Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy ఆనందరావూ-ఎటిఎం
#1
ఆనందరావూ-ఎటిఎం
                                         -  Dr.Chivukula Padmaja

ఉదయం ఐదు గంటలు. ప్లాస్టిక్ కవర్ చేత బుచ్చుకుని ఇంటి గేట్ దగ్గరికి వచ్చాడు ఆనందరావు. భార్య వరలక్ష్మి గేట్ బయట వాకిట్లో ముగ్గేస్తోంది
"ఇదిగో, అంతంత ముగ్గులెయ్యకు.చిన్నవి వెయ్యి. వారానికల్లా ముగ్గు ఐపోయిందంటావు. పైగా చీకటి తోనేవేస్తావు. లైటు దండగ. ఎండెక్కాక వెయ్యమంటే వినేడవ్వు" చిరాకుగా తిడుతూ మార్నింగ్ వాక్ కి బయలుదేరాడు. కులాసాగా అన్ని వీధుల్లో వాకింగ్ చేసి, పూలున్న చెట్టు కనిపించటం ఆలస్యం, అన్నీ కోసేసి కవర్ లో వేసుకుని కాలనీ చివర పార్క్ కి చేరాడు. పార్క్ లో వాకింగ్ చేస్తున్న పరమేశం "హలో ఆనందరావు గారూ.. పూలు కోసుకున్నారా" ఎకెసెక్కం గా పలకరించాడు. 
"ఏం పూలండీ.. నా బొంద.అంతా తెలివిమీరి పోయారు. అర్ధరాత్రే కోసేసుకుంటున్నట్లున్నారు, కాసిన్ని కోసుకున్నా అంతే" 
చుట్టుపక్కల వీధుల వాళ్లంతా ముందు రోజు మొగ్గలే కోసేస్తున్నారు. లేకపోతే ఒక్క పువ్వు కూడా వదలడు, చెట్టున్న వాళ్ళు పూల ముఖం కూడా చూడలేకపోయారు చాలా ఏళ్ళు ఆనందరావు దెబ్బకి.
వేప చెట్టు పుల్ల విరిచి దంతధావనం కానిచ్చి, పార్క్ పంపు నీళ్లతోనే ముఖం కడిగి ఇంటికి బయలుదేరాడు.
గేట్ తీస్తూ నేమ్ బోర్డు చూసాడు. సన్నారి ఆనందరావు, సీనియర్ అసిస్టెంట్, R&B అనే బోర్డు మీద ముందు 'పి' రాసి, 'న' వత్తు కొట్టేసి వుంది. అది కాస్త అప్పుడు 'పిసనారి ఆనందరావు' అయింది. 
మండిపడుతూ ఇంట్లో కొచ్చి "వెధవలు వెధవలని, కాస్త డబ్బు దాచుకుంటే చూసి చావలేరు పింజారి వెధవలు" తిడుతూనే పాల ప్యాకెట్, పూలు భార్య చేతికిచ్చాడు. 
"అమ్మయ్యా, కాఫీ కి లేట్ అయిందని చూస్తున్నా. ఇక ఇవ్వండి సామానులు త్వరగా" అంది వరలక్ష్మి వంటింట్లో కెళ్తూ.
ఆనందరావు షెల్ఫ్ తాళం తీసి కావాల్సినంత కాఫీ పొడి, పిల్లలకి హార్లిక్స్ తీసి భార్య చేతికిచ్చాడు.
"ఇదిగో, వంట సామాన్లు ఇవ్వాళ..సొరకాయ పప్పు చేసి, టమాటో చారు పెట్టు" అని పావు సొరకాయ ముక్క, నాలుగు టమేటాలు,కందిపప్పు వగైరా సరుకులు వరలక్ష్మికి ఇచ్చి చెప్పాడు.
ఆ పింజారి వెధవలెవరో బయట బోర్డు మీద రాసినట్లు, ఆనందరావు బహు పిసనారి. పైసా ఖర్చు పెట్టాలంటే పదహారు సార్లు ఆలోచించే రకం. రోజు వంటకు సరిపడా మాత్రమే ఇస్తాడు భార్యకు. సరుకులు, కూరగాయలు సమస్తం అతని ఆధీనం లోనే ఉంటాయి. కావలిసినంత ఇచ్చి షెల్ఫ్ కు తాళం వేసుకుంటాడు. భార్య ఎక్కడ దుబారా చేస్తుందో అని భయం. అదేమి విచిత్రమో, ఆనందరావు ఇచ్చే అన్నీ సరుకులు వంటకు సరిగ్గా సరిపోతాయి. ఎక్కువా కావు, తక్కువా కావు. ఆశ్చర్యపోతూంటుంది వరలక్ష్మి ఆనందరావు టాలెంట్ కి. పెళ్ళైన కొన్నాళ్లలోనే వరలక్ష్మి తరుపు వారికి ఆనందరావు మనస్తత్వం అర్ధమై పోయింది. వరలక్ష్మి ని చూడడానికి అప్పుడప్పుడు వచ్చిపోతారే తప్ప, ముద్ద ముట్టరు. "ఫర్వాలేదు, మీ వాళ్ళు సంస్కారవంతులేనే, ఏమి ఆశించరు" పొగుడుతాడు ఆనందరావు. కొరకొర చూస్తుంది వరలక్ష్మి. ఇంక ఆనందరావు తరపు వాళ్ళైతే, ఇంక చెప్పక్కర్లేదు. మనిషి వున్నాడన్న సంగతే మర్చిపోయారు.
తండ్రి ఇచ్చిపోయిన ఇల్లు, ఒక పోర్షను లో ఆనందరావు కుటుంబం ఉంటుంది. మిగిలిన రెండు పోర్షన్లు అద్దెకిచ్చి టంచను గా అద్దె వసూలు చేస్తుంటాడు.
"మా నాన్న కాస్త పెద్ద ప్లేస్ అన్నా కొన్నాడు కాదు. చుట్టూ స్థలం ఉంటే బోలెడు కూరగాయలు పండించచ్చు. ఖర్చు తప్పేది" కూరలు కొనాలన్నప్పుడల్లా ఒక అష్టోత్తరం చదువుతాడు. 
కూరగాయలు ఇంటిదగ్గర కొనడు, రేట్ ఎక్కువని. తెల్లవారుఝామునే పెద్ద మార్కెట్ కి వెళ్తాడు. అక్కడ రైతులు ట్రక్కుల్లో తెస్తారు కూరగాయలు, ఆకుకూరలు. చవగ్గా వచ్చే కూరలు తప్ప వేరేవి కొనడు. ఆకుకూరలైతే పుష్కలం గా తెస్తాడు. పది రూపాయలకి పది కట్టలు ఇస్తారు రైతులు హోల్సేల్ గా. అక్కడ కొంత మందికి ఆనందరావు సుపరిచితమే. ఆ తర్వాత మూడు నాలుగు రోజులు ఆకుకూర వంటలే. పిల్లలు భయపడిపోతారు ఆకుకూర అనగానే.
"అమ్మా, బిర్యానీ లు , శాండ్విచ్ లు తెస్తారమ్మా మా ఫ్రెండ్స్ అంతా.. నువ్వూ అవ్వి చెయ్యవే" గొడవ చేస్తారు పిల్లలిద్దరూ. రేట్ ఎక్కువ ఉంటాయి అని బీన్స్, కాప్సికం, క్యారెట్ లాంటివి తేడు. "అవ్వి వేస్ట్ రా.. అంతకు మించి ఆకుకూరల్లో పోషకాలు ఉంటాయి" పిల్లల నోరు మూస్తాడు.
ఇలాంటి పనులన్నింటికీ సైకిల్ మీదే వెళ్తాడు. ఆఫీస్ కైతే మటుకు సగం దూరం నడిచి, మిగిలిన సగం షేర్ ఆటో ఎక్కుతాడు, డబ్బు తక్కువ ఇవ్వొచ్చని.
ఇంటికి కావాల్సిన సరుకులు టోకున ఒక సంవత్సరానికి సరిపడా కొంటాడు పెద్ద బజార్ లో. మొత్తం మీద విడిగా కొన్నదానికి, ఇలా ఒకేసారి కొన్నదానికి చాలానే తేడా ఉంటుంది. కాకపోతే వాటన్నిటిని మేడ మీద ఎండపోసి బాగుచేసే డ్యూటీ వరలక్ష్మిది. 
"ఇంతోటి మన ఇంటికి ఎవరు వస్తారని ? ఇంత సరుకు కొనేబదులు కాస్త కాస్త నెలకు తెస్తే నాకు ఈ చాకిరీ తప్పుతుంది" అంది వరలక్ష్మి ఒకసారి.
"పిచ్చిమొహమా.. నేనలా తెచ్చాను కాబట్టే మంచిది అయ్యిందే. ఇప్పుడు చూడు కందిపప్పు రెండువందలు అమ్ముతున్నారు బయట.. నేను తెచ్చింది అరవై కి. ఎంత లాభమో చూడు" తిరిగి ఏమి అనలేని డైలాగ్ కొట్టాడు ఆనందరావు. పైగా "మీ అయన తెలివితేటలు తక్కువ అంచనా వెయ్యవాకు" మీసం తిప్పాడు.
"అబ్బో సంబడం" మూతి ముప్ఫయి వంకర్లు తిప్పింది వరలక్ష్మి.
పెద్ద బజార్ కాక ఆనందరావు కి ఇష్టమైన షాపింగ్ ప్లేస్ మరొకటి ఉందండోయ్. అదే మాయాబజార్. అంటే దొంగ వస్తువులు, కస్టమ్స్ కట్టకుండా తెచ్చిన ఐటమ్స్ అమ్మే ప్లేస్. ఇంటికి కావాల్సిన ఫ్యాన్ ల్లాంటి వస్తువులు గాని, వాచీలు గాని అక్కడే కొంటాడు. చాలా చీప్ గా వస్తాయి. పిల్లలకి, తనకు రెడీమేడ్ బట్టలు, చివరికి వరలక్ష్మికి చీరలు కూడా అక్కడే కొంటాడు. అసలు కొనడం చాలా అరుదు గాని, కొంటే మటుకు ఇక్కడే కొంటాడు.
ఒకసారి పండక్కి బట్టలు కొనమని గొడవ చేసారు వరలక్ష్మి, పిల్లలూను. సరే పదండి అని బయల్దేరతీసాడు. ఒక్కసారి అడగ్గానే ఒప్పుకున్నాడేంటి చెప్మా, అది కూడా ఎప్పటిలా తాను తేకుండా మనల్ని రమ్మన్నాడు అని చెంగు చెంగు మని చెంగనాలు వేసుకుంటూ ఫాలో అయిపొయ్యారు.
పెద్ద షాపింగ్ మాల్ కి వెళ్లారు కుటుంబం అంతా. వెళ్ళగానే పెద్ద హాల్ లో అన్ని టేబుల్స్ మీద రంగు రంగుల చీరలు. సంబరంగా చూస్తోంది వరలక్ష్మి.
"వదిన గారు.. మీరొచ్చారా?" గబా గబా వచ్చింది తమ ముందు పోర్షన్ లో వుండే మీనాక్షి.
"అవును. పండగకి బట్టలు తీసుకుందామని వచ్చాము" మురిసిపోతూ చెప్పింది వరలక్ష్మి.
"మరేంటి. ఇక్కడ చూస్తున్నారు?. ఇవ్వన్నీ ఆఫర్లు. క్వాలిటీ ఉండదు. బాగుండవు. పట్టు చీర తీసుకోమన్నారు నన్ను మీ అన్నయ్య గారు" మెలికలు తిరిగిపోతూ చెప్పింది మీనాక్షి.
వరలక్ష్మి కి కళ్ళనీళ్ళే తక్కువ. తమ ఇంట్లో అద్దెకుండే ఆమెకు పట్టుచీరా, తనకు బోడి రెండు వందల్లో ఆఫర్ చీరా! ... ముక్కులెగబీల్చి మొగుడ్ని శాపనార్ధాలు పెట్టుకుంటూ విస విసా బయటికి నడిచింది వరలక్ష్మి.. ఇక ఎంత చెప్పినా వినదు. ఆ రెండు వందలయినా మిగిలినందుకు సంతోషపడ్డాడు ఆనందరావు.
 ఇంక సినిమాల సంగతి చెప్పక్కర్లేదు.
 "నాన్నా..నాన్నా..సినిమా కెళ్దాం నాన్నా.." గారంగా అడిగారు పిల్లలొకసారి.
 "అదేమిట్రా.. మొన్ననేగా చూసాం"
"మొన్నేం చూసాం" ఆశ్చర్యంగా మొహం పెట్టారు పిల్లలు.
"బాహుబలి" చెప్పాడు ఆనందరావు.
"ఏంటీ .. అది మొన్ననా.. అది వచ్చి నాలుగేళ్లయింది" చేతులు తిప్పుతూ అంది వరలక్ష్మి.
 
"అవునా.. నాకేంటి.. నిన్నా మొన్న లాగుంది, అస్సలు గుర్తులేదు" ఆశ్చర్యపడిపోయాడు ఆనందరావు.
 "అవునవును ఎందుకుండదు. నాకు మటుకు తలకొట్టేసింది కాబట్టి నాకు బాగా గుర్తుంది"
"ఎవరు కొట్టారు నీ తల" వెటకారంగా అడిగాడు.
"ఇంకెవరు తమరే. అక్కడ కొంటే డబ్బులవుతాయని నా చేత పిల్లలకి పాప్కార్న్, మీకు గారెలు చేయించి ప్యాక్ చేసుకొచ్చారుగా, గుర్తు లేదా?" నిలదీసింది వరలక్ష్మి.
 అక్కడ గారెల వాసన దెబ్బకి సినిమా హాల్ వాడు చెక్ చేసి బయట ఫుడ్ తేకూడదు అని తీయించేసాడు. వాడి మీద యుద్ధానికి వెళ్ళాడు ఆనందరావు "మా ఇష్టం, మేం తెచ్చుకుంటాం, మాకు బయటివి పడవు, పైగా మీవి రేట్లెక్కువ" అనుకుంటూ. చుట్టూ అందరూ నవ్వటమే. సిగ్గుతో చచ్చిపోయింది వరలక్ష్మి.
"మీ కోసమే కదే. పిల్లలకి బయటవి ఎమన్నా చేస్తాయని కదా నా బాధ" సమర్ధించుకున్నాడు ఆనందరావు.
అలాగని పిల్లలకి ఎమన్నా జ్వరాలు, జలుబులు వస్తే హాస్పిటల్ కి తీసుకెళ్ళడు. ఇంటి దగ్గర గవర్నమెంట్ హోమియో క్లినిక్ వుంది. ఇంటిల్లిపాదికి వైద్యం అక్కడే. అక్కడయితే పెద్దగా జనాలు వుండరు, ఖర్చు ఉండదు. బయట ప్రైవేట్ హాస్పిటల్స్ కి అయితే బోల్డంత చమురు వదుల్తుంది.
పిల్లలని మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ కాకుండా ఇంటి దగ్గరి ఒక మాదిరి ప్రైవేట్ స్కూల్ లో వేసాడు. వరలక్ష్మి అదే అడిగింది పిల్లలని చేర్చినప్పుడు. "పిచ్చిమొహమా.. ఇలాంటప్పుడు డబ్బు చూసుకోకూడదే. గవర్నమెంట్ స్కూల్ మనకి దూరం లో వుంది. రోజూ తోడు వెళ్లి తేవాలి, నాకా ఆఫీస్ తో కుదరదు, నీకా ఇంట్లో పని, అదీ కాక వాళ్ళని కాస్త బాగా చదువుకోనీ" ఉపదేశించాడు.
 పిల్లల చదువు మీద కాస్త శ్రద్ధ కాబట్టి ఊరుకున్నాడు కానీ, లేకపోతే గవర్నమెంట్ స్కూల్ లో మిడ్ డే మీల్స్ వదిలేవాడా.. అనుకుంది వరలక్ష్మి. అయితే స్కూల్ ఫీజులు మాత్రం బాగా లేట్ గా కడతాడు. వీలైనంత వరకు బ్యాంకు వడ్డీ వస్తుంది కదా అని.
ఒకరోజు పొద్దున్నే తలుపు కొట్టారెవరో. వరలక్ష్మి తలుపు తీసింది. 
"మేము రైన్ బో NGO నుంచి వచ్చాము" అని వాళ్ళ బ్రోచర్ ఇచ్చారు. "చాల మంది చిన్నపిల్లలకి కంటి ఆపరేషన్స్, గ్రహణమొర్రి ఆపరేషన్స్ చెయ్యాలని ఈ ఊర్లో క్యాంపు పెడుతున్నాము. మీకు తోచిన విరాళం ఇవ్వండి" 
వరలక్ష్మి అది చూస్తూ ఉండగానే, ఆనందరావు టవల్ చుట్టుకుని బాత్రూం నుండి దూసుకొచ్చాడు.
"ఆ.. ఏంటయ్యా.. విరాళమా.. ఇట్లాగే చెప్పి అన్ని డబ్బులు నొక్కుతారు. ఎన్నో చూసాం లే ఇలాంటివి వెళ్ళండి. వెళ్ళండి" విసురుగా అన్నాడు.
"సార్. మేం అలాంటివారం కాదు సార్. కావాలంటే మీరు ఇక్కడ 'ఆదిత్య హాస్పిటల్స్' లో కనుక్కోండి. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ క్యాంపు కండక్ట్ చేస్తున్నాం. మీకు నమ్మకం కుదిరాక, ఆ బ్రోచర్ మీద నెంబర్ కి ఫోన్ చెయ్యండి సర్. లేదంటే హాస్పిటల్ లో మా పేరు చెప్పి ఇచ్చినా ఇదే ఫండ్ కి చేరుతుంది సార్" చాల మర్యాదగా చెప్తున్నారు వాళ్ళు.
"ఆ నాకదో పని..పోండి. పోండి" విసురుగా తలుపేసి వరలక్ష్మి కేసి తిరిగి "ఎవరు పడితే వాళ్ళని రానిస్తావేమే వెర్రి దానా. ఆ వంక బెట్టి ఇల్లంతా దోచుకుపోతారు" క్లాస్ పీకాడు. "అన్నట్లు ఆ బ్రోచర్ వుంచు. గట్టి గా వుంది. రేపు ఎండాకాలం కరెంటు పోతే విసురుకోవటానికి పనికి వస్తుంది". గట్టి శుభలేఖలు లాంటివి కూడా వదలడు ఆనందరావు ఇలాంటివాటికి పనికొస్తాయని. 
తలకొట్టుకుని ఉస్సురని నిట్టూర్చి తిరిగి పనిలో పడింది వరలక్ష్మి.  
ఆ రోజు ఆనందరావు పిల్లలు స్కూల్ నుంచిఏడ్చుకుంటూ వచ్చారు. "రేపు స్కూల్ ఫీజు కట్టకపోతే పిల్లల్ని స్కూల్ కి రావద్దన్నారుట" ఆ సాయంత్రం ఆనందరావు రాగానే చెప్పింది వరలక్ష్మి. 
"ఆహా.. రేపు పదో తారీకు. రేపు బ్యాంకు ఇంటరెస్ట్ పడ్డాక ఎల్లుండి తెచ్చి ఇస్తాలే" నింపాదిగా అన్నాడు ఆనందరావు. 
"ఇంకెప్పటికీ మారరా మీరు. నేనంటే అన్నిటికి సర్దుకున్నాను. పిల్లలికి స్కూల్ లో ఎంత నామోషీ నో ఆలోచించరా? వాళ్ళు అవమానపడితే మీకు బాగుంటుందా.. రోజు రోజు కీ మీ పీనాసితనం తో కుంగిపోతున్నాం. నేను నా పిల్లలు ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే మీకింక డబ్బులే డబ్బులు మిగులు" మెటికలు విరిస్తూ ఏడ్చింది వరలక్ష్మి.
"ఊరుకో ఊరుకో.. ఇప్పుడేమన్నాను.. సరే.. రేపు పొద్దున్నే లేపు. ఎటిఎం కి వెళ్లి నీకు డబ్బులు తెచ్చి ఇచ్చి, పెద్ద బజార్ కెళ్ళి సరుకులు తీసుకొస్తాను"
***
పొద్దున్నే ఆరు గంటలకల్లా సరుకుల కోసం పెద్ద సంచులు తీసుకుని ముందు ఎటిఎం కి వెళ్ళాడు. "ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ కార్డు" అని గొంతు వినిపిస్తోంది. కార్డు పెట్టి మొదట పదివేలు కొట్టాడు. ఆశ్చర్యంగా డబ్బులు వరుసగా వస్తూనే వున్నాయి. పది సార్లు, పది పదివేలు, లక్ష.. ఏమీ అర్ధం కాలేదు ఆనందరావు కి. 
"మీరు లక్ష రూపాయలు డ్రా చేసారు. ఇవి దాన ధర్మాలు చెయ్యాలి. ఎవరికి ఎంత అవసరమో అడిగి అంతే ఒక్కసారే ఇవ్వాలి. బాగ్ లో చేయి పెడితే వచ్చినంతే ఇవ్వాలి. పారేయకూడదు, దాచుకోకూడదు, ఏమి కొనకూడదు. స్వంతానికి వాడకూడదు. సాయంత్రం ఆరు గంటల లోపు డబ్బు అయిపోతే, మీ బ్యాంకు బాలన్స్ డబుల్ అవుతుంది, ఐపోక పోతే జీరో అవుతుంది" మళ్ళీ ఎటిఎం లోంచి వినిపించింది.
అద్దిరిపడ్డాడు ఆనందరావు. నమ్మబుద్ధి కాలేదు. చేతి లో చూస్తే నిజంగానే లక్ష వున్నాయి. భ్రమ అనుకోటానికి లేదు, చెవులారా విన్నాడు. చుట్టూ చూసాడు. ఎవరూ లేరు. అక్కడే మెట్లమీద కూలబడి ఆలోచించాడు. సరే ఇదేంటో చూద్దాం. డబ్బు దాచాలంటే కష్టం కానీ, దానం చెయ్యాలంటే ఎంతసేపు. అంతా అయిపోతే, బ్యాంకు లో పది లక్షలు వుంది, అవి కాస్తా ఇరవై లక్షలు అవుతాయి. ఆనందం తో తలమునకలయ్యాడు.
ఇక్కడినుంచే మొదలు పెడదాం అని చుట్టూ చూసాడు. ATM పక్కన ఎప్పుడు ఒక బిచ్చగాడు ఉంటాడు, ఎప్పుడూ ధర్మం ధర్మం అని ప్రాణం తీస్తుంటాడు. లేచి వెళ్లి పడుకున్న బిచ్చగాడ్ని లేపాడు. 
"నీకు డబ్బులు అవసరమా.. ఎంత ఇవ్వమంటావ్" అడిగాడు.
బిచ్చగాడు అయోమయం గా చూసాడు. వందసార్లడిగినా ఎవరూ ఇవ్వరు. ఈయనేంటి లేపి మరీ అడుగుతున్నాడు అనుకుని "పది రూపాయలియ్యండయ్యా..టీ తాగుతాను" అన్నాడు.
పది రూపాయలా.. వీడి మొహం మండ. కాస్త ఎక్కువ అడక్కూడదూ.. తిట్టుకుంటూ పది రూపాయలిచ్చి బయటపడ్డాడు.
తర్వాత ఎక్కడికా అని ఆలోచిస్తుంటేపోయిన వారం గుడి కి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి తన కూతురి పెళ్లి అని ఎవరికి తోచినంత వారివ్వమని అడగటం గుర్తు వచ్చింది. అమ్మయ్య.. పెళ్లి అంటే చాలా అడుగుతారు.. డబ్బులు దెబ్బకి అయిపోతాయి అని మురుసుకుంటూ గుడి కేసి దారితీసాడు.
తీరా గుళ్లో ఎప్పుడూ వుండే పూజారి కాకుండా ఇంకొక చిన్న వయసు పూజారి పూజ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. 
"స్వామీ, పూజారి గారు.." గొణిగాడు ఆనందరావు.
తమలపాకులు శుభ్రం చేసుకుంటూ "మా బంధువులే.. వారి అమ్మాయి పెళ్లి అన్నవరం లో. అందుకే ఇక్కడ చెయ్యమని నాకు అప్పగించారు" చెప్పాడతను.
ఓరినీ. డేట్ తెలుసుకోలేకపోతినే అయ్యో.. మంచి ఛాన్స్ పోయిందే. అనుకుంటూ పోనీ కనీసం ఈయన్నే అడుగుదాం అని "స్వామీ, మీకేమన్నా డబ్బు అవసరమా?" అడిగాడు.
ఈయనేదో.. ధర్మకర్త అయ్యుంటాడు. తనను పరీక్షించటానికి అడుగుతున్నాడు.. అనుకుని "అవసరం లేదండి. అన్నిటికి మాకు ఆ దేవుడే వున్నాడు" చెప్పి బావి దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఉస్సురంటూ బయటకి వచ్చాడు ఆనందరావు, అక్కడ కూర్చున్న ఇద్దరి బిచ్చగాళ్ల కన్నా ఇద్దాం అని బాగ్ లో చెయ్యి పెట్టాడు. అయిదు వందలు వచ్చింది. ఒకళ్ళకి ఇచ్చాడు. ఆ బిచ్చగాడు అదిరిపోయి పైకి కిందికి చూస్తున్నాడు. ఆనందరావు ఇంకా అక్కడే నిలబడడం చూసి "చిల్లర ఇవ్వమంటారా బాబయ్యా" అన్నాడు.నాకే ఎట్లా ఖర్చు కావాలిరా అని చూస్తుంటే నాకు చిల్లర కుడా ఇస్తావా.. తిట్టుకుంటూ "వద్దు. మొత్తం నీకే" అన్నాడు. అది చూసిన పక్కన బిచ్చగత్తె "నాకు ఐదు వందలియ్యండి బాబయ్యా.. పిల్లలున్నారు" అంటూ ఆత్రంగా ఎదురు వచ్చింది. ఓసినీ.. నీకు ఇంతేనా! ఎక్కువ అడక్కూడదుటే.. సణుక్కుంటూ ఐదు వందలు ఇచ్చి రోడ్ మీద కి వచ్చాడు.. ఛీ.. ఛీ.. ఒక్కడు కూడా లక్ష రూపాయలు అడగడు.. పోనీ తానే ఎక్కువ తీసి ఇద్దామా అంటే తనేమో మొదలే పిసినారి కనుక చేతికి ఎక్కువ డబ్బులు రావు..నడుస్తూ వస్తుంటే రైలు పట్టాల పక్కన గుడిసెలు కనిపించాయి.. అమ్మయ్యా.. వీళ్లకు డబ్బు అవసరం ఉంటుంది..పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఒక గుడిసె ముందు ఒక ముసలామె మంచం మీద కూర్చుని వుంది. ఆనందరావుఆమె దగ్గరికి పోయి "అవ్వా, అవ్వా..పెద్దదానివి.. నీకేమైనా రోగముందా? చెప్పు. నేను డబ్బులు ఇస్తాను ఎంత కావాలన్నా" అన్నాడు.
ఆమె చటుక్కున "ఒరేయ్ మల్లేసు, ఓబులేసు.. రండిరా.. వీడెవడో నాకు రోగం, గీగం అని పిచ్చి పిచ్చి గా వాగుతున్నాడు" అరిచింది గుడిసెల్లోకి చూస్తూ. ఆమె అరుపులు విని నలుగురు కర్రలతో బయటికి వచ్చారు "ఎవడ్రా అది?"
 ఆనందరావు కి ముచ్చెమటలు పోశాయి. వామ్మో వీళ్లొచ్చి మీద పడితే ఎముకల్లో సున్నం ఉండదు అని కాలికి బుద్ధి చెప్పి పరిగెత్తాడు. వాళ్ళు వెనకపడ్డారు. చాల దూరం పరిగెత్తి , పరిగెత్తి ఒక చోట ఫుట్ పాత్ మీద కూర్చుని అలుపు తీర్చుకున్నాడు. 
తేరుకుని చూస్తే మార్కెట్ దగ్గర ఉన్నట్టు అర్ధం అయింది. ఆలోచించాడు.. తాను ఎప్పుడు కూరలు కొనటానికి వచ్చినప్పుడు చుట్టూ పక్కల వూళ్ళ నుంచి వచ్చిన రైతులు మార్కెట్ లో టీ బంక్ దగ్గర కూర్చుని డబ్బు లెక్క చూసుకుని వెళ్ళటం గమనించాడు. చాలా సార్లు వాళ్ళ సాధకబాధకాలు విన్నాడు. ఇదీ మంచి ఐడియా. వాళ్ళ ని అడిగితే గ్యారంటీ గా కష్టాలు ఉంటాయి కాబట్టి డబ్బులివ్వచ్చు .. మొహం చాట అంత ఐంది ఆనందరావు కి. లేచి టీ బంక్ దగ్గరికి వెళ్ళాడు.
ఓ ఇద్దరు, ముగ్గురు రైతులతో మాటలు పెంచి "మీకేమైనా అవసరాలున్నాయా? డబ్బు కావాలా?" అడిగాడు.
"వడ్డీ వ్యాపారమా?" అడిగారు రైతులు. 
"కాదు, కాదు.. నేను ఊరికే ఇస్తాను డబ్బులు. నాకు తిరిగి ఇవ్వక్కర్లేదు
 
 "ఏందీ.. ఊరకే ఇస్తావ్.. మేమేమైనా అడుక్కునేవాళ్లమా? చెమట చిందిస్తాం, మా డబ్బు మేం తింటాం. పో పోవయ్యా.. నీకు పొద్దున్నే మేం దొరికామా ఆడుకోడానికి" గయ్యిమన్నారు అందరూ ఒక్కసారి.
"అది కాదు" సర్దిచెప్పబోయాడు ఆనందరావు.
"ఏది కాదు" లేచి భుజం మీది తువ్వాళ్లు దులుపుతూ వచ్చారు మీదకి.
పక్కనుంచి ఆనందరావు మొహం తెల్సిన రైతులు కొంతమంది వచ్చారు. "అయ్యా మీరా!.. సారు తెల్సిన వాడేలెండిరా. అయినా మీరేంది సారూ.. ప్రపంచం లో ఎక్కడా లేని బేరం ఆడతారు.. అట్టాటిది ఊరికే డబ్బులిస్తారా.. ఇదిగో తీసుకుపోండి" మిగిలిన ఆకుకూర కట్టలు నాలుగు ఇస్తూ అన్నాడొక రైతు.
అబ్బాబ్బా. ఉట్టి మూర్ఖులు లాగ ఉన్నారే. మింగలేను, కక్కలేను.. ఒక్కడికీ డబ్బవసరం లేదా? పైగా నాకే ఆకుకూర ముష్టా?.. ఛీ.. ఛీ.. నా ఖర్మ ఇలా కాలింది ఇవ్వాళ. రోజు అయితే ఎగిరి గంతేసి తీసుకుందును ఎక్స్ ట్రా కట్టలు.. మళ్ళీ నడకదారి పట్టాడు ఆనందరావు. 
కాస్త ముందుకు నడిచాక సిగ్నల్ దగ్గర సెక్యూరిటీ అధికారి కానిస్టేబుళ్లు కనిపించారు. ఓవర్ లోడ్ వున్న ఆటో లని, హెల్మెట్ లేని బళ్ళని పక్కకి ఆపుతున్నారు. ఆ... వీళ్ళు కరెక్ట్. బళ్ళ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు కాబట్టి, తనకి పండగే.. నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి చేరాడు ఆనందరావు.
"సార్, మీకేమైనా డబ్బు అవసరమా? నేను ఇస్తాను సార్ మీకు వూరికెనే" చెవులో చెప్పాడు ఒక సెక్యూరిటీ అధికారి కి. అనుమానం గా చూసాడతను.. లాఠీ పట్టుకుని "ఏందీ.. నాకు డబ్బులిస్తావ్.. అసలు నీకు డబ్బెక్కడిది రా.. ఎక్కడ కొట్టుకొచ్చావ్" ఆనందరావు చొక్కా పట్టుకున్నాడు ఆ సెక్యూరిటీ అధికారి. "సార్ . సార్ .. నేను దొంగని కాదు సార్" గింజుకున్నాడు ఆనందరావు.
 "తెలుస్తూనే ఉందిలే.. మెంటల్ వెధవా...ఫో... మళ్ళీ కనిపించావంటే బొక్కలో తోస్తా.." జాలిగా వదిలేసాడు సెక్యూరిటీ అధికారి.
బతుకుజీవుడా అని యధాప్రకారం పరుగందుకున్నాడు ఆనందరావు. వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆగాడు. ఇక్కడన్నా ఎవరైనా దొరుకుతారేమో అని లోపల కి వెళ్లి అందరిని గమనిస్తున్నాడు. ఇంతలో పెద్ద కోలాహలం.. ఒకావిడ రాత్రి ప్రసవిస్తే పొద్దున్నకల్లా బిడ్డని ఎత్తుకెళ్లిపోయారట ఎవరో.. సెక్యూరిటీ అధికారి లు, వెతుకులాటలు, మీడియా వాళ్ళొచ్చారు, పెద్ద గొడవ. . పేషెంట్స్ కానీ వాళ్ళందరిని పట్టుకుని ఎంక్వయిరీ కి తీసుకుపోతున్నారు. ఆమ్మో అని చిన్నగా అక్కడినుండి జారుకున్నాడు ఆనందరావు.
ఆలోచించాడు కాస్సేపు. వృద్ధాశ్రమం గుర్తు వచ్చింది. అదేమో వూరి చివర వుంది. పొద్దుటి నుండి ఈ హడావిడి లో సైకిల్ ఎక్కడ మర్చిపోయాడో గుర్తు రాలేదు. బంగారం అంటి సైకిల్. ఆటోల్లో తిరుగుదామా అంటే తన కోసం ఖర్చు పెట్టకూడదాయే. మళ్ళీ అక్కడికి నడక ప్రారంభించాడు.
విశాలమైన ప్రాంగణం. నిండా పెద్ద పెద్ద చెట్లు. ఎండ అస్సలు తెలీట్లేదు. నీరసంగా ఒక చెట్టు కింది సిమెంట్ బెంచీ మీద కూలబడ్డాడు. దాహం, నోరు ఎండుకుపోతోంది. వాచ్ మాన్ ఆనందరావు ని చూసి దగ్గర కొచ్చి "ఎవరు కావాలి సార్" అడిగాడు. దాహం అని సైగ చేసాడు ఆనందరావు. అతను తెచ్చి ఇచ్చిన చల్లని నీళ్లు తాగాక ఓపిక వచ్చినట్లయింది ఆనందరావు కి. "మేనేజర్ గారిని కలవాలి" అడిగాడు.
"రండి" అని ఒక పక్కాగా వున్న ఆఫీస్ రూమ్ కి తీసుకెళ్లాడు ఆనందరావు ని.
 చుట్టూ పరికించి చూసాడు ఆనందరావు. అంతా వృద్దులు. చిన్నగా నడిచే వాళ్ళు, పేపర్ చదివే వాళ్ళు, బెంచీ మీద కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు, ఇంకాస్త పక్కగా వున్న రూముల్లో మంచం మీది పేషెంట్స్..పిల్లలు చూడక వచ్చిన వాళ్ళు కొంత మంది అయితే,ప్రశాంతత కోసం కావాలని వచ్చిన వాళ్ళు మరికొంతమంది.
"కూర్చోండి" మర్యాదగా చెప్పాడు అక్కడి మేనేజర్.
ఆనందరావు కూర్చోగానే "చెప్పండి, ఏ పని మీద వచ్చారు?" అడిగాడు అతను.
"మీ ఆశ్రమానికి డబ్బు ఏమైనా ఇస్తే తీసుకుంటారా?" అడిగాడు ఆనందరావు మేనేజర్ ని. 
"తప్పనిసరిగా" రిసీట్ బుక్ తీస్తూ చెప్పాడు మేనేజర్.
"ఎంత కావాలి మీకు?" అడిగాడు ఆనందరావు.
"ఈ మధ్యనే మరీ ఒంట్లో బాగోలేని పెద్దవాళ్ళు కొంతమంది చేరారు. ఒక పది మంచాల దాకా కొనాలి. ఒక ఇరవై వేలేమైనా..." సందేహిస్తూ అన్నాడు మేనేజర్.
సరే అని డబ్బు తీసి ఇచ్చాడు ఆనందరావు.
అడగ్గానే డబ్బులిచ్చినందుకు సంతోషపడ్డాడు మేనేజర్. "మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ ఆశ్రమాలు నడుస్తున్నాయండి. ఎప్పుడైనా వస్తూఉండండి" రసీదు ఆనందరావు చేతిలో పెడుతూ చెప్పాడు.
తలవూపి బయట పడ్డాడు ఆనందరావు. ఇక్కడ కూడా అంతే. ఎక్కువ అడిగితే అయన సొమ్మేం పోయిందిట.. మనసులోతలపోస్తూ నడుస్తున్నాడు.
ఆ రోజు ఇంక ఊరంతా తిరిగాడు.. ప్రతిచోటా బొక్క బోర్లా పడ్డమే గాని, ఫలితం దక్కలేదు. పెద్ద అమౌంట్ అంటే వృద్ధాశ్రమం లో తప్ప ఇంకెక్కడా లేదు. పదీ పరకా తప్ప ఖర్చవ్వలేదు.. ఎండకు ఎండిన మాగాయ ముక్కలాగా అయ్యాడు ఆనందరావు. తిండి లేదు, తిప్పల్లేవు..డబ్బు ఖర్చు ఎలా చెయ్యాలా అని తప్ప వేరే ఆలోచన లేదు. 
సాయంత్రం అవ్వొస్తోంది. డబ్బుతీసుకునే తలకు మాసిన వెధవ ఒక్కడు కనపడడేం. నీరసంగా వుంది. అడుగులు తడబడుతున్నాయి. చటుక్కున గుర్తొచ్చింది..తన వెనక పోర్షన్ లో అద్దెకుంటున్న రామనాధం వాళ్ళ నాన్నకు హార్ట్ ఆపరేషన్ చేయాలిట. డబ్బు చూసుకుంటున్నాడు, మొన్న అద్దె లేట్ గా ఇస్తానంటే ససేమిరా అన్నాడు తాను. పిల్లి ని చంకలో పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నాను. ఆపరేషన్ అంటే పెద్దమొత్తం కావాల్సి వస్తుంది. ఇస్తానంటే ఎగిరి గంతేసి తీసుకుంటాడు రామనాధం అని ఉత్సాహంగా ఇంటిదారి పట్టాడు. అయ్యో ఇంట్లోకి వెళ్ళకూడదుగా అని వెనక పక్క గోడ అవతలకి వెళ్లి "రామనాధం, రామనాధం" అని పిలిచాడు. 
 రామనాధం ఎవరా అని బయటికి వచ్చి చూసి "మీరా..మీ ఆవిడ పొద్దుటినుండి మీ కోసం కంగారు పడుతున్నారండి.. మీరేంటి ఇక్కడ" ఆశ్చర్యపోయాడు.
"అదంతా తర్వాత చెప్తాలేవయ్యా.. ముందిది చెప్పు.. మీ నాన్న ఆపరేషన్ కదా.. నీకు డబ్బు కావాలి కదా.. ఎంతో చెప్పు నేనిస్తా" ఉత్సాహం గా బాగ్ గోడ మీద పెట్టి తొంగి తొంగి చూస్తూ అడిగాడు.
అనుమానం వేసింది రామనాధానికి... పీక మీద కత్తి పెట్టి ఇంటి అద్దె వసూలు చేసిన వాడు, డబ్బు ఇస్తానంటాడేంటి? పైగా సందులోంచి రహస్యంగా.. ఇందులో ఎదో మతలబు వుంది. "ఇప్పుడే వస్తా" అని ఇంట్లో కి వెళ్లి "ఏమేవ్.. ఒక్కసారి ఇలా రా " భార్య ని పిలిచి పక్కకి తీసికెళ్ళి రహస్యం గా మాట్లాడాడు రామనాధం. 
"ఏంటో మన ఓనర్ నాకు డబ్బు ఇస్తానంటున్నాడే.. అది కూడా ఉరికేట.. అప్పు కాదుట.. పైగా ఎవరికీ చెప్పకూడదుట..నాకేదో అనుమానం గా వుంది. దొంగ నోట్లేమో. నేను ఇక్కడ ఆయన్ని నిలబెట్టి ఉంచుతా. నువ్వు పోయి ఎదురింట్లో చెప్పి సెక్యూరిటీ అధికారి లకు ఫోన్ చెయ్యమను. బొక్కలో వేస్తారు. లేకపోతే సంవత్సరం సంవత్సరం అద్దె పెంచుతాడా..పీనాసి పీనుగ" కసితీరా తిడుతున్నాడు రామనాధం.
"ఒరేయ్.. నువ్వు రహస్యం గా పెళ్ళాంతో మాట్లాడుతున్నా అనుకుంటున్నావురా. పింజారికుంకా.. నాకు ఇక్కడ వినపడుతోంది..నన్ను సెక్యూరిటీ అధికారి లకి పట్టిస్తావ్..చూస్తా, చూస్తా, నీ సంగతి రేపు చెప్తా" తిడుతూ బాగ్ చంకలో పెట్టుకుని మళ్ళీ పరిగెత్తాడు ఆనందరావు.
సాయంత్రం ఆరు దాటనే దాటింది. ఉస్సురంటూ ఎటిఎం దగ్గరికి వెళ్ళాడు ఆనందరావు. డబ్బు ఖర్చు కాలేదు, ఏమౌతుందో ఏమో, మిగిలిన డబ్బు తో పారిపోవటమా? లోపలి వెళ్లటమా? కాస్సేపు మీమాంస పడి, అయినా కొంత ఖర్చు చేసాకాబట్టి పర్లేదులే అని తనకు తానే సమాధానము చెప్పుకుని లోపలి వెళ్లి మిషను లో కార్డు పెట్టాడు. 
"సారీ. మీకిచ్చిన డబ్బు ఖర్చు కాలేదు. కాబట్టి మీ బాలన్స్ జీరో" ఎటిఎం లోంచి హస్కీ వాయిస్ వినిపించింది. స్క్రీన్ మీద బాలన్స్ సున్నా చూపిస్తోంది. పదిలక్షలు .. పదిలక్షలు .. పోయాయా..నా డబ్బు.. నా డబ్బు.. విలపిస్తూ కూలబడిపోయాడు ఆనందరావు.
***
మొహాన చల్ల నీళ్లు తగిలే సరికి లేచాడు ఆనందరావు. "నా డబ్బు.. నా డబ్బు" అంటూ తలెత్తి చూసాడు. వరలక్ష్మి చేతిలో గ్లాస్ తో కనపడింది. "నా లక్ష్మి.. నా లక్ష్మి.." అంటున్నాడు.
"ఏంటి.. ఇందాకేమో నా డబ్బు... నా డబ్బు. . ఇప్పుడేమో ..నా లక్ష్మి.. నా లక్ష్మి..లేవండి" ఇంకాసిని నీళ్లు మొహాన కొట్టింది. "త్వరగా లేచి ఎటిఎం కి వెళ్లి రండి" చెప్పి లోపలికి వెళ్ళిపోయింది.
తెప్పరిల్లి చూసాడు. తన ఇల్లే. తన మంచమే. అంటే ఇదంతా కలా. కానీ నిజ్జంగా జరిగినట్లుందే. చాలాసేపు కల గురించే ఆలోచించాడు ఆనందరావు. అది కలే అయినా ఒక జీవిత సత్యం నేర్పినట్లుంది. గుండాయన చెప్పినట్లు "ఏది ఊరికే జరగదు". లేచి "లక్ష్మీ, మొన్న ఒక NGO సంస్థ వాళ్ళు బ్రోచర్ ఇచ్చారు చూడు, అది తీసుకురా" అడిగాడు. "అదెందుకండీ. ఏమైనా ఇస్తారా పెడతారా?" వంకరగా అంటూ వచ్చింది వరలక్ష్మి. "అవునే.. నేను మారిపోయా.. వాళ్ళకి లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తా" 
"హా.." మూర్ఛపోవటం వరలక్ష్మి వంతయింది.
 
(PUBLISHED IN HASYANANDAM JULY ISSUE)

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice hilarious comedy story  clps yourock Shy
[+] 1 user Likes sri7869's post
Like Reply
#3
మంచి కథ లను సేకరించి మాకు అందిస్తున్నారు, మీ శ్రమ, కృషి వెల కట్టలేనివి సర్, 

Hat's off to you sir  Namaskar Namaskar Namaskar
[+] 1 user Likes sri7869's post
Like Reply
#4
Superb andi...comedy bagundi..
Madhurilatha Heart
[+] 1 user Likes Madhurilatha's post
Like Reply
#5
జంద్యాల గారి సినిమా చూస్తున్నట్లు, మల్లాది కథ చదువుతున్నట్లు చాలా సరదాగా ఉంది k3v3 గారు
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)