Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - అసతోమా సద్గమయ
నన్నీసారి అంబులెన్సు లో ఎక్కిచ్చేరు. నా శవాన్ని మా అత్తింటి నుండి తీసుకొచ్చేటప్పుడు, వాళ్ళవైపు బంధువులంతా నానా రభసా చేసేరు. పెళ్ళైన ఆడది సత్తే అత్తగారూర్లోనే తగలబెట్టాలంట. అమ్మగారింటికి తీసుకుపోగూడదంట. అరిష్టమంట. అదిని మా నాయిన ' మాకింతకంటే అరిష్టమింకేముంటది తల్లా. ముత్తెమంటి బిడ్డని మీ యాదానేశాం. చాలమ్మా, మా బిడ్డని మేం తీసకపోతాం.అని తెచ్చేశాడు. తీసుకరాకుంటే, నేనా ఊర్లోనే తగలబడిపొయ్యేదాన్ని.

మా ఊరికి రాగానే మా బంధువులంతా యాడుస్తా ఎదురొచ్చినారు.ఫాదెశీణాఆౠ. ఘొదూఘొదూమని ఒకళ్ళనొకళ్ళు బట్టుకుని యాడ్వడం మొదలుబెట్టేరు. నేను నిండా మార్చురీ కట్లతో ఉండా కదా అందుకని నాకు శవ స్నానం జేయించకుండా పసుపుగుడ్డ, చీర మీదేసి నిండా పూలు బెట్టేరు. పూలంటే నాకెంత ఇష్టమో తెలుసా. మా కరగాడల్లో పూసే ముళ్ళగోరింట, నాగమల్లి పూలని కూడా వదిలేదాన్ని గాదు. నా జడలో పూలు నాకు కనిపిచ్చవు కదా. అట్ట చూసుకుంటా వుంటే అంత పూల పిచ్చి వుంటే మొగడు జస్తాడంట అనేది మా రెండో అత్త. మా అత్తకి గుర్తుందో లేదో. నా జడనిండా పూలుబెట్టి మా రేండో అత్త్ని బట్టుకుని ఓమని యాడవడం మొదలుబెట్టింది. ఆ తరవాత నన్ను పాడె మీద పండబెట్టి స్మశానానికి తీసుకపొయ్యేరు. మా నాయనే కొరివి పెట్టేడు.

నేను ఇంట్లోనే పుట్నానంట. అనుకోకుండా పుసక్కన పుట్టేస్తే మొదట మా నాయనే నన్ను ఎత్తుకున్నాడంట. మా నాయన్ ఆ మాట ఎప్పుడూ జెప్పేవోడు. ఇప్పుడు మా నాయనే నాకు కొరివి పెట్టేసరికి నా గుండెంతా సంతోషంతో నిండిపోయింది. అందుకే నేను ఎటుమంటి చిడిముడి పెట్టకుండా సుబ్బరంగా కాలి బూడిదయ్యా.

నా ఎముకల్ని ఒక కుండలో పెట్టి తెచ్చుకుని మా ఇంటి నిమ్మ చెట్టు మొదట్లో పాతాడు మా నాయిన. మళ్ళీ అందరూ అరిష్టం అరిష్టం అన్నారు. అయినా మా నాయిన ఇన్లా. ఇప్పుడు మా నాయినకి పొద్దున్నే లేవగానే ఒకటే పని, నిమ్మచెట్టు కాడికొచ్చి ఆమ్న్నే ఆ మట్లో నా ఎముకలు పూడ్చిన ద్గ్గర కూర్చొని ' ఏం నాయనా మహిలూ నన్ను తిట్టుకుంటా ఉండవామ్మా, మా నాయ్నే గదా నన్ను ఎముకలు జేసింది అనుకుంటా ఉండావామ్మా, ' అని యాడవడం. మా నాయన కంటే మా అమ్మే మేలు. ఒకరొంత మనుషుల్లో పడ్డది. మా నాయన ఏడవడం జూస్తే నాకు యాడవద్దు నాయినా ' అని ఓదార్చాలనిపిస్తది.

మా ఆయన, అత్త జైల్లో పడ్డరోజు మాత్రం మా నాయన చానా సంతోష పడ్డాడు. నిమ్మ చెట్టు దగ్గర కూర్చోని చానాసేపు ఏడ్చి ' అమ్మ మహిలు ఎంత ఖర్చయినా కేసు వదలనమ్మ. వాడు జైల్లోనే ఉండిపోయేట్టు జేస్తా' అన్నాడు. మూడు నెలలు జైల్లో ఉండి బెయిలు మీద బటకొచ్చేరు మా ఆయన, అత్త.

కేసు కోర్టులో నడస్తా ఉంది. మా నాయన రోజురోజుకీ మంచానికి అంటకపొయ్యి లేవడం లేదు. బంధువులంతా అట్టయితే అత్ణయ్యా అని చెప్తా ఉండారు. ఎవరేం చెప్పినా మా నాయన ఓమని ఏడ్చేవోడు. రోజంతా ఆమ్న్నే పొడుకోనుండేవాడ, కోర్టు వాయిదా రోజు మాత్రం లేసి కోర్టుకు పొయ్యేవాడు.

నేను సచ్చిపోయిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత సంగతి ఇది. పది గంటళేళ మా అమ్మ కుంటి కాకికి అన్నం పెట్టి కడిగి దబ్బిళిచ్చిన దబర్లు ఇంట్లోకి తీసుకు పోతా ఉంది. నేను సచ్చిపోయిన తరవాత మా అమ్మకి కుంటికాకి మీద ప్రేమ పెరిగింది. యాడకన్నా పోవాల్సి వస్తే ' ఒకరొంత మహితమ్మ కాకికి అన్నం పెట్టండి ' అంజెప్పి పోతది. ఆరోజు కాకి తింటా ఉండిందల్లా కా..కా..మని అరస్తా గెంతతా నీళ్ళ తొట్టి పక్కకి పోయింది. మాయమ్మ ఇంటిలోపల్నుండి తొంగి చూసింది. ఎవరన్నా వొచ్చేరా..ఎట్టా అని.

నిజమే ఎవరో వొచ్చేరు. ఒక పెద్దాయన, వురామరిగ్గా నా ఈడు పిల్లే. అంటే సచ్చిపొయ్యె రోజు నా వొయసు పజ్జెనిమిదేళ్ళ నాలుగు నెలలు గదా అంతనమాట. మా అమ్మ బయటికొచ్చి 'ఎవరమ్మా, ఎవరు గావాల?' అన్నది. ఆ పిల్ల నేను నరేంద్ర రెడ్డి భార్యనమ్మ ' అన్నది. మా అమ్మకి నోట మాట రాలా. ఉలుకూ పలుకూ లేకుండా నిలబడిపోయిన మా అమ్మని జూసి ఆ పెద్దాయన ' ఎండంబడి వొచ్చినాం తల్లా ఒక చెంబుడు నీళ్ళీ నాయన దాహంగా ఉందీ అన్నాడు. మా అమ్మ యాప చెట్టు కింద మంచం వాల్చి లోపలికి పోయి నీళ్ళు తెచ్చి ఇచ్చింది. వచ్చినోళ్ళు నీళ్ళు తాగినారు.

తరవాత ఒకరొంత సేపటికి ఆ పెద్దాయన ' అమ్మ మీరెవరో నాకు దెలీదు. నేను ఈ అమ్మికి నాయిన్ని. నరేనంద్ర రెడ్డికి ఇచ్చి పెళ్ళిజేసే వరకు మాకు కేసుల సంగతి తెలీదు తల్లీ. రొయ్యలు గుంటలు బెట్టి ఉండిందంతా కారనూక్కున్నాం. చేనూ డొంకా అప్పులోళ్ళ పాల్జేసి ఎదిగిన బిడ్డ పెళ్ళెట్టా జేద్దాం దేవుడా అనుకుంటా ఉంటే నరేంద్ర రెడ్డి అక్క, ఈ అమ్మి ఆడబడుచు ప్రవీణమ్మ ఉందే, ఆ యమ్మ వొచ్చి అడిగింది. మా తమ్ముడి భార్య పాము కరిసి సచ్చిపోయింది. మీ కూతుర్ని ఇస్తారా.కట్నాలు గిట్నాలు ఏమీ బళ్ళా..తరవాత సల్లంగా అన్నీ కానిచ్చేసుకుని కేసు సంగతి జెప్పి మీ కాళ్ళు పట్టుకోమని జెప్పి అంపిచ్చినారు. అది నాయనా సంగతి. న్యాయం, ధర్మం ఆ భగమంతుడు ఎట్టయినా జూస్తడు. చూడకుండా పోడు కదమ్మ. కానీ నా బిడ్డ పైన కనికరం బెట్టి ఆ కేసు వొదులుకోండమ్మా' అన్నాడు. మా అమ్మ ఎలవరబోయింది. తేరుకుని వలవలా యాడస్తా ' ఏమయ్యా పెద్ద మనిషీ ఇదిగో నీ కూతురుందే ముత్తెమాలా...అట్టే ఉండేది నా కూతురు. దాన్ని శవం జేసి పంపిచ్చినాడు. వాడ్నెట్ట వొదిలి పెడ్తామయ్యా. ప్రసక్తే లేదు.' అన్నది.

అదిని ఆ పిల్ల ' పెద్దమ్మ! మీ పెట్టుపోతలుగాక ఇంకో రెండెకరాలు గూడా కలిపి ఇస్తారంట ఆయన చెప్పమన్నారు. మీ అమ్మినే అనుకోని దయజూడు పెద్దమ్మ ' అన్నది.

మా అమ్మ ఆ మాటలీని , ' పాపా, నా బిడ్డనన్నావు, నా బిడ్డే అనుకుంటా. వాడొక సైతాను. నేను బతికినన్ని రోజులు నీ తిండికి, గుడ్డకి లోటు లేకుండా సాకుతా..దా..వొచ్చి నాదగ్గరుండు. అంతే కేసు గురించి మాత్రం మాట్లాడబాక. ఇంకోమాట..సచ్చిపోవడానికి రెండున్నర సంవత్సరాల ముందే నా బిడ్డ ఇంటికొచ్చేసింది. కట్టుగుడ్డతో వచ్చిన బిడ్డని మళ్ళీ అంపిచ్చలా మేం. దాని పట్టు చీరలు, నగలు ఆడే ఉండిపోయాయి. వాళ్ళీలా. మేమడగలా. ఆరోజు అడగనోళ్ళం, ఈరోజు నువ్వొచ్చి డబ్బాశ జూపిస్తే వొప్పుకుంటామా?వొప్పుకునేవాళ్ళమైతే, శవం తీయకుండానే రావాల్సింది వొసూలుజేసుకునేవోళ్ళం...ఇంక మీరు పోయి రాండమ్మ,' అని లేసి ఇంట్లోకొచ్చేసింది. నాకు ఆ పిల్లని జూస్తే జాలేసింది. పాపం ఆ పిల్లది మాత్రం తప్పేముంది? అనిపిచ్చింది.

కేసు చానా రోజులు నడిసింది.

ఆ రోజు ఆఖరి తీర్పు అని మా నాయన అమ్మకి జెప్తా వున్నేడు. పొద్దుటి నుండి చానా ఇచారంగా ఉణ్ణేడు మా నాయన. నిమ్మ చెట్టు కాడికి వొచ్చినాడు కానీ ఏమీ మాట్లాడలా. మా వకీలు పేరు ఆదిశేషా రెడ్డంట. ' అమరా వకీలు చానా రోజుల నుండి మారి పోయినాడు. ఇంతకు ముందు లాగా ధైర్నంగా మనం గెలుస్తామని చెప్పటం లేదు. నాకెందుకో భయంగా ఉంది. నేను కోర్టుకు పోలేను మే ' అన్నాడు. మా అమ్మ ఇదంతా విని ' సరేలే అయ్యా, పోకపోతే పోయినావులే. తెలిసేదెట్టా తెలవదా.. దిగులుపడబాక. ఈ లోకంలో తప్పిచ్చుకున్నా పై లోకమనేది ఒకటుంటది. ఆడవరకూ ఎందుకు? ఇది కలి యుగం. ఆ కాలంలో అప్పటిది ఎప్పుడో అయితే ఈ కాలంలో ఇప్పటిదిప్పుడే అంట. వాడికి మన కడుపుకోత పాపం తగలకుండా పోదు. ' అన్నది. మా నాయన ' ఏం దేవుడు లే మే. మొన్న కేసు గెలుస్తామా ఓడిపోతామా అని ఎంకయా సామి ముందర చీట్లు పెడితే ఓడిపోతామని వచ్చింది. మనమేం పాపం జేసామని వొకీలు కాడ్నించి దేవుడి వరకూ అందరికీ మనమంటే లోకువ,' అన్నాడు.

మా అమ్మేమీ మాట్లాడలా. కొన్సేపు మెదలకుండా కోచ్చోని ఆపట లేచి పూలచెట్ల కాడికి పోయింది. నేను సచ్చిపోయిన తరవాత పటం కట్టిచ్చడానికి ఫోటోలు ఎతికేరు. పెళ్ళి తరవాత నేను ఒక్క ఫోటో కూడా దిగలేదు. పెళ్ళి ఫోటోలు చూడడం కూడా మా అమ్మోళ్ళకు ఇష్టం లేదు., అందుకని పదోతరగతి పరీక్ష కోసం తీయించుకున్న పాస్ పోర్ట్ ఫోటోనే పెద్దది తీయించి పెట్టారు. దాంట్లో యూనిఫాం రైక తో రిబ్బన్ తో ఎత్తి కట్టిన రెండు జడలతో బాగుంటాను ప్చ్..! చదువుకోనుంటే పొయ్యుండేది. పదోతరగతి తరవాత నేను బతికింది రెండున్నరేళ్ళే కదా. అందుకని ఆ ఫోటోకి పటం కట్టిచ్చుకున్నారు. మా అమ్మ పూలు తీసుకొచ్చి నా పటానికి పెట్టి పోయి పొడుకున్నడి. ఆ రోజుకింక పొయ్యి ఎలిగించే పని లేదని దానర్థం.

మా నాయన గోడంచుగా, నిమ్మ చెట్టుకాడ మంచం వాల్చుకుని, తుండుగుడ్డ తలకింద పెట్టుకుని, చెయ్యి కళ్ళమీద పెట్టుకుని పొడుకున్నాడు. కేసు ఏమవతదో మా నాయనకి అప్పటికే తెలిసిపోయినట్టుంది. అంతెందుకు ఏమవతదో పసిబిడ్డని నాక్కూడా తెలిసినట్టే అనిపిస్తా ఉంది.

[Image: v.jpg]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - అసతోమా సద్గమయ - by k3vv3 - 20-09-2025, 04:30 PM



Users browsing this thread: