Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#29
జయవిజయులకు సనకసనందనాదుల శాపము:

శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠములో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు ఏడు ద్వారములు ఉంటాయి. ఏడవ ద్వారం దాటి లోపలి వెళితే స్వామి దర్శనం అవుతుంది. జయవిజయులు ఏడవ ద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు. అప్పుడు సనకసనందనాదులు స్వామి దర్శనార్ధమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహా జ్ఞానులు. నిరంతరమూ భగవంతుని పాదములయందు భక్తితో ఉండే స్వరూపం ఉన్నవారు. వారు ఏడవ ద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. అపుడు జయవిజయులు వారిని ‘లోపలికి వెళ్ళడానికి వీలు లేదు’ అని అడ్డుపెట్టారు.

అపుడు సనకసనందనాదులు ‘ఇది వైకుంఠము. ఇక్కడ మాత్సర్యము ఉండదు. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. అటువంటప్పుడు లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకుందుకు అభ్యంతరము ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులయిన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురువచ్చే స్వభావం ఉన్నవాడు. అటువంటి వాడు లోపల ఉంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయంలో ఆయనను దర్శనం చేయాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డుపెట్టడం మీకు మించిన స్వాతంత్ర్యము. కాబట్టి ఏది ఎక్కడ ఉండకూడదో దానిని మీరు చూడడం మొదలు పెట్టారు. కాబట్టి అది ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందో ఆ భూలోకమునకు పొండి’ అన్నారు. అనేటప్పటికి జయవిజయులిద్దరూ సనకసనందనాదుల కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలు పెట్టారు.

ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరం మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సము అని పిలుస్తాము. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపమును చూసి సనక సనందనాదులు పొంగిపోయారు. ‘మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాము. మా భాగ్యం పండింది’ అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి ‘పుష్పములో చేరే గండు తుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరమూ నీ పాదములయందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది’ అని ప్రార్థించారు.

అపుడు శ్రీమన్నారాయణుడు – ‘మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను. కానీ ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్లు నాకు అనిపించింది. ఏమయింది?’ అని అడిగాడు.

అపుడు వాళ్ళు – ‘స్వామీ మేము తప్పే చేశామో ఒప్పే చేశామో మాకు తెలియదు. కానీ మేము లోపలకి వస్తున్నప్పుడు ఏడవ ద్వారం దగ్గర ఈ పారిషదులు మమ్ములను అడ్డుపెట్టారు. మత్సరములు ఉండడానికి అవకాశం లేని వైకుంఠమునందు నీ దర్శనమునకు మమ్మల్ని పంపలేదు కనుక, వారు మాయందు విముఖులయి ఉన్నారు కనుక వారిని భూలోకమునందు జన్మించమని శపించాము. ఇప్పుడు నీవు ఎలా చెపితే అలా ప్రవర్తిస్తాము. ఒకవేళ మావలన అపరాధం అంటే మన్నించవలసినది’ అన్నారు.

అపుడు శ్రీహరి – ‘నా పాదములు మీవంటి బ్రహ్మ జ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు. కనుక ఇంతమంది చేత ఆరాధింపబడుతున్నాయి. మీవంటి వారిచేత పూజించబడి మిమ్మల్ని రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తాను కనుక, నిత్యాపాయినియై నిరంతరమూ లక్ష్మి నావెంట వస్తోంది. నేను భక్త పరాధీనుడను. భక్తులయిన వారు పిలిస్తే పరుగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరుగెత్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించడంలో అడ్డువస్తే నా చేతిని నేను నరికేస్తాను’ అన్నాడు. ఎంతపెద్ద మాటో చూడండి! ఎందుకు అంటే ఆ చేయి లోకములనన్నితిని రక్షించే చేయి. అటువంటి మీరు నిరంతరమూ నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు,చతుర్ముఖ బ్రహ్మ అంతటి వారు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలము నా పాదపంజరము మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది.’ ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమయిన విషయమును ప్రతిపాదన చేశారు.

‘నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా! వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. ఏడవ ప్రాకార ద్వారము వద్ద వుండి వచ్చిన వాళ్ళని లోపలి పంపించండి అని చెప్పాను, లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలి అని అంతరము తెలుసుకొని, ముందు వాళ్ళకి నమస్కారం చేసి, లోపలి ప్రవేశ పెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులయిన వారికి కలిగిన మనఃక్లేశము పట్టి కుదిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు నావద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమునందు పుట్టిన కుష్ఠు తనని పాడు చేసినట్లు నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయవిజయులు నాకే తప్పు పేరు తీసుకువస్తున్నారు. మీవంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింప బడితే భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకము పాడయిపోతుంది. నేను భక్త పరాధీనుడను. అటువంటి నాకు దుష్ట పేరు తెచ్చారు. కాబట్టి వాళ్ళను మీరు శపించడం కాదు నేను చెపుతున్నాను.’
‘వీళ్ళు ఉత్తర క్షణం భూలోకమునకు వెళ్ళి రాక్షస యోని యందు జన్మించి ఉగ్రమయిన రాక్షసులై అపారమయిన లోభత్వమును పొందుతారు’ అన్నాడు.

అప్పుడు జయవిజయులిద్దరు శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి ‘స్వామీ, లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళా మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనం’ అని అడిగారు. అపుడు స్వామి ‘మీరు మూడు జన్మలలో గొప్ప రాక్షసులు అవుతారు. కానీ మిమ్మల్ని మళ్ళా దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీ కోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళా తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా రక్షణే!

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Vikatakavi02 - 09-10-2019, 07:41 PM



Users browsing this thread: 1 Guest(s)