Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - అసతోమా సద్గమయ
#84
సహచరి - వైష్ణవి

[Image: image-2025-06-10-193716799.png]
ప్పుడే మాగన్నుగా నిద్ర రెప్పల మీదికి కమ్ముకొస్తోంది. దబ్బున పైనుంచి ఏదో బరువుగా పడిన చప్పుడు. ఇల్లంతా యదేచ్చగా తిరుగుతున్న జీవరాసులన్నీ కకావికలై పరుగులెత్తుతున్న సందడి, ఎన్నో ఏళ్ల అనుభవాన్ని బట్టి ఏం జరిగుంటుందో అర్ధమైంది. వెదురుగడల మంచం మీద చప్పుడు కాకుండా పక్కకి వొత్తిగిల్లి చూపుల్ని కూడదీసుకుని చూసాను. నూనె దీపం మసక వెలుతురులో నేలపైన చుట్టచుట్టుకొని పడగ పైకెత్తి నిలిచిన మిన్నాగు ఎలుకల్ని వేటాడుతోంది. రాత్రైతే చాలు లోపలికొచ్చి సేదతీరే కప్పలన్నీ గోడలమీద గెంతుతూ పైపైకి పోతున్నాయి. నా మంచానికి ఎదురుగా ఉన్న వంట గట్టుమీద ఎలుకలకోసం నేను చేసి పెట్టిన రొట్టెల్ని దౌర్జన్యంగా తింటున్న పందికొక్కు ఒకటి నిర్ఘాంతపోయి కదలిక మరిచి కొయ్యబారిపోయింది. ఆ పక్క పుస్తకాల రేక్ లో ఉడుత పిల్లలకి అడ్డంగా తోకను మూసి శిలాప్రతిమలా అయిపోయింది. పాము బుస గదినిండా ప్రతిధ్వనిస్తోంది.

కాస్సేపటికి దేన్నో నోట చిక్కించుకున్నట్టుంది. బుస ఆగింది. దానికి ఆహారంగా చిక్కిన ప్రాణి హృదయ విదారకంగా విలవిల లాడింది. ఇంకాస్సేపట్లో గది మొత్తం శబ్ద రహితమైపోయింది.

ముఫ్ఫై ఏళ్లుగా ఇదంతా అలవాటైన తతంగమే. ఇప్పుడంటే పాపికొండల సందర్శనకోసం వచ్చే టూరిస్టులాంచీల రోదకు భయపడి రావడం మానేసాయి కాని, పగటి పూట కూడా కుందేళ్ళు, లేళ్లు ఇంట్లోకొచ్చి విశ్రాంతి తీసుకునేవి. అడవి పందులు, చిరుత పులులు వాకిట్లో పచార్లు చేసేవి. గది, ఇల్లు, నివాసం, హోమ్ అంటూ నేను ఎన్ని రకాల పిల్చుకున్నా ఇది పూర్తిగా వెదురు గడలతో నిర్మించిన ఆవాసం, ముఖర్జీ దీన్ని కుటీరం అనేవాడు.

దీనికానుకుని నదివైపు దిగువకు ఉన్న పది పన్నెండు గుడిసెల గిరిజన గూడెం గాఢ నిద్రలో ఉన్నట్టుంది. నాలుగైదు రోజులుగా వరద నదిలో కొట్టుకొచ్చిన చెట్లనూ, దుంగల్నీ వొడ్డుకు చేరుస్తూ పగలూ రాత్రీ గూడెం మొత్తం అలసిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా ఏమాత్రం మారని గిరిజన జీవితాలు -

ఉధృతి తగ్గిన గోదావరి ప్రశాంతంగా ప్రవాహిస్తూన్న సవ్వడి, మోచేతిని నుదుటికి ఆనించుకుని కళ్ళు మూసుకున్నాను, నిద్రకు దూరమైన రెప్పలు మూతపడలేదు. లేచి తలుపు తీసుకుని వాకిట్లోకొచ్చాను. చల్లని గాలి హోరుమని ముసురుకుంది. కొంగును తలమీదుగా కప్పుకొని రాతి చప్టామీద కూర్చున్నాను. వెన్నెల రోజులు కాని, ఆకాశం మేఘామృతమై ఉండడం వలన చందమామ జాడ కానరావడంలేదు. దట్టమైన వృక్షాల ఆకుల సందుల్లోంచి మసక వెన్నెల ఉండీలేనట్టు కమ్ముకుని ఉంది. దూరంగా కొండరాళ్ళ సందుల్లో పుట్టిన సన్నని జలధార గలగలమని కిందికి ప్రవహించి గోదావరి వైపుగా సాగిపోతోంది. చప్టా మీంచి లేచి నాలుగువారలు ముందుకు నడిచి ధారలో పాదాలు పెట్టి వొడ్డున కూర్చున్నాను. కొండ వృక్షాల మీది తేనె పట్టుల నుంచి ఆగి ఆగి తేనె చుక్కలు చుక్కలుగా నీటి ప్రవాహంలో రాలిపడుతున్న చప్పుడు.

ఏడాది క్రితం ముఖర్జీ ఈ లోకాన్ని విడిచి వెళ్లేవరకూ కాలమే తెలీని నాకు ఇప్పుడు జీవితం ఎంత సుదీర్ఘంగా, మందకోడిగా సాగుతోంది!... అన్పిస్తోంది. ఎప్పటెప్పటి జ్ఞాపకాలో వెల్లువెత్తివస్తున్నాయి.

స్వతంత్రం రావడానికి. ముందు సంస్థానాలు, జమీందారీలు దేదీప్యమానంగా వెలుగుతున్న రోజులు. గోదావరి జిల్లాలోని ఓ ప్రఖ్యాత సంస్థానాధీశుడి కూతురుగా పుట్టిన నేను ప్లస్ టూ వరకు మద్రాసులో ఇంగ్లీష్ లో చదివేను. అప్పటికే రవీంద్రుడి రచనల ప్రభావం ఆసాంతం సన్నలముకున్న రోజులు, శాంతి నికేతన్ లో చదువు కుంటానన్న నా మాటను నాన్నగారు కాదనలేదు. తన కూతురు అక్కడ చదవడం గొప్ప స్టేటస్ సింబల్ గా భావించారాయన. ఫైనార్ట్స్ స్టూడెంటు ముఖర్జీ అక్కడే పరిచయమయ్యాడు. అప్పటి అతని రూపం ఇప్పుడే చూస్తున్నంత ప్రస్ఫుటంగా కళ్ళముందుకొచ్చింది. అతను లేండ్ స్కేప్స్ బాగా గీస్తున్నాడని విని లేడీస్ హాస్టల్ నుంచి ఆర్ట్ లవర్స్ కొందరం అతని రూంకెళ్ళాం.

గది నిండా అస్తవ్యస్తంగా పరచి ఉన్న చిత్రాలు గది మధ్యలో బాసింపట్టు వేసుకుని ధ్యానముద్రలో బుద్ధభగవానుడిలాగా అర్ధనిమిలిత నేత్రుడై కూర్చుని ఉన్నాడు ముఖర్జీ. ఒక్కసారిగా అయిదారుగురు అమ్మాయిల్ని చూసి కంగారుపడ్డాడు. అప్పటికే మా మహల్ లో చాలా చిత్రాల్ని మనసుపెట్టి చూసి ఉండడం వలన అతని చిత్రాల్ని బేరీజు వెయ్యడం కొంత సాధ్యమైంది నాకు. మా కన్నా సీనియర్ ఆయన అతనికి సలహాలివ్వచ్చో లేదో ఆలోచించకుండా పెద్ద ఆరిందాలాగా కలర్ మిక్సింగ్ గురించీ, రూప లావణ్యం గురించీ ఏదేదో మాట్లాడేశాను, తర్వాత స్ఫురించి అతనేమనుకుంటున్నాడో అని చూస్తే దట్టమైన కనుబొమ్మల కింద, విశాలమైన నేత్రాల లోతుల్లోంచి ఆసక్తిగా నన్నే చూస్తున్నాడన్పించింది.

ఆ పరిచయం స్నేహంగా మారి గాఢమైన మైత్రి కావడానికి ఎన్నాళ్లో పట్టలేదు. శాంతినికేతన్ పక్కనే ప్రవహించే కొఫ్ఫోయ్ నది వొడ్డున కూర్చుని ఎన్నెన్నో కబుర్లు కలవోసుకునేవాళ్లం. దేశ విదేశాలల్లోని ప్రముఖ ఆర్టిస్టుల గురించీ, వాళ్ళ కళానైపుణ్యం గురించీ అనర్ఘలంగా మాట్లాడేవాడు ముఖర్జీ. అచ్చమైన బెంగాలీ బాబులాగే ఉండేవాడు. అప్పుడప్పుడు నేనతన్ని 'నువ్వంతా కాదు కానీ నీ ముక్కు మాత్రం అచ్చమైన బెంగాలీ చప్పిడి ముక్కు' అని ఆటపట్టించేదాన్ని, అతను విశాలమైన నవ్వొకటి నవ్వి మౌనంగా ఉండిపోయేవాడు.

క్రమంగా ముఖర్జీ ఆర్టు, లోకానికి పరిచయం కావడం మొదలైంది. సెకండియర్ సెలవుల్లో నేనతన్ని మా వూరికి అహ్వానించేను. మా మహల్ సౌందర్యం, ప్రాచీన కాలంనాటి కళాకండాలు, విదేశాల నుంచి తెప్పించిన విలువైన వస్తువులు అతన్నెంతో ఆకట్టుకున్నాయి. ఇంటికి వస్తూనే నేను నా నగలన్నీ అలంకరించుకుని సంప్రదాయ అలంకరణలోకి మారిపోయాను. అది చూసి ముసిముసిగా నవ్వుతూండేవాడు. ఆ అలంకరణలోని నా రూపాన్ని అద్భుతంగా చిత్రించి నాకు ప్రెజెంట్ చేసాడు.

చిన్నప్పుడొకసారి గోదావరి నదిమీద పడవలో భద్రాచలం వెళ్లిన ప్రయాణం గుర్తుకొచ్చింది. ఆ అందమంతా ముఖర్జీలాంటి ఆర్టిస్టు చూసి తీరాలన్పించింది. నాన్నగారి నడిగి ఏర్పాటుచేయించి తెరచాప పడవలో వెళ్లాం. దారి పొడవునా, ముఖ్యంగా పాపికొండల దగ్గర ముఖర్జీ అవుట్ లైన్స్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా ఈ గిరిజన గూడెం లో దిగి, ఈ పరిసరాలన్నీ చూస్తూ పరవశంలో మునిగిపోయినప్పుడు తెలీలేదు కొన్నేళ్ళ తర్వాత మేమిక్కడ స్థిరపడబోతున్నామని.

ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే దేశ విభజన గొడవలు ఉధృతమయ్యాయి. ఇక చదువు చాలించి వెనక్కి రమ్మని నాన్నగారు కబురుచేసారు. అప్పటికే రెండు సార్లు గాంధీజీ కలకత్తా వచ్చినప్పుడు ముఖర్జీతో పాటు నేను కూడా వెళ్లాను. ఆ ప్రభావంతో ఖద్దరు కట్టడం ప్రారంభించాం ఇద్దరం. ఒకసారి కలకత్తాలో ముఖర్జీ చిత్రాల ప్రదర్శన ఏర్పాటుచేస్తాం. అతని గురించి పత్రికలు విపులంగా రాసాయి. ఆ వార్త ఖండాంతరాల్లోకి వెళ్ళింది. చాలా కళాఖండాలు అమ్ముడుపోయాయి. వచ్చిన డబ్బును స్వాతంత్ర్య పోరాట నిధికి ఇచ్చేసాడు ముఖర్జీ అప్పుడే నాకతని మీద ప్రేమలాంటిదేదో జనిస్తోందని అర్ధమైంది. నాన్న ఈ సారి మనిషిని పంపించారు. ఇంటికెళ్ళగానే నాకు తెలిసిందేంటంటే భార్య పోయిన మరో జాగీరుతో నా పెళ్లి నిశ్చయించేశారని. పుస్తకాలూ, సర్టిఫికెట్లు తెచ్చుకుంటానంటే కూడా ఇల్లు కదలనీయలేదు. నేను కలవరపడి ముఖర్జీకి ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు. రేపు నా వివాహం జరగాల్సి ఉండగా ఈ అర్ధరాత్రి హఠాత్తుగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రకటన వెలువడింది. అంతా ఆ ఉత్సవాల సంరంభంలో ఉండగా నన్ను చిన్నప్పుడు పెంచిన ఆయా సాయంతో ఇంట్లోంచి బైటికి వచ్చి కలకత్తా వెళ్ళిపోయాను. ముఖర్జీ శాంతినికేతన్ లో లేడు, అతని స్నేహితుల్ని అడిగితే తెలిసింది. శాంతినికేతన్ వదిలి పల్లెకు వెళ్లిపోయాడని.

నేనతన్ని వెతుక్కుంటూ ఆ చిన్న పల్లెకు వెళ్ళేను. బెంగాల్ విభజింపబడింది. కొట్లాటలు, చంపుకోవడాలు కొనసాగుతున్నాయి. దేశం అల్లకల్లోలంగా ఉంది.

ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - సుఖం - by k3vv3 - 11-06-2025, 12:10 AM



Users browsing this thread: 1 Guest(s)