10-04-2025, 08:49 AM
(This post was last modified: 16-04-2025, 12:52 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
![[Image: image-2025-04-16-125113576.png]](https://i.ibb.co/svsNwB2r/image-2025-04-16-125113576.png)
అప్పటికి రెండోవాయ చంద్రకాంతులు నూనెలో వేస్తూ... గంభనంగా నవ్వునాపుకుంటూ - "అలాగే జరిగింది" - అనింది నాతో అమ్మమ్మ, నా ప్రశ్నలన్నింటికీ జవాబుగా! నాకయితే అంత మురిపెంగా చెప్పిన అమ్మమ్మని మెడచుట్టూ చేయివేసి ఒక్కసారిగా కావలించుకోవాలన్పించింది గానీ... ఇప్పటికీ, మామూలుగా మధ్యాహ్నం వేళ, పలహారాలు తయారుచేస్తున్నా సరే... మడి గట్టుకుని చేసి, తొలి వాయుదేవుడికి నైవేద్యం పెట్టిగాని అమ్మమ్మ తనని ముట్టుకోనివ్వదు. ఈ విషయంలో మాత్రం రూల్సు దాటడానికి వీల్లేదన్న విషయం బాగా తెలిసినదానినే గనకా నా కోరికను అలా అర్ధాంతరంగానే ఆపుకుని, మళ్లీ సంభాషణని పొడిగించాను.
"అయితే అమ్మమ్మా! నీ మనసుకి కష్టం కలిగేది కదా?" అన్నాను. మా సంభాషణ అంతా తాతయ్య నడివయసులో నడిపిన శృంగార కలాపాల గురించి నడుస్తోంది.
తాతయ్యకి ఇతర స్త్రీలతోటి సంబంధాలని గురించి అమ్మమ్మ అంత సాధారణంగా ఎలా మాట్లాడగలుగుతోందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంక ఉండబట్టలేక "అమ్మమ్మా! ఇవాళ నీ వయసు మళ్ళినప్పటి సంగతివేరు.
ఆనాటికి నువ్వు చిన్నదానివే కదా! నీకు తాతయ్యకున్న ఇతర సంబంధాలు గురించి కష్టమే కలగలేదంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు?? అన్నాన్నేను రెట్టించి.
అమ్మమ్మకీ నాకూ మధ్య ఉన్న నలభై ఏళ్ళ వ్యత్యాసం మా స్నేహానికి ఏనాడూ అడ్డు రాకపోవడం వింతగా ఉంటుందేమోగానీ, మా అమ్మమ్మ నాకు మంచి స్నేహితురాలు.
"కష్టమా కాదా అన్నది ఆ ఇద్దరి మధ్యా ఉండే ఆకర్షణ మీదా... అవసరం మీదా ఆధారపడి ఉంటుందే అమ్మాయీ..." అంది అమ్మమ్మ. "మీ తాతయ్యకీ నాకు అలాంటి అవసరం అంత బలంగా ఆనాడు కలిగింది లేదు.
ఆ మాట అంటున్నప్పుడు అమ్మమ్మ గొంతులో ఏ కాస్త తడబాటు లేదు. వేదనా లేదు. నిరాశా నిర్లిప్తతా కూడా లేవు. అమ్మమ్మ చాలా స్పష్టంగా మాట్లాడిన ప్రతీమాటనీ అత్యంత ఆసక్తితో విన్నాన్నేను.
"అది అలా జరిగింది మరి" అంది అమ్మమ్మ. "నాకు పెళ్లయ్యేనాటికే మీ తాత. బహిరంగంగానే మాలక్ష్మి ఇంటికి వెళ్లి వస్తూండేవారు. ఆయన కులాసా పురుషుడని ఆనోటా ఈ నోటా విన్నా - మా వాళ్ళు దాన్నంత గణనలోకి తీసుకోలేదు. నాకప్పటికి పధ్నాలుగేళ్ళు. ఏ విషయమూ తెలిసీ తెలియని వయసు. వంటినిండా అణుకువా... భయమూ ఉండేవి తప్ప దేని గురించీ ప్రశ్నలే తలెత్తేవి కావు. పైగా నా లోకమంతా సత్కావ్యమయం!" అంటూ కాసేపాగింది అమ్మమ్మ. "మరి తాతయ్యో?" అన్నాన్నేను. మీ తాతయ్యకేవీ?! పరమ లౌకికుడు. నాలా కాక పుస్తకాల అవసరం దాటినవాడూనూ" అంది హాస్యంగా.
అమ్మమ్మని తిరిగీ సంభాషణలోకి మళ్లించటంలో ఏ మాత్రమూ ఏమరిపాటు చూపలేదు నేను. అందువల్ల అవీ ఇవీ మాట్లాడి జారిపోకుండానూ అమ్మమ్మ దారి మళ్ళకుండానూ నా ప్రశ్నలతో కాచుకుంటూ వచ్చాను నేను. నన్ను నిరాశ పరచకుండా నా సందేహాలన్నీ తీరుస్తూ అమ్మమ్మ మాట్లాడింది.
"నేను పుష్పవతినయ్యాకా కాపురానికైతే వచ్చాను గానీ... మరీ చిన్నదాన్ని. ఆటపాటల మీద ఉన్నంత శ్రద్ధ నాకు ఆయన మీద ఉండేది కాదు. ఆయన కూడా అప్పట్లో నన్ను చిన్నపిల్లగానే చూశారు. అదీగాక మా మధ్య వయసు తేడా చాలా ఉంది. మీ తాతయ్య నాకన్నా పదిహేనేళ్లు పెద్ద. పురుళ్లకనీ, పుణ్యాలకనీ నేనెక్కువ పుట్టింట్లోనే ఉండేదాన్ని. పైగా మా ఇంట నేనొక్కతనే ఆడపిల్లని. ఎంతసేపూ మా జట్టు పిల్లలతో ఏటిదాకా పోయి తోట్లంటా దొడ్లంటా తిరగటం, ఏటిలో ఈతలు కొట్టడం, అప్పల్రావుడి కన్ను గప్పి తోటలో చొరబడి మామిడికాయలు కోసుకోవడం ఈ పన్లంటే చాలు మనసు ఉరకలేసేది నాకు. మరి కాస్త పెరిగాకా ఆరోజుల్లో నా మనసునెక్కువ నాకర్షించినవి సంస్కృత కావ్యాలూ, నాటకాలూనూ!!
"నీకు తెలుసుకదా! మా పుట్టింట అంతా సురభారతీ సేవకులే! మా ముత్తాతలు, తాతలూ సంస్కృత పండితులు. కావ్య తర్క వ్యాకరణాలలో రచ్చగెలిచి ఔనన్పించుకున్న వాళ్ళూనూ! మా ముత్తాతగారువీధి సావిట్లో - వాలు కుర్చీలో కూర్చుని, కళ్ళు మూసుకుని, అలా శిష్యులు వల్లెవేసే శ్లోకాలవైపూ సూత్రాలవైపూ ఒక చెవివేసి వింటూ, తలపంకిస్తూ ఉంటే... ఆయన ఎదురుగా అప్పటికే తలనెరిసిన మా తాతగార్లందరూ ఆయన ముందు చాలా వినయంతో మసలటం నాకింకా జ్ఞాపకం ఉంది. సంస్కృత నాటకాలని మా చిన తాతగారు పాఠం చెబుతూ ఉంటే వినడం ఎంత బాగుండేదనీ!! అందరూ కాళిదాసు శకుంతల అంటారుగానీ... నాకు శూద్రకుడి వసంతసేన మీదనే ఎక్కువ మక్కువ ఏర్పడింది."
మా నాయనమ్మ చాలా శ్రావ్యంగా అష్టపదులు మొదలుకొని, తరంగాలనించి, ఆధ్యాత్మ రామాయణం దాకా తన్మయత్వంతో పాడుతూ ఉండేది. "అచ్యుత మాధవహరి రామేతి కృష్ణానంద పరేతి" - అంటూ పాడుతూ కళ్ళు మూసుకుని, తన గాత్ర మాధుర్యంలో తానే లీనమయ్యే నాయనమ్మ ముఖం ఇప్పటికీ నా కళ్ళలో కదలాడుతుంది. నాయనమ్మ పాటతో పెరిగిన దాన్ని నేను. "జయదేవుడంటే ఎంతో అనురక్తి ఏర్పడింది నాలో! నన్ను నేను వసంతసేనగానూ, గోపికగానూ భావించుకునేదాన్ని. ఎంత చక్కగా అలంకరించుకునేదాన్నో తెలుసా"? సంతోషంగా అంది అమ్మమ్మ.
అటూ ఇటూ కదులుతూ, పనిచేస్తూ ఇలా మాట్లాడుతున్న అమ్మమ్మని గమనిస్తున్నాను నేను. అమ్మమ్మ అందం వాసి తగ్గలేదిప్పటికీ! సన్నగా పొడవుగా కంచుకడ్డీలా ఉంటుంది అమ్మమ్మ శరీరం. పట్టుచీరని అడ్డకచ్చ కట్టుకుని, తనువంతా పసుపురాశి పోసినట్టు పచ్చగా ఉంటుంది అమ్మమ్మ. నిత్యమూ పసుపుతో విరాజిల్లే... అమ్మమ్మ పాదాలని కప్పుతూ వెండి కడియాలూ... వెండి గొలుసులూ, అమ్మమ్మ కంటానికి అతుక్కుని బంగారపు నానూ, పట్టెడ, మంగళసూత్రం, నల్లపూసల కుత్తిగంటూ, చేతులకీ బంగారు గాజులు, వాటిమధ్య ఎర్రటి మట్టి గాజులూ ఆవిడ శరీరంలో ఒక భాగమైనట్టుగా మెరుస్తూ ఉంటాయి. నెరసిన బారెడు పొడవైన తన తల వెంట్రుకలని జారు ముడి వేసుకుంటుంది. మడి మధ్యలో ఎర్రటి ముద్దమందార పువ్వుని ఎప్పుడూ వాడకుండా చూసుకుంటుంది. ఆవిడ తన ఆకర్నాంత నేత్రాలనలా భావస్ఫోరకంగా కదుపుతూ ఉంటేనూ... అటూ ఇటూ తల తిప్పుతూ మాట్లాడుతున్నప్పుడల్లా ఆవిడ ముక్కున పుష్యరాగ పొడితో తళుక్కుమంటూండే, ఆ నిమ్మగుత్తి ముక్కుపుడక మీద కిరణాలు పడి చెదిరి పోతుంటేనూ... విశాలమైన ఆవిడ నుదుటిమీద ఎర్రటి కుంకంబొట్టూ, కళ్ళకి కాటుకా, తాంబూలంతో పండిన ఆ పలచటి పెదాలూ... గడ్డం కింద సదా ఎండిన గంధపుచారా... తన ఒక్క శరీరంలో ఇంత వైవిధ్యాన్ని ఆవిడ ఎలా నిలుపుకుందో ఎప్పుడూ నాకు ఆశ్చర్యమే!!
ఇతర ధారావాహికాలు
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
