Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#61
ప్రహ్లాదుడు చెప్తున్న విషయములను విని హిరణ్యకశిపుడు కోపించిన వాడై గురువుల వంక చూశాడు. మేమేమీ చెప్పలేదు మహా ప్రభో అన్నట్లు హడలిపోయి చూస్తున్నారు చండామార్కులు. “ఈ పద్యములన్నీ నీకు ఎక్కడినుంచి వచ్చాయి? శ్రీమన్నారాయణుని సేవించాలని ఎలా చెప్తున్నావు? నీకీ భక్తి ఎలా కలిగింది? వాళ్ళెవరో నాకు చెప్పు. వాళ్ళ సంగతి చూస్తాను” అన్నాడు. 
ప్రహ్లాదుడు అన్నాడు "నాన్నా నీలాంటి వాడికి శ్రీమన్నారాయణుని గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు అని చెప్పినా నీకు అర్థంకాదు. నీ కళ్ళను మూసుకున్నావు. అజ్ఞానంలో పడిపోయిన వారికి చెపితే తలకెక్కుతుందా! అజ్ఞానావస్థలో కోరికోరి కూరుకుపోతూ సంసారము సత్యమని నమ్మే నీలాంటి అహంకార పూరితమయిన వ్యక్తులకి ఎవరు చెప్పారని చెపితే నీకు అర్థం అవుతుంది?” అని అన్నాడు.

ఈతని మాటలు వినేసరికి హిరణ్యకశిపునికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. రాక్షసులను పిలిచి “వీడిని చంపండి. వీడిని తీసుకెళ్ళి మంచులో నిలబెట్టండి, కొన్నాళ్ళు అన్నం ఇవ్వడం మానేయండి. ఆ తరువాత వీడి నవరంధ్రములు మూసేసెయ్యండి. ఆ తరువాత నేను నా మాయను చూపెట్టి భయపెడతాను. మరుగుతున్న నూనెలో వేయండి. పర్వత శిఖరముల మీదనుండి కింద తొయ్యండి. ఏనుగులతో తొక్కించండి. సముద్రంలో పారెయ్యండి” అన్నాడు. 

తనని శూలంపెట్టి రాక్షసులు పొడిచేస్తుంటే, పర్వత శిఖరం మీదనుంచి కింద పారేస్తుంటే, సముద్రంలోకి విసిరేస్తుంటే, కిందపడేసి ఏనుగుల చేత తొక్కేస్తుంటే, రాక్షసులలో, తండ్రిలో, అందరిలో, అంతటా, శ్రీమన్నారాయణుని చూసి పొంగిపోతుంటే గుప్తరూపంలో స్వామి లక్ష్మీ సహితుడై వచ్చి ప్రహ్లాదుని పట్టుకున్తున్నాడు. ఇంతమంది కలిసి కుమ్మితే ఏమీ జరగడం లేదు. ఈశ్వరుడిని నమ్ముకున్న వాడికి ఏమి లోటు ఉంటుంది. రాక్షసులు అలా హింసిస్తుంటే ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నవాడు అక్కడే నిలబడి నారాయణ జపం చేస్తుంటే అంతకంతకీ తేజోవిరాజితుడు అయిపోతున్నాడు. హిరణ్యకశిపుడికి ఒక్కొక్క వార్త వస్తోంది. ప్రహ్లాదుడు ప్రకృతికి అతీతమయిన స్థితిని పొందాడు. తన వాడయిన కారణం చేత, తనయందు భక్తి కలిగిన కారణం చేత ఈశ్వరుడు ఆనాడు ప్రహ్లాదుడిని రక్షించుకున్నాడు.

 హిరణ్యకశిపుడు రాత్రింబవళ్ళు దీనవదనంతో కూర్చుని ఉన్నాడు. ప్రహ్లాదుని చంపడానికి ఎన్ని ఉన్నాయో అన్నింటిని ప్రయోగించాడు. కానీ అతడు చచ్చిపోలేదు. కనీసం నీరసపడలేదు. పైగా తాను ప్రయత్నించే కొలదీ పిల్లవాడు ఎక్కువ తేజమును పొందుచున్నాడు. ఇప్పుడు గురువులు ‘బెంగ పెట్టుకోవద్దు. చావుతో సమానమయిన మందు ఒకటి మావద్ద ఉంది. వీనిని తీసుకువెళ్ళి అది వేసేస్తాము. ఈ పిల్లవాడికి వయస్సు వస్తోంది కాబట్టి చాలా గొప్పగా రకరకాలుగా కామశాస్త్రాన్ని బోధ చేసేస్తాము. వీడు భ్రష్టుడు అయిపోతాడు. సంసరమునండు అనురక్తి కలుగుతుంది’ అని చెప్పి పిల్లవాడిని తీసుకువెళ్ళి అతనికి శాస్త్ర బోధ ప్రారంభించారు. పరమ సంతోషంగా కూర్చుని గురువులు చెప్పినది చక్కగా నేర్చుకుంటున్నాడు. 

ఒకరోజున గురువులు తమ గృహకార్యములను నిర్వర్తించుటకు లోపలికి వెళ్ళారు. వెంటనే ప్రహ్లాదుడు పిల్లలందరినీ పిలిచి “ఒరేయ్ మీరు ఈ ఆటలు ఎంతకాలం ఆడతారు కానీ నేనుమీకొక విషయం చెప్తాను. మీరందరూ కూర్చోండి. అని మనకి ఆయుర్దాయం నూరు సంవత్సరములు. రాత్రి అయితే నిద్రపోతాము. కాబట్టి ఏభై ఏళ్ళు నిద్రలో పోతుంది. ఇరవై ఏళ్ళు శిశువుగా బాల్యంలో పోతుంది. ఇంకా మిగిలింది ముప్పది ఏళ్ళలో మన కోరికలన్నీ అక్కర్లేని వాటికన్నింటికీ తగుల్కొని అరిషడ్వార్గాలకి లొంగిపోతాయి. నా మాట వినండి. ఈ పంచ భూతములను, మూడు గుణములను, ఇరవై ఏడు తత్త్వములను నిర్మించి మాయచేత పరమాత్మ ఈశ్వర దర్శనం కాకుండా కప్పి ఉంచాడు. ఆత్మ ఒక్కటే స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆత్మా దర్శనాభిలాషులు అవండి. నామాట నమ్మండి" అన్నాడు. వాళ్ళు "ఈపాఠం చాలా గమ్మత్తుగా ఉంది. నువ్వు మాతోనే కలిసి ఇక్కడ చేరావు. మాతోనే చదువుకున్నావు. గురువులు మాకేమి చెప్పారో నీకు కూడా అదే చెప్తున్నారు. గురువులు చెప్పని విషయములు నీకు ఎవరు చెప్తే వచ్చాయి?” అని అడిగారు. అపుడు ప్రహ్లాదుడు "మహానుభావుడయిన నారదుడు చెప్పాడు" అని బదులిచ్చాడు. అపుడు వాళ్ళు "నారదుని నీవు ఎప్పుడు కలుసుకున్నావు? ఎప్పుడు నేర్చుకున్నావు?" అని అడిగారు.

హిరణ్యకశిపుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు గర్భిణి అయిన లీలావతిని చెరపట్టి ఇంద్రుడు ఈడ్చుకుపోతున్నాడు. నారదుడు ఎదురువచ్చి "మహాపతివ్రత అయిన కాంతను ఎందుకు చెరపట్టి తీసుకువెళుతున్నావు” అని అడిగాడు. ఆయన "నాకు ఆవిడ మీద క్రోధం లేదు. ఆవిడ గర్భమునందు హిరణ్యకశిపుని తేజం ఉన్నది. వాడు తపస్సుయందు మడిసిపోతాడని మేము అనుకుంటున్నాము. ఈలోగా బిడ్డపుట్టి వాడు కూడా పెరిగి పెద్ద వాడయితే చాలా ప్రమాదం. అందుకని ఆ బిడ్డడు పుట్టగానే సంహారం చేసి ఈమెను విడిచిపెడతాను" అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు "నీకేమి తెలుసు! ఆవిడ గర్భంలో మహావిష్ణు భక్తుడయిన వాడు ఉన్నాడు. వాడు జన్మచేత భక్తిజ్ఞాన వైరాగ్యములతో పుడుతున్నాడు. అటువంటి మహాపురుషుని కథ వింటే తరించిపోతాము. అందుకని లీలావతిని నా ఆశ్రమమునకు తీసుకువెడతాను" అని తీసుకు వెళ్ళి అక్కడ వేదాంత తత్త్వమును ప్రబోధం చేశాడు. చెబుతున్నప్పుడు లీలావతి వింటూ ఉండేది. చిత్రమేమిటంటే విన్న లీలావతి మరిచిపోయింది. కడుపులో వున్న పిల్లవాడికి జ్ఞాపకం ఉండిపోయింది. అలా జ్ఞాపకం ఉండడానికి కారణం తన గొప్పతనమని ప్రహ్లాదుడు చెప్పలేదు. "మా అమ్మ మళ్ళీ వచ్చి హిరణ్యకశిపుడితో సంసారంలో పడిపోయి భోగభాగ్యములలో నారడుచు చెప్పిన బోధ మరిచిపోయింది. అందుకు కారణం గురువుల అనుగ్రహం మా అమ్మయందు లేదు. గురువుల అనుగ్రహం, దైవ అనుగ్రహం నాయందు ఉన్నది. అందుకని అమ్మ కడుపులో విన్న నాకు నిలబడిపోయింది. గురువు అనుగ్రహం, దైవానుగ్రహం జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూశారా" అన్నాడు.

అపుడు పిల్లలందరూ లేచి నారాయణ భజన చేయడం మొదలు పెట్టారు. లోపలనుంచి గురువులు బయటకు వచ్చారు. ప్రహ్లాదుడిని పట్టుకుని జరజర ఈడుస్తూ హిరణ్యకశిపుని వద్దకు తీసుకువెళ్ళి "అయ్యా, తులసివనంలో గంజాయి పుట్టినట్లు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు. వీడికి పాఠం చెప్పడం దేవుడెరుగు, వీడు రాక్షస బాలకులనందరిని పాడుచేసేశాడు. అందరిని నారాయణ భక్తులుగా చేసేస్తున్నాడు" అన్నారు. ఇలా అనేసరికి హిరణ్యకశిపుడు "ఎవరి దిక్కు చూసూకుని ఎవరి బలం చూసుకొని నీవు ఇలా ప్రవర్తిస్తున్నావు" అని కుమారుని చూసి అడిగాడు.

బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్!
బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్రా!!

"నాన్నా, నీలో బలానికి కారణమెవడో వాడే నాలో బలమునకు కూడా కారణం. బలహీనుడయిన వానిలో వున్న కొంచెం బలానికి కారణం ఎవరో లోకములను సంపాదించిన మహాబలవంతుల బలమునకు కారణమెవడో వాడు నాకు దిక్కు" అన్నాడు. "ఏమిరా, వాడు దిక్కు దిక్కు అంటున్నావు కదా, వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పగలవా?" అని హిరణ్యకశిపుడు అడిగాడు. 
"నాన్నా, ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతావేమిటి? ఇదొక వెర్రి ప్రశ్న. 

ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుం 
డెందెందు వెదకి చూసిన నందందే కలడు దానవాగ్రణి వింటే!!

జ్ఞాననేత్రంతో చూసే దంతి కనపడదు. దారువు కనపడుతుంది. ఆభరణం కనపడదు. స్వర్ణం కనపడుతుంది. పాత్ర కనపడదు. మట్టి కనపడుతుంది. జ్ఞాన నేత్రంతో చూడు. ఉన్నది నారాయణుడు ఒక్కడే. అంతటా స్వామి ఉన్నాడు. నువ్వు చూడడానికి ప్రయత్నం చెయ్యి" అన్నాడు. ఒక ప్రక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవశ్యం వచ్చేసి పొంగిపోతూ ప్రహ్లాదుడు నాట్యం చేస్తూ —

కలడంబోధి, గలండు గాలి, గలడాకాశంబునం, గుంభినిం 
గల, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం
గల, డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటం 
గల, దీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల నీ యా యెడన్!!

"నాన్నా, ఈశ్వరుడు ఎక్కడలేడు అని అడుగు. ఈశ్వరుడు లేని ప్రదేశం లేదు. రాత్రులందు పగలందు, ఆకాశమునందు పైన మధ్యలో సర్వభూతములయందు అగ్నియందు ఓంకారము నందు సమస్త ప్రపంచమునందు నిండి నిబిడీ కృతమై ఉన్నాడు. ఆయనలేని ప్రదేశం లేదు" అనేసరికి హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
ప్రహ్లాదుడి మాటలకు హిరణ్యకశిపునికి చెప్పలేనంత ఆగ్రహం వచ్చింది. అటువంటి స్థితిలో హిరణ్యకశిపుడు ఒక స్తంభము వైపు వేలు చూపించి ‘ఈ స్తంభమునందు ఉన్నడా?’ అని అడిగాడు. అడిగితే ప్రహ్లాదుడు ‘అనుమానమా’ అన్నాడు. ‘అయితే చూపించు’ అన్నాడు. ‘నేను చూపించడమేమిటి – నువ్వు అడుగు వస్తాడు’ అన్నాడు ప్రహ్లాదుడు.

వెంటనే హిరణ్యకశిపుడు సింహాసనం మీదనుంచి దిగి గద ఎడమచేతితో పట్టుకుని కుడి అరచేతితో స్తంభం మీద ఒక దెబ్బ కొట్టాడు. అందులోంచి ఒక భయంకరమయిన మెరపు మెరిసింది. అది ప్రళయకాలంలో మెరిసే మెరపు ఎలా ఉంటుందో అటువంటి మెరపు వచ్చింది. ఆ మెరుపు కాంతికి అక్కడ ఉన్న వాళ్ళంతా స్పృహతప్పి పడిపోయారు. ప్రళయకాలమునందు పిడుగులు పడితే ఎటువంటి చప్పుళ్ళు వస్తాయో అంట భయంకరమయిన ధ్వనులు వచ్చాయి. మహానుభావుడు అపారమయిన తేజోవంతమయిన పాదములతో, పాదములకు అలంకరింపబడిన మణి మంజీరములతో, బలిష్ఠమయిన తొడలతో, గుండ్రని పిక్కలతో, అలంకరింపబడిన పట్టు పీతాంబరంతో, దానిమీద పెట్టబడిన మొలనూలుతో, మొలనూలు నుంచి వస్తున్న చిరుగంటల సవ్వడితో, పిడికిలితో పట్టుకోవడానికి వీలయిన సన్నని నడుముతో, గుండ్రంగా తిరిగి లోపలికి వెళ్ళిన నాభితో, కఠినమయిన శిలవంటి విశాలమయిన వక్షస్థలంతో, అనంతమయిన బాహువులతో, శంఖ చక్ర గదా పద్మ తోరణములను గండ్ర గొడ్డలిని పట్టుకున్న వాడై, చక్కటి పొడుచుకు వచ్చిన చుబుకముతో, గాలికి అల్లల్లాడే నవపల్లవము ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి అదురుతున్న రోషముతో కూడిన పెదవితో, ముత్యాలవంటి దంతపంక్తితో, మందరపర్వతం గుహ ఎలా ఉంటుందో అటువంటి నోటితో, నాసికా రంధ్రములతో, తూర్పుకొండ మీద ప్రకాశిస్తున్న రెండు సూర్యులా అన్న నేత్రములతో, విశాలమయిన ఫాలభాగముతో, అంతటా ఆవరించిన ఎర్రటి జుట్టుతో, నవరత్న ఖచితమయిన కిరీటంతో అటూ ఇటూ శిరస్సును కదుపుతుంటే ఆయన రోమములు ఆకాశమంతా వ్యాపించి కొడితే ఆకాశమునందు సంచరించే సిద్ధుల విమానము అన్నీ క్రింద పడిపోయాయి. ఆనాడు స్తంభంలోంచి బయటకు వచ్చి గర్జన చేసి ఘార్ణిల్లితే ఆ ధ్వనులకు సముద్రములు తిరుగుడు పడ్డాయి. భూమి కంపించి బద్దలయి పోయింది. ఎక్కడి వాళ్ళక్కడ సంభీభూతులై ప్రళయం వస్తోందని అనుకున్నారు. 
ఇటువంటి మూర్తిని చూసి కూడా హిరణ్యకశిపుడు దుస్సాహసం చేశాడు. కత్తి పట్టుకుని స్వామిమీద పడ్డాడు.

స్తంభంలోంచి బయటకు వచ్చి చంద్రహాసమును దూస్తున్న హిరణ్యకశిపుని ఆనాడు తాను ఎలా ప్రతిజ్ఞచేశాడో అలా కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకను నాగుపాము ఒడిసి పట్టినట్లు తన ఎడమచేతితో హిరణ్యకశిపుని తొడ పట్టుకొని గడప దగ్గరకి తీసుకు వెళ్ళి ప్రళయకాలంలో వచ్చే ధ్వనిలాంటి గర్జన చేస్తూ ఆ గడప మీద కోర్చుని తన తొడల మీద పడేసి భయంకరమయిన కనుబోమలను వేయి ఇంద్రధనుస్సులను ఒక్కసారి విరిచినట్లు ముడివేసి ఘోరమయిన స్వరూపంతో ఇలా చూస్తుంటే మెరిసిపోతున్న దంష్ట్రలు, ఆ నోరు, కాలనాగు వేలాడుతున్నట్లు వున్న నాలుక, పెద్ద గోళ్ళు అటువంటి స్వామి తన బాహువుల నెట్టి తన గోళ్ళు చూపితుంటే ఆయన స్వరూపమును చూసి కాళ్ళుచేతులు వేలాడేసి ఆయనకు లొంగిపోతే, ఆగ్రహంతో, తన భక్తుడిని ఇన్ని కష్టములు పెట్టాదన్న క్రోధంతో మాట తప్పకుండ, ఇంట్లో కాదు బయట కాదు మధ్యన గడప మీద. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు తన తొడల మీద, అస్త్రము కాదు శస్త్రము కాదు ప్రాణము ఉన్నది కాదు ప్రాణము లేనిది కాదు గోళ్ళచేత. క్రిందకాదు పైన కాదు తొడల మీద, మనిషి కాదు జంతువూ కాదు నరసింహావతారంతో, భయంకరమయిన స్వరూపంతో, విశేషమయిన క్రౌర్యంతో ఆ గోళ్ళను పొట్టలోకి దింపి భేదించి గండ్ర గొడ్డలి పెట్టి ఉరః పంజరమును బద్దలు కొట్టి, హృదయ క్షేత్రమును చేతితో పట్టుకుని గుండె కింద నలిపి వేసి ఆ కండలు తెంపి ముక్కలు చేసి తుంపి అవతల పారేసి, నెత్తురు తీసి దోసిళ్ళతో నోట పోసుకుని ప్రేగులు తీసి మెడలో వేసుకుని ప్రళయ గర్జన చేస్తూ నృసింహావతారం నిలబడింది.

ఆయన వెళ్ళి సింహాసనం ఎక్కుతుంటే అసుర గణములు మీద పడ్డాయి. అనేకమయిన చేతులు పైకెత్తి ఆయుధములతో కొన్ని కోట్ల అసురులను ఒక్కడే మట్టుపెట్టాడు. సింహాసనం ఎక్కి పాదపీఠంమీద పాదములను వుంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు కింపురుషులు అందరూ వచ్చి స్వామిని అనేకవిధముల స్తోత్రము చేశారు. కానీ ఆయన ఘార్ణిల్లుతున్న శబ్దమునకు ఆయన చేస్తున్న ప్రళయ గర్జనలకు ఎవ్వరూ తట్టుకోలేక పోయారు. ఎవ్వరూ దగ్గరకు వెళ్ళలేక అమ్మవారిని చేరి "అమ్మా, నీవు నిత్యానపాయినివి. నీవు మాత్రమే ఆ స్వామివారి స్వరూపమునకు ప్రళయ శాంతిని ఉపశాంతిని చేయగలవు. నీవు స్వామివారి దగ్గరకు వెళ్ళు" అని కోరారు. ఆవిడా అంది "ఇదేదో ప్రళయకాలంలో ప్రకాశించే సూర్యబింబంలా ఉన్నది కానీ నేను సేవించే స్వామివారి ముఖ మండలంలా లేదు. నా స్వామిలా ఎప్పుడూ నవ్వుతూ ఉండే దయారసంతో కూడిన ముఖం కాదు. ఇది భార్య దగ్గరకి వెళ్ళడానికి సాహసించే మూర్తి కాదు" అంది.

అపుడు బ్రహ్మాదులందరూ స్తోత్రం చేశారు. అయినా ఆయన చేసిన గర్జనలు ఆగలేదు. అపుడు బ్రహ్మగారు ప్రహ్లాదుడిని పిలిచి "నాయనా, నరసింహుడు భక్త పరాధీనుడు. నీవు వెళ్ళు" అన్నారు. ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల దగ్గర చాలా తేలికగా సాష్టాంగ పడిపోయాడు. ఇంత ధ్వని చేస్తున్న వాడు, ప్రశాంత పడిపోయి పెద్ద చిరునవ్వు నవ్వి, ‘ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వదించి తలమీద చేయివేసి రెండుచేతులతో పట్టుకు తీసుకువచ్చి తన తొడమీద కూర్చో పెట్టుకున్నాడు. నిజంగా ప్రహ్లాదుడు ఏమి అదృష్టం పొందాదండి!

ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడు "స్వామీ నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చేయలేకపోయారు. వేదము తాను ఇక నిన్ను ఆవిష్కరించ లేనని వెనుదిరిగింది. అటువంటి నిన్ను రాక్షస వంశములో పుట్టిన బాలుడిని నేను ఏమి స్తోత్రం చేస్తాను? నిన్ను చేరడానికి. నేను తపం చేశాను, యజ్ఞం చేశాను లేదా ఏదో క్రతువు చేశాను. ఈ కర్మచేశాను అంటే అలా నీవు కర్మలకి లొంగిపోయే వాడవు కావు. ఆ చేసిన కర్మల చేత హృదయ క్షేత్రమునందు శుద్ధి ఏర్పడి వైరాగ్యము ఏర్పడి ఈశ్వరుని సంతతము ధ్యాన నిష్టయందు కొలిచిన వాడెవడో అటువంటి వాడికి లొంగిపోయే స్వరూపం ఉన్నాడివి. అటువంటి స్వామివి ఇవాళ నాయందు కరుణించావు" అన్నాడు. ఈ మాటలకు ప్రసన్నుడయి పోయి ఆరోజున నరసింహ స్వామి అన్నారు – "ప్రహ్లాదా, ఇలా నన్ను మెప్పించిన భక్తుడు లేడు. నీకేమి వరం కావాలో కోరుకో" అన్నాడు. అపుడు ప్రహ్లాదుడు "అందరూ నీ రూపం చూసి భయపడ్డారు. నేను నీరూపం చూసి భయపడలేదు. నాకు నీవెప్పుడూ తండ్రివే. నేను సంసారమునకు భయపడతాను, కామక్రోధములకు భయపడతాను. ‘నేను’ ‘నాది’ అనే భావనలకు భయపడతాను. నాకు వరం ఇస్తానని నన్ను మరల మభ్యపెట్టాలని చూస్తున్నావా తండ్రీ! నాకేమీ వద్దు. సంతతము నీపాదాంబుజ సేవ కటాక్షించు. నీ నామము చెప్పుకునే అదృష్టమును కటాక్షించు. నీ కథలు వినే అదృష్టమును కటాక్షించు. నాకింకేమీ వద్దు" అన్నాడు.

 అపుడు స్వామి "అసలు నీలాంటి భక్తుడు ఎక్కడ వున్నాడురా, నిన్ను చూసి పొంగిపోతున్నాను. నీవు ఏదో ఒకటి అడగకపోతే నేను నాకు తృప్తి ఉండదు. నా తృప్తి కోసం ఏదో ఒకటి అడగవలసింది" అన్నారు. అపుడు ప్రహ్లాదుడు "ఎంత కాదన్నా హిరణ్యకశిపుడు నా తండ్రి, అజ్ఞాని. తండ్రీ అతడు ఎన్ని నీచ యోనులలోకి వెడతాడో! అలా వెళ్ళకుండా నా తండ్రిని నీ దగ్గరికి చేర్చుకుంటే నా తండ్రి కాబట్టి, నాకు జన్మనిచ్చిన వాడు కాబట్టి నేను సంతోషిస్తాను" అన్నాడు. అంటే స్వామి పెద్ద నవ్వు నవ్వి "ప్రహ్లాదా! నీ చరిత్రము ధన్యము. ఎంత గొప్ప వరం అడిగావు. ఏనాడు నీ తండ్రి నేను కోరలు విప్పి పళ్ళు చూపిస్తూ గోళ్ళు అతని కడుపు పైనుంచి నా నేత్రములతో చూస్తూ వుంటే, అతి దగ్గరగా మహర్షులు, మునీంద్రులు కూడా చూడని నా రూపమును తేజోహీనుడై అలా చూస్తూ ప్రాణములను వదిలాడో ఆనాడే నాకు దగ్గర అయిపోయాడు. అందుకని నీవు నీ తండ్రి గురించి బెంగ పెట్టుకోవద్దు. రాజ్యపాలన చేసి వంశమును వృద్ధిలోకి తెచ్చుకో" అని స్వామి వారు ఆనాడు మనకందరికీ గొప్ప వరమును కటాక్షించారు. అదే మనందరం కూడా తప్పకుండా స్మరించవలసిన పద్యం.

“శ్రీ రమణీయమైన నరసింహ విహారము నింద్రశత్రు సం
హారము బుణ్య భాగవతుడైన నిశాచరనాధ పుత్ర సం
చారము నెవ్వడైన సువిచారత విన్న పఠించినన్ శుభా
కారము తోడ నే భయము గల్గని లోకము జెందు భూవరా!!

ఈ ప్రహ్లాదోపాఖ్యానమును ఎవరు పరమ భక్తి శ్రద్ధలతో చేతులు కైమోడ్చి ఈశ్వరుడు ఉన్నాడు అన్న పూనికతో వింటున్నారో, ఉగ్రనరసింహ మూర్తియై తన భక్తులను బాధపెట్టిన వాడి పట్ల కోపము తెచ్చుకున్న స్వామి మూర్తి వర్ణనను వింటున్నారో, మళ్ళీ భక్తుడు చేసిన స్తోత్రమునకు ప్రసన్నుడయిన మూర్తి కథను విన్నారో, అటువంటి వారికి ఇంక యమధర్మరాజు దర్శనము ఉండదు. వారికి ఇక్కడే నేను భక్తిని కర్మని వైరాగ్యమును జ్ఞానమును ఇచ్చి, జ్ఞానము చేత మోక్షమును ఇచ్చి వారందరినీ తరింపచేస్తాను అని అభయం ఇచ్చారు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply
#63
Thanks sir Namaskar
[+] 1 user Likes sri7869's post
Like Reply
#64
చాగంటి గారి మహా భారతం కానీ చాగవతం ప్రవచనం ఆడి క్లిప్ ఉంటే (పూర్తి ) నాకు పంపగలరు ప్లీజ్
[+] 1 user Likes Yuvak's post
Like Reply
#65
(14-09-2023, 01:44 PM)Yuvak Wrote: చాగంటి గారి మహా భారతం కానీ చాగవతం ప్రవచనం ఆడి క్లిప్ ఉంటే (పూర్తి ) నాకు పంపగలరు ప్లీజ్

వీడియోలు యూట్యూబులో వున్నాయండి. ఎక్కడికీ వెళ్ళనక్కరలేదు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)