Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నల్లమల నిధి రహస్యం - 34
#75
నల్లమల నిధి రహస్యం పార్ట్ – 21
 
సమస్య ఎక్కడ మొదలు అయిందో అక్కడే దాని అంతం కూడా ఉంటుంది. అందుకే ఆ సమస్య మొదలైన చోటుకి మనోవేగంతో పయనమై ఆ సమస్య అంతం తెలుసుకుని వచ్చే ప్రయత్నంలో తానే ఒక సమిధ కాబోతున్నారు ఆయన!
 
ఈ ప్రయత్నంలో ఆ దుష్టాత్మ మళ్ళీ విఘాతం కల్పించకుండా ముందు గానే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాకే, తన ప్రయత్నం మొదలుపెట్టారు ఆయన.
అయన అనుకున్నట్లుగానే ఆ ప్రత్యేక క్రతువు మొదలు పెట్టేసరికి విఘాతం కల్పించేందుకు ఆ దుష్టాత్మ ప్రయత్నించింది. ఆ ప్రయత్నం లోనే అది బంధీ అయిపోయింది. అమ్మవారి మహిమ వల్ల, తన తపో బలం వల్ల ఆ దుష్టాత్మ సూర్యోదయం వరకూ బంధించబడింది. అమ్మవారి దయవల్ల మంచి సంకల్పానికి దైవం అండ దండలు తప్పక లభిస్తాయి కదా మరి! ఒక ప్రత్యేకమైన ధ్యాన సాధన ద్వారా తానే కాలానికి ఎదురువెళ్లి అసలు రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు.
అందుకుగాను ఆయన ముందుగా సేకరించిన వెంట్రుకను బయటకు తీసి ఒక ప్రత్యేకమైన యోగ పద్దతి ద్వారా తానే ధ్యానం లోకి వెళ్లి ప్రతాపరుద్రుని మరణం, నిధి వెనుక దాగి ఉన్న అసలు రహస్యం తెలుసుకునే ప్రయత్నంలో ఆనాడు ఏమి జరిగింది అనేది ఆయన కళ్లముందు కనిపిస్తోంది. ఆయన కంటికి ఇప్పుడు ప్రతాపరుద్రుని జీవితంలోని ఆఖరి యుద్ధం కనిపిస్తూ ఉంది. ఉలుఫ్ ఖాన్ కి కాకతీయ సైన్యం రహస్యాలు, ఓరుగల్లు లోని బలహీనమైన గోడల వివరాలు, కోటలోకి చొరబడే రహస్య సొరంగ మార్గాలు..ఇలా అన్ని కీలకమైన వివరాలూ ముందుగానే తెలియపరిచాడు నరేంద్రుడు.
అవన్నీ తెలియని ప్రతాపరుద్రుడు మాత్రం వీరొచితంగానే ఉలుఫ్ ఖాన్ సేనలను తనకున్న సైన్యంతోనే, తనకున్న యుద్ధవ్యూహంతోనే, కోటను రక్షించుకుంటూనే ధీటుగా సమాధానం ఇస్తున్నాడు. కానీ నమ్మకద్రోహం ముందు రాజ్యాలు కూలిపోయిన చరిత్రకి అదో ఉదాహరణ!
ఊహించని రీతిలో కోట గోడలు బద్దలు కొట్టి శత్రుసైన్యం కోటలోకి ప్రవేశించి , స్త్రీ, పురుష బేధం లేకుండా చిన్న, పెద్దా, తేడా లేకుండా అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపి, నరమేధం సృష్టించారు. ఆ దారుణ మారణ కాండ సిద్ధాంతి గారి మనసుని ఛిద్రం చేస్తోంది. అయినా పట్టు విడవకుండా ఆ దుష్టాత్మ అంతం కోసం మార్గం వెతికేందుకు ఆయన మనసును దృఢ పరుచుకున్నారు.
ఉలుఫ్ ఖాన్ ఓరుగల్లు కోటను స్వాధీనం చేసుకున్నాడు. ప్రతాపరుద్రుడు, కటకపాలుడు, గన్నమ నాయుడు మరియు పెక్కు సేనానులు బందీలయ్యారు.
 
ప్రతాపరుద్రుడిని బంధించిన ఉలుఫ్ ఖాన్, ఓరుగల్లు లోనే ఉంచితే ప్రమాదమని విశ్వాసపాత్రులైన ఖాదిర్ ఖాన్, ఖ్వాజా హాజీలకు ఆయన్ను ఢిల్లీకి తరలించే బాధ్యతను అప్పగించాడు. అయితే ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు.
 
సుల్తాను సైన్యం ప్రతాపరుద్రుని ఢిల్లీ తీసుకు వెళుతుండగా మార్గమధ్యాన సోమోద్భవ (నర్మదా నది) తీరంలో ఆయన కన్నుమూశాడు. కానీ..ప్రతాపరుద్రుడు సహజ మరణం చెందలేదు. ఆయన మరణానికి కారణం ఆ మహారాజు ఎంతో నమ్మిన నరేంద్రుడు.
 
ఆయనకి ఎంతో నమ్మకంగా ఉన్న నరేంద్రుడే ఆ మహారాజు ఎక్కడ ఆ సుల్తాను సైన్యం పెట్టే హింసలకు తట్టుకోలేక , నిధి కోయరాజు మార్తండకి ఇచ్చిన విషయం చెప్పేస్తాడో అన్న కారణంగా అత్యంత దారుణంగా హతమార్చి, అనారోగ్యంతో చనిపోయాడు అని సుల్తానుని నమ్మించాడు. ఆ సుల్తాన్ ఓరుగల్లు కోటనైతే సొంతం చేసుకోగలిగాడు కానీ. ఆ మహారాజు ప్రతాపరుద్రుని ముందుచూపు ముందు ఓడిపోయాడు. ఓరుగల్లుకి ఆ నరేంద్రుడినే ఢిల్లీ సుల్తానుకి సామంత రాజుగా ప్రకటించి, ఉలుఫ్ ఖాన్ సేనలు తిరిగి వెళ్లిపోయాయి.
 
ఆ కోటలో విలువైన సంపదనంతా ప్రతాపరుద్రుడు కోయరాజు మార్తండ దగ్గర దాచాడు అన్న విషయం తెలిసిన ఆ రాజ్యంలోని వారెవ్వరూ ప్రాణాలతో లేరు.. ఒక్క నరేంద్రుడు తప్ప! ఇక తనకి తిరుగులేదంటూ ఆ రాజద్రోహి నరేంద్రుడు విజయగర్వంతో నిధిని కైవసం చేసుకోవాలనే దుర్బుద్దితో నల్లమల అడవుల వైపు సైన్యంతో పయనం అయ్యాడు.
 
***
 
మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారంతో అజయ్ సింగాకి ఏమాత్రం అనుమానం రాకుండా అతన్ని అనుసరిస్తూ తను కూడా ఆ నల్లమల అడవుల్లో కాలు పెట్టబోతున్నాడు. వేగంగా వెళ్లిపోతూ ఉన్న సింగా జీప్ అడవిలోకి తిరిగింది. ఏమైందో ఏమో కొంత దూరం వెళ్లేసరికి జీప్ టైర్స్ పంచర్ అయిపోయాయి. అప్పటికే వాళ్ళని అనుసరిస్తూ వచ్చిన అజయ్ కూడా బండి ఆపేసి ఆ అడవిలో తొలిసారి కాలు మోపాడు. అజయ్ పాదాలు ఆ నేలను తాకగానే మరియా ఆత్మ సంతోషంతో ఉప్పొంగిపోయింది.
 
తన కలల రారాజు ఇన్నాళ్ళకి తన గత జన్మ గూటిలో తొలి అడుగు వేసాడు అన్న సంతోషం ఆమె ఆత్మను ఆనందంలో ముంచెత్తింది. అజయ్ కి నీడలా మారి, అతని వెనుకనే నిలబడింది మరియా ఆత్మ. అజయ్ కి ఏదో తెలియని భావోద్వేగం కలిగింది ఆ నిమిషం. కానీ కోలుకుని, తన కర్తవ్యం మీదే దృష్టి సారించాడు. కాలి నడకన వెడుతోన్న సింగా అండ్ బ్యాచ్ ని చాలా నేర్పుగా ఆ నీచుడికి, వాడి మనుషులకి ఏమాత్రం అనుమానం రాకుండా అనుసరిస్తూనే ఉన్నాడు.
 
వాళ్లు ఆ నిర్మానుష్యమైన అడవిలో చాలా దూరం నడిచి, ఒక కొండ దగ్గరనుండి లోపలికి గుహలాంటి చోటికి వెళ్తున్నారు. అజయ్ కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళను అనుసరిస్తూ ఉన్నాడు. అతనికి తెలియకుండా అతని వెనుకనే మరియా ఆత్మ ఉంది.
 
ఆ కటిక చీకట్లో సెల్ ఫోన్ లైట్స్ సాయంతో ముందుకు వెళ్లారు సింగా అండ్ బ్యాచ్. అక్కడ ఆ గుహ లోపల ఉన్న బండరాయి వెనుకనే దాక్కుని కాగడాల వెలుగులో అక్కడ జరుగుతున్న దారుణాన్ని చూస్తున్న అజయ్ కళ్ళు ఎరుపెక్కాయి. పిడికిలి బిగుసుకుంది. అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు వెతుకుతున్న నలుగురు పిల్లలే కాక, ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ గుహని అడ్డా గా మార్చుకుని, సింగా గంజాయి తయారు చేస్తున్నాడు అని నిర్ధారణకి వచ్చాడు అజయ్.
 
ఆ చిన్న పిల్లల చేత అక్కడ వెట్టిచాకిరీ చేయిస్తున్నాడు. ఆలస్యం చేయకుండా తన టీం మొత్తానికి మెసేజ్ పంపి అలెర్ట్ చేసాడు అజయ్. ఇంతలో అక్కడ ఒక పిల్లాడు అనుకోకుండా కిందపడిపోయాడు. సింగా వాడి మొహం పై నీళ్లు కొట్టి, "ఏరా! ఇలా పడిపోతే ఎలా? తిన్నదంతా ఏమైంది?" అంటూ పైకి లేపి “చెయ్ పని!” అని గద్దించాడు.
 
 
ఇంకో పిల్లాడు వచ్చి "అన్నా! వాడికి జరం వచ్చింది అన్నా! ఈ ఒక్క పూటకి వాడ్ని పడుకోనీయండి అన్నా.." అంటూ బతిమాలాడు.
 
సింగా ఆ పిల్లాడ్ని లాగిపెట్టి కొట్టి, "జరం, గిరం అన్నారో ఇక్కడే పాతి పెట్టేస్తా. రేపు ఉదయానికే సరుకు పంపాల! మూసుకుని బేగా పని చూడండి" అంటూ అరిచాడు ఆ పిల్లాడిపై.
 
అదంతా చూస్తున్న అజయ్ ఒక్కసారిగా సింగా మీదకి దూకి అతన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆ ఫోర్స్ కి వాడు ఎగిరెళ్ళి గోడకి గుద్దుకుని కింద పడ్డాడు. ఊహించని ఆ పరిణామానికి సింగా మనుషులు అలెర్ట్ అయి సింగాని పైకి లేపి, అజయ్ మీదకు వస్తున్నారు.
 
ఒక్కొక్కళ్ళని మక్కెలిరగదన్ని, ప్రహ్లాద్దుడ్ని కాపాడడానికి వచ్చిన నరసింహ స్వామిలా వాళ్లపై విరుచుకుపడి, తన సెక్యూరిటీ అధికారి దెబ్బలు రుచి చూపిస్తున్నాడు. అదంతా అక్కడే ఉండి చూస్తూ "నువ్వు ఈ జన్మలోనూ మారలేదు ప్రియా!" అనుకుంటూ మురిసిపోతోంది మరియా. ఇంతలో ఒకడు వెనకనుండి, అజయ్ తలపై రాడ్ తో కొట్టబోయాడు. మరియా తానొక ఆత్మని అని మరిచిపోయింది ఆ క్షణం.
 
"మార్తాండా!" అని అరిచింది. ఆ అరుపు, అజయ్ కి మాత్రమే వినిపించింది.
 
 
ఒక్కసారిగా వెనక్కితిరిగి చూసేసరికి రాడ్ తన తలను బలంగా తాకింది. అజయ్ కుప్పకూలిపోయాడు. అతనికి స్పృహ పోయింది. ఆంతే! అప్పటి వరకు తన్నులు తిన్న వాళ్లంతా మళ్ళీ అజయ్ మీదకి రాబోయారు.
 
ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పిల్లలు అందరూ స్పృహతప్పి పడిపోయారు అప్పుడు వాళ్లు చూసిన మరియా ఆకారానికి భయపడి! ఆ రౌడీలకు మరియా వికృతరూపం చూసేసరికే గుండె జారిపోయింది.
"ఉఫియే.. కిరాగిచ్చు.. యల్.. కిర.. కిర! మరియా గోరి..గోరి!" అంటూ ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తోంది. చావు భయంతో వాళ్లు పారిపోబోయారు. మరియా వాళ్లు పారిపోకుండా గుహ బయట బండరాయిని దొర్లించేసింది. వాళ్లని చావనివ్వకుండా. బతకాలంటేనే భయపడేలా చిన్నపిల్లల జోలికి రావాలనే ఆలోచన ఇంక ఏ జన్మలోనూ రాకూడదు అన్నట్టుగా చావు దెబ్బలు రుచి చూపిస్తోంది.
 
ఏ చేతితో సింగా ఆ చిన్న పిల్లాడిని కొట్టాడో. ఆ చేతిని మెలిపెట్టి, ఎముక విరిచేసింది మరియా. వాడి శరీరంలో ప్రతి ఎముకా విరిగిపోతోందా అన్నంతగా వాడిని హింసించి హింసించి స్పృహ తప్పించింది. అక్కడ ఉన్నప్రతి రౌడీ పరిస్థితి అంత దారుణంగా మార్చేసి, వాళ్లు ఇంక కదలలేని పరిస్థితికి వచ్చాక, రాయిని అడ్డం తప్పించింది.
తను మామూలు స్థితి వచ్చింది. అజయ్ పక్కనే కూర్చుని, ప్రేమగా అతని తలకిపై నిమురుతోంది. ఇంతలో అజయ్ టీం అంతా వచ్చారు. అజయ్ ని పిల్లల్ని హాస్పిటల్స్ కి తరలించారు. సింగాని, వాడి అనుచరుల్ని కూడా వాళ్ల పరిస్థితి చూసి, హాస్పిటల్స్ కే తీసుకెళ్లారు. ఆ గంజాయిని అంతా స్వాధీనం చేసుకున్నారు.
 
***సశేషం***
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 8 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నల్లమల నిధి రహస్యం - 20 - by k3vv3 - 21-06-2025, 01:35 PM



Users browsing this thread: 1 Guest(s)