Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Drama కడిగిన ముత్యం
#1
కడిగిన ముత్యం


-  kottapalli udayababu


'కట్టవలసిన డబ్బంతా కట్టేసాను నాన్నా.అన్ని ఫార్మాలిటీస్ పూర్తీ చేసాను, మీకు అభ్యంతరం లేకపోతే...నేను...నేను...వెళ్లొస్తాను.'' కార్తీక్ మాటలకు గాజు కళ్ళతో నిస్తేజంగా చూస్తుండిపోయారు. జగన్నాధంగారు.
''ఒరేయ్ బాబూ. బాగా వెలుతురూ వచ్చే రూమ్ ఇచ్చేలా చూడరా. నువ్వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. గాలి లేకపోతే నాకసలు నిద్రపట్టదు.''అన్నాడాయన కొడుకు చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ.
సున్నితంగా విడిపించుకున్నాడు కార్తీక్.ఎంత వద్దన్నా అతని ముఖం లో విసుగు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
''రూమ్ లంటూ ఎవరివి వాళ్ళకి వుండవట నాన్నా.అందరూ హాల్లోనే పడుకోవాలట. అయినా రెండురోజులకోసారి నేనో, మీ కోడలో వచ్చి చూస్తూనే ఉంటాం.మీరేం కంగారు పడకండి. వస్తాను. ఆఫీసులో పర్మిషన్ టైం అయిపోతే మళ్ళీ బాస్ చేత మాటలు పడాల్సి వస్తుంది. వెళ్లొస్తాను.'' తండ్రిని ఆయనకు కేటాయించిన కాట్ దగ్గరకు తీసుకువచ్చి కూర్చోబెట్టి, అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చూసి, వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు కార్తీక్.
''బాబూ...'' బావురుమన్నారు జగన్నాధం గారు.
'' తప్పు నాన్నా.మీరే ఇలా బాధపడితే ఎలా? అటు మీకోడలు ఉద్యోగం, ఇటు నా ఉద్యోగం, ఓ పక్క పిల్లల కాన్వెంట్ చదువులు, కౌలుకి ఇచ్చిన పొలం వ్యవహారాలూ చూసుకోవడం, వీటన్నిటితో మిమ్మల్ని సరిగ్గా చూడలేక ఇలా చెయ్యాల్సివస్తోంది గానీ లేకుంటే మిమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నాన్నా?" పైకి అంటున్నాడే గానీ గొంతులోంచి వచ్చిన తన మాటలు తనకే పేలవంగా అనిపించాయి కార్తీక్ కి. అందులో నిజమెంతో తనకు తెలుసు.
''సరే బాబూ. నీకోసం ఈ కళ్ళు అనుక్షణం ఎదురుచూస్తుంటాయని మర్చిపోకు. జాగ్రత్త. మనవలని అడిగానని చెప్పు.'' ఒక్కొక్క మాట అతికష్టం మీద కూడగట్టుకుని అంటున్న తండ్రిని చూస్తే ఒక్కక్షణం జాలేసింది కార్తీక్ కి. కానీ తప్పాడు.కిరణ్మయితో పడలేం. కళ్ళు చమర్చగా తండ్రిని వదిలి వడి వడిగా ముందుకు కదిలిపోయాడు కార్తీక్.
అప్పుడు పడింది ఆయన భుజం మీద ఓ చెయ్యి ఓదార్పుగా.
నెమ్మదిగా తలెత్తి చూసారు జగన్నాధంగారు.
'' నమస్తే. నా పేరు ప్రకాశం. మన వయసులో ఈ హోం కి వచ్చిన వాళ్ళందరూ ముందు ఇలా బాధ పడినవారే.జీవిత చరమాంకం లో ఉన్నాం.ఈ వయసులో మీరు కన్నీరు పెట్టడం నాకు చాలా బాధగా ఉంది.ఇంతకన్నా ఎన్నో సుడిగుండాలను మీరు ఇంతకూ ముందు వయసులోనే తట్టుకుని వుంటారు. కోశస్థ దశ విడిచి సీతాకోకచిలుకలా స్వేఛ్చగా ఎగిరిపోయి దశకు చేరుకున్నవాళ్ళం. మీరు ధైర్యంగా ఉండాలి. అదే మనకు మిగిలిన ఆరోగ్యాన్ని నిలబడేలా చేస్తుంది. ఏమంటారు?''
ఆయనకు అరవైఏడేళ్లకు పైనే ఉంటాయి. ఆత్మీయుడిలా చెబుతున్న ఆయన మాటలకు గంభీర వదనుడై భుజం మీద పడిన చేతిని ఆసరాగా తీసుకుని లేచి నిలబడి , శ్రీరాముడు ఆంజనేయస్వామిని కౌగిలించుకున్న రీతిలో ప్రకాశంగారిని కౌగలించుకున్నాడు జగన్నాధం గారు.
''నాపేరు జగన్నాధం.''అంటూ తనను పరిచయం చేసుకున్న కొద్దిసేపటికే వారిద్దరూ కాలం తెలియని తమ జీవితానుభవపుటల్లో ప్రతీ పేజీని చదువుకుంటూ, ఆప్తులైపోయారు.
*****
ప్రకాశంగారి సాహచర్యంలో ఎంతో అత్యద్భుత క్షణాల్లా నెలరోజులు యిట్టే గడిచిపోయాయి జగన్నాధం గారికి. ఈ నెల రోజుల్లో కార్తీక్ గాని, కిరణ్మయి గానీ ఇటు తొంగిచూడలేదు. సరికదా, కనీసం కాకితో కబురైనా పంపలేదు జగన్నాధం గారు ఎలాఉన్నారా అని?
"చూసావా ప్రకాశం! ఆనాడు నన్ను ఇక్కడ చేర్పిస్తూ కనీసం రెండురోజులకొకసారైనా వచ్చి చూసి వెళ్తానని అన్న నాకొడుకు కనీసం నెలరోజులైనా రాలేదు. ఇక్కడ నాకంటూ నీ తోడు దొరకకపోయి ఉంటె నేను ఏమైపోదును?" అన్నారు జగన్నాధం గారు ప్రకాశం తో.
''చివురు వేసిన కొమ్మను చూస్తే కలిగే ఆనందం పండిపోతున్న ఆకును చూస్తే కలగదు జగన్నాధం.అయినా వాళ్ళు రావాలనుకోవడం కూడా మన పొరపాటే. వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళ బిడ్డల సంరక్షణా పనుల్లో వాళ్ళు బిజీ గా ఉంటారు. మన వయసు వారికీ వస్తే గానీ వారికి తెలియదు మన బాధ. మనలాంటి వారికి ఇలాంటి ఆశ్రమాలైనా ఉన్నాయి. ఇదీ లేని వారితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులం జగన్నాధం.''
ప్రకాశం గారి మాటలు పూర్తి కాకుండానే ఆయన కొడుకు, కోడలు, మనుమలు వచ్చారు. వారు వఛ్చిన ఆనందంతో, పాలు కడుపునిండా తాగి ఆడుకుంటున్న పసిపాపే అయిపోయారు ప్రకాశం గారు. జగన్నాధం గారికి కొడుకును, కోడల్ని జగన్నాధంగారికి పరిచయం చేశారు.వాళ్ళు '' అంకుల్. బాగున్నారా. మా నాన్నగారిని జాగర్తగా చూస్తూ ఉండండి. '' అంటూ ఆప్యాయంగా పలకరించడం తో సగం బాధను మరచిపోయారు జగన్నాధంగారు.
రక రకాల పండ్లు, ఫలాలు, మినప సున్ని, రవ్వలడ్డు మొదలైన స్వీట్లు తెచ్చి ఇచ్చారు. ''ఈ మధ్యనే షుగర్ తగ్గుముఖం పట్టిందిరా. అబ్బాయీ,.మళ్ళీ ఇవి తింటే ఎక్కువ అవుతుంది '' అని పందుకు తీసుకుని స్వీట్స్ వెనక్కు తిరిగి ఇచ్ఛేసారు ప్రకాశంగారు.
వాళ్ళు ఉన్నంతసేపూ వాళ్ళల్లో తన కొడుకు, కోడలు, మనుమలు చూసుకోవడం వల్ల కాబోలు జగన్నాధం గారు చాలా ఉత్సాహంగా ఫీల్ అయ్యారు. వాళ్ళు వెళ్లిపోయారు.
ఆరోజే జగన్నాధం గారికి ఓ ఉత్తరం అందింది . అదైనా కొడుకునుంచేమో అనుకున్నారు. కాన్వెంట్ నుంచి పెద్దమనవడు రాసింది.
'' తాతయ్యా! మేము అంతా బాగున్నాం. మీరెలా ఉన్నారు? నెల రోజులనుంచి మీరు సోమ, బుధ , శుక్ర వారాలలో క్రమం తప్పకుండా వ్రాస్తున్న ఉత్తరాలు అన్నీ అందాయి. లైఫ్ లో ఏదైనా గోల్ పెట్టుకుని చదవమన్నారు. నాకు పైలట్ అవ్వాలని ఉంది. మీరు వ్రాసిన ప్రతీ ఉత్తరం నాకు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది. నాన్నగారి విషయంలో మీరు చేసిన పొరపాటును మాద్వారా దిద్దుకుంటున్నట్టు వ్రాసారు. అదే అర్ధం కాలేదు.
మొన్న రాజాజీ వ్రాసిన రామాయణం చదివాను. ఎంతో సున్నితమైన భావాన్ని సరళమైన ఇంగ్లీషు లో ఆ మహనీయుడు రచించిన తీరుకు చదువుతున్నంతసేపూ నాకు ఒళ్ళు పులకరించింది. చెస్ లో మొన్న జోనల్ లెవెల్ లో విన్నర్ అయ్యాను. చెస్ పట్ల నాకున్న అయిష్టతను పోగొట్టి అభిరుచిని పెంచి ఈ వేళ విన్నర్ స్థాయికి పెంచగలిగిన ఘనత మీదే.
సకల సంపదలూ మనకు ఉండి కూడా మీరు మాకు దూరంగా ఉన్నారనుకుంటే చాలా బాధ కలుగుతోంది. మీరు దగ్గరే ఉంటే ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభించేది అమ్మకు ఖాళీ ఉండదు. తమ్ముడు కూడా బాగా చదువుతున్నాడు. . నేను రిప్లై ఇవ్వలేదని మీరు వ్రాయడం మానకండి. మీరు వ్రాసే లెటర్స్ చదువుతుంటే నెహ్రు గారు ఇందిరాగాంధీ గారికి వ్రాసిన ''లెటర్స్ టు హిజ్ డాటర్ '' పుస్తకం గుర్తుకు వస్తోంది. మళ్ళీ తొందరలో లెటర్ వ్రాస్తాను.మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటాను. నమస్కృతులతో. ..
మీ పెద్ద మనవడు - శ్రీ హర్ష. "
ఆ ఉత్తరం మనవడి నుంచి వచ్చిన మూడో ఉత్తరం. ఈ నెలరోజుల్లో వచ్చిన ఆ మూడు ఉత్తరాలే తన ఎడారి జీవితానికి ఒయాసిస్సులు. ఎండిన నేలకు తొలకరి వానలు. అపురూపంగా ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకుని దాచుకుంటుంటే ప్రకాశంగారు నవ్వారు.
''చూసావా జగన్నాధం,సంతృప్తిని కలిగించే అంత చిన్న వస్తువు చాలు మనకు ఈ వయసులో - అన్న విషయాన్నీ ఈ పిల్లలు గుర్తించేదెపుడో.''
'' అందుకేగా ప్రకాశం.నేను రైల్వే టి.సి. గా పనిచేసినప్పుడు దొరకని ప్రశాంతతనంతటినీ పోగేసి ఎన్నో ప్రదేశాలు తిరిగిన నా అనుభవాలన్నింటినీ కలబోసి ఇప్పుడు కాగితం మీద పెట్టగలుగుతున్నాను. ఆ చిన్న కాగితాన్ని ఓ ప్రధాన గ్రంథమంతగా చేసుకుని ఎదుగుతున్న మనవడిని చూస్తుంటే మరింత ఉత్సాహం పుంజుకొస్తోందోయ్. ఈ మూడ్లో ఉండగానే సమాధానం రాసేస్తాను.'' అంటూ లెటర్ రాయడానికి ఉద్యుక్తులయ్యారాయన.
జగన్నాధంగారు తన అనుభవాలు చెబుతూ రాస్తున్న వుత్తరం ప్రకాశంగారి ఛలోక్తులతో మరిన్ని విజ్ఞాన విషయాలు సంతరించుకుంటున్న అస్త్రం లా సిద్ధమైంది చివరకు.
*****
అంతవరకూ రానివారు హఠాత్తుగా మనుమలిద్దరితో సహా ప్రత్యక్షమైన కొడుకు, కోడలిని చూస్తూనే జగన్నాధంగారు ఉప్పొంగిపోయారు.
కానీ నెలరోజుల తర్వాత తండ్రిని చూస్తున్న ఆనందం లేకపోగా కార్తీక్ గంటు పెట్టుకున్న ముఖంతో అసహనంగా ఉన్నాడు.
''బాగున్నారా మావయ్యా ?''ముభావంగా పలకరించిన కోడల్ని, కొడుకుని మార్చి, మార్చి చూసారు.మనవలిద్దరినీ దగ్గరకు తీసుకుని నుదుట ముద్దాడి'బాగా చదువుతున్నారా నాన్నా?' అని ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆయన కళ్ళనుండి ఆనందభాష్పాలు రాలాయి. అదే అదనుగా మోచేత్తో భార్య పొడిచిన పొడుపు కి స్పృహ లోకి వచ్చినవాడిలా అడిగాడు కార్తీక్.
'' మీరు ఠావులకొద్దీ ఉత్తరాలు రాసి వాళ్ళ టైం అంతా పాడుచేస్తుంటే చదువేం చదువుతారు నాన్నా? వాళ్ళకి మీరు తిరిగిన ప్రదేశాలు, అక్కడి విశేషాలూ చాటభారతమంత ఉత్తరాలు రాయడం ఎందుకూ? వాళ్లేమో కాన్వెంట్ లో చదవడం మానేసి అందరితోటీ కూర్చుని ఇవే చర్చలట. ఈసారి 'రాంక్' తగ్గిపోయిందేమిటా అని వాళ్ళ అమ్మ ఆరా తీస్తే ఇదీ విషయం. మీరికనుంచి వాళ్ళకి ఉత్తరాలు రాయడానికి వీల్లేదు. ఇంట్లో, వాళ్ళు అస్తమానూ మిమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నారనే కదా మిమ్మల్ని ఇక్కడ చేర్పించింది. పోనీ వాళ్ళని దూరంగా ఏదైనా హాస్టల్ లో చేర్పించేయమంటారా? చెప్పండి.''కఠినంగానే అడిగాడు కార్తీక్.
''వద్దురా కార్తీక్. బిడ్డకు దూరం అయిన బాధ ఏమిటో నాకు తెలుసు. ఆ బాధ నీకూ కలగాలని కోరుకునేటంత దుర్మార్గుడిని కాదు. నీ బిడ్డల పట్ల నీ ప్రేమ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఇక ఏనాడు నీ పిల్లలకు ఉత్తరాలు రాయను. నీ మీద ఒట్టు." ఆయన మాటలు ఆయన పడుతున్న అంతర్గత వేదనకు ప్రతిరూపంగా ఉన్నాయి. కళ్ళల్లో ఎంతవద్దనుకున్నా నీళ్లు తిరిగాయి.
''సరే గానీ మీ ఆరోగ్యం ఎలా ఉంటోంది మామయ్యా?'' అని అడిగింది కిరణ్మయి.
''బాగానే ఉంటోందమ్మా. అయినా మీ అత్తయ్య ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఎలా ఉంటుందమ్మా ఆరోగ్యం? ఏదో ఇక్కడ అందరూ మంచి వాళ్ళు కాబట్టి కాలం వెళ్ళబుచ్చుతున్నాను. భార్య పోయిన మగవాడు జీవశ్చవం తో సమానం. నా భార్య పట్ల నాకు నిజమైన ప్రేమ లేదేమో. అదే ఉంటే ఆమె మరణించిన మరుక్షణం నేనూ పోయి ఉండేవాడిని. మీ అందరికీ నా శ్రమ తప్పేది." అన్నారాయన గాద్గదికంగా.
''ఏమైనా అంటే ఇదొకటి. అంతంత పెద్ద మాటలెందుకు నాన్నా? ఇపుడు నీకు ఏం లోటు జరిగిందని? మాకెవరికీ ఖాళీ లేకే కదా నిన్ను ఇక్కడ ఉంచాల్సి వచ్చింది.'' నిష్ఠూరంగా అన్నాడు కార్తీక్.
''అవునురా. ఖాళీ ఉండదు. నిజమే.అనుక్షణం రూపాయికి మరో రూపాయి చేర్చుకుందాం అనుకునే వాడికి ఖాళీ ఎందుకు ఉంటుంది? నాకు తెలియక అడుగుతాను. నీ మనుమలు కూడా ఉద్యోగం చెయ్యకుండా సుఖం గా కూర్చుని తినగలిగేటంత ఆస్థి ఉన్నపుడు ఇంకా ఎందుకురా సంపాదన? మనిషి సంతృప్తికి అంతం ఎక్కడ? అటువంటప్పుడు అమ్మాయిని అయినా సుఖంగా బ్రతకనీయక ఎందుకురా ఉద్యోగం పేరుతొ ఆమెను ఇబ్బంది పెడతావు?''
''చూడండి నాన్నా.,డబ్బెవరికీ చేదు కాదు. మీ కొడుకుగా మీరు సంపాదించి నాకు ఇచ్చినట్లే నా పిల్లలకు ఇవ్వాలని నాకూ ఉంటుంది. వాళ్ళు సుఖంగా ఉండటానికే నా ఈ ప్రయత్నమంతా.ఇక మీ కోడలంటారా? తనకి కూడా కాలక్షేపం కావాలి కదా ఇంట్లో. తాను చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా ఎవరూ ప్రభుత్వ ఉద్యోగం వదులుకోరు. అయినా సిరిరా మోకాలొడ్డు తారెవరైనా?''
" చూడబ్బాయ్. నీతో నేను వాదించలేను.చదువుకున్న ప్రతీ ఆడది ఉద్యోగమే వెలగబెడుతోందా? అయినా మీ అభిప్రాయాలు మీవి. మా మాటలు మీకు ఎక్కడ చెవికెక్కుతాయి గనుక? నా బాధంతా ఏమిటంటే పిల్లలు మనసు తెలుసుకుని వారి అభిరుచి కి తగ్గ చదువు చదివేలా పెంచమని. అయితే వారికి అసలు ఏ అభిరుచి ఉందో కూడా తెలుసుకోలేని భార్యాభర్తలకు నా బాధ అర్ధం కాదురా. అది నీకు అర్ధం కావాలంటే...ఉండు.'' అని జగన్నాధం గారు లేచి తన పెట్టె దగ్గరగా వెళ్లి దానిని తెరిచారు. దానిలో ఆయన బట్టల అడుగున భార్యతాలూకు చీరమడతల్లో అతి భద్రంగా దాచిన ఒక పెద్ద పేకట్ పట్టుకొచ్చి కొడుకు చేతికి ఇచ్చారు.
''దీన్ని ఇంటికి వెళ్ళాకా ఓపెన్ చెయ్యి. నా భావం అర్ధం అయితే సరే. లేకపోతే వెంటనే దాన్ని తగ పెట్టేయ్యి. మళ్ళీ విజి టింగ్ అవర్స్ టైం అయిపోతే ఇబ్బంది పడతారు. వెళ్లి రండి నాయనా'' అన్నారు.
మనవలు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్లిపోతుంటే ఆయనకు భార్య అనసూయ గుర్తుకు వచ్చింది.
'' నీ దగ్గరకు తొందరగా వచ్చేయాలని ఉంది అనసూయా. నన్ను తొందరగా రప్పించేయమని దేవుడికి రికమెండ్ చేయవూ.." అనుకున్నారాయన మనసులో ఆర్తిగా.
వెళ్లలేక వెళ్లలేక వెళ్తున్న మనవలకు వీడ్కోలు చెబుతున్నట్టుగా ఆయన చెయ్యితో పాటు మనసు కూడా ఊగిసలాడుతూనే ఉంది అయోమయంగా.
*****
వారం రోజుల వరకూ పనుల తొందరవల్ల తండ్రి ఇచ్చిన పేకట్ ను విప్పి చూడాలని స్ఫురించనేలేదు కార్తీక్ కి.
ఆరోజు ఆదివారం. తలనొప్పిగా ఉందని కిరణ్మయి టాబ్లెట్ వేసుకుని పడుకుంది.
''తాతగారు ఇచ్చిన ప్యాకెట్ విప్పి చూపించండి డాడీ.'' అని పిల్లలు అడగడంతో గోద్రెజ్ బీరువాలో ఉంచిన పేకెట్ ను తీసుకుని పిల్లలతో తన రూంలో సోఫాలో కూర్చున్నాడు కార్తీక్. పేకట్ విప్పాడు.
అందులో మూడు వస్తువులున్నాయి.
మొదటిది సుమారు నాలుగువందల ఫోటోలకు పైగా ఉన్న ఆల్బమ్ .ప్రతీ పేజీ తిప్పుతుంటే అతని కళ్ళు సంభ్రమాశ్చర్యాలతో పత్తికాయల్లా విచ్చుకోసాగాయి. అవన్నీ తన ఫొటోలే .
నేలమీద బోర్లా పడినప్పటినుంచి పెళ్లి వరకు ఎన్నెన్నో ఫోటోలు. అన్నీ తనను కేంద్రం గా చేసి తీసినవే. దానిని పిల్లలకు ఇచ్చి రెండవదానిని ఓపెన్ చేసాడు.
అది ఒక వీడియో క్యాసెట్ . వి. సి. ఆర్. ఆన్ చేసి కేసెట్ ప్లే చేసాడు.
హాస్పిటల్ లో తాను పుట్టినదగ్గరనుంచి పడవ పుట్టినరోజువరకు ప్రతీ బర్త్- డే పార్టీ చిత్రీకరించబడింది. తన నామకరణ మహోత్సవం, అక్షరాభ్యాసం, తీరికవేళల్లో తండ్రి తనతో మాట్లాడుతున్నా దృశ్యాలు , తానూ తండ్రిని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఎన్నో ఎన్నో సన్నివేశాలు హృద్యంగా తీయబడ్డాయి. తాము తిరిగిన పుణ్యక్షేతాలు అద్భుతమైన సీనరీస్ లో తానూ ఉండగా వినూత్న రీతిలో తీసిన వీడియో కేసెట్ అది.
తనకు తెలియకుండానే అతని కళ్ళు సెలయేళ్ళయి ప్రవహించసాగాయి.
''అదేంటి..డాడీ. ఏడుస్తున్నావెందుకు?'' కుర్రవాడి మాటలతో కళ్ళు తుడుచుకుని మూడో వస్తువు విప్పాడు.
అందులో ఒక ఉత్తరం ...ఇలా సాగింది.
"బాబూ కార్తీక్. నీలో ఏదో మార్పు ఆశించి నీకు ఇది రాస్తున్నాను అనుకోకు. నేను ఇవన్నీ నీకు సాక్ష్యాలుగా చూపించడానికి తీసుకోలేదు. తీయించలేదు. కేవలం నా సంతృప్తి కోసం, నా బిడ్డ పట్ల నేను చూపించవలసిన ప్రేమ డబ్బు యావ లో పడి ఎక్కడ మర్చిపోతానేమో అన్న భయంతో తీసుకున్నవి. జీవితం లో ఉన్నత స్థితి లో ఉండగా 'నా తండ్రి నన్ను చూసి ఆనందించాలి. నా నుదుట పుత్ర ప్రేమతో చుంబించాలి.'అని తపన పడ్డాను. నా ఆశ తీరకుండానే మీ తాతగారు కాలం చేశారు. ఆ లోటు నా బిడ్డ కు రాకూడదన్న ప్రయత్నమే ఇదంతా.
నీ చిన్నప్పుడు విజయవాడ నుండి విశాఖపట్నం వరకు నా జాబ్ లో రోజూ రైలు లో ప్రయాణిస్తుండేవాడిని. వారానికి అయిదు రోజులు కేంపులే.
నీ ఆట పాటలు అల్లర్లు నాకు ఖాళీ అయినప్పుడల్లా అనుక్షణమూ చూసుకోవడం కోసం కేవలం నాకోసం తీసి దాచుకున్న తీపి జ్ఞాపకాలు అవి. నీనుండి నన్ను విడదీస్తుంటే నేను భరించలేకపోతున్నానురా. నీ పట్ల పుత్ర ప్రేమతో, మరో బిడ్డ కలిగితే నా ప్రేమను వాడికి కూడా పంచి ఇవ్వాల్సి వస్తుందని నిన్ను నిన్ను గా ప్రేమించడం కోసం నేను నిన్ను మీ అమ్మ కన్నా మరునాడే వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. నీ ఇంట్లో స్టోర్ రూమ్ లో పడేసిన చాలు. నా తనువూ ఉన్నంతకాలం కళ్ళముందు నువ్వు మసలుతుంటే చూసే అదృష్టం నాకు ఇవ్వు బాబూ. ఆపైన నీ ఇష్టం. వీటిని, నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్చిన నాడే ఇద్దామనుకున్నాను. నాకు తెలుసు - నాజీవితం లో ఇలాంటి రోజు వస్తుందని. అందుకే ఇది రాసి దాచుకుంటున్నాను. ఉంటాను బాబూ. నువ్వెక్కడున్నా నా ఆత్మ నీ క్షేమాన్ని మాత్రమే ఆకాంక్షిస్తూ ఉంటుంది. ఇవేమైనా నిన్ను బాధపెడితే మరుక్షణం వాటిని దగ్ధం చేసెయ్యి. ఉంటాను.
ప్రేమతో - నీ కన్న తండ్రి. ''
ఆ ఉత్తరం చదివిన కార్తీక్ ఒక్క ఉదుటున లేచి బాత్రూమ్ లోకి దూరి తలుపులు వేసుకుని గుండెలవిసేలా వెక్కి వెక్కి రోదించాడు.
''నాన్న. ఈ బిడ్డ పట్ల మీ ప్రేమను గుర్తించలేకపోయాను. క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. ఇపుడే మిమ్మల్ని నాదగ్గరకు తెచ్చేసుకుంటాను నాన్నా. మీకేనాడు క్షోభ కలిగించననీ అమ్మమీద ప్రమాణం చేస్తున్నాను. ఇపుడే వస్తున్నాను నాన్నా."
అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు.
పిల్లలు బాత్ రూమ్ తలుపు కొట్టేసరికి గబగబా ముఖం కడుక్కుని ప్రసన్నవదనం తో బయటకు వచ్చాడు.
''డాడీ. ఎక్కడి కైనా వెళ్తున్నారా.'' ప్రచ్ఛన్న వదనంతో ఉన్న తండ్రిని అడిగాడు పెదబాబు.
'' అవునమ్మా. అమ్మ లేచే లోపల మనం తాతగారిని ఇంటికి తెచ్చేసి అమ్మను సర్ప్రైజ్ చేద్దాం. ఆ...అన్నట్టు మీరు నాకో ప్రామిస్ చెయ్యాలి. చేస్తారా.'' అడిగాడు కార్తీక్.
''ఏమని డాడీ.'' అడిగాడు చినబాబు.
''ఇక ఎపుడూ నన్ను డాడీ అని పిలవం అనీ...నాన్నగారూ అని పిలుస్తామని.''
''సరే నాన్నగారూ.'' ముక్త కంఠం తో అంటున్న బిడ్డలా నుదుట ప్రేమతో చుంబించిన కార్తీక్ బైక్ తాళాలు తీసుకుని తేలికపడ్డ మనసుతో ఆనందంగా పిల్లల్ని తీసుకుని తండ్రి ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ వైపు బయల్దేరాడు.
ఇప్పుడతను 'కడిగిన ముత్యం' లా ప్రకాశిస్తున్నాడు.
( ఆంధ్ర ప్రభ - సచిత్ర వార పత్రిక - తేదీ : 20 - 07 - 2002 నందు ప్రచురింపబడిన కధ )
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
antha old story miku dorikindandi babu

and 20yrs back e old age homes gurinchi ee range lo stories raasara?
Like Reply
#3
మీకు బ్రహ్మంగారి చరిత్ర, Jules Verne War of the worlds తెలుసుగా, అటువంటిదే ఈ ఆలోచనల సారాంశం
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#4
Super fantastic story  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)