17-04-2019, 09:53 AM
'వికారి' నామ సంవత్సర రాశిఫలాలు...
౧ మేషం :
ఆదాయం -14 , వ్యయం - 14
రాజపూజ్యం - 3 - అవమానం - 6
ఆదాయం బాగానే ఉన్నా దానికి తగ్గా ఖర్చుల తగలడతాయి. కొన్ని కొన్ని చికాకులతో కకావికలంగా ఉంటుంది . చెయ్యి ఎంత దురద పెట్టినా సరే - అప్పులివ్వడాలు - మధ్యవర్తిగా ఉండటాలు చేయకుంటే మంచిది. సాధ్యమైనంత వరకూ చేతులు జేబులో పెట్టుకు తిరగటం మంచిది. ప్రయాణాల్లో ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలని సూచన హెచ్చరిక. స్పీడు గా వెళ్ళి కప్పట్టుకొచ్చేసి పీకేదేం లేదు. నెమ్మదిగా నింపాదిగా వెళ్ళినంత మాత్రాన కొంపలేం అంటుకుపోవు.
౨ వృషభం :
ఆదాయం - 8 , వ్యయం - 8
రాజపూజ్యం - 6 , అవమానం - 6
గత సంవత్సరంతో పోల్చుకుంటే కాస్త ఉపశమనంగా ఉన్నా - చేతులు జేబులో పెట్టుకు తిరగటం మంచిది. అర చేతులు యధావిధిగా దురదపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయ్. ఆర్ధికపరంగా ఇబ్బందులు లేకపోయినా ఆరోగ్యం సంక నాకిపోయే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో వీరు కూడా ఒళ్ళు - కళ్ళు దగ్గర పెట్టుకునుండాల. ఏ పిల్లో పళ్ళికిలించింది కదాని మెడ తిప్పితే ముందర బండోడికి ముద్దెట్టటం ఖాయం.
౩ మిథునం :
ఆదాయం - 11 , వ్యయం -5
రాజపూజ్యం - 2 , అవమానం - 2
ఆదాయం ఎవరెష్టులాగా - ఖర్చులు అన్నవరం కొండలాగా ఉంటాయి. అంతమాత్రాన సుఖపడిపోతాడని గేరంటీ లేదు. 11 లో 5 పోగా మిగిలిన ఆరూ ఎవత్థికిచ్చావని పెళ్ళాం రెండు పీకొచ్చు. అంటే మనశ్శాంతి అంతగా ఉండదన్న మాట. ఇంట్లోనీ - ఆఫీసుల్లోనీ బాసులు ఏస్కోటం కామను. అలవాటు పడితే పర్లేదు. లేపోతే కాస్త వికారంగా ఉంటాది. దైవ దర్శనాలు చేస్కోటం మంచిది.
౪ కర్కాటకం :
ఆదాయం - 5 , వ్యయం - 05
రాజపూజ్యం - 05 , అవమానం - 2
అనుకున్న పనులు అనుకున్నట్టే అవుతున్నా ఏదో మిస్సయిందని చేతులు పిసికేస్కుంటూ ఉంటారు. వీరికి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఒళ్ళు దగ్గరెట్టుకుని పొద్దున్న సాయంత్రం నాలుగడుగులు నడిస్తే ఏ డాక్టరుకీ సంభావన సమర్పించుకోనక్కరలేదు. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అబ్భో బెమ్మాండమూ కాదు - అలా అని అధమమూ కాదు. బండి చల్తీకా నామ్ గాడీలా అలా సాగిపోతుంది.
౫ సింహ రాశి :
ఆదాయం - 08 , వ్యయం - 14
రాజపూజ్యం - 01 , అవమానం - 4
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఐనా కంగారు పడక్కరలేదు. ఏ చేతి దురదగాడో టైముకొచ్చి అప్పిచ్చి ఆదుకుంటుంటాడు. అలాగే ఒకడు మంచంటే నలుగురు బూతులు తిట్టుకుంటారు. అప్పిచ్చినోళ్ళకి ఆ మాత్రం తిట్టుకునే స్వతంత్రం ఉండదా ఏంటి..?? మహేష్ బాబులా ఫీలైపోయి బ్లైండ్ గా దేన్నీ ఫాలో అయిపోకండి. కూసింత ఉదయం సాయంత్రం యోగా మెడిటేషన్లు చేయటం మంచిది. ఆర్ధికంగా ఇబ్బందులంతగా ఉండక పోయినప్పటికీ సహనానికి స్పెల్లింగు రాయించేసే సీజను.
౬ కన్యా రాశి :
ఆదాయం - 11 , వ్యయం - 05
రాజపూజ్యం - 04 , అవమానం - 05
చేతి నిండా చిల్లరాడటం వలన వేసే తిక్క వేషాల వలన ఆరోగ్యం సంకనాకే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తిండి తిప్నల విషయాల్లో ఓ ఏడాది పాటూ గిరి గీసుక్కూర్చోటం బేటర్. కొత్త బండి కొని ఏ పక్కింటమ్మాయినో షికారు తీస్కెళ్ళే సూచనలు పుష్కలంగా కనపడుతున్నాయ్. కాపోతే పెద్దోళ్ళకి కనపడితే ఒళ్ళు వాచిపోయేలా పెళ్ళయ్యే సూచనలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయ్. ఇది చదివి పెళ్ళైనోళ్ళు కొత్త బళ్ళు కొనేరు - అట్లకాడ ఇరిగిపోద్ది...!!
౭ తులా రాశి :
ఆదాయం - 08 , వ్యయం - 08
రాజపూజ్యం - 07 , అవమానం - 01
రాశి పేరుకు తగ్గట్టే బ్యాలన్స్ షీట్ బరాబర్ సరిపోయింది. లెక్కలు బానే ఉన్నా అన్నదమ్ములతో గొడవలు పడే అవకాశం ఉంది. కాస్త నాలిక మడిచి దాచుకోవటం మంచిది. పక్కోడి విషయంలో కాళ్ళూ వేళ్ళూ పెట్టకపోవటం మరింత మంచిది. ఎంచక్కా వారానికో మారు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే ఎన్ని ఏషాలేసినా పర్లేదు. సగం సంవత్సరం పూర్తయ్యాక మోకాళ్ళ నొప్పులొచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు నుంచే రోజూ కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ తిరగటం మంచిది.
౮ వృశ్చిక రాశి :
ఆదాయం : 14 , వ్యయం - 14
రాజపూజ్యం - 03 , అవమానం - 01
ఈ ఏడాది ఈళ్ళకి బెమ్మాండంగా ఉంది. బాబాయ్ బై బై చెప్పేసే టైము కాబట్టి కాస్తో కూస్తో మంచి చేసి పోతాడు. కాకపోతే బద్దకం తగ్గించి కూసింత ఒళ్ళొంచితే ముందర బంతిపూల బాటే. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. కానీ నాలుక్కి కూసింత పసుపు రాసి జాగ్రత్తగా దాచేస్కోవటం మంచిది. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఓవర్ నైట్ కింగులైపోక పోవచ్చు గానీ - కూసింత కష్టపడితే కింగులాంటి లైఫు ముందుంది. ప్రతి మంగళారం / శనారం అన్నియ్య ఆంజనేయుడి గుడికెళిపోయి దండమెట్టుకుని కుదిరితే రామకోటి రాస్కుంటే పుణ్యం పురుషార్ధం.
౯ ధనుర్రాశి :
ఆదాయం - 02 , వ్యయం - 08
రాజపూజ్యం - 06 , అవమానం - 01
సంపాదన చెండాలంగా ఖర్చులు భయంకరంగా ఉండి - రోజుకి రెండు మూడు సార్లు ఛీ...దానిమ్మ బత్తాయ్ జీవితం అనుకోవాలనిపిస్తుంటాది. బాబాయ్ భయంకరంగా ప్రేవఁ కురిపించేయటంతో ఉత్తుత్తునే చిరాకొచ్చేసి కేకలేసే అవకాశాలున్నాయ్. డబ్బులకి బెంగెట్టుకోనక్కరేదు. బలిసి కొట్టుకుంటున్నోడెవడో ఒకడు వచ్చి సమర్పించుకుని పోతుంటాడు. కాకపోతే గాడిద కున్నంత ఓర్పూ సహనాలతో బండి లాక్కు రావలసి ఉంటాది. ఖర్చులు కంట్రోల్లో పెట్టుకుని - క్రెడిట్ కార్డుల పిన్ నంబర్ మర్చిపోతే మంచిది.
౧౦ మకర రాశి :
ఆదాయం - 05 , వ్యయం - 02
రాజపూజ్యం - 04 , అవమానం - 04
ఈళ్ళకి ఈ ఏడాది సంపాదన బాగుండటంతో - ఎనక నుండి బాబాయ్ ఎంకరేజ్ చేయటంతో వచ్చింది వచ్చినట్టు పనికిమాలిన విషయాలకి తగలెట్టే ప్రమాదం ఉంది. ఆఫీసుల్లో బాసులు చాలా ప్రేఁమగా బ్యాండేస్కుంటారు. బాబాయ్ థర్డ్ అంపైర్లా బూతద్దం పట్టుకుని నడినెత్తిన కూర్చోటం వలన ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలని సూచన హెచ్చరిక. కుదిరితే సోమవారం శివాలయానికి క్రమం తప్పకుండా పొండి. ఇనపముక్కల జోలికి - నల్ల గుడ్డల జోలికీ పోకుండా మిస్టర్ వైట్ లా తెల్ల గుడ్డలో - లైటు కలర్లో ఏసుకు తిరగండి. చుట్టాలింటికెళ్ళినట్టు అప్పుడప్నుడన్నా గుళ్ళుకీ గోపురాలకీ తిరిగితే మనశ్శాంతిగా ఉండేడుస్తాది.
౧౧ కుంభ రాశి :
ఆదాయం - 05 , వ్యయం - 02
రాజపూజ్యం - 05 , అవమానం - 04
లచ్చిమి దేవి గళగళలాడుతుంది. ఉన్న జేబూలు సరిపోక ఎగస్ట్రా జేబులు కుట్టించాల్సి రావొచ్చు. ఈ ఏడాది ఎలా చూసుకున్న కాస్తో కూస్తో కులాసాగా గడిపేసేది ఈళ్ళేనని గ్రహాలు గట్టిగానే చెబుతన్నాయ్. కానీ - రాహు కేతువులిద్దరూ కొత్త అల్లుల్లలా అలక పాన్పు ఎక్కి కూర్చోటం వలన ఆళ్ళకేమన్నా గిఫ్టులిచ్చి మచ్ఛిక చేస్కోటం మంచిది. ఇంతకన్నా ఇబ్బంది కరమైన విషయాలేం లేవు. కానీ - చేతి దురద తగ్గించుకోకపోతే వచ్చే ఏడాది వాచిపోటం ఖాయం.
౧౨ మీన రాశి :
ఆదాయం - 02 , వ్యయం - 08
రాజపూజ్యం - 01 , అవమానం - 07
సంపాదన ఖర్చులకి తగ్గట్టు లేకపోయినా తగలేయటానికి టయానికి ఎక్కడో ఒక దగ్గర నుండి డబ్బులొచ్చి చేతిలో పడతాయి . ఏదో ఓ మార్గంలో లచ్చిమి దేవొచ్చి పలకరించి పోతుంటాది కాబట్టి చేతి దురదకొచ్చిన లోటేమీ ఉండదు. కాపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా కొన్ని నిజాలు దాయటం వలన వాళ్ళు అలిగి బాధపడే అవకాశం ఉంది. నాలికని పెద్దగా వాడొద్దు - ఏదో ఓ గుడికెళ్ళి హాయ్ చెప్పేసి వస్తూండటం మంచిది. సంవత్సరం మధ్యలో ఇంట శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. రెండో పెళ్ళనుకుని పొరపాట్న సంకలు గుద్దుకుంటే ఒదిన సొక్కా సిరిగేలా సితక్కొట్టేయటం ఖాయం ...!!
ఈ ఏడాదికి మీ మీ దరిద్రాలని ఇంతకన్నా గొప్పగా చెప్పటం ని వల్లకాదు కాబట్టి... మనోవికారాలని కంట్రోల్లో పెట్టుకుని ఎవుడి జాగ్రత్తల్లో ఆడుండటం మంచిది.
నోట్ : వాస్తవాలని నా శైలిలో వ్రాయటం జరిగినది. మనోభావాలు వగైరాలు ఏవఁన్నా బాధపడి ఉంటే వాటిని మడిచి భద్రంగా మీ దగ్గరే దాచుకోగలరు...!
స్వస్తి
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK