Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#22
ఫలించిన అమ్మమ్మ దీవెన
[Image: 3.jpg]
రచన: పూడిపెద్ది వెంకట సుధారమణ
 
"వనజా... ఇక్కడకి రా, నీకు జాగా ఉంచాను, ఇటు రా " అని జలజ పిలుస్తున్నా పట్టించుకోకుండా, తన తల్లి పక్కన కూర్చుంది వనజ పెళ్ళి భోజనానికి.



"ఏమ్మా వనజ, ఏంటి కత, అమ్మ పక్కన కూర్చున్నావు, నీ ఆరో ప్రాణాన్ని వదిలేసి" అన్న అత్తయ్య మాటలకి చిరునవ్వే సమాధానం అయ్యింది.



ఆవిడ అంతటితో ఊరుకోకుండా ""ఏమిటి జలజా.. ఏమయ్యిందే ఇలా విడి విడిగా కూర్చోని భోజనం చేస్తున్నారు. దాదాపుగా ఇరవై ఏళ్ళనుండి మీరు కలిసే భోజనం చెయ్యడమే చూసాము మేమంతా. ఇదే మొదటి సారి కదా ఇలా విడిగా కూర్చోవడం, ఇంతసేపు కలిసే ఉన్నారు కదే, మరిప్పుడేమయ్యింది" అంది.



"ఏం లేదత్తా" అంది జలజ కూడా నవ్వుతూ.



ఇదంతా గమనించిన అక్కడ వారంతా, ఏమై ఉంటుందని ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటున్నారు. భోజనాలు అయ్యేకా మళ్ళీ ముద్దుగుమ్మలు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని హాయిగా తిరగనారంభించారు, అసలు విషయమే పట్టించుకోకుండా.



ఇలా నాలుగు సార్లు జరిగేకా, వనజ మామూలుగానే వుంది గానీ జలజ మాత్రం లోలోపల కాస్త బాధ పడింది. ఎందుకిలా చేస్తోంది వనజక్క అని ఆలోచిస్తూ.



మరో ఫంక్షన్లో కూడా అలా విడి విడిగా కూర్చోవటం చూసిన వాళ్ళ అమ్మమ్మ ఇంక ఉండబట్టలేక "ఏమిటర్రా, ఏం జరిగింది, చాలారోజులుగా గమనిస్తున్నాను మీ ఇద్దరినీ, కలిసే వస్తారు. కలిసే తిరుగుతారు మళ్ళీ కలిసే వెళ్ళిపోతారు. మరి భోజనం మాత్రం కలసి చేయటం లేదు ఎందుకు" అని అడిగేసింది.



"అదంతే అమ్మమ్మ.. నేను భోజనానికి మాత్రం దాని పక్కన కూర్చోను" అంది నవ్వుతూనే వనజ.



అది విని జలజతో సహా అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. జలజ మాత్రం ఆలోచనలో పడింది ఎందుకా అని. ఏమీ అర్థం కాలేదు కానీ ఊరుకుంది, ఎప్పుడో అప్పుడు తెలుస్తుందిలే అని. అయినా ఇద్దరూ ఎప్పటిలాగే ఉన్నారు.



సాయంత్రం ఫంక్షన్ అయిపోయి అందరూ ఇంటికి బయలుదేరుతుండగా జలజ ఏదో మరచిపోయానంటూ లోపలికి వెళ్ళగానే అదే అదనుగా వనజ మేనత్త "ఏమే వనజా.. నువ్వు మీ చెల్లి పక్కన ఎందుకు కూర్చోవట్లేదు భోజనానికి, ఏమీ లేదని మాత్రం చెప్పకు" అంది.



మారు చుట్టూ చూసుకొని, జలజ అక్కడ లేదని నిర్ధారించుకొని మెల్లగా "ఏం లేదత్తయ్యా, అది మధ్య డైటింగు పేరుతో ఏమీ తినటం లేదు, వడ్డన చేస్తున్న వాళ్ళతో అన్నీ వద్దు వద్దు అనడం లేదా కొంచెం కొంచెం వెయ్యమనడంతో వాళ్ళు దానితోపాటు పక్కన ఉన్న నాకు కూడా సరిగా వెయ్యకుండా కొంచెం వేసి వెళ్లిపోతున్నారు. ఇలా చాలా సార్లు జరిగింది, అందుకని నేను వేరేగా కూర్చోని భోజనం చేస్తున్నాను. నా సంగతి మీ అందరికీ తెలుసుగా, నేను అన్నీ ఎక్కువగానే వేయించుకుంటాను కదా, అలా అని నేను తిండిపోతును కాను సుమా, కాకపోతే అన్నీ రుచి చూసి ఏది ఎలా వుందో తెలుసుకొని, బావుంటే తినండి అనీ, లేకపోతే తినొద్దని మీ అందరికీ చెప్తాను కదా. అంటే ఒక రకంగా నేను సమాజ సేవ చేస్తున్నాను అన్నమాట " అంది నవ్వుతూ వనజ.



"ఓహో, మరైతే దానికీ ఆవిషయం చెప్పొచ్చు కదుటే, పాపం విషయం తెలియక అది లోలోపల మధనపడుతోంది అని నాకు అర్థమయ్యింది, పాపం దాని మొహం చూస్తే జాలేస్తోంది" అంది వనజ మేనత్త.



"వద్దు అత్తయ్యా.. చెప్తే నాకోసం డైటింగు మానేస్తుంది, పాపం బరువు తగ్గడానికి అది నానా ప్రయత్నాలు చేస్తోంది కదా, అవి నా వల్ల చెడిపోకూడదని, అందుకే చెప్పలేదు. అయినా దానికీ అర్థమయ్యిందిలే అందుకే నన్నేమీ అడగలేదు కూడా" అంది వనజ.



అప్పుడే అటుగా వస్తూ వీళ్ళ సంభాషణ అంతా విన్న జలజ తేలికపడ్డ మనసుతో పరిగెత్తుకొని వచ్చి వనజని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది.



అమ్మమ్మ వారి అనుబంధానికి మురిసిపోతూ, పెద్దకూతురి కూతురు వనజని, చిన్నకూతురి కూతురు జలజనీ దగ్గరకు తీసుకొని ఇద్దరి నెత్తిన రెండు మొట్టికాయలు వేసి, ఆనందంగా అక్కున చేర్చుకొని, కలకాలం ఇలా మీరిద్దరూ కలిసే ఉండాలంటు దీవించింది.



అప్పుడే ఎవరో వెనుక నుండి "ఇద్దరినీ ఒకే ఇంటికి కోడళ్ళుగా పంపేస్తే సరి" అని అరిచారు. అందరూ అవునవును అంటూ వంత పాడారు.



"వనజ పుట్టగానే మా కోడలు అనుకున్నాం, వీళ్ళిద్దరి అనుబంధం చూసి మధ్యే మా చిన్నబ్బాయికి జలజని అనుకున్నాం. ఇక త్వరలో వాళ్ళ పెళ్ళిళ్ళే" అంది వనజ మేనత్త.



అప్పటికే వాళ్ళిద్దరూ ఒకే ఇంటికి కోడళ్ళుగా వెళ్ళడానికి, వారి పెద్దవాళ్ళంతా అన్ని ఏర్పాట్లు కూడా చేసేసుకున్నారు కనుక, వాళ్ళిద్దరూ అమ్మమ్మ కాళ్ళకి నమస్కరించి "నీ దీవెన తప్పక ఫలిస్తుంది అమ్మమ్మా.." అన్నారు ఇద్దరూ ఒకేసారి.



అందరూ తేలికపడ్డ మనసులతో, ఆనందంగా బయలుదేరారు ఇళ్ళకి.
*****


 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - అమ్మమ్మ దవడ వాచిపోయింది నాయనోయ్ - by k3vv3 - 19-08-2025, 04:10 PM



Users browsing this thread: