Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - నేను నా అమ్మమ్మ
#58
అతను నా బాధని అర్థం చేసుకుని, ఇంగ్లీషులోనే, నాకర్థమయేలా, “వచ్చే నెల ఒకటో తారీఖున వచ్చి ఆరవ క్లాసులో జాయిన్ అవచ్చు. ఈలోగా మీ పెద్దవాళ్ళని, నీ ఐదో క్లాస్ పాస్ సర్టిఫికేట్, మీ కాలేజ్ నుంచి టి.సి. తీసుకుని వచ్చి నన్ను కలవమను.” అని చెప్పారు.
“నీకు ఎడ్మిషన్ ఇస్తాను గాని, ఇక్కడంతా హిందీవే, హిందీ మీడియమే! మొదట్లో నువ్వు కొంచెం కష్టపడాలి. ఫరవాలేదులే!” అని భరోసా ఇచ్చారు.
సమయం చూసుకుని అమ్మమ్మకి చెప్పాలి అనుకున్నాను.
మా అమ్మమ్మగారు, ఇంచుమించు ప్రతిరోజూ, ఏదోవొకటి కొని పట్టుకురమ్మని నన్ను హైవేకి పంపించేవాళ్ళు. నేనూ సంతోషంగా ఎగురుకుంటూ, గెంతుకుంటూ వెళ్ళి కావలసినవి కొని తెచ్చేసేవాణ్ణి.
అలాగే ఒకరోజు అర్జంటుగా పచ్చిమిరపకాయలు కావాలంటే, పరుగెత్తుకుని వెళ్ళి తెచ్చాను. అప్పుడు మెల్లిగా ఆమెతో, కాలేజీ ఎడ్మిషన్ గురించి చెప్పాలని తలచి, మరోలా మొదలెట్టాను.
“అమ్మమ్మా నేను ఇక్కడ నీతో ఈవూర్లో ఉండకపోతే, నీకూ మాఁవయ్యకీ చాలా కష్టం కదా!” అన్నాను.
వెంటనే ఆవిడ సంబరపడిపోతూ, “అవునురా నాన్నా! నువ్విక్కడే ఉండిపో! ఎంచక్కా నాదగ్గరేవుండి చదువుకోవచ్చు. మిగిలిన వాళ్ళని విజయనగరం వెళ్ళి తెలుగులోనే చదువుకోనీ.” అంటారని ఊహించాను.
అబ్బే! అలా అనలేదు.
“నేనూ విజయనగరంలో ఉన్ననాళ్ళూ ‘వీళ్ళకి నేనే దిక్కు! నేనే మొత్తం ఈయింటి భారాన్నంతా లాగుతున్నాను. నేను లేకపోతే, పాపం, వీళ్ళేమైపోతారో!’ అని సరిగ్గా ఇప్పుడు నువ్వు నాగురించీ ఎలా అనుకుంటున్నావో, నేనూ అలాగే మీగురించి అనుకునే దాన్ని. కానీ చూశావా! మీ పెద్దక్క అందుకుంది. నేను లేకపోయినా బండి సాగుతోంది. ఆగిపోలేదు.
అలా మనమెవరం, ‘ఎద్దుబండి కింద కుక్క’లా గర్వంగా ఫీల్ అయిపోనక్కరలేదు.” అన్నారు, ఆవిడ.
“ఎద్దుబండి కింద కుక్కా! అదేమిటది?” అనడిగాను.
అప్పుడు వివరంగా ఆ కథ చెప్పారు.
చివరకి, “అందుచేత నిజానికి నడిపేది ఆ బండివాడు, బరువు లాగేది ఆ ఎద్దు అయితే, దాని నీడలో సురక్షితంగా నడిచే కుక్కలాటి వాళ్ళం మనం!
కానీ, ‘మనమే అంతా! మనం లేకపోతే ఇంకేం లేదు!’ అని, మనం ఉన్నంతకాలం విర్రవీగుతాం!
నిజానికి నడిపించేది ఆపైవాడు, అది ఆరోజే చెప్పానుగా!
ఎలా జరగనున్నది అలా జరుగుతుంది. మనం మాత్రం మన పని మనం చేసుకుంటూపోవడమే!
అంతవరకే!
నాకర్థమయిందిలే నీ ట్రిక్కు.
ఈవంకన, ఇక్కడుండిపోదామని, తెలుగు నుంచి ఇప్పుడు హిందీ మాధ్యమంలో ఇక్కడ చదివీసుకోవచ్చని, నీ ఎత్తు! నాకు తెలీదనుకున్నావేంటి!” అని నన్నాశ్చర్యంలో ముంచేశారు!
“అమ్మ అమ్మమ్మా!” అనుకుని దిగ్భ్రాంతి చెందాను.
నేను తేరుకునేలోగా నా మార్గాన్ని తిరిగి మళ్ళిస్తూ, “పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యక, విజయనగరం వెళ్ళి శుభ్రంగా మన మాతృభాషలో చదువుకో. బుద్ధిమంతుడవనిపించుకో!” అన్నారు.
ఆ తరవాత నా చదువు అక్కడ సాగి, తిరిగి నేను ఉద్యోగ ప్రయత్నాల కోసం మధ్య ప్రదేశ్ చేరాను.
సరిగ్గా అప్పుడే మా మాఁవయ్యకి వైజాగ్ ట్రాన్స్­ఫర్ అయింది.
అలా మరికొన్నేళ్ళ తరవాత నాకు మాఁవయ్య దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది.
“ఒరేయ్! అమ్మమ్మకేం బాగులేదు! నిన్నే కలవరిస్తోంది. ఒకసారి రారా! నిన్ను చూసయినా కోలుకుంటుందేమో!” అని ఆర్తితో అడిగాడు.
నేను ఆఘమేఘాల మీద వైజాగ్ పరుగెత్తాను.
ఆసుపత్రికి చేరి, అమ్మమ్మని చూడ్డానికి ఆ స్పెషల్ రూంలోకి అడుగుపెట్టాను.
నోట్లోంచి, ముక్కులోంచి గొట్టాలు, మెడ దగ్గర నెక్­లైనర్స్, సెలైన్. ఇవేవీ కాదు, నేను చూస్తున్నది.
ఆమె కళ్ళు!
కళ్ళు నిర్మలంగా మూసుకునేవుంది. అవి చూశాను.
పసి పిల్లాడిలా ఆమె బుగ్గల్ని తపతపలాడించాను. చలనం లేదు.
అప్పుడన్నాడు మాఁవయ్య “స్పృహలో లేదు! వస్తే ఈరోజు స్పృహ రావచ్చు! లేకపోతే, కోమాలోకైనా వెళిపోవచ్చు. చెప్పలేం!” అన్నాడు.
అప్పుడు ఆమె బెడ్ పైనే, ఆమె పక్కనే కూచుండిపోయాను. చంటిపిల్లాడిలా ఆమె గుండెలపై వాలిపోయాను.
“ ‘నువ్వే చెప్తావుగా మనం ఎద్దుబండి కింద కుక్కల్లా కాకుండా, మనం చెయ్యవలసిన పనులేం మిగిలున్నాయో సరిగా తెలుసుకుని అవి పూర్తి చేసుకుంటూ ముందుకు సాగడమే మన పని అని. ‘లే! అమ్మమ్మా! మనం చెయ్యవలసిన పనులింకా చాలా మిగిలున్నాయి. ...” అని నా మాటలు ఇంకా గుండెలు దాటి, బయటకు రానేలేదు. కాని,
ఆమె మెదడుకి చేరినట్టు, అమ్మమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచింది.
రెప్పలార్పకుండా నావైపు చూసింది.
“వచ్చేవా నాన్నా!” అన్నదేమో మరి! నా చెవులకది వినిపించలేదు.
ఆ తరవాత ఆనందంతో ఆమె ఎప్పుడూ అనే మాటా వినిపించలేదు
నా కళ్ళకి మాత్రం ఆమె కళ్ళనుండి కారుతున్న అశ్రుధారలే కనబడుతున్నాయి.
కొద్ది క్షణాల్లో అవి కూడా ఆగిపోయాయి.
ఆశ్చర్యం! ఇంకా ఆమె రెండు కళ్ళూ రెప్పలార్పకుండా నావైపే చూస్తున్నాయి.
ఈలోగా సిస్టర్ పిలిచింది కాబోలు గబగబా ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చారు.
నేనిక కళ్ళార్పకుండా నన్నే చూస్తున్న మా అమ్మమ్మ కళ్ళ వైపు చూడలేకపోయాను.
గది బయటకి వచ్చేశాను.
అదీ అమ్మను కన్న అమ్మ, అమ్మమ్మ
మా అమ్మమ్మ!
ఎద్దుబండి కుక్కలా కాకుండా, ఎప్పటికప్పుడు తన కర్తవ్యాన్ని ఎరిగి తన బాధ్యతల్ని తెలుసుకుని, తను చెయ్యగలిగినది చేసి, సాగిపోయింది.
ఆరోజు ఆమె నాకా కథ చెప్పివుండకపోతే, గుణపాఠం నేర్పివుండకపోతే, ‘నేను నిమిత్తమాత్రుణ్ణి’ మాత్రమేనన్న జ్ఞానం, కలిగివుండేది కాదు!
ఈరోజుకీ అంతా నేనే, అంతా నా వలనే, అని ‘ఎద్దుబండి కింద కుక్క’లా భ్రమల్లోనే ఉండిపోయివుండేవాణ్ణేమో!
--: oo(O)oo :--
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - ఇరుగు పొరుగు - by k3vv3 - 08-11-2025, 10:05 AM



Users browsing this thread: