Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పునీత
#1
పునీత


-  K.K.Raghunandana
 
వాళ్ళిద్దరికీ పెళ్ళికుదిరింది. సెల్‌ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. అందం తెలివితేటలు సొంతం చేసుకున్న యువతి భార్య కాబోతోందని అతడు మురిసిపోయాడు. కానీ అంతలోనే అనుకోని అవాంతరం. టీ.వీల్లో ఫ్లాష్‌ న్యూస్‌లూ, వీడియో క్లిప్పింగులూ! అతడు ఆలోచనలో పడ్డాడు. ఆమె షాక్‌ తింది. స్నేహితులు ఆమె ఇంటికి వెళ్ళి, ఏమిటే ఇది! అంటూ ఆరాటపడసాగారు. ఇంతకీ ఏమిటా వీడియో? అసలేంజరిగింది?
ఒక్క అందంలోనేకాదు, తెలివితేటల్లో సైతం పదుగురితో భేష్‌ అనిపించుకున్న పునీతను పరిణయమాడేందుకు ముందుకురాని మహాశయుడంటూ ఎవడైనా ఉన్నాడంటే అతగాడో కొయ్యబొమ్మే! కాని కౌశిక్‌ కొయ్యబొమ్మ కాదు. జీవమున్నవాడు కాబట్టే పునీత అందచందాలను పొందేందుకు జీవితంలో తన అర్ధాంగి పీఠం అలంకరించేందుకు హృదయపూర్తకంగా ఆహ్వానించాడు. అది పునీత అదృష్టమో, అతడికి పట్టిన యోగమో ఏదైనా అవనీగాక వారిద్దరి వివాహం ఖాయమైంది. చందనరావుకు పునీత ఏకైక కుమార్తె. ఒకప్పుడు ఉమ్మడికుటుంబంలో బాధ్యతలు, భార్య అకాలమరణం వంటికారణాలవల్ల పునీత వివాహం కొద్దిగా ఆలస్యమే అయ్యింది. రిటైరయ్యేదాకా ఆ ప్రయత్నమే చేయలేక పోయాడు చందనరావు. అబ్బాయి కౌశిక్‌ యోగ్యుడు కావటంవల్ల, ఇంత కావాలని రొక్కించి కట్నకానుకలకోసం ఒత్తిడి తేనందువల్ల పునీత పెళ్ళి ఏర్పాటు చేయడానికి ముందడుగేశాడు.
తన వివాహం తండ్రికి భారం కాకూడదనే ఉద్దేశంతోనే, కొంతకాలం ఏదైనా ఉద్యోగంచేసి, తండ్రికి ఆర్థికంగా సహయపడతానంది పునీత. ఇప్పుడు పెళ్ళి వాయిదావేస్తే కలసివచ్చిన సంబంధం కాలదన్నుకున్నట్లవుతుందని పిల్ల పెళ్ళికే మొగ్గు చూపాడు చందనరావు.వివాహముహూర్తం ఇలా పెట్టారో లేదో మరుక్షణమే పునీత, కౌశిక్‌లు సెల్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ లోపే కొంత అనుబంధం బలపడుతుందని వారిద్దరి నమ్మకం! అలా వారి హృదయాల్లో వెన్నెలలు విరియడం మొదలైంది. కాని, విధి బలీయమైంది. అందరినీ అలరించే చిత్తరువు మీదనే బురదజల్లి అల్లుకుపోయేలా చేయడం, విస్తారంగా పండిన పంటచేతికొచ్చే సమయంలో మహావర్షం కురిపించి రైతుకంట కన్నీరొలికించటం ఆ దేముడికి మామూలు విషయం కాబోలు! పునీత జీవితంలో ఆనందం పరవళ్ళు తొక్కుతున్నవేళ సరిగ్గా ఆ వార్త! ఫోన్‌ చేసింది సన్నిహితురాలు కల్పన. ‘‘పునీతా! ఓ బ్యాడ్‌ న్యూసే!’’
ఏమిటో అర్థంకాక అడిగింది పునీత.‘‘నేనూ మొదట నమ్మలేదు. నా సెల్‌కి ఓ మెసేజ్‌ వచ్చింది. ‘నీ స్నేహితురాలు పునీత న్యూడ్‌ ఫోటోస్‌ నెట్‌లో పెట్టా! చూసి తరించు’ అని. నేను చూశా! అచ్చం నీ ముఖమే! నీలి చిత్రాల్లో కలిపేసి పెట్టాడు. అసలు నిశ్శబ్దంగా ఉండే నీమీద ద్వేషం ఎవరికి ఉంది? ఎందుకో నా కెంత మాత్రం బోధపడలేదు.’’ అని ఏదేదో చెబుతుంటే పునీత చేతిలోంచి ఫోన్‌ జారిపోయింది.అంతలోనే మళ్ళీ సెల్‌ రింగయితే తీసింది. ‘‘నువ్వు బట్టల్లోనే అందగత్తెవనుకున్నా! కాని అవి లేకుండా కూడా సూపర్‌! నిన్ను అనుభవించేవాడెంత అదృష్టవంతుడో!’’ అవతలినించి కూశాడు ఎవడో.ఎదురు అపార్ట్‌మెంట్‌లో వనజాక్షి గబగబా వచ్చింది. ‘‘ఇదిగో ఎవరివో నగ్నచిత్రాలు నెట్‌లో ఎవరో ఆకతాయి పెట్టాడంటూ మీడియాలన్నీ ఊదరగొట్టేస్తున్నాయి.
నువ్వు చూశావో లేదో..అచ్చంగా నీ మొహమే! నాకు అనుమానం వచ్చి నీ దగ్గరకు పరుగెత్తుకొచ్చా! ఏదో మాయాజాలంలా ఉంది. అయినా నువ్వంటే అంత పడనివాడెవడే? అంత దారుణంగా పగ సాధిస్తున్నాడు?’’ అంటూ పునీత కళ్ళు తుడిచింది.టీ.వీ ఆన్‌ చేస్తే ప్రతిఛానల్‌ లోనూ అవే క్లిప్పింగ్స్‌! గుండె పగిలిపోయింది పునీతకు. తన తండ్రి చూస్తే కుప్పకూలిపోవటం ఖాయం! దేముడిదయవల్ల యాత్రలకు వెళ్ళారు. ఒకవేళ ఆయనకి ఈ సంగతి తెలిస్తే మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంటుంది.ఎవరిదో నగ్నశరీరానికి తన ముఖం అతికించాడు! ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది పునీతకు.‘ఛీ! వాడే! తనమీద శత్రుత్వం పెంచుకొని తనను అసహ్యంగా చిత్రించాడు!’ ఒక్కసారిగా జుగుప్స, దుఃఖం ఆమెను ఆవరించాయి.
‘‘అసలిదంతా ఎలా జరిగిందే? నీకెవరిమీదైనా అనుమానం ఉందా? లోగడ నీమీద పగబట్టినవారెవరైనా ఉన్నారా? మనసువిప్పి నాతోనైనా చెప్పవే! ప్లీజ్‌!’’ అంది వనజాక్షి పునీతను అనునయిస్తూ! అప్పుడు గొంతువిప్పింది పునీత. ‘‘అసలు నాలో ఏ లోపం ఉందో చెప్పు? నిన్నెంతగా ఆరాధిస్తున్నానో నీకు తెలీదు. నువ్వు నా సొంతం కావాలి. నువ్వు ఐ లవ్యూ చెప్పేదాకా నిన్నొదిలేది లేదంతే.’’ బైకు అడ్డంగా పెట్టి పునీతను నిలబెట్టేశాడు వసంత్‌. పునీత అసహనంగా చూసింది. ‘‘దారికి అడ్డం లే! నువ్వంటే నాకిష్టంలేదని ఎన్నిసార్లు చెప్పాలి? నన్ను అనవసరంగా విసిగించొద్దు. నీ చదువు నువ్వుచదువుకో.’’ అంది జుగుప్సగా చూస్తూ.
‘‘నాకు నీతులు చెప్పకు. నిన్నెలాగైనా పొందాలన్నదే నా జీవితాశయం. నువ్వులేని నేను లేను. నాకు అడ్డు చెప్పద్దు. నీ బిగి కౌగిలిలో నన్ను కరిగిపనీ!! ప్రతిరాత్రీ మనకు వసంతరాత్రి కావాలి. నువ్వు నన్ను కాదంటే నిన్నేమైనా చేయగలను.’’ బెదిరించాడు వసంత్‌. పునీత తప్పించుకున్నది. అలా ఎన్నోసార్లు వసంత్‌ వెంటబడ్డాడు. వేధించాడు. హెచ్చరించాడు. యాసిడ్‌ పోస్తానన్నాడు. వేరెవరితోనైనా నీకు పెళ్ళి కుదిరినాగానీ సహించేది లేదన్నాడు. తన కోరికను తీరిస్తే చాలన్నాడు. అతనెంత కఠినంగా ప్రవర్తించినా సరే పునీత తలవంచలేదు. ఎంత రెచ్చగొట్టినాసరే మౌనంగానే తన వ్యతిరేకత తెలియజేసేది. ఈ సంగతులన్నీ తండ్రికి తెలీకుండా జాగ్రత్త పడింది. కాబోయే పెళ్ళిబంధానికే విలువనిచ్చింది.
అప్పుడు జరిగిందో సంఘటన.  కాలేజీలో పరీక్షలైపోయిన తర్వాత, కాలేజీ ఆఫీసులో ఏదో పనుండి వెళ్ళి వస్తున్నప్పుడు వసంత్‌ మళ్ళీ పునీతను అటకాయించాడు. ‘‘ఏయ్‌! నువ్వింత తెలివైనదానివనుకోలేదు. భలే ఠోకరా ఇచ్చావే! నన్ను కాదని వేరేవాడితో పెళ్ళి కుదుర్చుకున్నావా? నాకు మహా అసూయగానూ, అక్కసుగానూ ఉంది. నీకంటే నాలుగాకులెక్కువే చదువుకున్నాను. నేనేదో నీ మొహం మీద యాసిడ్‌జల్లి నిన్ను వికృతంగా చేస్తానన్న అనుమానం పెట్టుకోకు. అంతకంటే ఎక్కువగా నువ్వు అవమానంతో కృంగిపోయేలా చేస్తా! నీ హృదయం దహించుకుపోయేలా చేస్తా! నీ పెళ్ళి ఇప్పుడే కాదు. ఎప్పటికీ నువు్ పెళ్ళి పీటలు ఎక్కకుండా చేస్తా! ఇదే నా ఛాలెంజ్‌! మళ్ళా నా కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడి నువ్వే దిక్కని నా పాదాలపై పడేలా చేస్తా!’’ అని బైకుపై సర్రున వెళ్ళిపోయాడు.
జరిగినదంతా చెప్పేసి వెక్కివెక్కి ఏడ్చేసింది పునీత. ‘‘పగబట్టినవాడెవడో నీకు తెలుసు. మరి నిమ్మకు నీరెత్తినట్టు కూచుంటావేం పునీతా! వెంటనే సెక్యూరిటీ ఆఫీసర్ రిపోర్టియ్యి. వాటి సంకటం కట్టేస్తుంది.’’ అని మద్దత్తు పలికింది వనజాక్షి. ‘‘గొడవలు పడటం నాకిష్టం లేదే! నాన్నగారికి తెలిస్తే ఆయన కోపానికి అంతుండదు. ప్రస్తుతం ఆయన లేకపోవటం వరమైంది’’ అని మరల కన్నీళ్ళు పెట్టుకుంది పునీత.టీ.వీ.లో న్యూస్‌లో ‘న్యూడ్‌ ఫోటోస్‌.. నెట్‌లో దర్శనం.. ఓ ప్రబుద్ధుడి నిర్వాకం..’, ‘అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఆకతాయి ఎవరో?’, ‘ప్రేమించలేదన్న పగతో కక్షసాధింపు..’, ‘అంతర్జాలాన్ని అడ్డుగా పెట్టుకుని అమ్మాయి బ్రతుకులతో చెలగాటాలు!’ ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఊదరగొడుతున్నారు. అస్పష్టంగా చిత్రాలు చూపిస్తున్నారు. గాజు తెర అడ్డుగా ఉంచి, కథనం చెబుతున్నారు.
వాడిని పీకనులిమి చంపేయాలనిపిస్తోందే!’’ అక్కసుగా అంది వనజాక్షి.‘‘ఆ దృశ్యాలు నావి కానప్పుడు నేనెందుకు బాధపడటం? నేనేం అసభ్యంగా దిగజారలేదుకదా!’’ ‘‘కాని నిజం ఎవరికి తెలుసు? లోకులు పలుకాకులే! చూసిందే నమ్ముతుంది. ఇలా నువ్వు ఊరుకోడం నాకేంనచ్చలేదు’’ రెట్టించింది వనజాక్షి. స్నేహితురాలు పట్టుదలగా ఒత్తిడిచేసినాసరే, పునీత ముందడుగు వేయలేదు. కారణం, ఒక ఆడపిల్లగా..అదీ తండ్రిలేని సమయంలో ఒంటరిగా తను బయటకు వెళ్ళగలదా? వెళ్ళాక తన ముఖం టీ.వీలో చూపించకమానరు. ఏవేవో ప్రశ్నలేస్తారు. బయోడేటా మొత్తం బట్టబయలు కావడం తప్ప ప్రయోజనం లేదు. తండ్రి సంగతి సరే! మరి కౌశిక్‌! అతనికి తెలిస్తే ఎంత అసహ్యించుకుంటాడు? కాబోయే శ్రీమతి, పెళ్ళికి ముందే కామ కలాపాలు వెలగబెట్టిందని ఊహించుకుంటాడు.
తనతో తెగతెంపులు చేసుకుంటాడు. జరగబోయే విపత్కర పరిణామమిదే! వనజాక్షి ఎప్పుడెళ్ళిపోయిందో తెలీదు. పునీత మనసులో అనేకానేక ఆలోచనలు రేగి ఢీకొడుతున్నాయి. నిజానికి వారం తర్వాత రావాల్సిన చందనరావు మర్నాడే దిగబడ్డాడు. వచ్చా రావడంతోటే విశ్వరూపం ప్రదర్శించాడు. కూతురుపై ధ్వజమెత్తాడు.‘‘నాన్నా! ప్లీజ్‌! నాగురించి తెలిసిన మీరు కూడా...!’’ బావురుమంది పునీత.‘‘పదిమందిలో పడ్డ పాములాగా అయిందమ్మా మన పరిస్థితి. ఈ సంగతి మగపెళ్ళివారిదాకా పాకి ఉంటుంది. నా పరువు గంగల కలిసిందమ్మా! జరగరానిది జరిగితే నేనే శవమవ్వాల్సిందే!’’ అంటూ మథనపడిపోసాగాడు చందనరావు.‘‘నాన్నా! ప్లీజ్‌! అటువంటి మాటలు మీనోటంట వినలేను. ఇదెలా జరిగిందో నాకు తెలీదు.’’ అని రోదించింది.
‘‘ఇదిగో పునీతా! నీ తప్పెంతమాత్రంలేనప్పుడు నీకెందుకే భయం? మీ నాన్నగారికి విషయం తెలీకనే నీమీదకోప్పడ్డారు. చెప్పడం మనధర్మం’’ అని వనజాక్షి నోరు విప్పగానే, తండ్రికి విషయమంతా వివరంగా చెప్పింది పునీత.‘‘ఆ వెధవెవడో ముందే చెబితే ఇంతదాకా వచ్చేదికాదు. నువ్వు ఊరుకోబట్టే వాడింతగా రెచ్చిపోయాడు’’ అని బుర్ర పట్టుకున్నాడు చందనరావు.బయట జీపు ఆగిన చప్పుడు. ఖాకీ దుస్తుల్లో ఓ ఇద్దరు ఇంట్లోకి అడుగుపెట్టారు. ‘‘సార్‌! పునీత ఎవరు? మీరు ఆమెకు ఏమవుతారు?’’ అడిగాడొక కానిస్టేబుల్‌.‘‘నేను పునీత తండ్రిని’’ అర్థంకానట్టు వాళ్ళవైపే చూస్తూ చెప్పాడు చందనరావు.‘‘మీ పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన ఓ ఆకతాయిని అరెస్టు చేశాం.’’ చెప్పాడు మరో కానిస్టేబుల్‌.
‘‘మేమేం ఫిర్యాదు చేయలేదే!’’ విస్తుపోయాడు చందనరావు.‘‘నిజమే. కానీ ఓ వ్యక్తి ఈ సమాచారం మాకు అందించారు. తన వివరాలు గోప్యంగా ఉంచమన్నారు. అందువల్ల అసలు వివరాలు మీ నుంచి సేకరించకతప్పదు. వెంటనే మిమ్మల్ని స్టేషన్‌కి తీసుకురమ్మన్నారు మా ఎస్‌.ఐ. గారు’’ వారి మాటలకు తొట్రుపడ్డారు తండ్రికూతుళ్ళు.తప్పదన్నక కదిలారు. అప్పటికే మీడియా స్టేషన్‌ చుట్టూ మొహరించింది. పునీత, చందనరావుల రాక గమనించిన విలేకరులు చుట్టుముట్టబోయారు. ఎస్‌.ఐ వాళ్ళని వారించాడు. లోపలికి వచ్చాక కుర్చీలో కూర్చోబెట్టి ‘‘మీరేం టెన్షన్‌ పడద్దు. దయచేసి విచారణ పూర్తయ్యేదాకా సహకరించండి. ఈరోజు మీకు జరిగింది, రేపు మరొకరికి కావచ్చు.
అందుకే మేం సీరియస్‌గా తీసుకున్నాం. అమ్మా! అసలు విషయం చెప్పండి, ఆ రోగ్‌ నిన్నే టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?’’ అడిగాడు ఎస్‌.ఐ.‘ఇన్నాళ్ళూ ఈ విషయం బయటకు చెప్పకుండా తనే తాత్సారం చేశాను’ అనుకుంది పునీత. ఇక అప్పుడు గొంతువిప్పి తప్పలేదు పునీతకు. వసంత్‌ తనను ఏవిధంగా టార్చర్‌ చేసిందీ, ఎలా వెంటాడిందీ, బెదిరించిందీ, తనెలా అతడికి హెచ్చరిక చేసిందీ...అతడెలా సవాల్‌ చేసిందీ...అంతా చెప్పుకొచ్చింది. ఆడపిల్ల తండ్రిగా చందనరావు ఆవేదనను వెళ్ళగక్కాడు. పెళ్ళి కుదిరిన శుభతరుణంలో ఇలా రచ్చకెక్కడం తమ కుటుంబాన్ని తీవ్ర వ్యథకూ, మనస్తాపానికీ గురిచేసిందని ఘూర్ణిల్లాడు.వారిద్దరి మాటలూ సావధానంగా విన్నాడు ఎస్‌.ఐ. ‘‘ఆ చెత్త వెధవను అరెస్ట్‌ చేసి సెల్‌లో వేశాను.
మీడియా వాళ్ళు అడిగితే ఇప్పుడు నాకు చెప్పినదంతా వారికీ చెప్పండి.’’ అని లేచాడు. ఎప్పుడు లోపలినుంచి బయటకొస్తారా అని ఎదురుచూస్తున్న విలేకరులు, ఒక్కక్కుమ్మడిగా వారిపై ప్రశ్నలవర్షం కురిపించారు. ‘‘ఆ రాస్కెల్‌ మిమ్మల్ని ఎప్పటినుంచి వేధిస్తున్నాడు? మీరెప్పుడూ ప్రతిఘటించలేదా?’’ ప్రశ్నించాడు ‘న్యూ’ టీ.వీ. ఛానల్‌ విలేకరి.‘‘కనీసం మీ నాన్నగారితో కూడా చెప్పకపోవడంలో ఉద్దేశం?’’ అని ‘బ్రహ్మ’ న్యూస్‌ ఛానల్‌.‘‘మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఎవరికీ ఫిర్యాదు చేయకపోవటానికి కారణమేంటి?’’ అడిగింది సమాజ్‌ టి.వి.ఒకటే ప్రశ్నలవర్షం! లోగడ జరిగినదంతా చెప్పకతప్పలేదు పునీతకు. చందనరావును కూడా ఏవేవో అడిగారు. అన్నిటికీ జవాబిచ్చాడు.‘‘ఇలాంటి ఆకతాయిలకు ఎటువంటి శిక్ష విధించాలని మీ అభిప్రాయం?’’ అడిగారు మరో ఛానల్‌ వాళ్ళు.
‘‘ఏ ఆడపిల్ల జీవితంతోనూ ఇలా ఆడుకోకుండా గుణపాఠంచెప్పే ఏ శిక్షయినా సరే విధించాలి, ఇలాంటివాళ్ళు చట్టంనుంచి తప్పించుకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని నా కోరిక’’ అని ముందుకు నడిచాడు చందనరావు. న్యూస్‌ ఛానల్‌ వాళ్ళు వసంత్‌ను బయటకు రప్పించి ప్రశ్నలతో ముంచెత్తారు.‘‘తనను ప్రేమించలేదన్న కసితోనే తనీ మార్ఫింగ్‌ కి పాల్పడినట్టు ఒప్పుడకున్నాడు. ‘‘తనకు ఆ అమ్మాయి కావాలనిపించింది, ఆమెకు వేరొకరితో పెళ్ళికాకూడదనే ఉద్దేశంతోనే ఇదంతా చేశాను’’ అని చేసినతప్పు అంగీకరించాడు వసంత్‌. అతగాణ్ణి ఎస్‌.ఐ నాలుగు ఉతుకులు ఉతికాడు. అదంతా షూట్‌ చేసుకుని ఛానల్‌ రిపోర్టర్స్‌ వెళ్ళిపోయారు. మరికొంత సమయానికే ఈ కథనమంతా ప్రసారం కావడం మొదలైంది.
పునీత, చందనరావుల ఇంటర్వ్యూ.... వసంత్‌ చెప్పిన మాటలు.. ఎస్‌.ఐ వాడిని చావబాదడం అన్నీ ఛానల్స్‌ అన్నిటిలో ప్రసారమయ్యాయి. ప్రతీసారి అవే దృశ్యాలు పదేపదే చూపించారు. టీ.వీ వీక్షకులకు భలే వినోదం! ఆ ఘట్టం ముగిసింది. ఇక చందనరావు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో చెప్పలేం. తెలిసిన వాళ్ళంతా వ్యంగ్య బాణాలు కురిపించారు.‘‘అదేంటయ్యా! చందనరావూ! ఇంట్లో పెళ్ళి పెట్టుకున్నారు, ఇలా జరిగింది! మీ అమ్మాయేం చేసిందని టీ.వీ లన్నీ ఒకటే గగ్గోలెడుతున్నాయి. అసహ్యంగా ఆ క్లిప్పింగ్స్‌ ఏంటి? మీ ఇంటర్వ్యూ లేంటి? ఛఛ! అసలు మగపెళ్ళివారికి ఈ విషయం తెలిస్తే ఏమైనా బాగుంటుందా?’’ అడిగాడు ఓ పెద్దమనిషి.‘‘అదేంటయ్యా! పిల్లనలా స్వేచ్ఛగా వదిలేశావు.
ఆ మాత్రం పట్టించుకోపోతే ఎలా? ఆడ పిల్లంటే అరిటాకన్న సామెత ఎరగవా? రోజులు అసలే బాగులేవు కదా! ఇంత జరిగాక మీ అమ్మాయికి పెళ్ళి కావడం కష్టమే!’’ అని ఎన్నో రీతులుగా వ్యాఖ్యానాలు, విమర్శలు..పునీత మనసును అతలాకుతలం చేశాయి. చందనరావును నిలదీశాయి.‘ఇంత రాద్ధాంతం జరిగాక ఏ ముఖంపెట్టుకుని మగపెళ్ళివారిని కలవగలడు? వివాహం చేయమని ఒత్తిడి చేయగలడా? ఒకవేళ ధైర్యంచేసి వియ్యాలవారి గుమ్మంలో అడుగుపెట్టినా వాళ్ళు తనపై నిప్పులు చెరిగి, సంబంధం వద్దుపొమ్మంటే?! వాస్తవానికి పెళ్ళికొడుకు కౌశిక్‌ సౌమ్యుడే.
అయినా సరే ఇంత రసాభాస జరిగాక వాళ్ళింట్లోవాళ్ళ ఆలోచనలెలా ఉంటాయో? కరగ్రహణం చేయడానికి అతడు సిద్ధపడతాడా? వాళ్ళ అమ్మనాన్నల మాటకే విలువిచ్చి ఈ పెళ్ళికి స్వస్తిపలికితే?! అమ్మాయి పునీత భవిష్యత్తు ప్రశ్నార్థకమే!?’ అనేక ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతున్నాడు చందనరావు మగపెళ్ళివారిని కలిసేందుకు జంకాడు. భగవంతుడంటూ ఒకడుంటే తమకు న్యాయమే జరిగితీరుతుందని గట్టిగా విశ్వసించాడు. అదే విశ్వాసంతో ఎదురుచూస్తూ మిన్నకుండిపోయాడు.
ఇక పునీత మానసిక పరిస్థితి మరీ అల్లకల్లోలంగా ఉన్నది. ‘ఎప్పుడూ తను ఫోన్‌ చేయకపోయినాగానీ కౌశికే కాల్‌ చేసి రోజుకోసారైనా పలకరించేవాడు. సరదాగా కబుర్లు చెప్పేవాడు. ఇప్పటికి రెండురోజులైంది. పత్తాలేడు. టీ.వీలో వార్తలు చూసిన తర్వాత తనను అసహ్యంచుకుని ఉంటాడు. మీడియా ప్రభావం అతనిమీద కూడా పడిందా? తను పెళ్ళాడాలనుకున్న ఆడపిల్ల పరువు బజారునపడింది గనుక వివాహానికి తిలోదకాలివ్వాలని నిశ్చయించుకున్నాడా? పోనీ తనే ధైర్యం చేసి ఫోన్‌ చేస్తే..?’ ఆ ఆలోచన వచ్చిన మరుక్షణమే ఫోన్‌ చేసింది పునీత. స్విఛాఫ్‌ వచ్చింది. చాలాసార్లు ప్రయత్నించింది. ‘తనతో మాటాడాల్సివస్తుందని స్విఛాఫ్‌ చేసాడా?!’ ఎటూ తేలని వింతనరకంలో కొట్టుమిట్టాడుతోంది పునీత.
ఒక ఆకతాయి చేసిన ఛండాలానికి తనెంత శిక్షననుభవించాల్సి వస్తోంది? హే! భగవాన్‌! ఏమిటీ పరీక్ష?! పురోహితుడు పేరయ్యశాస్ర్తి హఠాత్తుగా ఊడిపడ్డాడు.‘‘ఏమయ్యా! చందనరావ్‌! ఏమిటలా నిమ్మకునీరెత్తినట్టు కూచున్నావ్‌? పిల్ల పెళ్ళికి తొందర పడ్డంలేదేం? అవతల మగపెళ్ళివారు నిన్ను తీసుకురమ్మన్నారు. మీతో అర్జంట్‌గా మాట్లాడాలట!’’ అని చెప్పగానే గుండెలు దడదడలాడాయి చందనరావుకి. బహుశా తెగతెంపులు చేసుకోవడానికే మధ్యవర్తి పేరయ్యతో కబురుపంపించారా? ఏ సంగతులూ చెప్పకుండా పిలుచుకురమ్మని చెప్పి ఉంటారు. జరగబోయేది తనూహించుకోవటం ఎందుకు?’ అని ఆలోచిస్తూ బయలుదేరాడు. తండ్రి వెళ్ళడంతోనే పునీత ఆందోళన ముప్పిరిగొన్నది.
ఏం జరుగుతుందో అనే ఆవేదన ఆమెను చుట్టుముట్టింది. చందనరావు మగపెళ్ళివారింట్లోకి అడుగుపెట్టగానే ‘‘ఏం బావగారూ! నల్లపూసైపోయారేంటి? మీరంత గుంభనంగా ఉండిపోతే పనికిరాదండోయ్‌! మన దగ్గర దాపరికాలు పనికిరావు. అంతా ఫ్రీగా మాట్లాడుకోవాలి. తర్వాత మీ ఇష్టం.’’ అనగానే కంగుతిన్నాడు చందనరావు. ఆయన నోరిప్పేలోగానే మళ్ళా ‘‘అదేంటండీ! కొయ్యబొమ్మల్లే ఉండిపోయారు. మీకు తొందరలేకపోవచ్చుగానీ, మా అబ్బాయి మాత్రం పెళ్ళికి తొందరపడుతున్నాడు. ముహూర్తాలు పెట్టేసుకుందామా!’’ వియ్యంకుడి మాటలతో ఒక్కసారిగా తెరిపినపడింది చందనరావు మనసు. పెళ్ళికొడుకు కౌశిక్‌ కూడా అక్కడే ఉన్నాడు. కాబోయే మామగారికి వినమ్రంగా నమస్కరించాడు.
అప్పటికిగానీ చందనరావు మనసు నిమ్మళించలేదు.పెట్టుపోతలవిషయాలు చర్చించుకున్నారు. ముహూర్తాలు నిర్ణయించేసుకున్నారు. అంతకుముందుజరిగిన సంగతులప్రసక్తి తీసుకురాలేదు చందనరావు వియ్యంకుడి కుటుంబం.తండ్రి గుమ్మంలోకి అడుగుపెట్టాడు. పునీత హృదయం అనేక రీతులుగా రంపపుకోతకు గురవుతోంది. ఆందోళనగా తండ్రికేసి చూసింది. ‘అక్కడ వ్యవహారం బెడిసికొడతే తనమీద చిందులేయటం ఖాయం! తన జీవితం అస్తవ్యస్తం అయ్యే పరిస్థితి ఎదురైంది’ ఇలా ఎన్నో ఆలోచనల్లో కూరుకుపోయిందామె.
‘‘నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా!’’ అన్నాడు చందరనావు ఇంట్లోకి అడుగుపెడుతూనే. ‘‘ప్రసంగమాత్రంగా కూడా వాళ్ళెవరూ ఆ విషయాలు నాతో ప్రస్తావనకు తీసుకురాలేదు. ముహూర్తాలు ఖరారుచేసేశాం. అసలు అల్లుడు ఆణిముత్యమమ్మా! ఎటువంటి అపార్థాలకు తావివ్వలేదు!’’ తండ్రి ఆనందంగా చెబుతుంటే పునీత కళవర పడ్డ మనసు పులకించిపోయింది. ఆ ఆనందంలో కౌశిక్‌కి ఫోన్‌చేసి మాట్లాడాలనుకుంది. కాని అతని ఫోన్‌ పలకలేదు. కానీ వెంటనే ఒక మెసేజ్‌ కనిపించింది. ‘‘డియర్‌! పెళ్ళి ముహూర్తాలు కుదిరాయి. దాంతోపాటే మప శోభననిక్కూడా!..నీ కౌశిక్‌.’’ఆ సంక్షిప్త సమాచారం చదవటంతోనే సిగ్గులమొగ్గైంది పునీత. ఏ అపశ్రుతులకు తావులేకుండా తమ వివాహం జరగాలని భగవంతుడిని మనసారా ప్రార్థించింది.
ఎటువంటి అడ్డంకులు లేకుండా పెళ్ళి వైభవంగా జరిగిపోయిది. ఎక్కడా ఎటువంటి చర్చలకు, అపోహలకు, అపార్థాలకు ఆస్కారంలేని సంతోషకరమైన వాతావరణం నెలకొన్నదక్కడ. పెళ్ళయిన మరునాటి రాత్రే శోభనం.‘‘మీ అంత మంచివారుండరండీ! నా వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నారు. నా జీవితానికి ఒక వరం మీరు. నా జన్మకిది చాలు’’ కన్నీళ్ళు పెట్టుకుంటూ అన్నది పునీత.‘‘ఈ జన్మకేకాదు ఎన్ని జన్మలైనా నువ్వే కావాలనుకుంటున్నా! ఎందుకో తెలుసా? నీ అంత మంచిపిల్ల మరొకరుండదు. ఎవడో ఆకతాయి నిన్ను వెంటాడి వేధించినా ఖాతరు చేయలేదు. వాడంటే నీకు అసహ్యమని మొహంమీదే చెప్పేశావు. నీ మనసుని, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకున్నావు. అదే నాకు నచ్చింది’’‘‘కౌశిక్‌! మీకిదంతా!’’‘‘అంతా తెలుసు. వసంత్‌ ఇక్కడివాడు కాదు. కర్నూల్‌లో ఓ అమ్మాయి జీవితంతో చెలగాటమాడాడు.
అక్కడా వాడికి పనిష్మెంట్‌ అయింది. నీకు జరుగుతున్న వన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. వాడెప్పుడైతే రెచ్చిపోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో మీకు తెలీకుండా నేనే సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశా. ప్రతిరోజూ ఏదోఒకచోట ఆడపిల్లలు బలైపోతున్నారనే వార్తలు జనం పేపర్లో చదువుతూనే ఉన్నారు, టీ.వీల్లో చూస్తూనే ఉన్నారుతప్ప స్ర్తీల బ్రతుకులతో చెలగాటమాడితే, పరిణామాలెంత తీవ్రంగా ఉంటాయో, ఎలాంటి శిక్షలకు గురౌతారో ప్రపంచానికి తెలియడంలేదు.
అది చెప్పాలనే తెరవెనక ఉండి నేనే కథ నడిపించాను. మీడియా నిన్నెలాంటి ప్రశ్నలువేసి సతాయించినా, లోకం ఎంతలా వక్రీకరించి మాట్లాడినా, నీమెడలో తాళికట్టేది నేనే అని నాకు తెలుసు. అందుకే మా వాళ్ళనుకూడా ఏమాత్రం నోరు విప్పనివ్వలేదు. ఒక మగవాడి దాష్టీకం ముందు ఓడిపోతున్న ఆడదాన్నే చూస్తున్న ఈ జనానికి స్ర్తీ విజయం ఎలా ఉంటుందో కూడా తెలియాలి. మరో అమ్మాయికి ఇలా జరగకూడదనే ఉద్దేశంతోనే మనిద్దరి మధ్య అఘాతం సృష్టించాలని చూసినవాడికి గుణపాఠం చెప్పాను.’’
‘‘ఏమండీ! నాగురించి మీరు...పునీతకు మాటలు రావడం లేదు. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి.‘‘ఆ ఆకతాయి మార్ఫింగ్‌ చేసి రాక్షసానందం పొందాడేతప్ప నీమనసును గెలుచుకోలేకపోయాడు. నీ హృదయానికి తన వికృత భావాలను పులమలేకపోయాడు. నీ మనసుకు ఏ కల్మషం అంటలేదని, నువ్వు స్వచ్ఛమైనదానివనీ నాకు తెలుసు. మా వాళ్ళకి ఆ విషయాలన్నిటిమీద ఒక అవగాహన తీసుకొచ్చాను.
పేరుకి తగ్గట్టు నువ్వు నిజంగా పునీతవే! నువ్వంటే నాకిష్టమైనప్పుడు ఎవరెన్ని కూసినా నేను పట్టించుకోలేదు. వివాహం కుదిరిన శుభతరుణంలో ఏవో అపార్థాలు చెలరేగి, అర్ధాంతరంగా పెళ్ళాగిపోయి అఘాయిత్యాలకు పాల్పడేవారెందరికో మన పెళ్ళి స్ఫూర్తి కావాలన్నదే నా కోరిక’’ అనగానే ‘‘కౌశిక్‌! ఐ లవ్‌ యూ! ఐ లవ్‌ యూ!’’ అంటూ భర్తను అల్లుకుపోయింది పునీత.అంతే! ఆ రెండు తనువుల సమాగమానికి, రెండు హృదయాల ఆత్మీయబంధానికీ తొలి అడుగుపడింది.
*****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కథ చాల బాగుంది yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)