Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#72
దీపావళి విడుదల - కోటమర్తి రాధా హిమబిందు
 
[Image: image-2025-05-10-091200736.png]
వీరేశానికి కొడుకు నుండి ఫోన్ వచ్చింది. కల్పవల్లి ఫోన్ తీసుకొని పరిగెత్తుకుంటూ భర్త దగ్గరికి వచ్చింది.

“ఏంది” వరండాలో పడకుర్చీలో కూర్చుని దినపత్రిక చూస్తున్న వీరేశం వెలుగులు చిమ్ముతున్న భార్య ముఖం చూసాడు.

“సతీషు ఫోన్ చేస్తున్నడు” అంటూ ఫోన్ ఇచ్చి కుర్చీలో కూర్చొని కొడుకు ఏం మాట్లాడతాడా అని ఆరాటంగా చూసింది.

“నాన్నా.. స్పీకర్ పెట్టండి.. అమ్మ కూడా వింటుంది.. అమ్మా.. సినిమా దాదాపుగా అయిపోయింది. దీపాలళి సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. పదిరోజుల్లో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. నాన్నా.. అమ్మా.. మీకు సంతోషంగా వుందా?”

“ఇద్దరికీ చాలా చాలా సంతోషంగా వుందిరా.. సతీషూ.. యాంకరు అమ్మకూ నాకూ ఎంతో ఇష్టమైన ఉమే కదా”

“ఆమే నాన్నా. సినిమా అనుకున్నప్పటినుండే ఆమే ఖచ్చితంగా వుండాలని అమ్మా మీరు కోరారు కదా”

“ఆమెను టీవీలో చూడటమే. ఇప్పుడు ఎదురుగా చూడటం అంటే భలే బాగుందిరా” ఉత్సాహంగా అంది కల్పవల్లి.

“అమ్మా. నా సినిమా రిలీజ్ కాబోతుంది. నా గురించి మాట్లాడకుండా యాంకర్ గురించి మాట్లాడతావేంటమ్మా?”

“నా కొడుకు గురించి వేరే మాట్లాడాలా? నువ్వు ఉద్యోగం వద్దనుకుని అమెరికా నుంచి వచ్చినవు సినిమా తీయటానికి”

“అమ్మా..వీలు చూసుకుని మళ్ళీ మాట్లాడతా. హీరోగారు వచ్చారు. నాన్న.. మీరు ఈ లోపే ఒకసారి నన్ను అక్కడికి రమ్మన్నారు. కానీ నాకు కుదిరేట్టు లేదు. పాసులు పంపించినప్పుడు మీరే రండి. వుంటాను” కాల్ కట్ చేశాడు సతీష్.

“ఎంత ప్రాణమేంటే కొడుకంటే నీకు? అంతగా ఉరుక్కుంటూ వచ్చావు. సినిమా దర్శకుడిగా తొందరలో నీ కొడుకు పేరు వెండితెర మీద కనపడబోతదని సంతోషం..అంతేనా? దర్శకుడు గారి అమ్మ. సినిమా దర్శకుడిని కన్నతల్లి. ఇప్పుడే ఇట్లా ఉన్నవు. రేపటి రోజున ఎంత గొప్పలు పోతవో?” నవ్వుతూ అన్నాడు వీరేశం.

“అట్లాంటి గొప్పలన్నీ నీకే..నాకేం లేవు. ఒక్కగానొక్క కొడుకుని ఇక్కడ బాగా చదివించినవు. ఆ తర్వాత అమెరికా పంపినవు. అక్కడ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేసుకుంటున్నొడ్ని సినిమా తీస్తా అంటే ఒప్పుకొని ఇక్కడికి రప్పించినవు. వాడు ఏది చేస్తనన్నా నువ్వు సరే అంటవు. మధ్యలో నాదేమన్నా వుంటదా? వాడిపై నీకు చచ్చేంత ప్రేమ. నీకు సినిమాలంటే ఇష్టం. నీ కొడుకు సినిమా తీస్తానంటే ఎగిరిగంతేసినవు”

“ఎగిరినా చతికిలపడనులే. నలభైఎకరాల పొలం ఉంది. సినిమా తీస్తా అంటే. నిర్మాతతోపాటు ఇంకో నిర్మాతగా వాడు నన్ను పెట్టాడు. సరే అన్నాను. నేను సంపాదించిందంతా వాడి కోసం కాదా.. ధైర్యంచేసి వాడు అడిగినంత డబ్బు ఇచ్చినా.
  అంతకంత లాభమే మనకు వస్తది” అంటున్న వీరేశాన్ని కళ్ళనిండుగా ప్రేమగా చూసుకుంది కల్పవల్లి.
*****                                        *****
కొడుకు సతీష్ వి చంద్ర సినిమా డైరెక్టర్ కావటం..ప్రీ రిలీజ్ ఫంక్షనుకు పదిపాసులు పంపటం తండ్రి వీరేశానికి ఎనలేని సంతోషం కలిగించింది. తన వాళ్లందరికీ ఫోన్ చేసి చెప్పుకున్నాడు.. పక్క వీధిలో ఉండే బావమరిదిని పిలిచి విషయం చెప్పాడు. బావమరిది మల్లేష్ ఆనందంతో ఊగిపోయాడు. ఊరంతటికీ ఈ వార్త చెప్పాడు. రెండు రోజుల్లో హైదరాబాద్ పోతున్నట్లు కొన్ని పాసులే ఉన్నాయి కాబట్టి అందర్నీ తీసుకోపోలేకపోతున్నామని.. సినిమా రిలీజు కాగానే అందరికీ తన డబ్బులతో సినిమా చూపిస్తానని బావ చెప్పమన్నాడని చెప్పాడు.

ప్రతీ ఒక్కరూ తమ ఇంట్లో వేడుక అన్నట్లు
   సంతోషంగా వచ్చి వీరేశాన్ని కల్పవల్లిని అభినందించారు. సతీష్ వి చంద్ర అక్కడ లేకున్నా పొగడ్తలతో ముంచెత్తారు. కల్పవల్లి వంటమనిషిని మాట్లాడి రుచికరమైన వంటకాలు వండించి పరండాలో అరిటాకులు వేసి భోజనాలు పెట్టించింది ఆ తర్వాత కొడుకు గురించి ముచ్చట్లు పెట్టింది. సాయంత్రం వేళ టీ కాఫీలు ఇచ్చి అప్పుడు కానీ అందర్నీ పంపలేదు.
*****                                                             *****
ఒక వ్యాను మాట్లాడుకుని తన ఇంటి సభ్యులలో ముఖ్యమైన వారితో ఊరినుండి బయలుదేరి హైదరాబాదుకు వచ్చి అనుకున్న సమయానికి ఇండోర్ స్టేడియంకు చేరుకున్నారు వీరేశం కల్పవల్లి మిగతావాళ్ళు. కొడుకును స్టేజీమీద చూసి పొంగిపోయారు వీరేశం కల్పవల్లి.. తనకు తన భార్యకు ఎంతో ఇష్టమైన యాంకరు ఉమ హుషారుగా వేదిక మీద అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతుంటే ఆమెకు తామిద్దరినీ కొడుకు ఎప్పుడు పరిచయం చేస్తాడా అని తహతహలాడారు.

యాంకరు ఉమ తన మాటల చాతుర్యంతో తెగ మాట్లాడుతోంది. ముందుగా సినిమాలోని పాటలను పాడారు గాయని గాయకులు. మధ్య మధ్య కొంతమందిపై సెటైర్లు వేస్తూ జోకులు పేలుస్తూ అందర్నీ ఉత్సాహపరుస్తూ నవ్వించసాగింది యాంకరు. ముఖ్య అతిథిగా వచ్చిన
  మంత్రిని సాదరంగా ఇంగ్లీష్ లో వేదిక మీదికి ఆహ్వానించింది. మంత్రి ఇంగ్లీషులో చాలాసేపు మాట్లాడుతుంటే ఏమీ అర్థం కాలేదు వీరేశానికి.. కల్పవల్లి కూడా అయోమయంగా భర్తను చూడసాగింది. 

“ఏందిరా..మల్లేసూ..మంత్రి తెలుగోడే కదా.. ఇంగ్లీషులో మాట్లాడుతున్నడేంది? ఇదేంగోల? మనకేం అర్థమై చస్తదిరా”

“ఏమో..అదోరకమైన స్టయిలేమో?” నవ్వాడు ప్రక్కనే వున్న బావమరిది.

తర్వాత సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ముంబైకి చెందిన అమ్మాయి “అందరికీ నమస్కారం” అనేసరికి అంతా గొల్లుమంటూ అరిచారు. ఆ తర్వాత ఆమె అంతా ఇంగ్లీషులోనే మాట్లాడింది.
  హీరో కూడా ఇంగ్లీషులోనే మాట్లాడాడు. ఏమాత్రం అర్థంకాకున్నావినక తప్పలేదు వీరేశానికి, కల్పవల్లికి, వాళ్ల వెంట వచ్చిన మిగతావారికి… ఏదో కళ్ళప్పగించి చూడటం తప్ప వాళ్ళందరికీ ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. మంత్రిగారు ఏదో అర్జెంట్ పనివుందని వెళ్ళిపోయాడు. చివరాఖరికి సతీష్ వి చంద్ర కూడా ఇంగ్లీషే మాట్లాడటంతో వీరేశానికి పిచ్చి కోపం వచ్చింది.

అదే సమయంలో తల్లి తండ్రిని వేదిక మీదికి పిలిచాడు కొడుకు. భార్యతో వేదిక మీదికి వచ్చాడు వీరేశం. ఇంగ్లీషులో వాళ్ళను పరిచయం చేస్తూ వాళ్ల గురించి చెప్పాడు సతీష్ వి చంద్ర.

“ఎందుకొచ్చినట్లు మనం? నీకేమన్నా అర్థం అవుతుందా?” ప్రక్కనున్నకల్పవల్లిని గుసగుసగా అడిగాడు వీరేశం.

“నాకా?నీకే అర్థంకావడం లేదు. ఇంగ నాకేం అర్థమవుతది ఇంగ్లీషు? నువ్వు మూడు చదివితే నేను ఐదు చదివాను. అంత మాత్రాన నాకు ఇంగ్లీషు అర్థమైతదా? కొంటెగా నవ్వుతూ చూసింది కల్పవల్లి. వీరేశానికి తానేం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలో చాలా చిరాగ్గా కొడుకు చేతిలోంచి మైక్ లాక్కున్నాడు.

“యాంకరమ్మా..ఇన్ని జోకులు వేస్తవు..చెప్పిన మాట చెప్పకుండా చెప్తవు..ఏం..నువ్వు వీళ్ళను మన తెలుగుభాషలో మాట్లాడమని చెప్పలేవా? అబ్బబ్బ..టీవీలలో చూపించే సినిమా ఇంటర్యూలలో ఇదే గోల..ఇక్కడ ఇలాంటి చోట అంతే.. ఎవరు చూడు ఇంగ్లీషులో మాట్లాడటమే, ఒక్క ముక్క మాకు అర్థం కాకపోయే, ఇది తెలుగుసినిమా, ఇంగ్లీష్ సినిమా
   కాదు. మీరంతా తెలుగోళ్ళు.. ఇంగ్లీషోళ్లు కాదు. హీరోయిన్ ముంబయి పిల్లకంటే తెలుగు రాదు..పోనీ అని అనుకుందాం. హీరోకు ఏమైంది? మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయే.. ఇప్పుడంటే సినిమాలు చేసి బాగా సంపాదించిండు.. ఏమాత్రం మేము తెలవనట్లే వుంటడు. అయినా మేం ఏమీ అనుకోం.. నేను చెప్పేదేంటంటే, మన భాష తెలుగు.. నాలుగు పైసలు వచ్చినంత మాత్రాన భాష మార్చుకోవాలా? నా కొడుక్కి ముందే నేను చెప్పిన.. ఎప్పుడు నువ్వు తెలుగులోనే మాట్లాడాలి అని..వాడికీ వీళ్ళందరి జిడ్డు అంటుకుందేమో.. వాడూ ఇంగ్లీషులోనే మాట్లాడుతుంటే నా పరిస్థితి ఏంది? అరెరే.. నా కొడుకు సినిమా డైరెక్ట్ చేసే.. ఏం చేశాడో.. ఎట్లా చేశాడో నాకు మా వాళ్ళకు అర్ధం అవొద్దా? మాకు పాసులు ఎందుకు పంపినట్టు? మేం ఎందుకు వచ్చినట్టు? ఏం విని పోతున్నట్లు?  ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీషులోనే గొప్పలుపోతూ మాట్లాడుతున్నరు. మంత్రిగారికి తెలుగు వచ్చు.. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తెలుగులోనే మాట్లాడతడు కదా.. మరి ఇప్పుడేమైంది? ఎబ్బెబ్బే..అస్సలు బాగోలేదు.. యాంకరమ్మా.. నువ్వు చాలా తప్పు చేసినవు” ఎర్రటి కళ్ళతో యాంకరును వేలితో బెదిరిస్తూ అన్నాడు వీరేశం.

గలగల గోదారిలా మాట్లాడే యాంకరు ఉమకు అవమానంగా అనిపించి ఏం చెప్పాలో అర్థంకాక దొంగచూపులు చూసింది. కొడుకు తండ్రి చేతిలో మైకు లాక్కుని బాధగా ఉమకు ఇచ్చాడు.

“ఇప్పుడు మీ అందరికీ తెలియని ఒక విషయం చెప్తాను. డైరెక్టర్ అసలు పేరు సతీష్ చంద్ర..మధ్యలో వి అంటే మీకు తెలియదు కదా..నేను చెప్తాను.. వీరేశంగారూ” అంటూ వాతావరణాన్ని తేలిక పరిచేందుకు పెద్దగా అరిచి అందరి చేత చప్పట్లు కొట్టించింది.

తన మాటల ప్రవాహ ఉధృతంలో సతీష్ వి చంద్ర తల్లిదండ్రులని వేదిక నుండి కిందికి పంపింది. ఆ తర్వాత వీరేశాన్ని కల్పవల్లిని మిగతా వాళ్ళను కలిసింది.

“వీరేశంగారూ.. మీరు మేడమ్ గారు మిగతా వీళ్ళు నా అభిమానులు అని సతీష్ చెప్పాడు..నేను కూడా నిజంగా చస్తున్నాననుకోండి..మన భాష ఏంటి? మన సంస్కృతి ఏంటి? మీరు నన్ను నిలదీసి మరీ అడిగారు కానీ.. ఇంగ్లీషు మాట్లాడకండి అని నేను చెప్పటం పద్ధతి కాదు. నేను చెప్పలేనిది మీరు చెప్పారు.. థాంక్యూ.. ఇలా అంతా ఇంగ్లీషు మాట్లాడుకుంటూ పోతే మన తెలుగు భాష ఏమైపోతుంది? మీరు మాత్రం భలేగా బుద్ధి చెప్పారు. మీకు ఈ కడుపులో మంట ఎప్పటినుండి వుందో.. మొత్తం మీద
  చల్లార్చుకున్నారు. ఎవరో ఒకరు కంకణం కట్టుకొని ఇలా ధైర్యం చేయాలి” అంటూ కాసేపు వాళ్ళతో, అతని వెంట వచ్చిన మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి నవ్వుముఖంతో వాళ్ళను పంపించింది యాంకరు ఉమ. సరిగ్గా అదే సమయంలో డైరెక్టర్  సతీష్ వి చంద్ర తండ్రి మాటలకు అవమానభారంతో కినుక వహించిన హీరో వెంటపడి బ్రతిమాలుతున్నాడు. అతనికి కోపం తగ్గలేదు. నీతో ఇంకో సినిమా ఎప్పటికీ చేయనని వెళ్లిపోయాడు.
*****                                     *****
సతీష్ వి చంద్ర సినిమా అనుకున్నట్లుగా దీపావళికి విడుదల అయింది. ఉదయం ఆటతోనే ప్రతి ఒక్కరూ సినిమాని పొగడ్తలతో ముంచెత్తారు. కొడుకు ఫోన్ చేసి చెప్పిన మాటలకు మరింతగా ఉబ్బితబ్బిబ్బయ్యారు వీరేశం కల్పవల్లి.

“ఇండస్ట్రీలో టాప్ లో వున్న హీరోతో నేను పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను. మీరు చెప్పిన మాటలు వారికి బాగా నచ్చాయట..తను ఇకనుండి మీలాంటి వాళ్ళకు అర్థమయ్యేలా తెలుగులో మాట్లాడతానన్నారు.. కొత్తకథ రెడీగా వుంది కదా..అది హీరోగారికి బాగా నచ్చింది. దీపావళికే విడుదల కావాలని హీరో అన్నారు. దీపావళి వారికి సెంటిమెంట్ అట”

“అవునా..అయితే రాబోయే సినిమా బొమ్మ విడుదలకు కూడా యాంకర్, ఉమే ఉండాలి. మనకు అచ్చి వచ్చింది” అన్నారు ఆనందంగా వీరేశం కల్పవల్లి. ఆ మాటలకు ఖుషిగా సరే అంటూ అభయం ఇచ్చాడు సతీష్ వి చంద్ర.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - ఆంతర్యం - by k3vv3 - 10-05-2025, 09:12 AM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)