21-04-2026, 04:11 AM
(This post was last modified: 21-04-2026, 04:12 AM by Raagaa. Edited 1 time in total. Edited 1 time in total.)
ఈ మూడు రోజుల్లో గోపి, జఫర్ ఇద్దరు ఊరంతా తెగ తిరిగేశారు. ఇద్దరి మధ్యా స్నేహం ఇంకా ముదిరింది. జఫర్ ఇంకా ఓపెన్ అయ్యాడు. ఇద్దరు నవ్వుకోవడం, పోట్లాడుకోవడం ఎక్కువైంది. జఫర్‌కి వంటలో సాయం చేస్తున్నాడు గోపి. ఈ ఇద్దరు తెగ తిరగడం కింద ఇంట్లో ఉన్న గీతతో పాటు ఎదురింట్లో ఉన్న హిమజ కూడా గమనిస్తుంది. లేట్ నైట్ వస్తుంటే ఓ రోజు వార్నింగ్ కూడా ఇచ్చింది గీత. శుక్రవారం పొద్దున్నే గోపీ లేచేసరికి తల స్నానం చేసి కూర్చున్నాడు జఫర్. నన్ను కూడా లేపచ్చు కదరా అంటే లేపాను నువ్వు లేవలేదు అన్నాడు.
రేయి నువ్వు మస్జీద్ కి వెళ్ళవా.. శుక్రవారం పక్కా వెళ్తారు కదా.. నువ్వెంటి ఎప్పుడూ ఇంట్లోనే చేస్తావ్!
నాకు అంతమందిలో నచ్చదులే.. అయినా నమాజ్ అక్కడే చెయ్యాలని రూల్ లేదు. నాకు ఒంటరిగా చెయ్యడమే ఇష్టం. ఎక్కువగా దువా చేస్తాను.
అంటే..?
అంటే నేను నా దేవుడితో మాట్లాడుకుంటాను. నాకు కావాల్సినవి అడుక్కుంటాను. కష్టాలు చెప్పుకుంటాను.. అన్నీ..
ఒహ్హ్.. అయితే నేను కూడా నా దేవుడితో మాట్లాడుకోవాలి, మొక్కుకోవాలి.
ఏమని.. నవ్వాడు జఫర్.
తిరుపతి లడ్డు తినాలని మొక్కుకున్నా.. అన్నవరం ప్రసాదం కోసం మొక్కుకున్నా. ఇప్పుడు శబరీ వెళ్లాలని మొక్కుకుంటా అంటే పగలబడి నవ్వాడు జఫర్. దేవుడిని నమ్మవా అని అడిగితే.. నమ్ముతాను కానీ ఏమి అడగను, ఎలాగో నాకేమి ఇవ్వడు. జఫర్ మాట మార్చుతూ ఇంకేం మాట్లాడతావ్ అంటే.. ఏమో మాటలన్నీ నీతోనే మాట్లాడుతున్నా కదరా ఆయనతో ఇంకేం మాట్లాడాలి అంటే ఒకలా చూసాడు జఫర్.
కాఫీ పెడతాను.. అని జారుకున్నాడు.
స్వర్ణ నుంచి మెసేజ్ : ఈ వారం చివరి లోపు నన్ను కలవలేదంటే ఇంకెప్పటికీ నన్ను కలవకు
నిజమే.. వీడితో తిరగడం స్టార్ట్ చేసినప్పటి నుంచి స్వర్ణని అసలు తలుచుకోలేదు. కలిస్తే ముందు పొట్లాడుతుంది అని నావ్వుకున్నాడు.
***
ఇవ్వాళ ప్రాజెక్టు మొదలవుతుంది కదా.. త్వరగా రమ్మని తాతయ్య ఫోన్ చేసాడు అని గోపి అంటే నేనెప్పుడో రెడీ నువ్వే ఇంకా గాడిదలా తొంగున్నావ్ అని జఫర్ నవ్వుతుంటే రేయి అని లేచాడు.. జఫర్ అల్లరిగా బైటికి పరిగెత్తితే గోపి వీడికి ఎక్కువైంది అనుకుంటూ టవల్ అందుకుని స్నానం చేసి వచ్చాడు. ఇద్దరికీ కాఫీ పెట్టి ఎదురు చూస్తున్నాడు జఫర్. తాగేసి చెప్పులు వేసుకుని గది తాళం వేస్తుంటే జఫర్ కడుపు పట్టుకున్నాడు. అనుమానంగా గజ్జల్లో చెయ్యి పెట్టి నొక్కి చూసాడు. ఒంటికి ఏమవుతుందో అర్ధమైంది.
ఏమైందిరా!
నాకు ఒంట్లో బాలేదు, నువ్వెళ్లు
అదేంటి ఇవ్వాళ నీకు ఇంపార్టెంట్ కదా..
నా వల్ల అవ్వదు. అయినా నువ్వు ఉన్నావుగా.. నువ్వెళ్లు అన్నాడు జఫర్.
పోనీ కాసేపు ఆగి వెళదామా.. లేదంటే హాస్పిటల్ కి వెళదామా?
వద్దు. ముందు తాళం తెరువు అంటే గోపీ తాళం తీసాడు. జఫర్ వెంటనే నడుము చుట్టు టవల్ కట్టుకుని బాత్రూంలోకి దూరాడు. పది నిమిషాలు గడిచినా జఫర్ బైటికి రాలేదు. రేయి వస్తున్నావా లేదా అని గోపి అడిగితే నువ్వెళ్లు.. ఇవ్వాళ నేను రాను అనేసరికి గోపి తాతయ్యకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సరే నువ్వు వచ్చేయి అన్నాడు రాజారావు. గోపి జఫర్‌కి చెప్పేసి ఒక్కడే వెళ్ళిపోయాడు.
***
ఎండలో ఆటో దిగి ఇంటికి నడుస్తుంది హిమజ. పిల్లాడి కాలేజ్ ఫీజు కట్టి వస్తుంది. ఎండకి, ఒంటికి పట్టిన చెమటకి అసహనంగా నడుస్తుంటే మెడికల్ షాపులో జఫర్ కనిపించి నడక వేగం తగ్గించింది.
అన్నా పేపర్లో కట్టి ఇవ్వరా అని అడిగితే అలాగే ఇచ్చాడు మెడికల్ షాపు వాడు. అది తీసుకుని బ్యాగులో పెట్టుకుని వెళుతుంటే అప్పటికే అదేంటో అర్ధమైన హిమజ నిర్ధారించుకోవడానికి మెడికల్ షాపు లోకి వెళ్ళింది.
చెప్పండి మేడం
ఇప్పుడు ఒకబ్బాయి వచ్చాడు కదా.. అతనేం తీసుకెళ్లాడు ?
వాళ్ళ అక్కగారికి ప్యాడ్స్ మేడం.. మీరెవరు?
నేను వాళ్ళ ఎదురింట్లోనే ఉంటాను. నాకూ తీసుకురమ్మని చెప్పారు అందుకే..
అయితే తను తీసుకెళ్లాడు మేడం.
హిమజ బైటికి వచ్చింది. అప్పటికే జఫర్ వెళ్ళిపోయాడు. హిమజ వేగంగా ఇంటికి నడిచి వెళ్లేసరికి జఫర్ తన గది తలుపులు వేసుకోవడం చూసి వేగంగా గేటు తీసుకుని గీత ఇంటి తలుపు కొట్టింది. రెండో సారికి తలుపు తీసింది గీత. ఎదురుగా హిమజని చూసి ఏంటీ ? అని అడిగింది. ఏదో విషయం లేకపోతే హిమజ తన ఇంటి తలుపు తట్టదని గీతకి తెలుసు.
పైన ఆ పిల్లోడు మెడికల్ షాపులో వాళ్ళ అక్కకి అని చెప్పి ప్యాడ్స్ కొనడం చూసాను.
ఎహె ఊరుకో..
నిజమే.. పరిగెత్తుకుంటూ వచ్చి పైకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.
ఎవరికైనా తీసుకున్నాడేమో !
హిమజ ఒప్పుకోలేదు. చూస్తే తప్పేంటి. నాకేదో తేడా కొడుతుంది వాడి విషయంలో.. పైగా సాయిబుల పిల్లోడు. చుస్తున్నావుగా ఈ మధ్య ఏం జరుగుతుందో.. మొన్న కాశ్మీర్లో అందరిని కాల్చేశాడు ఒకడు. గోపీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అలా ఏం జరగదులేవే అంటే హిమజ కొట్టేస్తూ మళ్ళీ చూస్తే తప్పేంటి అంది. హిమజ వినేలా లేదని సరే పదా అని తన వెనకే వెళ్ళింది. ఇద్దరు పైకి వెళ్లి తలుపు కొడితే ఎవరూ అన్న జఫర్ గొంతు విని నేనే అంది గీత.
ఓ సారి తలుపు తెరువు అంది హిమజ తలుపుని నెడుతూ.. పది నిమిషాలు ఆంటీ అన్నాడు జఫర్. ఇప్పుడే తెరువు అంది హిమజ. అయినా తెరవలేదు. గీత వదిలెయ్యవే అని చెపుతున్నా వినలేదు హిమజ. తలుపు కొడుతూనే ఉంది. నువ్వు తలుపు తెరవకపోతే సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేస్తాను అని బెదిరించేసరికి జఫర్ భయపడి తలుపు తెరిచాడు. ఎదురుగా టవల్లో ఉన్న జఫర్‌ని చూసారు ఇద్దరు. గీత స్పష్టంగా గమనించింది, టవల్ కింద పాదం దెగ్గర ఎర్రగా రక్తం. కాళ్ళ మీద వెంట్రుకలు లేవు. హిమజ అంతే వేగంగా టవల్ లాగేసింది. జఫర్ నిజం బయట పడిపోయింది. తొడల మధ్య రక్తం చూడగానే హిమజకి, గీతకి ఇద్దరికీ అర్ధమైంది జఫర్ మగాడు కాదని. జఫర్ కళ్ళలో భయం, కంగారు, అవమానం జరిగిన బాధని చూడగానే గీత వెంటనే టవల్ అందుకుని నడుము చుట్టు చుట్టి ప్యాడ్స్ ఎక్కడా అని అడిగితే తల దించుతూ చెయ్యి ఎత్తి చూపించింది. గీత హిమజా.. అంటే హిమజ ప్యాకెట్ చించి గీతకి ఇచ్చింది.
గీత దెగ్గరుండి బాత్రూంకి తీసుకెళ్లి సాయం చేసింది. అంతా అయ్యాక జఫర్ బట్టలు వేసుకున్నాడు. మంచం మీద కూర్చుంటే ఇద్దరు చెరో వైపు తన పక్కన కూర్చున్నారు. గీత తన భుజం మీద చెయ్యేస్తే తల ఎత్తి చూసింది జఫర్.
గోపికి తెలుసా తెలీదా అని అడిగితే తెలీదని తల ఊపింది. హిమజ, గీతా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.
ఎందుకిలా అని అడిగితే చెప్పింది. ఆ సమాధానం హిమజకి, గీతకి ఇద్దరికీ నచ్చింది. నీ నిజం బైటికి రాదులే కంగారుపడకు అంటే జఫర్ కృతజ్ఞతగా చూసింది. హిమజ మంచినీళ్లు తెచ్చి ఇస్తే తాగి థాంక్స్ చెప్పింది. కాసేపు ఊరికే కూర్చున్నారు. హిమజ లేచి బండలు తుడిచింది.
గీత నవ్వితే జఫర్ కూడా చిన్నగా నవ్వింది. అయితే గోపీని ఎర్రి పప్పని చేస్తున్నావన్నమాట అని హిమజ నవ్వితే ఇద్దరూ నవ్వారు. గీత అనుమానంగా వాడికి మరీ అమ్మాయికి అబ్బాయికి తేడా తెలీదా! అని అడిగితే గోపీ ఇప్పటివరకు ఒంటరిగానే ఉన్నాడని, అమ్మా నాన్న ఉన్నా లేనట్టేనని రాజారావు ద్వారా, గోపీ ద్వారా తను విన్నది చెప్పింది. ఇద్దరు ముందు గోపీ కోసం బాధ పడ్డా మళ్ళీ జఫర్‌ని చూసి నవ్వారు. గోపీకి తెలిసినప్పుడు వాడి మొహం చూడాలి అంది నవ్వుతూ.. జఫర్ కూడా నవ్వేసింది.
జఫర్ అని పిలిస్తే తల ఎత్తి చూసింది.
నీ అసలు పేరేంటి ?
జఫర్ నుంచి వచ్చిన స్పష్టమైన అమ్మాయి గొంతు విన్నారు గీత, హిమజ.
నా పేరు ****


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)