Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Inspiration పీత కష్టాలు పీతవి
#1
Tongue 
పీత కష్టాలు పీతవి

[Image: image-2024-04-17-191744681.png]

రచన: మల్లవరపు సీతారాం కుమార్



పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అనే సామెతను మనం సాధారణంగా వాడుతూ ఉంటాము.
ఎవరి కష్టాలు వారికి ఉంటాయనే ఉద్దేశంలో సామెతను వాడుతూ ఉంటాం.
సామెత ఎలా ఏర్పడి ఉంటుందనే ఆలోచనకు ఒక అందమైన రూపకల్పన కథ.
పీతలు పడ్డ కష్టాలను సీతా మాత పడ్డ కష్టాలను పోలుస్తూ అల్లిన కథలో సీతారాముల ఔన్నత్యాన్ని మరింత పెంచేవిధంగా శ్రద్ధ తీసుకున్నాము.
సీతాదేవిని అపహరించిన రావణుడు, ఆమెను అశోకవనంలో ఉంచి, త్రిజట అనే రాక్షసిని ఆమెకు కాపలాగా ఉంచాడు.నెమ్మదిగా సీతాదేవి మనసును తన వైపు తిప్పమని ఆమెను ఆదేశించాడు. కానీ కొద్దిరోజుల్లోనే త్రిజట సీతాదేవికి భక్తురాలయింది.
 
ఒక రోజు త్రిజటకు రావణ సంహారం జరిగినట్లు కల వచ్చింది. లంకలో సముద్ర తీరంలో తన స్నేహితురాళ్ళతో కూర్చొని, ఆ కల గురించి తన స్నేహితురాళ్లకు వివరంగా చెప్పింది త్రిజట.
 
"నిన్న నీకు వచ్చిన కల గురించి చెప్పావు. కానీ నాకు ఎంత మాత్రం నమ్మకం కలగడం లేదు. అపజయం ఎరుగని మన మహారాజు రావణుడు ఒక మానవుడి చేతిలో ఓడిపోవడం అసంభవమని నా మనసు చెబుతోంది. నీకు ఆ సీత మీద జాలి కలిగింది. అందుకే అలా ఉహించుకొని ఉంటావు. దిక్పాలకులను సైతం పాదాక్రాంతం చేసుకున్న వీరుడు, కైలాసాన్ని పెకలించగల బలశాలి అయిన మన ప్రభువుకు అపజయం ఎలా కలుగుతుంది?" అంది త్రిజట స్నేహితురాలు సరసి.

"మాకు కూడా అలాగే అనిపిస్తోంది" అన్నారు మిగిలిన స్నేహితురాళ్లు.

" కొంచం సావధానంగా వినండి. రాక్షస ప్రవృత్తి వల్ల మన ఆలోచనలు అలాగే ఉంటాయి. ఎవరికి వారు మనలను ఎదిరించేవారు లేరనుకోవడం మన నైజం. కానీ మనలోనే ఒకరిని మించిన వారు మరొకరు ఉన్నారు కదా! వారిని మించిన వారు మరొకరు ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట ఉండే ఉంటారు. వానరుడైన వాలి తన తోకతో చుట్టి మన రాజును సప్త సముద్రాల్లో ముంచలేదా? అలాంటి వాలిని ఒక్క బాణంతో కూల్చిన రాముడు సామాన్యుడనుకుంటున్నారా? ' అంది త్రిజట.
 
స్నేహితురాళ్ళు శ్రద్ధగా వింటున్నారు.
తన అభిప్రాయాన్ని చెప్పడం కొనసాగించింది త్రిజట.
 
" కైలాసాన్ని పెకలించగల రావణుడు శివ ధనుస్సును ఎత్తలేక పోయిన విషయం, అదే ధనుస్సును శ్రీరాముడు అలవోకగా ఎత్తడం అందరికీ తెలిసిందే కదా! మరో విషయం గమనించండి. రావణుడు, రాముడిని జయించి సీతను తీసుకొని వచ్చాడా? మాయతో రాముడిని బయటకు పంపి సీతను అపహరించాడు. ఇది వీరత్వమని మీరు నమ్ముతున్నారా? అమంగళం పలుకుతున్నానని అనుకోవద్దు. రావణుడిని వధించిన తరువాత రాముడు మండోదరిని చెర పడతాడా? మీరే సమాధానం చెప్పండి" అంటూ తన మిత్రురాళ్లను ప్రశ్నించింది.
 
" రాముడి గురించి మేము విన్న దాన్ని బట్టి రాముడు మన మహారాణి వంక కన్నెత్తి కూడా చూడడు" ముక్త కంఠంతో చెప్పారు వాళ్ళు.



" మరి అలాంటి ధర్మ పరాయణుడికి అపజయం ఉంటుందా? రావణ సంహారం తథ్యం. వారధి కట్టడం త్వరలో ప్రారంభమవుతుంది. కొద్ది రోజుల్లో వంద కోట్ల వానర సైన్యంతో రాముడు లంకలో అడుగు పెట్టడం ఖాయం. ఈ లోగా సీతామాతను ఎవరూ బాధ పెట్టకండి" అంటూ పైకి లేచింది త్రిజట.
***
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
సముద్ర తీరంలో లక్షలాది పీతలు నివాసం ఉంటున్నాయి. చాలా ఆడ పీతలు గుడ్లను పెట్టి, సముద్ర తీరంలోని బండరాళ్ల మధ్యలో పొదుగుతున్నాయి. మరికొన్ని పీతలు సముద్రపు ఒడ్డున ఇసుకలో నెర్రెలు చేసుకొని గుడ్లను పొదుగుతున్నాయి. త్రిజట మాటలు విన్న పీతలు పెను తుఫాను వచ్చినట్లు భయంతో వణికి పోయాయి. గబగబా తమ మహారాజు కొండి దీర్ఘుడి వద్దకు వెళ్లాయి.

" ప్రభూ! మన జాతి అంతరించే సమయం ఆసన్నమయింది. మీరే ఏదైనా ఉపాయం ఆలోచించాలి" అంటూ విన్నవించుకున్నాయి.

 
"ఏమైంది మిత్రులారా? ఇప్పుడు మన జాతికి ముంచుకొచ్చిన ప్రమాదం ఏమిటి? ప్రస్తుతం ఏ విధమైన తుఫాను సూచనలూ లేవే?" అంటూ ప్రశ్నించాడు పీతల రాజు కొండి దీర్ఘుడు.
 
"పెను తుఫాను కంటే ప్రమాదం ముంచుకొచ్చింది మహారాజా! శ్రీరాముడు వంద కోట్ల వానర సైన్యంతో, భల్లూక సైన్యంతో లంక పైకి దండెత్తుతున్నాడు. అన్ని కోట్ల వానరులు ఒక్కసారిగా సముద్ర తీరంలో చేరితే వారి కాళ్ళ కింద పడి మన వాళ్ళందరూ నలిగిపోవడం ఖాయం. వేరొక చోటికి వెళ్లిపోదామంటే కొన్ని లక్షల ఆడ పీతలు గుడ్లను పొదుగుతున్నాయి. ప్రస్తుతం అవి కదిలే పరిస్థితిలో లేవు. ఇక్కడే ఉంటే కోట్లాది వానరుల కాళ్ళ కింద పడి చనిపోవడం ఖాయం" భయంతో చెప్పాయి త్రిజట మాటలు విన్న పీతలు.



వారు చెప్పింది సావధానంగా విన్నాడు పీతల రాజు. వెంటనే పూర్తి వివరాలతో రమ్మని తన మంత్రి వక్రకొండికి కబురు పంపించాడు. కొద్ది సేపటికే మంత్రి వక్రకొండి పీతల రాజు వద్దకు వచ్చాడు. మహారాజుకు వినయంగా నమస్కరించాడు.
 
"మహా రాజా! లక్షలాది ఆడ పీతలు గుడ్లను పొదుగుతున్నాయి. ప్రస్తుతం అవి ఎక్కడికీ కదిలే పరిస్థితిలో లేవు. ఒక్కొక్క పీత పదిలక్షలు పైగా గుడ్లను పొదుగుతోంది.. గుడ్లు పరిపక్వము చెందడానికి ఇంకా పది రోజుల పైనే పడుతుంది. వారధి నిర్మాణం కాస్త ఆలస్యం అయితే మనకు ఏ సమస్యా లేదు. పొదగబడ్డ గుడ్లను ఎప్పటిలాగే సముద్రంలో వదిలేసి మనం వేరొక చోటికి వెళ్ళవచ్చు. కానీ వానర వీరుల ఉత్సాహం చూస్తుంటే, వారధి నిర్మాణం ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే పూర్తవుతుందనిపిస్తోంది. వానర సేన ఇటువైపు దిగితే మనకు ముప్పు తప్పదు. ఎప్పుడో ఐదు వందల సంవత్సరాలకు ముందు పెను తుఫాను వచ్చినప్పుడు మన జాతికి తీరని నష్టం కలిగింది. తిరిగి ఇప్పుడు అంతకంటే పెద్ద ముప్పు వస్తోంది. వారధి నిర్మాణం ఆలస్యమయ్యేలా దేవుడిని ప్రార్ధించడం తప్ప మనం చెయ్యగలిగింది ఏమీలేదు." గద్గద స్వరంతో చెప్పాడు మంత్రి వక్రకొండి.
 
"రేపే మన తీర ప్రముఖులను ప్రార్ధనా స్థలానికి రమ్మని కబురు పంపండి . అందరం కలిసి ఆ దేవుడిని వారధి నిర్మాణం ఆలస్యం చేయమని ప్రార్థిస్తాం. కొన్ని వందల కోట్ల ప్రాణాలు పోవడాన్ని దేవుడు మాత్రం హర్షిస్తాడా? మనకు రామ రావణ యుద్ధం గురించిన ఆసక్తి లేదు. ఎవరు గెలిచినా, ఎవరూ ఓడినా మనకు ఒరిగేదీ, పోయేదీ ఏమీ లేదు. మన జాతిని కాపాడుకోవడమే రాజుగా నా బాధ్యత. రేపు అందరం వారధి నిర్మాణంలో జాప్యం జరగాలని ప్రార్థిద్దాం" తన నిర్ణయాన్ని సాధికారంగా ప్రకటించాడు పీతల రాజు కొండిదీర్ఘుడు.
***
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#3
అశోక వనంలో దిగులుగా కూర్చున్న సీత వద్దకు వెళ్ళింది త్రిజట.
" త్రిజటా! నా రాముడు ఎప్పుడొస్తాడో నీకేమైనా తెలిసిందా? రాముడు లంకలో అడుగు పెట్టాడన్న శుభవార్త ముందుగా నీనోట వినాలని ఎదురు చూస్తున్నాను. నీ ఓదార్పు మాటలే నా ప్రాణం ఇంతవరకు నిలిచేలా చేశాయి. భూజాతనైన నాకు మాతృ వాత్సల్యాన్ని పంచిన దానివి నువ్వు" అంది సీత త్రిజట వంక చూస్తూ.



" అమ్మా! లోకానికే తల్లివి నువ్వు. నీతో నాలుగు మంచి మాటలు మాట్లాడిన అదృష్టం నాది. ఇక విషయం చెబుతాను విను. వంద కోట్ల వానర సైన్యం, యాభై కోట్ల భల్లూక సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రాక్షస సంహారం చేద్దామా అని వారందరూ ఉవ్విళ్లూరుతున్నారు. వారధి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. మొదలు పెడితే ఐదే రోజుల్లో పూర్తి అవుతుంది. తరువాత రావణ సంహారం తథ్యం " సీతను ఓదారుస్తూ చెప్పింది త్రిజట.
" ఐతే ఆ వారధి నిర్మాణం తొందరగా జరగాలని భగవంతుడిని ప్రార్ధిస్తాను. ఇక్కడ ప్రతి క్షణం ఒక యుగంలా గడుపుతున్నాను." అంది సీత.
 
" మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కానీ..." ఏదో చెప్పబోయి ఆగింది త్రిజట.
"నీ సంకోచం నాకు ఆందోళన కలిగిస్తోంది. వారధి నిర్మాణానికి ఆటంకాలేమైనా ఉన్నాయా?" ఆందోళన నిండిన స్వరంతో ప్రశ్నించింది సీత.
 
" తల్లీ! ఇది చెప్పదగ్గ విషయం కాదు. కానీ మీ వద్ద నేనేదీ దాచను. వారధి నిర్మాణం ఆలస్యం కావాలని సముద్ర తీరంలోని పీతలు రేపు సమావేశమై సామూహికంగా దేవుడిని ప్రార్ధిస్తున్నాయట" చెప్పింది త్రిజట.



ఆశ్చర్యపోయింది సీత. " పీతలు వారథి ఆలస్యం కావాలని ప్రార్ధిస్తున్నాయా? ఎందుకు వాటికి నా పైన కక్ష? ఈ సృష్టిలో సకల జీవరాశులు రామకార్యానికి సహకరిస్తాయంటారే! నన్ను కాపాడటానికి పక్షీంద్రుడైన జటాయువు తన ప్రాణాలను అర్పించాడే! పర్ణశాలలో ఉన్నప్పుడు క్రూర మృగాలు సైతం హాని తలపెట్టలేదే! వానర వీరులు, భల్లూక యోధులు తమ ప్రాణాలకు తెగించి కౄరులైన రాక్షసులతో యుద్ధానికి సిద్ధమయ్యారే! మరి ఈ పీతలకు దీనురాలైన ఈ సీతమీద కక్ష ఎందుకో?” ఆవేదనతో పలికింది సీత.
" అమ్మా! లక్షలాది పీతలు సముద్ర తీరంలో గుడ్లను పొదుగుతున్నాయి. ప్రస్తుతం అవి కదిలే పరిస్థితిలో లేవు. వారధి నిర్మాణం కాస్త ఆలస్యం అయితే వాటి పని పూర్తి అవుతుంది. తరువాత అవి వేరొక చోటికి వెళ్లిపోవచ్చు. అందు కోసం రేపు పీతలన్నీ కలిసి దేవుడిని వేడుకుంటాయట. పీత కష్టాలు పీతవి. అయినా సాక్షాత్తు దైవ స్వరూపుడైన రామకార్యాన్ని, పీతల కోసం ఏ దేవుడు మాత్రం ఆపగలడు? " అంది త్రిజట ఈసడింపుగా.



కళ్ళు మూసుకొని తీక్షణంగా ఆలోచించింది లోక పావని. గుడ్లను పొదుగుతున్న లక్షలాది పీతలు వానరుల పాదాల క్రింద పడి నలిగిపోవడం ఆమె కళ్ళ ముందు కదలాడింది. ఆ దృశ్యాన్ని చూడలేక వెంటనే కళ్ళు తెరిచింది.
 
" త్రిజటా! నా రాముడి కోసం ఎన్నో రోజులు యుగాల్లా గడిపాను. మరి కొన్ని యుగాలైనా ఎదురు చూస్తాను. ఆ అల్ప ప్రాణులు నాకోసం బలి కాకూడదు. వాటి కోసం నేను కూడా ప్రార్థిస్తాను." దృఢ నిశ్చయంతో చెప్పింది భూజాత.

త్రిజట కళ్ళు చెమ్మగిల్లాయి. "ఆ రాముడికి తగ్గ సతివి నువ్వు. మానవులుగా పుట్టి దైవత్వం కలిగినవారు దేవతలకన్నా గొప్పవారు. మరి ఆ దేవుడి నిర్ణయం ఎలావుంటుందో వేచి చూడాలి" సీతకు భక్తితో నమస్కరిస్తూ చెప్పింది త్రిజట.

***
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#4
పీతల ప్రముఖులందరూ సమావేశమయ్యారు. అందరూ కూర్చున్నాక వారి రాజు కొండి దీర్ఘుడు ఇలా చెప్పాడు.
 
" మిత్రులారా! ఈ రోజు మనం చేసే ప్రార్థనను బట్టి మన జాతి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం ఎవరి పక్షమూ కాదు. కేవలం వారధి నిర్మాణం ఆలస్యం కావాలని మాత్రమే ప్రార్థిద్దాం. అందరూ మనసు పెట్టి ప్రార్థిస్తే ఆ రాముడే మనల్ని కరుణిస్తాడు. నిజానికి ప్రతి సంవత్సరం వేసవి కాలంలోనే మన సంతానోత్పత్తి ప్రక్రియ పూర్తి అవుతుంది. మన దురదృష్టమేమో ఈ సారి ఆలస్యమయింది”.
 
ఇంతలో వేగుల వాళ్ళు అక్కడికి వచ్చారు.
" మీరు తీసుకు వచ్చిన సమాచారాన్ని చెప్పండి" అని అనుమతి ఇచ్చాడు కొండి దీర్ఘుడు.
 
" మహారాజా! వారధి నిర్మాణం ప్రారంభం కాబోతోంది. యుద్ధంలో రాముడికి విజయం లభించినా కోట్లాది వానరులు, భల్లూకులు మరణించడం ఖాయం. అయినా ఏ ఒక్కరిలోనూ ప్రాణ భయం అనేది కనిపించడం లేదు. పైగా రాముడి కోసం ప్రాణాలు అర్పించడం గొప్పగా భావిస్తున్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. సముద్రానికి ఆవలి వైపు అడవుల్లో వున్న లక్షలాది ఉడుతలు కూడా సమావేశమై రామ కార్యంలో పాలుపంచుకోవాలని తీర్మానించాయట. తమ శక్తి కొద్దీ రాళ్లను మోసి వారధి నిర్మాణానికి తమవంతు సహాయం అందిస్తాయట. ఆ ప్రయత్నంలో వానరుల కాళ్ళ కింద పడి ఎన్నో ఉడుతలు చనిపోవడం ఖాయం. అయినా ఆ ఉడుతలు ఎంతమాత్రం వెరవడం లేదు "
 
వేగులు చెప్పిన మాటలు విని పీతల ప్రముఖులందరూ ఆశ్చర్యపోయారు.ఇంతలో లంకలో పర్యటించిన మరికొందరు వేగులు రాజుగారి అనుమతితో తాము మోసుకొచ్చిన సమాచారాన్ని ఇలా చెప్పారు.
 
" మహారాజా! అశోక వనంలో సీతాదేవి మన కోసం ప్రార్థిస్తోందట. మన కష్టానికి ఆమె ఎంతో కలత చెందిందట. మరి కొన్ని రోజులయినా కష్టాలు భరిస్తుందట".
వేగులు చెప్పింది విన్న పీతలకు సీతాదేవి హృదయం ఎంత ఉన్నతమైనదో అర్థం అయింది.
 
ఇంతలో కొన్ని ఆడ పీతలు భారంగా అడుగులు వేస్తూ అక్కడికి వచ్చాయి. మగ పీతలు వారిస్తున్నా వినకుండా రాజు దగ్గరకు వచ్చి " మహారాజా! మన ప్రాణాలు శాశ్వతం కాదు. సీతమ్మ విముక్తి మన కారణంగా ఆలస్యం కాకూడదు. అలా చేసి దక్కించుకున్న ప్రాణాలు ఎంతకాలం ఆపుకోగలం? చెట్లూ,పుట్టలూ, జంతువులూ, పక్షులూ, సముద్రుడు అందరూ రాముడికి సహాయం చేస్తోంటే పీతలు మాత్రం తమ స్వార్థం చూసుకున్నాయన్న అపప్రథ మన జాతికి వద్దు. వంతెన తొందరగా కట్టి, రాముడు లంకకు వచ్చి రావణ సంహారం చేయాలని మనమంతా ప్రార్థన చేద్దాము." అని ముక్త కంఠంతో చెప్పాయి. ఆ మాటలను అన్ని పీతలూ స్వాగతించాయి.
పీతలన్నీ రాముడు తొందరగా లంకా ప్రవేశం చేయాలని ప్రార్థించాయి.
***
రాముడు ధర్మ స్వరూపుడన్నది మరోసారి రుజువైంది. పీతలు కాపాడబడటమే ధర్మం. అందుకోసం సీతామాత స్వయంగా ప్రార్ధించడం దైవ సంకల్పం. ఆమె ప్రార్థించినట్లుగానే వారథి నిర్మాణం కొన్ని రోజులు ఆలస్యమయింది. ఈ లోపల పీతల గుడ్లు పొదగబడ్డాయి. తరువాత అన్ని పీతలూ సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాయి.



ఆ తరువాతే వానర సైన్య సమేతుడై శ్రీరాముడు లంకలోకి ప్రవేశించాడు. భీకరమైన రణంలో రావణ సంహారం చేసాడు. యుద్ధంలో మరణించిన వానరులందరూ పునరుజ్జీవింప బడ్డారు. ధర్మం వైపు నిలబడ్డ విభీషణుడు, మండోదరి, త్రిజట లాంటి కొద్దిమంది రాక్షసులు మాత్రం మిగిలారు. తమకోసం ప్రార్థించిన జానకీమాతను, ధర్మపరాయణుడైన శ్రీరామ చంద్ర మూర్తిని లంకలోని పీతలు ఇప్పటికీ తమ కుల దేవతలుగా పూజిస్తున్నాయి.
(కల్పితం)
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#5
Excellent  Namaskar Namaskar Namaskar
[+] 1 user Likes sri7869's post
Like Reply
#6
Super .. excellent....no words andi...Baga rasaruu...
Deepika 
[+] 1 user Likes Deepika's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)