Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#5
పోతనగారు భాగవతమును ఆంధ్రీకరిస్తూ మొట్టమొదట ఒక పద్యం చెప్పుకున్నారు.

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్!!


పోతనగారి శక్తి ఏమిటో పోతనగారి ఉపాసనాబలం ఏమిటో మీరు ఆ పద్యములలో చూడాలి. అసలు నిజంగా ఆ పద్యం నోటికి వచ్చిందనుకోండి – మీరు ఆ పద్యమును ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారనుకోండి – ఆ పద్యం ఒక్కటి చాలు – మీ జీవితమును మార్చేస్తుంది. ’ఈ భాగవతమును ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను? ఈ భాగవతమును ఆంధ్రీకరించి రాజులకు గాని లేక ఎవరో జమీందారులకు ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేను ఏదో పాముకోవాలనే తాపత్రయం నాకు లేదు’ అన్నారు. ఈశ్వరుడి గురించి చెప్పుకున్నారు. కైవల్యము అనుమాట అద్వైత సాంప్రదాయమునకు చెందింది. కైవల్యము అంటే ఇంక మళ్ళీ తిరిగిరావలసిన అవసరం లేకుండ ఈశ్వరునిలో కలిసిపోవడం. అలా ’ఈశ్వరుడియందు నా తేజస్సువెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి. అలా కలిసిపోవడానికి గాను నేను ఆయనను ధ్యానము చేస్తున్నాను” అన్నారు. రామచంద్రమూర్తి రచింపజేస్తున్నారు. కాబట్టి చెయ్యి పోతనగారిది. ఆ చేతిని కదిపిన శక్తి రామచంద్రమూర్తిది.

పరమాత్మ లోకములను రక్షించుటను ఆరంభించినవాడు. లోకరక్షణము అసలు సృష్టించడంలో ప్రారంభం అవుతుంది. కాబట్టి ’ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను’. లోకమునంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు. అదేపనిగా ఆయనపెట్టిన అన్నం తిని, ఆయన జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుడిని తిట్టేవాని యందు కూడ ఈశ్వరుడు శక్తిరూపంలో ఉంటాడు. కాని తనను నమ్ముకొనిన వాళ్ళని, ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి పూనికతో వున్నవాళ్ళను రక్షించడం కోసం ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెడుతూ ఉంటాడు. ఈశ్వరుడు అలా పరుగెత్తే లక్షణం ఉన్నవాడు. దానవుల ఉద్రేకమును స్తంభింపజేయువాడు. రాక్షసులందరికీ చావులేదని అనుకోవడం వలననే వారికి అజ్ఞానం వచ్చేసింది. ’ఈలోకములనన్నిటిని లయము చేస్తున్నవాడు ఎవడు ఉన్నాడో వానికి నమస్కరిస్తున్నాను.’ ఇందులో ఎవరిపేరునూ పోతనగారు చెప్పలేదు. ఆయన పరబ్రహ్మమును నమస్కరిస్తున్నారు. ’సృష్టికర్తయై, స్థితికర్తయై, ప్రళయకర్తయైన పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను. కేవలం తన చూపులచేత లోకములనన్నిటిని సృష్టించగల సమర్ధుడు ఎవరు వున్నాడో వానికి నేను నమస్కరిస్తున్నాను.’ భాగవతంలో పరబ్రహ్మంగా కృష్ణభగవానుడిని ప్రతిపాదించారు. కాని ఇక్కడ కృష్ణుడని అనడం లేదు. ’మహానందాంగన’ అని ప్రయోగించారు. వానిని గురించి నేను చెపుతున్నాను. వాడు చిన్న పిల్లవానిలా కనపడుతున్నాడు. కాని వాడు పరబ్రహ్మ అందుకని వానికథ నేను చెప్పుకుంటున్నాను’ అన్నారు.
ఇంతేకాదు. అందులో ఒక రహస్యం పెట్టేశారు. పోతనగారిలా బతకడం చాలాకష్టం. పోతనగారి ఇలవేల్పు దుర్గమ్మ తల్లి. పోతనగారు తెల్లవారు లేచి బయటకు వస్తే విభూతి పెట్టుకుని రుద్రాక్షలు మెడలో వేసుకొని రుద్రాక్షలు కట్టుకుని ఉండేవారు. నోరు విప్పితే ఆయన ఎల్లప్పుడూ నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు. పోతనగారు ఎంతవిచిత్రమయిన మాట వాడతారో చూడండి –

'కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానాకంజాత
భవాండకుంభకు మహానందాంగనా దింభకున్'

అన్నారు. 

ఎవరు ఈ మహానందాగనా? మీరు ఇంకొకరకంగా ఆలోచించారనుకోండి – మనం పొందే ఆనందమును శాస్త్రం లెక్కలుకట్టింది. ఆనందమును శాస్త్రం నిర్వచనం చేసింది. ఏదో మనుష్యానందము, సార్వభౌమానందము, దేవతానందము అని ఇలా చెప్పిచెప్పి చివరకు ఆనందము గొప్పస్థితిని ’మహానందము’ అని చెప్పింది. ఈ మహానందము అనేమాట శాస్త్రంలో ఎవరికి వాడారు? శ్రీ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలో అమ్మవారికి వాడారు. అమ్మవారికి ’మహానందమయి’ అని పేరు. అమ్మవారి డింభకుడు కృష్ణుడు అంటున్నారు. ఎలా కుదురుతుంది? అమ్మవారి కొడుకుగా కృష్ణుణ్ణి ఎక్కడ చెప్పారు? మీరు లలితా సహస్రమును పరిశీలిస్తే అందులో

’కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః’

ఎదురుగుండా ఉన్న భండాసురుడు పదిమంది రాక్షసులను సృష్టించాడు. మళ్ళీ రావణాసురుడుని, హిరణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిని సృష్టించాడు. వాళ్ళు పదిమంది మరల పుట్టాము అనుకొని యుద్ధానికి వస్తున్నారు. వారిని అమ్మవారు చూసి ఒకనవ్వు నవ్వింది. వారికేసి ఒకసారి చెయ్యి విదిల్చేసరికి ఆమె రెండుచేతుల వేళ్ళ గోళ్ళనుండి దశావతారములు పుట్టాయి. పుట్టి మరల రాముడు వెళ్ళి రావణుణ్ణి చంపేశాడు. కృష్ణుడువెళ్ళి కంసుడిని చంపేశాడు. అలా చంపేశారు కాబట్టి ఇపుడు శ్రీమహావిష్ణువు అవతారములు అన్నీ ఎందులోంచి వచ్చాయి? అమ్మవారి చేతి గోళ్ళలోంచి వచ్చాయి. కాబట్టి ’శ్రీమహావిష్ణువు మహానందమయి కుమారుడు. మహానందమయి డింభకుడు. అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను’ అన్నారు. ఎందుకు అంటే ఆయన స్వరూపం మహానందం. ఆయన పేరు కృష్ణుడు. నిరతిశయ ఆనందస్వరూపుడు.

పోతనగారు భాగవతమును అంతటినీ రచించి ఒక మంజూష యందు పెట్టారు. ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతమును రచించానని కూడ చెప్పలేదు. ’ఇది రామచంద్రప్రభువు సొత్తు – దానిని రామచంద్రప్రభువుకి అంకితం ఇచ్చేశాను’ అని అన్నారు. కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథములను పూజామందిరంలో పెట్టమన్నారు. ఆ తాళపత్ర గ్రంథములు పూజామందిరంలో పెట్టబడ్డాయి. కొంత కాలమయిపోయిన తరువాత పోతనగారి కుమారుడు పెద్దవాడయిపోయి అనారోగ్యం పాలయ్యాడు. అతడు తన శిష్యుడిని పిలిచి ’మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజూషలో ఉంది. దానిని జాగ్రత్తగా చూడవలసింది’ అని చెప్పాడు. తరువాత కొద్ది కాలమునకు అందులోంచి నాలుగయిదు చెదపురుగులు బయటకు వస్తూ కనపడ్డాయి శిష్యునికి. అపుడు ఆ శిష్యుడు మంజూషను తీశాడు. తీసిచూస్తే అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతం ఉంది. ఇంతగొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథములకు ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితంలో ఎప్పుడూ తను ఇంత గొప్ప విషయమును రచించానని బయటకు చెప్పుకోలేదు. అదీ పోతనగారంటే! ఆ మహానుభావుడు అంత నిరాడంబరుడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 3 users Like Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం - by Vikatakavi02 - 03-08-2019, 07:24 PM



Users browsing this thread: 1 Guest(s)