద్ర పోతున్నారా? ఘ...ట్టిగా… ఏమిటా గుర్రు… కాదు… ఓండ్ర పెడుతున్నారు. మీరు, మీ మొబైల్ ఇద్దరూ సైలెంట్ గా ఉంటే మంచిది.” అంటూ గది బయటకు వెళ్ళి , గొళ్ళెం పెట్టేసింది కుసుమ.
“కుసుమా ...బెడ్ రూమ్ మ్యూజిక్ మీ శ్రీవారేనా? ఏమా రిధిమ్.. ఏమా సౌండ్... ” గట్టి గట్టిగా నవ్వులూ… అరుపులూ...కేకలూ ...అన్నీ కలిసిపోయి, గోలగోలగా ఉంది నాకు.
పసిడి పడతులు… హాల్లో కిట్టీ పార్టీ చేసుకుంటున్నారు.
“కుసుమా! ఇది అన్యాయం. అక్రమం... నా ఇంట్లో స్వతంత్రంగా గుర్రు పెట్టే హక్కు నాకుంది. గుర్రు నా జన్మ హక్కు.” నాక్కోపం నసాళానికి అంటింది. బోనులో కోరలు పీకేసిన సింహంలా గాండ్రించాను.
“బొత్తిగా మొగుడంటే గౌరవం లేదు. అందులో రిటైర్ అయిన దగ్గర నుండి అసలు లక్ష్యపెట్టడం లేదు.”
కోపంతో పళ్ళు పట పట లాడించాను. ‘అబ్బా!’ కసుక్కున బుగ్గ కొరికేసుకున్నా… కొంచెం ఉప్పగా నాలిక్కి తగిలింది. కండ ఊడొచ్చిందేమోనన్న అనుమానంతో నోరు గబుక్కున మూసుకున్నా…
‘మా ఆయన తన మొదటి భార్యని వదిలేసి వచ్చారు. ఇక నా దగ్గరే జీవితాంతం ఉంటానని, ఊ... అంటావా... భామా! ఉహూ అంటావా... భామా! అని తెగ పాటలు పాడేస్తున్నారు. పాటలతో నా బుర్ర ని, ఇంట్లో ఉన్న వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, జీడిపప్పు అన్నిటినీ తినేస్తున్నారు. ముందీ తినడాలు ఆపాలి. మీ సలహా ఏవిటి?” వాళ్ళ గ్రూప్ లో పోస్ట్ చేసింది. దానికి రకరకాల కామెంట్లు… ఎమోజీలు… ఛ...ఛ ...నా పరువు తీసేసింది.
వెయిట్ పెరుగుతున్నానని, షర్ట్ లోంచి పొట్ట బయటకి పొడుచుకొస్తోందని, సలాడ్ అంటూ పచ్చి కూరలు, పచ్చి గింజలు, మూడంటే మూడు పలచటి రోటీలు … జైల్లో ఖైదీలా తిండికి రేషన్ …తిన్న రోటీలు సరిపోక, అర్ధరాత్రి ఆకలేసి, లేవాల్సి వస్తోంది. ఇలా నన్ను ఆకలితో చంపేస్తావా అంటే ...
“డైట్ అండీ ...డైట్... నా మొగుడు స్మార్ట్ గా ఉండాలని ట్రై చేస్తుంటే… ఈ ఆకలి అరుపులేవిటి? అర్థం చేసుకోరూ ...”అంటూ స్వర్ణకమలం లో భానుప్రియ ఎక్స్ప్రెషన్ ఒకటి పారేసింది.
మొన్నటికి మొన్న, నా మటుకు నేను హేపీగా ‘నన్ను వదిలి నీవు పోలేవులే… అదీ నిజములే’ అన్న పాట సంగతులేసి పాడుకుంటూ ఉండగా… కుసుమ ధడేల్...మంటూ వీధి తలుపు తీసుకుని, సునామీ లా వచ్చి, విరుచుకుపడింది.
సునామీ ఆగిన తర్వాత అర్ధం అయినదేమిటంటే నా సంగీత సాధన వల్ల మా సొసైటీ లో చిన్న పిల్లలకు విడవని దడుపు జ్వరాలు, ఏడుపులూ, పెద్దవాళ్ళకి బీపీలుట. నా అర్థ భాగం చాలా సీరియస్ గా, స్ట్రాంగ్ గా ఆర్డర్ ఇచ్చింది. ‘నో సంగీత సాధన విత్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్’ … అంటూ నా పాటకు పే...ద్ద బోదురు కప్ప లాంటి తాళాన్ని వేసేసింది.
హాల్లోంచి కుసుమ పాటలు, మాటలు గోలగోలగా వినిపిస్తున్నాయి.
చెప్పొద్దూ … కుసుమ అలా రెచ్చిపోయి, ఆటలాడేసుకుంటుంటే, చాలా జెలసీగా ఉంది. నన్నింత మానసిక క్షోభకు గురి చేసిన కుసుమ హేపీగా ఉండకూడదు గాక ఉండకూడదు…చేతి గోళ్లు, కాలి గోళ్లు కొరికేసుకుని, జుట్టు పీకేసుకుంటుంటే, ఎదురుగా ‘ఊర్వశి’ కనిపించింది. ఎస్. దీనితోనే నా పగ తీర్చుకుంటాను … అనుకున్నాను.
ఆ పథకం ప్రకారం, సాయంత్రం , కుసుమ తో కలిసి టీ తాగుతున్నప్పుడు “ఒక టెక్నికల్ పేపర్ ఆ మానేజ్మెంట్ కాలేజీ లో ప్రజంట్ చేయాలి. అర్జెంట్. ప్లీజ్ ఒక్క వారం నీ ఊర్వశి ని ఇస్తావా?” అడిగాను.
“మీదేమైంది? ముట్టుకుంటే, ముద్దెట్టుకుంటోందా? కాగలించుకుంటే కరుస్తోందా?” ఆ మాటల్లోని వెటకారానికి ఒళ్ళు మండినా, పైకి చూపించలేదు. అవసరం నాదీ…
“నీ దాంట్లో లేటెస్ట్ వెర్షన్ ఉంది. ప్లీజ్ హెల్ప్ మీ…” జాలిగా ముఖం పెట్టి మరీ అడిగాను.
మా అమ్మాయి బహుమతిగా ఇచ్చిన లాప్ టాప్ని, తన యఫ్ బి ఫ్రెండ్ సలహ ప్రకారం, కుసుమ ముద్దుగా ‘ఊర్వశి’ అని పిలుచుకుంటుంది.
కుసుమని ప్రతీ క్షణం గమనిస్తూనే ఉన్నాను. ఫోన్ తో కూడా ఎప్పటిలాగే ఫ్రెండ్స్ తో
ఇకఇకలు..పకపకలు… రాగాలు...దీర్ఘాలు…
ఆదివారం ‘జూమ్’ మీటింగ్ లో మా గ్రూప్ వాళ్ళు, నేను వ్రాసిన వ్యాసాన్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు. మీటింగ్ అయిపోయి కుర్చీ నుండి లేస్తూ “ఉర్వశి తో నా పని అయిపోయింది. థాంక్ యూ శ్రీమతీ!” అన్నాను చాలా ఉదారంగా....
“ అవును, మీ పని అయిపోయింది.” కిసుక్కున నవ్వింది కుసుమ .
“అన్నట్టు, ఎవరో వైఫులని వై-ఫై తో పడేయచ్చు. ఆఫ్టర్ ఆల్ … ‘ ఆడవాళ్ళూ - అల్ప సంతోషులు’ అన్నాడుట” అంది వంకరగా నవ్వుతూ .
గతుక్కుమన్నాను. నా వ్యాసం శీర్షిక అదే ‘వైఫ్ – వై... ఫై’ .
“ ఇవాళ భలే వీడియో వచ్చింది. మీకూ వచ్చి ఉంటుంది. చూడండి” మళ్ళీ వెటకారం.
గబగబా వాట్స్ అప్ వంగి చూస్తుంటే… నా నడుం కలుక్కుమంది
ఆ వీడియోలో ‘ఊర్వశి’ ముందు కూర్చుని, చెవుల్లో హెడ్ ఫోన్ పెట్టుకుని, సుడుకో ఆడుకుంటూ, మొబైల్ లో మెసేజీ లు ఇస్తూ, కునికిపాట్లు పడుతూ … గోళ్ళు కొరుక్కుంటూ… రకరకాల భంగిమల్లో ఉన్న ఫోటోలు…వీటన్నిటిలోనూ ఉన్నది... నేనే…
“దుర్మార్గురాలా… బ్లాక్ మెయిల్ చేస్తున్నావా…” అరిచాను.
“ఆహా.. వచ్చేసారి ‘జూమ్ మీటింగ్ లో ఉంటూ, జాలీగా చేసే మరో డజను పనులు’ అంటూ ఇంకో పేపర్ ప్రజంట్ చెయ్యచ్చు” మళ్ళీ వెటకారం…
“అదిగో ఆ వెటకారమే వద్దన్నది “ అంటుంటే, ఇంకోసారి కలుక్కు మంది నడుం.
—--
ఉదయాన్నే మెలకువ వచ్చి కళ్ళు తెరిచాను. నా బెడ్ రూమ్ సీలింగ్, దానికున్న సీలింగ్ ఫ్యాన్ , గోడలు అన్ని గిరగిరా తిరిగేస్తున్నాయి.
“ కుసుమా… కుసుమా … భూకంపం వస్తోంది. పద పద... కిందికి వెళదాం ” గట్టిగా అరిచాను. కానీ, చేతులు ఆనించి, మంచం పై నుండి లేవలేకపోయాను.
“నా బొంద .. భూకంపము లేదు, గాడిద గుడ్డు లేదు. మీకే కళ్ళు తిరుగుతున్నట్లున్నాయ్.. వర్టిగో వచ్చినట్లుంది.” చివాట్లు పెట్టింది.
“నేనెక్కడ నా ఊర్వశిని తీసేసుకుంటానో అని, చిన్న పిల్లాడిలా, రకరకాల భంగిమల్లో, పగలూ రాత్రీ దాన్ని కరచుకుని కూచున్నారు. … ఇంకా పదహారేళ్ళ బాలా కుమారుడు అనుకుంటున్నారా… షష్టిపూర్తి అయి మూడేళ్లు కావొస్తోంది. డాక్టర్ కి ఫోన్ చేస్తా … కదలకుండా పడుకోండి ” అంటూ అక్షింతలు వేసింది.
ఫలితం ‘నడుంకో బెల్ట్ … మెడకో బెల్ట్ ‘ అటు ఇటు తిరగడానికి, తిప్పడానికి కూడా లేకుండా...ఈజిప్టు మమ్మీలా, శవాసనం లో ఉండడమే… లాప్ టాప్ వాసన కూడా చూడకూడదు.
అలా మంచం మీద పడుకుని ఉండగా, స్టాటర్ పోయిన ట్యూబ్ లైట్ లా, కొట్టుకుని, కొట్టుకుని, కళ్ళ ముందు మెరుపులు మెరిసి, జ్ఞానోదయం అయింది. నిజాన్ని గ్రహించాను.
దాంతో ‘తెల్ల జెండా ‘ఊపి, మా గ్రూప్ లో అర్జెంట్ గా ఓ వాయిస్ పోస్ట్ చేసాను.
“వైఫ్ అంటే వై ఫై లా - మన చుట్టూ ఉండే బెటర్ హాఫ్
వైఫ్ అంటే మన లైఫ్ - వారుంటేనే మనం సేఫ్ - అందుకే
వైఫ్ తో వైరం వద్దు - వారితో మైత్రే ముద్దు “
అసలు రహస్యం ఏవిటంటే…
నెల రోజులు నన్ను కదలకుండా, లాప్ టాప్ దరికి చేరకుండా జేసిన ఆ డాక్టర్, ‘ పసిడి పడతుల గ్రూప్’ లో మెంబర్...
“టిట్ ఫర్ టాట్” కుసుమ కొంటెగా నవ్వుతూ నన్ను చూసి కన్నుగీటింది.
సమాప్తం

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

సుట్టకోసం - మోహరావు మంత్రిప్రగడ
[Image: image.jpg]
ఒరే రావుడు ఎక్కడున్నావు ఓపాలిఇలారార," " వత్తన్న ఏంఅయింది" అడిగాడు రావుడు. ఏంఅయింది అంటు వచ్చాడు రావుడు, "ఏంంలేదురా నాసుట్టకిందడిపోయినాది కాంత తీసివ్వరా" అడిగాడు రంగయ్య. "ఓరి నాన్నఇదేంటి నువ్వు కుర్చిలో కూకడున్నావు, సుట్ట నీకాళ్ళ కాడుంది వంగుంటే అందుతాది, దానికోసం పన్లొఉన్న నన్ను పిలుత్తవ అన్నాడు రావుడు కోపంగా రావుడు. "ఏంట్ర నేను నీకు బాబుని నాకెటి ఎదురు సమాదానం సెప్పీతున్నావు కోపంగా అరిచాడు రంగయ్య. ఈసారి రావుడు కొచం నవ్వి ఒరి నాయన నువ్వు కూకున్న కుర్చీలో బల్లిపడింది గబుక్కున లేచి సూడు" అన్నాడు. రంగయ్య కంగారుగ లేచి కుర్చీ చూసి "ఎదిరా బల్లి" అన్నాడు. "కుర్చికిందకాని పోయిందేమో సూడు" అన్నాడు రావుడు. రంగయ్య వంగి కుర్చీ క్రద చూసి "ఏది ఇక్కడ కూడా లేదు" అన్నాడు. ఓరి నాయన నీవ్వు వంగావుకదా నీసేతికాడ సుట్టంది సూడు తీసుకో అన్నాడు" రంగడు నవ్వుతు. "ఆరినాకొడక ఏంనాటకం ఆడవురా లెగకుండా పొద్దున్నకాడి నించి ఇలాగెఉన్నాను, ఇప్పుడు నన్నులేపావా ఒరే నేను నీబాబునిరా నిన్ను ఎంతో గారంగా పెంచిపెద్దసేత్తె నువ్వు ఇలా నాటకంఆడతావా, మీఅమ్మ నువ్వు కలసి నన్ను సంపెద్దం అనుకొంటన్నారా" కోపంగా అరిచాడు రంగయ్య. "ఓరిబాబు నీవ్వు లెగిసి తిరుగుతుంటె పది కాలాలపాటు మాకళ్ళముందుంటావు, లేదనుకో పొటోకి దండె అని భయమేమసే నీకుమంచి సేయిలనే సెపతన్నాం, నీకన్నా పెద్దోడు లా కనకరాజు సూడు ఎలా సెకసెకా తిరుగుతు న్నాడు ఆయననీకులా సుట్టలు కాల్చడు అయనా ఒకె సోట కుకునుండిపోడు, వంగుని కాలుకాడున్న సుట్ట కూడా నీకెవరేనా తీసియ్యాల, ఇలాగైతె ఓనెలలోనే మంచం ఎక్కేత్తావు" అన్నాడు రావుడు. "ఏంట్రా బెదిత్తన్నావా" గట్టీగా అడిగాడు రంగయ్య. "ఏంట్రా ఆడిమీదిరుసుకు పడతనావు" అడిగాడు అప్పుడే ఇంట్లోకొచ్చిన బాలయ్య. "సూడరా ఈ సన్నాసి నన్నాట పట్టింతనాడు, ఒక నెలలొ మంచానాపడతానంట" అన్నాడు రంంగయ్య కోపంగా. "అసలేటయినాది" అడిగాడు బాలయ్య. "సెప్పు మావకి అన్నాడు రావుడు. "అలాగే సెపుతాను" అని జరిగిందంతా చెప్పాడు రంగయ్య."ఓరినీ ఆడు సెప్పిందాట్లో తప్పెం ఉందిరా ఆడు నీబాగుకోసమే నీమీదున్న పేమతో సెప్పాడు దానికింత ఎగురతన్నావా" గట్టిగానే అడిగాడు బాలయ్య. "అదికాదురా" అని ఏదో అనబోయాడు రంగయ్య. "ఏదికాదు ఆడుసెప్పీనట్టు లా కనకరాజు మనకంటే పెద్దోడు, ఆడు సిలకలా తిరుగతనాడు నేను సలాకిగానే తిరగతన్నా, నీవ్వెమొ లాకుర్చి సుట్ట తప్ప ఏంలేదు, రెపుకాడనించి నాతోరా కాంచెపు తీరుగుదాం" అన్నాడు బాలయ్య. "ఓరి బాబు నాను నడవలేనురా నాకాళ్ళు నెప్పిసేత్తాయి" అన్నాడు రంగయ్య. "అయతే అలాగె ఏడు ఒరేయివుడు నాతోరారా పనున్నాది" అని రావుడ్ని తీసుకొని వెళ్ళిపోయాడు బాలయ్య. రంంగయ్య సుట్టఅంటించి మళ్ళా కుర్చీలో కూర్చున్నాడు. బాలయ్య దగ్గరనించి రావుడు ఇంట్లొకొచ్చాడు, మరనాడు "ఒరే రావుడు సుట్టలు అయిపోయియిరా ఆడు రాలేదా ఈయిల" అడిగాడుంగయ్య. "లేదు ఇంక రాడంట గవర్నమెంటోళ్ళు పోగాకు కొట్లన్నీ ముయించేసారంట ఇంక రానని చెప్పాడంట" అన్నాడు రాముడు. "మరిఎలాగరా బాబ పొద్దుకాలనించి నోరు లాగేత్తందిరా" అరచాడు రంగడు. "నేనేటి సేత్తాను నువ్వే ఏదో పడు" అన్నాడు రావుడు. ఇంతలో బాలయ్య వచ్చాడు" ఏరోయి ఏటి మీనాయన నోరు కాలీగుంది" అని అడిగాడు. "ఏంట్ర ఎటకారం ఆడతనావా పొగాకు కొట్లన్నీ గవరమెంటోళ్ళు మూసేరంటకదా తెల్దా" కొపంగా అడిగాడు రంగయ్య. "ఒటిరా ననాకెట్ట తెలుత్తాది నానేవన నీకులా రైలింజల్ల పొగొదులుతుంటానా" అంతే స్వరంలో అడిగాడుబాలయ్య. రంగడు మెత్తబడ్డాడు "అదికాదురా మరి నాకు సుట్టలు ఎలాదొరుకుతాయిరా" అని బేలగా అడిగాడు. "సరే నెను వాకబు సేత్తలే నీవ్వు వల్లకుండు"అన్నాడు బాలయ్య. మరనాడు బాలయ్క వచ్చి "ఒరే రంగా ఉదయంగుడి కాడకెల్దాం ఎవడో ఒకాయన వచ్చి సుట్టలుకట్టఇత్తనాడంట అనిసెప్పాడు. రంగడికి నిద్దరట్టలేదు తెల్లారకుండ లేచి కూచున్నాడు. బాలయ్య ఇంటికి దిరితీసాడు, రంగయ్యని చూసి బాలయ్య "ఒరె ఇంత పెందరకడే వచ్చెవేంద్రా" అడిగాడు. "అదేరా లాగుడికాడ ఎవడొసుట్టలిత్తన్నాడని సెప్పినావు కందరా" అన్నాడు. "మరే నడు ఎల్దాం" అని దారితీసాడు బాలయ్య. ఇద్దరు రెండు కిలోమీటర్లు నడిచి గుడి దగ్గరకొచ్చారు. అక్కడున్న షాపతన్ని కలిసి చుట్టలు ఇచ్చె ఆయన వచ్చాడ , అడిగారు. "నేదు బాబు లాయన రెపొత్తాడంట" అని చెప్పాడా షాపాతను. "ఓర్ని లింత దూరం వచ్చినాక తుస్సు మనిపించిడేంట్రా, సరే నడు రేపు వద్దం" అని ఇంటికి దారీ తీసారిద్దరు. ఆమరునాడు కూడా ఇద్దరు పొద్దున్నే వచ్చారు. ఆరోజు అదే జవాబొచ్చింది. పట్టువదలని విక్రమార్కుల్లా ఇద్దరు రోజు వస్తున్నారు కాని ఆచుట్టలిచ్చెఆయన రావటంలేదు. "ఒరే వారంరోజుల నుండి తిరగతన్నాం ఆయన రాటల్లెదేంట్రా" అడిగాడు రంగయ్య. "ఏమొరా రెపుకాడనించి మానేద్దాం" అన్నాడు బాలయ్య. ఇద్దరు ఇంటికొచ్చేసారు. ఆమరనాడు రంగడు లేచి మామూలుగా బాలయ్య ఇంటకి నడచాడు. "ఏరా ఈయిల యెల్లద్దనుకొన్నాం కదరా మళ్ళా వచ్చావేంటి" అని అడిగాడు బాలయ్య. "ఒరే వారంకాడనించిఅలవాటైయింది కదరా ఇంట్లొ కూకో బుద్దెయ్యలేదురా సుట్టల సంగతి మరసేపోయిను, గుడికాడదాకా నడిచి వద్దాం నడు" అన్నాడు రంగయ్య."సరే నడు" అని దారితీసాడు బాలయ్య. అలా నడుస్తున్న రంగయ్యతో "ఒరే రంంగా ఎంట్రా మళ్ళ ఇలామారావు" అని అడిగాడు. "ఒరే బాలా ఆలా నడత్తుంటే మంచి చలాకీగఉందిరా, ఉషారుగ ఉందిరా అన్నాడు రంగయ్య "ఒరే సుట్ట ఏదిరా" అని అడిగాడుబాలయ్య. "ఏంటి సుట్ట నేనా సుట్ట కాల్చడం నువ్వు చూసావా" అని అడిగాడు రంగయ్య. "ఓరినీ బలే పిరాయించావురా ప్లేటు" అన్నాడు ఆనందంగ రంగయ్య.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply

Namaskar thank you for sharing
Like Reply

<size=24> >color=green> ఇంటిని అద్దెకిస్తే...! - బొందల నాగేశ్వరరావు</size></color>
[Image: Picture1.png]
<font size=18 colour=blue>అది 'మే'మాసం.ఎండలకు బండలు బద్దలౌతున్నై. మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో ప్రహరీ గోడకు లోపల వున్న ఇరవై పూల కుండీలకు నీళ్ళు పడు తున్నాడు ఇంటి యమాని నీలకంఠం చెమటలు పట్టిన ముఖంతో.
"ఏమండీ!భోంచెద్దురు గాని రండి!"కేకేసింది భార్య భాగ్యమ్మ.ఆ కేక నీలకంఠం చెవుల్లో గుయ్మింది.
"ఇదిగో! నేనిక్కడ వూరికే లేను. కుండీల్లోని పూల మొక్కలు ఎండిపోతూ ఏడు స్తుంటే వాటికి నీళ్ళు పడుతున్నాను" నీళ్ళ హోసును తన వేపుకు తిప్పుకొని జవాబిచ్చాడు నీలకంఠం. ఫలితంగా తనూ తడిసిపోయాడు .
"అబ్బా! త్వరగా రండి. లేకపోతే నేనొచ్చి మిమ్మల్ని బండరాయిని దొర్లించుకొచ్చి నట్టు నెట్టుకు రావాలి. అది బాగోదు. ఆఁ ".
తనలో తానే 'ఆహాఁ! అంటే నేను ఊబకాయుణ్ణని పరోక్షంగా దెప్పేస్తోందన్నమాట, అక్కడికి తనేదో నాజూకైన నగిషీ బొమ్మైనట్టు. నా దృష్ఠిలో తను కూడా నాలాగే ఊబకాయంతో పట్టు మని పది అడుగులు కూడా నడవలేని గుణ్ణేనుగు' అనుకొని.
" సరే ఆగు...!నేనే వస్తున్నా" అంటూ లోనికెళ్ళాడు నీలకంఠం పాత సినిమాల్లోని హాస్య నటుడు రేలంగిలా. మొత్తంలో భార్యభర్త లిద్దరూ... దొందూ దొందే!.
కంచం ముందు కూర్చొన్న భర్తకు భోజనం వడ్డించింది భాగ్యమ్మ. కలుపుకొని తింటూ అక్కడే కప్పులో వున్న గడ్డ పెరుగు మొత్తం కంచంలో వేసుకోని ఆవ కాయను పెట్టమని సైగ చేశాడు.
"మరీ...మీరు అన్యాయమండీ!చాదస్తం కాకపోతే ఈ వేళప్పుడా పూల మొక్కలకు నీళ్ళు పట్టేది?" ఓ చిటికెడు ఆవకాయను కంచంలో పెడుతూ అంది భాగ్యమ్మ. "మరేం చేయమంటావే ?మనకు అకలైతే కంచాలు కంచాలు లేపేస్తున్నాంగా! వాటికి నీళ్ళు అవసరమైతే మనమే తెలుసుకొని పట్టాలి.లేకుంటే ఎండిపోతాయి. ఇదిగో...రేపు నీ వంతు సుమా!" భార్యకు గుర్తు చేశాడు నీలకంఠం. "కుదరదండీ!నన్నునేను మోసుకొంటూ నడవటానికే అష్టకష్టాలు పడుతున్నాను. నా వల్ల కాదు.ఈ వేసవి కాలం ముగిసేవరకూ ఎవరికైనా పావలా డబ్బులిచ్చి పని చేయించుకొండి" తెగేసి చెప్పింది.భాగ్యమ్మ
నీలకంఠం నోటిలోని ముద్దను అటూ ఇటూ గ్రైండరులో పిండిని రుబ్బుతున్నట్టు నములుతూ షడ్డన్గా ఏదో గుర్తుకొచ్చినట్టు"అవునూ!మన మేడమీదున్న గుడిసె ను అద్దెకిస్తున్నట్టు బోర్డు పెట్టామే... ఎవరైనా వచ్చారా?" అడిగాడు.
"రాలేదండి.అయినా మనం అద్దెకిచ్చే ఆ గుడిసెకు ఈ పూల మొక్కలకు నీళ్ళు పట్టటానికి సంబంధం ఏమిటండీ!?" సాగదీసి అడిగింది.
"ఉంది.ఎటూ ఇద్దరం స్థూలకాయాలతో పూలకుండీలకు నీళ్ళు పట్టే పని చేసుకో లేక కష్టపడుతున్నాం కదా!అందుకని ఇల్లు కావాలని ఎవడైనావస్తే వాడికి ఆ గుడిసెను అద్దెకిచ్చి రాబోయే సేప్టంబరు మాసం వరకు వాడ్నే పూల కుండీలకు నీళ్ళు పట్టేటట్టు ఎగ్రిమెంటు వేద్దాం. వాడే గాడిదలా చేసుకు పోతాడు. ఎటూ స్టు,సెప్టంబరుల వర్షాలుంటాయి కనుక వాడున్నా లేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినా బాధ లేదు. ఏమంటావ్?"అన్నాడు కళ్ళెగరేస్తూ నీలకంఠం.
"అబ్బో!భలే బుర్రండీ మీది. కాకపోతే ఎక్కడైనా గోళ్ళకు మేకులు కొట్టొద్దు. పిచ్చి గీతలు గీయొద్దు, బంధువులు రావద్దని, ఇంకా రాత్రి తొమ్మిదికల్లా ఇంట్లోకి చేరు కోవాలని, అద్దెను ఒకటవ తారీఖే ఇవ్వాలన్న షరతులు పెట్టటం విన్నాను కాని ఇలా పూల కుండీలకు నీళ్ళు పట్టాలన్న షరతును మీవద్దే వింటున్నాను" అంటూ నవ్వింది భాగ్యమ్మ.
అంతలో బయట కాలింగ్ బెల్లు మోగింది. భోంచేస్తున్న వాడల్లా పైకి లేవబోయాడు నీలకంఠం.
"మీరాగండి.నేను వెళ్ళి చూస్తాను" అంటూ అతి కష్టంగా అంత పెద్ద కాయాన్ని మోసుకొంటూ వెళ్ళి తలుపు తీసి చూసింది భాగ్యమ్మ.ఎదరే పిట్టల దొరలా తలకు టోపి పెట్టుకొని పళ్ళికిలిస్తూ నిలబడి వున్నాడు ఒకడు. "ఎవరూ?అబ్బాయ్...నువ్వు ఆటో డ్రయివర్వు కదూ?ఎం కావాలి?" అడిగింది. "అద్దెకు ఇల్లు కావాలి !" గేటుకున్న 'టూ లెట్' బోర్డును చూపిస్తూ అన్నాడు.
"ఇల్లా...బోర్డు అలా రాయించి పెట్టాము కానీ...మేము అద్దెకివ్వనుంది మా ఇంటి టెరాస్ మీదున్న గుడిసెను!"
"తెలుసు. నా లెవెల్‌కు అది చాలు"అని పెద్దగా నవ్వాడు ఆటోవాడు.
కోపం వచ్చింది భాగ్యమ్మకు.అయినా భర్త పెట్టబోయే కండిషన్లకు ఈ పిట్టల దొరగాడే కరెక్టు అనుకొని కోపాన్ని మనసులోనే కుక్కేసుకొని "సరే!నీకు పెళ్ళ య్యిందా?"ప్రశ్నించింది.
" పిల్ల కుదిరింది. మూడు నెలల్లో పెళ్ళి చేసుకొంటాను" సిగ్గు పడుతూ అన్నాడు.
ముఫ్పై సెకండ్లు ఆలోచించింది భాగ్యమ్మ. ' ఆడ పిల్లలు లేని కొంప. మేమో వయ స్సు మళ్ళిన ముసలాళ్ళం కనుక వీడి వల్ల ఎలాంటి ఇబ్బంది వుండదు. మాకు కావలసిందల్లా అద్దె. పూల మొక్కలు ఎండి పోకుండా వాటికి నీళ్ళు పట్టడం. అందుకు ఈ బకరాగాడే కరక్టు.కనుక వీడికి గుడిసెను అద్దెకు ఇచ్చేద్దాం'అనుకొని "అయినా కొన్నిటెర్మస్ అండు కండిషన్సు వున్నై!వాటిక నువ్వు ఒప్పుకోవాలి!" అంది సానుకూల దోరణితో.
"మీ కండీషన్లన్నిటికి సిద్దపడే వచ్చాను. హి... హాఁ హాఁ...హాఁ"అని మళ్ళీ పెద్దగా నవ్వాడు. ఆటోవాడి నవ్వుకు లోపల పెరుగన్నం తింటున్న నీలకంఠం లేచి చేతిని నాక్కొంటూ బయటికి వచ్చాడు.ఆయన్ను చూసిన ఆటోవాడు"నమస్తే సార్ !"అం టూ మిలటరీ సెల్యూట్ చేశాడు .
"ఆఁ...ఆఁ...నీకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. షరతులను చెపుతాను విను .అద్దె అయిదు వేలు. ఆరు నెల్ల అడ్వాన్సు అంటే ముప్పై వేలివ్వాలి. గోడల కు మేకులు కొట్టడాలు, పెన్సిల్లతో రాయడాలు. గీయడాలు, పొద్దుపోయి ఇంటికి రావటాలు కుదరదు."
"ఓకే....ఓకే సార్ " అంటూ ప్యాంటు జేబులో తయారుగా వుంచుకున్న డబ్బులు తీసి టకటక లెక్కపెట్టి ఇవ్వబోయాడు అటోవాడు.
"ఆగు! షరతులు ఇంకా వున్నై. నువ్వు ఇంటిని ఖాళీ చెయ్యాలంటే మూడు నెల్లకు ముందు చెప్పాలి. మేము నిన్ను కాదనుకుంటే రోజుల గడువుతో వెళ్ళి పోవాలి. ఆటోని ప్రహరీ గోడకు కాస్త దూరంలో పెట్టుకోవాలి" అన్నాడు నీలకంఠం.
"అంతేగా! పట్టండి సార్ అడ్వాన్సు"అంటూ మళ్ళీ డబ్బు చెతికివ్వబోయాడు.
"ఆగు! మరీ స్వీడుమీదున్నావే! అసలు ముఖ్యమైన కండిషను ఇంకొకటుంది. అందుకు నువ్వు ఓకే అంటే.,.." దీర్ఘం తీశాడు నీలకంఠం.
"ఏమిటి సార్ అది?" కాస్త ఇబ్బంది ఫీలవుతూ అడిగాడు ఆటోవాడు.
"అవిగో! అక్కడున్న ఆ పూలకుండీలకు వారంలో నాలుగు రోజులు నీళ్ళు పట్టాలి. ఆ పని సేప్టంబరు వరకు కొనసాగాలి. ఆపై వర్షాలు వస్తాయి కనుక నీళ్ళు పట్టే అవసరముండదు. ఓకే అనుకుంటే అడ్వాన్సు ఇవ్వు. లేకపోతే...".
"నీళ్ళు పట్టడమేగా! అదేమాత్రం.... చక్కగా చేసి పెడతాను. పట్టండి అడ్వాన్సు" అంటూ అందాకా నీలకంఠం శుభ్రంగా నాకేసి శుధ్ధం చేసుకున్న చేతిలో డబ్బుల్ను వుంచాడు ఆటోవాడు 'రేపే ఇంట్లోకి దిగిపోతాను సార్ !' అంటూ.
'దొరికాడురా బ్రహ్మాండమైన బకరాగాడు'అనుకొంటూ "అలాగే!" అంటూ ముసి ముసి నవ్వు లతో ఇంట్లోకి నడిచారు భార్య భర్తలిద్దరూ.
ఆటోవాడు గుడిశెలోకి దిగి నెల రోజులు. ప్రతిరోజు ఉదయం లేచి పనులన్నీ ముగించుకొని ముఖ్యంగా పూలకుండీలకు నిర్ణీత రోజుల్లో నీళ్ళు పట్టి ఏడున్నర కల్లా ఆటోతో స్టాండుకు వెళ్ళి పోతాడు.ఎనిమిది గంటలకు నిద్ర లేచే నీలకంఠం దంపతులు హాయిగా వరాండాలోకొచ్చి పచ్చ గా కలకలలాడే పూల కుండీలను చూసి మురిసిపోతూ ఆనందిస్తారు. అంత వరకూ బాగానే వుంది ఆ దంపతులకు. ఆ తరువాత....
రెండవ నెల పుట్టి పది రోజులు గడిచాయి. ఇప్పుడు మునుపటిలా పూల కుండీల్లోని మొక్కలు పచ్చగా కలకల లాడుతూ కనబడ్డం లేదు. పేలవంగా పాలిపోతున్న రంగుతో ఎండిపోతూ కనబడుతున్నై. అసలు ఆటోవాడు పూల కుండీలకు నీళ్ళు పడుతున్నాడా లేదా అన్న సందేహం వచ్చింది నీలకంఠానికి. అందుకే మరుసటి రోజు ఉదయం ఆరున్నర కల్లా లేచి కిటికీలో నుంచి తొంగి చూస్తూ వున్నాడు .
డ్యూటీకి తయారై బయటి కొచ్చిన ఆటోవాడు ఓ చెంబుడు నీళ్ళు తీసుకొని కుండీలలో వున్న పూల మొక్కలమీద చిలకరించి వెళ్ళిపోతోంది గమనించాడు. ఆటోవాడిపై మితిమీరిన కోపం వచ్చింది నీలకంఠానికి.కాని చేసేదిలేక కోపాన్ని దిగమింగుకొని భార్య భాగ్యం వద్దకు నడిచాడు.
"భాగ్యం ఆటోవాడు మనల్ని మోసం చేస్తున్నాడే!వాడు పూల కుండీలకు నీళ్ళు పట్టటం లేదు చెంబెడు నీళ్ళు చిలకరించి వెళ్ళటం చూశాను" అన్నాడు.
"అవునా...అంతే కాదండోయ్ !మొన్నీమధ్య టెరాస్ శుభ్రం చేయటానికీ పైకెళితే ఓ మూల బ్రాందీ బాటిల్లు వున్నై.అలాగే పది రోజుల క్రితం ఉదయాన అయిదున్నర గంటలకు ఓ ఆడది వాడి గుడిసెలో నుంచి క్రిందకు దిగి వెళ్ళిపోతుంటే ఇంటి ముందు కల్లేపు చల్లుకొంటున్న వెంకాయమ్మ చూసిందట. నాతో చెప్పిందావిడ. ఆఁ " అంది భాగ్యమ్మ.
"ఇక చెప్పకు.నాకఅంతా అర్ధమైపోయింది.వాడ్ని వెంటనే ఇల్లు ఖాళీ చేయించటమే మన తక్షణకర్తవ్యం."అంటూ పేపరులోకి తలదూర్చాడు నీలకంఠం.
మరుసటి రోజు ఉదయం ఆరున్నరకల్లా పైపుతో కుండీలకు నీళ్ళను పట్టను ప్రారంభించాడు .నీలకంఠం. ఆటోవాడు నీలకంఠాన్ని చూస్తూ ఆటోతో వెళ్ళిపోయాడు.సాయంత్రం ఆటోవాడ్ని కాపేసి పట్టుకున్నాడు నీలకంఠం.
"నువ్వు మా ఇంట్లో ఏవో తప్పుడు పనులు చేస్తున్నట్టు విన్నాను"అన్నాడు నీలకంఠం.
"అబ్బే...అదేం లేదే!అయినా అది నా స్వంత విషయం కదా!" తడబడూతూ అన్నాడు ఆటోవాడు.
"వుండొచ్చు. కానీ నా ఇంట్లో అలాంటి పనులు జరగటానికి వీళ్లేదు. పూల ,కుండీలకు నీళ్ళు పట్టమంటే చెంబెడు నీళ్ళు చిలకరించి వెళ్ళటం కాదు. అది మమ్మల్ని మోసం చేయటమే అవుతుంది. అందుకే గోల చేసుకొని సెక్యూరిటీ ఆఫీసర్ వరకూ వెళ్ళ కూడదన్నది నా మాట. సైలంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో!ఇవిగో నీ అడ్వా న్సు డబ్బులు"అంటూ డబ్బున్న కవరును ఆటోవాడి చేతిలో పెట్టాడు నీలకంఠం. చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇరకాటంలో పడ్డ ఆటోవాడు మౌనంగా పైకెళ్ళిపో యా డు.
మరుసటి రోజు నిద్ర లేచిన నీలకంఠం ప్రహరీ గోడ వేపు చూశాడు. ఆటో కనబడ లేదు.
అంతలో"అయ్యగోరూ!ఇవిగో తాళాలు.ఆటోవాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు" అంటూ పనిమనిషి తాళాలను నీలకంఠం చేతికిచ్చింది.
'నీచమైన దరిద్రుణ్ణి వొదిలించుకున్నాను. అందుకే అన్నారు కొందరు 'ఇళ్ళను అద్దెకిచ్చే టప్పుడు వాళ్ళను గూర్చి పూర్తి వివరాలను తెలుసుకొని, వీలైతే ఓ మధ్యవర్తి ( బ్రోకరు) ద్వారా అగ్రిమెంటు వేయించుకొని ఇవ్వాలని'.ఎలాగో గోల పెట్టకుండా,గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు. లేకుంటే నేనూ సెక్యూరిటీ ఆఫీసర్ స్టేషను మెట్లు ఎక్కాల్సి వచ్చేదేమో!'అనుకొంటూ లోనికెళ్ళిపోయాడు నీలకంఠం. ©ప©©©© అయ్యా! ఈకథ నాస్వంతరచన.దేనికీ అనువాదం,అనుసరణ కాదని,మరే పత్రిక పరిశీలనలో లేదని తెలుపుకొంటున్నాను.

</font>

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply

వంట గదిలో వీరుడు కథ - రాము కోలా దెందుకూరు
[Image: Picture.png]
dedupelist unique lines generator
ఫైనల్ ఆ రోజు మా శ్రీమతి పుట్టినరోజు. రాత్రంతా ఆలోచించి, ఉదయానికే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాను.
"ఈసారి ఏదో భిన్నంగా చేయాలి. పూలు, కేకులు అందరూ ఇస్తారు. నేను మాత్రం స్వయంగా వంట చేసి నా శ్రీమతిని ఆశ్చర్యపరుస్తాను!" అనుకున్నాను.
వెంటనే వంటగదిలోకి దూసుకెళ్లి, "బంగారం! ముందుగా మీ నోరు తీపి చేస్తాం... నీ కోసం నేనే పాయసం చేస్తాను. ఈరోజు వంటంతా నా బాధ్యత. నువ్వు హాయిగా కూర్చొని చూస్తూ ఉండు!" అన్నాను. ఆమె నా ముఖం వైపు ఓసారి చూసింది. ప్రపంచంలోని పదకొండో వింత కళ్లముందు నిలబడినట్టుగా ఆశ్చర్యపోయింది.
చిరునవ్వుతో, "అయ్యో! వంట పాత్రల మీద మీ వీరప్రతాపం చూపించకండి. పాపం... వాటికి నోట్లో నాలుక లేదు!" అంది.
నేను మాత్రం హీరోలా కాలర్ సరిచేసుకుని, "ఈరోజు నా వంట రుచి చూసాక నువ్వే ఆశ్చర్యపోతావు!" అని ప్రకటించాను. ముందుగా పాయసం మొదలెట్టాను. పాలు పోశాను... బియ్యం వేసాను... పంచదార కలిపాను...
అన్నీ బాగానే సాగుతున్నాయని అనుకుని, "ఇంతలో చికెన్ బిర్యానీకి సిద్ధమవుదాం" అంటూ మరో స్టవ్ దగ్గరకు వెళ్లిపోయాను. అక్కడ ఉల్లిపాయలు తరగడం మొదలెట్టాను. తరిగింది ఉల్లిపాయ ఒక్కటే కాదు...
నా కళ్లలోని ధైర్యమూ! కన్నీళ్లు కారుతుంటే, "అయ్యో ఉల్లి తమ్ముడా! నీకు నాపై కాస్తైనా కనికరం లేదా?" అని మనసులోనే వాపోయాను. ఇంతలో చికెన్ కుక్కర్‌లో వేసి, మసాలా పొడి ప్యాకెట్‌ను వీరావేశంతో లాగాను.
అంతే! మసాలా పొడి గాలిలో ఎగిరి నేరుగా నా ముఖంపై అభిషేకం చేసింది. దగ్గు... తుమ్ములు... కళ్లలో నీళ్లు... వంటగది మొత్తం యుద్ధరంగంలా మారిపోయింది. ఆ హడావుడిలో పాయసం సంగతి పూర్తిగా మర్చిపోయాను.
కొద్ది సేపటికి... "ఏదో మాడిన వాసన వస్తోంది!" అని నా శ్రీమతి అరిచింది.
నేను ధైర్యంగా, "అది కొత్త స్టైల్ పాయసం అయి ఉంటుంది!" అన్నాను. మూత తీసి చూడగానే... గిన్నె అడుగున పాయసం కాదు... బొగ్గులా నల్లగా మారిన ఒక కళాఖండం! చెంచాతో కలపాలని ప్రయత్నిస్తే అది కదల్లేదు. గిన్నె మాత్రం, "నన్ను వదిలేయండి బాబూ!" అని వేడుకుంటున్నట్టనిపించింది.
ఆ వాసనకు పక్కింటి పిల్లి కూడా ముక్కు మూసుకుని వెనక్కి వెళ్లిపోయింది.
అప్పటికే నా శ్రీమతి వంటగదిలోకి వచ్చి ఆ దృశ్యం చూసింది. మొదట గిన్నెను చూసింది... తర్వాత నన్ను చూసింది... ఇంకేముంది! నవ్వు ఆపుకోలేక గోడ పట్టుకుని పగలబడి నవ్వింది. చీరకొంగు నడుముకు దోపుకుని, "చాలు మీ వంటవీరత్వం! ఇక మీరు రాముడిలా కూర్చొని చూస్తూ ఉండండి. నేను ఐదు నిమిషాల్లో పాయసం, బిర్యానీ రెండూ చేసి పెడతాను!" అంది.
నేను మాత్రం ఓడిపోయిన సేనాధిపతిలా నిశ్శబ్దంగా వంటగది నుంచి బయటకు వచ్చేశాను. ఆ రోజు నాకు ఒక జీవిత సత్యం అర్థమైంది. యూట్యూబ్‌లో వంట చూడటం చాలా సులువు... గ్యాస్ ముందు నిలబడి చేయడం మాత్రం మహాయోగం!
నీతి: భార్య పుట్టినరోజున వంటగదిలో కథాకళీ ఆడటంకంటే... మంచి హోటల్‌కు తీసుకెళ్లి భోజనం పెట్టడం ఆరోగ్యానికీ, పాత్రలకీ, భర్త పరువుకీ ఎంతో మేలు!

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply

అరటి పూలు
[Image: Picture1.png]
Venkata Rama Seshu Nandagiri
 
 
శ్రీనివాస్ బజార్ నుండి కూరగాయల సంచితో వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టాడు. చెల్లి గీత ఎదురెళ్ళి సంచీ అందుకుంది. సంచీ లోంచి కూరలన్నీ ఒక్కొక్కటిగా బైటికి తీస్తోంది.
 
ఇంతలో పక్క వీథిలోనే ఉంటున్న అక్క రాధ వచ్చింది.
 
" బజారుకెళ్ళావా వాసూ. అయ్యో, తెలిస్తే
 
నేను కూడా కావల్సినవి తెప్పించుకొనే దానిని కదా!" అంది రాధ.
 
"ఏమైనా కావాలంటే పట్టుకెళ్ళమ్మా." అందా తల్లి సుశీల.
 
గీత బైట పెడుతున్న వస్తువులను చూస్తూ " అన్నీ కూరగాయలేనా, పళ్ళు, పూలు ఏమైనా తెచ్చావా." అడిగింది రాధ వాసుని.
 
"కూరలే తెచ్చానే. పళ్ళు చెపితే తెస్తాను. అమ్మ చెప్పలేదు. పూలంటావా. నేనెప్పుడూ తేను. డబ్బు దండగ. ఇలా పెట్టుకుంటారు. అలా వాడిపోతాయి.
 
మీ ఆడాళ్ళకి పనీ - పాటూ ఉండదు. డబ్బులిలాగే
 
తగలేస్తారు.".చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు వాసు
 
"ఒరేయ్, తప్పురా. పూలు‌, పళ్లు వాటి గురించి అలా మాట్లాడకూడదు." తల్లి కేకలేసింది.
 
"పూలు, పళ్ళూ సరే. బైటికెళ్తాడా. తినడానికి కూడా ఏం తేడక్కా. ఉద్యోగం వచ్చాక మరీ పిసినారి అయిపోయాడే." అంది గీత ఫిర్యాదు చేస్తున్నట్లు.
 
"ఏంటీ, అక్కా చెల్లెళ్ళిద్దరూ వాడినలా ఆడి పోసు కుంటున్నారు! రేపు రాధక్క కడుపుతో ఉంటే తీసుకొచ్చి ముచ్చట్లు జరిపించాల్సింది వాడే. గీతా! నీ పెళ్ళి చేయడం కూడా వాడి బాధ్యతే. మరి ఆ మాత్రం పొదుపు ఉండక్కర్లేదా." తల్లి సుశీల కొడుకుని వెనకేసుకొచ్చింది.
 
"అబ్బో, కొడుకు మీద ఈగ వాలనివ్వదక్కా. ఈ మధ్య మరీను." నవ్వుతూ అంది గీత.
 
"ఎన్నాళ్ళే. ఆ కోడలు రానీ. ఆవిడగారి కోసం, ఈయన గారు, రోజూ పూలు, పళ్ళూ‌, స్వీట్లు తేక పోతాడా, మనం చూడక పోతామా." వెటకరించింది అక్క రాధ.
 
"అంతలేదమ్మా. నాకెవరైనా ఒకటే. పళ్ళూ, స్వీట్లు జాన్తా నై. పూలడిగితే, పెట్టుకోడానికి, ఒకే ఒక పువ్వు , అరటి పువ్వు కొనిస్తా. మరి జన్మలో అడగదు." అన్నాడు గట్టిగా నవ్వుతూ.
 
"పోరా. వచ్చే నెలేగా పెళ్ళి. ఆ భాగోతం చూడక పోతామా." అంటూ గీత , రాధ ఆట పట్టించారు.
 
మరుసటి నెల పెళ్ళి సందడి సర్దుమణిగాక, ఒకరోజు
 
వాళ్ళాయన ఊరెళ్ళడంతో ఆ రాత్రి పుట్టింట ఉండడానికి వచ్చింది రాధ. అత్తా, కోడలు, అక్కా చెల్లెళ్ళు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు.
 
ఇంతలో వాసు ఆఫీసు నుండి వచ్చాడు. అందరినీ చూసి పలకరింపుగా నవ్వి లోపలికి వెళ్ళి పోయాడు. మరదలు రాణి కూడా అతని వెనకే వెళ్ళి అయిదు నిమిషాల్లో వదినగారికి, మరదలికి చేతుల్లో మల్లెపూల దండలు పెట్టింది. వెనకాతలే వాసు బట్టలు మార్చుకుని వచ్చి కూర్చోడం, తల్లి కాఫీ తెచ్చి ఇవ్వడం జరిగింది.
 
"ఏరా వాసూ, ఇవేనా అరటిపూలు." అడిగింది అక్క రాధ మల్లెచెండుని చేతిలో పట్టుకుని సుతారంగా ఊగిస్తూ. గీత నవ్వుని బిగపెట్టి వాసుని చూస్తోంది.
 
"అరటిపూలు ఏంటి? " ఆశ్చర్యంగా అడిగింది రాణి.
 
నవ్వుతూ ఆరోజు జరిగిన సంభాషణను వివరించింది గీత. రాణి కూడా నవ్వాపుకోలేక పోయింది. ఆ ముగ్గురితో పాటు తల్లీ కొడుకు కూడా శృతి కలిపారు.

ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 1 Guest(s)