Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#95
అంతే! దున్నపోతు తలకాయతో పాటు అన్న తలకాయ కూడ తెగి అమ్మోరి ముందర పన్యాది. పజలందరూ సూచ్చాండంగానే చనంలో ఇంత గోరం జర్గిపోయినాది. సంతోసంగా జర్గుతాండే ద్యావర ఇసాదంగా మారినాది. ఏడుపులు పెడబొబ్బులతో ఆచోటంతా గోలగోల అయినాది. సాలన్న పెళ్ళాం మరిడమ్మ కూతురు ఈరినమ్మ కొడుకు మోదుగులయ్య రోదన అలివి కాలే. వలవలా ఏర్చి నెత్తి నోరు బాదుకుంటుండారు. పాలన్న ఏడుపును ఏదనను ఎవరూ ఆపల్యాక పోయినారు.
 
"పాలన్నా! నీదేం తప్పు లేదురా! మీయన్నా రొండోతూరి సెబ్బుతాడని నీకు తెలీక నరికినావు. పొర్పాటు నీదికాదు. తీరా నరికేప్పుడు సెప్పడం మీయన్నా సేసిన పొర్పాటు. ఐనా అలా జరగాలని వుందేమో! మడుసులం మనకేం తెల్సు? అందుకే జరిపోయినాది. బాదపడి లాబం లేదు. నువ్వు నిబ్బరించుకొని నీ వదినను పిల్లల్ను ఓదార్చు" వూరి పెద్దలంతా చెప్పి నెమ్మది పర్చినారు పాలన్నను.
 
పెద్దలంతా అబ్బటికబ్బుడు పెద్దమ్మ మాన్యం బూముల్ని శాసిపితంగా సాలన్న కుటుంబమే సేద్యం సేసుకొని బతకొచ్చని నిర్నయం తీసుకున్యారు.
 
ఇట్టాటి పరిచితి ఉండగానే సుంకన్న సిన్నగా జనాన్ని తొలగదొబ్బుకొని అమ్మోరి గుడి దగ్గిరకొచ్చి అమ్మోరికి మొక్కి, పార్తాండే నెత్తురు కుడికాలికి పూసుకొని జనం ఎలపలికి వొచ్చినాడు. ఊరిసుట్టూ పొలి సల్లక తలికే పొలి ఎత్తక పొవాలని సుంకన్నకు ముందుగాలనే తెలుసు.
బయలుకు వొచ్చిన సుంకన్న"అర్రరోయ్! మీ వూరి పొలి మా వూరికి ఎత్తక పోతాండా రోయ్!" అనీ గెట్టిగా కేకేసి అనిమెల దిట్టు ఉడాయించినాడు సుంకన్న. అంత గందరగోళంలోనూ కాటంరాయుడు సుంకన్న మాటలు ఇన్యాడు. చనాల్లో తేరుకొని జనాన్ని యవకుల్ని సమాయత్త పరచినాడు. యువకులంతా యాటకొడళ్ళు మచ్చుకత్తులు ఈటెలు గండ్రగొడ్డెళ్ఫు తీస్కొకొని సుంకన్నను యంబడించినారు.
 
వూరి యెలపల వడివడిగా ఉరికెత్తుతాండడు సుంకన్న. పొలిమేర ఐదు కిలోమీటర్లు వుండాది. దద్దనాలోళ్ళు కేకలేసుకుంటా యంబడించి వొచ్చాండరు. సుంకన్న చిక్కకుండా కాలికొద్దీ పరిగెడ్తాండడు. పరుగులో పట్టుదల కన్పడ్తాండది. కాటంరాయుడు అతని మడుసులు "ఎలాగైనా దద్దనాల పొలి అనిమేలకు పోగూడ్ద"ని సుంకన్నను యంటాడుతా వొచ్చాండరు.
 
"ఏమైనా పొలి అనిమేలకు చేర్చాల" ని పరుగులో ఏగం పెంచినాడు సుంకన్న. మొదటి మైలురాయి దాట్నాడు.
 
నరకూ! పొడచూ! కోబలీయని దద్దనాలోళ్ళ అరుపులు కేకలు వీపెనుకే ఇనపడ్తాండయ్ సుంకన్నకు. సుంకన్నను పట్టుకోవడానికి కాటంరాయుడు, పొలిని పొలిమేర చేర్చడానికి సుంకన్న బిస్సగా పరిగెడ్తాండరు. సుంకన్న రెండవ మైలరాయి దాట్నాడు. సుంకన్న పరిగెత్తే ఏగంలో తలగుడ్డ ఎగిరిపోయినాది. చొక్కా ఊడిపోయినాది. పంచ రాలిపోయినాది. బనిగెను డ్రాయరు మాతరమే వొంటి మీద వుండాయి.
 
"పానం పోయినాసరే పొలిని మాతరం అనిమేలోళ్ళకు అందిచాల" సుంకన్న దుడంగా నిర్నయించు కున్యాడు. మూడవ మైలురాయి గూడా దాటుకున్యాడు. కాటంరాయుడి గుంపు అందుజాపులకు వొచ్చాండాది. యారముట్లు ఇసుడ్తాండరు. ఈటె సుంకన్న ఎడమపక్క రాసుకుంటా బోయినాది. గొడ్డెలి కుడిదిట్టు ఇసురుకుంటా బోయినాది. మచ్చుకత్తి తలకాయ మీద ఎంటికలు తగులుకుంటా బోయినాది. ఐనా సుంకన్న పరుగు తీచ్చానే వుండాడు.
 
నాలగోవ మైలురాయి గూడా చావుజంపుల దాట్నాడు. కాటంరాయుడోళ్ళు కిందామిందా పడ్తా వొచ్చాండరు. సుంకన్న శాయసత్తుల పరిగెత్తుతానే వుండాడు. ఇంగా అనిమెల పొలమేర ఇరవై అడుగులే వుండాది. సుంకన్న ఉద్దేగంగా అడుగులు ఏచ్చాండడు. పొలిమేరలో వున్న అనిమెలోళ్ళు "రా.. సుంకన్నా! పరిగెత్తు.. సుంకన్నా!" అంటూ సేతులూపుతా అరుచ్చాండారు. అందరిలోనూ బయాందోలన సోటు సేసుకున్యాది.
 
ఇంతలోపల పొలిమేర పదడుగులు ఉందనగా దద్దనాలోళ్ళు సుంకన్నను అందుకున్యారు. కాటంనాయుడు అటాత్తుగా బయానకంగా సుంకన్నను యాటకొడవలితో తలకాయ నరికినాడు. తల ఎగిరి ఆంత దూరం పన్యాది. తావంతా రానారగతమైనాది. ఐనప్పటికీ మొండెం పరిగెత్తుతాపోయి అనిమెల పొలిమేర అవతల పన్యాది.
 
బెడిల్ బెడిల్ అని ఉరిమినాది. పెటిల్ పెటిల్ అని మెరుపు మెరిసినాది. మెరుపు వెలుగులో పొలి రాసుకున్న కాలు అనిమెల పొలిమేరలో పడి ఉండడాన్ని దద్దనాలోళ్ళు అనిమెలోళ్ళు సూసి ఆచర్యపన్యారు.
 
"సచ్చి సాదించినాడు రా..! మొగోడు రా..! వీరుడు రా..!" అనుకుంటా ఎనిక్కి ఎలబారినారు దద్దనాలోళ్ళు సేసేది ఇంకేమి లేక.
 
ఉరుం మీద ఉరుం, మెరుపు మీద మెరుపు మెరిసినాది. మోడాలు గుంపులు గుంపులు కొండలెక్క ఆకాసంలో పరిగెత్తా వొచ్చాండయ్. పుల్లచినుకుల్తో మొదలు బెట్టిన వాన జడివానగా మారి దడిగట్టి నిలకురిసినాది. ఒక వీరుడు మరణించినందుకు ఓపలేని బాద అందర్లో అలుముకున్యాది.
 
అందరితో పాటు పొలిమేరలో వున్న జంబులన్న"మీ మూర్ఖత్వానికి ఒక మంచి మనిషిని బలి తీసుకున్నారు కదరా!" అని విపరీతంగా బాదపన్యాడు.



సుంకన్న శవాన్ని ఏడ్చుకుంటా! తలలు బాదుకుంటా! తడ్చుకుంటా! మోసుకొని పోయినారు అనిమెలోళ్ళు.
దప్పికగొన్న బూములు దప్పిక దీడ్చుకున్నాయి. పానంబోయిన చెట్లు చేమలు పానం బోసుకున్నాయి. అన్ని జీవరాసులు ఊపిరి పోసుకున్నాయి. యేరు పారినాది చెరువులు కుంటలు నిండినాయి. దొరువులు దొర్లినాయి. అలుగులు పొర్లినాయి. పొలాలన్నీ పచ్చదనం నింపుకున్యాయి. అనిమెలకు మల్లా ఆకుపచ్చ కళొచ్చినాది.

వానలు పడడమూ, పడకపోవడమూ సహజమైనా.. జనం వాన కోసం ప్రయత్నించినపుడు వానలు పడితే మూడనమ్మకాలకు బలం పెరుగుతుంది
 
===========================================================
***సమాప్తం***
===========================================================
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక (జానపద) - పొలిమేర - పార్ట్ 1 - by k3vv3 - 13-05-2025, 01:46 PM



Users browsing this thread: