Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#90
అబ్బుడు అంకాల్రాయుడు లేసి తువాల ఇదిలిచ్చి బుజాన యేస్కొని సెప్పడం మొదులు బెట్నాడు-



"వూర్లో అందరికీ ఆవజివాలు (జవసత్వాలు) కుంగిపొయినాయి. బతుకులు సూచ్చే పంగదెంగులు (చెడిపోవడం) పదారబాట్లైనాయి. యెవరికీ బొట్టుపానం లేదు. కన్లల్లో పానంబెట్టుకొని ఊసబెండ్లలా ఈలకర్సుక(నేల కరుచుక)పోయి వుండారు. గెట్టిగా పడమటి గాలీచ్చే ఒగుడాకులా (పండాకు) బారడు దూరం పడేట్టు వుండారు. ఈల్లెవరూ ఈపనికి సమర్తులుకారు. ఒక్క సుంకన్నైతేనే తగినోడు. కార్యం సాదించగల సత్తా వున్నోడు. ఓర్పు నేర్పు చురుకుదనం పట్టుదల గలోడు. అంతోయింతో గెట్టిగా బలంగా వున్నోడు. వూరికి యేదన్న మేల్సేయాలన్న ఆసియం వున్నోడు. అతను దప్ప యేవడి వొల్లా గాదు. " అంకాలడ్రాయుడి మాటలకు అందరూ ఆసగా సూసినారు సుంకన్న దిట్టు.



"ఔనూ.. ఔనూ.. సుంకన్నే సమర్తుడు. " అని జనమంతా పలికనారు.



సుంకన్న ఉలికిపాటుగా అదిరి పన్యాడు. అదే జనంలో కుడ్చున్న చదువుకున్న జంబులన్న లేచి పంచాయతీ తీర్మానం తప్పు దోవ పడుతునందకు చింతించి "అయ్యా పెద్దలారా! వానరాక పోవడానికి ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన మార్పులు కారణం గ్గాని పొలి ఎత్తకపోవడం కాదు. అది వఠ్ఠి మూడనమ్మకం. పొలి తీస్క రావడంలో ప్రాణాలు పోతే అది మీ మూర్ఖత్వం, మీ మూడనమ్మకం కారణమవుతుంది. ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోకండి. వానలు ఆలస్యమైనా పడతాయి" అన్యాడు ఆందోళనపడతూ..



"చదవుకున్నోళ్ళు అట్టే అంటారు. ఆయన్ను వదిలైండ్రీ" అని ఆయన మాటల్ని పూచిక పుల్ల మాద్రిగా తీసిపారేసినారు జనం. సుంకన్న దిట్టు తిరిగి చెప్పమన్నట్టు ఆసగా సూసినారు.



"అయ్యలారా! నాగ్గూడా వూరికేదన్న మేలు సేయాలని వుండాది. గానీ నా అమ్మనాయినలు ముసలలోళ్ళు. తమ్ముడు చెల్లెలు న్యాదర(లేత) పిల్లోల్లు. నాకేమన్నైతే వాళ్ళు అన్నాయమైపోతారు. నేదప్ప వాళ్ళకు దిక్కులేదు. " ఇచారంగా చెప్పుకున్యాడు సుంకన్న.



జనం సుంకన్నను బతిమాలినారు. "వూరి యువకులంతా బెట్టబోయివుండారు. నువ్వే రోంత గెట్టిగా వుండావు. నువ్వు మాతరమే పొలి త్యాగలవు. నువ్వు పొలి తీసుకొని పరిగెత్తి వొచ్చే పొలిమేరలో మేమంతా అయుదాలతో సిద్ధంగా వుంటాం. నీ యంటబడొచ్చే దద్దనాలోళ్ళకు ఎద్రు నిల్బడి పోరాడ్తం. నీకేం బయం లేదు. " పోద్బలంగా (ధైర్యం) చెప్పినారు.



"ఊర్నీ ఇపత్తు నుంచి తప్పిచ్చాల. గానీ పొలి త్యావడమంటే జనాన్ని ఆదమరింపించి సైగ్గా (శబ్దం చేయకుండ) దెచ్చేది కాదు. అందరికీ ఇనబడేట్టుగా కేకేసి చెప్పి వాళ్ళకు చిక్కకుండా ఉరికెత్తి రావాల. అట్టాడప్పుడు మన అదుట్టం బాగల్యాక నా పానానికి ముప్పొచ్చే. నా వోళ్ళు యేంగావాల? ఇదీ ఉరకల పరుగుల యవ్వారం" అనమానం పన్యాడు సుంకన్న.



అబ్బుడికబ్బుడు పంచాయతీ పెద్దలు కాగితాలు తెప్పించి ఊరికి దిగదాల (క్రింది) యేటి గట్టునున్న పదేకరాల బూమి‌‌ ఊర్లో పడమటీది నున్న యాబై సెంట్లు సలం, అందులో నున్నా రేకులిల్లు, పసుల్దొడ్డి, కల్లంతో సహ రాచ్చినారు. లచ్చ రుపాయలు పోగుజేసి సుంకన్న చేతిలో బెట్న్యారు. సుంకన్న కేమన్నైతే గ్రామ పంచాయతీ సుంకన్న కుటుంబానికి నెలనెలా బత్తెమిత్తూ పిల్లల్ని చదివిచ్చి పయోజుకుల్ని సేసేటట్టూ నిర్నయం సేసి పంచాయతీ బుక్లో రాసినారు.



ఇంగ తప్పదన్నట్టు ఒప్పుకొని యకాయకిన యింటికి బోయి అమ్మనాయినకు ఇసయం సెప్పినాడు సుంకన్న. తల్లిదండ్రులు బోరున ఏర్చినారు.



"ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతుకుదాం నాయిన. మనకొద్దు ఈపనీ. మనకొద్దు కొడకా!" అన్సెప్పీ తల్లిదండ్రులు తల్లడిల్లి పోయినారు.



"నాకేం గాదులేమ్మా! సున్యాసంగా పొలి తీస్కొచ్చాను. పొలిమేర కాడ మనోళ్ళు ఆయుదాల్తో వుంటారు. బయపడాల్సిన పన్లేద"ని సెప్పి పంచాయిదిచ్చిన లెక్కా, బూమి పట్టాలు ఇచ్చినాడు. ఇంగా పంచాయతీ ఏమేమి నిర్నయాలు దీస్కొందో సెప్పినాడు.



" యేమీ నీ కన్నా యెక్కువ కాదు నాయినా! నువ్వే మాకు ఎదిగొచ్చిన పిల్లోడివి. నీ మీదే మా పానాలుండాయి. బతికుంటే కూలోనాలో చేసుకొని బతకొచ్చు. మా మాటిను బిడ్డా!" బతిమలాడినారు తల్లిదండ్రులు.



"అమ్మా! నాయినా! నాకేం గాదు. మీరు బాదపడి నన్ను బాద పెట్టకండ్రీ. ఊరికి మేల్సేసే అవకాషం మనకొచ్చింది. అది గొప్పనుకుంటాను నేను. ఇంగేం మాట్టాడకండ్రీ. పొలి తెచ్చానని ఊరికి మాటిచ్చిన." కరాకండిగా సెప్పినాడు సుంకన్న.



* * *



1970కి మునుపటి సంగతి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు కలర్ సినిమాలు వొచ్చాండేవి. అనిమెలకు దగ్గిరుండే కమలాపురం లాంటి సిన్న టవున్లల్లో టెంట్లుండేవి. దసరాబుల్లోడు కలర్ సినిమా వొచ్చిందని ఎద్దులబండి కట్టి ఆడమొగ పిల్లాజల్లా యింటిల్లపాది బోకుశాలగా సూడను పోయినారు. అప్పట్లో అదో ఇసిత్రం కలర్ సినిమాంటే. ఆదినాల్లో వూరూర ద్యావర్లు జరిగేవి. మూడనమ్మకాల మీద జనానికి నమ్మకం యేక్కువ వుండేది. అప్పటి కతయిది.



అనిమెల దద్దానాల మద్దిన దూరం పది కిలో మీటర్లు. అనిమెల గండేటి ఒడ్డున, దద్దనాల పాగేటి ఒడ్డున వుండాయి. మొదట్లో అనిమెల్లో సకాలంలో వానలు గురిసి, ఏరు పారి‌‌, చెరువు నిండి, పంటలు దండిగా పండి, పాడి మెండుగా పెరగి ఊరు కళకళాడ్తుండినాది.
దద్దనాల్లో వానలు కురువక, ఏరు పారక, చెరవు నిండక, పంటలు పండక, పసువులకు మేతల్యాక నానాక ఇబ్బందులు పడేటోళ్ళు. చెప్పను అలివిగాని ఇడుములు ఇక్కట్లు అనబయించేవోళ్ళు.



అట్టాటబ్బుడు అనిమెల అన్నెందాల బాగున్నందున వూరిపై దద్దనాలోళ్ళ కన్నుపన్యాది. అనిమెల్లో పోలేరమ్మ ద్యావర జరేగేబ్బుడు అనిమెల పజలు అజాగరతగా ఉండేది సూసి దద్దనాలోళ్ళు వోళ్ళ పొలిని ఎత్తుక పోయినారు. అనిమెలోళ్ళు ఎగాసగా పడి ఆయుదాలందుకొని యంటపడే సరికి ఊరుదాటి పొలిమేర గూడా దాటిపోయినారు.



అప్పట్నుంచి అనిమెలను కరువు తొందుకొని నలిపి సంపుతాంది. తమ పొలి తాము తెచ్చుకుంటేగాని తమ ముందటి వైబోగం తమకు దిరిగి రాదని అనిమెలోళ్ళు నిర్నయించుకున్యారు. పమాదకర కార్యాన్నీ నెరవేర్చేకి సుంకన్న పూనుకున్యాడు.



[font=var(--ricos-font-family,unset)]====================================================================[/font]
ఇంకా వుంది[font=var(--ricos-font-family,unset)]..[/font]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - ఏకలవ్యుడి కథ - by k3vv3 - 05-05-2025, 05:22 PM



Users browsing this thread: 1 Guest(s)