09-10-2019, 07:47 PM
యజ్ఞ వరాహ మూర్తి:
ఇప్పుడు అందులో ఒకడయిన హిరణ్యాక్షుడు, పశ్చిమ సముద్రం అడుగున ఉన్న వరుణుడిని యుద్ధమునకు రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయమునకే యజ్ఞవరాహ మూర్తి జన్మించాడు. ఆయన అవతారం వచ్చింది. వరుణుడు అన్నాడు – ‘సముద్ర జలముల మీదకు ఒక కొత్త భూతం వచ్చింది. నీవు దానితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా యజ్ఞవరాహ మూర్తిని ఎక్కడయినాఏదయినా ఫోటో చూసినప్పుడు, ఒక పంది స్వరూపమును వేసి దాని మూపు మీద రెండుకోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగా వేస్తారు. కానీ పరమాత్మ అలా ఉండడు. యజ్ఞవరాహ మూర్తి అంటే ఎవరో తెలుసా! యజ్ఞవరాహ మూర్తి వర్ణన విన్నా ఆవిర్భావమును గూర్చి విన్నా, చదివినా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమయిపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపముతో ఆయన దర్శనం ఇచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. ఆయన గుర్ గుర్ అని శబ్దం చేస్తున్నాడు. వ్యాసులవారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞ వరాహం. ఇప్పుడు ఆయనను స్తోత్రం చేయాలి. అందుకని ఋషులందరూ నిలబడి ఋగ్వేదములోంచి, యజుర్వేదము లోంచి, సామవేదంలోంచి సూక్తములను వల్లిస్తూ ఆ యజ్ఞవరాహమునకు నమస్కారం చేస్తున్నారు.
అపుడు యజ్ఞవరాహం అడుగులు తీస్తూ అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించి తన నాసికతోటి మూపుతోటి సముద్ర అడుగు భాగమును కెలకడం ప్రారంభించింది. ముఖం అంతా నీటితో నిండిపోతోంది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి తన ముఖమును పైకెత్తి కనురెప్పలను ఒకసారి చిట్లించి మెడను అటూ ఇటూ విసురుతోంది.
అలా విసిరినప్పుడు దాని జూలులోంచి నీళ్ళు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయన నుండి పడిన నీటికోసమని దానిక్రింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవ్వాళ యజ్ఞవరాహంగా వచ్చారు. ఆ నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి వెతికి భూమిని పట్టుకుని దానిని మూపు మీదకు ఎత్తుకుని రెండు దంష్ట్రల మధ్య ఇరికించి, పైకి ఎట్టి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.
యజ్ఞవరాహమూర్తియై వచ్చి భూమండలమును పైకెత్తాడు. అపుడు స్వామి అది నీటిలో నిలబడడానికి దానికి ఆధార శక్తిని ఇచ్చాడు. ఆ ఆధార శక్తిని ఇచ్చి మూపురమును పైకెత్తి నిలబడ్డాడు. ఇలా గోళ రూపంలో ఉన్న భూమండలమును పైకెత్తేసరికి భూదేవి పొంగిపోయి గాఢంగా ఆలింగనం చేసుకుంది. తత్ఫలితమే నరకాసుర జననము. ఈ దృశ్యాన్ని చూసిన ఋషులు పరమాత్మను అనేక విధములుగా స్తోత్రం చేశారు.
అపుడు స్వామి వారందరికీ అభయం ఇస్తున్న సమయంలో హిరణ్యాక్షుడు యుద్ధమునకు వచ్చాడు. ఇద్దరి మధ్య భయంకరమయిన యుద్ధం జరిగింది. ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గదా ప్రహారమునకు స్వామి చేతిలో గద జారి క్రింద పడిపోయింది. అపుడు వాడు ‘నేను ఆయుధం లేని వాడితో యుద్ధం చేయను’ అన్నాడు. అతని ధర్మమునకు స్వామి ఆశ్చర్యపోయారు. వెంటనే స్వామి సుదర్శన చక్రమును స్మరించారు. అపుడు చతుర్ముఖ బ్రహ్మ గారు ‘స్వామీ, నీ వినోదం చాలు, మాకు భయం వేస్తోంది. వాడు నిన్ను అలా గదతో కొడుతుంటే మేము చూడలేక పోతున్నాము. వాడిని సంహరించి ఉద్ధరించు. వాడికి ఒక శాపము విమోచనం అయిపోతుంది’ అన్నారు. అపుడు స్వామి సుదర్శన చక్రమును ప్రయోగిస్తే వాడు ఒక పెద్ద గదను ప్రయోగించాడు.
ఆ గదను స్వామి అలవోకగా పట్టుకుని విరిచి అవతల పారేశారు. పిమ్మట ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుడి గూబమీద ఒక లెంపకాయ కొట్టారు. అంతే, వాడు క్రిందపడిపోయాడు. నాసికారంధ్రముల వెంట, కర్ణ రంధ్రముల వెంట నెత్తురు కారిపోతూ ఉండగా కిరీటం పడిపోయి తన్నుకుంటున్నాడు. ఇప్పుడు దితికి అర్థం అయింది. తన కొడుకును శ్రీహరి సంహరిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఆవిడ స్తనముల లోంచి రక్తము స్రవించింది. శ్రీహరి హిరణ్యాక్షుడిని తన రెండు కోరలతో నొక్కిపెట్టి సంహరించాడు. హిరణ్యాక్ష వధ పూర్తయి ఆయనకీ ఒక శాపం తీరిపోయింది. పిమ్మట స్వామి భూమండలమును పైకి ఎత్తారు.
ఆదివరాహమై, యజ్ఞవరాహమై ఆనాడు రెండు కోరలతో భూమండలమును సముద్రములోంచి పైకి ఎత్తుతూ తడిసిపోయిన ఒంటితో నిలబడిన స్వామి మూర్తిని ఎవరు మానసికంగా దర్శనం చేసి, చేతులొగ్గి నమస్కరిస్తారో, అటువంటి వారి జీవనయాత్రలో ఈ ఘట్టమును చదివినరోజు పరమోత్కృష్టమయిన రోజై వారి పాపరాశి ధ్వంసం అయిపోతుంది.
గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK