Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance భామాకలాపం
#1
భామాకలాపం
-Srinidhi Venkat
సాయంత్రం ఐదు అవుతోంది. బాల్కనీ పిట్టగోడపై చేతులు పెట్టుకుని కాఫీ తాగుతూ ధీర్ఘంగా’ ఆలోచిస్తోంది ప్రియ. ఇప్పటికి ఇది నాలుగో కాఫీ.ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలా కప్పులు కప్పులు కాఫీ తాగడం ప్రియ నైజం. గాలికి ఊగుతున్న “మేపల్” చెట్టు ఆకుల మధ్య నుండి తన నులివెచ్చని కిరణాలతో దాగుడు మూతలు ఆడుకుంటున్నాడు సూర్యుడు. రోజు తనని ఎంతో ఆశ్చర్యంతో, ఆరాధనతో చూసే ప్రియ, ఈరోజు పట్టించుకోక పోవడంతో సూర్యుడు కూడా ఎర్రగా అలిగి, ఒరిగిపోయాడు. ఈ కోపంలో తమకు నీళ్ళు కూడా పోయలేదని పిట్టగోడపై కుండీలలో ముచ్చటగా సర్దిన చెట్లన్నీ ఆకులని వాల్చేసి,దీనంగా చూస్తున్నాయి.
ప్రియ అందం, తెలివి, చదువు, లౌక్యం, ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే జీన్సు వేసుకున్న నేటి తరం పదహారణాల తెలుగు పిల్ల.ముంజేతి వరకు పెట్టుకున్న మెహంది డిజైన్, ప్రియ కొత్తపెళ్లి కూతురు అనే హోదాని గుర్తు చేస్తూ ,ఇప్పుడిప్పుడే వెలసిపోతోంది. పెళ్ళైన వారానికే ఉద్యోగం వదిలి, సగటు తెలుగు అమ్మాయిలాగా, మొగుడు కార్తీక్ తో కలిసి “అమెరికా కాపురానికి”, వచ్చింది.
ఇంతలో చిన్నగా శబ్దం చేస్తూ సెల్ ఫోన్ తన ఉనికిని చాటుకుంది. యాదాలాపంగా ఫోన్ ఆన్ చేసిన ప్రియకి తెలియకుండానే బ్రుకుటి ముడిపడింది.కారణం, ఎంతో ఇష్టపడి, విశాల భావాలు గల వాడని కోరి మరీ చేసుకున్న మొగుడి గారి ఫేస్ బుక్, పిచ్చి వల్ల. నిమిషానికో పేజిని లైక్ కొట్టడం,పది నిమిషాలకోసారి స్నేహితుల ఫోటోలపై కామెంట్లు చెయ్యడం, అరగంటకోసారి ఏదో ఒక పనికిమాలిన విషయాన్ని షేర్ చెయ్యడం ఇది అతగాడి వ్యసనం.
తన పేజిలో ఏం చేస్కున్నా ప్రియా పట్టించుకునేది కాదు. అసలు బాధంతా ఎందుకంటే, ప్రియ స్నేహితులని కూడా తన లిస్టు లో ఆడ్ చేసేసుకుని , ఏదో వాళ్ళందరిని ముక్కు కారే వయసు నుండి ఎరుగుదును అన్న చందంగా కామెంట్లు పెడ్తుంటాడు.తన స్నేహితులంతా,” ఏంటి ప్రియా, నువ్వు మీ ఆయనకి రెండో భార్యవట కదా, ఫేస్ బుక్ ని నీకన్నా ముందే పెళ్లి చేసేసుకున్నాడట ?, నిజమేనా?,” అని గేలి చేస్తుంటే ఒళ్ళు మండిపోతోంది ప్రియకి.
మొన్న ఎంతో సంతోషంగా తన ఫేవరేట్ హీరో సినిమాకి వెళ్లారు ఇద్దరూ.లైట్లు ఆర్పెయ్యగానే కార్తీక్ చేతిని పెనవేసుకుని, చక్కగా అతని భుజంపై తలవాల్చి ప్రేమగా ఏదో చెప్పబోతున్న ప్రియకి, నోటిఫికేషన్ వచ్చింది, ఏంటా అని చూస్తే, కార్తీక్ స్టేటస్ అప్డేట్. అది చూడగానే గాలి తీసేసిన బెలూన్ లాగా నీరస పడిపోయింది.అప్పటి మొదలు సినిమా స్టార్ట్ అయ్యాక “ఫీలింగ్ ఎక్సైటెడ్” అని, కాసేపయ్యాక పేర్లు పడేటప్పుడు ఒక సేల్ఫీ, సినిమా మొదలయ్యాక ఎలా వుందని ఒకటి, ఇంటర్వెల్ బాంగ్ అంటూ ఒకటి , సెకండ్ హాఫ్ అని ఒకటి, క్లైమాక్స్ అని ఒకటి ఇలా ఎదో ఒకటి పోస్ట్ చేస్తూనే వున్నాడు. సినిమా అయ్యేసరికి ఇంకో సారి కార్తీక్ తో సినిమాకి రాకూడదు, ఒకవేళ వస్తే అయితే ఫేస్ బుక్ ఐనా రావాలి లేదా తానైనా రావాలి అనే నిర్ణయానికి వచ్చేసింది.
ఇలాంటివే చెప్పేంత పెద్దవీ, మర్చిపోయేంత చిన్నవీ కానీ బాధలు ప్రియవి.చెప్పులో రాయిలాగా కలవరపెడ్తున్నాయి.వెన్నెల్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవాలని తన కోరిక.ఇంటికొచ్చేటప్పటికి అలసిపోయి వచ్చే కార్తీక్ ఎంచక్కా చందమామ, వెన్నెల వున్న ఒక ఫోటోనీ ఫేసుబుక్కులో ఎక్కించి తనని ట్యాగ్ చేసేవాడు.నవ్వాలో ఏడవాలో అర్ధంఅయ్యేది కాదు ప్రియకి . పోనీ కాస్త మెల్లిగా అర్ధం అయ్యేలా చెప్దామంటే, “ఇంత చక్కగా చూసుకుంటున్నా నీకు నచ్చట్లేదా, నేనంటే ఇష్టం లేదా ప్రియా?,” అని బిక్కమొహం వేసే కార్తీక్ ని చూసి కరిగిపోతుంది. దాని కన్నాకూడా అలా అన్న ప్రతిసారీ “ఫీలింగ్ స్యాడ్”, “ఫీలింగ్ లోన్లీ” అని ఎక్కడ ఫేసు బుక్కులో అప్ డేట్ చేసి పరువు తీస్తాడేమో అనే భయం లేకపోలేదు.
పోనీ తన గోడంతా అమ్మకి చెప్పుకున్దామంటే. “పిచ్చి మొహమా, బంగారం లాంటి పిల్లోడు. ఒక చెడు అలవాటు లేదు , ఇంటి రుచి తప్పించి ఇంక ఏ రుచి నచ్చని వాడు , ఇంతకన్నా ఏం కావాలే.ఈ కాలం ఆడపిల్లలకి మరీ సుఖాలు ఎక్కువై పోయాయే. మాకున్నన్ని కష్టాలు మీకు ఉన్నుంటే ఏమయ్యేవాళ్ళో.అనవసరంగా చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూసి కోడి గుడ్డు పై ఈకలు పీకమాక,” అని ఎంచక్కా ఫోనులోనే తలంటు పోసింది.
ఇక ఎదో ఒక విషయంలో సర్దుకుపోవడం తప్పదు అనుకుని చూసి చూడనట్లు వదిలేసింది.ఇక్కడే అసలు చిక్కు వచ్చింది.పెళ్లి కుదిరిన తరువాత మాటల మధ్యలో తను కాలేజిలో ఉన్నప్పుడు ప్రేమించిన అమ్మాయిని గురించి చెప్పాడు కార్తీక్.తను ఎంత నిజాయితీగా ప్రేమించింది , ఎలా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న గుండెజబ్బుకూ, తన ప్రేమకు ముడివేసి తన ప్రేమను తుంచేసి ఇంకొకరిని పెళ్ళి చేసుకున్నదీ .. అంతా వివరంగా చెప్పాడు.పెళ్ళికి ముందే అన్ని విషయాలు చెప్పేసిన కార్తీక్ పై ఇంకా ఇష్టం పెరిగింది ప్రియకి.పైగా ఇలాంటి విషయాలు ఈరోజుల్లో మామూలేనని, తాను చాలా స్పోర్టివ్ అని కార్తీక్ తో చెప్పింది.ఇప్పుడు మళ్ళి ఆ అమ్మాయితో ఫేస్ బుక్ స్నేహం మొదలయ్యింది.పోనీ ఏమైనా తెలియకుండా చాటుగా మాట్లాడుతున్నాడా అంటే, అదీ లేదు.ఆ అమ్మాయి ఆడ్ రిక్వెస్టు పంపించిన దగ్గిర నుండి, తను ఏం మెసేజి చేసింది వరకు అన్ని చెప్పే చేస్తాడు.ఇది మరీ పుండు మీద కారం చల్లినట్టు ఉంది ప్రియకి.
ఆ అమ్మాయి ఫొటోలకి ఈయన గారు లైకులు కొట్టడం, తమ ఇద్దరము ఉన్న ఫోటోకి ఆవిడ గారు కామెంట్లు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే అరికాలి మంట నెత్తికెక్కుతోంది ప్రియకి. పెళ్ళికి ముందు ఇలాంటి విషయాలు తేలిగ్గా తీసుకున్నా, తన మొగుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం, ఏడు మల్లెల ఎత్తు తెలుగుతనం సహించలేకపోతోంది. రోజుకోసారి ఆ అమ్మాయి ప్రొఫైలుని గుడచారిలా చూడడం, ఆ అమ్మాయి తనకంటే బాగుందా లేదా అని తనలో తనే బేరీజు వేసుకోవడం, ఇదో వ్యసనంలా తయారయ్యింది ప్రియకి. ఎలాగైనా ఇందులోంచి తనని, కార్తీక్ నీ బయటపడేయ్యాలని నిర్ణయించుకుంది.
దెబ్బలాడి, భయపెట్టి , అలిగి పనులు చేయించుకునే మనస్తత్వం కాదు ప్రియది.ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్న తమ గూడు ప్రేమ, నమ్మకంతో గట్టిగ పెనవేసుకుని ఉండాలే కానీ, బలవంతపు కాపురం కాకూడదని ప్రియ అభిప్రాయం.అందుకే తన బాధని ఎప్పటికీ మరచిపోని విధంగా కార్తీక్ కి తెలియజెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చి, ఇంట్లోకి వెళ్ళింది ప్రియ.
******
ఎప్పుడూ బెల్లు కొట్టి కొట్టగానే నవ్వుతూ ఎదురొచ్చే ప్రియా ఎంతసేపటికీ తలుపు తెరవకపోవడంతో తన దగ్గర వున్న తాళంతో తలుపు తెరుచుకుని వచ్చాడు కార్తీక్.బెడ్ రూమ్ లో బోర్ల పడుకుని ఐపాడ్ లో ఫేస్బుక్ చూసుకుంటోంది ప్రియా.
“హాయ్ ప్రియా, ఏంటోయ్ అంత బిజీ?”,అంటూ ప్రియనీ మీదికి లాక్కున్నాడు కార్తీక్.
“ప్లీజ్ కార్తీక్, మా కజిన్ తో చాట్ చేస్తున్నాను.కాఫీ నువ్వే పెట్టుకుని తాగేసేయ్”, అని మళ్ళి చాటింగ్ లో మినిగిపోయింది ప్రియ.
“ఓకే నో ప్రాబ్లం “,అనేసి ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ చేసుకుని తాగి తన పనిలో పడిపోయాడు కార్తీక్.
కాసేపటికి ప్రియ వంటింట్లో డిన్నర్ రెడీ చేస్తోంది. మధ్య మధ్యలో తన ఫోన్ పిల్లి కూతలు కుయ్యడం, వాటిని చూస్తూ ప్రియ తనలో తనే నవ్వుకోడం ఇవన్నీ కార్తీక్ గమనిస్తూనే వున్నాడు.
రొజూ తన పని చెడగోడుతూ ఎప్పుడు తన చుట్టూ తిరుగుతూ ఏదోటి మాట్లాడే ప్రియ అలా మౌనంగా తన పని తను చేసుకోవడం అస్సలు నచ్చట్లేదు కార్తీక్ కి. ఇంట్లో ఉన్నాము అనేకంటే లైబ్రరీలో ఉన్నామేమో అనిపిస్తోంది వాతావరణం.భోజనం చేసేటప్పుడు కూడా పోటీలు పడి మోగుతున్నాయి ఇద్దరి సెల్ ఫోన్లు.
ఇలా రెండు రోజులు గడిచేసరికి జీవితం నరకంలా కనపడసాగింది కార్తీక్ కి. ఆ రోజు అఫీస్ నుండి బయలుదేరుతూ “ఫీలింగ్ కన్ ఫ్యుసుడ్”, అని స్టేటస్ అప్ డేట్ చేసి, సెల్లు సైలెంట్ లో పెట్టేసాడు..సాయంత్రం కాస్త తొందరగా ఇంటికి వచ్చాడు.మొక్కలకి నీళ్ళు పోద్దామని బాల్కని లో వున్న ప్రియ దగ్గరికి వెనగ్గా వెళ్లి కళ్ళు మూసాడు.
“చెప్పుకో చూద్దాం,” అని కార్తీక్ అంటే
“ఈ ఇంట్లో దొంగైనా, దొరైనా ఇంకెవరు, కార్తీక్ సారే,”అంటూ నవ్వుతూ కార్తీక్ చేతులని విడిపించుకుని చెట్లకి నీళ్ళు పోస్తూ సేల్ఫీ తీసుకోవడం మొదలెట్టింది ప్రియా.
కార్తీక్ వెంటనే ప్రియా సెల్ లాగేసుకుని ఇంట్లో పడేసి వచ్చాడు.
“ఫేస్బుక్ లో అందరికీ చెప్పే కబుర్లు ముందు నాకు చెప్పు.తర్వాతే మిగతా వాళ్ళకి.సరేనా?,” అని చిరుకోపంతో ప్రియని కసిరాడు.
“మీరే కదా సోషల్ గా మూవ్ అవ్వాలి.ప్రపంచంతో ఎప్పుడూ టచ్ లో ఉండాలి అన్నారు, అందుకే ఇలా చేస్తున్నాను,” అంటూ వచ్చే నవ్వుని ఆపుకుంటూ అమాయకంగా చెప్పింది ప్రియ.
“అంటే ,అదంతా పెళ్ళికి ముందు.ఇప్పుడు మనకి మనమే ముఖ్యం.ముందు మనం, తరువాతే మిగతా ప్రపంచం,”అన్నాడు కార్తీక్.
తరువాత ఇద్దరూ కలిసి మొక్కలకి నీళ్ళు పోసారు.ఏ కుండీలో ఏ మొక్క ఉందో , ఏ చెట్టు ఎప్పుడు పూస్తుందో ప్రియ చెపుతూ వుంటే అలా వింటూనే వున్నాడు కార్తీక్.రెండు రోజుల మౌనం తర్వాత వినే సరికి మొక్కల పెంపకం కూడా తనకి ఎంతో ఇష్టమైన ఎకానమీ న్యూస్ లాగ వినపడుతోంది కార్తీక్ కి.
ఆ రోజంతా ప్రియా చుట్టూనే వున్నాడు కార్తీక్.తను వంట చేస్తుంటే పక్కనే వుండి మాట్లాడిస్తూ వున్నాడు.కలిసి కబుర్లు చెప్పుకుంటూ బాల్కని లో భోజనం చేసారు .
సాయంత్రమే కార్తీక్ ఇద్దరి ఫోన్లు సైలెంట్ మోడ్ లో పెట్టడం ప్రియ చూసి కూడా గమనించనట్టే ఊర్కుంది.
రాత్రి ప్రియ పక్కన చేరి చిన్ని పిల్లాడిలా ముడుచుకుని పడుకున్నాడు కార్తీక్.కార్తీక్ జుట్టుతో ఆడుతోంది ప్రియ.
“ప్రియా , నేనో విషయం అడగనా?,” అని గోముగా అడిగాడు కార్తీక్.
“ఊ అడగండి ,” అంది ప్రియ కార్తీక్ జుట్టుని చెరిపేస్తూ సరిచేస్తూ.
“మీ కజిన్ గురించి నాకు చెప్పనే లేదు నువ్వు పరిచయం చెయ్యవూ ?,”
“ఎవరి గురించి?” ఏమి తెలియనట్టు అడిగింది ప్రియ.
“అదే రోజూ ఎఫ్ బి లో చాట్ చేస్తావే ఆ అబ్బాయి.”
“ఓ వాడా ? వాడు మా అత్తా వాళ్ళ అక్క కొడుకు. వరసకి బావ అవుతాడు.చిన్నప్పుడు వేసవి సెలవులో కలిసేవాళ్ళం .బాగా ఆడుకునే వాళ్ళం.నాకు ఐస్ క్రీములు, చాక్లెట్లు కొనిచ్చేవాడు.”
“ఏడిచాడు వెధవ.వాడు కొనిస్తే మాత్రం నువ్వు తీసుకుంటావా .వద్దనలేక పోయావా?” ఉడుక్కుంటూ అన్నాడు కార్తీక్.
“అయ్యో అప్పుడు నేను చిన్నపిల్లని అండి.అందరూ కొనిస్తారు కదా. అయినా ఇలా మధ్యలో ఆపేస్తే నేన్ చెప్పను అంతే పో,” అని కార్తీక్ ని తోసేసి అటు తిరిగి పడుకుంది ప్రియ, వచ్చే నవ్వుని ఆపుకుంటూ.
“సరే ఆపను లే.చెప్పు చెప్పు. ఇంతకీ వాడి పేరేంటో ?,” కసిగా అడిగాడు కార్తీక్.
“ఫణిభూషణ్ , ఫణి అని పిలిచేవాళ్ళం,” అండి ప్రియా మళ్ళి కార్తీక్ నీ తన వైపు లాక్కుంటూ.
“అదేం పేరు.ఏమి బాగోలేదు. నా పేరే బాగుంది ,” అని చెప్దామనుకుని మళ్ళి ఎక్కడ తోసేస్తుందోనని అలానే గట్టిగ పట్టుకుని పడుకున్నాడు.
“నేనంటే చిన్నప్పటి నుండి వాడికి ఎంతో ఇష్టం.నన్ను ప్రత్యేకంగా చూసేవాడు.ఆటలో నేను దొంగయితే నా బదులు వాడే దొంగయ్యేవాడు.నన్ను గెలిపించేవాడు. సెలవుల్లో అన్ని సినిమాలకి తీస్కెళ్లేవాడు.”
“నువ్వెందుకు వెళ్ళావ్ అసలు. నేను తీసుకెళ్తాను, అన్ని భాషల్లోని అన్ని సినిమాలకి నేను తీసుకెళ్తాను.” అని పట్టు ఇంకాస్త బిగించాడు కార్తీక్.
“అయ్యో, నేనొక్కద్దాన్నేనా? మా అక్క, వాళ్ళ అక్క, బాబాయ్ పిల్లలు ఇలా పది మంది ఉండేవాళ్ళం.వాడు పెద్దవాడు కాబట్టి వాడిదే పెత్తనం.”అని చెప్పింది ప్రియ.
“పుచ్చు వెధవ, వీడికి మళ్ళి సినియారిటి ఒకటి.” అని మనసులో అనుకుని, “మరి అంత గొప్ప స్నేహితుడు మన పెళ్ళికి ఎందుకని రాలేదో?.”అని అడిగాడు కార్తీక్.
“అదంతా పెద్ద కధలే. వాడికి నాకూ గొడవైంది.పెళ్ళికి నేను పిలవలేదు. పిలిచినా వచ్చేవాడు కాదులే .” అంది ప్రియ.
“అబ్బో ఎందుకో గొడవ,”అన్నాడు కార్తీక్.
“కాస్త పెద్దయ్యాక ఎవరి చదువుల్లో వాళ్ళం బిజీ అయిపోయాము. నేను థర్డ్ ఇయర్ లో వున్నప్పుడు ఆమ్మమ్మ వాళ్ళ ఊరిలో కలిసాము. అప్పటికే తను జాబ్ చేస్తునాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు?”
“అడిగాడా? ఎందుకు అడగడు? అక్కుపక్షి,” అని దిగ్గున లేచి కూర్చున్నాడు కార్తీక్.
“విను మరీ. నాకు ఇష్టం లేదని చెప్పాను. ఐనా వినిపించుకోకుండా ఫోన్ చేసి విసిగించేవాడు. దాంతో పెద్ద గొడవైంది. జీవితంలో మళ్ళి నాతో మాట్లాడోద్దని చెప్పేసా? అది మొదలు మళ్ళి ఇప్పుడు పెళ్లి అయ్యాక ఫేస్ బుక్ ద్వారా కలిసాము. అలా ఫూలిష్ గా ప్రవర్తించినందుకు సారీ చెప్పాడు.”
“నువ్వు నమ్మేసావా,?” అన్నాడు వ్యంగంగా కార్తీక్.
“మీరే కదా విశాల భావాలు వుండాలి అన్నారు.” అంది ప్రియా అమాయకంగా.
“అంటే అన్నానులే. నువ్వు మాట్లాడొద్దు ఆ పాము గాడితో. నాకిష్టం లేదు.ఇంకెవరితో అయినా మాట్లాడు, వాడితో మాత్రం వద్దు. నాకు మంట.”
“పాము గాడు కాదు, ఫణి” అండి ప్రియ నవ్వుని మునిపంటితో నొక్కిపెడుతూ.
“నేనన్నది అదే” అన్నాడు కార్తీక్ కచ్చిగా.
“అబ్బో ఎందుకంత రోషం. ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినవి. స్పోర్టివ్ గా తీసుకోవాలి అంతే కదూ,” అని నవ్వుతూ అంది ప్రియ.
తన మాటలు తనకే చెప్పడంతో మొదట కోపం వచ్చింది కార్తీక్, కానీ మంచంపై పడి నవ్వుతూ వున్న ప్రియని చూస్తే ఎదో గుర్తొచ్చిన్నట్టు ఆగిపోయాడు. తను కూడా ఇలాగే ప్రియ వద్దు అంటున్నా వినకుండా ఎదో గొప్ప ఘనకార్యం లాగా తను ప్రేమలో వున్న రోజుల గురించి, చేసిన పనుల గురించి చెప్పేవాడు. ప్రియ చిన్నబుచ్చుకుంటే స్పోర్టివ్ గా ఉండాలి అని చెప్పి నవ్వేసేవాడు. ఇప్పుడు తన బాణం తిరిగి తనవైపే ఎక్కుపెట్టిందనమాట మాట.
ఒక్కసారిగా ప్రియని లాగి ఒల్లో కూర్చోపెట్టుకుని,” ఏయ్ దొంగ నిజం చెప్పు , అసలు ఆ పాముగాడు గాడు లేడు కదూ, నన్ను ఆటపట్టిస్తున్నావ్ కదూ” అని అడిగాడు చక్కలిగింతలు పెడుతూ.
“అబ్బ ప్లీజ్ కార్తీక్.ఇక నవ్వలేను,” అంటూ గింజుకుంటోంది ప్రియ.
“అయితే చెప్పు నిజం,” అన్నాడు.
“మరి ఎన్ని సార్లు చెప్పినా మీరు వింటేగా. మీ ప్రేమ యాత్రలు విన్నప్పుడల్లా నాకు ఎంత కడుపుమంటగా ఉండేదో తెలుసా. అమాంతం ఫ్లాష్ బ్యాక్ లో కి వెళ్ళిపోయి మీ పక్కనుండి దాన్ని లాగేసి, దాని చెంపలు ఎడా పెడా వాయించేసి, మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోవాలి అనిపించేది. మాములుగా చెపితే వినరు కదా. అందుకే ఈ రివర్స్ ఇంజనీరింగ్ అనమాట.”
“రాక్షసి..నిన్నూ” అంటూ ప్రియని కదలనివ్వలేదు ఇక కార్తీక్.
“మరి నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా ఏంటి,” అని నవ్వింది ప్రియ.
“సరే మరి.ఇక మన పుట్టలో మనిద్దరమే . ఇంకెవరు వద్దు. అవును ఇంతకి ఆ పాముగాడు ఎవడు ఫేస్బుక్ లో,” అని అడిగాడు కార్తీక్.
“హమ్..ఇంకా అడగలేదేంటి అనుకుంటున్నా..తను నాతో పాటూ పనిచేసిన కొలీగ్. మంచి ఫ్రెండ్, ఇలా హెల్ప్ కావాలి అంటే సరే అన్నాడు. అది సంగతి.”
“అమ్మో ఇంత మోసమా, చెప్తానుండు నీ పని,”అంటూ ప్రియని ఆక్రమించేసుకున్నాడు కార్తీక్.
*******
రాత్రి గెలుపోటముల మధ్య అలసిపోయిన ప్రియ బద్దకంగా లేచి ఒల్లువిరుచుకుంది.
మూగబోయిన సెల్లుని చూసుకుందామని తెరిచేసరికి,
“ఫీలింగ్ హ్యాపీ” అని కార్తీక్ స్టేటస్ వెక్కిరిస్తూ శుభోదయం తెలిపింది.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
[quote="k3vv3" pid='5056537' dateline='1670668979']
భామాకలాపం
-Srinidhi Venkat
[color=#0d0d0d][size=x-large][font=Potti Sreeramulu]సాయంత్రం ఐదు అవుతోంది. బాల్కనీ పిట్టగోడపై చేతులు పెట్టుకుని కాఫీ తాగుతూ ధీర్ఘంగా’ ఆలోచిస్తోంది ప్రియ. ఇప్పటికి ఇది నాలుగో కాఫీ.ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలా కప్పులు కప్పులు కాఫీ తాగడం ప్రియ నైజం.
--Nice story.
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
#3
భామాకలాపం chala bagundi 
[+] 1 user Likes smartrahul123's post
Like Reply
#4
కథ చాల బాగుంది thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)