Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చీకటి నుంచి వెలుగుకు
#1
చీకటి నుంచి వెలుగుకు

రచన: C..S.G . కృష్ణమాచార్యులు



మధ్యాహ్నం రెండు గంటల వేళ, వేసవి యెండల తాపానికి తల్లడిల్లుతున్న ప్రజానీకానికి, వూరట కలిగించేలా కారు మబ్బులు, ఆకాశాన్ని కమ్ముకున్నాయి. నిప్పులు చెరుగుతున్న సూర్యుడిని మేఘాలు, చుట్టు ముట్టి, చెరబట్టడంతో, చీకట్లు వ్యాపించడం మొదలైంది. బలంగా వీస్తున్న గాలుల తాకిడికి, రోడ్డుకి అటు, ఇటు వున్న చెట్ల కొమ్మలు వూగుతూ, ఆకులు రాలుస్తున్నాయి. 
రహదారులపైన వున్న దుమ్ము పైకి లేవడంతో, ప్రజలు కంగారుగా తలలు వంచి, నడక వేగం పెంచారు. వాన పడేలోగా యిల్లు చేరాలనుకున్న వారి ఆశలు అడియాసలు చేస్తూ, కుండపోతగా వాన పడడం మొదలైంది. రోడ్డు మీద వున్న వారంతా, అక్కడ వున్న షాపుల్లోకి, సిటీ బస్ షెల్టరులోకి పరుగులు తీశారు. 



అప్పుడే కారులో అటుగా వస్తున్న రవీంద్ర, బస్ షెల్టరు క్రిందికి చేరిన జనాలకు కొంచెం యెడంగా, పొందికగా నిలుచున్న ఆమెను చూసి, కారునామెకు ఎదురుగా, రోడ్డు ప్రక్కన నిలిపి, " అమ్మా! రండి. ఇంటికి వెడదాం!" అని పిలిచాడు. 



ఆమె ఒక నిమిషం తటపటాయించింది. డ్రైవర్ సీట్ నుంచి, ఎడమవైపుకు వాలి, రవీంద్ర ముందు డోర్ తీసి, "రండి" అని మరలా పిలిచాడు. 



దాంతో, ఆమె ఒక్క నిమిషం కూడా ఆలశ్యం చేయకుండా కారెక్కింది. ధారగా కురుస్తున్న వానవల్ల, దారి కనబడడం కష్టంగా వుంది. అందువల్ల అతడు, కారుని మెల్లగా పోనిస్తూ, " మీకు అవసరమైన పనేమీ లేదుగా?" అని అడిగాడు. 



అందుకామె, " ఏమీ లేదు, జాగ్రత్తగా వెళ్ళండి" అంది. 



"అండి అనకండి. మీ కన్నా చిన్న వాడిని. రవీ అని పిలవండి. నా పేరు రవీంద్ర. గవర్నమెంటు ఆర్ట్స్ కాలేజీలో లెక్చరరుగా పని చేస్తున్నాను. మీ ఇంటి కెదురుగా కుడి వైపు నున్న యింట్లో వుంటున్నాను. " 



"చూసాను. నువ్వు వచ్చి ఒక యేడాదయింది కదా ? నువ్వు మంచివాడివని నీ ఇంట్లో పనిచేసే అవ్వ చెప్పింది. నీకు మీ కాలేజిలో కెమిస్ట్రీ లెక్చరర్ కల్యాణీ తెలుసా?" 



 
"బాగా తెలుసు. నాకు సీనియర్. నేను కూడా కెమిస్ట్రీ డిపార్టుమెంటులోనే పనిచేస్తున్నాను. ఆమె నన్నొక తమ్ముడిలా చూసుకుంటారు. " 



" ఆమె నా ఫ్రెండ్. ఒక సారి మాటల సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది. నువ్వు మా వీధిలోనే వున్నావని, యోగ్యుడైన బ్రహ్మచారివని చెప్పింది. అంతే కాదు, మంచి పెళ్ళి సంబంధాలుంటే చెప్పమంది"



ఆమె మాటలకు రవీంద్ర సిగ్గు పడి, టాపిక్ మార్చే ప్రయత్నం చేసాడు, . 
"అక్కకి నా పెళ్ళి గురించే కలవరింత. మీరు స్కూల్ టీచరు గదా!"



" అవును. మన వీధికి, రెండు సందుల ఆవల వున్న బాలికల హైస్కూలులో పనిచేస్తున్నాను" 



 వాన ధాటి పెరగడంతో రవీంద్ర మాటలు ఆపి, డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. పది నిమిషాల తర్వాత, ఆమె ఇంటి ముందు కారునాపాడు. ఆమె రవీంద్రకు ధన్యవాదాలు తెలిపి, లోనికి వచ్చి కాఫీ త్రాగమని ఆహ్వానించింది. పిలుపుకోసం యెదురు చూస్తున్నవాడిలా, రవీంద్ర " అలాగే నమ్మా", అని కారు ఒక ప్రక్కగా పెట్టి, ఇంట్లోకి వెళ్ళాడు. 



 @@@



 హాలు విశాలంగా, శుభ్రంగా వుంది. మధ్యతరగతి గృహాల్లో వుండే సోఫా, టీవీ, పూల వాసే, వున్నాయి. అవిగాక, ఒక అలమర నిండా పుస్తకాలున్నాయి. ఒక ప్రక్క గోడకి, రెండు ఫోటోలు తగిలించి వున్నాయి. పూల దండలతో అలంకరింపబడిన ఫోటోలలో ఒక యువకుడు, ఒక మధ్యవయస్కుడు వున్నారు. రవీంద్రకు ఆమె ఒంటరి జీవితానికి కారణం అర్ధమైంది. ఇంతలో ఆమె ఒక ట్రేలో రెండు కాఫీలు, బిస్కట్లు తీసుకువచ్చింది. 



"నా పేరు తేజస్విని. రెండేళ్ళ క్రితం నా భర్త సుందర్రావు, నా కొడుకు రమేష్, ఒకే సారి మరణించారు. " మాటలు చెప్పేటప్పుడు ఆమె భావోద్వేగానికి గురైంది. ఒక్క నిమిషం తర్వాత, ఆమె తెప్పరిల్లి, " కాఫీ తీసుకో. ఎంత వద్దనుకున్నాగుండె బరువెక్కి కన్నీళ్ళు వర్షిస్తుంది. ప్రేమ పంచిన జీవిత భాగస్వామి ఒకరైతే, ప్రేగు తెంచుకుని పుట్టిన బిడ్డ మరొకరు." 



"సారీ అమ్మా! ఇంత విషాదాన్ని మోస్తూ, ఇలా ఒంటరిగా జీవించవలసి రావడం నిజంగా దురదృష్టమే" 



"గత జన్మలో పాపం చెసానో, నా నుదుట దేవుడిలా వ్రాసాడు" అంటూ ఆమె ఒక కాఫీ కప్పు రవీంద్ర కందించి, తనొకటి తీసుకుంది. 



 ఒక అయిదు నిమిషాల పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది. కాఫీ తాగిన తర్వాత, కొంచెం సందేహిస్తూనే, రవీంద్ర ఆమె నడిగాడు. 



"వారిద్దరూ యెలా చనిపోయారు? యాక్సిడెంటా? మీ కభ్యంతరం లేకుంటే చెప్పండి. " 



"చెప్పడానికి అవమాన భారమే అభ్యంతరం. అయినా నీకు చెప్పాలనిపిస్తోంది. బహుశా నీవు నా కొడుకు వయసు వాడివి కావడం వల్లననుకుంటా. విషాదానికి కారణం నా కన్న కొడుకు రమేష్. 
నేను, నాతో పాటు ఇంకో జీవి వాడి దుశ్చర్యకు అనాధలమయ్యాము. సంగతి జ్ఞప్తికి వచ్చినప్పుడు, అవమానభారంతో తలదించుకొంటాను. ఒక టీచరునైవుండి కూడా, నా కొడుకుని సరిగ్గా పెంచ లేకపోయానని కుమిలిపోతాను. ". 



ఆమె చెప్పటం మాని, గట్టిగా వూపిరి తీసుకుంది. ఆమె కనులలో నీటి పొరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రవీంద్రలో ఆమె గతం తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగింది. ఆమె మెల్లగా లోగొంతులో చెప్పడం మొదలుపెట్టింది. 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Super excellent update
[+] 1 user Likes sri7869's post
Like Reply
#3
"నా భర్త ఒక ప్రయివేటు కంపనీలో మేనేజరుగా పని చేసేవారు. నేను టీచరుగా వుద్యోగం చేస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా వుండే దాన్ని. మాది కలతలు లేని కమ్మని కాపురం. మాకు ఒక మగ బిడ్డ కలిగాడు. రమేష్ అని పేరు పెట్టి, ముద్దుగా పెంచాము. వాడు కాలేజీకి వెళ్ళే వరకు, మంచి విద్యార్ధిగానే వున్నాడు. ఎదిగిన కుర్రవాడని, వాడికి కొంత స్వేచ్చగా మసిలే అవకాశమిచ్చాము. అదే మా కొంప ముంచిందని తర్వాత తెలిసింది. 



వాడు బీకాం ఆఖరి సంవత్సరంలో వున్నప్పుడు, తన క్లాసుమేటుని పెళ్ళి చేసుకుని, యింటికి తీసుకు వచ్చాడు. అది వాడు మాకిచ్చిన ఫస్ట్ షాక్. అమ్మాయిది దిగువ మధ్యతరగతి కుటుంబం. అమ్మాయి తల్లిదండ్రులను సంప్రదిస్తే, వారు. " మాకింకా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వున్నారు. మమ్మల్ని కాదనుకున్న పిల్ల పట్ల మాకే బాధ్యతా లేదు" అని మమ్మల్ని పంపించివేసారు. 



పెళ్ళి చేసుకుని, మా కొడుకుని నమ్మి వచ్చిన, అమ్మాయి బాధ్యత మాదే అనుకున్నాము. వాళ్ళిద్దరి చదువు, కాపురం సజావుగా సాగేలా మా వంతు సహాయం చేసాము. 



 సరిగ్గా అప్పుడే, వాడి తప్పుడు పనులు ఒక్కటొక్కటిగా బయటపడటం ఆరంభమైంది. వాడు, నాకు తెలియకుండా, ఇంట్లో లాకరులో వున్న నగలనే గాక, వాడి పేర మేము కొన్న యిండ్ల స్థలాలను అమ్మేసాడు. తండ్రి పేరునుపయోగించుకుని అప్పులు తెచ్చాడు. డబ్బులన్నీ, పబ్బుల్లో డాన్సులు చేయడానికి, మాదక పదార్ధాలు కొనడానికి, తగలేసాడని తెలిసి, మా గుండెలు బ్రద్దలయ్యాయి. 



పెళ్ళి చేసుకున్నావు. బాగా చదువుకొని, నువ్వొక మంచి వుద్యోగం తెచ్చుకుంటే, మీరిద్దరూ సుఖంగా కాపురం చెయ్యవచ్చు. మా మాట విను నాయనా అని బ్రతిమిలాడాము. 



విన్నట్లు నటించాడు గాని, వాడేనాడు మా మాటల్ని లెక్క చేయలేదు. క్రొత్తగా బెట్టింగులు మొదలుపెట్టాడు. డబ్బుల కోసం మమ్మల్ని వేధించ సాగాడు. డబ్బులివ్వమంటే, వాడి భార్యను, మా కళ్ళ యెదుట హింసించే వాడు. అభాగ్యురాలిని కాపాడడం కోసం, వాడడిగిన డబ్బులు యివ్వక తప్పని పరిస్థితి, యేర్పడింది. 



వాడి భార్య, జయంతి అమ్మాయి పేరు, పెళ్ళికి ముందు రమేష్ చెప్పిన మాటలు నమ్మి, ఒక మంచి కుటుంబంలో పెద్దలతో కలిసి, సంతోషంగా జీవించవచ్చని కలలు కంది. కలలు నిజమవుతాయని నమ్మే సమయంలో, రమేష్ దురలవాట్లు, హింసా ప్రవృత్తి బయట పడడంతో పిల్ల తీవ్ర మనో వేదనకు గురైంది. 



మేము అమ్మాయిని ఓదార్చి, " ఇప్పుడు చింతించి లాభం లేదు. బాగా చదువుకుని మంచి వుద్యోగం తెచ్చుకో. వాడి మీద ఆధార పడకుండా బ్రతికే మార్గం చూసుకో. మేము జీవించి వున్నంతవరకు నీకు సపోర్టుగా వుంటాము" అని ధైర్యం చెప్పాము. అమ్మాయి మా మాట విని బాగా చదువుకోసాగింది. 



ఇలా విషాదభరితంగా కొన్ని రోజులు గడిచిన తర్వాత, రమేష్ ఒక రోజు ఇల్లు స్మశానం చేశాడు. బెట్టింగుల్లో 30 లక్షలు పోగొట్టుకుని ఇంటికి వచ్చి, డబ్బు వెంటనే కావాలని అడిగాడు. సహజంగానే, నేను నా భర్త అంత డబ్బు యెక్కడనుంచి తెస్తామని కోప్పడ్డాము. వాడు కోపంతో లోనికి వెళ్ళి వాడి భార్యను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి, డబ్బు యివ్వక పోతే చంపేస్తానని బెదిరించాడు. 



అప్పుడు నా భర్తకి, కొడుక్కి జరిగిన కొట్లాటలో వారిద్దరూ చనిపోయారు. వారిద్దరిని విడదీయాలని నేను, జయంతి చేసిన ప్రయత్నం ఫలించలేదు. గాయపడిన శరీరాలతో, పగిలిన హృదయాలతో, ప్రవహించే కన్నీళ్ళతో, యిద్దరం మిగిలిపోయాము.



చాలా బాధాకరం. ఎందరో యువకులు దుర్వ్యసనాల పాలబడి, వారి కుటుంబాలను శోకసముద్రంలోకి నెట్టేస్తున్నారు. ప్రతి రోజూ పేపర్లో వార్తలు వస్తూంటాయి. అన్నాడు రవీంద్ర అనునయంగా. 



"జయంతి ఇప్పుడు ఎంకాం ఆఖరి సంవత్సరం చదువుతోంది. నాతో వుంటే, యవ్వనంలో వుండే వుత్సాహం అణగారిపోతుందని, యూనివర్సిటీ హాస్టల్ లో వుంచాను. జీవితంలో ఒక సారి దెబ్బ తిన్నది కనుక విజ్ణతతో వుంటుందని నా నమ్మకం. చడువయ్యాక, ఉద్యోగం తెచ్చుకుని, పెళ్ళి చేసుకోమని చెప్పాను". 



"మంచి మనసు మీది. మీకే అవసరమున్నా, నాకు ఫోన్ చెయ్యండి. ఇదిగో నా కార్డ్" అని ఆమెకు తన విజిటింగు కార్డునిచ్చాడు. 
 @@@

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#4
తేజస్వినితో పరిచయమైన తరువాత, మళ్ళీ పది రోజుల వరకు రవీంద్ర, ఆమెను కలవలేదు. రోజుకారోజే ఆమెను కలవాలనిపించినా, కలిసే ప్రయత్నం చేయలేదు. ఆమెకు యిష్టముంటుందో వుండదో, అన్న సంకోచమే దానికి కారణం. ఒక రోజు, అతడికి ఆమెనుంచి ఫోన్ వచ్చింది. 



"జయంతికి జ్వరంగా వుంది. హాస్టలునుంచి, ఇంటికి తీసుకు రావాలి. సహాయం చెయ్యగలవా?" అని అడిగింది. 



రవీంద్ర వెంటనే కారు తీసుకుని, ఆమె యింటికి వెళ్ళి, ఆమెను యూనివర్సిటీ హాస్టలుకి తీసుకెళ్ళాడు. అక్క డే, అతను మొదటి సారి, జయంతిని కలిసాడు. పసిమి చాయ, కోల ముఖం, నల్లటి కళ్ళు, గిరజాల జుట్టు, సాధారణ పొడవు, పొడవుకు తగ్గ లావు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆమె చూడ చక్కగా వుంది. ఆమెను పెళ్ళిచేసుకోవడానికి రమేష్ యెందుకు తొందరపడ్డాడో, అతనికిప్పుడర్ధమైంది. 



జయంతికి నీరసంగా వుండడం వల్ల, కారులో కనులుమూసుకుని పడుకుంది. రవీంద్ర కూడా మౌనంగా వుండి, వారిని యింటికి చేర్చాడు. తేజస్విని రవీంద్రకి ధన్యవాదాలు తెలిపి, కోడలితో లోపలికి వెళ్ళిపోయింది. రవీంద్ర మనసు చివుక్కుమంది. కేవలం కారు కోసమే పిలిచాను, ఇంక వెళ్ళు, అన్నట్లుంది ఆమె ప్రవర్తన, అని బాధపడ్డాడు. ఆత్మీయత కరవైన చోట, స్నేహం కొనసాగించడం కష్టమని భావించాడు. 



అయితే అతని వైమనస్యం ఎంతో కాలం నిలవలేదు. దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది తేజస్విని. చూడగానే గౌరవించాలనిపించే, ఆమె వ్యక్తిత్వం, అతనికి ఎంతగానో నచ్చింది. రోజుకొకసారైనా అమ్మా అని ఆమెతో కబుర్లు చెప్పాలన్నది అతని కోరిక. ఇక రెండవది జయంతి. ఆమె చూడ చక్కగా వుంది. ఆమెను పెళ్ళి చేసుకుంటే, అందమైన భార్యనే గాక, అనురాగమయి తేజస్వినిని తల్లిగా పొందవచ్చు. ఇలా సాగే అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, ఫోన్ మ్రోగింది. తేజస్విని దగ్గరనుంచి. 



జయంతి కి జ్వరం తగ్గింది, ఇప్పుడు కులాసాగానే వుంది. నీకు థాంక్స్ చెప్పాలనుకుంటోంది. సాయంత్రం అయిదు గంటలకు టీ కి రాగలవా అని అడిగింది. 



 “రాలేను అని చెప్పాలనుకుంటూనే, వస్తానని చెప్పేసాడు. 
---
 @@@
సాయంత్రం సరిగ్గా అయిదు గంటల వేళ, అతను తేజస్విని యింటి గుమ్మం ముందు నిలుచున్నాడు. అతడి రాకను గమనించిన జయంతి ఎదురు వచ్చి, " స్వాగతం ! ఆపద్బాంధవులకు" అని నమస్కరించింది. చక్కగా అలంకరించుకుని, ముగ్ధమోహనంగా వున్న జయంతిని చూడగానే అతడిలో ఇంతవరకు తారాడిన ప్రతికూల ఆలోచనలు జాడలేకుండా పోయాయి. 



 "టీ తో పాటు తినడానికి పకోడీలు, మైసూరుపాక్ చేసింది. జయంతి వంట చక్కగా చేస్తుంది. " అంటూ తేజస్విని వచ్చిఅతనికెదురుగా కూర్చుంది. 



జయంతి ఆరోగ్యం, పరీక్షలు, హాస్టలు జీవితం వంటి అంశాలపై కబుర్లుసాగాయి. అందరూ తీరికగా టీ తాగిన తర్వాత, తేజస్విని, జయంతి, రవీంద్రలని వుద్దేశించి యిలా అంది. 



" నేను చెప్పే మాట మీకు నచ్చకపోతే, మన్నించండి. మరచిపోండి. నాకు జయంతి అంటే ఎంతో యిష్టం. అలాగే రవీంద్ర అంటే కూడా. నిజానికి రవీంద్రలో నా కొడుకుని చూసుకుంటున్నాను. మీరిద్దరూ మాట్లాడుకొని, మీకు ఓకే అనిపిస్తే, మీ పరిచయాన్ని స్నేహంగా, స్నేహాన్ని ప్రణయంగా. చివరకు పెళ్ళిగా మార్చుకుంటే సంతోషిస్తాను. ఇది నా కోరికగా భావించి, నా కోసం మీరెలాంటి త్యాగాలు చెయ్యకండి



సాధకులకు, జీవితం ఎప్పుడూ క్రొత్త, క్రొత్త అవకాశాలనిస్తుంది. మీకిదొక అవకాశం మాత్రమే. మంచి అవకాశమనిపిస్తే, ఆలోచన చేయండి. లేదంటే వదిలివేసి, మరో అవకాశం కోసం యెదురుచూడండి. నేను గుడికి వెళ్ళి వస్తాను. " 



తర్వాత, ఆమె ప్రసన్న వదనంతో, వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె అక్కడ లేకున్నా, మంద్ర స్వరంలో ఆమె చెప్పిన మాటలు వారి చెవుల్లో వినిపిస్తూనే వున్నాయి. దాదాపు అయిదు నిమిషాలపాటు వారు ఆలోచిస్తూ వుండిపోయారు. తర్వాత రవీంద్ర చొరవ తీసుకుని, ముందుగా తన అభిప్రాయం చెప్పాడు. 



"అమ్మ సలహా నాకు శిరోధార్యం. జయంతీ! నీకు అభ్యంతరం లేకుంటే మనం, ఆమె కోరినట్లు చేద్దాం "
 
"నాకు అత్తయ్య మాట శిలా శాసనం. ఆమె ఎంతో ఆలోచించి, మీ సంబంధం నాకు సూచించింది. మీతో వివాహం, నాకు క్షణమైనా పూర్తిగా అంగీకారమే. అయితే ఒక్క మాట. నేను ఒక సారి పెళ్ళి చేసుకుని కొన్నాళ్ళు కాపురం చేసినదాన్ని. అందువల్ల, మీకు లేకున్నా, మీ తల్లిదండ్రులకు అభ్యంతరం వుండవచ్చు. "



"నా తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకుని నాకు దూరమయ్యాడు. నాది ఏక వ్యక్తి కుటుంబం. వ్యక్తిని నేనే. నాకూ పూర్తిగా అంగీకారమే. "



త్వరపడి నిర్ణయానికి రాకండి. నాకంటే అమ్మలా ఆలోచించించే అత్తయ్య వున్నారు. బహుశా కొన్నాళ్ళు డేటింగు చేస్తే మంచిదేమో. మీకు నా గురించి తెలుస్తుంది. " 



అవసరం లేదు. నెలలు, సంవత్సరాలు డేటింగ్ చేసిన జంటలు, రోజుల్లో విడాకులు తీసుకుంటున్నాయి. నీ కోసం నేను, నా కోసం నువ్వు అని గాఢంగా నమ్మి, అన్యోన్యంగా బ్రతికితే, మన బంధం శాశ్వతం, ఆదర్శం అవుతుంది. జయంతీ, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంక నీతోనే నా జీవితం. భర్తగా నీతో, కొడుకుగా అమ్మతో కలిసి, కలకాలం జీవించాలని పార్వతీ పరమేశ్వరులని ప్రార్ధిస్తున్నాను. ” 



జయంతి అతని చేతులు, తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకు అద్దుకుంది. ఆమె కనులనిండా కన్నీరు ఉబికి వస్తోంది. ఆమె దేవ దేవుని ప్రార్ధించింది. 



 “శిలగా మారిన నా జీవితానికి అత్తయ్య కరుణ, ప్రాణ శక్తిని ప్రసాదించింది. రవీంద్ర వలపు, క్రొత్త జీవితంలోకి అడుగిడమని స్వాగత గీతం పాడుతోంది. చీకటి నుంచి వెలుగు వైపుగా, నా మరో ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది. భగవాన్! తమసోమా జ్యోతిర్గమయ.
 @@@

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#5
Nice update  thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: