Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆంధ్రమాత గోంగూర
#1
ఆంధ్రమాత గోంగూర
 
రచన : పేరాల బాలకృష్ణ
 
“గోంగూర!”
“పొడి గోంగూర!”
“పచ్చళ్ళ గోంగూర!”
 
గట్టిగా అరుచుకుంటూ వెళుతున్నాడు పెద్దయ్య!
 
“ఒరేయ్ బాలయ్యా! వాణ్ణి పిలు! ఆ గోంగూర అమ్మేవాణ్ని” అంటూ బామ్మ  వంటింట్లోంచి వరండాలోకి రయ్యి రయ్యి మని వచ్చేసింది కాసె పోసి కట్టుకున్న చీరకొంగు భుజం మీదకు లాక్కుంటూ!
 
గోంగూర గంప రావటం,  అయ్యగారూ!  ఓ చెయ్యేసి సాయం చేయండి అనటం, పేపరు చదువుకుంటున్న  నాన్నగారు, జారిపోతున్న లుంగీ పంచను పైకి లాక్కుంటూ గంప దించు కోవటానికి సాయం చేయటం, అన్ని టకటకా జరిగిపోయాయి. 
 
గంప నిండా గోంగూర! పచ్చగా మెరుస్తూ  నిగనిగలాడుతున్న గోంగూర! దాని పైన తడి పంచలో ముడేసి ఎర్రగా వెలుగులు చిమ్ముతున్న పండు మిరపకాయలు పెట్టుకొచ్చాడు. బామ్మ చక చకా వచ్చి గంప ముందు చతికలపడింది ఎల్ షేప్ లో కాళ్ళు పెట్టి.  కూరలు బేరం చెయ్యాలంటే బామ్మ అయితే ఎడం కాలు మడిచి పైకి పెట్టి  కుడికాలు మఠం వేసుకున్నట్లుగా రెండు అరికాళ్ళు ఆన్చి పెట్టి గంప ముందు కూర్చునేది.  నాన్నగారి భంగిమ వేరే అనుకోండి! గంప ముందు గొంతుక్కూర్చుని కూరలు తీసుకునేవారు, నోట్లోంచి గాలి శబ్దం చేస్తూ లోపలికి పీలుస్తూ !
 
“ఎలా వీసె ?” అని బామ్మ అడగటం ఆ ముసలోడు ముందు ఆకు పులుపు చూడండమ్మా అని చాలా భరోసాగా అనటం,  బామ్మ పులుపు చూసి కన్ను కొట్టకుండా తమాయించుకుంటూ వీసె ఎంతకిస్తావు అని మళ్ళా అడగటం జరిగింది. 
 
ముసలాయన “ఎన్ని వీసెలు కావాలమ్మ గారూ !” అని అంటూ “వీసె రూపాయి” అన్నాడు గంపలో గోంగూర మీద నీళ్లు చల్లుతూ.....
 
“ఎందుకలా అన్ని నీళ్లు చల్లుతావ్ ! నువ్వు వీసె అని చెప్పి ఇస్తావ్ అది చివరికి మూడు సవాసేర్లు కూడా ఉండదు,”  అని ఆ నీళ్లు చల్లడం ఆపించింది!
 
ఆపిస్తూనే గంపంతా రూపాయా అని అనటం ......వాడికి ఎక్కడో మండి, గంపే కాదమ్మా! రేపు వచ్చేటప్పుడు మా పొలంలో గోంగూరంతా కోసి బండి కట్టించుకొచ్చి మీ ఇంట్లో దింపుతా ఆ రూపాయి నా మొహాన కొట్టండి చాలు అని వెటకారంగా అనటం జరిగింది. 
 
మా బామ్మ ఆ గోంగూర అమ్మేవాడు ఫ్రెండ్స్ లెండి. మా బామ్మకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఓ ఇద్దరు ముగ్గురున్నారు! చింతకాయలమ్మే వాడు, పెద్ద ఉసిరి కాయలమ్మేవాడు, ఈ గోంగూర పెద్దయ్య..... ఇలాంటి వాళ్ళు.
 
అతను వీసె రూపాయి అనటం బామ్మ అర్ధ రూపాయి అనటం చివరికి పదెణాలకు బేరం కుదరటం ఆ తర్వాత ఓ అయిదారు వీసెలు కొనటం జరిగేది. అలాగే మిరప్పళ్లు కూడా మూడు నాలుగు వీసెలు కొనేది!
 
“ఒరేయ్ భరతుడూ!  అతనికి డబ్బులు ఇచ్చి పంపించు” అంటూ గోంగూర, మిరప్పళ్లు  లోపలికి తీసుకెళ్లింది బామ్మ!
 
మా అమ్మ మడి చీర ఒకటి మధ్యకి మడతేసి హాల్లో పరిచి ఈ గోంగూర, మిరప్పళ్ళూ  అరబోసింది. బయట ఆరబోయచ్చు కదే బామ్మా! అంటే బయట ఆరబోస్తే గాలికి ఇసక పడి కసకసలాడుతుందిరా పచ్చడి అనేది. 
 
అరచేతి వెడల్పున గోంగూర ఆకు మన చేతి వేళ్ళ లాగా కనపడుతూ ఉండేది. నెమ్మదిగా అది ఆరి ఆరి మధ్యాహ్నానికి కొద్దిగా వడలిపోయేది. అప్పుడు బాగుచేసి......... బాగుచేయటం అంటే ఎర్రగా ఉంటాయి ఈ పుల్ల గోంగూర కాడలు. అవి తుంచేసి, కొన్ని ఆకులు చిల్లులు పడి ఉండేవి అవి జాగ్రత్తగా ఏరేసి, ఏ పురుగూ లేకుండా ఆకు వెనకా ముందూ చూసి ఆ తర్వాత మా ఇంట్లో ఓ ఇండస్ట్రియల్ సైజు సత్తు బాండీ ఒకటుంది లెండి!  ముఖ్యంగా ఇలాగ గోంగూర లాంటివి వేయించుకోవడానికి, ఆవకాయ లాంటివి కలపటానికి వాడతారు. ఇప్పటికీ అది మా ఇంట్లో ఉంది!  దాన్లో బాగా నల్లగా  వేయించటం ...బాగా వేగకపోతే పచ్చడి పాడై పోతుంది, కసరు వాసన వస్తూ.  అంతే కాదుట త్వరగా బూజు పట్టే అవకాశం కూడా ఎక్కువట!
 
ఇలా వేయించిన గోంగూర కొద్దిగా రోట్లో దంచి రాళ్ల ఉప్పు కలిపి పాళంగా నువ్వు పప్పు నూనె కలిపి ఓ పక్కన పెట్టేది అమ్మ.  దర్శకత్వం బామ్మది. స్క్రీన్ ప్లే అమ్మది.  బామ్మ ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెపితే అమ్మ అలా చేసేది. అలా ఎందుకే దంచటం అని అడిగితే ....కొంచం గోంగూర నలిగి ఉప్పు రాళ్ళు కొద్దికొద్దిగా కరిగి ఊట వచ్చి పచ్చడి రుచిగా ఉంటుందిరా అనేది. నాకేమో అమ్మ ఒక్కతే ఇంత చాకిరీ చెయ్యాల్సివస్తున్నదే అన్న బాధే ఎక్కువగా ఉండేది.
 
కానీ ఆనాడు మా బామ్మిచ్చిన ఆ ట్రైనింగే ఇవాళ మా పబ్బం గడుపుతున్నది. ఈ పచ్చళ్ళు పెట్టడంలో మా బామ్మ దగ్గర మా అమ్మ పి హెచ్ డి చేస్తే, మా అమ్మ దగ్గర మా ఆవిడ ఎం ఫిల్ చేసింది! అమ్మ ఆవకాయ, గోంగూర, చింతకాయ, ఉసిరికాయ ఇలా ఏ పచ్చడి పెట్టినా అమ్మతో పాటు కూడా ఉండి సాయం చేయటమే కాకుండా కాలక్రమేణా సొంతగా పచ్చళ్ళు పెట్టుకోవటం అలవాటు చేసుకుంది మా ఆవిడ.
 
మోటారు సైకిల్ మెకానిక్ షెడ్డులో రెంచులు, స్పానర్లు అందించటానికి చేరిన బుడ్డోడు ఓ నాలుగైదేళ్ళలో వేరే సొంత షెడ్డు పెట్టుకుని మెకానిక్కు అవతారమెత్తినట్లు మా ఆవిడ కూడా నా ఉద్యోగం, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ల తిరుగుళ్లతో సొంతంగా పచ్చళ్ళ పరిశ్రమ స్థాపించి మా పబ్బం గడుపుతోంది. మనలో మాట..... అత్తగారి లాగా బాగా పెడుతుంది కూడా అన్ని పచ్చళ్ళు.
 
మళ్ళా కథలోకి......
మిరప్పళ్ల నాణ్యత ఖాయం చేయటం కూడా  ఓ గొప్ప కళే! పళ్ల తొడిమెలు పచ్చగా మెరుస్తూ ఉంటే అవి చాలా ఫ్రెష్ అన్నమాట. తొడిమ కొద్దిగా వాడినా, తొడిమ పండును పట్టుకునే ముచ్చిక భాగంలో ఆకుపచ్చ చిగుళ్ళు కొంచం గిరజాల జుట్టులాగా వెనక్కి తిరిగి నల్లబడ్డట్టు కనిపించినా అవి తాజా పళ్ళు కాదని లెక్క! అంతే కాదండోయ్!  పండు బరువు తక్కువగా వుండి, మెరుపు తక్కువగా వుంటే అవి డెఫినెట్ గా ఫ్రెష్ కానట్టే. వాటిల్లో ఊట తక్కువగా ఉండి కారం రుచిగా ఉండదు. పండు మరీ లావుగా ఉంటే కారం తక్కువగా ఉండి ఊట ఎక్కువై పచ్చడి కి త్వరగా బూజు పట్టే ప్రమాదం ఎక్కువ!
 
ఊరగాయాలజీ!  ఊరగాయ పచ్చళ్ళ దినుసులు, మిరప్పళ్ళు, మామిడి, చింత ఉసిరి ఇత్యాది కాయల నాణ్యం చేయటం చాలా గొప్ప కళే.  కళ అనటంకంటే దాని వెనక వున్న శాస్త్రం చాలా గొప్పది. మరి ఆ రోజుల్లో బామ్మలకు, అమ్మలకు అది దైవ దత్తమైన విద్య. ....... అబ్బెబ్బే కాదండోయ్.  దైవ దత్తమైన విద్య కాదు. దేవుళ్ళకు ఇన్ని రుచికరమైన వంటలూ, పచ్చళ్ళు తెలీవుగా.  అమృతం తప్ప మరో కొత్త పదార్థం తెలియని   దురదృష్టవంతులు .........
 
(మరి మళ్లీ విషయంలోకి వద్దాం! )
ఇప్పుడు మిరప్పళ్లు తొక్కి కొద్దిగా ఉప్పూ చింతపండు కలిపి ఇంకో జాడీలో పెట్టేవాళ్ళు. ఆ తర్వాత కొంత తొక్కిన గోంగూర, కొంత పళ్ళ కారం కలిపి మరో జాడీలో పెట్టేవాళ్ళు.
 
తమాషా ఏంటంటేనండీ,ఈ మడీ ఆచారం ఎక్కువగా ఉండే కొంపల్లో కూడా ఆవకాయల రోజుల్లో ఎండు మిరపకాయలు, ఉప్పు, ఆవాలు పనిమనుషుల చేత ఇళ్ళ దగ్గర దంపించుకుంటే పనికొచ్చేది కానీ ఈ పండు మిరపకాయలు, గోంగూర, చింతకాయలు, ఉసిరికాయలు లాంటివి మాత్రం వీళ్ళే తొక్కు కోవాలి, గింజ తీసుకోవాలి ! మడి రూల్స్ లో అవకాశవాదం కదండీ ఇది! అదేమంటే వీటిని రోకలితో తొక్కినా, దంచినా తడి వస్తుంది కాబట్టి మడికి బయటివాళ్ల ప్రమేయం పనికిరాదు. హు! ఎదిరించి గట్టిగా అడిగితే వీపు విమానం మోత మోగుతుంది ఎందుకొచ్చిన గొడవలెండి!
 
ఈ పరిశ్రమ అంతా మధ్యాహ్నం భోజనాలు అవగానే, వంటిల్లు కడిగి శుద్ధిపెట్టి వంటింటి తలుపులు బిడాయించి, మొదలుపెట్టి సాయంత్రం ఆరు ఏడు గంటలకల్లా పూర్తి చేసేవాళ్ళు.
 
తలుపులు బిడాయించారు అంటే ఆసుపత్రి లో ఆపరేషన్ థియేటర్ బయట రెడ్ లైట్ వేసి పెద్దాపరేషన్ మొదలెట్టినట్లే ఇక్కడ కూడా నన్నమాట !
 
ఇంత హడావిడిలోనూ బామ్మకి కాఫీ టైముకి కాఫీ పడాల్సిందే. అమ్మ మడి విప్పి కాఫీలిచ్చి మళ్ళా మడికట్టి పచ్చడి తయారీలో తరువాయి భాగానికి ఉద్యమించేది!
 
ఇహ రాత్రికి హ్యూమన్ ట్రయల్స్ మొదలు!  వేడన్నంలో తాళ్ళు తాళ్ళుగా వున్న పళ్ళ గోంగూర కలిపి, చారెడు పప్పు నూనెతో మర్దించి ముద్ద నోట్లో పెట్టుకుంటే .......దాని తస్సాదియ్యా జన్మ తరించిపోయేది.  ముద్ద నములుతుంటే ఉప్పు గల్లలు పంటి కింద నలుగుతూ లాలాజలంతో సంగమించిన పళ్ళ గోంగూర పచ్చడి రుచి అనుభవించా ల్సిందే తప్ప ఇలా ఎంత చెప్పినా తక్కువే !
 
ఈ గోంగూర పచ్చడి అన్నంలో పచ్చి మిరప కాయలు నమిలి, పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొరికి భోజనం చేస్తే కలిగే అలౌకికానందం ఎంత చెప్పాలని చూసినా కుదర్దు! ఆ ఆనందం తింటే కానీ అనుభవంలోకి రాదు!
ఈ మిరప్పళ్ళ కారంలో  ఇంగువ పోపు పెట్టి వేడి వేడన్నంలో కలిపి ఇంత నెయ్యి దట్టించి, పక్కన ఓ వెన్నముద్ద పెట్టుకుని నంచుకు తింటుంటే......అబ్బబ్బబ్బబ్బబ్బ అంతకంటే మహాయోగం ఏముంటుందండీ.........!
 
అసలు ఈ గోంగూర పచ్చడిలో సన్నగా ఉల్లిపాయలు తరిగి దోరగా వేయించి కలిపి, పోపు తగిలించి తింటుంటే అబ్బ!  నాలుకకు పట్టిన ఆ యోగం, ఆ మనిషికి దక్కిన ఆ భోగం అలాంటిదిలాంటిది కాదుకదా!
 
"........ తన రుచి బ్రతుకులు తనవి గాన....."
 
కొందరు ఈ గోంగూర పచ్చడిలో వెల్లుల్లి పోపు వేసి చేసుకుంటారు! నేను వెల్లుల్లి తినను. అందువల్ల ఆ ఆనందం, అనుభూతి నాకు తెలియవు.
 
బుర్రకో బుద్ధి....జిహ్వకో రుచి.....
 
పొద్దున పూట అమ్మ మమ్మల్ని చుట్టూ కూర్చోపెట్టుకుని చద్దన్నంలో ఈ గోంగూర పచ్చడి, ఆవకాయ లాంటివి కలిపి చేతిలో ముద్దలు పెట్టేది. అబ్బ ఆ రుచే రుచి, ఆ ఆనందమే ఆనందం! ముద్దలు ఎక్స్ట్రాగా పెట్టించుకోవటం కోసం అమ్మని యేమార్చి పక్కవాడి చంకలోంచి చేయిదూర్చి మరో ముద్ద లాగించిన ఆ రోజులు ఎంత మధురం!
 
అమ్మకు ఓపిక తగ్గింత ర్వాత ఇప్పటికీ మా తమ్ముడు ప్రభు ఈ గోంగూర పచ్చడి చద్దన్నం లో కలిపి పప్పు నూనెతో అభిషేకించి మాకందరికీ చేతిలో ముద్దలుపెడితే తింటూనే ఉంటాం! మేం విశాఖలో ఎప్పుడు కలిసినా మాకు ఈ రసనానందం తప్పకుండా కలుగుతుంది.  "ఏమానందము భూమీ తలమున ....."
 
ఒకటి మాత్రం నిజం.  తెలుగువాడిగా పుట్టటం మనదృష్టం! అదీ ఆ రోజుల్లో పుట్టటం! ఆ రోజులు అంటే .....ఇంకా ఇళ్లల్లో భారీగా పచ్చళ్లు పెట్టుకుని ఆనందించే ఆ
ఈ రోజుల్లో పుట్టటం!
 
గోంగూర పచ్చడిని గోరింటాకు ముద్దలా చేసి అమ్మే స్వగృహ ఫుడ్స్ లో కొనుక్కుని తినే దౌర్భాగ్యం, దుస్థితి, అవస్థ లేని ఆ రోజుల్లో పుట్టటం అన్నమాట!
 
horseride banana
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కథ చాల బాగుంది clps yourock thanks
Like Reply




Users browsing this thread: 1 Guest(s)