Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అత్తగారి కథలు - పెళ్ళికి ముందు గొడవ - పార్ట్ 13
#21
నా కోడలు
[Image: N.jpg]
అత్తగారి కథలు - పార్ట్ 12


సమర్థ్, జాగృతిల పెళ్ళికి అన్నీ సిద్ధమయ్యాయి. పెళ్ళి ఇంకోవారంలో ఉందనగా, జాగృతిని తన ఇంటికి తీసుకువెళ్లాడు సమర్థ్. జాగృతి వద్దని చెప్తున్నా వినలేదు. 



సమర్థ్ వాళ్ళమ్మ రాధకి, కాబోయేకోడలు పెళ్ళికిముందు అత్తగారింటికి రావడం నచ్చలేదు. అలా రావడం అశుభమని జాగృతి మీద కోప్పడి, ఇంట్లోకి రానివ్వలేదు. "ఇందులో జాగృతి తప్పులేదు, తను వద్దని చెప్తున్నా, నేనే తీసుకువచ్చానని" సమర్థ్ చెప్పినా వినలేదు రాధ. రాధ కోపాన్ని చూసిన జాగృతికి, వెనక్కితిరిగి వెళ్ళిపోవాలనిపించింది. సమర్థ్, జాగృతిని వెళ్ళద్దని చెప్పి, రాధని బతిమాలుకున్నాక, చాలాసేపటితరువాత జాగృతిని ఇంట్లోకి రానిచ్చింది. 



తనకి నచ్చిన తీరులో జాగృతిని అలంకరిస్తూ, "అమ్మాయిలు ఇలా ఉంటేనే మామీనాక్షికి నచ్చుతారు. ఈ ఊరిలో అందరూ ఇలాగే తయారవుతారు. " అని జాగృతితో చెప్పింది రాధ. 
రాధ తనని తయారుచేసిన విధానం జాగృతికి నచ్చకపోయినా, అప్పుడే రాధ కోపాన్ని చూసిన జాగృతి, ఆ విషయాన్ని రాధకి చెప్పలేకపోయింది. 'ఈవిడ ఆడపడుచుకి నేను ఎందుకు నచ్చాలి? ఆవిడ కోసం నేనెందుకు మారాలి? నాలా నేనుందుకు ఉండకూడదు. ' అనుకుంటూ పక్కవీధిలోనున్న రాధ ఆడపడుచు మీనాక్షి ఇంటికి వెళ్ళింది జాగృతి, రాధతో. 



రాధని, జాగృతిని చూసి సంతోషపడింది మీనాక్షి. "నీక్కాబోయే కోడలు కదూ. ఫొటోలో చూసాను. ఆయ్. పెళ్ళికి ముందే అత్తగారింటికి వచ్చేసిందే? నువ్వెలా ఒప్పుకున్నావ్? ఇంతకీ ఇప్పుడొచ్చింది? ఆయ్. " అంటూ గోదావరియాసలో రాధని పలకరించింది మీనాక్షి. 



"ఇప్పుడే వచ్చింది. వెంటనే నీకు చూపిద్దామని తీసుకొచ్చాను. నీ అలక తీరి, ఇప్పటికైనా నాతో నవ్వుతూ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీనాక్షీ. " అంది రాధ. 



"నీక్కాబోయేకోడలిని ఇన్నాళ్లు చూడలేదు. కోపం ఉండదా మరి? ఆయ్. " అంది మీనాక్షి నవ్వుతూ. 



"రాధా, నేనూ ఒకే వయస్సువాళ్ళం. మంచి స్నేహితులం. అన్ని విషయాలు ఒకళ్ళతోఒకళ్ళం పంచుకుంటాం. తను చూపించిన పిల్లని నేను నా కోడలిగా చేసుకున్నాను. ఆయ్. రాధ కూడా నేను ఎంచిన పిల్లని కోడలిగా చేసుకోవాలికదా. కానీ, మీ పెళ్లిచూపులు, పెళ్లిమాటలు వేరే ఊరిలో జరిగాయి. రాధ నన్ను తీసుకెళ్లలేదు. ఆయ్. అందుకే మాట్లాడడం మానేసాను. " అంది మీనాక్షి జాగృతితో. 



"మీ అత్తయ్యగారేరి? ఆవిడకి కూడా నాక్కాబోయే కోడలిని చూపిస్తాను. " అంది రాధ. 



"అత్తగారండీ. మా రాధ తనకి కాబోయే కోడలిని తీసుకొచ్చింది. " అని కూర్చున్నచోటునుండే అత్తగారిని అరిచిపిలిచింది మీనాక్షి. మీనాక్షి భర్త, ముగ్గురు కొడుకులు వచ్చారు. కానీ, మీనాక్షి అత్తగారు రాలేదు. 



"మా అత్తగారికి బ్రహ్మచెవుడు. వినపడదు. గట్టిగా అరవాలి. " అని తలకొట్టుకుంటూ అంది మీనాక్షి. మీనాక్షి ఒకళ్ళతో మాట్లాడుతూ, ఇంకొకరిని చూడడాన్ని గమనించింది జాగృతి. 'మీనాల్లాంటి కళ్ళు అన్న పేరున్నఆవిడకి మెల్లకళ్ళు. ఆవిడ అత్తగారి బ్రహ్మచెవుడని వెక్కిరిస్తోంది. ఇంతకీ ఈ అత్తాకోడళ్లు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో!!' అనుకుంది జాగృతి. 



మీనాక్షి అత్తగారు కళ్లద్దాలు సరిచేసుకుంటూ, "నీకు కాబోయేకోడలు కదే రాధా. అయ్. " అని, మళ్ళీ అనుమానంగా చూస్తూ, "ఫోటోలోలాగ లేదేమిటే?" అని రాధని అడిగింది. 



"ఫోటోలో హుందాగా ఉన్న పిల్ల, ఇప్పుడు పల్లెటూరిపిల్లలా ఉందేంటి అనుకున్నాను. అప్పుడే మీ పద్ధతిలోకి మార్చేసావా?" అని రాధని అడిగాడు మీనాక్షి భర్త. 



"తప్పేముంది? కోడళ్ళని మొదటినుంచి మన పద్ధతిలోకి మార్చుకుంటేనే మంచిది. తరువాత మారుద్దామన్నా లొంగరు. నేను అనుభవిస్తున్నాను కదా. " అని తలపట్టుకుంది మీనాక్షి. 



"నీకేం తక్కువ చేసింది అది? నా పిన్ని మనవరాలిని కోడలిగా చేసుకున్నావ్. ఇంటిపనులన్నీ చక్కగా వచ్చు దానికి. " అంది రాధ, మీనాక్షితో. 



"చదువు సంధ్యా లేనిదాన్ని తెచ్చావ్. పనిసాయమైన చేస్తుందా అంటే అదీ లేదు. ఎంతసేపూ ఆ చంటిపిల్లకి పాలిస్తున్నాను అంటూ అంతపనీ నాచేతే చేయిస్తుంది. ఇంతకీ అదెక్కడ?" అని వంటిటివైపు చూస్తూ, "ఏమే, అందరికీ కాఫీలు పట్టుకునిరా. " అని అరిచింది మీనాక్షి. అందరెదురుగా మీనాక్షి తన కోడలిగురించి మాట్లాడిన విధానం జాగృతికి నచ్చలేదు. 'కూర్చున్నచోట నుండి కదలకుండా అత్తగారిని, కోడలిని పిలుస్తూ, పనులన్నీ ఈవిడే చేస్తున్నట్టు చెప్తోందేమిటి?' అనుకుంది జాగృతి. 



"అండీ అత్తయ్యగారండీ. తెస్తున్నానండి. ఇప్పుడే పాలు పెట్టానండి. " అని వంటిట్లోనుంచి చెప్పింది మీనాక్షి కోడలు. 'ఒకే వాక్యంలో అండీ అని నాలుగుసార్లు అంది. మీనాక్షి కోడలు బాగా భయస్తురాలైన అయ్యిండాలి లేదా వీళ్ళు బాగా భయపెట్టి అయినా అయ్యుండాలి. ' అనుకుంది జాగృతి. 



మీనాక్షి మాటలకి, మీనాక్షి పెద్దకొడుకు మొహం మాడిపోయింది. జాగృతిని చూసి, మాట మార్చడానికి ప్రయత్నిస్తూ, "చెల్లెమ్మా నువ్వు చాలా పెద్ద ఐటీ కంపెనీలో చేస్తున్నావంట కదా? 
ఆయ్. " అని అడిగాడు. జాగృతి నవ్వుతూ అవునని చెప్పింది. "వాడు నా పెద్దకొడుకు. మా ఊళ్ళోనే తెలుగు మాస్టారుగా చేస్తున్నాడు. " అని చెప్పింది మీనాక్షి. 



"ఆయ్. నాక్కుడా చదువయ్యాక, నీలాగా, బావలాగ పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చెయ్యాలనుందక్కా. " అన్నాడు మీనాక్షి మూడోకొడుకు. 



"నాకు కూడా కంప్యూటర్స్ వచ్చు అక్కా. ఇక్కడ నా ఫ్రెండ్ తో కలిసి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. వర్డ్, ఎక్సెల్ క్లాసులు నేనే తీసుకుంటాను. ఆయ్. సంపాదనే పెద్దగా లేదు. మీ కంపెనీలో ఉద్యోగాలేమైనా ఉంటే చూస్తావా అక్కా?" అని జాగృతిని అడిగాడు మీనాక్షి రెండో కొడుకు. 



"నేను చేస్తున్న కంపెనీలో అయితే కష్టం. సి, జావా లాంటి కోర్సలు ఏమైనా చెయ్యండి. అప్పుడు తప్పకుండా ప్రయత్నిద్దాం. " అంది జాగృతి. అక్కా, చెల్లీ అంటూ వరసలు కలిపి మాట్లాడడం నచ్చింది జాగృతికి. కానీ, ప్రతిసారి ఆయ్ అని ఎందుకు అంటున్నారో, దాన్ని అర్ధం ఏమిటో తెలియలేదు జాగృతికి. 



"నువ్వు దీన్ని ఉద్యోగం అడగటం ఏమిటిరా? నీకన్నా ఎక్కువ వచ్చా దీనికి?" అని మీనాక్షి రెండో కొడుకు మీద అరిచింది రాధ. జాగృతి ఉద్యోగం గురించి అందరూ గొప్పగా మాట్లాడడం, ముఖ్యంగా మొగవాళ్ళు పొగుడుతూ మాట్లాడడం నచ్చలేదు రాధకి. 



"చెల్లమ్మ పెద్ద ఉద్యోగమే చేస్తోంది కదత్తా. ఉద్యోగం ఇప్పించగలదేమో. ఆయ్. వాడి ప్రయత్నాలు ఏవో వాడిని చూసుకొని. " అన్నాడు మీనాక్షి పెద్దకొడుకు. 



"మొగవాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తుందా? అంతుందా దీనికి? అయినా ఆడవాళ్లు, భర్తని, పిల్లల్ని చూసుకుంటే చాలు. బ్యాగులూపుకుంటూ ఉద్యోగాలకి వెళ్ళి ఎవరిని ఉద్దరించనక్కరేలేదు. " అంది రాధ కోపంగా కళ్ళెర్రజేస్తూ. రాధ ఎందుకు అలా అరుస్తోందో అర్ధంకాక, అందరూ ఒకళ్ళమొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. జాగృతికి మళ్ళీ రాధ కోపాన్ని చూసి, భయం వేసింది. 'నేను ఉద్యోగం చెయ్యటం ఈవిడకి ఇష్టంలేకపోతే పెళ్ళిచూపుల్లోనే చెప్పుండాల్సింది. కొంపదీసి, పెళ్ళయ్యాక ఉద్యోగం మాన్పించేస్తారా?' అనుకుంది మనసులో. 



"ఇంతకీ నా కోడలేది?" అని వంటిటివైపు చూస్తూ, "ఏమే. ఎప్పడికి తీసుకొస్తావ్ కాఫీలు?" అని అరిచింది మీనాక్షి. 



"అత్తయ్యగారండీ. తెచ్చేస్తున్నానండి" అంటూ వచ్చింది మీనాక్షి కోడలు. ఒకచేత్తో కాఫీ కప్పులున్న ప్లేట్ పట్టుకుని, ఇంకో చేత్తో, చెంకలోనున్న పిల్ల పడిపోకుండా పట్టుకుంది. 



"ఏమే. ఏం చేస్తున్నావ్ ఇంతసేపూ?" అని కోడలిని అడిగింది మీనాక్షి. 



"పిల్ల ఇప్పుడే లేచిందండి. ఆకలికి ఏడుస్తుంటే.. " అని మొహమాటంగా, చెప్పింది మీనాక్షి కోడలు. 



"చెప్పనా. ఇదీ దీన్ని వరస. ఎప్పుడూ పని ఎగ్గొట్టడానికి, పిల్లకి పాలిస్తున్నానండి అని చెప్తుంది. " అంది మీనాక్షి కోడలిని వెక్కిరిస్తూ. మీనాక్షి కోడలు మొహం మాడిపోయింది. 'చిన్న పిల్లకి పాలిస్తుంటే కూడా వెక్కిరిస్తారా? వీళ్ళేం మనుషులు?' అనుకుంది జాగృతి. మీనాక్షి కోడలు చేతిలోనున్న కాఫీ ప్లేట్ అందుకోవడానికి వెళ్ళి, "మీ పేరేంటండి?" అని అడిగింది జాగృతి. 



"నా కోడలు అని చెప్పాను కదా? మళ్ళీ అడుగుతావేం?" అంది మీనాక్షి జాగృతితో. 'కోడలిని, అదీ, ఇదీ అని పిలుస్తున్నారు. ఆవిడ చేతిలో ప్లేట్ తీసుకోవడానికి, సాయం చెయ్యటానికి ఎవరూ వెళ్ళలేదు. కనీసం ఆవిడ పేరుని కూడా చెప్పనివ్వటం లేదు. వీళ్ళ పద్దతి ఏమీ బాగులేదు. ' అనుకుంది జాగృతి. 



అందరూ కాఫీలు తాగడం అయ్యాక, కాఫీ కప్పుల్ని తీసుకుని, మీనాక్షి కోడలితో మాట్లాడానికి వంటిట్లోకి వెళ్ళింది జాగృతి. పిల్లని ఎత్తుకుని, ఏడుస్తూ, వంటపని చేస్తోంది మీనాక్షి కోడలు. "మీరు ఒక నిమిషం కూర్చోండి. నేను చేస్తాను. " అంది జాగృతి, మీనాక్షి కోడలితో. 



"వద్దు వదినా. నేను చేసుకుంటాను. " అని కళ్ళు తుడుచుకుంటూ, "సారీ. మిమ్మల్ని వదిన అని పిలుస్తున్నాను. కానీ, మిమ్మల్ని నా పరిస్థితుల్లో ఊహించలేకపోతున్నాను. " అంది మీనాక్షికోడలు. 



"అదేమిటి అలా అంటున్నారు?" అంది జాగృతి అనుమానంగా. 



"నాకైతే, చదువు పెద్దగా అబ్బలేదు కాబట్టి, ఇలాంటి సంబంధం చేసుకున్నాను. మీరు ఇంజనీరింగ్ చదివి, పెద్ద పొజిషన్లో ఉన్నారని విన్నాను. మీరెలా ఈ సంబంధం ఒప్పుకున్నారో అర్ధం కావటంలేదు. " అని మొహమాటంగా అడిగింది మీనాక్షి కోడలు. 



"మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మొహమాటపడద్దు. " అంది జాగృతి. 



"మా అన్నయకి మీరు నచ్చారని, ఈ పెళ్ళికి ఒప్పుకుందిట మా పెద్దమ్మ. మీరు ఉద్యోగం చెయ్యటం ఆవిడకి అస్సలు ఇష్టం లేదు. బ్యాగులూపుకుంటూ ఆఫీసులకి వెళ్ళే ఆడవాళ్లంటే నాకు ఇష్టం లేదని నాతో సార్లు చెప్పింది మా పెద్దమ్మ. మీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుందా అనుకున్నాను. పెళ్ళి తరువాత మీ ఉద్యోగం మాన్పించేస్తానని మా అత్తగారికి చెప్పింది. " అంది మీనాక్షి కోడలు. 



"ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా?" అని అడిగింది జాగృతి. 



"తెలియదు. తెలిసినా అన్న ఏమీ చెయ్యలేడు. మా పెద్ధమ్మంటే అన్నకి చాలా భయం. ఇంట్లో అందరూ మా పెద్దమ్మ మాటే వింటారు. " అని చెప్పింది మీనాక్షి కోడలు. 



జాగృతికి తన భవిష్యత్తు, మీనాక్షి కోడలి రూపంలో కళ్ళముందు కనపడింది. ఈ పెళ్ళి అయితే, ఈ అత్తగారికి కోడలిగా మాత్రమే మిగిలిపోతానని, "నా కోడలు" అనిపించుకుంటూ, తనని, తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతానని జాగృతికి అర్ధం అయ్యింది. 



'ఇలాంటి సంబంధం చేసుకుని, జీవితాంతం ఏడ్చేకంటే, చేసుకోకుండా ఉంటేనే మంచిది. ' అని నిర్ణయించుకుని, తన ఇంటికి వెళ్తూనే, ఈ పెళ్ళి కాన్సల్ చెయ్యమని ఇంట్లోవాళ్ళకి చెప్పింది. 



పేరు కూడా తెలియని మీనాక్షి కోడలికి, పెళ్ళికిముందే తన ఇంటికి తీసుకువెళ్లిన సమర్థ్ కి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది. 
***
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
పెళ్ళికి ముందు గొడవ
[Image: P.jpg]
పార్ట్ 13

జాగృతికి, సమర్థ్ కి పెళ్ళై 20 సంవత్సరాలు అయ్యింది. పెళ్లిరోజు ఉదయంనుండి, జాగృతికి పెళ్ళికిముందు జరిగిన విషయాలు గుర్తుకొచ్చాయి. 



*********************************************



జాగృతి నెమ్మదస్తురాలు, ఇంజనీరింగ్ చదివింది. హుందాగావుండే అమ్మాయి. జాగృతి, చెన్నైలో, ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేరోజుల్లో, సమర్థ్ తో పెళ్ళిచూపులు జరిగాయి. 



పెళ్ళిచూపులకి ముందు, సమర్థ్ ఫోటోని జాగృతి చూడలేదు. చామనఛాయకన్నా తక్కువ రంగులో, గుండుతో, పొట్టతో, చమటలు కారుతూ, మెంతి రంగు షర్ట్ వేసుకుని, అమ్మ బ్యాగ్ భుజాన వేసుకుని వచ్చాడు సమర్థ్. 'బాగా చదువుకున్నాడని, మంచి ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు!! మరి ఇలా ఉన్నాడేంటి?' అనుకుంది జాగృతి. మొదటి పరిచయంలోనే, "కడుపొస్తే ఉద్యోగం మానేస్తావా?" అన్న సమర్థ్ మాటకి, జాగృతికి ఒళ్ళుమండి, తనకి అబ్బాయి నచ్చలేదని వాళ్ళ అమ్మ లతకి చెప్పింది. సమర్థ్ కి, జాగృతి చాలా నచ్చి, జాగృతిని తప్ప, ఇంకెవ్వరిని చేసుకోనని వాళ్ళ అమ్మ రాధకి చెప్పాడు. 



ఎన్ని రోజులైనా, జాగృతివాళ్ళనుండి సమాధానం రాకపోవడంతో, జాగృతికి తను నచ్చలేదమో, తను జాగృతితో మాట్లాడింది తప్పేమో అన్న అనుమానం సమర్థ్ కి వచ్చింది. మెయిల్స్ లో, మెసేజెస్ లో జాగృతికి క్షమాపణ చెప్పాడు. "పెళ్లితరువాత నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు. నిన్ను నేను ఉద్యోగం మానెయ్యమని అడగను. " అని వాగ్దానం చేసాడు సమర్థ్. రాధ చేత లతకి ఫోన్ చేయించి, పెళ్ళికి ఒప్పుకునేటట్టు చేసాడు. 
 
**********************************************************



సమర్థ్ ఉద్యోగం బెంగుళూరులో అవడంవల్ల, జాగృతిని చూడాలనుందని, బండి మీద తనతో సరదాగా తిరగాలనుందని, వీకెండ్స్ లో బెంగళూర్ రమ్మని చాలా సార్లు అడిగాడు సమర్థ్. పెళ్ళికిముందు తనకి అలాంటివి ఇష్టంలేదని, రానని చెప్పింది జాగృతి. ఒకళ్ళ గురించి ఒకరు తెలుసుకోవాలి, పరిచయం పెంచుకోవాలి అంటూ, తరచూ జాగృతికి ఫోన్ చేసి మాట్లాడేవాడు. తన గురించి సమర్థ్ ఎక్కువగా చెప్తుండడాన్ని, జాగృతి గురించి అడగకపోవడాన్ని గమనించింది జాగృతి. 'సమర్థ్ తీరే ఇంతా? లేక నన్ను ఇంప్రెస్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడా?' అనుకుంది. 



ఎలాగైనా జాగృతిని కలిసి, జాగృతి చేత ఇష్టపడేటట్టు చేసుకోవాలని అనుకున్నాడు సమర్థ్. ఇంటర్వ్యూల కోసం అయితే, జాగృతి తప్పకుండా బెంగళూర్ వస్తుందన్న ఆలోచనతో, "పెళ్ళి తరువాత, నువ్వెలాగూ బెంగళూర్లోనే ఉద్యోగం చెయ్యాలి కదా. ఇక్కడ కంపెనీల్లో అప్లై చెయ్యడం మొదలుపెట్టు. నీ రెస్యూమె నాకు పంపించు. మా కంపెనీలో కూడా అప్లై చేస్తాను. " అన్నాడు. సమర్థ్ కి రెస్యూమె పంపించి, తను కూడా కొన్ని కంపెనీల్లో అప్లై చేసింది జాగృతి. 



రెండు కంపెనీల నుండి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. వాళ్ళు జాగృతిని ఇంటర్వ్యూ కోసం బెంగళూర్ రమ్మన్నారు. జాగృతి బెంగళూర్ వస్తున్న విషయం విని సమర్థ్ చాలా సంతోషించాడు. "ఇంటర్వ్యూ ఏ కంపెనీల్లో?" అని అడిగాడు. 



"సన్ మైక్రోసిస్టమ్స్, డెల్" అని చెప్పింది జాగృతి సంతోషంగా. 



"అంత పెద్ద కంపెనీల్లో నీకు ఉద్యోగం వస్తుందని అనుకుంటున్నావా?" అన్నాడు సమర్థ్ అనుమానంగా. 



"నేను ఇప్పుడు చేస్తున్నది కూడా పెద్ద కంపెనీయే కదా. ఏమో రావచ్చేమో? ట్రై చెయ్యటంలో తప్పేముంది?" అంది జాగృతి నమ్మకంగా. 



"సర్లే. నీకు వచ్చినప్పుడు చూద్దాంగాని, మా కంపెనీలో HR కి నీ రెస్యూమె పంపించాను. వాళ్ళు ఇంటర్వ్యూ కి పిలుస్తారు. నువ్వొకసారొచ్చి, మొహం చూపిస్తే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. " అన్నాడు సమర్థ్ గర్వంగా. 



సమర్థ్ కి, గొప్పలు చెప్పుకోవడం అలవాటన్న విషయం జాగృతికి అర్ధమయ్యింది. కానీ, జాగృతికి తన మీద తనకి నమ్మకముంది. "రెస్యూమె ఫార్వర్డ్ చెయ్యటం వరకు పర్వాలేదు కానీ, నేను చూసుకుంటాను అంటున్నారేమిటి? అలా వచ్చే ఉద్యోగం నాకు వద్దు. నా అంతట నేను తెచ్చుకోగలను. మీరు నాకోసం కష్టపడనక్కరలేదు. " అంది కోపంగా. 



"సరే. నువ్వు ముందు బెంగుళూరు రా. వచ్చాక మిగతావన్నీ మాట్లాడుకుందాం. " అని సమర్థ్ మాటదాటవేసాడు. 



***************************************
 
జాగృతి బెంగుళూరు వెళ్ళి, రెండు కంపెనీల్లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చి, రెండింటిలోనూ సెలెక్ట్ అయ్యింది. 



ఇంటర్వ్యూలు అయ్యాక, జాగృతిని కలుస్తానన్నాడు సమర్థ్. జాగృతికి, సమర్థ్ ని ఎలా గుర్తుపట్టాలో అర్ధం కాలేదు. జాగృతి పెళ్ళిచూపులకి ముందు సమర్థ్ ఫోటో చూడలేదు. పెళ్ళిచూపుల్లో, సమర్థ్ అన్న మాటకి వచ్చిన కోపంతో, జాగృతి పెళ్ళిచూపుల తరువాత కూడా సమర్థ్ ఫోటో చూడలేదు. గుండుతో, పొట్టతో, చమటలు కారుతూ వచ్చిన సమర్థ్ మాత్రమే జాగృతికి గుర్తున్నాడు. 'ఇప్పుడూ అలానే ఉండి ఉంటాడా? ఏమైనా మారి ఉంటాడా? చూద్దాం. ' అనుకుంది జాగృతి. 



జాగృతి తన ఆలోచనల్లో తానుండగా, ఒకతను, బండి మీద స్పీడ్ గా వచ్చి, జాగృతి ఎదురుగా సడన్ బ్రేక్ వేసి, బండి ఎక్కమన్నాడు. అతన్ని చూసి భయపడి, వెనక్కి జరిగింది జాగృతి. "తొందరగా ఎక్కు జాగృతి. ఇంటర్వ్యూ కి టైం అవుతోంది. " అన్నాడతను. గొంతుని బట్టి, జాగృతికి అర్ధమయ్యింది వచ్చినతను సమర్థ్ అని. 



'పెళ్ళిచూపుల్లో చూసినట్టుగా అస్సలు లేడే!! కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని, ఎగురుతున్న జుట్టు తో, బండి మీద స్టైల్ గా వచ్చాడు!! పర్వాలేదు, స్మార్ట్ గానే ఉన్నాడు. ' అని జాగృతి అనుకునేలోపు, సమర్థ్ కున్న ఫ్రెంచ్ బియర్డ్, ఛాతి కనపడేటట్టు కిందవరకు విప్పున్న షర్ట్ బటన్స్ జాగృతి కళ్ళపడ్డాయి. 'పెళ్ళిచూపుల్లో చూసిన మనిషి నచ్చలేదనుకుంటే, ఇప్పుడు రౌడీలా, ఈ అవతారంలో కూడా నచ్చలేదు. ఇంతకీ అసలు సమర్థ్ ఎలా ఉంటాడు? అలానా, ఇలానా, లేక ఇంకేదైనా వేరే అవతారంలో కూడా ఉంటాడా?' అర్ధంకాలేదు జాగృతికి. 



"ఏమిటి ఆలోచిస్తున్నావు. ఇంటర్వ్యూ కి టైం అవుతోంది. పద. " అన్నాడు సమర్థ్, జాగృతిని కుదుపుతూ. 



"ఇంటర్వ్యూస్ అయిపోయాయి. " అంది జాగృతి. 



"నువ్వు వచ్చావని, మా కంపెనీలో ఇంటర్వ్యూ పెట్టించాను. ఇప్పుడు వెళ్ళాల్సింది అక్కడికి. " అన్నాడు సమర్థ్. 



'నేను అటెండైన ఇంటర్వూస్ గురించి అడుగుతాడనుకుంటే, సమర్థ్ ఇప్పటికిప్పుడు ఈ ఇంటర్వ్యూ పెట్టించాడేంటి? ఎప్పటిలాగే నా గురించి అడగకుండా, తన గొప్పే చూపించుకుంటున్నాడు. నేను సెలక్టయిన విషయం చెప్పడం అనవసరం. ఈ ఇంటర్వ్యూ కూడా అటెండైతే పోయేదేముంది. ' అనుకుని, "నా అంతట నేను వెళ్తాను. మీరు బయలుదేరండి. " అంది జాగృతి. 



"ఏమిటి మొహమాటామా? పెళ్ళి చేసుకోబోయేవాళ్లమేగా! ఎన్నో రోజులనుండి ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నానో తెలుసా. ఇప్పటివరకూ నా బండి మీద ఎవరినీ ఎక్కనివ్వలేదు. నువ్వే మొదటిదానివి. ఎక్కు ప్లీజ్. " అని బతిమాలాడు సమర్థ్. సమర్థ్ లో రొమాంటిక్ ఆంగల్ ని చూసి, నవ్వుకుని, సమర్థ్ బండి ఎక్కి, దూరంగా కూర్చుంది జాగృతి. 



"అంత దూరంగా కూర్చున్నావ్. పడిపోతావేమో. దగ్గరకి రావచ్చు. భుజం మీద చెయ్యి కూడా వేసుకోవచ్చు. " అన్నాడు సమర్థ్ నవ్వుతూ. జాగృతి, సమర్థ్ మాట విననట్టు ఉండిపోయింది. 



సమర్థ్, జాగృతిని తన ఆఫీస్ కి తీసుకువెళ్ళి, అందరికీ పరిచయం చేసాడు. పెళ్ళినిశ్చయమైనందుకు అందరూ అభినందలు తెలిపాక, ఇంటర్వ్యూ రూంలోకి వెళ్ళింది జాగృతి. వెళ్ళిన పది నిమిషాల్లోనే, కోపంగా బయటకొచ్చిన జాగృతిని చూసి, "ఏమయ్యింది? అలావున్నావ్? ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదా?" అని అడిగాడు సమర్థ్ కంగారుగా. 



"కాలేదు. " అంది జాగృతి ముభావంగా. 



"నా ఆఫీస్ వాళ్ళ దగ్గర నా పరువుపోయింది. ఎలా ఇప్పుడు?" అన్నాడు సమర్థ్ తలపట్టుకుంటూ. 



"మీ కంపెనీలో సెలెక్ట్ అవ్వలేదని మీకు కోపంగా ఉందా? ఎందుకు 
సెలెక్ట్ అవ్వలేదో మీకు తెలియదు కదూ?" అని అడిగింది జాగృతి. 



"నువ్వు సమాధానాలు చెప్పి ఉండవ్. ఇంకేముంటుంది కారణం. " అన్నాడు సమర్థ్ కోపంగా. 



"అవును. సమాధానం చెప్పలేకపోయాను. మీకు కారణం తెలియనట్టు నటించకండి. మీకు తెలుసు, వీళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు, నా స్కిల్స్ వేరు అని. అయినా కూడా నాకు తెలియకుండా, నా రెస్యూమెని వీళ్ళ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా మొత్తం మార్చేశారు మీరు. అవునా? అబద్దం రెస్యూమె పెట్టి, నన్ను ఎందుకు సెలెక్ట్ కాలేదంటే ఎలా? ఇలా చేస్తే, ఎవరు సెలెక్ట్ అవుతారు? నాకు అస్సలు సంబంధంలేని ప్రశ్నలు అడిగారు వాళ్ళు ఇంటర్వ్యూలో. నాకు అబద్దాలు చెప్పి, ఉద్యోగం తెచ్చుకోవడం ఇష్టంలేదు. అందుకే, ఈ ఉద్యోగం నాకు సరిపోదని చెప్పి, బయటకి వచ్చాను. " అంది జాగృతి. 



"నువ్వు ఏదోఒకటి చెప్తే, నేను తరువాత మేనేజ్ చేసుండేవాడిని. ఉద్యోగం నీకు సరిపోదని ఎందుకు చెప్పావ్? ఇక్కడే తెచ్చుకోలేనిదానివి, సన్ మైక్రోసిస్టమ్స్, డెల్ లో తెచ్చుకుంటానని గొప్పలు ఎందుకుకొట్టావ్?" అన్నాడు సమర్థ్ చిరాకుగా. 



సమర్థ్ చేసిన పనికి, అంటున్న మాటలకి జాగృతికి కోపంగా ఉంది. "ఇన్నాళ్ల నుంచి గొప్పలెవరు కొడుతున్నారు? పెద్ద కంపెనీల్లో ఉద్యోగం తెచ్చుకోలేనని ఇన్నాళ్లు నన్ను తక్కువచేస్తూ మాట్లాడారు కదా. ఈ రోజు నేనిచ్చిన రెండు ఇంటర్వ్యూల్లోను సెలెక్ట్ అయ్యాను. మీకీవిషయం ఇక్కడికి రాకముందే చెప్దామనుకున్నాను. కానీ, ఎప్పుడూ మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోవడమేతప్ప, నా గురించి ఎప్పుడైనా అడిగితే కదా నా గురించి మీకు తెలిసేది. " అని కోపంగా నడుస్తూ, సమర్థ్ ఆఫీస్ నుండి బయటకి వెళ్ళిపోయింది జాగృతి. 



జాగృతి విషయంలో తను మళ్ళీ తప్పుచేసాడన్న విషయం అర్ధమయ్యింది సమర్థ్ కి. జాగృతి వెనక పరిగెడుతూ, క్షమించమని కోరాడు. "ఇక మీతో మాట్లాడాల్సింది నాకేమిలేదు. నేను వెళ్తున్నాను. " అని వెనక్కి తిరిగి వెళ్ళింది జాగృతి. 



"సారీ చెప్తున్నాను కదా. కోపం తగ్గించుకో. పద. మా అక్క ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడ అందరి ఎదురుగా వద్దు. " అన్నాడు సమర్థ్, జాగృతిని బతిమాలుతూ. 



"నేను రాను. ఇక రావాల్సిన అవసరం కూడా లేదు. " అంది జాగృతి. సమర్థ్ చేసిన పనికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. 
 
"అలా నాకు. నా తప్పు నాకు అర్ధమయ్యింది. సారీ. ఇంకెప్పుడూ నిన్ను తక్కువ చెయ్యను. ఎంత కష్టపడి అందరినీ మన పెళ్ళికి ఒప్పించానో తెలుసా? నిన్ను తప్ప ఇంకెవ్వరిని నేను చేసుకోననంటే, మా అమ్మకి కూడా నా మీద కోపం వచ్చింది. " అని జాగృతి చేతులుపట్టుకుని బతిమాలాడు సమర్థ్. 



'సమర్థ్ కి గొప్పలు ఎక్కువ. మాటతీరు కూడా సరిగ్గా లేకపోయినా, ఇంతలా ఇష్టపడుతున్నాడుకదా. పెళ్ళి తరువాత నన్ను పూర్తిగా అర్ధం చేసుకుంటాడులే. ' అనుకుని సమర్థ్ తో వాళ్ళ అక్క పల్లవి ఇంటికి వెళ్ళింది జాగృతి. 



పెళ్ళిచూపులకి పల్లవి రాలేకపోయినందువల్ల, జాగృతి, పల్లవిని కలుసుకోవడం అదే మొదటిసారి. సమర్థ్ బండి మీద నుండి దిగుతున్న జాగృతిని చూస్తూనే, "పెళ్ళికిముందే, బండి మీద షికారులు కొడుతున్నారు ఇద్దరూ. " అంటూ రాధకి ఫోన్ చేసి చెప్పింది పల్లవి. 'ఇదేమిటి? మొదటి పరిచయంలోనే నా గురించి వాళ్ళ అమ్మకి కంప్లైంట్ చేస్తోందీవిడ?' అనుకుంది జాగృతి. 



కాసేపటి తరువాత, సమర్థ్ కి ఫోనిస్తూ, "అమ్మ నీతో మాట్లాడతానంది. " అంది పల్లవి. రాధ ఏమంటుందా అని భయపడుతూ, ఫోన్ తీసుకున్నాడు సమర్థ్. 



"అవును వచ్చిందమ్మా.. ఊరికనే కాదు.. ఇంటర్వూస్ ఉన్నాయని వచ్చింది.. మేము ఎక్కడా తిరగలేదు.. లేదు, భుజం మీద చెయ్యి వెయ్యలేదు.. దూరంగా ముళ్లమీద కూర్చున్నట్టు కూర్చుంది. నిజం. నమ్ము. " అన్నాడు సమర్థ్, రాధతో మాట్లాడుతూ. సమర్థ్ చెప్తున్న సమాధానాల్ని బట్టి, రాధ ఎం అడిగి ఉంటుందో అర్ధమయ్యింది జాగృతికి. 'ఈవిడకి నా మీద బాగానే అనుమానాలు ఉన్నట్టున్నాయి. ' అనుకుంది మనసులో. 



తరువాత జాగృతి కి ఫోన్ ఇచ్చాడు సమర్థ్. "అమ్మ నీతో మాట్లాడతానంటోంది. జాగ్రత్త. " అన్నాడు. జాగృతితో కాబోయే అత్తగారితో మాట్లాడడం అదే మొదటిసారి. పెళ్ళిచూపుల్లో, జాగృతిని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు రాధ. సమర్థ్ భయాన్ని చూసి, రాధతో మాట్లాడడానికి జాగృతికి కూడా భయంవేసింది. 



రాధ, జాగృతితో, "నా కొడుకు నచ్చలేదా నీకు? " అని అరుస్తూ అడిగింది. రాధ ఆ సమయంలో, అలాంటి ప్రశ్న అడుగుతుందని ఊహించలేదు జాగృతి. ఏం చెప్పాలో అర్ధంకాక, సమర్థ్ ని, పల్లవిని చూసింది. సమర్థ్, పల్లవి కూడా జాగృతి ఏం చెప్తుందా అని చూసారు. 



"ముందు మా వాడి బండి ఎక్కను అన్నావంట. ఎక్కిన తరువాత, దూరంగా ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చున్నావట. భుజం మీద చెయ్యి వెయ్యమన్నా వెయ్యలేదట!! ఏంటి చెప్పు? ఏం తక్కువ నా కొడుకుకి? నువ్వేదో పెద్ద అందగత్తెనని, చదువుకున్నదానివని, ఉద్యోగస్తురాలినని ఫీల్ అయిపోతున్నావేమో. నాకొడుకు, నిన్ను చేసుకుంటాననడం నీ అదృష్టం. నీకన్నా మంచి సంబంధాలు చాలా వచ్చాయి మాకు. 25 లక్షలు ఇస్తామంటూ ఒకళ్ళు ఇంకా మా వెనకపడుతున్నారు. ఆ పిల్ల చక్కగా 10th పాస్ అయ్యింది. నీలాగా బాగ్ ఊపుకుంటూ ఆఫీసుకి వెళ్ళదు. చక్కగా ఇంటిపట్టునే ఉంటుంది. కడుపొచ్చినా నేను చూడక్కరలేదు. చెప్పు. ఏం చెయ్యమంటావ్? పెళ్ళి కాన్సల్ చేసెయ్యమంటావా?" అంది రాధ గదమాయిస్తూ. బిత్తరపోయింది జాగృతి. 



'ఈవిడేంటి ఇలా మాట్లాడుతోంది? అందుకేనేమో సమర్థ్ ఈవిడని పెళ్ళిచూపుల్లో మాట్లాడనివ్వలేదు. సమర్థ్ తో మాట్లాడాడుతూ, నా మీద అనుమానాలు వ్యక్తం చేసినావిడ, ఇప్పుడు పెళ్ళికి ఎందుకు ఎక్కనన్నావని, ఎక్కి ఎందుకు దూరంగా కూర్చున్నావని, భుజంమీద చెయ్యవెయ్యలేదని తిడుతోందేమిటి? ఇంజనీరింగ్ చదివి, ఉద్యోగం చేస్తున్న నా కంటే, 10th చదివి, ఇంట్లో ఉండే పిల్లని మంచి సంబంధం అంటోందేమిటి? పెళ్ళిచూపుల్లో, సమర్థ్ అన్న మాటలు ఈవిడన్నమాట అయితే?' అనుకుంది జాగృతి. జాగృతికి, రాధ మాటతీరు, ఆలోచన తీరు అర్ధం కాలేదు. 



జాగృతి సమాధానం చెప్పకపోవడంతో విసిగిపోయిన రాధ, భర్త మాణిక్యాలరావుకి ఫోన్ ఇచ్చి, "నేను ఈ పెళ్ళి కాన్సల్ చేయించేస్తాను. ఇంటర్వ్యూకి వచ్చిందంట. " అని కోపంగా వెళ్ళిపోయింది. పరిస్థితి అర్ధంచేసుకున్న సమర్థ్, జాగృతి చేతిలోని ఫోన్ తీసుకున్నాడు. 



సమర్థ్, మాణిక్యాలరాతో మాట్లాడుతూ, "పెళ్ళికి ముందే అన్నీ అయిపోవడమేమిటి నాన్నా?.. ఏం జరిగింది మా ఇద్దరి మధ్య?.. ఏం మాట్లాడుతున్నారు మీరు?.. అసలు అక్క, అమ్మకేం చెప్పింది? అమ్మ మీకేంచెప్పింది?" అని అడిగాడు తలపట్టుకుంటూ. 



"అదంతా ఇప్పుడెందుకులేకానీ, నీకో ఫోటో ఈమెయిల్ చేశాను. చూసావా? ఆడపడుచు కట్నంగా వచ్చిన డబ్బుతో, అక్కకో నగ కొన్నాం. అక్కకి చూపించు. మీ ఆవిడకి కూడా అలాంటిదే కొన్నాం పెళ్ళిలో పెట్టడానికి. ఆవిడకి కూడా చూపించు. నీతోనే తిరుగుతోంది కదా. ఉంటాను. " అన్నాడు మాణిక్యాలరావు. సమర్థ్ కి, జాగృతి కి వాళ్ళేం తప్పు చేసారో అర్ధంకాలేదు. 



సమర్థ్, మాణిక్యాలరావు పంపిన ఫోటోని పల్లవి కి, జాగృతికి చూపించాడు. పల్లవి, ఆ ఫోటోని చూసి, "ఇద్దరికీ ఒకలాంటిదేనా? నాకేమి స్పెషల్ గా చేయించలేదా?" అంటూ కోపంగా వెళ్ళిపోయింది. జాగృతి చూస్తూనే, మొహం తిప్పేసుకుంది జాగృతి. షర్ట్ బటన్స్ కిందవరకూ విప్పుకుని, మేడలో నగ వేసుకుని, షాపులో మాణిక్యాలరావు తీయించుకున్న ఫోటో అది. 'సమర్థ్ కి రౌడీలా షర్ట్ బటన్స్ కిందవరకూ ఇప్పుకునే అలవాటు ఇక్కడనుండి వచ్చిందన్నమాట' అనుకుంది జాగృతి. 



కోబోయే అత్తగారింట్లోవాళ్లందరి మాటతీర్లకి, ప్రవర్తనలకి జాగృతికి మతిపోయింది. 'నలుగురికి నలుగురూ ఇలా ఉన్నారేంటి? నాకిది సరైన సంబంధమేనా? ఈ పెళ్ళి జరిగితే, ఇలాంటి వాళ్ళ మధ్య నేను బతకగలనా? మా వాడు నచ్చలేదా అని రాధ అడిగినప్పుడు నచ్చలేదని చెప్పేసుండుంటే బాగుందేమో! ఈ గోల తప్పేది. ' అనుకుంది. 



చెన్నై వెళ్ళగానే, జరిగినదంతా లతకి వివరంగా చెప్పింది జాగృతి. "ఈ సంబంధం నాకు కరెక్ట్ కాదనిపిస్తోందమ్మా. వాళ్ళ మాటతీర్లు, ఆలోచనలు, ప్రవర్తన ఏదీ నాకు నచ్చలేదు. నేను ఆ ఇంట్లో ఇమడలేననిపిస్తోంది. పెళ్ళి కాన్సల్ చెయ్యండమ్మా. ప్లీజ్. " అని బతిమాలుకుంది. 



"నువ్వు చెప్పిందంతా నాకు అర్ధమయ్యింది. కానీ, మీ నాన్నగారు పోయిన సంవత్సరంలో నీ పెళ్ళి చెయ్యాలి. అందరికీ పెళ్ళి శుభలేఖలు కూడా పంచేసాం. ఇప్పడు నువ్వు వద్దన్నా, కాబోయే మీ అత్తగారు కాన్సల్ చేస్తానన్నా, అందరి పరువులు పోతాయి. అబ్బాయికి నువ్వంటే ఇష్టమని నీకు కూడా తెలుసు కదా. పెళ్లయ్యాక, నీ గురించి మారతానని కూడా చెప్పదన్నావు కదా. నిన్ను ఇష్టపడినవాడు నీకోసం తప్పకుండా మారతాడు. నిన్నంకా బాగా అర్ధం చేసుకుంటాడు. మిగతావాళ్లందరూ ఎలా ఉంటే నీకెందుకు? కంగారుపడకు. అంతా మంచే జరుగుతుంది. " అని జాగృతికి నచ్చచెప్పింది లత. 



సమర్థ్ కి, జాగృతికి పెళ్ళి జరిగింది. 



******************************************************
'20 ఏళ్ళు ఇలాంటి మనుషుల మధ్యలో, అనుమానాల మధ్యలో, ఎలా బతికానా?' అనుకుంది జాగృతి. 






***
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: