Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#9

నారదభగవానుడిని వేదవ్యాసుడు ప్రార్థనచేస్తే ఆయన సలహామేరకు వ్యాసుడు తన ఆశ్రమంలో భాగవతమును రచించడం ప్రారంభించేశారు. దానిని మన అదృష్టవశాత్తు మన తెలుగువారయిన పోతనామాత్యులవారు ఆంధ్రీకరించారు.

శారదనీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిగానగ నెన్నడు గల్గు భారతీ!!


అని పోతనగారు ఆ శారదాదేవిని స్తోత్రం చేసి ఆంధ్రీకరించడం ప్రారంభం చేస్తే మహానుభావుడికి అలవోకగా పడిపోయాయి పదాలు. ఒక అద్భుతమయిన ఆంధ్రీకరణం ఆ రోజున జరిగింది.
అటువంటి భాగవతంలో శౌనకాది మహర్షులందరు కూడ దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. సత్రయాగము అనే యాగము ఒక విచిత్రమయిన యాగము. దీర్ఘసత్రయాగం అంటే చాలాకాలం పాటు కొనసాగే యాగం. దానిని నైమిశారణ్యంలో చేశారు. ఎవరు ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉంటే దానిని సత్రయాగము అని పిలుస్తారు. అటువంటి దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. దానికి అనువయిన ప్రదేశంగా నైమిశారణ్యమును నిర్ణయించుకున్నారు. అది విష్ణుభగవానుని శక్తి ప్రకటితమయిన క్షేత్రము. ఇరుసును ఆధారము చేసుకుని చక్రములు తిరుగుతూ ఉంటాయి. ఇరుసు విరిగిపోతే ఆ బండి పనికిరాదు. సంసారమునకు ఉండేటటువంటి నేమి (ఇరుసు) ఏ ప్రాంతమునందు శిధిలం అయిపోయిందో అటువంటి పరమ పవిత్రమయిన ప్రాంతమునకు నైమిశారణ్యము అని పేరు. ఆ నైమిశారణ్యములో చేసిన క్రతువు చాలా విశేషమయిన ఫలితమును ఇస్తుంది. శ్రీమహావిష్ణువు అనుగ్రహమునకు నోచుకున్న క్షేత్రము. అటువంటిచోట ఈ దీర్ఘసత్రయాగమును చేసినట్లయితే బాగుంటుందని శౌనకాది మహర్షులందరు కూడ ఈ యాగమును ప్రారంభం చేశారు. అక్కడికి సూతమహర్షి విచ్చేశారు.

ఒక కోయిల వచ్చిందనుకోండి – దానిని మనం పాట పాడాలని కోరుకుంటాము. ఒక నెమలిని చూసినట్లయితే అది ఒక్కసారి పురివిప్పితే బాగుండును అనుకుంటాము. ఎందుచేత అంటే పురివిప్పి ఆడుతున్న నెమలి అందంగా వుంటుంది. సూతుడు కనపడినప్పుడు ’అయ్యా, భగవంతుడి గురించి నాలుగు మాటలు చెప్పండి’ అని అడగకపోతే అలా అడగని వాడు చాలా దురదృష్టవంతుడు. సూతుడు పురాణవాజ్ఞ్మయము అంతా తెలిసి ఉన్నవాడు. అటువంటివాడు వచ్చినప్పుడు ఆయన దగ్గర పురాణములలో ఉండే విశేషములను, హరికథామృతమును తెలుసుకొని గ్రోలాలి.

అందుకని శౌనకాది మహర్షులు సూతుడిని అడిగారు – ’అయ్యా, నీవు రోమహర్షణుని కుమారుడవు. నీకు పురాణములలో ప్రతిపాదింపబడిన విషయములు అన్నీకూడా తెలుసు. శుకబ్రహ్మచేత ప్రవచనము చేయబడిన భాగవతము నీకు కరతలామలకము. అందులో హరినామములు, హరిభక్తి, హరికథామృతము, విశేషంగా ప్రవచనం చేయబడ్డాయి. ఏ భగవంతుని గుణములు వినడం చేత వేరొకసారి పుట్టవలసిన అవసరము కలుగదో, ఏ భగవద్భక్తికి సంబంధించిన కథలను వినితీరాలో, అటువంటి విషయములను కలిగి ఉన్న గ్రంథము భాగవతము. అటువంటి పురాణమును మాకు వివరించవలసినది. అసలు జన్మనెత్తవలసిన అవసరంలేని పరమాత్మ కృష్ణభగవానుడిగా ఎందుకు జన్మించాడు? అందునా వసుదేవునికి కుమారుడిగా ఎందుకు జన్మించాడు? అన్ని అవతారములలో వచ్చినట్లుగా కాకుండా అర్ధరాత్రివేళ కారాగారంలో ఆ దేవకీ వసుదేవులకు ఎందుకు జన్మించాడు? కంసుడిని ఎందుకు వధించాడు? తాను వచ్చిన అవతార ప్రయోజనమును నెరవేర్చడంలో అంత విడంబము చేస్తూ, అంతకాలంపాటు భూమిమీద తాను ఉండి శత్రుసంహారం చేసి జరాసంధుడివంటి రాక్షసులను సంహరించడంలో చాలా ఆశ్చర్యకరమయిన లీల ప్రదర్శిస్తాడు భగవానుడు.’

’కన్నులు తెరువని కడు చిన్నిపాపడై దానవి చనుబాలు ద్రావి చంపె’

’కనురెప్ప పైకెత్తడం కూడా సరిగ్గా చేతకాని వయస్సులో ఉన్న కృష్ణపరమాత్మ పూతన పాలుతాగి పూతనాసంహారం చేశారు. అటువంటివాడు జరాసంధుడికి పదిహేడుమార్లు అవకాశం ఇచ్చాడు. పదిహేడుమార్లు జరాసంధుడు దండెత్తి వచ్చాడు. పదిహేడుమార్లూ జరాసంధుడిని ఓడించి వదిలేశాడు తప్ప చంపలేదు. పద్దెనిమిదివ మారు జరాసంధుడు దండెత్తి వచ్చాడు, కృష్ణుడు పారిపోయాడు. యుద్ధంలో జరాసంధుడిని నిర్జించలేదు. కృష్ణ లీలలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. ఇంతమంది రాక్షసులను మట్టుపెట్టినవాడు జరాసంధుడిని మట్టుపెట్టలేడా? జరాసంధుడు కనపడినప్పుడు ఎందుకు పారిపోయాడు? ఈ లీలలు మాకు వినిపించవలసింది ఎన్ని కోట్ల జన్మములనుండియో భగవంతుని కథను విస్మృతిపొందడం చేత మేము మళ్ళీ మళ్ళీ అనేక యోనులయందు తిరుగుతున్నాము. ఇన్నాళ్ళకు మాకు భాగవతకథా శ్రవణం చేసే అదృష్టం పట్టింది. అందుచేత మహానుభావా, శుకమహర్షీ! ఆ భగవత్కథలను కలిగినటువంటి అమృత స్వరూపము కనుక దానికి భాగవతము అని పేరు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 2 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం - by Vikatakavi02 - 04-08-2019, 10:03 PM



Users browsing this thread: 7 Guest(s)