15-05-2026, 06:19 AM
ఏజెంట్ రూహి వాసుదేవ్...7
నార్త్ కొరియా లో రూహి వాసుదేవ్ ని చంపడానికి ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించారు. ఆ రెండిటి వెనుక ఉన్నది ఒకరే అని రూహి కి అర్థమైంది. ఆ వ్యక్తే లీ జాంగ్.. లీజా ఆటోమొబైల్స్ సీఈఓ. ఆ దేశం లోనే అత్యంత గొప్ప సంపన్నుల్లో అతనూ ఒకడు. ఎప్పుడూ అతని చుట్టు చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా వారు తన వెంటే ఉంటారు. అతని అనుమతి లేకుండా, ఆ సెక్యూరిటీని దాటి అతన్ని చేరడం దాదాపు అసాధ్యం. అది తెలిసి బ్లాక్ కోబ్రా బృందం మొత్తం భయపడ్డారు.
"ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయాయి. ఇక మనం అతన్ని ఎప్పటికీ చేరుకోలేము." అంటూ పార్వతి నిరాశగా పలికింది.
"నువ్వు అన్నది నిజమే. లీ జాంగ్ చుట్టు పటిష్టమైన ప్రైవేట్ సైన్యం ఉంది. అనుక్షణం అతన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. వారి కళ్ళు కప్పి అతని దగ్గరకు వెళ్లడం అసాధ్యం." అని వంశీ కూడా అన్నాడు.
"ఒక పని చేద్దాం. వాడినే మన దగ్గరకు ఎత్తుకొని వచ్చేద్దాం."
బృందం మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యి, ఆ మాట పలికిన రూహి వాసుదేవ్ వంక చూసారు. తన కళ్లలో ఎలాంటి బెరుకు లేదు. పైగా శత్రువును ఎంత త్వరగా పట్టుకుంటానా అనే ఆత్రుత కనిపిస్తుంది. తన అణువణువునా ఆత్మ విశ్వాసం మెండుగా తొణికిసలాడుతుంది.
"ఏంటి మేడమ్ మీరు అనేది?" అని వంశీ అడిగాడు.
"అవును. వాడిని ఎత్తుకొచ్చేద్దాం." అని రూహి మరోసారి దృడంగా పలికింది.
తన ధైర్యం చూసి అందరిలో ఆశ్చర్యం కలిగింది. రూహి అవేవి పట్టనట్టు తమకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ని పిలిచింది. అతను లీజా ఆటోమొబైల్స్ లోనే పనిచేస్తున్నాడు. రూహి అతని తో చాలా సేపు మాట్లాడింది. లోపల కంపెనీ ఎలా ఉంటుంది, సీఈఓ ఎప్పుడెప్పుడు వస్తాడు, ఎంత మంది సెక్యూరుటీ ఉంటారు ఇలాంటి చాలా ప్రశ్నలు వేసింది. రూహి రాత్రి తమకు చేసిన సహాయం అతను మర్చిపోలేదు. అందుకే తను అడిగిన ప్రతి దానికి, తనకు తెలిసింది సమాధానం ఇచ్చాడు.
రూహి అతను చెప్పిన దాని ప్రకారం కంపెనీ బ్లూ ప్రింట్ లాంటిది గీసింది. తరువాత ఇంటర్నెట్ లో లీ జాంగ్ గురించి, అతని కుటుంబం గురించి కాసేపు వెతికింది. వాటిని నోట్ చేసుకుంది. అలా లీ జాంగ్ గురించి పూర్తి వివరాలు సేకరించడం తో పాటు, అతని దినచర్యను కూడా ఫాలో అయ్యింది.
మొత్తం అయ్యాక రూహి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టింది. తన మెదుడు పాదరసం లాగా పనిచేస్తుంది. చివరకు ఆ ఆలోచనల్లో నుంచి అతన్ని ఎత్తుకురావడానికి ఒక అద్భుతమైన పథకమైతే సిద్ధం చేసింది.
రూహి బ్లాక్ కోబ్రా బృందం మొత్తాన్ని పిలిచింది. ఎవరెవరు ఏమేమి చేయాలో విడమరచి అర్థమయ్యేలా చెప్పింది. అందరూ తను చెప్పింది శ్రద్దగా విన్నారు.
అంతా చెప్పాక రూహి అందరి వంక చూస్తూ...
"రేపు సాయంత్రమే లీ జాంగ్ కిడ్నాప్ కి ముహూర్తం. ఇది చాలా ప్రమాదకరమైన సాహసమని నాకు బాగా తెలుసు. కానీ దేశం కోసం పని చేసే సైనికుడి కాళ్లకు ముందుకు దూకడమే తప్ప వెనక్కి అడుగు వేయడం తెలియకూడదు. కచ్చితంగా ఈ పోరాటం లో గెలిచి తీరుదాం." అని స్ఫూర్తి నింపింది. తన మాటకు అందరూ గుండెల నిండా శ్వాస పీల్చుకొని సాధిద్దాం అని అరిచారు. తరువాత కాసేపు మాట్లాడి అందరూ ఎవరి గదుల్లోకి వారు చేరారు.
రూహి వాసుదేవ్ మనసులోనే... లీ జాంగ్, నీ మరణం రేపు నిన్ను పలకరిస్తుంది అని అనుకుంది.
ఇంతలో మేడమ్ అనే పిలుపు వినిపించడం తో రూహి ఈ లోకం లోకి వచ్చింది. తల తిప్పి చూస్తే ఎదురుగా అయాన్ ఉన్నాడు. ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగింది.
"రేవు మన మిషన్ లో చాలా ముఖ్యమైన రోజు కదా. మా బామ్మ ఎంతో ఇష్టం తో నాకు ఇది ఇచ్చింది. నాకెందుకో దీన్ని మీకు ఇవ్వాలి అనిపిస్తుంది. ఇది మీ చేతికి ఉంటే విజయం తప్పకుండా మనదే.." అంటూ ఒక త్రిశులం ఉన్న దారం బయటకు తీసాడు.
రూహి అప్రయత్నంగానే చేతిని ముందుకు చాపింది. తనకు ఇలాంటి నమ్మకాలు అస్సలు ఇష్టం ఉండవు. అయినా సరే ఎందుకో ఆ క్షణం అయాన్ కోరిక కు ఎదురుచెప్పలేక పోయింది. అయాన్ తన చేతికి దాన్ని కట్టాడు. రూహి చేతికి ఆ దారం అందంగా అనిపించింది. అయాన్ నవ్వుతుంటే, రూహి తన వంక అలా చూస్తూ ఉండిపోయింది. ఇంతకాలం వేరువేరుగా వారు నడుస్తున్న దారులు రెండు నేడే ఒకటిగా కలిసాయేమో అన్నట్టు ఉండిపోయారు.
వారిరువురి మధ్య భాషకు అందని అందమైన భావం ఏదో మధురంగా ఒదిగిపోయింది. చిరుగాలి అది చూసి మురుస్తూ ఓ చిరునవ్వు విరిసింది. చందమామ సడి చేయక మెల్లగా మబ్బుల చాటుకు చేరిపోయాడు.
వారి గమ్యం ఏటో, ప్రయాణం ఏ చివరకి చేరుతుందో కాలమే నిర్ణయించాలి.
--------------------------------------------------------
తరువాతి రోజు...
లీజా ఆటోమొబైల్స్...
సమయం సరిగ్గా 2:30 గంటలు అవుతుంది. కాసేపటి ముందే భోజనం చేయడం తో అందులో పని చేసే చాలా మంది కాస్త నిద్ర మత్తుగా ఉన్నారు. అందరిలో ఉదయం కనిపించిన చురుకుదనం ఇప్పుడు కనిపించడం లేదు.
సరిగ్గా అప్పుడే కంపెనీ యూనిఫామ్ వేసుకొని, మొహానికి మాస్క్, నల్ల కళ్ళజోడు ధరించిన ఒక వ్యక్తి కంపెనీ ముందుకు వచ్చాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. లోపల చాలా కంగారుగా ఉంది. కానీ అదేమీ కనిపించకుండా, గట్టిగా శ్వాస పీల్చుకొని ముందుకు అడుగువేశాడు.
ఆ కంపెనీ లోపలకు వెళ్ళాలి అంటే అందరూ ముందుగా తలుపు పక్కనే ఉన్న మెషిన్ లో వేలి ముద్ర పెట్టాలి. అది ఆ కంపెనీ లో పని చేసే వ్యక్తిదే అని నిర్దారణ అయితేనే తలుపులు తెరుచుకుంటాయి. అతను కూడా ఆ బయోమెట్రిక్ మెషిన్ మీద చెయ్యి పెట్టాడు. కొన్ని క్షణాల తరువాత తలుపు మెల్లగా తెరుచుకుంది.
అతను నవ్వుతూ లోపలకు అడుగు పెట్టాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, బ్లాక్ కోబ్రా టీం సభ్యుడు అయాన్...
రూహి వారు ఉంటున్న ఇంట్లోని వ్యక్తి వేలిముద్రలు సేకరించి, దాంతో ఒక డూప్లికేట్ వేలు ను తయారు చేసి అయాన్ కి ఇచ్చింది. దాన్ని ధరించిన అయాన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా కంపెనీ లోపలకు అయితే చేరుకున్నాడు. అయాన్ అప్పటికే ఆ కంపెనీ బ్లూ ప్రింట్ చూడటం తో అందులో ఎక్కడ ఏముందో తనకు బాగా తెలుసు.
ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా స్థిరంగా నడుస్తున్నాడు. తను వెళ్ళాల్సింది ఎడమ వైపు. కానీ అటు వైపు వెళ్లకుండా కుడి వైపున ఉన్న వాష్ రూమ్స్ లోకి వెళ్ళాడు. అక్కడ ఒక టాయిలెట్ లోకి వెళ్లి తలుపు వేసాడు. తరువాత వెంట తెచ్చిన టూల్ కిట్ సాయం తో అక్కడ ఉన్న కిటికీ తలుపులు తెరిచాడు. అందులో నుంచి బయటకు రాగానే ఒక వాటర్ పైప్ కనిపించింది. ఒకసారి చుట్టూ చూసాడు. ఎక్కడా ఎవరూ కనిపించకపోవడం తో మెల్లగా ఆ పైప్ పట్టుకొని పైకి ప్రాకాడు. అలా కాసేపటికి ఒక గది దగ్గరకు చేరుకున్నాడు. మెల్లగా ఆ గది ముందున్న వరండా లాంటి చోటుకు దూకాడు.
అది ఆ కంపెనీ లో ఉన్న సర్వర్ రూమ్. దాని ముందు వైపు ఇద్దరు సెక్యూరిటీ వాళ్లు కాపలా ఉంటారు. కానీ వెనుక వైపు మాత్రం ఎవరూ ఉండరు. ఎందుకంటే అటు నుంచి ఎవరూ రారని నమ్మకం. వారి నమ్మకమే ఈరోజు అయాన్ కి బాగా ఉపయోగపడింది. అయాన్ మెల్లగా తన దగ్గర ఉన్న కిట్ సాయం తో కాసేపు కష్టపడి చివరకు ఎలాగోలా ఆ గది తలుపులు తెరిచి లోపలకు వెళ్ళాడు.
అక్కడ చాలా సర్వర్స్ ఉన్నాయి. కంపెనీలో జరిగే మొత్తం డేటా ఇక్కడే స్టోర్ అవుతుంది. కాసేపు అక్కడంతా తిరిగి చివరకు ఒక మెయిన్ సర్వర్ ని కనిపెట్టాడు. దానికి ఒక చిప్ అమర్చాడు. వచ్చిన పని అయిపోవడం తో మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఎలా అయితే లోపలకు వచ్చాడో, అలాగే బయటకు చేరుకున్నాడు. అక్కడ తన కోసం రూహి కారులో ఎదురుచూస్తూ ఉండటం తో ఎక్కి అందులో కూర్చున్నాడు.
"మేడమ్ మీరు చెప్పినట్టుగానే మెయిన్ సర్వర్ కి మీరు ఇచ్చిన చిప్ పెట్టాను. ఇప్పుడు ఏం చేయబోతున్నారు. అసలు ఇంతకీ అదేంటి." అని అడిగాడు.
రూహి నవ్వుతూ...
"ఇప్పుడు మనం ఈ బటన్ నొక్కితే, ఆ చిప్ లో ఉన్న వైరస్ మెయిన్ సర్వర్ లోకి చేరి, మొత్తం సర్వర్స్ అన్ని క్రాష్ అవుతాయి.
తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టి, ఆ తరువాత మొత్తం సర్వర్లు తిరిగి పని చేసేలా చేయాలంటే వారికి కనీసం ఒక రోజైనా సమయం పడుతుంది." అని చెప్పి వెంటనే తన ఫోన్ లో ఉన్న బటన్ నొక్కెసింది.
"ఈ కంపెనీ సర్వర్లు చెడగొట్టడానికి, లీ జాంగ్ ను కిడ్నాప్ చేయడానికి ఏమిటి సంబంధం.." అని అయాన్ ఆశ్చర్యంగా అడిగాడు.
"కాసేపు జరిగేది చూడు. మొత్తం నీకే తెలుస్తుంది.." అని రూహి నవ్వింది.
దాంతో అయాన్ మౌనంగా ఉండిపోయాడు. ఒక అరగంట తరువాత రూహి అక్కడి నుంచి వేగంగా కారును కదిలించింది. దారిలో పార్వతి, వంశీ ఒక చోట నిలబడి ఉన్నారు.
"చెప్పిన పని సరిగ్గా పూర్తి చేసాం మేడమ్" అని వారు సమాధానం ఇచ్చారు. రూహి చిరునవ్వు నవ్వింది.
తరువాత కారును ఒక ఐస్ క్రీం షాప్ దగ్గర ఆపి లోపలకు వెళ్ళి అందరికి ఐస్ క్రీం ఆర్డర్ చేసింది. ఇక్కడ ఇంత పెద్ద మిషన్ చేస్తుంటే రూహి కూల్ గా ఐస్ క్రీం తినడం చూసి షాక్ అయ్యారు. అసలు ఆ లీ జాంగ్ ని ఎలా కిడ్నాప్ చేయబోతున్నారా అని అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది. ఒళ్ళంతా చమటలు పడుతున్నాయి. కాని రూహి ని అడగలేక మౌనంగా ఉండిపోయారు.
అక్కడ అందరూ ఐస్ క్రీం తిన్న తరువాత... రూహి తిరిగి కారును నడుపుతూ ఒక గోల్ఫ్ కోర్ట్ దగ్గర ఆపింది. అందరూ కిందకు దిగారు.
"సరదాగా కాసేపు గోల్ఫ్ ఆడుదామా..." అని రూహి అందరిని చూస్తూ నవ్వుతూ అడిగింది.
ఆ మాటకు బృందం మొత్తం ఆశ్చర్యపోయారు.
"ఏంటి మేడమ్ మీరు. అసలు ఆ లీ జాంగ్ ని ఎలా కిడ్నాప్ చేస్తారా అని ఇక్కడ మేము టెన్షన్ పడుతూ ఉంటే.. మీరు మాత్రం ప్రశాంతంగా గోల్ఫ్ ఆడుదామా అని అడుగుతున్నారు" అని వంశీ అడిగాడు.
దానికి రూహి నవ్వుతూ...
"ఒకసారి అటు చూడండి." అంటూ ఒక గోల్ఫ్ కోర్టు వైపు చూపించింది.
అక్కడ వారికి దూరంగా కొందరి సెక్యూరిటీ మధ్య లీ జాంగ్ గోల్ఫ్ ఆడుతూ కనిపించాడు. అతన్ని చూడగానే అందరికీ ఫ్యూజు లు ఎగిరిపోయాయి. షాక్ లో బిగుసుకుపోయారు. కొన్ని క్షణాలు వారి కళ్ళను వారే నమ్మలేక పోయారు.
"ఇదెలా సాధ్యం మేడమ్ " అని ఆశ్చర్యంగా అడిగారు.
అప్పుడు రూహి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టింది.
"మొదటగా... అయాన్ లీజా ఆటోమొబైల్స్ లోకి అడుగు పెట్టి అక్కడున్న సర్వర్స్ అన్ని క్రాష్ అయ్యేలా చేశాడు. సర్వర్స్ పని చేయకపోతే లీ జాంగ్ అక్కడ ఎలాంటి పని చేయలేడు. దాంతో రాత్రి 7 గంటల దాకా కంపెనీ లో ఉండాల్సిన అతను, మధ్యాహ్నం 3 గంటలకే ఆఫీస్ నుంచి బయటకు వచ్చేలా చేసాం.
సరిగ్గా అదే సమయం లో లీ జాంగ్ భార్యకు ప్రతి బుధవారం మధ్యాహ్నం బ్యూటీ పార్లర్ కి వెళ్లడం అలవాటు. ఈ విషయం తనే ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది. అది చూసే ఆ విషయం తెలుసుకున్నాను. అందుకే పార్వతి కి ఒక పని చేయమని అప్పగించాను. అదేంటంటే లీ జాంగ్ భార్య వెళ్లే పార్లర్ కి ఒక పది మంది కొరియన్ అమ్మాయిలను తీసుకొని వెళ్లమని.. దాని వల్ల ఏం జరిగింది అంటే... ఆ పార్లర్ దగ్గర రష్ పెరిగింది. దాంతో లీ జాంగ్ భార్య ఎక్కువ సేపు అక్కడ ఎదురుచూడాల్సి వచ్చింది.
అప్పటికే సర్వర్లు క్రాష్ అవ్వడం తో, ఇంటికి బయలుదేరిన లీ జాంగ్ కు తన భార్య ఇంటి దగ్గర లేదు, రావడానికి ఆలస్యం అవుతుంది అని తెలిసింది. సరిగ్గా అదే సమయం లో లీ జాంగ్ ఇంటికి వెళ్లే రోడ్డు మీద వంశీ కొంతమందికి డబ్బులు ఇచ్చి కావాలనే ఒక డమ్మీ ఆక్సిడెంట్ ని సృష్టించాడు.
ట్రాఫిక్ జామ్ వల్ల కాసేపు లీ జాంగ్ కారు అక్కడ ఆగాల్సి వచ్చింది. అప్పటికే అసహనంగా ఉన్న లీ జాంగ్ కి ఆ సంఘటన మరింత చిరాకును తెప్పించింది. విసుగ్గా కిటికీ లో నుంచి బయటకు తొంగి చూసాడు. అలా చూస్తాడని నాకు బాగా తెలిసే... వారు ఆగిన చోటుకు బాగా కనిపించేలా ఒక పెద్ద గోల్ఫ్ హోర్డింగ్ పెట్టించాను. దాన్ని చూడగానే లీ జాంగ్ కళ్ళు మెరిసాయి.
లీ జాంగ్ కు గోల్ఫ్ ఆడటం అంటే చాలా ఇష్టం. కానీ ప్రతి రోజు కంపెనీ పనుల్లో బిజిగా ఉండటం తో ఎప్పుడో ఒకసారి ఆడటానికి వెళ్తుంటాడు.
ఈరోజు ఆఫీస్ లేదు.. ఇంటి దగ్గర ఎలాగూ భార్య కూడా లేదు. కాబట్టి సరదాగా గోల్ఫ్ ఆడాలి అనే ఆశ అతనిలో కలిగేలా చేశాను. దాని ఫలితమే... ఇప్పుడు అతను ఇక్కడ నిలబడి ఉన్నాడు." అని రూహి చెప్పడం ఆపి అందరి వంక చూసింది.
అందరూ ఇంకా ఆశ్చర్యం లోనే ఉన్నారు. ఎక్కడో ఆఫీస్ లో ఉండాల్సిన లీ జాంగ్ ను ఇక్కడికి రప్పించిన రూహి అద్భుతమైన తెలివిని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
కాసేపటికి తేరుకొని, ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడమ్ అని అడిగారు.
"పొగ పెట్టి కలుగులో ఉన్న ఎలుకను బయటకు రప్పించాము. ఇక అది బోను లో పడటమే తరువాయి..." అని రూహి స్థిరంగా పలికింది.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)