Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#26
భాగవతము — ద్వితీయస్కంధము

భాగవతంలో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. అటువంటి శుకబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు. తనగురించి తానూ ఏమీ చెప్పుకోలేదు. కానీ ఒక్కమాట చెప్పాడు. “పరీక్షిన్మహారాజా! నేనొక విషయం చెపుతాను. జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనే ఒకరాజు ఉండేవాడు. అతడు దేవతలకు సాయం చేయడం కోసమని యుద్ధం చేయడం కోసమని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. తదుపరి దేవతలు అందరూ ఖట్వాంగుడిని అభినందించారు. ‘నీవు మాకోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నారు. అపుడు ఆయన ‘నాకేమీ వరం అక్కర్లేదు. కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెపుతారా’ అని అడిగాడు. అపుడు దేవతలు వాని ఆయుర్దాయం లేక్కచూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉన్నాడని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క ఘడియ ఆయుర్దాయం చాలునని ఖట్వాంగుడు భావించాడు. వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈమాట చెప్పేసి, ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరమును విడిచి పెట్టేసి మోక్షమును పొందాడు. ఒక్క ఘడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన ఖట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు. నీకు ఇంకా ఏడురోజుల సమయం ఉంది. నీకు తప్పక మోక్షం లభిస్తుంది’ అని చెప్పాడు శుకుడు.

ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఇలా మాట్లాడిన వాడు గురువు. మరణించే వారందరికీ పరీక్షిత్తు ప్రతినిధి. నేను నేననుకున్న ఈ శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రములో కాలి దోసెడు బూడిద అయిపోతోంది ఒక్క అరగంటలో. ఏది నామరూపములు? వాడు పెట్టుకుంటే ఒక ఫోటో మిగిలిపోతుందంతే! పెట్టుకోక పోతే ఏ గొడవా లేదు. కాబట్టి ఇంతటి ఆభిజాత్యం కూడా పోయిందంతే! ఈ అహంకారమును గుర్తించని కారణము చేత మరల హీనోపాధిలోకి వెళ్ళిపోతున్నావు. అందుకని నీవు ఈశ్వరాభిముఖుడవు కావలసింది. నీకు సంబంధించిన ఈ భౌతిక సంబంధములు కాని, వ్యక్తులు కాని, ఆస్తులు కాని, సంపద కాని, ఏవీ నిన్ను రక్షించవు. నీవు ఈశ్వరుడి పాదములను పట్టుకో. అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకము తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ శుకుడు విరాడ్రూప వర్ణనమునంతా చేశాడు. చేసి హరిలేని పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచామహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాంగములై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఈశ్వరుడు కనపడడం లేదు. ఎందుకు? అదే మాయ. అది నామ రూపములయండు కలిగిన తాదాత్మ్యం తదధిష్టానమయిన బ్రహ్మమునందు కలుగదు. అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి. ప్రపంచంలో ఉన్నది మాయ అని తెలిస్తే అది తొలగిపోతుంది. ఇది మాయ అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది. అప్పటివరకు తొలగదు. దానికి ఈశ్వర కృప తోడయితే తొలగుతుంది. మాయ తొలగినపుడు లోపల వున్న ఆత్మ భాసిస్తుంది. కానీ మాయ తొలగడం అనేది అంత తేలికయిన విషయం కాదు.

ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కరలేదు. విశ్వము హరి. హరి విశ్వము. అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము ఇంకా ఇంకా అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాన నేత్రము చేత చూస్తే ఉన్నది ఒక్కటే. నీవు కానీ సక్రమముగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి, అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము’ అని బోధచేసి భక్తి నిలబడడానికి శుకుడు ఒక మాట చెప్పాడు. ‘నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు. నీకు ఈశ్వరునియందు పూనిక కలగాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలని అనుకుంటే రాదు. ఈశ్వరునికి ముందు నీవు నమస్కారం చేయడం మొదలుపెడితే ఆయన నీకొక దారి చూపిస్తాడు. భగవంతుని కథలు వినడమనే స్థితికి నిన్ను తీసుకువెడతాడు. కానీ మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథవైపు వెళ్ళడు. కానీ వెళ్ళాడు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమయిందన్న మాట. భగవంతుని కథలను వినడం నీవు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. ఆ భక్తితో అంతటా నిండియుండి చూస్తున్న వాడు, చేయిస్తున్న వాడు సర్వేశ్వరుడనే భావన నీకు కలిగిన నాడు, నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది.

భాగవతం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది. మనస్సును మారుస్తుంది. ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీనిని అందరూ పొందలేరు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ భాగవతమును వినలేరు. అందుచేత ‘నీవు భగవత్ కథా శ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే’ అని చెప్పాడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Vikatakavi02 - 09-09-2019, 03:44 PM



Users browsing this thread: 1 Guest(s)