Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - ఆత్మీయత
#47
“అమ్మా నిన్నొకమాట అడగమన్నాడు మీ అల్లుడు, నువ్వెలాగు ఒక్కదానివే ఉంటున్నావు కదా! మందికి ఎవరికో వంటచేస్తూ కష్టపడుతున్నావు, మా దగ్గర ఉండి మాకు నీ చేతితో చేసి పెట్టొచ్చు కదా మీ అమ్మను అడుగు అన్నారు” అంది అర్చన.



“అర్చనా .. అల్లుడిగారు అడిగారా? ఎంతమాట ఆయన అడిగిన తరువాత నేను రాకుండా ఉంటానా చెప్పు? అయినా నువ్వు ఇబ్బంది పడుతుంటే నాతో ఒక్కమాట కూడా చెప్పలేదు” నిష్టూరంగా అంది సుందరమ్మ.



“నీకు చెపుదామనే అనుకున్నా! నువ్వు బాధపడతావేమోనని చెప్పలేదు, ఆ నువ్వు ఎప్పుడు వస్తావు? ఆ ఇల్లు కూడా అమ్మేసి వచ్చావంటే మాతోపాటుగా ఇక్కడే ఉండిపోవచ్చన్నారు ఈయన, మేము రేపాదివారం వస్తాము అన్ని పనులు చేసుకొని వచ్చేద్దాము సరేనా అమ్మా” అడిగింది ప్రేమగా.



“అలాగేలే నాకు మాత్రం ఎవరున్నారు మీరు కాకపోతే ఎప్పటికైనా నీకు చెందవలసిందే” అంది సుందరమ్మ. అలా అన్నదే కానీ అర్చన దుడుకు స్వభావం తనకు తెలియనిది కాదు. నోటికి హద్దు పద్దు ఉండదు. తీరా అక్కడకు వెళ్ళాక ఇబ్బంది పడతానేమోనని ఆలోచించసాగింది సుందరమ్మ.



“అర్చనా.. మీ అమ్మతో మాట్లాడావా ఏమన్నది” అడిగాడు మనోజ్.



“అవును మీకు చెప్పలేదు కదూ! నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, తినడానికి కూడా టైం ఉండడంలేదు, కాస్త నువ్వు వస్తేనన్న నాకు చేదోడు వాదోడుగా ఉంటావు
కదా! మాకు మాత్రం ఎవరున్నారమ్మ నువ్వు కాకపోతే, అక్కడ ఒంటరిగా ఉంటూ మందికెవరికో చాకిరి చేసే బదులు, నీచేత్తో పిడికెడు ముద్ద మాకు పెడితే మేము సంతోషంగా ఉంటాము, నువ్వు మాతోనే ఉండాలి అన్నాను. తప్పకుండా వస్తాను అందండి” చెప్పింది అర్చన. తల్లితో మాట్లాడిన మాటలకంటే వేరుగా చెప్పింది.



“మరింకేం.. వచ్చే ఆదివారం వెళ్ళి తీసుకవద్దాము అర్చనా” అన్నాడు.



“అలాకాదు .. మనం వెళ్ళి రెండురోజులు అక్కడ ఉండి, ఇంటివిషయాలు అన్ని చక్కబరుచుకోని వద్దాము, మా అమ్మను మళ్ళీ ఆ పల్లెటూరుకు పంపిచేది లేదు” అంది.



“సరే మంచి ఆలోచననే కానీ! మీ అమ్మ ఉంటుందంటావా ఇక్కడ” అడిగాడు నమ్మకంలేక.



“మీకెందుకవన్ని నేను మా అమ్మను ఒప్పిస్తాను కదా!” అంది ధీమాగా.



అనుకున్నట్టుగానే సుందరమ్మ దగ్గరకు వెళ్ళి. ఆ మాటలు ఈ మాటలు చెప్పి మొత్తానికి ఇల్లు బేరానికి పెట్టింది అర్చన. ఇల్లంతా సర్ధేసి అవసరంలేని సామానంతా తీసివేసింది.
సుందరమ్మ ప్రాణం ఉసూరుమనసాగింది ఎన్నో ఏళ్ళనుండి తనను అంటిపెట్టుకున్న ఇల్లు సామాను పోతుంటే మనసంతా విలవిలలాడింది. అంతలోనే మనసు రాయిచేసుకుని ఎప్పటికైనా దాని దగ్గరకు పోవలసినదానినే. ఎప్పుడైతే ఏముందిలే అనుకుంది.



అర్చనకు తల్లి వచ్చినప్పటినుండి వంటఇంటి జోలికి పోవడం మానేసింది. “అర్చనా! మీ అమ్మ పెద్దావిడ కదా! పాపం పనంతా ఆవిడమీదనే వేస్తున్నావు, పోని పనిమనిషిని అయినా పెడదామంటే నువ్వు ససేమిరా అంటున్నావు, అక్కడ హాయిగా ఉన్నదాన్ని తీసుకవచ్చి పనంతా చేయిస్తున్నావు” నిష్టూరంగా అన్నాడు మనోజ్.



“అబ్బ మీకేం తెలియదు మీరూరుకోండి, మా అమ్మకు ఈ పనంతా అలవాటే, ఒంట్లో బాగాలేనప్పుడు ఎలాగు ఆమెకోసం మనిషిని పెట్టాలి, ఇప్పటినుండి ఖర్చు ఎందుకు
అయినా మా అమ్మేమి పరాయివాళ్ళకు చెయ్యడంలేదు, ఇలాంటి విషయాలన్ని మీరు పట్టించుకోకపోవడం మంచిది” గట్టిగా చెప్పింది భర్తతో.



ఛీ ఛీ ఏం మనిషో నోట్లో తలపెట్టడం పాపం. పెద్దావిడ అక్కడ ఒక్కర్తే ఉంటుందని ఎలాగైనా కూతురు దగ్గరకు వస్తుంది అనుకుంటే. ఆమెను బాగా ఉపయోగించుకుంటుంది అర్చన.
ఇలా చేస్తుందనుకుంటే ఆమెను రమ్మని అనకనేపోదును అనుకుంటూ తనలో తానే బాధపడసాగాడు మనోజ్.



సుందరమ్మకు గడియ తీరికలేదు గవ్వెడు ఆదాయం లేదన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. మనవడు మనవరాలు బాగా మచ్చికైనారు. అర్చనకు ఆఫీసు పనితోనే సరిపోతుంది ఇంటికి వస్తూనే తలనొప్పని లేకపోతే అలసిపోయానని కాఫీ తాగి కాసేపు పడుకుండిపోతుంది. మనోజ్ వచ్చాక సాయంకాలం ఏదైనా టిఫిన్ తింటాడని తయారుగా చేసి పెడుతుంది సుందరమ్మ.



అందరికి అన్ని విధాల చేసిపెడుతుండడంతో కాస్త ఒళ్ళుచేసారు ప్రశాంతంగా ఉంటున్నారు. ఎటొచ్చి సుందరమ్మకే తీరికలేకుండా పోయింది తిన్నవా ఆరోగ్యం బాగుందా అనే అడిగే నాథుడేలేడు. పొరబాటున మనోజ్ అడుగుదామని నోరు తెరిస్తే. మా అమ్మకేంటండి ఉక్కు శరీరం. వాళ్ళమ్మ వాళ్ళు అలా పెంచారు మా అమ్మను. అంటూ మాట దాటవేస్తుంది అర్చన. నోరెత్తలేక గమ్మున ఉండిపోతాడు మనోజ్.



“అర్చనా.. నాకు ఒంట్లో బాగుండడంలేదు, ఏమిటో కళ్ళు తిరుగుతున్నాయి ఎక్కడైనా పడిపోతానేమొనని భయంగా ఉంది, దగ్గరలో ఎవరైన డాక్టర్ ఉంటే తీసుకెళ్ళమ్మ” ఒకరోజు అడిగింది అర్చనను. వచ్చిన నాలుగేళ్ళనుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగానే ఉంది. వయసు మీదపడుతుంది విశ్రాంతి అనేదే లేకుండాపోయింది.



“ఏమైందమ్మా.. కళ్ళు తిరుగుతున్నాయా, పైత్యం అయిందేమో ఇదిగో ఈ అల్లం ముక్కలు చప్పరించు తగ్గిపోతుంది, నాకు ఆఫీసుకు సెలవులు లేవు తగ్గకపోతే అప్పుడు చూద్దాంలే” అంటూ గబగబా తల్లి చేసిన టిఫిన్ తిని వెళ్ళిపోయింది.



సుందరమ్మకు మనసు ఉసూరుమనిపించింది. ఒంట్లో ఓపికలేకపోయినా పిల్లలను తయారుచేసి కాలేజ్ కు పంపింది. వాళ్ళు వెళ్ళగానే కళ్ళుమూసుకుని పడుకుందంటే
సాయంకాలం అర్చన వచ్చి లేపితేగాని లేవలేదు పాపం అంతగా అలసిపోయింది. మగతగా కళ్ళుతెరిచి చూసి. “అయ్యో .. నువ్వు ఆఫీసునుండి వచ్చేసావా అర్చనా?” అడిగింది కంగారుగా లేవబోతూ.



“అబ్బా అమ్మా.. నాకు తల పగిలిపోతుంది నీకు సమాధానం చెప్పే ఓపిక నాకు లేదుగాని, నాకు కాస్తా కాఫీఇవ్వు అయినా ఈవేళప్పుడు పడుకున్నావేంటి? ఇల్లంతా చిందరవందరగా
ఉంది సర్దాలి కదా? ఇంటికి ఎవరన్నా వస్తే ఏమనుకుంటారు” అంది రుసరుసలాడుతూ.



ఒక్కమాట మాట్లాడకుండా మౌనమే సమాధానం అన్నట్టుగా కళ్ళుమూసుకుని పడుకుంది మనసులో బాధపడుతూ.



“ఏంటి నాకు తలపగిలిపోతుందని చెప్పినా కూడా లేవడం లేదేంటమ్మా? ఈ రోజేంటి కొత్తగా చేస్తున్నావు, నీకు మీ ఊరిమీద మనసు పడిందా ఏంటి కావాలంటే నిన్ను మీ ఊరికి పంపిస్తాలే, ఈ మధ్యలో చాలా చూస్తున్నా నువ్వు ఏపని సరిగా చెయ్యడంలేదు, అయినా నీకు మాకంటే ఆ ఊరివాళ్ళే ఎక్కువయ్యారు, సరె సరె కానీ! పడుకున్నది చాలు లేచి నాకు కాఫీ పెట్టివ్వు” అంది రుసరుసలాడుతూ.



“అయ్యో తల్లి. అంత మాటలెందుకే.. నాకు లేచే ఓపికలేకనే ఇలా పడుకున్నాను, ఇప్పుడే నీకు కాఫీ పెట్టి తెస్తాను కోపానికి రాకు, ” అంటూ బలవంతంగా లేచి తూలుకుంటూ వెళ్ళి కాఫీ
తెచ్చి ఇచ్చింది. ఓరకంట తల్లిని గమనిస్తూనే ఉంది తప్పా కొంచెమైనా జాలిపడలేదు. పైగా తన ఆలోచనా సరళిలో వేగంగా ఆలోచించింది. భర్త ఎప్పుడెప్పుడు వస్తాడా తననుకున్న విషయం వెంటనే అమలు చెయ్యాలని ఎదిరిచూసింది.



జవసత్వాలుడిగిపోయిన కన్నతల్లి లేవలేకా వంటచేస్తుంటే టీవి చూడడంలో మునిగిపోయిన అర్చన. భర్త రాగానే కమ్మగా పుల్లగా అమ్మచేసిన వంట తింటూ అమ్మ అనారోగ్యం గురించి ఆలోచించే మనసులేని కన్న కూతురిని చూస్తుంటే
కడుపు తరుక్కుపోయింది సుందరమ్మకు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ - by k3vv3 - Today, 09:43 AM



Users browsing this thread: 1 Guest(s)