Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#65
[Image: image-2025-04-09-083617941.png]
దీపావళి పండక్కి అల్లుడికి రావడం కుదరదుట. మనల్నే వాళ్ళింటికి రమ్మని ఫోన్ చేశాడు అని చెప్పాడు భార్యతో కృష్ణమూర్తి.
అదేంటి! కొత్తల్లుడు కదా, పండక్కి తను అత్తారింటికి రావడం మానేసి, మనల్ని రమ్మనమనడం ఏమిటి? పిలిచాడు కదాని.. మనం అల్లుడింటికి వెళ్ళడం ఏమిటి? ఏం బావుంటుంది? అంది రుక్మిణి.
“అదేమాట నేనూఅన్నాను. ఆ! అవన్నీ పాతకాలం పద్ధతులు మామయ్యగారు. మీరు నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా ఇక్కడివచ్చేయండి. పన్లోపనిగా మా అమ్మానాన్నగార్లని, చెల్లెలు బావగారిని కూడా ఇక్కడికే పిలిపిస్తాను. మా బావమరిది, చెల్లెలు...అదే మీఅబ్బాయి,కోడల్ని కూడా పిలిచేస్తాను. గ్రాండ్ గాలాదీపావళి సెలెబ్రేట్ చేస్కుందాం అన్నాడు.” అని అల్లుడితో జరిగిన మొత్తం సంభాషణ చెప్పాడు కృష్ణమూర్తి.
“ఇది మరీన్నీ! మనమే ఎక్కువ అనుకుంటే వాళ్లందర్నీనా? వియ్యాలవారు ఏం అనుకుంటారు?” అంది రుక్మిణి.
“వాళ్లనుకోవడం సంగతి సరే! ఒకవేళ వెళ్లామే అనుకో. ఎంత వాళ్ళింట్లో మనం ఉన్నా, మనమే అల్లుడికి అమ్మాయికి బట్టలు పెట్టాలి. ఇంక అల్లుడన్నట్టు మిగతవారందరూ వస్తే కనుక, వియ్యాలవారికీ,  అల్లుడి చెల్లెలు బావగారికీ, వాళ్ళ పిల్లలకీ  మనమే బట్టలు పెట్టాలి. ఇంక మనబ్బాయి,కోడలు, మనవడే కనుక వాళ్ళకీ మనమే బట్టలుపెట్టాలి. పోనీ, వాడిబట్టలు వాడే కొనుక్కుంటాడనుకుందాం. అయినాగానీ అందరి బట్టలఖర్చు మనదే. ఇవన్నీఒకెత్తు. దీపావళి సామాన్లఖర్చు ఒకటి. అల్లుడి ఈ ఆహ్వానంవెనుక  ఇంత పెట్టకుట్ర ఉందంటావా!?” అన్నాడు కృష్ణమూర్తి.   
“మీరూ! మీ పిచ్చిమాటలూనూ!? కుట్ర ఏమిటండీ? వాళ్లేమన్నా శత్రువులా? లేక ప్రతిపక్షాలా? పెట్టేబట్టలకికూడా అలా మొహంమాడ్చుకుంటూ పెడతారా? ఇందులో ఎవరుపరాయివాళ్ళు? అసలునిజానికి మొదటిపండక్కి అల్లుడితోపాటు, వియ్యాలవారు, అల్లుడి అక్కచెల్లెలు కుటుంబాన్నికూడా పిలిచాం. వాళ్ళకి కుదరక, మొదటి పండక్కి వాళ్ళెవరూ రానేలేదు, అమ్మాయి,అల్లుడు మాత్రమేవచ్చారు. ఒకవేళ వాళ్ళందరూ వచ్చుంటే కనుక అప్పుడు ఈ బట్టలన్నీ వాళ్ళకి పెట్టుండేవారుకదా. అప్పుడు తప్పిపోయినఖర్చు ఇప్పుడు పెడుతున్నాం అనుకోండి. అంతే కానీ, ఇలా ఏడుస్తూ పెట్టకండి. మంచిది కాదు. అన్నట్టు మర్చిపోయాను. ఒకవేళ మనబ్బాయి, కోడలు వస్తే కనుక, వాళ్ళ నెత్తిన ఈ మొత్తం ఖర్చు వేసేయకండి. ఇప్పటికే వాడు ఇక్కడికి ఎప్పుడొచ్చినా ఏవో కొని తెస్తూంటాడు.” అని మొగుడికి ఓ క్లాస్ పీకింది రుక్మిణి.
==============
నిజానికి కృష్ణమూర్తి కాస్త పిసినారి మనిషి. వచ్చేచోట రూపాయి వదలడు. ఇవ్వాల్సివస్తే.. ఏదో మెలిక పెట్టి,  వీలైనంతవరకు ఇవ్వకుండా తప్పించుకుంటాడు. రైతు బజార్ కి వెళ్తే.. వాళ్ళు “పావుకేజీ 12 రూపాయలు, చిల్లర లేదు 15 కి వేసేస్తా” అని ఏ వంకాయల గురించో అంటే, వద్దు పావుకేజీనే తూచు, చిల్లర 12రూ. నేనిస్తా అని కూడా చిల్లర పట్టుకు తిరిగేరకం. ఏ షాపులోనైనా చిల్లరలేక, రిటర్న్ వాళ్ళు ఏ చాక్లెట్టో ఇస్తే, ఒప్పుకునేవాడు కాదు. నాకు సుగరయ్యా. ఈ చాక్లెట్ నేనేం చేస్కోనూ? అని ఇవ్వాల్సిన చిల్లర ఇచ్చేవరకు వదిలేవాడు కాదు. ఒకవేళ తప్పనిసరై అలాతీసుకున్న చాక్లెట్స్ అన్నీ పోగేసి,  అవి మెత్తబడిపోకుండా ఫ్రిజ్ లో పెట్టి, అవి ఓ ఇరవైయ్యో ముప్ఫైయ్యో అయ్యాక, తనకవి అంటగట్టిన షాపులకేవెళ్ళి ఏవో సరుకులుకొని, ఇవ్వాల్సినడబ్బుల్లో కొంత కోతపెట్టి, “ఇదిగో, ఆ బేలన్స్ డబ్బులకు ఈ ముప్ఫై చాక్లెట్స్ తీసుకో. ఇవి రూపాయి చొప్పున ముప్ఫైరూపాయలు. ఇవి చిల్లరలేదంటూ మొన్నటిదాకా నువ్వు నాకు అంటగట్టినవే.  లెక్కసరిపోయిందా!” అని  అలా దాచి ఉంచిన  చాక్లెట్స్ వాళ్ళకే  తిరిగి అంటగట్టేవాడు. ఇక బజార్లోకి ఎప్పుడెళ్లినా, వీలైనంత వరకు పక్కింటి పాపారావు గారి బండి మీద వెనక సవారీ తనదే. తను ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాల్సివస్తే.. నేను అలా ఇంకొకర్ని వెనక కూర్చొబెట్టుకు డ్రైవ్ చెయ్యలేనని  చెప్పి తప్పించుకునే రకం.
అలాంటి కృష్ణమూర్తి కూతురిపెళ్లి కూడా ఓ రెండొందల కార్డులే ప్రింట్ చేయించి, చాలామందిని పిలవకుండా, ఎక్కువ భోజనాలఖర్చులేకుండా కానిచ్చేశాడు. తర్వాత విషయంతెల్సి, నీకూతురిపెళ్లి చేసేశావటగా. పిలవలేదేం!? అని ఎవరైనా అడిగితే.. చాలా తక్కువ టైమ్ లో కుదిరింది. మా వియ్యంకుడేమో “మా అమ్మగారి పరిస్థితేం బాలేదు. ఆవిడేమో మనవడిపెళ్లి చూస్తేగానీ చావనని యమభటులెన్నిసార్లొచ్చినా తరిమేస్తోంది. వెంటనే పెళ్లి చేసేయాలీ” అని హడావుడి చేస్తే.. తొందర్లోనే ఓ ముహూర్తం చూసి, హడావుడిగా చేసేసాం. ఎవర్ని పిలిచానో, ఎవర్ని మరిచానో కూడా తెలీలేదు. అయ్యో! మిమ్మల్నే మర్చిపోయానా!? సారీ!?” అని తప్పించుకునేవాడు.
ఇలాంటి కృష్ణమూర్తి దీపావళిపండక్కి అల్లుడు తమతోసహా అందర్నీ పిలవాలనుకోవడంతో , ఈ దీపావళి ఏ టపాసులు కాల్చకుండానే చేతులుకాలేలాఉందే అనుకున్నాడు. దీన్నుండి ఎలాగైనా తప్పించుకుందామని బెంగళూరులోఉన్న కొడుకు సుదీప్ తో మాట్లాడాడు. “నీ బావగారే మనందర్నీ దీపావళికి వాళ్ళ హైదరాబాద్ రమ్మని పిలిచాడురా.  వాళ్ళు ఇక్కడికిరాకుండా, మేమే వెళ్తే ఏం బాగుంటుందని రామన్నాను.  నీకు కూడా సెలవులు దొరకడం కష్టమేమో కదరా? పైగా ట్రైన్ లో రిజర్వేషన్ దొరకద్దూ?” అని ముందరికాళ్ళకి బంధం వేసినట్టు, నువ్వు రావు కదూ.. రావు.. రావు...రావడం లేదు... అని హిప్నటైజ్ చేసినట్టు మాట్లాడాడు.
“అబ్బ! ఎందుకు సెలవు దొరకదు నాన్నా. దీపావళికి ఎలాగూ సెలవే. పైగా మర్నాడు శని ఆదివారాలు. అంచేత మేం హైదరాబాద్ వెళ్లడానికి ఏఇబ్బందీలేదు. రిజర్వేషన్ దొరక్కపోతే.. కార్లో వచ్చేస్తాం. మీరూ వచ్చేయండి. అక్కడే అందరం సరదాగా దీపావళి చేసుకుందాం.” అని సుదీప్  చెప్పేసరికి నోట్లో సిగరెట్ అనుకుని బాంబు పెట్టుకు కాల్చుకున్నట్టైంది కృష్ణమూర్తి కి.
ఇక హైదరాబాద్ వెళ్ళక తప్పేట్టులేదు. తను విజయవాడలో ఉంటున్నాడు కనుక, రిజర్వేషన్ దొరకదు అని చెప్పి తప్పించుకునే వీలు లేదు. అయిదు గంటల ప్రయాణంలో బోల్దన్ని బస్సులు, రైళ్లున్నాయి. సర్లే! ఏం చేస్తాం! ఈ ఖర్చు ఇంకెక్కడో తగ్గించుకోవచ్చు అని సమాధానపడి హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధపడ్డాడు
===============
వియ్యాలవారు, అల్లుడు, అమ్మాయి విజయవాడ వస్తే తను చెయ్యాల్సిన మర్యాదలన్నీ, హైదరాబాద్ లో అల్లుడింట్లో  తాము పొందారు కృష్ణమూర్తి, రుక్మిణీ. మామగారికి, అత్తగారికి తానే బట్టలు పెట్టాడు అల్లుడు. అయ్యో! ఇది మర్యాదకాదు అల్లుడు గారు, మేం మీకు పెట్టాల్సిందిపోయి, మీరే మాకు బట్టలుపెట్టడం ఏమిటి?” అని మొహమాటపడింది రుక్మిణి. కృష్ణమూర్తి మాత్రం  కలిసొచ్చేకాలానికి ఖర్చు త(ప్పిం)గ్గించే అల్లుడు దొరికాడు అని మురిసిపోయాడు.    కృష్ణమూర్తి కొడుకు సుదీప్, భార్య సునందతో  బెంగళూరు నుండి వస్తూ.. బావగారికి, చెల్లికీ మంచి బట్టలు తీసుకొచ్చాడు. ఈ కాలం పిల్లలు ఆడైనా, మగైనా  ఎప్పుడు షార్ట్స్, టీ షర్ట్స్ వేసుకునే బజార్లమ్మట కూడా తిరుగుతారు కనుక, బావగారికి, చెల్లెలికీ అవే కొనుక్కొచ్చాడు. బావగారు, చెల్లి “ఓహ్! సూపర్ సెలెక్షన్!”  అని సంతోషించినా, పెద్దవాళ్ళుమాత్రం..అదే కృష్ణమూర్తి వియ్యంకుడు,వియ్యపురాలు “హవ్వ! ఇదేం పెట్టుపోతలూ!?లక్షణంగా చీరా, జాకెట్టు ముక్క ఓ బొట్టెట్టి ఇవ్వకుండా!?” అని రహస్యంగా నోళ్ళు నొక్కుకున్నారు. ఇలాంటి పెద్దమనిషి బుద్ధుల్లేని, కృష్ణమూర్తి మాత్రం ఏం బట్టలు అల్లుడికి కూతురికీ పెట్టారు అన్నది కాకుండా, తనకెంత ఖర్చు తప్పిందీ అన్నది లెక్కవేసి,  దాదాపు ఓ అయిదువేలు లాభం అని లోలోన సంతోషపడ్డాడు. భార్య రుక్మిణి దగ్గరమాత్రం బయటికే సంతోషం వ్యక్తంచేశాడు. ఎవరూ చూడకుండా మొగుడిడొక్కలో ఓ పోటు పొడిచింది రుక్మిణి.
దీపావళిరోజు ఉదయం కృష్ణమూర్తి కుటుంబసభ్యులంతా దీపావళి మతాబుల సామాన్ల కొనుగోలుకు బయల్దేరబోతుంటే. కృష్ణమూర్తి “మీరాగండి.ఏ షాప్ లో కొనాలో నేను సర్వచేసి వస్తాను, అప్పుడు అందరం అక్కడికే వెళ్దాం” అని ముందుగా ఒక్కడే బయల్దేరాడు, “ఎందుకు మామగారూ.. అందరం వెళ్ళి నచ్చినవి కొనుక్కువద్దాం” అని సుదీప్  వారించినా వినలేదు. దీపావళిసామగ్రి అమ్మేషాపుల్లో  ఓ ముప్ఫైషాపులు కలయతిరిగి, ధరవరలు అడిగి. వాటిలో ఓ ఇరవై మంది దాదాపు ఒకే రేటు చెప్తూండంతో.. వాటిలో ఓ మూడింటిలో ఫైనల్ రిబేట్ ఎంత అన్నది పదిసార్లు బేరమాడి ఖరారు చేసుకుని, ఇప్పుడే వస్తా... అని ఇంటికొచ్చి అందర్నీ బయల్దేరదీశాడు. మేమెందుకూ? మీ మగాళ్ళంతా వెళ్లిరండి సరదాగా అని ఆడవాళ్ళు తప్పించుకున్నారు.  సరే అని కృష్ణమూర్తి, ఆయన వియ్యంకుడు, సుదీప్, కిరణ్ బయలుదేరాడు.
దార్లో “అసలు ఈ వూర్లో మీకు ఈ షాపుల గురించి ఏం తెల్సు మామగారూ? ఇక్కడా మీ బేరాలు సాగించారా ఏం!?” అనడిగాడు అల్లుడు కిరణ్  
“ఇందులో తెలిసేది ఏం లేదు అల్లుడూ.  నీకు తెలుసో లేదో?ఈ దీపావళి సామానుల  అమ్మకాల్లో వీళ్ళు లక్ష మదుపు పెట్టి... అయిదు లక్షలు దాకా సంపాదిస్తారు. ఓ అగ్గిపెట్టెల పేక్ మీద డజన్ 350 రూ అని ఉంటుంది.. కానీ అరవై శాతం డిస్కౌంట్ అని 140 కే అమ్ముతారు. కానీ మనం వదలకుండా బేరమాడితే అది 75 కే వస్తుంది. అసలు వాళ్ళు దాన్ని కొనేదే 35 రూ లకి.. దానికి పది రెట్లు పెంచి 350 కి అమ్ముతారు. మనం గీసి గీసి బేరాలాడితే.. లాభం లో నష్టం అని 75 కే ఇచ్చేస్తారు. ఐతే మరీ నాలాగ గీసిగీసి బేరాలాడేవాళ్లు ఎక్కువమంది ఉండరు కనుక 350 చెప్పి.. ఏ 250 కో అమ్మేస్తారు. అలా అయినా వాళ్ళకి భారీగాలాభాలే కదా. అసలు అక్కడున్న బోర్డులు చూశావా? 60%, 70% డిస్కౌంట్ అని ఎలా పెట్టేరో!? దాన్ని బట్టే నీకు అర్ధమై ఉంటుంది.. ఈ దీపావళీ సామగ్రి అమ్మకం ఎంత లాభసాటి అనేది.” అన్నాడు కృష్ణమూర్తి.
“మీకోదండం మామగారూ! ఇన్ని తెలిసిన మీరే ఓ షాపుపెట్టి ఉండాల్సింది. బోల్డు లాభాలార్జించుండేవారు.”  అన్నాడు  కిరణ్ నవ్వుతూ.
“అయ్యో! అవును సుమీ! అల్లుడూ. నాకీ ఆలోచనే రాలేదు. ఎంతపనైంది!” అని వాపోయాడు కృష్ణమూర్తి. ఇదంతా వింటున్న మిగతావారు  ఘొల్లున నవ్వేశారు.
=================
మొత్తానికి కృష్ణమూర్తి చూపించిన షాపుల్లోనే దీపావళి సామగ్రి కొన్నారు. “మీరేం డబ్బులు తీయకండి మామగారూ. దీపావళి సామానుల ఖర్చునాదే” అని కిరణ్ మామగార్నీ, నేను పే చేస్తా అని ఫోన్ పే తో సిద్ధపడ్డ బావమరిదిని అడ్డుకున్నాడు. కృష్ణమూర్తి మహదానందపడిపోగా, సుదీప్ నొచ్చుకున్నాడు. మన సొమ్ముకాదు కదా అని, కృష్ణమూర్తి తాటాకు పటాసులు, లక్ష్మీ బాంబులు కొనిపించబోయాడు.
“అబ్బే! అవన్నీ వద్దు మామగారూ. ఇప్పుడంతా సౌండ్ పొల్యూషన్, స్మోక్ పొల్యూషన్ ఉండరాదని, పైగా అవి ఎప్పుడు పడితే అప్పుడు కాల్చరాదని, రాత్రి 8 నుండి 10 గం లోపలే కాల్చాలని కోర్ట్ ఆర్డర్లున్నాయి. మనం కాదు కూడదని కొని,కాల్చితే సెక్యూరిటీ అధికారి కేసవుతుంది. ఎందుకొచ్చినగొడవ!?”అని సుదీప్ సున్నితంగా అడ్డుకున్నాడు. అయితే ఈ మతాబులు, చిచ్చు బుడ్లే మరికొన్ని కొను. బాగుంటాయి అని అవి కొంచెం ఎక్కువ కొనిపించాడు కృష్ణమూర్తి.
మొత్తానికి ఏవో మతాబాసామన్లు కొన్నామనిపించుకుని, ఇంటికొచ్చారు. పిల్లలు దీపావళి పిస్తోళ్ళతో  ఢమఢమలు మొదలెట్టేశారు. చీకటిపడ్డాక, సంప్రదాయబద్ధంగా ఆడవాళ్ళు ఇంట్లో లక్ష్మీపూజ, దీపారాధన చేసి, ఇంటి ముంగిట్లో దీపాలు పెట్టారు. ఆతర్వాత అంతా తెచ్చిన మతాబా సామాన్లు కాల్చడం మొదలెట్టారు.
“మీరూ రండి, ఈ మతాబులు కాల్చండి బావగారు అని వియ్యంకుణ్ణి పిలవబోతే.. ఆయన సున్నితంగా వద్దని, “చిన్నతనంలో తెగకాల్చి ఆనందించాంగా బావగారు. ఇప్పుడుకూడా ఏంటి!? పిల్లలు కాలుస్తూంటేచూసి ఆనందించాలిగానీ!”అని పరోక్షంగా కృష్ణమూర్తినికూడా వారించాడు. “నీకు ఈవయసులో అవసరమా ఈ మతాబులు కాల్చడాలు అవీ!” అన్నట్టు చూస్తూ.  
కృష్ణమూర్తికి ఆ చూపుఅర్ధమైనా, దులిపేసుకుని, “నాకుమాత్రం ఈ దీపావళి టపాకాయలు, మతాబులు అంటే మహాప్రీతి బావగారు. ఈరోజు చిన్నపిల్లాడ్నైపోతానంటే నమ్మండి. అసలు వీళ్ళు బాంబులు కొనద్దన్నారు గానీ, నాకైతే అవే ఎక్కువిష్టం. తాటాకు టపాకాయలు ఇలా చేత్తో అంటించి అలా విసిరేస్తుంటే భలే మజాగా ఉంటుంది. పోన్లెండి! ఏంచేస్తాం! ఈసారికిలా  ఈ మతాబులు, చిచ్చుబుడ్లుతో కానిచ్చేస్తాను అని వియ్యంకుణ్ణి పట్టించుకోకుండా.. కొన్ని కాకర్లు, భూచక్రాలు వెలిగించి ఆనందించాడు. పిల్లలూ.. మీరు ఈ విష్ణుచక్రాలు కాల్చలేరు. ఇటివ్వండి నేను కాల్చి చూపిస్తాను అని వాటిని తీసుకు కాల్చాడు. అసలు కృష్ణమూర్తి ప్రతీ దీపావళిపండక్కి తాను కొనేసామాన్లు తక్కువ, పక్కింటివాళ్ళతో చేరి, వాళ్ళ కాకర్లు, భూచక్రాలు, విష్ణుచక్రాలు వంటివి సాయం చేస్తున్నట్టు నటిస్తూ.. కాల్చేవి ఎక్కువ.
పిల్లల చేతిలోంచి తీసుకున్న విష్ణుచక్రం కాలుస్తూంటే “జాగ్రత్తండీ. షర్ట్ పై ఆ రవ్వలు పడతాయి” అని రుక్మిణి హెచ్చరించింది.  “ఏం పర్లేదులే! నాకు తెలీని విద్యలా ఇవి!” అని ఓ రెండు విష్ణు చక్రాలు కాల్చాడు. పిల్లలు కేరింతలు కొడుతుంటే.. రెచ్చి పోయి చిచ్చుబుడ్డి ఒకటి చేత్తోనే వెలిగించి దాన్ని ఇంటి కాంపౌండ్ గేటుపైన పెట్టాడు. “ఏంటినాన్నగారు! మీరు మరీనీ!” అని కిరణ్ కోప్పడ్డాడు. కొడుకు కోపాన్ని లెక్కచేయ్యకుండా, విజయగర్వంతో వియ్యంకుణ్ణి చూస్తూ ఇంకో చిచ్చుబుడ్డీ అలానే చేత్తో వెలిగించి గేటుపైన పెట్టాడు. అలా పెడుతూండగానే  ఆ చిచ్చుబుడ్డీకాస్తా  ఢాం అని పెద్దశబ్ధం చేస్తూ అతని చేతిలోనే పేలిపోయింది. అరచెయ్యి వెంటనే బొబ్బలెక్కిపోయింది. దాని రవ్వలు కృష్ణమూర్తి షర్ట్ పైపడి చిన్నచిన్నగా కాలి కన్నాలు పడ్డాయి. ఒక్క క్షణం చెవులు దిబ్బడవేసి, ఏం వినబడలేదు. కళ్ళు బైర్లుకమ్మి కాసేపు మసకబారాయి. అందరూ వెంటవెంటనే.. “ఏమండీ!..నాన్నగారూ.. మామయ్య గారూ... బావగారూ... అన్నయ్యగారూ.. అంకుల్... అంకుల్... తాతగారూ...! అంటూ టీవీసీరియల్లో పాత్రల్లా తమ తమ ఆందోళనాపూర్వక హావభావాలు వ్యక్తపరిచారు.
రెండు నిమిషాల తర్వాత, తేరుకున్న కృష్ణమూర్తి, పెద్ద ప్రమాదం ఏం లేదని తెల్సుకుని, “దొంగ వెధవలు!  ఈ చిచ్చుబుడ్లమందులో రాళ్ళు కూడా ఏరకుండా దట్టించేశారు. దాంతో అవి ఇలా పేలి చచ్చాయి!” వాళ్ళని తిట్టి,  “ఏం పర్లేదు. ఐ యాం ఆల్ రైట్!” అన్నాడు  బొబ్బలెక్కిన అరచేతిని చూసుకుంటూ, మనసులో “వామ్మో! వాయ్యో! అమ్మోయ్! నానయోయ్!” అని ఏడుస్తూ. గబగబా ఇంత వెన్న పట్టుకొచ్చిన వియ్యపురాలు, రుక్మిణికి      ఇచ్చింది అరచేతికి రాయమని. ఆ వెన్నపూతకి ఇంకాస్త ఉపశమనంపొందిన కృష్ణమూర్తి అందర్నీ చూసి ఓ ఏడవలేనినవ్వు నవ్వాడు.
“మీరు కాల్చాలనుకున్నబాంబు ఇలా చిచ్చుబుడ్డిరూపంలో మీచేతిలో కాలింది..అదే పేలింది. మీకోరికానెరవేరింది. ఇప్పుడు చేతవెన్నముద్దపట్టిన కృష్ణమూర్తిలా ఉన్నారు నాన్నగారు” అన్నాడు నవ్వుతూ  కిరణ్, వాతావరణాన్ని తేలిక చేస్తూ. మొత్తానికి ఏ టపాసులూ కాల్చకుండానే చేతులు కాల్చుకున్న కృష్ణమూర్తి దీపావళి పండగ  అల్లుడింట అలా జరిగింది. 
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - తాతయ్యా నాకు భయం - by k3vv3 - 09-04-2025, 08:37 AM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)