Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అభిమాని
#1
అభిమాని
-    రత్నాకర్
ఊహించని ఈ విజయపు ఆనంద కోలాహలాల మధ్యన ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది అతుల్య విహారికి. వారం క్రితం వరకూ సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ పరిచయం లేని మొహం. ఒక సూపర్ స్టార్ కొడుకుగా తప్ప పాత్రికేయులకు కూడా పరిచయం లేని పేరు.
 తను సంపాదించుకున్న ఫారిన్ డిగ్రీలు, తండ్రి సంపాదించిన స్టూడియోలు, హోటల్స్, కంపెనీలు, వ్యాపారాలు, ఆస్తులు ఎన్ని ఉన్నా తనకంటూ వ్యక్తిగతంగా ఎలాంటి పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు లేక తన ఉనికిని నిలుపుకునే అవకాశం కోసం వెంపర్లాడుతున్న ఒక తండ్రి చాటు బిడ్డ నేడు బాక్సాఫీస్ రికార్డులు సృష్టించే మొనగాడు అయ్యాడు. కేవలం తన తండ్రి స్టార్ ఇమేజితో కాకుండా సినీ విమర్శకుల చేత కూడా ఆహా అనిపించాడు, ప్రేక్షకుల చేత ఔరా అనిపించాడు.
 ఏ కాలేజీ క్యాంటీన్ లో ముచ్చట్లైనా, ఏ సోషల్ మీడియాలో ఛాట్టింగైనా, ఏ కేఫ్ లో బాతాకానైనా, యూత్ నోటి వెంట ఒక్కటే మాట.
 "అబ్బ యాక్షన్ సినిమాని మన ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఫైటింగ్స్ స్టెంట్స్ ఇలాగే చేయాలి అనే బెంచ్ మార్క్ ని, గ్రాఫిక్స్ లేకుండా కూడా యాక్షన్ సినిమాలు చేయొచ్చు అనే ట్రెండ్ ని సెట్ చేసాడు రా,
యాక్షన్ సినిమాల దాహం తీరాలంటే హాలీవుడ్ సినిమాలు చూడాలనే మైండ్ సెట్ ని మార్చే సినిమాను తీసి చూపించాడురా" అనే మాటలే ఎక్కడ విన్నా.
 ఏ వార్త పత్రికలో సినిమా కాలమ్ ని చూసినా అతుల్య ఫోటోలే.. అతుల్య స్టెంట్సే అతుల్యాని గురించిన వార్తలే..
సినిమా పత్రికలు, మ్యాగజైన్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. మొత్తం పొగడ్తలతో ముంచెత్తాయి. అవన్నీ చూసి పుత్రోత్సాహంతో మురిసిపోతున్నాడు ఆనంద్ బాబు విహారి.
 
 
 
 అరేయ్ ఇంక నా వల్ల కాదురా నాకు ముందు నుంచీ యాక్షన్ సినిమాలు అంటే పరమ చిరాకు. కేవలం నీకోసం ఇప్పటికే మూడుసార్లు వచ్చాను. నేను రానని మొత్తుకుంటే నేను లేకుండా ఇప్పటికే నువ్వూ మూడుసార్లు చూశావు. అయినా సినిమా అయిపోయి శుభం కార్డు పడిన తరువాత 18వ సెకండ్ లో ఎనిమిది మంది పేర్లతో కలిపి వచ్చే నీ పేరుని చూసుకోవడానికి ఇంత ఆతృత ఏంట్రా నీకు?"
 మనసు చివుక్కుమన్నది సంపత్ కి.
వ్యక్తిగతంగా తనంటే ఇష్టం స్నేహం ఉన్నా తనలో ఉన్న నైపుణ్యాన్ని తన స్నేహితుడు గుర్తించనందుకు కాస్త బాధగా అనిపించినా అదేది పట్టించుకొనట్టుగా నవ్వుతూ బాయ్ చెప్పి సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోయాడు.
సంపత్ సినిమాలలో చేస్తున్నాడు అంటే ఎవరూ నమ్మరు. ట్రాలీ నెట్టడమో, లైట్ బాయ్ గా చేస్తున్నాడో అనుకుంటారు. హీరోకి యాక్షన్ సీన్లలో డూప్ గా చేస్తున్నాడు అంటే అతని దగ్గరి స్నేహితుల కూడా నమ్మరు.
ఈమధ్య జనాలు తెగ పొగుడుతున్న సినిమాలో అత్యంత సాహసోపేత యాక్షన్ సీన్లలో హీరోకి డూప్ గా చేసింది తనే అని చెప్పుకునే అవసరం లేదు, చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేరు. తన పేరుని వెండి తెర మీద చూసుకోవడం మాత్రం సంపత్ కి బాగా నచ్చింది.
 
 
 
 "అలాగే సార్.. అలాగే సార్.. నేను చూసుకుంటాను సార్..,
సార్.. సార్.. నేను ఉన్నాను కదా సార్.
చిన్నబాబు ఏమి చేయనవసరం లేదు మొత్తం నేను చూసుకుంటాను సార్.. మీరు నిశ్చింతగా ఉండండి" స్టెంట్స్ మాస్టర్ కమలాకర్ ఆనంద్ బాబుని కాకా పడుతున్నాడు.
ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసిన అనుభవం, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలందరితో కలిసి పని చేసిన మంచిపేరు ఉన్నా కూడా ఇండస్ట్రీ టాప్ హీరో కొడుకుని తన చేతుల మీద పరిచయం చేసిన ఘనత మరో మైలురాయిగా నిలిచిపోతుంది అనేది ఆతని అభిలాష.
ఎన్నో సక్సెస్ లు కమలాకర్ పేరున ఉన్నా కోపిష్ఠి, ఓపిక లేనివాడు అనే ముద్ర కూడా ఉంది - అదే ఆనంద్ బాబు భయం కూడా.
డ్రామా, కామెడీ, పాటలతో 90% సినిమా పూర్తి అయింది, యాక్షన్ / ఫైటింగ్ సీన్లు మిగిలి ఉన్నాయి. హీరోకి తొలిపరిచయం సినిమా కాబట్టి చాలా చాలా రీస్కీ సీన్లు ఆలోచించాడు స్టెంట్ మాస్టర్.
మొదటి రెండు రోజులు గిరికొండ ప్రాంతపు చిట్టడవిలో షూటింగ్ బాగానే జరిగింది కానీ.. ఇదివరకు ఎప్పుడూ అంతటి శారీరక శ్రమ అలవాటు లేని అతుల్య చాలా ఇబ్బంది పడుతున్నాడు. కార్వాన్ ఉన్నా.. ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్స్ లేవు. అక్కడ ఉన్న 30 మంది మొహాలే చూడటం. అక్కడ ఉండే దోమలు, అడవిలో వచ్చే ఒకరకమైన వాసన అతుల్యని అసహనానికి గురిచేస్తున్నాయి.
 మరుసటి రోజు ఉదయం 4:30కి సెట్ రెడీ చేసి కమలాకర్ హీరో అతుల్యని నిద్ర లేపడానికి సంపత్ ని పంపించాడు. నిద్ర మబ్బులో చిర్రుబుర్రులాడినా, డబ్బుల్లో పుట్టి పెరిగిన బలుపు చూపించినా, సంపత్ నిర్మలమైన మనసుతో ప్రశాంతమైన మొహంతో గౌరవనీయ మాటలతో నిద్ర లేపే విధానం నచ్చింది అతుల్యకి.
"సారీ బాస్ నిద్ర మత్తులో తిట్టాను. ఏమనుకోకు" అరచేతిలో చేయి వేసి గట్టిగా నొక్కి..
"రెండు నిమిషాలు ఇక్కడే కూర్చో ఫ్రెష్ అయి వస్తాను" అన్నాడు.
"సార్ ఇలాగే రండి, కొన్ని నీళ్లు నోట్లో పుక్కిలించుకుని అంతే చాలు.. సీన్లో కూడా మీరు చెట్టుమీద పడుకుని ఉంటారు, మొహంలో నిద్రమబ్బు, చెంపలమీద చద్దరి అచ్చులు ఉంటేనే బాగుంటుంది."
"ఓహో అలాగా.. థాంక్స్ బాస్.. by the by what's your name?"
"నా పేరా సార్. సంపత్, సార్."
"సంపత్ ఇంకా how many days నాకు ఈ టార్చర్"
"నాలుగు రోజులు, ఈ రోజు సూర్యోదయానికి షాట్ ఉందట. రేపటినుండి పదింటికి ఉంటుంది సర్ షూటింగ్"
"పొద్దున లేవడం కాదు సంపత్ నా problem, I love sun raise, కానీ you know day and night ఆ కార్వాన్ లో కూర్చోవాలి అంటే.. and ఇంకా ఫోన్ పని చేయదు, లాప్టాప్ పనిచేయదు, torture అనిపిస్తుంది నాకు.
What kind of a location బాబు ఇదీ.
Forest అంటే ఇలాగే ఉంటుందా?"
"యే అదేం లేదు సార్. దునియా అందంగుంటది. అందులో జంగిల్ ఇంకా అందంగా ఉంటుంది. ముంగటికి పోతే వాటర్ ఫాల్స్ ఉంటాయి. రేపు షూటింగ్ అయిపోయాక సాయంత్రం చూపిస్తాను జంగిల్ అందాలు.
"సరే సంపత్ పద"అంటూ భుజం మీద చేయి వేసి సీన్ ఎలా ఉంటుంది అని మాట్లాడుతు నడుస్తూ ఉన్నాడు.
 వాళ్ళ నాన్న కాకుండా అలా భుజం మీద చేయి వేసి అలా ఆప్యాయంగా ఎవ్వరూ
మాట్లాడలేదు సంపత్ తో.
ఆప్యాయంగా మాట్లాడటం కాదు, మాములుగా మాట్లాడినా అతని మనసు ఉప్పొంగుతుంది. భూతులు వాడకుండా అతనితో ఎవరూ మాట్లాడిందే లేదు. దొమ్మరి ఆట ఆడే వాళ్లంటే సమాజంలో ఆ చులకన ఏళ్ళ నాటిది. ఆ ఛీత్కరింపులు వాళ్ళ నరనరాల్లో ఇమిడిపోయింది. ఆ తిట్లు చెవులను దాటి మనసుని చేరవు.
అతుల్య ఏదో మాట్లాడుతున్నాడు. సంపత్ ఏనుగు అంబారీని ఎక్కిన చిన్న పిల్లడిలా ఆనందంలో తెలియాడుతున్నాడు.
మరేంటి. మెగాస్టార్ ఆనంద్ బాబు కొడుకేంటి.. ఫారిన్ లో చదువుకున్న దొరబాబు ఏంటి. ఆ అందం చదువు హోదా ఎంత పెద్ద మనిషి.. అతుల్య బాబు పక్కన నిలబడితే చాలు అలాంటిది మనం ఫ్రెండ్స్ అని చేయి కలిపి భుజం మీద చేయి వేసి నడవడం ఏంటి?
నడుచుకుంటూ షూటింగ్ స్పాట్ కి వచ్చేసారు.
అతుల్య రాగానే అందరూ అలర్ట్ అయ్యారు. మేకప్ మ్యాన్ అసిస్టెంట్ డైరెక్టర్ మేకప్ చేస్తున్నారు. ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సీన్ / డైలాగ్స్ వివరిస్తున్నాడు.
పెద్ద వృక్షానికి ఎత్తులో ఉన్న కొమ్మ మీద హీరో రాత్రంతా పడుకుని ఉంటాడు, తెల్లవారు జామున పక్షుల కిలకిలా రావాలకు మెలకువ అయ్యి నిద్ర మత్తులో పక్కకు తిరుగుతాడు, కానీ పడుకున్నది చెట్టుకొమ్మ మీద కాబట్టి పట్టుజారి కింద పడేలోగా చాకచక్యంగా కుడిచేతి చూపుడు వేలు మధ్య వేలుతో కొమ్మకు ఉన్న చిన్న బుర్రలో పట్టు చిక్కించుకుని కిందకు వేలాడి నిదానంగా మరింత పట్టు చిక్కించుకుని ఆ చేతు మొత్తం కొమ్మ పట్టుకుని ఒంటి చేత్తో పుషప్స్ చేస్తూ కొమ్మ మీదకు ఎక్కుతాడు.
పుషప్స్ చేస్తూ పైకి వచ్చే సమయంలో చేతి కండకు మొహంకి మధ్యన ఉన్న ఖాళీ నుండి సూర్యోదయం కనబడాలి.. అదీ షాట్. కింద అతని కాళ్ళు గాలిలో ఉన్నాయి అని చూపడానికి మాత్రమే స్పేస్ వదిలి రెండు అడుగుల కింద వలలు కట్టారు.
అంతా రెడీ అయ్యింది. స్టెంట్స్ మాష్టర్ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాడు. అతుల్య కొమ్మ మీద ఎక్కి పడుకున్నట్టు యాక్టింగ్ మొదలుపెట్టాడు కానీ అతనికి ఆ హైట్ లో చేయడం విపరీతంగా భయం వేస్తుంది. ఎంత ధైర్యం చెప్పినా చేయలేక పోతున్నాడు.
కింద మాములుగా ఒక నెట్ పెట్టి చేసే షాట్ కి అతుల్య కి భయం వేస్తోంది అని రెండు బలమైన వలలు కట్టారు. కింద ఏరియా మొత్తం ఒకదాని మీద ఒకటి మూడు వరుసలు పరుపులు వేశారు. అయినా అతుల్య భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ కొమ్మమీద ఎక్కి చూసినప్పుడు పక్కన పెద్ద లోయ కనబడుతుంది.
ముందుగా ఒక అసిస్టెంట్ ని ఆ తరవాత తనే పైకి ఎక్కి కిందకు దుంకాడు స్టెంట్స్ మాష్టర్. అయినా అతుల్య ఆ షాట్ చేయలేకపోతున్నాడు. సహజంగానే ముక్కోపి అయిన స్టెంట్స్ మాష్టర్ తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నాడు. ఖాళీ తను పెద్ద హీరో కొడుకుని కాబట్టి ఏమి అనట్లేదు కానీ చాలా కోపంగా ఉన్నాడన్న విషయం అతుల్యకి కూడా అర్థం అయిపోయింది. డైరెక్టర్ కి కేమరమేన్ కి సీన్ ఎలా చేయాలో చెప్పి రుసరుసగా ఆ లొకేషన్ నుండి వెళ్ళిపోయాడు స్టెంట్స్ మాష్టర్. అందరి మొహాల్లోనూ నిరుత్సాహం. సూర్యోదయం సీన్. ఈరోజు తీయడం కుదరక పోతే కేవలం ఆ షాట్ కోసం రేపటివరకు ఎదురుచూడాలి. లేబర్ వాళ్లకు డబ్బులు ఇవ్వరు. అందరూ దీనంగా పెట్టిన మొహాలు చూసి అతుల్యకు చాలా ఇబ్బందిగా చేతగాని తనంగా తనమీద తనకే అసహ్యంగా అనిపిస్తుంది. అందరూ అలా నిశ్శబ్దంగా చూస్తుండిపోయారు అతుల్య తనంతట తానే రెండుసార్లు కొమ్మ పైకి ఎక్కి ప్రయత్నం చేయబోయాడు, కానీ అతని కాళ్ళు పిక్కలు చేతులు వణికిపోతున్నాయి.
ఆ షాట్ లో అతని బలం తెగువ చూపించే సన్నివేశం.
 వెంటనే సంపత్ సరసర ఆ కొమ్మ ఈ కొమ్మ పట్టుకుని షూటింగ్ చేసే కొమ్మ పైకి ఎక్కి కూర్చున్నాడు.. సార్ రండి నేను మీకన్నా పైన ఎక్కి ఉన్నాను. మీకేం కాదు మీరు లోయవైపు చూడకండి. నన్ను చూస్తూ షాట్ చేయండి, పైకి చూస్తూ చేస్తారు కాబట్టి సీన్ బాగా వస్తుంది. ఏం భయం లేదు సార్.. నేను మీకన్నా ఎత్తులో ఉన్నాను. మీరు చాలా తక్కువ ఎత్తులో ఉన్నారు. మీకేం కాదు అందరూ ఉన్నారు అని గట్టిగా అరుస్తూ ధైర్యం చెప్పాడు.
 అప్పటి వరకూ నిచ్చెన మీద కొమ్మమీదకు ఎక్కిన అతుల్య స్వంతగా తనే చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చుండి తుళ్ళిపడినట్టు కొమ్మమీద నుండి జారీ ఒంటిచేత్తో వేలాడి బలం అంతా కూడదీసుకుని పైకి ఎక్కి మళ్లీ కొమ్మమీద కూర్చున్నాడు. ఆ నిశ్శబ్దంలో ఒకరు ఒకరు అటు చూడు అటు చూడు అనుకుంటూ అందరూ చూసారు. డైరెక్టర్ నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయి చప్పట్లతో ముంచెత్తారు.
వెంటనే కెమెరా యాంగిల్స్ సెట్ చేసుకుని సరిగ్గా సూర్యోదయం వచ్చేటప్పుడు షాట్ పూర్తి చేశారు. చెట్టు దిగగానే, డైరెక్టర్, కెమెరామేన్, అసిస్టెంట్ డైరెక్టర్లు అతుల్య చుట్టూ మూగి అభినందించారు.
 మొక్కుబడిగా అందరికీ షేక్ హాండ్ ఇచ్చి తన కార్వాన్ వైపు అడుగులు వేసాడు. అతని చూపులు సంపత్ వైపు ఉన్నాయి. కానీ సెట్టింగ్ లో వాడిన వలలు, పరుపులు సర్దే పనిలో ఉన్నాడు సంపత్.
 మరునాటి సాయంత్రం ఇచ్చిన మాట ప్రకారం సంపత్ అతుల్యకు అడవిని చూపించడానికి తీసుకువెళ్లాడు. వాటర్ ఫాల్స్ దగ్గర సంపత్ ఈత కొడుతున్నాడు.
అతుల్య గట్టున బండపైన కూర్చుని మొబైల్ కెమెరాలో ఫోటోలు తీస్తున్నాడు.
"అవును సంపత్ ఎన్నిరోజుల నుండి సినిమాల్లో చేస్తున్నావు. కమలాకర్ గారు ఎలా తెలుసు నీకు?"
"రెండేళ్లు పైనే అయ్యుంటుంది సార్. అందరూ బాగా రీస్కు ఉంటుందేమో అనే షాట్లు చేయడం మస్తిష్టం సార్ నాకూ. కానీ ఒకమాట చెప్పనా సార్.. నాతో ఏ హీరో కూడా ఇట్ల మాట్లాడలేదు సార్, అసలు ఏ సార్ తో మాట్లాడే అవకాశమే రాలేదు. ఏ సార్ ఎందుకు, మా కమలాకర్ సార్ యే దగ్గరకు పిలిచి మాట్లాడడు. సార్ మంచోడే కానీ కోపిష్టి.
 ఒకరోజు రోడ్డు మీద దొమ్మరి ఆట ఆడుతుంటే ఆ ఏరియాలో ఉండే పోరళ్ళు సెల్ ఫోన్లో వీడియో తీసారట సార్, ఇంటర్నెట్లో పెడితే షానా మంది చూసింరట. ఎవరో పెద్దసార్ నా గురించి చెప్పి నన్ను ఈ కమలాకర్ సార్ దగ్గర పెట్టాడు. షూటింగ్ ఉన్నప్పుడు మూడు పూటలా తిండి పెడతారు. ఒక సినిమా అయ్యేవరకు 15, 20 వేలు వస్తాయి సార్. డబ్బుకు ఏం లోటు లేదు ఇప్పుడు అమ్మని బస్తీలో రెండు గదులు, బాత్రూం ఉన్న ఇంట్లో అద్దెకు ఉంచాను. మాకేం డోకాలేదు ఇప్పుడు ఆ దేవుని దయ మీలాంటి వాళ్ళ దయ వలన"
ఇంత కష్టాలల్లో ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నాడు. అసలు నేను కష్టంగా అనుకుంటున్నానా.. లేదా అసలు అతని కష్టాలే కాదా.? ఆలోచనలో మునిగిపోయాడు.
గొంతులో మాట రావట్లేదు.. నిదానంగా తేరుకుని.. "అవును సంపత్ దొమ్మరోళ్ల ఆట అంటే ఏంటి?"
అదా సార్. సర్కస్ చేస్తారు చూడండి అలాంటిదే. రేపు షూటింగ్ అయిపోయాక చూపిస్తాను.
" మీ నాన్న ఏం చేస్తారు"
"మా నాన్న చిన్నప్పుడు చనిపోయాడు సార్, అమ్మ బస్తీలో బట్టలు కుట్టి నన్ను పెద్దవాణ్ణి చేసింది. అమ్మకు నేను నాకు అమ్మ అంతే సార్ మాకెవరూ లేరు."
"నీకైనా అమ్మ ఉంది అదృష్టవంతునివి"
"ఏం సార్ నాకర్థం కాలేదు"
"ఏం లేదులే. సరే గాని సంపత్ నాకు స్విమ్మింగ్ నేర్పిస్తావా"
"నేర్పిస్తాను కానీ ఇప్పుడు కాదు సార్, ఇంకో నాలుగు రోజులైతే సినిమా అయిపోతుంది, ఆ తరవాత నేర్పిస్తాను. మళ్లీ ఏ జలుబో చేసిందంటే కష్టం అవుతుంది సార్"
"నువ్వెంత వరకూ చదువుకున్నావ్"
"అబ్బో అదెందుకు అడుగుతావు సార్ -
 
 
 మేం ఊరూరా తిరుగుతూ గారడీలు చేసి డబ్బులు అడుక్కుని పొట్టపోసుకునే తెగకు చెందినవాళ్ళం. మా అమ్మా నాన్నలతో పాటు వాళ్ళు సమూహంగా ఉండే గుడిసెలలోని నలుగురి పిల్లలతో ఎప్పుడూ దొమ్మరి ఆట పెడుతుంటాం.
 తాడుపైన సైకిల్ రీమ్ పైకి ఎక్కి నడపడం, గాల్లో గిరికీలు తిరుగుతూ ముందుకి వెనకకు పల్టీలు కొట్టడం, 20 ఫీట్ల ఒంటి స్థంభం పైకి ఎక్కి కాలి బొటన వేలుని ఆ చివర ఆనించి తలక్రిందులుగా వేలాడటం, ఆ స్థంభంపైన ఫీట్స్ చేయడం అక్కడినుండి ఎలాంటి నేలపైన అయినా దెబ్బలు తాకించుకోకుండా కిందకి దుంకడం లాంటి ఎన్నో నైపుణ్యాలను మా నాన్న నుండి నేర్చుకున్నాను.
 మేం ఎప్పుడు గారడి ప్రదర్శన చేసినా నేను చేసే ఫీట్స్, జనాలు అబ్బురపడిపోయి బాగా చిల్లర డబ్బులు వేసేవాళ్ళు.
గ్రామాల్లో పంటలు వచ్చినప్పుడు, పండగలప్పుడు, వేసవి సెలవుల్లో ప్రదర్శనలు ఎక్కువగా ఉండేవి. మా అమ్మ పెట్టే నస భరించలేక నాల్గవ తరగతి దాకా బడికి పోయేవాణ్ణి కానీ మనకు పెద్దగా సదువు మీద ఇంట్రెస్ట్ లేదు సార్.
 చిన్నప్పటి నుంచీ స్టంట్స్ నేర్చుకోవడం చేయడం అంటే పిచ్చి నాకు. ఆట అయిపోయిన తెల్లారి జుట్టుకోడి కొనుక్కొచ్చేవాడు నాన్న, ఊరుమీద అడుక్కుని తెచ్చిన సన్నబియ్యం వండేది అమ్మ, సాయంత్రం సారాయి దుకాణం కాడికెళ్ళి సీకులు కొనిపెట్టేవాడు, రాత్రిషో సినిమాకి తీసుకెళ్ళేవాడు నాన్న.
 అందులో ఫైటింగ్ సీన్లు, స్టంట్లు, కొండలు ఎక్కడం, బిల్డింగ్ అంచుకి కొండ చివర్లో తాడుని పట్టుకుని పైకి లాగడం అలాంటి సీన్లు వచ్చినప్పుడు కన్నార్పకుండా చూసేవాణ్ణి. అట్లనే చేయాలి అనిపించేది.
అప్పుడప్పుడు గారడీ ప్రదర్శనలు దొమ్మరోళ్ల ఆటలు ఆడటం, మిగతా సమయాల్లో రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో పైపులు తాళ్ళు కట్టుకుని స్టెంట్స్ నేర్చుకోవడం, నాన్నతో సారాయి కొట్టులో కూర్చోవడం, పైసలు ఎక్కువ దొరికిన నాడు కోడికూర బువ్వ తినడం సినిమా చూడటం గమ్మత్తుగా అనిపించేటివి సార్ చిన్నప్పుడు."
 "నీ చిన్ననాటి జ్ఞాపకాలు భలే సరదాగా ఉన్నాయి. చీకటి పడుతుంది క్యాంపుకి వెళదామా ఇక."
"సరే సార్! పదండి".
మొత్తానికి ఆ లొకేషన్ లో షూటింగ్ అయిపోయింది. ఆ లొకేషన్లోనే కాదు మొత్తం షూటింగ్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మిగిలింది. సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకో 20 రోజులు పడుతుంది కావచ్చు.
"ఆహ్లాదకరమైన అడవి, వాటర్ ఫాల్స్, ఈ వాతావరణం మళ్లీ మళ్లీ దొరకదు. రేపు అందరం జాలీగా ఎంజాయ్ చేద్దాం" ప్రపోజ్ చేసాడు దర్శకుడు. సినిమా చాలా బాగా వచ్చిందన్న నమ్మకం కుదిరే సరికి అందరికీ మంచి పార్టీ ఇద్దామని నిర్మాత కూడా ఒప్పుకున్నాడు.
 వాటర్ ఫాల్స్ దగ్గర ఉదయం భోజనాలు ఏర్పాటు చేశారు. సహజంగా మందిలో ఉండటాన్ని ఇబ్బంది పడే అతుల్య దూరంగా పచ్చికబయళ్లు దగ్గరకు వెళ్లి సిగరెట్ వెలిగించాడు.
ఇదివరకు కాస్త మాట్లాడిన చనువుతో ధైర్యం చేసి నిదానంగా దగ్గరకు వెళ్లి "ఏంటి సార్ ఇలా వచ్చారు" అనడిగాడు సంపత్.
"రా సంపత్, ఏంటి సంగతులు. తరవాత ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు."
"నాకేం పని ఉంటుంది సార్, మళ్ళా మా కమలాకర్ సార్ ఏ ప్రాజెక్టు పట్టుకుంటే అది.. ఎక్కడికి పిలిస్తే అక్కడే నా పని.
పనుంటే మస్తు.. లేకుంటే పస్తు.. చిట్టీలు వేసి మూడు లక్షల దాకా జమ చేసాను. బస్తీలో ప్రభుత్వం జాగలకు పట్టా చేసి ఇచ్చింది. ఇంకో రెండు లక్షలు అయితే ఇల్లు కట్టుకోవచ్చు. పెళ్లి చేసుకుంటే అంతే సార్. మా అమ్మ మస్తు ఖుషి అవుతుంది."
"అయితే ఇంకో రెండు లక్షలు కావాలా నీకు"
"అయ్యో సార్, అలా అని మిమ్మల్ని అడగట్లేదు. మీకు చెప్పుకున్నానంతే"
"అయితే నేను ఇస్తే తీసుకోవా"
"అయ్యో సార్. అలా కాదు. మీరు డబ్బు కాదు పని ఇవ్వండి. చేస్తాను. నా పనితనానికి డబ్బులు ఇవ్వండి.
నాన్న బతికి ఉన్నప్పుడు మేం ఊళ్ళో అడుక్కుని బతికేవాళ్ళం. ముష్టివాళ్ళం కాకపోయినా చేయి చాపి ఆడుకున్న వాళ్ళమే.
కానీ అమ్మకు అస్సలు ఇష్టం ఉండదు అలా. ఎవ్వరూ మనస్ఫూర్తిగా ఇవ్వరు సార్.. తిట్టుకుంటూ ఇస్తారు. అందుకే నాన్న చనిపోయినప్పుడు అమ్మ ఒట్టు వేయించుకుంది. జన్మలో ఎప్పుడూ ఎవ్వరి చేత ఊరికే డబ్బులు తీసుకోవద్దు అని అట్లనే బాకీ కూడా తీసుకోవద్దు అని చెప్తది."
"సరే మరి నా దగ్గర పని చేస్తావా"
"మీ దగ్గర నేను చేసే పని ఏముంటుంది సార్. నాకు కారు డ్రైవింగ్ కూడా రాదు. అట్లనే నాకు స్టెంట్స్ చేసుడు అంటే ఇష్టం. అది మా నాన్న నేర్పించిన పని. ఆ పని చేసిన పైసలతో జీవితం గడిపితే మా నాన్న నాతోనే ఉన్నట్టుంటుంది. మా కమలాకర్ సార్ నన్ను వద్దన్న రోజు జీవితంలో ఇబ్బంది ఉన్నరోజు ఎవరినైనా అడగాలి అన్నరోజు ముందుగా మిమ్మల్నే అఫుగుతాను సార్"
"సరే సంపత్ నీ మాటలు చాలా నచ్చాయి నాకు.
 మీ అమ్మ మీద మీ నాన్న మీద నీ ప్రేమకు ఫిదా అయిపోయాను. అవును సారీ సంపత్ మీ నాన్నగారు ఎలా చనిపోయారు"
"సార్.." ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరుగంగా మౌనంగా తల వంచుకున్నాడు.
"సారీ సంపత్ పద వెళదాం" అంటూ ఇద్దరూ వచ్చేసారు.
 "మీరు పదండి సార్ నేను వస్తాను" అని అక్కడ రాయి మీద కూర్చుని సిగరెట్ వెలిగించి ఆకాశంలో చూస్తుండిపోయాడు.
 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఒక ఊళ్ళో గారడి చేయడానికి వెళ్ళి ఆ గ్రామ సర్పంచిని కలిసి దొమ్మరోళ్ల ఆట పెడతాము అని బతిలాడుకున్నారు. నాలుగు రోజులు పోయాక వాళ్ళ ఊళ్ళో పోషమ్మ బోనాలు ఉన్నాయి, ఆరోజు చేస్తే గ్రామస్థులు అందరూ ఒకచోట పోగవుతారు. వాళ్లకు వేడుకలు ఏర్పాటు చేసినట్టు ఉంటుంది, వీళ్లకూ నాలుగు కొత్తలు దొరుకుతాయి, అప్పడిదాకా ఊరవుతల గుడిసెలు వేసుకుని ఉండాలని దొర పురమాయించాడు.
 
 బోనాలనాడు ఊరందరితో కలిసి చూడటం ఇష్టం లేని పెద్దింది మహిళలు అదే మాట దొరసానితో చెప్పారు. వెంటనే అదే రాత్రి గడీల దొమ్మరాట పెట్టాలి అని దొరసాని కోరడంతో మసకచీకటి పడుతుండగ పాలేరుని పంపించి దొర కబురుచేశాడు.
సంపత్ వాళ్ళ నాన్న సంపత్ ని పట్టుకుని పరుగున వెళ్లి దొరను కలిసిండు.
"ఏం రా మీరిద్దరే అచ్చింరు, ఇద్దరే ఎగురుతే సూడాల్నారా మేము."
"బాంచెన్ దొర, ఇప్పుడేం ఆట దొర. నాలుగు రోజులు పోయినంక ఆడమంటిరి కదా."
"అవునురా అన్నాను.. అయితే ఇప్పుడు పిలిస్తే చెయ్యరారా? అమ్మగారు ముచ్చట పడుతుంది ఆడండిరా, అందరికీ బువ్వ ఏర్పాట్లు చేయిస్తా లేరా"
"ఇప్పుడు ఆడటం మాతోని కాదు, నీ బాంచెన్ దొర కాల్మొక్తం".
మరచెంబుని మొహం మీదికి ఇసిరికొట్టి పడకకుర్చీల కెళ్ళి సర్రున లేచి నిలబడి "ముండాకొడుక! నువ్ చెప్పినట్టు ఇని, నువ్ చేసినప్పుడు చూడాల్నారా.. దొరసాని అమ్మ అడిగింది అని చెప్పినంక నా గడీల అడుగుపట్టి నా ఎదురుంగ నిలబడి నాకు కాదు అని చెప్పే రుబాబు ఏందిర.?" గదమాయించాడు దొర.
"దొరా దొరా.. మీ మోచేతి నీళ్లు తాగేటోళ్లం, మీకు ఎదురుచెప్పి ఈ సుట్టుపక్కల ఊళ్ళల్ల దొమ్మరి ఆట ఆడగలమా బాంచెన్,
ఊళ్లే ఆట పెట్టుకోమన్నారు, అలాగే నాలుగు రోజుల తిరం దొరికింది అని ఫూటుగా సారా తాగి పన్నా దొర. పొల్లగాండ్లు కూడా కడుపునిండా తిని మాఘిపొద్దు గుడిసెల గువ్వ పిల్లలోలే ఒదిగి పన్నరు. ఇప్పుడు చేయలేరు దొర. రేపు పొద్దున సూరీడు మీ ఆకిలి తొక్కకముందే మేం ఆట షురువు చేత్తం.. ఒక్కరాత్రి ఒగ్గేయ్యరాదు దొర. నువ్ దేవుని లెక్క మాకు."
"ఛల్ మల్లదేమాట. ఏందిరా నీ సోది. నువ్ చెప్తే నేను ఇనాల్నారా బాడకావ్" అని ఆకాశమంత ఎత్తు లేచి ఉరిమే చూపులతో పండ్లు కొరికాడు.
ఇక ఆట పెట్టకుండా తప్పించిలుకోలేం అని మోకాళ్ళ మీదకు వంగి సంపత్ తో.. "ఇక్కడ జరిగింది చెప్పి ఉన్నదున్నట్టు అందరినీ తాళ్ళు పైపులు సామాను పట్టుకురమ్మని" చెవిలో చెప్పాడు.
పావుగంట గడిచేలోపు ఆట సరంజామా మనుషులతో గడీలకు వచ్చిండు సంపత్.
తాగిన మైకంలోనే అటూ ఇటూ సొలుగుతూ పైపులు తాళ్ళు కడుతున్నాడు సంపత్ వాళ్ళ నాన్న.
కన్నంటుకునే నిద్రలోంచి లేపుకరావడంతో మనసునపట్టనట్టు చేయబుద్ధి కాకా ఎలాగోలా మొదలుపెట్టారు మిగతావాళ్ళు కూడా..
చలిపెడుతుందని చినిగిపోయిన బొంతను నెత్తిమీద వేసుకుని తబల కొడుతుంది సంపత్ వాళ్ళ అమ్మ. అటీటుజేసీ నాలుగైదు రకాల గారడీలు చేసి అయిపోయింది అనిపించారు పిల్లలు, సంపత్.
ఆట ఆసాంతం తన వాక్చాతుర్యంతో వీక్షకులను మంత్రముగ్దులను చేసి జనాల దృష్టిని కేవలం ఆటవైపు ఆకర్షించేలా చేయడం, ఒక్కొక్క గారడీ ఆటను పరిచయం చేయడం, జానాల మొహాలు ఎలా ఉన్నాయి ఎప్పుడు పైసలు అడగాలి లాంటివి సంపత్ వాళ్ళ నాన్న చూసుకుంటాడు.
 చివరకు ముగించే ముందు మాత్రం ఒక పొడుగాటి సన్నని చువ్వతో తను ఒక స్కిట్ చేసి ఆటని ముగిస్తాడు.
పది పన్నెండు ఫీట్ల పొడవున్న ఓ మోస్తరు లావు ఉండే రాడ్డు ఒకకొనని భూమిపై ఒక దగ్గర పెట్టి, రెండవ కొన గొంతు గుటకవేసే క్రింద ఉండే సొట్టపడే ప్రాంతంలో అదిమిపట్టి రాడ్డుని బెండ్ చేసి జనాల చప్పట్లనడుమ ఆటని ముగిస్తాడు.
 
 అచ్చంగా అలాగే చేయడం కోసం రాడ్డుని వాకిట్లో ఉండే ఒక పోట్రాయికి ఆనించి గొంతు సొట్టలో పెట్టి బలంగా నొక్కాడు. రాడ్డు బెండ్ కాలేదు, ఉన్నఫలంగా బలం అంతా తీసుకుని నొక్కడం వలన దాదాపు రెండు ఫీట్లు రాడ్డు గొంతులోనుండి దిగి బయటకు వెళ్ళింది. కంఘు కంగు మని దగ్గు.. దగ్గిన ప్రతీసారి చెంబెడు చెంబెడు రక్తం కుమ్మరిస్తున్నటుగా ఎదురుగా పడుతుంది.
 ఏం జరిగిందో అని షాక్ లో నుండి తేరుకుని అతని దగ్గరకు పరిగెత్తే ఆ కొన్ని సెకన్లలోనే రక్తపుమడుగు.. చిమ్మించిపోస్తూనే ఉంది రక్తపు ధార.."
 ఎప్పుడు తండ్రిని మనసారా తలచుకున్నా కళ్ళముందు మెదులుతుంది ఆ సన్నివేశం. బాధ, నిరాశ, నిస్పృహ నిండిన హృదయంతో భారంగా అడుగులు వేస్తూ క్యాంపులో కలిసాడు సంపత్.
 
 
 
 తన తొలి చిత్రమే రికార్డుల మోతతో అందించిన గెలుపు మత్తు చివరి బొట్టుని తాగేసేందుకు స్నేహితులతో కలిసి క్యాంబెర్రా సిటీ వెళ్ళాడు అతుల్య. ఇక్కడ ఇండియాలో అతుల్య బాబు తదుపరి చిత్రం డేట్స్ కోసం దర్శకనిర్మాతలు, నిర్మాణసంస్థలు ఇంటిచుట్టూ తిరుగుతున్నారు. మొదటి సినిమాకు అన్నీ తానై దగ్గరుండి చూసుకున్న ఆనంద్ బాబు ఈసారి కథ తదితర విషయాల ఎంపికలో అతుల్యకు పూర్తి స్వేచ్చని ఇవ్వదలచాడు. స్టూడియో ఆఫీసు రూము బాల్కనీలో మేనేజర్ తో మాట్లాడుతూ సిగరెట్ వెలిగించాడు.
"సార్ రెండురోజులుగా దర్శకుడు రాం ఫోన్ చేస్తున్నాడు. ఒక్కసారి మిమ్మల్ని కలవాలంట. టైం ఇస్తారా సార్"
"రాం కు మనం టైం ఇచ్చుడు కాదు, మా గురువుగారిని ఇక్కడకు రమ్మను, రమ్మనడం కాదు, వెళ్లి దగ్గరుండి తీసుకుని రా. అలాగే ఒక ఐదుగురికి మంచి పార్టీ అరేంజ్ చెయ్.
టర్కీ కోడి, కుందేలు ఫ్రై చేపించు మా గురువుగారికి చాలా ఇష్టం, ప్రభాకర్ ని ఒక సిగరెట్ ప్యాకెట్ తెచ్చివ్వమని చెప్పి నువ్ వెళ్ళు" అన్నాడు.
 సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ఎంతగానో కలవరపరిచిన ఒక సమస్యకు ఇంత పెద్ద బహుమతి దొరికింది.
 ఆనంద్ బాబు సినిమా ఇండస్ట్రీకి మకుటం లేని మహారాజు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసాడు. బాక్సాఫీస్ సూపర్ డూపర్ హిట్టులతో ఏలాడు. హీరోగానే కాకుండా స్టూడియోలు, రియల్ ఎస్టేట్, హోటల్స్, మాల్స్, థియేటర్లు, నిర్మాతగా దర్శకుడిగా ఎన్నో విజయాలనందుకున్నాడు.
ఎప్పుడైతే అతుల్య ఫారిన్ లో చదువు అయిపోబోతుంది, తరవాత అతుల్యని తనకన్నా గొప్ప స్థాయిలో నిలబెట్టాలి అనుకున్నాడో అప్పటినుండి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
 ఇండస్ట్రీలో ఉండే సమస్యలు ఒత్తిడిలు డబ్బు పేరు హోదా మోజులో పడి వ్యక్తిగత జీవితం పట్టించుకోకపోవడంతో అతుల్య వాళ్ళ అమ్మ ఆనంద్ బాబుని వదిలేసి వెళ్ళిపోయింది.
 అమ్మ లేదు, నాన్న పట్టించుకోడు,
కొడుకుకి ఉన్న ఒంటరితనాన్ని డబ్బుతో కొనేసాడు ఆనంద్ బాబు.
కానీ ఇప్పుడు కొడుకులో సామర్ధ్యం లేకుండా ఆ డబ్బుతో కొడుకుకి హోదాను కొనిపెట్టలేదు అని తెలుసుకున్నాడు.
 అలాగే అతుల్య చదువులో చూపించిన ప్రతిభ డిగ్రీలు మహా అయితే తనకున్న బిజినెస్ లు నడపడానికి పనికి వస్తాయి కానీ తన హోదాని పరువుని ముఖ్యంగా ఇండస్ట్రీలో తనకు ఉన్న ఇమేజ్ ని నిలబెట్టడానికి ఎందుకూ పనికిరాదని ఆనంద్ కి బాగా తెలుసు.
 అత్యంత సన్నిహితులను, విశ్లేషకులను, కార్పొరేట్ గురూస్ ని సంప్రదించిన తరువాత ఎలాగైనా తన కొడుకుని హీరోగానే ఇదే ఇండస్ట్రీలో నిలబెట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అలాగైతేనే తన హోదాతో పాటు ఇండస్ట్రీలో తన ఇమేజ్ తన పరువు నిలబడుతుంది అని గట్టి నమ్మకం.
ఆ ప్రయత్నంలోనే తన మాట మీద తన కొడుకు సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాడని తెలిసినా తనకి ఏమాత్రం నటన రాదు, డ్యాన్స్ రాదు అనేది కచ్చితంగా తెలుసు. అదే విషయమై తన ఆప్త మిత్రుడు సినీ గురువు దర్శక దిగ్గజం బలరామ గారిని సంప్రదించాడు. నటన డాన్స్ తో పని లేకుండా సరైన కథ, మంచి దర్శకుడు, టాలెంటెడ్ టీమ్ ని తీసుకున్నప్పుడు అతుల్యని యాక్షన్ హీరోగా నిలబెట్టవచ్చును అని చెప్పాడు. మాటలు చెప్పడమే కాకుండా, తగ్గట్టుగా తన అనుభవాన్ని పరిచయాలను వాడి మంచి టీమ్ ని జతచేసి సినిమాని పట్టాలకెక్కించాడు. ఈ గొప్ప విజయాన్ని సొంతం చేశాడు.
 అందుకే గురువుగారితో ఈ సంతోషాన్ని పంచుకోవడంతో పాటూ తన కొడుకికి ఇండస్ట్రీలో శాశ్వత దిశా నిర్దేశం చేయించాలి అని ప్లాన్ చేసాడు.
ఆహ్లాదకరమైన రూఫ్ గార్డెన్లో కూర్చుని మాటలు మొదలుపెట్టారు.
గురువుగారి పక్కన కూర్చుని "చూసారా బాబాయ్, అతుల్య గాడు ఇరగదీసాడు. నా ఇమేజ్ ని ఈ ఇండస్ట్రీలో కాపాడే మగాడు మళ్లీ నాకొడుకే" గర్వంతో ఊగిపోయాడు.
అవున్రా చూసాను. బాగా వచ్చింది సినిమా.
"బాబాయ్!! వాడు, ఆ డైరెక్టర్ రాం గాడు నా కొడుకుని ఇంట్రడ్యూస్ చెయ్ ఎన్ని పైసలు అయినా ఖర్చుకు వెనుకాడను అంటే ఏమన్నాడు బాబాయ్.. అతుల్య సినిమా ఇండస్ట్రీకి పనికిరాడు అన్నాడు కదా, ఇప్పుడు చూడు రెండు రోజుల నుండి ఫోన్ చేస్తున్నాడు. నేను జవాబు ఇవ్వట్లేదు అనుకోండి అది వేరే సంగతి."
"వాడి సంగతి వదిలేయ్ గానీ, ఒక్క సినిమాకే ఇంత గోడవేంటి ఆనంద్ బాబు. మనం ఉన్న శక్తిని అంతా కూడబలుక్కుని కిందా మీదా పడి ఒక్క సినిమా తీయడానికి వెంపర్లాడట్లేదు. మన ఉనికి ఇది, మన బిజినెస్ ఇది, మనం ఏలాల్సిన రాజ్యం ఇది.
నడమంత్రపు సిరి నరం మీద పుండు మనిషిని ఒక్కచోట ఉండనివ్వవన్నట్టు ఒక్కసారిగ వచ్చిన స్టార్ డం గురించి అతి చేయవద్దు. నీకు చెప్పేదేముంది, అయినా మనం ఇండస్ట్రీలో ఎందరిని చూడలేదు, రాత్రికిరాత్రి స్టార్ అయిన వాళ్ళు మరో రాత్రికిరాత్రే బిచానా ఎత్తేసిన వాళ్ళు. అందుచేత ఇంకో మూడు నాలుగు ప్రాజెక్టుల వరకు కథా రచయిత, దర్శకుడు, కెమరామేన్, ముఖ్యంగా స్టెంట్స్ మాస్టర్ ని మార్చకు లేదా దగ్గరుండి చూసుకో. నాతో ఫ్రీగా ఉన్నప్పుడు చర్చించు, అంతేగానీ ఒంటెద్దు పోకడకు పోతే ఈరోజున మన అతుల్య గాడికి వచ్చిన పేరే కాదు, నువ్ ఇన్నిరోజుల సంపాదించుకున్న ఇమేజ్ కూడా సంకనాకిపోతుంది!"
"సరే బాబాయ్ ఒక్కనిమిషం.."
 "అరేయ్ ప్రభాకర్ బాబాయ్ కి కుందేలు ఫ్రై వడ్డించు, అలాగే వెళ్లి రెండు చల్లటి నీళ్ళ బాటిల్స్ పట్టుకుని రా.."
"హా.. బాబాయ్, అయితే అదే టీమ్ తో ఇంకో నాలుగు ప్రాజెక్ట్స్ ప్లాన్ చేయాలా?"
"ఇదే ఆనంద్, ఈ తొందర పాటే వద్దనేది, ఇప్పుడు మనోడు యాక్షన్ ప్రాజెక్టు హిట్ కొట్టగానే, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలందరూ యాక్షన్ సినిమాలే ప్లాన్ చేస్తారు, బుడ్డ కామెడీ హీరోలు పేరడీ సినిమాలు ప్లాన్ చేస్తారు.
చూడూ..! మన వాడి బలం ఎత్తు, దానికి తగ్గ బరువు, ఆకట్టుకునే దేహం. అంతే వాడికి డ్యాన్స్ రాదు. ఇప్పుడు నేర్పించి ప్రయోజనం లేదు. నటన కూడా రాదు. అది నేర్పించినా ఇంకో నాలుగయిదు సంవత్సరాలు పడుతుంది. అంచేత.
కెమెరా ఎప్పుడూ వాడి మొహం మీద ఉండకూడదు, షోల్డర్ బ్యాక్ యాంగిల్, సైడ్ యాంగిల్స్ ఉండాలి, ఫోకస్ ఎక్కువ వాడి బాడీ మీదనే ఉండాలి, ఎక్కువ శాతం సినిమాలో బనీన్స్, టీషర్ట్స్ లో కనిపించాలి. కథలో ఎమోషనల్ సీన్స్ ఉండకూడదు. ఆ జుట్టు ఎప్పుడూ ఇప్పుడున్నంతే ఉండేలా చూసుకోమను, చిన్నగా ఉండే హేయిర్ స్టైల్ వలన మొహంలో నటన స్పష్టంగా కనబడుతుంది. డూపుని పెట్టి తీసే యాక్షన్ సీన్లకు ఇబ్బంది.
కెమెరా మేకప్ డ్రెస్సింగ్ డైలాగ్స్ ముఖ్యం. సిక్స్ ప్యాక్స్ మార్షల్ ఆర్ట్స్ వాడి బలం.
ఎమోషనల్ సీన్స్ అస్సలు ఉండకూడదు. మొన్నటి టీమ్ లో ఎవరిని మార్చినా ఈ సూత్రాలు పాటిస్తే చాలు. వాడి స్టంట్స్ మాస్టర్ ని అస్సలు మార్చకు. అలాగే ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్లలో తేలిపోయింది. ప్రేక్షకుణ్ణి కట్టి పడేసేలా ఉండాలి లేదా మనవాడి నటనను గమనిస్తాడు. వాణ్ణి అర్జెంటుగా మార్చేయండి. హిందీలో మొన్నేదో హర్రర్ సినిమాలో కొత్తగా ఓ కుర్రాడు చేసాడయ్యా. వాడి పేరు..
హ్మ్.. నా మేనేజర్ ని అడిగి చెప్తాలే. వాడితో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పెట్టుకో. నాలుగు పాటలుండలి, అందులో రెండు క్లబ్ సాంగ్స్, అవి విడిగా మన లోకల్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకో. పోస్టర్ మీద వీళ్ళ పెరు ఉండటం అసెట్.
ఇలా ఇవన్నీ చూసుకో బాబు. అతుల్య గాడికి ఏదీ వదిలేయకు, వాడికి ఇదేం తెలియదు.
వచ్చే సినిమా లాంఛింగ్ పోస్టర్ రిలీజ్ ఇలా ఏదో ఒక ఫంక్షన్ కి నన్ను పిలువు. అతుల్య ఏంట్రా మన తెలుగు సినిమా హీరోకి అలా సెట్ అవ్వదు. ఏదైనా ట్రెండీగా రెండు అక్షరాల పేరు పక్కన స్టార్ అని పెడదాం.
అరేయ్ ప్రభాకర్ ఇదంతా తీసేయ్ రా.
ఆనంద్ ఇక చాలు.,
మొన్నామధ్య అన్నమయ్య కీర్తనలు ప్లూట్లో వాయించిన CD పెట్టావు చూడు, అది పెట్టు కాసేపు."
అని కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టి, కళ్ళమీద రుమాలు వేసుకుని అలా ఒరిగాడు.
 
 పదిహేను రోజుల తరువాత కొత్త ప్రాజెక్టు మొదలైంది. ఆనంద్ బాబు, బలరాం గారు చెప్పిన మాటలు తూ.చ. తప్పకుండా పాటించాడు. మొదటి సినిమాలో యాక్షన్ సన్నివేశాల షూటింగ్ అప్పుడు ఇబ్బంది పడ్డాడని కమలాకర్ వెళ్లిపోవడం అతుల్యకి నచ్చలేదు. సెంటిమెంట్ గా కమలాకర్ ని మార్చలేడు. కానీ అతనితో సఖ్యత పొసగలేదు. అందునా సంపత్ అతుల్య బాబుతో సన్నిహితంగా ఉండటం చూసి, పూర్తిగా డూపుగా సంపత్ ని నియమించాడు కమలాకర్. దాంతో అతుల్య బాబు, సంపత్ ల మధ్యన సాన్నిహిత్యం మరింత పెరిగింది.
రెండవ సినిమా మూడవ సినిమా ఒకదాన్ని మించి మరొకటి బంపర్ హిట్స్ అయ్యాయి.
 
 స్నేహితులతో ఆస్ట్రేలియా టూర్ వెళ్లి ప్రతీ సినిమా సక్సెస్ ని ఆస్వాదించడం పరిపాటి.
చిన్నప్పటి నుండీ అతుల్య ఎలాంటి వాడు, చదువుల్లో ఆటల్లో ఎలా ఉండేవాడో దగ్గర నుండి చూసిన అత్యంత సన్నిహిత మిత్రులు అతుల్యలో ఆ మార్పుని ఆ స్టార్ డం ని ఊహించలేకపోయారు.
"Great అతుల్య. కల్లో కూడా ఊహించని మలుపు.. గొప్ప సక్సెస్".
"అవునురా where is that soft boy Athulya, where is he now. He is mass action hero, amazing isn't it?"
"All credit goes to his father and stunts master Kamalakar sir".
"No raa.
మీరందరూ అనుకుంటున్నట్టు ఈ సక్సెస్ కమలాకర్ సర్ దో మా నాన్నగారిదో లేదా మరెవరిదో కాదు. ఇది డూప్ బాయ్ సంపత్ ది".
"What nonsense?, Production Boy is behind your success. No way??"
"Yes, మీరు ఊహించరు, నమ్మరు, ఎవరికీ తెలియదు. కానీ నేనేమి నటనాకౌశల్యంతో ప్రేక్షకుల మెప్పు పొందలేదు. యాక్షన్ హీరోగా మాస్ ప్రేక్షకులకు దగ్గర అయ్యాను.
నేను చేసే ప్రతీ యాక్షన్ సీన్ డూపుని పెట్టుకుని చేసిందే. నేను చేసిన ప్రతీ సీన్ కి డూప్ గా చేసింది ఆ సంపత్ గాడే. వాడే నేను చేయలేను అని నిరుత్సాహ పడిన ప్రతీసారి, నేను భయంతో చేయలేను అని మొండికేసిన ప్రతీసారి నన్ను ఒప్పించి, అంతకన్నా రీస్కు తను తీసుకుని, చేసి చూపించి, నాలో భయం పోగొట్టి, నాలో ధైర్యం, ఉత్సాహం నింపి నాతో సినిమా షాట్ కంప్లీట్ చేపించే వాడు.
షూటింగ్ మధ్య సమయాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి నాలో ఆత్మస్థైర్యం నింపేవాడు.
ప్రేక్షకులు స్టెంట్స్ నచ్చి ఈలలు కొడుతున్నారు.. పేపర్లు వేస్తున్నారు అంటే అదంతా వాడి గొప్పదనం. స్టెంట్ మాస్టర్ సీన్ చెప్పి చేపిస్తాడు అది వేరు కానీ నాలాంటి మృదు స్వభావి భయస్థుడు మాస్ హీరోగా ఎదగడం, యాక్షన్ హీరోగా నిలదొక్కుకోవడం వెనుక కచ్చితంగా సంపత్ చేసిన కృషి ఎంతైనా ఉన్నది".
"నాకు మా నాన్న కొండంత అండ ఉండటం మా నాన్న ఆల్రెడీ ఇండస్ట్రీలో తిరుగులేని సూపర్ స్టార్ అవ్వడం వలన నేను హీరో అవ్వగలిగాను. వాడు స్లమ్ లో పుట్టడం, వాళ్ల నాన్న చిన్నతనంలోనే చనిపోవడం, జీవితం అంతా పేదరికంలో మగ్గడం వలన వాడు బాయ్ గా మిగిలిపోయాడు. గమ్మతైన విషయం ఏంటంటే వాడు మొసంతో ఆశతో డబ్బులు సంపాదించే రకం కాదు. నేను ఎన్నిసార్లు ఆర్ధిక సహాయం చేయాలని చూసినా తిరస్కరించేవాడు. ఎప్పుడైనా హోటల్లో ఖరీదైన భోజనం తప్ప నాదగ్గర నుండి వాడు ఏదీ తీసుకోలేదు. నాకు ఇంత చేశాడని వాడు ఒప్పుకోడు. కేవలం డూప్ బాయ్ గా వాడి పని వాడు చేస్తున్నాడు అంటాడు.
నిజానికి నేను అనుభవిస్తున్న ఈ ఇమేజ్ కి డూప్ వాడు, వాడి అదృష్టానికి నైపుణ్యానికి వేసుకున్న ముసుగు నేను.
వాడు అసలైన స్టార్" అని మనసులో మదనపడుతున్న బాధనంతా స్నేహితుల ముందు వెళ్లగక్కేసాడు. పార్టీ మత్తులో మునిగిపోయాడు.
 
 టాలీవుడ్, నేషనల్ డిస్ట్రిబ్యూషన్, ఓవర్సీస్, శాటిలైట్ రైట్స్ అన్నింటిలో రికార్డుల మోత.
ఒక సినిమాని మించిన యాక్షన్ సీన్స్ మరొక సినిమాలో. అతుల్యతో స్నేహం, ఆనంద్ బాబు మెచ్చుకోవడం, పలువురిలో గుర్తింపు రావడంతో మరింత ప్రమాదకర సన్నివేశాలు, ఒళ్ళు గగుర్పొడిచే పోరాటాలు రచించడం, డూపుగా చేయడం చేసేవాడు సంపత్.
ప్రతీ సినిమా యాక్షన్ థ్రిల్లర్ సినిమానే అయినప్పటికీ లొకేషన్స్ కానీ స్టెంట్స్ కానీ ప్రతీది ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతూ ప్రేక్షకులు మూస ధోరణి అనుకోకుండా ఉండేందుకు టీమ్ మొత్తం చాలా కష్టపడేది.
అందులో భాగంగా తరువాతి సినిమా క్లైమాక్స్
పోరాట సన్నివేశాలు నేపాల్లోని అన్నపూర్ణ పర్వతం శిఖరం దగ్గర ప్లాన్ చేశారు. సంపత్ శిఖరం అంచుతో రిహార్సల్స్ చేస్తున్న సమయంలో పట్టు తప్పి లోయలో పడిపోయాడు.
 
 
 
 ఛిద్రమైన అవయవాలను ఒక తాడు దగ్గర పెట్టి రూపురేఖలు కనబడేటట్లు కుట్లు వేసి కట్లు కట్టి మొత్తం శరీరం బ్యాండేజ్ లతో నింపేసి శవపేటికలో పెట్టి ఇంటికి పంపించారు.
అప్పటికే సంపత్ వాళ్ళు ఉండే ఆడకట్టు పోరళ్ళు వార్తని వాళ్ళ అమ్మ చెవిలో వేశారు.
చెవులకు వినబడ్డా మనసుకి చేరలేదు. మనకు నచ్చనివి అన్నీ అబద్ధాలు అయితే ఎంత బాగుండు. తన ఆశ తన శ్వాస తన ఊపిరి తన నమ్మకం తన కొడుకే. తన బ్రతుకే తన కొడుకు. అలాంటి కొడుకే చనిపోయాడు అనే నిజాన్ని ఆ తల్లి ఎలా తీసుకుంటుంది, ఎలా ఒప్పుకుంటుంది, ఎలా భరిస్తుంది. పిడుగులాంటి వార్త రెండోసారి చెవిన పడ్డాక నమ్మలేని మాటలు మనసు ఓర్వలేని నిజాలు విని అయోమయ స్థితిలో కుప్పకూలిపోయింది. వార్త చెప్పిన వాడే కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మొహం మీద నీళ్లు చల్లి కొన్ని నీళ్లు గొంతులో పోశి దగ్గరికి అలుముకుంది పక్కింటి ఆవిడ.
"చెట్టంత కొడుకు, ఏళ్ళు నిండిన కొడుకుని పొగుట్టుకుని ఎట్టా బతుకుతావే వదినా" అంటూ రాగం తీసింది.
 "ఆళ్ల మోకాలు ఎట్లుంటాయో తెలియకుండానే అమ్మానాయిన్నలను పోగొట్టుకున్నాను, కూలో నాలో చేసి బతుకుదాం కొడుకుని ఒక దారిలో పెడదాం అనుకున్న సమయంలో అర్దాంతరంగా మొగుడు కండ్లు మూశిండు, సదువు రాంకపోయినా తెలివితేటలతో ఏదో కట్టం జేసుకుంటా నాలుగు పైసలు సంపాదించుకుంట ఆడి కాళ్ళమీద ఆడు బతుకుతుండు అనుకుంటే ఇప్పుడు ఆ దేవుని గుళ్ళే మన్నువడ్డది. నా కొడుకుని ఎత్తుకపోయిండే.. దేవుడా నీకెట్ల నాయం అయితది రా.." అని బోరున ఏడుపునందుకున్నది.
 వీధి వీధంతా వీరి గావు కేకలతో దద్దరిల్లి పోయింది. వార్త తెలిసి కొందరు, వీళ్ళ ఏడుపులు విని కొందరు మొత్తం వాకిలి నిండిపోయింది. మంచికుర్రాడు, తనపనేదో తను చేసుకుని వెళ్ళేవాడు, పెళ్లీడుకొచ్చిన యువకుడు చనిపోయాడు అని తెలుసుకున్న వీధిలోని వారంతా దుఃఖంలో మునిపోయారు.
అంబులెన్స్ రానే వచ్చింది. శవపేటిక దించి వాకిట్లో పెట్టి వెళ్లిపోయారు.
 పెట్టెను చూసి కీకలు పెడుతూ ఏడుస్తున్న ఆతల్లిని ఓదార్చడం ఎవ్వరి తరం కావట్లేదు. అరుపులు కేకలు ఏడుపులు విషన్న వదనాలతో అక్కడి వాతావరణం వల్లకాడుని తలపిస్తుంది. ఒకరిని పట్టక ఒకరు ఏడుపునందుకుంటున్నారు.
"ఈ బతుకు అద్దు, ఊరూరా తిరుగుడు, ఏసాలేసుడు అద్దు.. ఇంకేదైన పని చేసుకుని బతుకుదాం.. అంటే నీ అయ్య ఇనకపాయే, నడమంత్రంలో కాలం జేసే. కూలి పని కాకపోతే నాలుగిండ్లల్లా పాచి పని చేసైనా నిన్ను ఎల్లకాలం సాదుతారా కొడుకా అని నెత్తీనోరు మొత్తుకున్నా ఇనకపోతివి. మీ అయ్య లెక్కనే ఎగురుడు దుంకుడు అంటివి నన్ను ఎటుగాని దాన్ని జేసీ దేవుని దగ్గరకు పోతివి. నాకు ఇగ దిక్కేది, నాకు బతికే ఆశేది " అనే ఆమె ఆర్తనాదాలు మిన్నంటాయి.
జరగండి జరగండి తప్పుకోండి తప్పుకోండి మాటల మధ్యన అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. నలుగురు బౌన్సర్ల మధ్యన విచార వదనంతో అయోమయం ఆ ఇంటివైపు వస్తున్నాడు అతుల్య. ఇంటి అరుగంచున పందిరి గుంజకు ఒరిగి నిలబడ్డ సంపతి దోస్తు నిదానంగా అడుగులు వేసి వంగి " అత్తా ఆ వచ్చేటాయనే అతుల్య బాబు, హీరో.. మన సంపత్ గాడు ఆయన సినిమాల్లోనే చేసేటోడు" అని గుసుగుస చెప్పాడు.
 దుఃఖం, ఆవేశం ఆక్రోశంగా మారింది, ఆ తల్లి ఒక్కసారిగా లేచి, కొంగు అంచుతో కన్నీళ్లు మొహం తుడుచుకుని, తలవెంట్రుకలు శిఖముడుస్తూ ధనధన నాలుగు అడుగులు ఎదురెళ్లి శవపేటిక దగ్గరే అతుల్యని గల్లా పట్టుకుంది.
"చూడరా వాణ్ణి, అందరూ బాగానే ఉన్నారు, నా సంపత్ గాడే పోయిండు, నా కొడుకు నన్ను అన్యాయం చేసి పోయిండు, నా కొడుక్కి నాకు ఎన్నటికీ జమ చేయలేని అన్యాయం జరిగింది. అన్యాయం జరిగింది" గట్టి గట్టిగా అరుస్తూ అతుల్య మీద పడి ఏడుస్తుంది.
 ఒక బౌన్సర్ నిదానంగా ఆమె చేయి పట్టి పక్కకు జరిపేప్రయత్నం చేయబోయాడు. ఆమెను తాకవద్దు అని కనుసైగలతో వారించాడు. మదినిండా దుఃఖం ఉప్పొంగుతుండగా ఎగిసిపడి వస్తున్న కన్నీళ్లను మాటలకు అడ్డం కానివ్వకుండా అదిమిపట్టి..
"వచ్చానురా సంపత్, మీ ఇంటికి వచ్చానురా, అమ్మను చూసానురా.. మీ ఇంటికి నిజంగా వచ్చానురా.. ఎన్నిసార్లు అడిగావురా.. మా ఇంటికి రావాలి సార్, మా అమ్మని కలవాలి సార్ అని.. వచ్చాను చూడరా అని భోరున ఏడుపునందుకుని పెట్టెమీద ఒక చేయి వేసి ఒక చేత్తో ఆ తల్లి కాళ్ళను పట్టుకుని ఆమె పాదాలపై తల ఆనించాడు.
బోరున విలపిస్తున్న ఆ తల్లి నిశ్చేష్టురాలయ్యింది. అతుల్యని లేపలేదు. తనే అక్కడే కుప్పకూలింది.
"అమ్మా.. అమ్మా.. ఎప్పుడూ చెప్పేవాడమ్మా.. ఎప్పుడూ మీ గురించే చెప్పేవాడమ్మా.. వాడి లోకం అంతా మీ చుట్టూనే అమ్మ. అమ్మని బాగా చూసుకోవాలి, నాన్న లేడు,
ఈ సమాజం మమ్మల్ని మనుషులుగా గుర్తించలేదు సార్, పెద్ద ఇల్లు కట్టాలి, జీవితంలో గౌరవంగా స్థిరపడాలి అని ఎప్పుడూ నాతో చెప్తుండేవాడమ్మా..
 
 అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది, తల్లీ-కొడుకుల మధ్య ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి.
అమ్మానాన్న పిల్లలు కుటుంబం ఆప్యాయతలు ఎలా ఉంటాయి అనేది నాకు తన ద్వారానే తెలిశాయి అమ్మా.
నీ కొడుకుని చంపిన దోషిగా నన్ను ఒక మనిషిగా కూడా గుర్తుంచవు కావచ్చు అమ్మా,
కానీ నా తుది శ్వాస ఉన్నంత వరకూ నేను నా మనసులో నిన్ను తల్లిగా గౌరవిస్తూనే ఉంటాను అమ్మా..
నా చిన్నతనంలోనే నా తల్లి చనిపోయింది. నాకు అమ్మ ఎలా ఉంటుందో, ఆ ప్రేమ, ఆ స్పర్శ ఆ బంధం ఏదీ తెలియదు. అనుబంధాలు అనురాగలు ఇవేవీ తెలియకుండానే పెరిగాను. సంపత్ నా దగ్గర పనిచేసే వ్యక్తి కాదు, నా ఆత్మీయ మిత్రుడు, దేవుడిచ్చిన సోదరుడు అనుకున్నాను అమ్మా.."
అంటూ మాటలు రాక ఆవేదనను చెప్పలేక తన సోల్ మేట్ ని కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగలేక వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ తల్లి పదాల దగ్గర నేలపై తన తలను బాదుకుంటున్నాడు. గుండెలను బాదుకుంటూ ఆవేదనని వెళ్లగక్కుతున్నాడు.
"ఏడవకు నాన్న!, వాడికి అలా రాసిపెట్టి ఉంది,
అంతే తెచ్చుకున్నాడు ఆ భగవంతుని దగ్గర నుండి ఏడవకు" అని దగ్గరకు తీసుకుంది ఆ తల్లి.
భుజంపై చేయివేసి నిదానంగా అతుల్యని పిలిచాడు సెక్యూరిటీ గార్డు.
కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి వెనక్కి తిరిగి చూసే సరికి వార్త పత్రికా, టీవీ ఛానెల్స్ ప్రతినిధులు ఉన్నారు.
"దయచేసి ఇక్కడ వాతావరణం డిస్టర్బ్ చేయకండి. నేను రేపు మీతో ప్రెస్ మీట్ లో మాట్లాడతాను. ఒక్కటి మాత్రం చెప్తాను
చనిపోయింది ఒక స్టెంట్ బాయ్ కాదు.
నేను మీ అందరికి స్టార్ ని. కానీ నా సూపర్ స్టార్ మాత్రం సంపత్.
నేను అతని 'అభిమాని'ని" అని ముగించాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
#3
కథ చాల బాగుంది  yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)