19-11-2025, 01:58 PM
అమ్మమ్మ కథలు : - 2
2. అవివేకం : కథఅందరూ రెడీనా?
పిల్లలూ! అన్నాలు తినడం అయ్యింది కదా!
విఘ్నేశ్వర స్తుతి చెప్పండి. అని అమ్మమ్మ అనగానే...
తొండమనేక దంతము తోరపు బొజ్జయు,
వామ హస్తమున్, మెండుగ మ్రోయు గజ్జెలు
చల్లని చూపులు మందహాసమున్, కొండక గుజ్జు రూపమున
కోరిన విద్యాలకెల్ల నొజ్జవై వుండెడు పార్వతీ తనయా! ... ఓ గణాధిపా! నీకు మ్రొక్కెదన్" అని గణేశుని స్తుతించాము.
అప్పుడు అమ్మమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది.
2. అవివేకం : - కథ
భగవంతుడే వచ్చి వరాలిచ్చినా అవివేకంతో ఆ వరాలను నిరుపయోగం చేసుకున్న ఒక కుటుంబం కథ.
ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. తనకు వచ్చే సంభావనలతో ఎలాగో నెట్టుకొస్తున్నాడు. ఒక్కడే కొడుకు. భార్య ధన సంపాదన లేదు, చాతకానివాడు అని ఎప్పుడూ భర్తను తిడుతూ ఉండేది.
ఒక రోజు ప్రదోష వేళలో పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు భూలోకంలో సంచరించాలని వస్తూ, ఈ బ్రాహ్మణ గృహం పరిసరాల నుండి వెళుతున్నాడు.
అప్పుడు చిక్కి శల్యమైన అతడు బాధ పడుతూ అరుగు పైన కూర్చుండడం పార్వతీ దేవి కంట పడింది.
అమ్మ కదా ఆ బ్రాహ్మణుడి పై జాలిపడి..
"ఈశ్వరా! పాపం ఇతన్ని చూస్తే జాలి కలుగుతోంది. ధనం ఇచ్చి అతన్ని అనుగ్రహించండి! కష్టాలు పోయి సుఖంగా ఉంటాడు!" అని పతిని అడిగింది
"పార్వతీ! ఈ బ్రాహ్మణుడు మూర్ఖుడు. మూర్ఖులకు ఇచ్చినా వ్యర్థం! తమ అవివేకంతో ఏమీ పొందలేరు" అన్నాడు గౌరీపతి
"ఈ ఒక్క సారికి కరుణించండి!" అని అమ్మ మళ్లీ అడిగింది. సరేనని అన్నాడు ఆ జగత్ పిత. ఇద్దరూ ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షం అయ్యారు.
"ఏవైనా వరం కోరుకో నాయనా! "
"ఏమి కోరాలి" అని బుర్రగోక్కుంటూ ఆ బ్రాహ్మణుడు చూస్తుంటే..
స్వామి దయతో..
" నీకు మూడు వరాలు ఇస్తున్నాను. రేపు పొద్దున లేచినప్పటి నుంచి, మీ ఇంట్లో వాళ్ళు ఏది కోరుకున్నా మూడు సార్లు తీరుస్తాను. ఆలోచించుకుని ఆ మూడు కోరుకోండి రేపు!" అని చెప్పి, పార్వతీ సహితంగా అంతర్ధానం అయ్యాడు.
***
ఆ బ్రాహ్మణుడు వెంటనే లోపలికి వెళ్ళి, భార్యతో సంబరంగా విషయం చెప్పాడు.
"మనం రేపు ఏమి కోరుకుందాం? మంచి తిండి,బట్టలు, మంచి ఇల్లు అడుగుతాను" అన్నాడు
అది విని ఆమె...
"నాకెప్పటినుంచో చాలా నగలు వేసుకోవాలని కోరిక! అవి అడుగుతాను నేను" అన్నదామె
ఒకరి అభిప్రాయంతో మరొకరు విభేదించారు. మాటా మాటా పెరిగింది. చివరికి 'లేదు నేనన్నదే కోరుకోవాలి అంటే నేనన్నదే!' అని పెద్ద గొడవ పెట్టుకున్నారు. అలాగే వీళ్ళ గొడవలు తీరకముందే తెల్లవారిపోయింది. వీరి గొడవ మాత్రం ఇంకా ఆగలేదు.
వాళ్ళను చూస్తూ ఉన్న వాళ్ళ కొడుకు చాలా చిన్నవాడు. అలా కూర్చుని చూస్తూ ఉన్నాడు భయంగా.
ఇంతలో భర్త కోపంగా...
"నా మాట వినకుండా ఇంత సతాయిస్తున్నావు కదా నన్ను, నువ్వు వెంటనే కోతిగా మారిపో! " అన్నాడు
అదే సమయంలో అతను పూర్తిగా అనే లోపే భార్య కూడా కోపంగా..
"నువ్వే కోతిగా మారు!" అంది.
అలా ఇద్దరూ కోతులుగా మారిపోయారు. అలా రెండు వరాలు అయిపోయాయి.
తల్లిదండ్రులు కోతులుగా మారిపోవడం చూసిన కొడుకు బాధపడ్డాడు.
వెంటనే మూడవ వరం కోరాడు.
"మా అమ్మానాన్నలు మళ్ళీ మాములుగా మారాలి!" అని శివపార్వతులను స్మరించి, నమస్కారం చేశాడు.
ఆ బ్రాహ్మణ దంపతులు మళ్ళీ మాములుగా మారిపోయారు.
ఇంకేముంది మళ్ళీ అదే స్థితిలో వుంటారు. అలా మూడు వరాలు పొంది కూడా తమ అవివేకంతో వాటిని ఉపయోగించుకోలేక పోయారు.
"అందుకే గొడవలు పెట్టుకోకూడదు! అనవసర పంతాల వల్ల ఎంత నష్టమో తెలిసింది కదా!" అంది అమ్మమ్మ.
అవునని బుర్ర వూపాము.
ఇప్పుడు మళ్లీ నేను చెప్పింది చదివి బుద్ధిగా పడుకోండి అని చెప్పింది.
నందగోపకుమార, నవనీత చోరా.... అని మళ్లీ నిన్న చెప్పిన కృష్ణ స్తుతి చదివి, పడుకున్నాం!
మరి మీరూ...
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)