08-11-2025, 10:02 AM
అమ్మమ్మ కథ - ఆపాసా
![[Image: A.jpg]](https://i.ibb.co/k2bJTS2Y/A.jpg)
నా చిన్నతనంలో మా అమ్మమ్మ చెప్పిన వందల కథల్లో ఒక చిన్నకథ ఇది. రెండు లైన్లు కూడా ఉండదు.
బహుశః తరతరాలుగా చెప్పుకున్న కథ అయుంటుంది. అందుకే ఈకథ నేనెవరికి చెప్దామని ప్రయత్నించినా, అది మొదలెట్టగానే,
“చాల్లేవోయ్! పెద్ద చెప్పొచ్చావు! మాకీ కథ ఏనాడో తెలుసు!” అనేవాళ్ళు.
అయితే ఆ కథా కమామీషు, అదెప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు మా అమ్మమ్మగారు నాకు చెప్పాల్సి వచ్చిందీ అనేది మరికొన్ని పంక్తుల కథ.
ఆ వరసలకి శ్రీకారం చుట్టే ముందు అమ్మమ్మగారి గురించి చెప్పాలి కదా! అది మాత్రం కొంచెం పెద్దదే, ఈరోజుతో అయిపోదు. బహుశః రేపు ముగుస్తుంది. ఆ తరవాత ఆమె చెప్పిన కథతో మా అమ్మమ్మ కథ ముగిస్తాను.
అమ్మమ్మని తలచుకునేసరికల్లా, నేననే ఏంటి, ఎవరికైనా ఆనందమే! ఎక్కడలేని హుషారే!
ఎందుకంటే, ఎప్పుడో సెలవుల్లో కాని అమ్మమ్మావాళ్ళ ఊరు వెళ్ళం.
అలా ఎప్పుడన్నా మా స్నేహితులు, “మేం ఈ సెలవుల్లో మా అమ్మమ్మా వాళ్ళూరు వెళుతున్నామోచ్! నువ్వెళ్ళవుగా!” అనేవాళ్ళు, నన్నూరిస్తూ.
నేను ఉడుక్కునేవాణ్ణి. కానీ అది బయటపడనీకుండా, రోషంగా, “పొండిరా! మీరైతే అప్పుడప్పుడే వెళ్తారు. అప్పుడే మీకు అమ్మమ్మ ఉండేది. మాకైతే ఎంచక్కా మా అమ్మమ్మా వాళ్ళిల్లే మాయింటికొచ్చేసింది!” అని వాళ్ళమాటని తిప్పికొట్టేవాణ్ణి. తెలిసిన వాళ్ళు నోరు మూసుకునేవాళ్ళు. తెలియని వాళ్ళు నేనెందుకలా అన్నానో ఇతరులని అడిగి తెలుసుకునేవాళ్ళు.
అప్పుడు వాళ్లకి కూడా మా అమ్మమ్మగారి గురించి తెలిసేది.
“గం.భ.స. దొడ్డమ్మగారికి ...” అని సంబోధిస్తూ పోస్టు కార్డులొచ్చేవి, మాయింటికి.
ఒకసారి ఆమెని, “గం.భ.స. అని ఎందుకు రాస్తారు? ప్రియమైన దొడ్డమ్మగారికి అని చక్కగా రాయొచ్చుగా” అనడిగితే, అప్పుడు చెప్పారావిడ, నా మాతామహులు కాలం చేశారు కనుక, అలా “ప్రియమైన దొడ్డా” అనో, ఎంత చనువున్న వాళ్ళయినా “మై డియర్ దొడ్డా!” అనో అనకూడదు. అది సభ్యత కాదు. నువ్వు మాత్రం పెద్దాడివయ్యాక, నాకు “మై డియర్ అమ్మమ్మా! అని మొదలెట్టి ఎలావున్నావు? అని కుశలప్రశ్నలు వేసి, నువ్వక్కడ ఎలావున్నావో, ఏం చేస్తున్నావో, ఏం తింటున్నావో, అన్నీ వివరంగా రాయి.” అని చెప్పారు.
నేనప్పుడు, “నాకా అవకాశం రాదు అమ్మమ్మా! నేనెక్కడుంటే నువ్వక్కడేవుంటావు. ఎందుకంటే, నిన్నూ నాతోపాటే తీసుకెళిపోతానుగా!” అన్నాను.
ఆవిడ మురిసిపోయింది. ఎంతలా అంటే, నన్ను టక్కున అక్కున చేర్చేసుకుంది. “మా నాయన! మా నాయనే! నేను చచ్చిపోతానురా!” అని ఆనందంతో కళ్ళంబడి నీళ్ళు పెట్టేసుకుంది.
ఆవిడంతే! అలా ఎన్నిసార్లు చచ్చిపోయిందో!
అలా ఆవిడ ఎప్పుడు నన్ను దగ్గరకు తీసుకున్నా, ఆమె నేత చీర స్పర్శ ఇచ్చే ఆనందంలో ములిగిపోయేవాణ్ణి. అలాగని మా స్నేహితులిళ్ళల్లో తలచెడిన బామ్మగార్లలా, మా అమ్మమ్మగారు తెల్లటి మల్లు పంచె కట్టుకుని, ‘సిటీ సెక్యూరిటీ ఆఫీసర్’లా తెల్లని యూనిఫారంలో ఉండేవారు కారు.
చక్కని కోడంబాకం, మీనంబాకం, వెంకటగిరి రంగు రంగుల నేత చీరలు, మంచి మంచి జరీ అంచులున్నవే కట్టుకునేవారు. హుందాగా ఉండేవారు. చక్కగా తలకి నూనె రాసుకుని జుత్తు దువ్వుకునేవారు. జడ వేసుకునేవారు కాదు గాని, తలకి వెనుకవైపుకి వచ్చేలా చుట్ట చుట్టి ముడి వేసుకునేవారు. బయటకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఆ ముడికి పిన్నులు పెట్టుకునేవారు. తలలో పూలు పెట్టుకునేవారు కారు, కానీ నుదుటను మాత్రం గుండ్రంగా చక్కటి విభూతి బొట్టు పెట్టుకునేవారు. రెండు చేతులకీ బంగారుగాజులు వేసుకునేవారు. రోజూ రెండు పూటలా పూజ చేసుకునేవారు.
మా మాతామహులు “ఒకవేళ నేను కాని, ముందు పోతే, ఇప్పుడెలా ఉన్నావో అలాగే ఉండాలి, అలంకరించుకోవాలి. కట్టు, బొట్టు, జుట్టు అన్నీ. వేటిలోను భేదం రానక్కరలేదు. ఎవరయినా, నిన్నలావుండాలి ఇలావుండాలి అని నిర్బంధిస్తే, నువ్వు నిక్కచ్చిగా ‘ఇది మావారి చివరి కోరిక. నేనిలాగే ఉంటాను.’ అని నిర్భయంగా చెప్పు.” అన్నారుట.
అందుకనేనేమో మాతో పాటు, హరికథలకి, నాటకాలకి, సభలకి, సమావేశాలకి, నిస్సంకోచంగా వచ్చేవారు. సినిమాలకి కూడానండోయ్!
అయితే, మాతోపాటు ఆవిడ వచ్చేవారో, మేమే ఆమెతోపాటు వెళ్ళేవాళ్ళమో; నాకు ఇప్పటికీ అర్థం కాదు!
ఒకసారి అలాగే ‘జగదేకవీరుని కథ’ సినిమా ఫస్ట్ షో చూసి ఇంటికొచ్చాం. అప్పుడు నేను ఒకటో క్లాసనుకుంటాను. వచ్చీ రాగానే, మా అమ్మమ్మగారితో,
“అమ్మమ్మా! నేను ఐదుగురు అమ్మాయిల్ని పెళ్ళాడుతాను.” అని ఆలవోకగా చెప్పేశాను. అదేదో అంత సులువయిన పనన్నట్టు.
ఆమె, కసరలేదు, తిట్టలేదు, కోప్పడలేదు.
“ఎందుకు నాన్నా ఐదుగురు? ఒక్కరు చాలుగా!” అని ఆప్యాయంగా నన్నుదగ్గరకి తీసుకుని, అప్పటి నా చిన్ని బుఱ్ఱలో ఏముందో తెలుసుకుందామని, బుజ్జగిస్తూ అడిగారు.
నాకేం తెలుసు ఆమె తెలివితేటలు!
పిచ్చి వెధవలాగా, నా మనసులో ఉన్నది, యథాతథంగా, వాగేశాను.
“ఒకరు నా కాళ్ళు పట్టడానికి, ఒకరు నాకు పళ్ళు తినిపించడానికి, ఒకరు నాకు పాయసం అందించడానికి, ఒకరు విసనకర్ర విసరడానికీ.” అన్నాను.
“నలుగురే అయారు. మరి ఐదో అమ్మాయో? ఆమె ఎందుకు? నిన్ను పెళ్ళి చేసుకుని ఆమె ఏం చేస్తుంది?” అని ఆరా తీశారు.
నేను అమ్మమ్మవైపే జాలిగా చూస్తూ, “ఇంట్లో, నువ్వొక్కర్తివే అన్నీ చేస్తున్నావుగా. అందుకు. నీకు సాయం చెయ్యడానికి.” అన్నాను.
మళ్ళీ మా అమ్మమ్మ నన్ను ఆనందంతో హత్తుకుని, ఎప్పటిలాగే ఆమె అలవాటు ప్రకారం, చచ్చిపోయింది.
ఆ తరవాత మర్చిపోకుండా ఆమె, ఆ నా మాటలు, ఎన్నోసార్లు ఇద్దరికి చెప్పి మురిసిపోయింది.
ఒకరు అడిగిన వాళ్ళు. ఇంకొకరు అడగని వాళ్ళు. వాళ్ళిద్దరికే!
అక్కడితో అయిపోలేదు.
అలాగే ఆ తరవాతి సంవత్సరమే అనుకుంటాను ‘గుండమ్మ కథ’ మరో విజయావారి సినిమా. అప్పటికి నేను మూడవతరగతికి వచ్చేశాను. “ఇదేంటి? రెండు సినిమాలకీ మధ్య గ్యాప్ ఒక సంవత్సరమేగా! ఒకటో క్లాసు నుండి రెండుకి కదా రావాలి. మరి మూడోతరగతిలో ఎలావున్నాడు!” అని ఆశ్చర్యపోకండి! కరక్టే!
కానీ మా అమ్మమ్మా మజాకా!
ఆవిడ శిక్షణలో పెరిగాను. నిజానికి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ‘ఓం నమః శివాయః! సిద్ధం నమః!’ అని ఓనమాలు దిద్దించింది మా నాన్నగారే అయినా, ‘అమ్మమ్మ దగ్గర్నుంచి అంమమ్మ’ వరకు అక్షరాలు నేర్పింది మాత్రం మా అమ్మమ్మే.
నా హుషారు చూసి, మా వీధి పురపాలక (పూరిపాక కాదు, మ్యున్సిపల్) బడిలో చేర్చడానికి, మా పెద్దక్క నన్ను తీసుకువెళ్ళింది.
అమ్మగారు (టీచర్. అదేమో నాకు తెలీదు. లేడీ టీచర్లనందర్నీ మరి అప్పట్లో అలాగే పిలిచేవాళ్ళు), మా అక్కతో, “వీడికి తలమీంచి చెయ్యి వేసి, అవతల చెవి పట్టుకోరా అంటే, చెవి సరిగా అందనైనా లేదు! ఇప్పట్నుంచే కాలేజ్లో వేసేస్తారా! ఎన్నేళ్ళే వీడికి? ఆరేళ్ళన్నా వచ్చాయా?” అనేసరికి మా పెద్దక్క అడ్డగానో, నిలువుగానో తెలిసీ తెలియకుండా అదోలా బుఱ్ఱూపింది.
“ఇంకా ఎంతమందున్నారే నీకు తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ; మీయింట్లో?” అని ఉరిమింది.
మా అక్క గాభరాపడింది. “అదేమో! నాకు తెలీదు!” అంది.
ఈవిడ అయోమయంగా మా పెద్దక్క వైపు చూసింది, ఆ సమాధానానికి.
అప్పుడు తిరిగి మా అక్కే, ధైర్యం తెచ్చుకుని, “అదేమో! నాకు తెలీదు! మా అమ్మమ్మగారు, ‘ఇంట్లో వీడి అల్లరి భరించలేకపోతున్నాం, బడికి పంపించేస్తే సరి! తిక్క కుదురుతుంది వెధవకి!’ అన్నారు. నాతో ప్రత్యేకంగా మీ పేరు చెప్పి, మీ దగ్గరకి పంపించారు. ఆవిడ మీకు, “ఎలాగైనా వీణ్ణి మీ కాలేజ్లో చేర్చెయ్యండి. వీడికి చదువు చెప్పడం, నావల్ల కావటం లేదు.” అని చెప్పమన్నారు.” అని ఒక్క గుక్కలో చెప్పేసి, అమ్మయ్య అని ఊపిరి తీసుకుంది.
ఆవిడ చేటంత మొహం (అంటే ఎంత విశాలమో నాకు తెలీదు) చేసుకుని,
“ఎవరూ! దొడ్డమ్మగారా!” అని, మారుమాటాడకుండా నన్ను బళ్ళో చేర్చేసుకుంది.
ఆరోజే మా అమ్మమ్మ మాట, ఇంట్లోనే కాదు బయట కూడా చెల్లుతుందని నాకు తెలిసింది.
దటీజ్ మై అమ్మమ్మ!
--: oo(O)oo :--

ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)