Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller చిట్టితల్లి
#1
చిట్టితల్లి
                 - Kiran Vibhavari
 
"బలబల కన్నుల కన్నీరొలికెను
పుత్తడి బొమ్మకు పూర్ణమకు
కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
పుత్తడి బొమ్మా పూర్ణమ్మ"
"నానమ్మ నీకు కూడా చిన్నప్పుడే పెళ్లి అయ్యిందా?! నాన్న ఎప్పుడూ చెబుతూ ఉంటారు.. యెనమండుగురు పిల్లల్ని కనీ పెంచి ప్రయోజకులను చేశావు. ఎప్పుడూ నీ మొహంలో విసుగు అనేదే చూడలేదని చెప్తారు డాడీ. ఇంతమందిని ఎలా కన్నావ్ నాన్నమ్మా? నీకు కోపం రాదా ఎప్పుడూ?" అంటూ చదువుతున్న పాఠం పక్కన పెట్టేసి నానమ్మ చెంతకు చేరింది చిట్టి.
"ఇప్పుడెందుకు చిట్టి తల్లి అవన్నీను? మీ అమ్మొచ్చిందంటే అంతెత్తున లేస్తుంది నువ్వు చదవడం మానేసి కబుర్లు చెప్తున్నావని. పనిలో పనిగా నన్ను కూడా తిడుతుంది నిన్ను గారాబం చేస్తున్నాను అని" సాయంత్రం పూజ కోసం పూల మాల చుడుతున్న రత్నమ్మ.. చిట్టి బుగ్గలను చేతిలోకి తీసుకుని అడిగింది.
"మరే.. మాకు పుత్తడి బొమ్మా పూర్ణమ్మ పాఠం ఉంది నానమ్మ. అందులో పూర్ణమ్మ కి చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తే ఆ ముసలి మొగుడితో ఉండలేక బావిలో దూకి చనిపోతుంది. నీకు కూడా ఎప్పుడైనా అలా చనిపోవాలి అనిపించిందా నానమ్మ" చిట్టి అమాయకంగా అడిగింది.
చిట్టి ప్రశ్నకు పూలమాలను పక్కనపెట్టి గలగలా నవ్వేసింది రత్నమ్మ. "మా చిన్నప్పుడు అంటే నీ అంత వయసు ఉండగానే మా పెళ్లిళ్లు అయిపోయాయి. ఒకవేళ ఎవరికైనా పెళ్లి కాకుండా మిగిలిపోతే అలాంటివారికి అనిపిస్తుంది చనిపోవాలని. నాకెందుకు? మీ తాత ఆరడుగుల అందగాడు. అచ్చం సినిమా యాక్టరు హరిబాబులా ఉంటాడు. మీ తాతని చూసి, నాకు పట్టిన అదృష్టం చూసి స్నేహితురాళ్ళు ఎంతమంది కుళ్ళుకొలేదూ" భర్తను తలుచుకుని మురిసిపోయింది రత్నమ్మ. చిట్టి ఏమి అర్థం కానట్టు ఆమెని అలా చూస్తూ ఉండిపోయింది.
మల్లె పువ్వు లాంటి తెల్లటి గౌనులో, అందాల చందమామ లాగా ముద్దుగా ఉన్న చిట్టిని దగ్గరగా కూర్చో పెట్టుకుంది. గోడమీద ఉన్న తన తల్లి ఫోటో ని చూపిస్తూ, "అదిగో అటు చూడు మీ జేజమ్మ ఉన్నాదే.. ఆవిడకు కూడా నా కన్నా చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది. ఆమెకి 12 మంది సంతానం. వారిలో చిట్టచివరి దాన్ని నేను. అప్పట్లో ఎంత ఎక్కువ మంది సంతానం ఉంటే అంత ఆస్తిగా భావించే వారు. పిల్లల్ని దేవుడిచ్చిన వరంగా భావించేవారు. ఇప్పటిలా ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే చంపేసుకునేవారు కాదు" తన తల్లిని గుర్తు చేసుకుంటూ చెప్పింది రత్నమ్మ. ఆమె మాటలను చిట్టి శ్రద్ధగా వింటోంది.
"మీ అమ్మకి కూడా 18 ఏళ్లకే మీ నాన్నని ఇచ్చి పెళ్లి చేసేసాము. సొంత అన్న కూతురు కాబట్టి అది నా దగ్గర గారాలు పోతూ హాయిగా బతికేస్తోంది." గొప్పలు పోయింది రత్నమ్మ.
"అంటే నానమ్మ , జేజమ్మ కి తొమ్మిదేళ్ల కి పెళ్లయింది నీకు 12 ఏళ్ళకి, అమ్మకి 18 ఏళ్ల కి, కాలంతో పాటు మారుతూ వస్తోంది కదా నానమ్మ మరి అక్కని చదువుకొనివ్వకుండా 20 దాటిపోతోంది పెళ్లి చెయ్యవేట్రా అని నాన్నని ఎందుకు ఎప్పుడు తిడుతూ ఉంటావు. పాపం అక్క నాన్న దగ్గరికి వచ్చి ఏడుస్తోంది.. ఇంకా చదువుకోవాలని ఉందని, తనో పెద్ద ఆఫీసర్ అవ్వాలని, తనకు నచ్చినట్టు బతుకుతానని ఏడుస్తోంది" చిట్టి తలవంచుకు చెబుతోంది.
"కాలంతో పాటు మనం కూడా మారాలి కదా నానమ్మ.." మెల్లిగా చెప్పింది చిట్టి.
"వేలెడంత లేవు నీకేం తెలుస్తది.. ఎవరి నేర్పించారే నీకు ఈ మాటలు. ఆడపిల్ల ఉద్యోగాలు అవీ చేసి మగవాళ్ళ మధ్య తిరుగుతూ ఉద్ధరించే అవసరంలేదు మనకు. తిండికి లోటా బట్టకి లోటా మనకి." ఈ పిల్ల తో మాట్లాడే ఇక అవసరం లేనట్టు లేవబోయింది రత్నమ్మ.
"నానమ్మ జేజమ్మ ఎందుకు జాకెట్టు వేసుకోదు ఆమె ఫోటోలు అన్నిట్లో చీర తో మాత్రమే ఉంటుంది." గోడ మీద ఉన్న రత్నమ్మ తల్లి గారి ఫోటో చూస్తూ చిట్టి రత్నమ్మ ని అడిగింది.
చిట్టి చూడడానికి చిట్టిగా ఉంటుంది కానీ మహా చురుకైనది. ఎవరితో ఎలా మాట్లాడాలి. ఎవరిని ఎలా కూర్చోబెట్టాలి బాగా తెలుసు. చిట్టి అడిగిన ప్రశ్నకి రత్నమ్మ కి మళ్ళీ ఈ పిల్లకి తన తల్లి గారి గొప్పతనం చెప్పేయాలనే కోరిక కలిగి చిట్టి తల మీద ప్రేమగా నిమురుతూ ఆమె పక్కన కూర్చుంది.
"మా అమ్మగారే కాదే.. అప్పట్లో చాలామంది ఆడవాళ్ళు జాకెట్ వేసుకునే వారు కాదు. వారికి అదే అలవాటేమో. నిజానికి జాకెట్ వేసుకోక పోవడం వల్ల జెబ్బలకి, వీపుకు, పొట్టకు మంచి ఎండ తగిలి రోగాలు రాకుండా ఉంటాయి. సన్ బాత్ అంటారు కదా. ఇదే మన పూర్వీకులు మన వస్త్రధారణతోనే సూర్యుడి కిరణాలు శరీరం మీద పడేట్టు చేశారు. మన చీరకట్టులో ఇంతటి ఆరోగ్య రహస్యం ఉంది."
"మరి నానమ్మ జేజమ్మ కి ఎప్పుడు సిగ్గు అనిపించ లేదా? నువ్వు ఎప్పుడు జేజమ్మ ను తిట్టలేదా? జాకెట్టు వేసుకోమని చెప్పలేదా?"
"ఎందుకు తిట్టడం? ఎందుకు చెప్పడమే తల్లి!!? అప్పట్లో అందరూ వేసుకునేది కదా. మా టైం లో లంగా జాకెట్టు వేసుకునే వారు. వారి సమయంలో అలా. అంతే.."
"అమ్మ చెప్పింది.. పంజాబీ డ్రెస్ వేసుకుంటే అమ్మని కాలేజ్ కి రానీవ్వలేదని. చీర కట్టుకొని రావాలంట కదా.."
"అవునే అప్పట్లో ఒకరూ ఇద్దరూ పంజాబీ డ్రస్సులు వేసుకొనేవారు. వారిని కూడా అందరూ వింతగా చూసేవారు ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు."
"మరి నువ్వు అక్కని జీన్స్ ప్యాంట్ బదులు చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకోమని చెప్పావుగా. అంటే నీ కాలంలో కుసంస్కారం గా కనిపించినది మా కాలం వచ్చేసరికి సంస్కారవంతమైన బట్టలుగా మారిపోయిందా నానమ్మ?" చిట్టి అమాయకంగా అడిగింది. ఆమె కళ్ళల్లో ఎక్కడ నిరసన లేదు కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాస మాత్రమే ఉంది.
రత్నమ్మకి ఏం చెప్పాలో పాలుపోక, "ఇప్పుడెందుకు చిట్టితల్లి ఉపయోగం లేని మాటలు. నాకు పూజ చేసుకునే సమయం అయింది. నేను వెళ్లి లలితా సహస్రనామం చదువు కోవాలి. నువ్వు నీ పూర్ణమ్మ చదువుకో" అని చెప్పి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పూజ గది వైపు నడిచింది.
చిట్టి కూడా ఇంకేం మాట్లాడకుండా హోమ్ వర్క్ చేసే పనిలో పడింది. విజ్ఞులు అంతే. తెగేదాకా లాగరు. ఏ విషయం ఏ సమయంలో చెప్పాలో ఆ సమయంలోనే చెప్తారు. వారి చెప్పే మాటలు అవతల వారి హృదయాలను తప్పక తాకుతాయి. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఆ సమయం రానే వచ్చింది. రత్నమ్మ ఆరుబయట వెన్నెల్లో నులక మంచం మీద కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. మధ్య మధ్యలో కళ్ళొత్తుకుంటూ ఉంది. పాపం పెద్దావిడ ఎప్పటినుండి బాధ పడుతుందో ఆమె ఆకుపచ్చని నేత చీర చెంగు తడిచి పోయింది. చిట్టి ఆమె చెంతకు చేరి ఆమె భుజం మీద తలవాల్చి, "అత్తమ్మ గుర్తుకు వచ్చిందా నానమ్మ?" అని అడిగింది.
"అవునమ్మా దానికి పండువెన్నెల అంటే చాలా ఇష్టం ఈ వెన్నెల్లొ కూర్చుని ఎప్పుడు ఏవో కవితలవీ చెప్పుకుంటూ ఉండేది..." దుఃఖంతో బొంగురుపోయిన గొంతుతో బాధగా చెప్పింది రత్నమ్మ.
రత్నమ్మ కూతురు రాధ. ఆమె ఎనమండుగురు పిల్లలలో చిట్టచివరిది. చదువన్న పుస్తకాలన్న కథలన్నా కవితలన్నా ఎంతో మక్కువ. ఆమె పదవతరగతి లో ఉండగానే రత్నమ్మ భర్తకి అనారోగ్యం చేయడంతో తొందరగా చిన్న వయసులోనే పెళ్లి చేసి బాధ్యత తీర్చేసుకున్నారు.
పెళ్లంటే ఏంటో కూడా తెలియని పిల్లకి ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తికి బంధం వేసేసారు. అమ్మానాన్న చెప్పారని రాధ తలవంచి తాళి కట్టించుకుంది. పెళ్లయిన కొన్నాళ్లకే మొగుడు నిజ స్వరూపం బయటపడింది. అతడికి లేని అలవాటు అంటూ లేదు. ఆదరిస్తారు అనుకున్న అత్తమామలు కూడా కాలం చేసేసారు. అతడు పెట్టే చిత్రహింసలు మౌనంగా భరించింది. వ్యసనాల కోసం భర్త చేసే అప్పుల బాధ పెరిగిపోయింది. పుట్టింటి వారిని అడుగుదాం అనుకుంటే చావు బ్రతుకుల్లో ఉన్న నాన్న గారిని చూసుకోవడానికి అన్నదమ్ములు ఇబ్బందులు పడుతున్నారు. తన సమస్య చెప్పి వారిని ఇంకా ఇబ్బంది పెట్టాలని అనుకోలేదేమో తన సమస్యకు తానే పరిష్కారం చెప్పేసుకుంది. తన ముక్కుపచ్చలారని జీవితాన్ని అంతం చేసుకుని చెరువులో శవంగా తేలింది.
"ఏడవద్దు నానమ్మ నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది" చిట్టి రత్నమ్మ చుట్టూ చేతులు వేసి, పక్కన కూర్చుని ప్రేమగా చెప్పింది.
ఆ చిన్నదాని అభిమానం చూసి రత్నమ్మకు ప్రేమ పొంగుకు వచ్చింది. చిట్టి తలమీద చిన్నగా ముద్దు పెట్టుకుంది.
"నానమ్మ , రాధత్త ఇంకా బోల్డంత జీవితం చూడకుండానే చనిపోయింది కదా"
"అవునమ్మా అది చెడ్డ పిరికిది. చిన్నప్పటినుండి అంతే ఏ చిన్న బాధ కలిగినా తనలో తనే బాధపడేది కానీ మాకు ఎవరికీ చెప్పేదికాదు"
"అచ్చం అక్క లానే కదా.. అక్కవన్నీ రాధత్త పోలికలు అంటూ ఉంటారు కదా"
"అవునమ్మా మీ అక్కని చూస్తే నాకు రాధే గుర్తుకు వస్తుంది."
"మరి అక్క జీవితం కూడా రాధత్త లాగా మారకుండా ఉండాలంటే మనమే అక్కకి సహాయం చెయ్యాలి కదా నానమ్మ. అక్క బాగా చదువుకొని తన కాళ్ళమీద తాను నిలబడాలి. తనకు నచ్చిన వ్యక్తిని తను పెళ్లి చేసుకొని తన జీవితం తనకు నచ్చినట్టు బతకాలి కదా నానమ్మ. అంతేగానీ నువ్వు అక్క పెళ్లి చూడలేవేమో అనే అనుమానంతో నీకోసం తెలిసి తెలియని వయస్సులో అక్క పెళ్లి చేసేసి అక్కను మరో రాధత్తలా చచ్చిపోమంటావా నానమ్మా?!!" చిట్టి మాటలు రత్నమ్మ కు గుండెల్లో ఎక్కడో గుచ్చుకోగా తన రాధ చావుకి కూడా తన తప్పు ఏమైనా ఉందా అనే ఆలోచనలో పడింది రత్నమ్మ.
"చెప్పు నాన్నమ్మా! అక్క కూడా తన కాళ్ళ మీద తాను నిలబడకుండా, వేరే వారి చేతుల్లో కీలుబొమ్మగా మారిపోవాలా?" చిట్టి రత్నమ్మ మనసు గ్రహించి సూటిగా అడిగింది.
"వద్దమ్మా...వద్దు.. మీ అక్క కూడా మరో రాధలా మారొద్దు. నా మనవరాలిని కూడా నా చేతులతో చంపొద్దు. దాని జీవితం దాని చేతిలోనే పెట్టేస్తా. అదో స్థాయికి వచ్చాకే పెళ్లి చేద్దాం. నేనేం ఇక విసిగించనమ్మా. నాకు అర్ధం అయ్యింది బంగారం." అంటూ తడిచిన కనురెప్పల సాక్షిగా చిట్టిని గుండెలకు హత్తుకుని, పశ్చాత్తాప పడింది రత్నమ్మ.
చిట్టి కళ్ళు ఆ వెన్నెల నీడల్లో ఆనందంతో మెరిసాయి.
***అయిపోయింది***

రాధలా అగచాట్లు పడుతూ తనువు చాలించకున్నా, తమలో సత్తా ఉన్నా అవకాశం లేక అనుక్షణం వేరే వారి మీద ఆధారపడి జీవితాన్ని లాగిస్తున్న తరుణీ మణులకు ఈ కథ అంకితం.

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కథ చాల అద్భుతంగా ఉంది  clps yourock thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)