Poll: అమలిన శృంగార కథలు
You do not have permission to vote in this poll.
కావాలి
100.00%
1 100.00%
వద్దు
0%
0 0%
Total 1 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అమలిన శృంగార కథలు - శ్రీమతి డైరీ
#8
కథ ముగిసింది - Raja Mohan Ivaturi
[Image: k.jpg]

దిలీప్ తన ఊరికి వస్తున్నానని ఉత్తరం వ్రాసాడు. ఆ ఉత్తరం చదువుతూ కసిగా పళ్ళు కొరుక్కుంది సుందరి. "ఇప్పుడెందుకు వస్తున్నాడు? అసలు ఇంకా నాతో ఇతనికి ఏమిటి పని?" అనుకుంది.
ఎర్రబడిన ముఖంతో రకరకాల మనోభావాలతో రగిలిపోతున్న సుందరిని చూసి "ఏమే నీ మిత్రుడు ఈసారి ఏంరాసాడు?" అని అడిగింది సీమ. ప్రసార మాధ్యమాలతో వ్యాపారం చే సే సుందరి స్వంత సంస్థ లో ఉన్నత సలహాదారు మాత్రమే కాక సుందరి చిన్ననాటి స్నేహితురాలు కూడా కావటం వలన సీమ కి ఆఫీస్ తో పాటు కాక సుందరి తాలూకు వ్యక్తిగత విషయాలూ తెలుసు.
దిలీప్ రెండు రోజులకొకసారి ఇమెయిల్ లో స్కాన్ చేసిన ఉత్తరం పంపిస్తాడు. అతనికి ఇప్పటికీ ఉత్తరాలు రాసే అలవాటు ఉండటం వలన ముందు ఉత్తరం స్వహస్తాలతో రాసి ఆ ఉత్తరాలని స్కాన్ చేసి పంపిస్తాడు. ఆ ఉత్తరాలలో వాళ్లిద్దరూ ఇక్కడ కలిసి ఉన్నప్పటి జీవితంలోని జ్ఞాపకాలు తలుచుకోవడం తప్ప మరేమీ ఉండేది కాదనీ అతను దూరదేశాలకి వెళ్ళాక సుందరిలో అసహనం మరింత పెరిగిందనీ ఈ ఉత్తరాల వలన ఆమె బాధ ఇంకొంచెంపెరగటం తప్ప ఆమెకి ఏమీ స్వాంతన చేకూరటం లేదని ఆమెకెంతో సన్నిహితమైన సీమ కి తెలుసు.
సీమ ప్రశ్నకి సమాధానంగా "వాడు ఇక్కడికి వస్తాడట" అని కసిగా అంది సుందరి.
"నిజమా? అది మంచి విషయమే కదా?" అంది సీమ.
సుందరి తన తల కొట్టుకుంది. "ఎందుకు ఇతను నన్ను హింసిస్తున్నాడు?" అని మనసులోనే అనుకుంటుంటే "ఎందుకే అంత కోపం? అతను వస్తే ముఖం మీదే అన్నీ మాట్లాడుకోవచ్చు కదా?" అంది సీమ.
"నా నెత్తి. అతనితో ముఖాముఖీ కొత్తగా మాట్లాడుకునేదేముంది? ఇన్నేళ్లు ఇక్కడే ఉన్నాడు కదా? ఏడాది క్రితమే కదా వెళ్ళింది?" అరిచినట్టు చెప్పింది సుందరి.
"అదీ నిజమే" నిట్టూర్చింది సీమ. సుందరి మానసిక పరిస్థితి చూసి మౌనంగా ఉన్న సీమతో మళ్ళీ సుందరే అంది "వచ్చినప్పుడు నా ఇంట్లోనే ఉంటాడట" అంది.
సుందరి తో ఇంత వరకూ జరిగిన అనుభవాలతో సీమ ఎక్కువ మాటాడకుండా "అలాగా?" అని ఊరుకుంది.
"అతని సొంతిల్లు అనుకున్నాడా? ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి?" అని మళ్ళీ పళ్ళు కొరికింది సుందరి.
సీమ అవున్నిజమే అన్నట్టు హు అని నిట్టూర్చి అక్కడనుంచి తన సీట్ దగ్గరికి వెళ్ళింది.
దిలీప్, సుందరి, సీమ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. సుందరి ఎదురింట్లోనే ఉండే దిలీప్ తండ్రి బొగ్గు గనులలో పనిచేసే ఒక దిగువ మధ్య తరగతికి చెందిన వాడయితే సుందరి వాళ్ళ నాన్న ఆర్థికంగా ఒకటి రెండు మెట్లు పైన ఉండేవాడు. ఆ అంతరం పట్టించుకోకుండా పెద్ద వారిద్దరూ స్నేహంగా ఉండటంతో సుందరి దిలీప్ ల మధ్య కూడా స్నేహం పెరిగింది. తండ్రితో పాటు బొగ్గు గనులలో సాయం చేస్తూ చదువుకుంటున్న దిలీప్ స్వతహాగా చాలా భావుకుడు.
వాడి చదువు వాడు చదివేసుకునేవాడు గానీ మామూలు వ్యవహారాలకి సంబంధించిన అంశాలలో సుందరి సాయం లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేకపోయేవాడు. ఎప్పుడు మొదలయ్యిందో గుర్తు లేదు గానీ తనకి తెలిసినంత వరకూ దిలీప్ ఒక్క సారి కూడా కనీసం ప్రయత్నం కూడా చెయ్యకుండా తన వ్యవహారాలన్నీ సుందరికి వదిలేసే వాడు. చిన్నప్పుడే వాడి చదువులో భాగంగా బడిలో ఎన్నో రకాల లావాదేవీలు తమ చేత చేయమని టీచర్లు చెప్పినపుడు వాడికి ఏంచెయ్యాలో తెలిసేది కాదు. బాంకుకి వెళ్లి ఒక చలాన్ కట్టి రమ్మని గురువుగారు అడిగితే అందరూ చకచకా చేసుకు వచ్చేసేవారు. వీడు మాత్రం సుందరి దగ్గరికి వచ్చేవాడు. సుందరి కూడా వాడి వయసు లోనే ఉన్నా పెద్ద ఆరిందాలా వాడిని తీసుకెళ్లి వాడిచేత ఒక్కొక్క పనీ చిలక్కి చెప్పినట్టు చెప్పి చేయించి ఆ చీటీని గురువుగారికి ఇప్పించేది. తపాలా కార్యాలయానికి వెళ్లి రకరకాల తపాలా బిల్లలకి డబ్బులిచ్చి సరైన చిల్లరతో రావటం ఒక పరీక్షయితే వాడికి ఎంత డబ్బులివ్వాలి ఎంత చిల్లర తెచ్చుకోవాలి లెక్కలు తెలిసినా ఆ పని చేసుకురావటం మాత్రం తెలిసేది కాదు. మళ్ళీ మామూలే. "సుందరీ! ఇదేదో చేసి పెట్టు" అని తనువచ్చేవరకూ ఆమె ఇంటి అరుగు మీద కూర్చునే వాడు. "సుందరీ. ఈరోజు గురువుగారు రకరకాల పప్పులు తెచ్చుకురమ్మన్నారు. నాకు కూడా నువ్వే తెచ్చేయ్" అనేవాడు. వాడు చెప్పాడు కనుక తన ఇంట్లోంచి రకరకాల పప్పులు వాడికోసం కూడా పొట్లాలు కట్టి ఇస్తే వాడు గురువుగారికి తన వంతుగా చూపించేవాడు. మెల్లిగా ఇంటర్మీడియట్ పరీక్ష కి కావలసిన అప్లికేషన్ నింపటం అతనికి కావలసిన సర్టిఫికెట్లు వగైరా సద్దుకుని అతని చేత సబ్మిట్ చేయించటం ఆ తర్వాత ఇంకా ఇంకా పెద్ద పనులలో కూడా సుందరే వాడి బాధ్యత తీసుకోవటం జరిగిపోయాయి.
అలా అని వాడు తెలివి తక్కువ వాడేమీ కాదు. చదువులో ఎప్పుడూ మొదట ఉండే వాడు. ఎవ్వడికైనా సాయం చేసేవాడు. డబ్బు కి సంబంధించని విషయాలలో వాడు అందరికీ సహాయం చేసేవాడు. పెద్ద చదువుల్లో వర్క్ షాప్ అనీ వేరే ప్రాక్టికల్స్ లోనూ వాడు తన క్లాసుమేట్ లందరికీ సాయం చేసేవాడు. చెక్కలని కోసి కుర్చీగానో బల్లగానో చేసే లాంటి పనులు వాడు అందరికంటే ముందే పూర్తి చేసి మరో ఇద్దరు ముగ్గురికి చేసి పెట్టేవాడు. తండ్రితో పాటు వృత్తి పనులు చేసిన అనుభవం వాడికి బాగా పనికొచ్చేది. అందుకు ప్రతిఫలంగా కొందరు ఏమయినా ఇచ్చే ప్రయత్నం చేస్తే తీసుకునేవాడు కాదు. "నాకు కూలీ ఇవ్వకండిరా." అనేవాడు. సాయం చేసే ఆ గుణం కూడా వాడితోనే పెరిగి వాడి సమర్ధత పెరిగినకొద్దీ ఇంకా ఇంకా సహాయం చేస్తూనే వుండే వాడు. ఇవన్నీ ఎలా చేసినా తనకి సాయం కావాలంటే మాత్రం దిలీప్ చేరేది సుందరి దగ్గరికే.
వారిద్దరి స్వచ్ఛమైన స్నేహం వారితో పాటే పెరిగి ఇంకా ఇంకా గాఢంగా మారి ప్రతితోజూ దిలీప్ సుందరిని చూడకుండా రోజు గడిపేవాడే కాదు.
చదువు పూర్తయ్యి దిలీప్ కి ఒకేసారి అయిదు చోట్ల ఉద్యోగాలు వస్తే అందరూ ఆరోజులలో కథలుగా చెప్పుకున్నారు. బెంగుళూరులో పనిచేయవలసిన ఉద్యోగం అన్నివిధాలా ఆకర్షణీయంగా ఉన్నా దిలీప్ విశాఖలోనే తన తండ్రి ఉద్యోగం లో చేరిపోయాడు. సుందరి దగ్గరికి వచ్చి తన నిర్ణయాన్ని చెప్తూ "సుందరీ! నా చదువు కథ ముగిసింది. ఇక ఉద్యోగంతో కొత్త జీవితం" అన్నాడు.
సంభాషణ కొనసాగిస్తూ "నేనే ఆయన ఉద్యోగంలో చేరితే తప్ప నాన్న ఆ ఉద్యోగం మానరు. ఆ బొగ్గుల మధ్య పని చేసి చేసి ఆయన ఆరోగ్యం పాడయిపోతోంది. నే ఉద్యోగంలో చేరితే తప్ప నాకెక్కడా ఉద్యోగం రావటం లేదని ఆయనకి చెప్పాను సుందరీ" అన్నాడు. విశాఖలో ఆ ఉద్యోగం అంత డబ్బు సంపాదించగలిగేది కాదు. పైగా దేశవాళీ సంస్థ కావటం వలన ఆ సంస్థ నుంచి విదేశాలలో పని చేసే అవకాశం రానే రాదు. ఇంత దిక్కుమాలిన నిర్ణయం ఎందుకు తీసుకున్నావురా అని వాడి స్నేహితులు వాడిని మందలిస్తే "ఇక్కడయితే మనందరం కలిసి ఉంటాం కదురా" అని నవ్వేసాడు. అతను చెప్పిన రెండు కారణాలూ అతని నిర్ణయానికి కారణం కాదని సుందరి కి తెలుసు. అతను సుందరిని వదిలి ఎక్కడికో వెళ్లి బతకలేడు.
మరి ఆ తర్వాత దూర ప్రదేశాలకి (ఒక్కడే) వెళ్లిపోవాలని ఇంత సులువుగా నిర్ణయం తీసుకుని ఎలా వెళ్లిపోయాడో ఇప్పటికీ ఆమెకి అర్ధం కాలేదు. కరెంటు బిల్ ఎలా కట్టాలో తెలియని ఈ మనిషి ఎక్కడికో పోయి స్వతంత్రం గా బతకగలడా? అనుకున్న సుందరికి అదొక పెద్ద షాక్.
***
సుందరి ఇంకా ఆలోచనలలో ఉండగా సీమ తన హ్యాండ్ బాగ్ తో వచ్చి "నేనిక ఇంటికి వెళ్తాను" అంది.
"వెళ్ళిపోతున్నావా? దిలీప్ కి పెంకుటిల్లు సిద్ధం చెయ్యమని బహదూర్ కి చెప్పావా?" అని అడిగింది సుందరి.
సీమ నిర్ఘాంతపోయి "నువ్వేదో కోపంగా ఉన్నావు కదా అతన్ని ఇంకెక్కడో ఉండమంటావేమో అనుకున్నా" అంది.
"నా మొహం. ఆ విషయం అతను వచ్చాక తేల్చుకుంటాం. వచ్చిన వెంటనే ఎక్కడ ఏడుస్తాడు?" అంది సుందరి బింకంగా.
"నువ్వు నాకు అర్ధం కావే తల్లీ" అంటూ బంగాళా వెనక పెంకుటింటిని సిద్ధం చెయ్యమని ఆ ఇంటి కాపలాదారు బహదూర్ కి ఫోన్ లో చెప్పటానికి మళ్ళీ లోపలికి వెళ్ళింది సీమ.
దిలీప్ జీవితంలో చిన్నప్పటి నుంచి సుఖం గానీ శాంతి గానీ ఎప్పుడూ లేవు. అతను కాలేజ్ కి వచ్చే ముందర ఇంటి పక్కన తోటలో పుల్లలేరి నీళ్లు కాస్తాడు. తర్వాత గంజి వార్చి వారానికి రెండు సార్లు బట్టలు ఉతికి చుట్టుపక్కల కాలనీలలో పాలు సరఫరా చేసి అప్పుడు కాలేజ్ కి వస్తాడు. ప్రతిరోజూ ఆలస్యంగా వస్తే మాస్టారు గవర్రాజు గారి శిక్షాస్మృతి ప్రకారం మోకాళ్ళ మీద మొదటి క్లాసంతా కూర్చోవటం అతనికి అలవాటే. వాడు శుభ్రమైన బట్టలేసుకుని తలకి నూనె రాసుకుని రావటం లేదని మంచి అలవాట్లు నేర్చుకోవటం లేదని బెన్హర్ టీచర్ రోజూ వాడి చేతులు కాయలు కాసేలా బెత్తంతో కొట్టేవారు. ఎన్ని జరిగినా వాడి కంట్లోంచి ఒక్క చుక్క వచ్చేది కాదు. వాడి స్నేహితుడు బలరాం ఒకసారి "నీకు నెప్పి ఉండదేమిటిరా?" అని అడిగితే "నేను చేస్తున్నది తప్పే కదురా!తప్పు చేసినపుడు శిక్ష అనుభవించేస్తే ఎంతో తెరిపిగా ఉంటుంది" అన్నాడు. "సాయంత్రం కూర్చుని ఓ నాలుగు మంచి పాటలు పాడేసుకుంటే కథ మారిపోతుంది" అంటాడు.
వాడికి పాటంటే ప్రాణం. ఇంట్లో రేడియో కూడా ఉండక రోడ్డు పక్కన ఎక్కడ పాటలు వినపడితే అక్కడ నుంచుని వింటూ నచ్చిన పాటల సాహిత్యం రాసుకునేవాడు. కాలేజ్ లంచ్ టైం లో సుందరీ సీమా బలరాం దిలీప్ కొంత దూరం నడుస్తుండేవారు. మొదట్లో వీడి వ్యవహారం తెలియక వాడు తమతోనే ఉన్నాడనుకుని వాడితో మాట్లాడుతూ కొంత దూరం నడిచాక వాడు మాయమయ్యాడని గ్రహించి గతుక్కుమన్నారు. అక్కడా అక్కడా వెతుక్కుంటూ వెనక్కి వచ్చి చెన్నకేసు హోటల్ దగ్గర నోరు వెళ్ళబెట్టుకుని బాలు గారి ఒక మంచి పాట వింటూ ఏదో లోకంలో ఉన్న దిలీప్ ని చూసి హమ్మయ్య వీడెక్కడా తప్పిపోలేదు అని ముందు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత పాటలకోసం లోకాన్ని మరిచిపోయే వాడి పాటల పిచ్చికి మురిపంగా భళ్ళుమని నవ్వుకున్నారు. "నువ్వే సైకిల్ మీద పోతున్నపుడో పాత వినిపిస్తే పడిపోతావు రా" అని వేళాకోళం చేసేవారు. ఎప్పుడైనా క్లాస్ టీచర్ రాకపోతే దిలీప్ ని బల్లెక్కించి ఒక్కొక్కడూ వాళ్లకి ఇష్టమైన పాటని అడిగి పాడించుకునేవారు.
రోజూ గవర్రాజు మాస్టారి దగ్గర ఆలస్యంగా వచ్చినందుకూ బెన్హర్ టీచర్ దగ్గర సరైన బట్టలు వేసుకోవనందుకూ దెబ్బలు తింటూనే పెరుగుతున్న దిలీప్ మీద చివరికి కంప్లైంట్ వెళ్ళింది. ఇక తప్పదని వాడి తల్లి కాలేజ్ కి వచ్చింది. ఇద్దరూ టీచరులూ ఒకేచోట ఉండగా వారి దగ్గరికి వచ్చి "అయ్యా! ఈ వయసుకి వాడిని కూలి పనిలో పెట్టి మరిన్ని కాసులు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్న మేము వాడి మంచి కోసం పళ్ళబిగువున చదివిస్తున్నాం. కానీ వాడికి నూనెలూ పౌడర్లూ కూడా కొనాలంటే మేమంత డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితిలో లేము బాబూ!" అని ఏడిచింది. ఆవిడ చెప్పిన మాటలు విని గవర్రాజు గారి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగి "వాడికి క్రమశిక్షణ తప్పుతోందని బాధతో వాడిని శిక్షిస్తున్నాను గానీ ఇప్పుడు నా తప్పు తెలిసిందమ్మా. వాడికి అభిమానం చాలా ఎక్కువ. శిక్ష అనుభవించేవాడు తప్ప ఎప్పుడూ నాకు ఆలస్యానికి కారణం చెప్పలేదు. పేదరికం అన్నింటికన్నా పెద్ద రోగం. ఈరోజు నుంచి మెదటి పాఠం నేనే కొంచెం ఆలస్యంగా మొదలెడతాను. ఏరా పిల్లలూ మీరేమంటారు?" అన్నాడు. పిల్లలంతా బల్లల మీద చరుస్తూ "తప్పకుండా మాస్టారూ" అన్నారు. దిలీప్ అంటే ఇష్టం లేనిదెవరికి?
బెన్హర్ టీచర్ ఆరోజే వాడికి రెండు జతల బట్టలు కుట్టించుకోమని డబ్బులిచ్చి అప్పటినుంచి వాడి తల్లికి ప్రతి రెండు నెలలకీ ఒక కొబ్బరినూనె సీసా ఒక పౌడర్ డబ్బా ఇచ్చేవారు. దిలీప్ కి ఈ విషయం చెప్పద్దని వట్టు పెట్టించుకుని పంపించారు. ఎందుకంటే దిలీప్ ఎవరిదగ్గరా సహాయం తీసుకోవటానికి ఇష్టపడే వాడు కాదు. కేవలం సుందరి మాత్రమే అతనికి స్పెషల్ కనుక అన్ని సాయాలూ ఎంతో హక్కుగా తీసుకునేవాడు.
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమలిన శృంగార కథలు - అనూఢ (శృంగార కథ) - by k3vv3 - 25-12-2025, 04:49 PM



Users browsing this thread: 1 Guest(s)