Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#22
విదురుని ఆగమనము:

ఒకరోజున విదురుడు వచ్చాడు. ధర్మరాజు ఎదురువెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి తీసుకొని వచ్చాడు. తరువాత విదురుడు చక్కటి భోజనం చేశాడు. తరువాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్న పిమ్మట ధర్మరాజు ఆయన పాద సంవాహనం చేస్తూ కాళ్ళ దగ్గర కూర్చుని 'అయ్యా మహానుభావా, మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు. ఇది మా అదృష్టం. మీరు మేము చిన్న పిల్లలుగా ఉండగా మా తండ్రిగారు మరణిస్తే, ఒక పక్షి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా రెక్కల క్రింద పెట్టుకుని కాపాడి తానూ తీసుకువచ్చి ఆహారమును నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. దుర్యోధనుడు దాక్షాగృహంలో (లక్క ఇంట్లో) పెట్టి మమ్మల్ని కాల్చేద్దామనుకున్నప్పుడు, అనేకమయిన ప్రయోగములు చేసి మమ్మల్ని సంహరించాలని అనుకున్నప్పుడు మీరు మమ్మల్ని ఆదుకున్నారు. అటువంటి మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. మీరు ఏయే తీర్థములకు వెళ్ళారో, ఏమేమి చూశారో మాకు చెప్పవలసింది’ అని అడిగాడు.

తీర్థయాత్ర చేసివచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదములకు నమస్కరిస్తే ఇవతలి వాడు తీర్థయాత్ర చేయకపోయినా అతనికి ఆయా క్షేత్రములలోని దేవతల అనుగ్రహం కలుగుతుంది. ధర్మరాజు మాటలను విని విదురుడు చాలా సంతోషించి ధర్మరాజుతో మాట్లాడి పంపిస్తాడు. భాగవతమును కొన్ని కోట్ల జన్మల తరువాత మాత్రమే వింటారు. భాగవతము విన్న ఫలితం వట్టినే పోదు.



ధృతరాష్ట్రుని వానప్రస్థము:

తరువాత ధృతరాష్ట్రుని దగ్గరకు వెళతాడు విదురుడు. ధృతరాష్ట్రునితో ‘నామాట విని ఉత్తర క్షణంలో లేచి ఉత్తర దిక్కుకి వెళ్ళిపో. ఎవరికోసం చూడకు. ఇన్నాళ్ళు బ్రతికిన దుష్ట జీవితం నీకు చాలు. ఇప్పటికయినా నామాట విను. వెళ్ళిపోయి ఈశ్వరునియందు మనస్సు చేర్చి అందులో ప్రాణములను ఆహుతి చెయ్యి. అలా యోగమార్గంలో ఈశ్వరుడిని చేరు. లేకపోతే నీవు చేసిన పాపములకు ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది’ అన్నాడు. 

ధృతరాష్ట్రుడు ‘గొప్పమాట చెప్పావయ్యా! నిజమే ఇంకా నేను ఎవరికోసం బ్రతకాలి? భీముడు మొదలయిన వాళ్ళు పెడుతున్న ఈ నెత్తుటి కూడు తిని ఇంకా సంతోషంగా బ్రతికేస్తున్నానా? ఛీ నాకు రోత పుట్టింది వెళ్ళిపోతున్నాను’ అన్నాడు.

అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు గాంధారికి కూడా చెప్పలేదు. భర్త వెళ్ళిపోతున్నాడని గాంధారి పసిగట్టింది. ఆయనతో పాటు వెళ్ళిపోయింది. ప్రతిరోజూ ఉదయం ధర్మరాజుగారు స్నానానుష్ఠానములన్నీ పూర్తి చేసుకున్న తరువాత వచ్చి పెదతండ్రిగారయిన ధృతరాష్ట్రుడికి, గాంధారికీ తల తాటించి నమస్కరించేవాడు. ఆరోజుకూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురమునకు వచ్చాడు. ఆయన కనపడలేదు. ‘నావల్ల ఏదో అపకారం జరిగి వుంటుంది. నా పెదతండ్రి అంధుడు, వృద్ధుడు. ఆయన బిడ్డలు అందరూ మరణించారు. వీళ్ళ వలన ఇంకా సుఖ పడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడో! నాకు చాలా బెంగగా ఉంది. గాంధారీమాత కూడా కనపడడం లేదు. అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు’ అని ధర్మరాజు అంతటి వాడు ఏడ్చాడు.

ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయిన ధృతరాష్ట్రుని గురించి ధర్మరాజు ఏడుస్తుంటే విదురుడు వచ్చాడు. "ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడో మీకేమన్నా తెలుసా?" అని విదురుని అడిగాడు. తప్పో ఒప్పో విదురుడు మంచివాడని ధృతరాష్ట్రునికి తెలుసు. అందరూ పడుకున్నాక ధృతరాష్ట్రుడు విడురుడిని పిలిచి ‘నాకు నిద్ర పట్టడం లేదు. ఏదయినా మంచిమాటలు చెప్పు’ అనేవాడు. అప్పుడు విదురుడు ‘నీకు ఎందుకు నిద్ర పట్టడం లేదు? దొంగలకి నిద్ర పట్టదు. నీవు దొంగవి. నీ తమ్ముడి రాజ్యం, నీ తమ్ముడి పిల్లల రాజ్యమును నీవు దొంగిలించాలని ఆలోచన చేస్తున్నావు’ అని తిట్టేవాడు. రాత్రి అన్నీ తిట్టేసిన తరువాత వాటిని విని ధృతరాష్ట్రుడు ‘నువ్వు బాగా తిట్టావు, నిజమే, నేను దొంగనే, ఏం చేస్తాను. నేను ఈ మోహంలోంచి బయటకు రాలేను’ అనేవాడు. కనీసం ఒక మంచివ్యక్తి దగ్గర సత్సంగం చేసి తన తప్పును ఒప్పుకుని, బుర్రకి పట్టినా లేకపోయినా రాత్రి మంచి మాటలు వినేవాడు. ఈ పుణ్యమునకు గాను విశ్వరూప సందర్శనంలో కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రునికి కళ్ళను ఇచ్చి దర్శనం చేయించాడు. జీవితంలో ఒక సత్పురుషుడితో సహవాసం ఎంత గొప్పదో చూడండి!

అటువంటి ధృతరాష్ట్రుడు, గాంధారి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతే విదురుడు ‘ఎటు వెళ్ళిపోయాడో నాకు కూడా తెలియదు.' అని కన్నుల నీరు పెట్టుకున్నాడు.

ఆ సమయానికి నారదుడు వచ్చాడు. నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్కళ్యాణమే. 

'ఎందుకు ఏడుస్తున్నావు?' అని ధర్మరాజుని అడిగాడు. 'పాపం మా పెదనాన్న గారికి కళ్ళు లేవు, ఉత్తర దిక్కుకి తపస్సుకి అని వెళ్ళిపోయారు. ఆయన ఏమి తింటారు? ఎవరు పెడతారు?' అన్నాడు ధర్మరాజు. అపుడు నారదుడు 'ఈ పిచ్చి ప్రశ్న మానెయ్యి. ఎవరు పెడతారని అంటావేమిటి? రెండు కళ్ళు ఉన్న దానిని నాలుగు కాళ్ళు ఉన్నది తినేస్తోంది. నాలుగు కాళ్ళు ఉన్న దానిని రెండు కాళ్ళు ఉన్నవాడు బాణం వేసి కొట్టి చంపి తినేస్తున్నాడు. సత్పురుషులను పోషించడానికి చెట్లు కాయలు కాసి, పళ్ళు పండి అందవేమోనని క్రిందకు వంగి అందిస్తున్నాయి. కాయ కోసేశాక కొమ్మ పైకి వెళ్ళిపోతుంది. తనను నమ్ముకున్న వాడిని ఎలా పోషించాలో ఈశ్వరుడికి తెలుసు. మధ్యలో నీకు బెంగ ఎందుకు? అతను వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు. మీ పెదనాన్న నడిచి ఉత్తరదిక్కున ఋషులు ఉంటే ఆశ్రమమును చేరుకున్నాడు’ అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు విదురుడు అనిన మాటలకు చాలా వైరాగ్యమును పొందాడు.

ఇవాళ్టి నుండి మీ పెదనాన్న ఇంద్రియములన్నింటిని వశం చేసుకొని అంతర్ముఖుడు అయిపోయి ప్రాణాయామం చేసి మనస్సును ఈశ్వరుడి దగ్గర పెట్టేసి శరీరమును శోషింపజేసి యోగాగ్నిని ప్రజ్వరిల్ల జేసి మూడు అగ్నిహోత్రములు ఏకకాలమునందు వెలిగితే అటువంటి యోగాగ్ని యందు తన శరీరమును బూడిద చేసేస్తాడు. బ్రహ్మమునందు చేరిపోతాడు. యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి తన భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి తాను కూడా ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరూ బ్రహ్మమును చేరిపోతారు. నువ్వు సంతోషించు’ అని చెప్పాడు. అర్జునుడు వెళ్ళి ఇప్పటికి ఏడు నెలలు అయింది. కృష్ణ భగవానుడిని చూసి వస్తానని చెప్పి బయలుదేరాడు. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుచేత రాలేదు? ద్వారకా నగరంలో ఏం జరిగింది?’ అని ఆశ్చర్యపోతూ విదురుడిని ‘మీరు తీర్థయాత్రలు చేశారు. అనేక క్షేత్రములకు వెళ్ళారు. ద్వారకానగరం ఎలా ఉంది? కృష్ణ భగవానుడు క్షేమమేనా?’ అని అడిగాడు. 

కృష్ణుడు నిర్యాణం పొందేశాడని విదురునికి తెలుసు. కానీ కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడన్న అప్రీతికరమయిన వార్త విదురుడు చెప్పలేదు. ఎందుచేత అంటే వాక్కుకి ఒక నియమం ఉంది.

‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం’

సత్యమయినా అప్రియమయిన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు.

కానీ ధర్మరాజు నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఈ దుర్నిమిత్తములు చూస్తే అవతార పురుషుడై, ధర్మమును నాలుగు పాదముల నడిపించి ఈ లోకమునంతటిని తన భుజముల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడయిన కృష్ణుడు శరీరము విడిచి పెట్టి అవతారమును చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్లే. నాకు అనుమానంగా ఉంది’ అని బాధపడ్డాడు.

ఇంతలో అర్జునుడు వచ్చాడు. ధర్మరాజు ముందుగా కుశలం అడిగాడు. అప్పుడు అర్జునుడు 'అన్నయ్యా, మన నెచ్చెలి, మన దైవము, బంధువు, మన సమస్తము అయిన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా! అడవిలో వెడుతున్న వాడు, ముల్లు కాలిలో గుచ్చుకుంటే ఆ ముల్లు తీయడానికి వేరొక ముల్లును చేతితో పట్టుకుని చర్మమును ఉత్తరీయించి, శరీరములో ఉన్న ముల్లు తీసేసిన తరువాత శరీరములో గుచ్చుకున్న ముల్లు, చేతిలో వున్న ముల్లు రెండు ముళ్ళను విసిరేసినట్లు శరీరముతో ఈ లోకములోనికి వచ్చి నిద్రయందు, అనవసర ప్రసంగముల యందు జీవితమును పాడుచేసుకుంటున్న వ్యక్తులను ఉద్ధరించడానికి వచ్చి ముల్లును ముల్లుతో తీసినట్లు తాను శరీరమును ధరించి లోకమునకు గీత చెప్పి, నడవడి నేర్పి, మనలను ఉద్ధరించి, కాపాడి, రెండు ముళ్ళు పారేసినట్లు లోకోద్ధరణ అయిపోయిందని శరీరాన్ని వదిలేసాడన్నయ్యా!' అని అంటూ 'ఆశ్చర్యం ఏమిటి అంటే కృష్ణ నిర్యాణం కాగానే గోపబాలురు ఒకరినొకరు కొట్టుకొని అందరూ మరణించారు. కృష్ణుని భార్యలను రక్షిద్దామని నేను గోపాలురతో యుద్ధం చేయవలసి వచ్చింది. గోపబాలురకు పశువులను తోలడం తప్ప యుద్ధం తెలియదు. అటువంటి వాళ్ళు, కేవలం కడవలో నీళ్ళు పట్టుకుని వెళ్ళే ఒక అబలను ఓడించినంత తేలికగా గాండీవము ఉన్న నన్ను ఓడించేశారు. నన్ను ఓడించి కృష్ణ పత్నులను నావద్ద నుండి అపహరించి పట్టుకుపోయారు. అయితే నాకొకటి అర్థం కాలేదు. ఈ గాండీవమునే కదా నేను అప్పుడు పట్టుకున్నది. ఈ రథమునే కదా నేను అప్పుడు ఎక్కాను.'

యాత్ర యోగీశ్వరః కృష్ణో యాత్ర పార్థో ధనుర్ధరః!

తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ!!

'ఏనాడు నీ జీవన రథంలోంచి కృష్ణుని తీసివేశావో ఆ నాటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావో అంతకాలం నీకు విజయ పరంపరే!'

‘అన్నయ్యా, ఇవ్వాళ కృష్ణుడు లేదు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణమును గురిపెట్టి కదులుతున్న చేపను కొట్టాను. ఖాండవ వనమును దహించ డానికి ఆగ్నేయాస్త్రమును ప్రయోగించాను. 18 అక్షౌహిణుల సైన్యమును చీల్చి చెండాడాను. అన్ని చేయగలిగిన ఈ చేతులు ఇవాళ గోపబాలురతో యుద్ధము చేయలేకపోయాయి. ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి. ఈవేళ మనం జీవచ్ఛవాలమై ఉన్నాము’ అన్నాడు.

ఈ మాటలను విని ధర్మరాజు ‘ఇంక మనం ఉండవలసిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడయితే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తరువాతి యుగానికి అవకాశం చూపాడు. కాబట్టి మనం ఉండవలసిన అవసరం లేదు’ అని పరీక్షిత్తుని పిలిచి అతనికి పట్టాభిషేకం చేశాడు.

తాను కట్టుకున్న సార్వభౌమ లాంఛనమయిన పట్టు వస్త్రములను, ఆభరణములను విడిచిపెట్టి, కేశ పాశములకు ఉన్న ముడిని విప్పి ఒక మానసిక హోమం చేశాడు. అది పైకి చేయలేదు. ఇంద్రియములన్నిటినీ తీసుకువెళ్ళి మనస్సులో పెట్టాను. మనస్సును తీసుకువెళ్ళి ప్రాణవాయువునందు పెట్టాడు. ప్రాణవాయువును తీసుకు వెళ్ళి అపానమనబడే మృత్యు వాయువు నందు పెట్టాడు. అపానమును తీసుకువెళ్ళి మృత్యుస్థానమయిన శరీరమునందు పెట్టాడు. ఈవిధంగా ఇప్పుడు శరీరము పడిపోవడానికి కావలసిన స్థితిని తీసుకువచ్చేశాడు. దీనిని శాస్త్రంలో ఒక రకమయిన సన్యాసమని అంటారు. ఇహ తను మాట్లాడడు. ప్రతిస్పందించడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా పిశాచగ్రస్తుడిలా జుట్టు విరబోసుకొని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోయాడు. ధర్మరాజును చూసిన భీముడు అలాగే అన్నగారిలాగా వెళ్ళిపోయాడు. భీముడి వెనుక అర్జునుడు, ఆ వెనుక నకుల సహదేవులు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వారు మృత్యుస్థానమయిన శరీరములోకి హోమము చేసేశారు కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యమును పొందేశారు. ఇది తెలుసుకున్న ద్రౌపదీ దేవి. తన భర్తలు వెళ్ళిపోయిన తరువాత ఇంక తను ఉండకూడదని తానూ కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరమును విడిచి పెట్టేసింది. విదురుడు ధృతరాష్ట్రునితో మాట్లాడిన మాటలను, ధర్మరాజు, మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులయిన ఘట్టాన్ని ఎవరు విన్నారో జీవితంలో, ఎవరు చదివారో అటువంటి వారికి నిర్హేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదారవిందములయందు భక్తిని కృప చేస్తాడు’ అని పోతన గారు అభయం ఇచ్చారు. ఆ ఘట్టం అంతా మహోత్క్రుష్టమయిన ఘట్టం.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Vikatakavi02 - 07-09-2019, 02:31 PM



Users browsing this thread: 1 Guest(s)