18-05-2026, 07:36 AM
. ఏజెంట్ రూహి వాసుదేవ్...13
రూహి, అయాన్ చైనా వారి స్థావరానికి వెళ్ళిపోయాక వంశీ, పార్వతి ఓ వ్యాన్ లోనే ఉంటున్నారు. రూహి చేతికి ఉన్న ఉంగరం ద్వారా తను ఎక్కడున్నది ఎప్పటికప్పుడు తమకు తెలుస్తూనే ఉంది. కాబట్టి వీరు కూడా ఆ స్థావరానికి కాస్త దూరం లో మాటు వేసి ఉన్నారు. లోపల ఏమైందో, రూహి ఎలా ఉందో అనే టెన్షన్ వారిలో చాలా ఉంది. కానీ వారికి అప్పజెప్పిన పని సక్రమంగా చేయాలని కంటికి రెప్పలా ఆ చైనా సైనికుల మీద ఓ కన్ను వేసి ఉంచారు.
అప్పుడే వారికి మరో విషయం తెలిసింది. చైనా అధ్యక్షుడు ఆగష్టు 15 వ తేది న మన భారతదేశాన్ని సందర్శించడానికి వస్తున్నాడు అని. అదే రోజున చైనా వారు మన దేశం మీద దాడి ప్లాన్ చేసారు. అలాంటి సమయం లో అదే రోజు అతను ఇండియా రావడం అనేది ఎందుకో వారికి అసలు అర్థం కాలేదు. వెంటనే ఈ సమాచారం రూహి కి చేర వేయాలి అనుకున్నారు. కానీ రూహి వెళ్లే ముందే చెప్పింది. నేను చెప్పేదాకా నన్ను కలవడం కోసం ఎలాంటి పని చేయకండి అని. అందుకే వీరు రూహి నుంచి వచ్చే కాల్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.
సరిగ్గా అదే సమయం లో... ఒక వ్యక్తి పార్వతి, వంశీ లని రహస్యంగా గమనిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు. బ్లాక్ కోబ్రా బృందం నార్త్ కొరియా లో అడుగు పెట్టిన సమయం నుంచి వీరిని వెంబడిస్తూ ఉన్న వాడు. అతని చూపుల వెనుక ఉన్న మర్మం ఏంటో ఇంకా అంతుచిక్కలేదు.
------------------------------------------------------------
చాంగ్ లీ... చైనా సైన్యాధ్యక్షుడు. పనిలో చాలా క్రూరంగా ఉంటాడు. ఎంతలా అంటే ఏదైనా చిన్న అనుమానం వచ్చినా సరే వారి కళ్ళ ముందే కాళ్ళు, చేతులు, ఆ తరువాత ఒక్కో భాగం నరకుతూ నరకం చూపించి మరీ చంపుతాడు. ప్రాణాలు తీయడం అంటే చాలా సరదా.. అసలు తన ఉద్దేశం లో మనిషి ప్రాణానికి విలువ అంటూ ఉండదు. అతని చుట్టు పక్కల వారు అందరూ అతనిని ముద్దుగా రక్త పిశాచి అని అంటూ ఉంటారు.
అంతటి క్రూరమైన వాడు కాబట్టే, చైనా భారతదేశం మీద చేయబోతున్న ఈ ఉగ్ర దాడి కి అధికారి గా అతనిని నియమించారు. అతడి కనుసన్నల్లో గాలి కూడా అనుమతి లేకుండా లోపలకి రాదు. మొత్తం ఆ పథకానికి సంబంధించిన వివరాలు అన్ని ఓ రహస్య గదిలో దాచాడు. దానిని తెరిచే కీ, మరియు ఫింగర్ ప్రింట్ మాత్రం తన దగ్గరే ఉన్నాయి.
ప్రతి బలవంతుడి పరదా వెనుకా ఎవరికీ తెలియకుండా దాచుకోవాలనుకునే ఓ బలహీనత ఉంటుంది. అలాగే చాంగ్ లీ కి కూడా ఓ బలహీనత ఉంది. అదే అమ్మాయిలు...
అమ్మాయిలు అంటే పిచ్చి. రోజుకొకరు కావాలి అనుకుంటాడు. ఇప్పుడు ఆ బలహీనతనే తన బలంగా చేసుకోవాలి అని రూహి వాసుదేవ్ అనుకుంది.
అనుకున్నదే తడువుగా ఆ రోజు వీరు పని చేస్తున్న సమయంలో చాంగ్ లీ అక్కడికి వస్తే, కావాలనే ఏదో వంక తో తనని తాకుతుంది. కన్ను గీటుతూ, పెదవి మీటుతూ రెచ్చగొట్టింది. కానీ చాంగ్ లీ మాత్రం రూహి ని చూసి చూడనట్టు ఉంటున్నాడు. రూహి రోజంతా వాడి చూపు తన మీద తిప్పుకునే పనిలోనే పడింది.
అదే సమయం లో రూహి చెప్పినట్టుగానే అయాన్, ఎవరూ గమనించకుండా ల్యాబ్ లో నుంచి క్లోరోఫారం ఒక చిన్న గాజు సీసా లో తీసుకొని జేబులో దాచుకున్నాడు.
చూస్తూ ఉండగానే సూర్య కిరణాలు పడమర దిక్కును ముద్దు పెడుతూ తన ఒళ్ళో జారిపోవడం మొదలైంది.
అప్పటికే చాంగ్ లీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ చాంగ్ లీ తప్పక తన వలలో పడతాడు అని రూహి లో మాత్రం నమ్మకం అలాగే ఉంది.
సాయంత్రం అవడం తో అప్పటిదాకా పని చేసిన అందరినీ కూడా తమ పని అయిపోయాక వారి వారి గదులకు వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ అక్కడే ఓ సమస్య ఉంది.
ఆ ల్యాబ్ వదిలి వెళ్లే ముందు అక్కడ చైనా సైనికులు ఒక్కొక్కరిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. వారి కళ్ళు గప్పి ఏ వస్తువు కూడా బయటకు తీసుకొని వెళ్లలేము. అది చూడగానే అయాన్ గుండె వేగం పెరిగిపోయింది. తన జేబులో ఉన్న క్లోరొఫారం బాటిల్ వారికి దొరికిపోతుందేమో అని భయమేసింది. తన ఒళ్ళంతా చమటలు పట్టేసాయి. తనకు ఏదో అవుతుంది అనే భయం కంటే మేడమ్ చెప్పిన పని చేయలేకపోతున్నాను అనే భయమే ఎక్కువగా ఉంది.
సరిగ్గా అప్పుడే తన ముందుకు రూహి వచ్చి నుంచుంది. అయాన్ దగ్గర నుంచి ఆ బాటిల్ తను తీసుకుంది. అయాన్ ఊపిరి బిగబట్టి ఇప్పుడు రూహి దాన్ని ఎలా ఆ గది దాటిస్తుందా అని చూస్తున్నాడు. ఇంతలో రూహి ఇప్పుడే వస్తాను అంటూ ఆ ల్యాబ్ లో ఉన్న బాత్రూం లోకి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా వెంట తీసుకొని వెళ్ళింది.
అప్పటికే ఆ చిన్న సీసా ను ఎలా తీసుకొని వెళ్లాలో రూహి మది లో ఓ ప్లాన్ ఉంది. ఒక్కసారి ఊపిరి బిగబట్టింది.
ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఉన్న కత్తెర తీసుకొని తోడ దగ్గర చిన్నగా కోసింది. ఎర్రని రక్తం చిమ్మింది. పంటి బిగువున ఆ నొప్పిని ఓర్చుకుంది. ఆ సీసా పట్టేంత కోసి, ఆ తరువాత ఆ సీసా ను తన తోడ లోపలకు తోసింది. అలా చేస్తుంటే తన ప్రాణం పోయినంత నొప్పి కలుగుతుంది. తన గుండెల్లో ఎలాగైనా సరే మన భారత దేశాన్ని గెలిపించాలి అని రగులుతున్న జ్వాల ముందు ఆ నొప్పి చాలా చిన్నగా అనిపించింది.
ఇంతలో రక్తం కారడం ఎక్కువ అయ్యింది. వెంటనే తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తో ఆ కోసిన దగ్గర కుట్లు వేసుకొని రక్తం కారకుండా మొత్తం బ్యాండేజ్ తో కట్టు కట్టుకుంది. RAW ఏజెంట్ గా శిక్షణ ఇచ్చే సమయం లో ఇలా శరీరంలో దాచి ముఖ్యమైన వివరాలు ఎలా తీసుకెళ్ల వచ్చో శిక్షణ ఇచ్చారు. అది తనకు ఇప్పుడు ఉపయోగపడింది.
తరువాత నిదానంగా బయటకు వచ్చింది. నడవడానికి చాలా చాలా నొప్పిగా ఉంది. కానీ ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని మామూలుగా నడవడానికి ప్రయత్నిస్తుంది. అడుగు ముందుకు వేసిన ప్రతి సారి గుండెల్లోకి ఓ కత్తి దిగినంత నొప్పిగా ఉంది. కానీ పిడికిలి బిగించి ఓర్చుకుంటుంది. మెల్లగా ల్యాబ్ దాటి బయటకు వెళ్లాలని అటు వైపు నడిచింది. తన వెనుక అయాన్ కూడా బయటకు నడిచాడు.
చైనా సైనికుడు రూహి ని చెక్ చేస్తున్నాడు. తన చేతులతో అక్కడక్కడా కావాలనే తడుతూ చెక్ చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న డిటెక్టర్ ని ఉపయోగించి కూడా చెక్ చేస్తున్నాడు. కానీ రూహి ఆ గాజు సీసా ని తన శరీరం లోపల దాచడం తో అది కూడా కనిపెట్టలేకపోయింది. తరువాత తనని తన గదిలోకి వెళ్ళమని ఆదేశించాడు.
అయాన్ కి ఏమి అర్థం కాలేదు. రూహి ఆ సీసా ని ఎలా తీసుకొని వెళ్ళింది అని. తన చూపు... అప్పటిదాకా రూహి నిలబడి ఉన్న చోటు మీద పడింది. అక్కడ ఎర్రని రక్తం....
అది చూడగానే షాక్ అయ్యాడు. రూహి చేసిన పని అర్థమై కళ్ళలో నీళ్లు తిరిగాయి. దేశం కోసం తను పడుతున్న తపన చూసి గుండె మొత్తం గర్వం తో నిండిపోయింది. కానీ ఇప్పుడు ఆ రక్తం చూస్తే ఆ చైనా సైనికుడి కి అనుమానం రావచ్చు. వాడు అటు వైపు తిరిగి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏ క్షణమైనా చూడచ్చు.. ఎలా ఆ ప్రమాదం ఆపాలా అని ఆలోచించాడు.
అప్పుడే తన పక్కన ఓ గాజు గ్లాస్ కనిపించింది. దాన్ని చూడగానే ఓ ఆలోచన వచ్చింది. వెంటనే కళ్ళు తిరిగినట్టు నటిస్తూ ఆ గ్లాస్ మీద పడ్డాడు. గ్లాస్ పగిలింది, అలాగే అయాన్ ఒంటి మీద కూడా అక్కడక్కడా గాయాలు అయ్యి రక్తం కారింది. అది చూసి మిగతా సైనికులు వచ్చి అయాన్ ని పైకి లేపారు.
ఏమైంది అని అడిగితే కళ్ళు తిరిగాయి అని అబద్దం చెప్పాడు. ఇద్దరూ సైనికులు తనని పట్టుకొని నడిపించుకుంటూతన గదికి తీసుకొని వెళ్లారు. ఇందాక అక్కడ పడిన రక్తం కూడా అయాన్ దే అని అనుకోవడం తో వారికి రూహి మీద అనుమానం రాలేదు.
ఇంకో వైపు... రూహి గదిలోకి రాగానే తన తోడ దగ్గర వేసిన కుట్లు విప్పేసి సీసా బయటకు తీసి, తన గదిలో దాచేసింది. అక్కడ రక్తం ఏరులై పారుతుంది. ప్రాణం పోతున్నట్టు ఉంది. భరించలేని నొప్పి తనలో కలిగింది. నోట్లో తన చొక్కా కుక్కుకొని పెద్దగా అరిచి మౌనంగా ఓర్చుకుంది. కానీ తొందరగా ఆ కాలికి చికిత్స చేయకపోతే చాలా ప్రమాదమని తనకు బాగా తెలుసు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. తను ఉన్న గదిలో ఓ మంచం ఉంది. ఆ మంచానికి ఒక మూల కొంచెం పదునుగా ఉంది. దానికి తన కాలి నుంచి కారే రక్తం కొంచెం రాసి, ఆ తరువాత తన గదిలో ఉన్న అలారం గట్టిగా నొక్కింది.
అలా నొక్కితే చైనా సైనికులు వస్తారు. ఇప్పుడు కూడా ఒక నలుగురు పరుగున వచ్చారు. గదిలోకి రాగానే రక్తపు మడుగులో పడి ఉన్న రూహి కనిపించింది. తన కాలి నుంచి రక్తం కారుతూనే ఉంది
ఏమైంది అని వారు కంగారుగా అడిగారు. మంచం చివర కాలికి తగిలి కోసుకుంది అని అబద్దం చెప్పింది. వారు అక్కడ చూసి తను చెప్పింది నిజమని నమ్మారు. తరువాత తనని ఎత్తుకొని ఆ స్థావరం లోనే ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్లారు. ఆయన వెంటనే తన కాలికి చికిత్స చేసి, కుట్లు వేసాడు. అలాగే రక్తం బాగా పోవడం తో వేరే రక్తం కూడా ఎక్కించాడు. రూహి కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. ప్రాణం పోయేంత నొప్పి తనలో ఉన్నా సరే తన మోహం లో మాత్రం తనకు కావలసింది సంపాదించాను అనే ఆనందం కలిగింది.
భారతదేశాన్ని కాపాడటం కోసం మరో అడుగు ముందుకు వేసాను అనే తృప్తి తో మెల్లగా నిద్రలోకి జారుకుంది.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)