Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#24

కలి అన్నాడు “నేను ఇంకా స్థిరముగా ఊన్చుకోలేక పోతున్నాను. ఇది నా తప్పు కాదు. నేను రావాలి. అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు. నేను వచ్చాను. గట్టిగా ఊన్చుకొని నిలబడదామనుకుంటే నేను ఎక్కడికి వెడితే అక్కడ నీవు ధనుర్బాణములు పట్టుకుని కనపడుతున్నావు. మరి ఎలా? ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా! కలియుగంలో కలిని అయిన నేను ప్రవేశించాలి కదా! అందుకని నువ్వు నాకొక అవకాశం ఇవ్వు. నన్ను ఫలానా చోట ఉండమని చెప్పు. నేను అక్కడ ఉంటాను. అప్పుడు ఇక ఇబ్బంది ఉండదు. అలాకాక నేను ఎక్కడికి వెడితే నీవు అక్కడ కనిపించినట్లయితే నీకూ, నాకూ సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతానని అంటూ ఉంటావు. యుగం వచ్చేసింది. నేను రావాలి. కాబట్టి నేను ఎక్కడ ఉండనో నీవే చెప్పవలసింది” అన్నాడు.

అపుడు పరీక్షిత్తు “నీకు నాలుగు స్థానములు ఇస్తాను. నువ్వు అక్కడే ఉండు” అన్నాడు. పరీక్షిత్తు చెప్పిన మొట్టమొదటి స్థానం జూదశాల. “జూదశాల యందు నీవు ఉండవచ్చు” అన్నాడు. రెండవది పానశాల. ‘ఎక్కడెక్కడ మత్తు పదార్థములను త్రాగుతారో అక్కడ నీవు ఉండవచ్చు’ అన్నాడు. మూడవది ‘స్వేచ్ఛా విహరిణులై, ధర్మమునకు కట్టుబడని ఆచార భ్రష్టులయిన స్త్రీలవద్ద నీవు ఉండవచ్చు.’ నాల్గవది జీవహింస జరిగే ప్రదేశము. ‘జీవహింస జరిగే ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. ఈ నాలుగు ప్రదేశములను నీకు ఇచ్చాను’ అన్నాడు.

ఇలా కలికి ఈ నాలుగు స్థానములను ఇచ్చుట ద్వారా పరీక్షిత్తుకు కలిసి వచ్చినది ఏమిటి? అసలు కలిని రావద్దు అని చెప్పాలి కాని, అలా నాలుగు స్థానములు కలికి ఇవ్వడం ద్వారా కలి వెళ్ళి జూడశాలలో పేకముక్కలు ఇస్తాడా, లేకపోతే మత్తు పదార్థములను అమ్మేచోటికి వెళ్ళి దుకాణం పెట్టుకుంటాడా, లేకపోతే జీవహింస తాను చేస్తాడా – మిమ్మల్ని కలి ఎలా పాడుచేస్తాడు? ఇది మీరు విశ్లేషణ చేయాలి. జూదశాలయందు ఏమి జరుగుతుంది? అక్కడ అసత్యము ప్రబలుతుంది. లోకమునందు పోకడ మీరు గమనించే ఉంటారు. గుడికి వెళ్ళేవాడు ‘ఏమండీ- నేను ఒక్కసారి శివాలయమునకు వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేస్తానండి అంటాడు. సినిమాకి వెళ్ళేవాడు నేను సినిమాకి వెడుతున్నాను అని చెప్తాడు. కానీ తాను పేకాడుకోవడానికి వెడుతున్నానని ఎవడూ చెప్పడు. మర్యాద పోతుందని వాడికి తెలుసు. తన స్నేహితుడి ఇంటికి వెళ్ళివస్తానని అబద్ధం చెప్తాడు. లేకపోతే క్లబ్ ను ఒకదానిని పెట్టుకుని అక్కడికి వెడుతున్నానని చెప్పుకుంటారు. అలా చెప్పుకుందుకు సిగ్గుపడరు. మనం సాధారణంగా ఏమని అనుకుంటామంటే వీరందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారని అనుకుంటాము. ఏమీ ఉండదు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అది కలిస్థానం. అందుకని అక్కడ అసత్యం ప్రారంభమవుతుంది.

సత్యమును ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలయిపోతుంది. జూదశాలలో అసత్యమే చెప్పాలి. కాబట్టి ఏం చేస్తాడు? ప్రారంభం అసత్యం. తీరా వెళ్ళిన తర్వాత మూడుగంటలు కూర్చుని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చుని ఉంటుంది. ‘ఏమండీ ఇంతసేపు ఎక్కడికి వెళ్లారండీ’ అంటుంది. అపుడు ఆయన ‘స్వామీజీ ఉపన్యాసమునకు వెళ్లాను. నేను వెళ్ళకపోతే ఆయన చెప్పలేనని అంటున్నాడు. అందుకని వెళ్లాను’ అంటాడు. కాబట్టి అక్కడొక అసత్యం. కానీ క్రమంగా తెలుస్తుంది. భార్య ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. ‘మీరు పేకాటలో డబ్బు పోగొట్టుకుంటున్నారు’ అంటుంది. ‘ఏమీ కాదు డబ్బు మా నాన్న గారికి పంపించాను’ అంటాడు. బుకాయిస్తాడు. దబాయిస్తాడు. జూదశాల నుంచి కలి అసత్యరూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది. రెండవది పానశాల. తాగగానే యుకాయుక్త విచక్షణ పోతుంది. మదము ప్రవేశిస్తుంది. అతివాగుడు మొదలవుతుంది. తాగగానే శుకపిక బకరవములు ప్రారంభమయిపోతాయి. ఒక వెర్రివాగుడు మొదలుపెట్టేస్తాడు. సేవించకూడనిది సేవించడం వల్ల నీ అంత నీవు రాక్షసుడవు అయిపోతున్నావు. ఈశ్వరుడు ఇచ్చిన దైవత్వమును నాశనం చేసుకుంటున్నావు. అపుడు ఈశ్వరుని దయ ప్రసరించదు. ఈశ్వరుని ఆగ్రహం ప్రకటితమౌతుంది. మదోన్మత్తుడవు అవుతావు. ఆ మదము నిన్ను భ్రష్టుడిని చేసేస్తుంది. కలి మదరూపంలో వస్తాడు. అందుకని పానశాలయందు ఉండడానికి పరీక్షిత్తు కలికి అవకాశం ఇచ్చాడు. మూడవది స్వేచ్ఛా విహారిణి అయిన స్త్రీ. ఆమె వలన సమాజం భ్రష్టు పడుతోంది. మనిషి విషయ సంగాలోలుడు అయిపోతున్నాడు.

నాల్గవది హింస. నిష్కారణముగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుటను హింస అంటారు. ప్రాణిహింస అంటే కేవలం ప్రాణులను చంపివేయడమని కాదు. అస్తమానూ చంపి వేయనక్కరలేదు. కొంతమంది చీమలు వెడుతుంటే వాటిని తొక్కేస్తారు. కొంతమంది నిష్కారణంగా చెట్ల ఆకులను తున్చేస్తారు. నీవు ఆకులను సృష్టించలేదు. అటువంటప్పుడు ఆ ఆకులను తుంచివేసే హక్కు నీకు లేదు. అది నిష్కారణ హింస. అన్నిటికంటే భయంకరమయిన హింస నోటిమాట.

‘కడుపుల్ రంపపుకోత కోయునదియే గాయాలు కాకుండినన్’ అన్నారు గయోపాఖ్యానంలో.
ఒక మనిషిని పడుకోబెట్టి మతుమందు ఇవ్వకుండా ఒక రంపము పట్టుకువచ్చి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి దూలమును కోసినట్లు కోస్తుంటే, ఆ కడుపు కోయబడుతున్న వాడు ఎంత బాధపడతాడో, అవతలవారు తాను అంటున్న మాటలకు అంత బాధపడుతున్నాడన్న ఇంగితజ్ఞానం లేకుండా, ఈశ్వరుడు నోరు ఇచ్చాడని వాక్కునందు అదుపు ఉండాలి. అవతలివారు బాధపడకుండా మధురమధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాటయందు కాఠిన్యము అలవాటయిపోతుంది. అవతలివారి యందు నిష్కారణమయిన కోపం పెరిగిపోతుంది. అవతలివాడు బాధపడుతుంటే వీడు సంతోషపడతాడు. అవతలివాడి బాధ వీడి సంతోషమునకు హేతువయిన నాడు అది కలిపురుషుని ప్రవేశమును సూచిస్తుంది.

‘కాబట్టి ఈ నాలుగు స్థానములు నీకు ఇస్తున్నాను’ అన్నాడు పరీక్షితు కాలితో. తాను పరిపాలనలో వుండగా ఈ నాలుగు స్థానములకు తన ప్రజలు ఎవ్వరూ వెళ్ళరని పరీక్షిత్తు నమ్మకం. ఈ నాలుగుచోట్లకు బాగా వెళ్ళాలని కోరుకుంటే ఆయన పరీక్షిత్తు కాదు. అటువంటి వాడు కలి ప్రతినిధి.

మీరు నాలుగింటిలో ఒకదానికి పట్టుకున్నారంటే మిగిలిన మూడింటివైపు మిమ్మల్ని ఎలా లాగివేయాలో కలికి తెలుసు. భాగవతమును వినడం వలన మీ జీవితం ఎక్కడ పాడయిపోతున్నదో మీరు తెలుసుకోగలుగుతారు.

కలిపురుషుడు చాలా తెలివితేటలుతో ప్రజలను మభ్యపెట్టగలదు. కలి పరీక్షిత్తుతో ‘అయ్యా, మీరు నాకు నాలుగు స్థానములు ఇచ్చారు. కానీ వీటిలో నేను ఊన్చుకోవడానికి తగిన స్థానం లేదు. కనుక ఇంకొక్క స్థానమును ఇప్పించండి’ అన్నాడు. అపుడు గభాలున పరీక్షిత్తు ‘నేను నీకు బంగారమునందు స్థానం ఇచ్చాను’ అన్నాడు. ‘చాలు మహాప్రభూ!’ అని కలి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో బహుశః ఒక లక్షణం ఉండేది. నిస్సంగులయిన వారికి ఆత్మజ్ఞాన ప్రబోధము చేసేవారికి బంగారమునందు లోభము ఉండదు. వారు బంగారమును కోరరు. వారికి దానిమీద పెద్ద ఆసక్తి ఉండదు. అందుకని కలికి అక్కడ ఇచ్చినా ప్రమాదమేమీ ఉండదని పరీక్షిత్తు భావించి ఉండవచ్చు. కానీ పరీక్షిత్తు మాట తప్పనితనమే ఆయనకు ప్రతిబంధకము అయిపోయింది.

పరీక్షిత్తు ఒంటినిండా బంగారమే. అది చాలు కలికి పరీక్షిత్తులో ప్రవేశించి అతనిని నాశనం చేయడానికి. ఇంటికి వెళ్ళిన తరువాత పరీక్షిత్తుకి వేటకి వెళ్ళాలనే కోరిక కలిగింది. వేటకోసమని బయలుదేరాడు. అనేక మృగములను వేటాడాడు. కలి అంశలలో బంగారమునుండి తానిచ్చిన వేరొక స్థానములోనికి పరీక్షిత్తు వచ్చేశాడు. ఎలా? ఒకదానిద్వారా కలి ప్రవేశిస్తే చాలు, మిగిలిన అవలక్షణములన్నీ వచ్చేసి ఆ వ్యక్తి చివరకు నాశనం అయిపోతాడు. పరీక్షిత్తు ఒంటిమీద బంగారం ఉంది. అందుకని కలి పరీక్షిత్తులోనికి ప్రవేశింపగలిగాడు. తరువాత పరీక్షిత్తుకు జీవహింస చేయాలన్న కోరిక పుట్టింది. సాధారణంగా వేటకి ప్రభువు ఎప్పుడు వెడతాడంటే – జానపదులు వచ్చి, అయ్యా, క్రూర మృగముల సంఖ్యా పెరిగి పోయిందండి’ అని వేడుకుంటే, ఆ క్రూర మృగములు ఊరిమీదకి రావడానికి భయపడే రీతిలో రాజు పెద్ద పరివారంతో దండుగా వెళ్ళి కొన్ని క్రూర మృగాలను వేటాడతాడు. అలా వెళ్ళాలి. అంతేగానీ జంతువులను సరదాగా చంపడానికి వేటకు వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు పరీక్షిత్తుకు జంతువులను చంపుదామనే ఆలోచన పుట్టింది. అందుకని వేటకు వెళ్ళాడు. తద్వారా ఇంకొక స్థానంలోకి వెళ్ళాడు. అతనిలో నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది.

పరీక్షిత్తు వేటకి వెళ్ళి వేటాడాడు. దప్పిక, ఆకలి కలిగింది. ఆకలి దప్పిక కలిగినప్పుడు అవి పోగుట్టుకుందుకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పరీక్షిత్తుకి బుద్ధి భ్రంశము అవుతోంది. అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాడు. అక్కడ దాహార్తి తీర్చమని ఎవరిని అడగాలి? అక్కడ ఆశ్రమంలో సంచరిస్తున్న స్త్రీ పురుషులనెవరినయినా అడగాలి. కానీ పరీక్షిత్తు వారినెవరినీ అడగలేదు.అతనిలో అహంకారము ప్రవేశించింది. నేరుగా అక్కడ తపోదీక్షలో ఉన్న శమీకమహర్షి దగ్గరకు వెళ్ళాడు.

ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు? కదలిక లేదు.స్థాణువయిపోయి ఉన్నాడు. ధ్యానమునందు తపస్సునందు చాలా నిమగ్నుడయిపోయి బ్రహ్మమునందు రమిస్తున్నవాడు కదలిక లేక కర్ర నిలబడిపోయినట్లు స్థాణువయి ఉండిపోతాడు.

ఆయన అలా కూర్చుండి ధ్యానమగ్నుడై ఏమాత్రం కదలిక లేకుండా ఉన్నాడు. ప్రాణాయామము చేత ప్రాణమును నియంత్రించాడు. కుంభకము చేత వాయువును పూరించి ఆపుచేసేశాడు. కాబట్టి వక్షఃస్థలం కదలదు. మనస్సు ఊపిరిమీద ఆధారపడుతుంది. అటువంటి మనస్సు ఇప్పుడు కదలడం లేదు. మనస్సు కదలకపోవడం వల్ల బుద్ధికదలడం లేదు. బుద్ధి కదలకపోవడం వల్ల ఇంద్రియములు కదలడం లేదు. బయట విషయమును కన్ను చూడదు, చెవులు వినబడవు. స్పర్శేంద్రియములు బాహ్యజ్ఞానము తెలియదు. అందుకని అలా ఉండిపోయాడు. ఆయన జాగ్రదాది మూడు అవస్థలను దాటిపోయి చివరకు తురీయమనే స్థాయికి చేరిపోయి, తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరమును చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు. అలా కూర్చుని బ్రహ్మముతో రమించి ఉండిపోతే ఆయన వెంట్రుకలు, గోళ్ళు, పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారము లేక వ్రేలాడుతున్నాయి. ఒక కృష్ణజింక చర్మమును కట్టుకుని అలా కూర్చుని ఉండిపోయాడు. వస్త్రం కూడా లేదు.

అటువంటి శమీకమహర్షి దగ్గరకు దాహంకోసం ఆర్తిపొందిన పరీక్షిత్తు వెళ్ళాడు. ఆయన నీటికోసం వెళ్ళడం ప్రధానాంశం. కానీ పరీక్షిత్తు లోపల ఒక మౌనభాష బయలుదేరింది. ఏమిటది? ఇప్పుడు పరీక్షిత్తు తానెవరో మరిచిపోయాడు. అతని బుద్ధి భ్రంశము అయిపోయింది. బ్రహ్మమునందు రమిస్తున్న తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలి. కానీ తాను అలా వెళ్ళలేదు. తానో మహారాజునని, వస్తే లేచి నిలబడలేదని, తనకు నమస్కరించలేదని, తనకి ఆసనం చూపించలేదని ఆ తపస్వి మిక్కిలి అహంకారుడని భావించాడు.

ఇప్పుడేమయింది? అంత గొప్ప పరీక్షిత్తు, తెల్లవారిలేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు, అన్నీ తెలిసినవాడు అన్నిటినీ మరచిపోయాడు. కలి ప్రవేశము వలన అన్నీ భ్రంశము అయిపోయాయి. దీనివలన అతనిలో ఆగ్రహం పుట్టింది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఒక స్థానంలోంచి మరొక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు.

ఆ మహర్షిని ఎలా అవమానించాలా అని తలంచాడు. అక్కడ సమీపంలో చచ్చిపోయి పడివున్న పాము ఒకటి కనిపించింది. చచ్చిపోయిన పాము అయినా మెడలో వేసేసరికి చల్లగా తగులుతుంది. అపుడు మహర్షికి తెలివి వస్తుంది. అపుడు ఆయనను గేలిచేయవచ్చు అనుకున్నాడు. ఇపుడు పరీక్షిత్తు లోపల వికృతాతివికృతమయిన ఆలోచనలు పెరిగిపోతున్నాయి. అపుడు తన ధనుస్సు చివరి భాగంతో మృత సర్పమును పైకి ఎత్తాడు. ఒక ప్రభువు, ధర్మరాజు మనుమడు, అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షిత్తు, ఇపుడు ఒక చెయ్యరాని పనిని చేశాడు. ఇపుడు ప్రపంచంలో పరమ భయంకరమయిన సన్నివేశము జరుగుతోంది. ఆ మృత సర్పమును పైకెత్తి శమీక మహర్షి మెడలో వేశాడు.

కానీ ఆయనకు స్పర్శ తెలియలేదు. తపస్వియై ఉన్న వానిలోనికి కలి వెళ్ళలేకపోయాడు. ఎందుచేతనంటే మహర్షి ఇంద్రియములు, మనస్సు ఈశ్వరుని పట్టి వున్నాయి. ఒక్క స్థానమునకు ఆశ్రయం ఇచ్చిన పరీక్షిత్తులోనికి కలి ప్రవేశించి మొత్తం నాశనం చేయగలిగాడు.

కాబట్టి మనం బాగుపడాలంటే శమీక మహర్షి ఏది పట్టుకున్నాడో దానిని పట్టుకోవాలి అని భాగవతం చెపుతోంది. శమీకుడు ఈశ్వరుని పాదములు పట్టుకుని ఉన్నాడు. నీవు కూడా వాటిని పట్టుకో. ఆ స్పర్శ ఉన్నంతకాలం కలి నీ సమీపమునకు రాలేదు. ఇది భాగవతము చెప్తున్న తీర్పు. పరీక్షిత్తు తాను చేసిన పనికి సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయి, అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి ప్రక్కనపెట్టాడు. బంగారు కిరీటం ప్రక్కన పెట్టగానే అందులోంచి కలి బయటకు వెళ్ళిపోయాడు.

కిరీటం ప్రక్కన పెట్టగానే ఆయనకు అనుమానం వచ్చింది. ‘దాహం వేయడం ఏమిటి – నేను ఆయన ఆశ్రమమునకు వెళ్ళడం ఏమిటి – వెళ్ళిన వాడిని ఊరుకోకుండా చచ్చిపోయిన పామును ఆయన మెడలో వేయడం ఏమిటి – అయిపోయింది – నా రాజ్యం అయిపోయింది. నా ధనం అయిపోయింది – నా భోగం అయిపోయింది – నా పరిపాలన అయిపోయింది – నేను చెయ్యరాని దుష్కృత్యమును చేసేశాను – దీనికంతటికీ కారణం కలిపురుష ప్రవేశం – ఎంత తప్పు చేశానో కదా’ అని పశ్చాత్తాప పడ్డాడు. పరీక్షిత్తు సహజ స్థితి అదికాదు. కానీ కలిపురుషుడి వలన అలా భ్రష్టుడయి పోయాడు.

పరీక్షిత్తు మహర్షి మెడలో చచ్చిపోయిన పామును వేయడం, అక్కడ సమీపంలో ఉన్న మునికుమారులు చూశారు. వాళ్ళు పరుగెత్తుకుంటూ అక్కడికి సమీపంలో కౌశికీనది ఒడ్డున ఆడుకుంటున్న శమీక మహర్షి కుమారుడయిన శృంగి వద్దకు వెళ్ళారు. ఆ పిల్లవాడు మహా తపస్వి. ఆ పిల్లలు ‘మీనాన్నగారు తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు. మీ తండ్రి పలకలేదు. అపుడు ఆ రాజుకి కోపం వచ్చి చచ్చిపోయిన పామును ధనుస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలో వేసి వెళ్ళిపోయాడు' అని చెప్పారు.

ఈ మాటలు విన్న వెంటనే శృంగి అన్నాడు ‘నాతండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వలన రాజు క్షేమంగా రాజ్యమును పరిపాలించగలిగాడు' అని వెంటనే శాపం ఇవ్వడానికి కౌశికీ నదీ జలాలను చేతిలోకి తీసుకున్నాడు. 'చేతిలో ధనుస్సు ఉన్నది కదా అని ఆ రాజు చెయ్యకూడని పనిని చేశాడు. అటువంటి రాజు ఎవరయినా ఉండవచ్చు గాక! వానిని ఈశ్వరుడు అడ్డినా, శ్రీమహావిష్ణువు అడ్డినా, నేటినుండి ఏడవ దినమునాటికి చచ్చి ఊరుకుంటాడు. తక్షకుడు అనే మహాసర్పము కాటు వలన రాజు మరణించుగాక!’ అని శపించి, నీళ్ళు విడిచిపెట్టి, తిరిగి ఆశ్రమమునకు వచ్చి, తండ్రి ముందుపడి ఏడవడం ప్రారంభించాడు.

తండ్రికి బాహ్యస్మృతి వచ్చింది. ‘ఎందుకు ఏడుస్తూన్నావు?' అని కుమారుని అడిగాడు. 'తండ్రీ మీ కంఠమునందు మృత సర్పము ఉన్నది' అన్నాడు. దానిని తీసి క్రింద పడవేశాడు శమీకుడు. ఎవరు వేశారు అని కుమారుని ప్రశ్నించాడు. నాకు తెలియదు. ఎవరో రాజు వేశాడట. నేటికి ఎడవనాటికి ఆ రాజు చచ్చిపోవాలని నేను ఆ రాజును శపించాను అని శృంగి జవాబిచ్చాడు. వెంటనే మహర్షి అన్నారు – 'నాయనా, ఎంతపని చేశావు. నీవు చేసిన దుష్కర్మ వలన మనకి పాపం సంప్రాప్తిస్తుంది. నీవు రాజు మరణించాలని కోరుకున్నావు. కలిపురుషుడు ప్రవేశించిన మనస్సులు అలా ఉంటాయి. ఆ రాజు అపకారియందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు. అటువంటి పరిపాలకుడు ఎక్కడ వస్తాడు మనకు! సమాజము భ్రష్టు పట్టిపోతుంది. పరీక్షిత్తును కొట్టి సమాజమునందు ఇన్ని ప్రమాదములు తేవడానికే కలి ఇలా నీచేత శాపం ఇప్పించాడు. నీవు క్రోధమునకు వశుడవు అయిపోయావు. ఎంత పొరపాటు చేశావు!’ అన్నాడు.

ఈవార్త పరీక్షిత్తుకు అందిపోయింది. ఇంకా నాటికి ఎదవరోజున శరీరం విదిచిపెట్టేస్తానని ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకు వెళ్ళి, తూర్పుదిక్కుకు కొసలు ఉండేలా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి, ఈశ్వరుని యందు మనస్సును నిలబెట్టాడు. గంగ ఒడ్డుకు ఎందుకు వెళ్ళాడు అంటే ఎవరయినా గంగ దగ్గరకు వచ్చి ‘అమ్మా, గంగమ్మా’ అని పిలిస్తే గంగమ్మ పొంగిపోయి ఆ పిలిచిన వానిని ఎంతగానో అనుగ్రహిస్తుంది. గంగలో స్నానం చేయడం ద్వారా అతడు చేసిన తప్పులన్నిటినీ తీసివేసి మోక్షమును ప్రసాదించి పంపించివేస్తుంది. గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. ఎవరు యాగం చేస్తే దేవతలు అందరూ వచ్చి కూర్చున్నారో అటువంటి మహా పురుషుడు శాపగ్రస్తుడై ప్రాయోపవేశం చేశాడు. ఈ సన్నివేశమును చూడడానికి గౌతముడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలయిన ఋషులందరూ వచ్చారు. ఈ ఏడురోజులలో తాను ఏమిచేస్తే మోక్షం పొందుతాడో చెప్పవలసినదని పరీక్షిత్తు అందరినీ అడుగుతున్నాడు. ఇంత ధర్మమూ ఉన్నవాడు ఇంత అధర్మమయిన పని చేసేయ్యడమా! కలికి కొద్ది అవకాశం ఇస్తే అంత ప్రమాదమును తెచ్చేశాడు. కాలమును అతిక్రమించడం ఎవరి తరం కాదు. ఇంతటి స్థితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్న వాడు మాత్రం చెక్కు చెదరడం లేదు. ఆ సమయంలో అక్కడికి పదహారు సంవత్సరముల వయస్సు కల ఒకాయన వచ్చాడు. ఆయన మంచి యౌవనంలో ఉన్నాడు. నల్లటి జుట్టు ముఖం మీద చిందరవందరగా పడిపోయి ఉంది. ఒక కౌపీనము పెట్టుకుని ఉన్నాడు. చుట్టూ చిన్నపిల్లలు అందరూ చేరారు. సూర్యుడు ఈ భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్లుగా ఒకరు పిలవకపోయినా ఆవుపాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఒకచోట నిలబడని శుకుడు తనంత తాను నడిచి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయన తేజస్సు చూసి పొంగిపోయిన పరీక్షిత్తు ‘కృష్ణ భగవానుడిని మా వంశము అంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో నాకు మార్గం చూపించడానికి గురువును పంపాడు కృష్ణ పరమాత్మ’ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యాడులను ఇచ్చి శుకుడి కాళ్ళమీద పడితే, కదిలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Vikatakavi02 - 08-09-2019, 09:34 PM



Users browsing this thread: 11 Guest(s)