Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#61
[Image: image-2025-03-14-094216465.png]
బర్రున ఆటో ఆ యింటి ముందు ఆగింది. ఆటో దిగి డబ్బులు చెల్లించి సామాన్ల సంచులు బరువుగా, అలసటగా మోసుకుంటూ మెట్లెక్కి యింట్లోకి తీసుకువచ్చాడు రామపాదం.
"యిదిగో చూసుకో నువ్వు రాసిచ్చిన లిస్టులో ఉన్న సామానులన్నీ తీసుకొ... కాదు కాదు మోసుకొచ్చాను" ఆయాస పడుతూ చెప్పేడు రామపాదం సామాన్ల సంచులు జాగ్రత్తగా నేల మీద పెడుతూ. పగిలిపోయే గాజు సామాన్లు కూడా ఉన్నాయి వాటిలో మరి.
కాసేపు తరువాత -
"నేను రాసిందేమిటి - మీరు చేసుకొచ్చిందేమిటీ" వస్తువులు ఒక్కొక్కటీ చెక్ చేసుకుంటూ ఒంటి కాలి మీద లేచింది రామపాదం భార్య సుమతి. అంటే అవిడకో కాలు లేదని కాదు. కోపం వచ్చినప్పుడు అలా ఒంటి కాలు మీద లేవాలని ఆవిడ ఎక్కడో ఏదో పుస్తకంలో చదివిందట.
పండక్కి అమ్మ గారి ఊరికి వెళుతూ అక్కడి వారికి తీసుకు వెళ్లాల్సిన వస్తువులూ, బహుమతులూ అంటూ ఓ పొడుగాటి లిస్ట్ రాసిచ్చింది భర్త అనే ఆ మహానుభావుడికి సుమతి.
"నువ్వు చెప్పినట్టే నువ్వు రాసిన వస్తువులన్నీ తీసుకు వచ్చానుగా? ఇంకా ఏమిటిట లోటు? అసలు చెరువులో చేపల కోసం ఎదురుచూసే దొంగ కొంగలా ఆ కాలెత్తడమేమిటీ? దింపు. పడిపోగలవు" గాబరా నటించాడు రామపాదం ఆమె పడిపోకుండా పట్టుకుంటూ.
ముక్కుకి చేపను చిక్కించుకున్న కొంగలా చటుక్కున కాలు దించిన సుమతి "చూడండి! నేను రాసిచ్చిన లిస్ట్ లో సగం వస్తువులే తీసుకొచ్చారు తమరు. ఎందుకని?" అంటూ ఎగిరి ఈ సారి కయ్యానికి కాలు దువ్వింది.
రామపాదం జేబులోంచి సుమతి రాసిచ్చిన లిస్ట్ బయటికి లాగేడు. "చూసుకో నువ్వు నీ స్వహస్తాలతో రాసిచ్చిన లిస్ట్. ఇందులో ఉన్నవన్నీ తెచ్చాను కదా" లిస్ట్ ఆమె మీదికి విసురుతూ అన్నాడు.
కిటికీ లోంచి బయటికి పారి పోవడానికి ప్రయత్నించిన ఆ లిస్ట్ ని ఒడుపుగా ఒడిసి పట్టుకుని చెక్ చేసింది సుమతి.  లిస్టు ముందు వైపు రాసి ఉన్న వస్తువులన్నీ వచ్చాయి గానీ వెనుక పక్క రాసిన వస్తువుల్లో ఒక్కటి కూడా లేదు ఆ సంచుల్లో ఎంత గాలించినా.
"చూడండి! ఈ వెనుక పక్కన రాసిన వస్తువుల్లో ఒక్కటంటే ఒక్కటి పట్టుకొచ్చారా తమరు?" అంటూ ఈ సారి అప్పడంలా విరుచుకు పడింది సుమతి.
"ఏదీ చూడనీ" అంటూ లిస్ట్ అందుకుని పరిశీలనగా చూసి "ఓహో వెనక పక్కన రాశావా!" అన్నాడు రామపాదం తేలిగ్గా.
"మీకింత మతిమరుపేమిటండీ బాబూ? ఖర్మ ఖర్మ" నెత్తీ నోరూ బాదుకుంది సుమతి సుతారంగా.
'నాకు మతిమరుపా' మనసులో స్వగతంలా అనుకున్నాడే తప్ప నోరెత్త లేదు రామపాదం. అందుకే మళ్లీ సుమతే నోరు చేసుకుంది -
"ఇలాగే మొన్నటికి మొన్న..." అంటూ  ఉపోద్ఘతించింది.
"మొన్న...? మొన్న ఏం చేశానూ నేనూ?" అమాయకమైన ముఖంతో అడిగేడు రామపాదం.
"అప్పుడే మర్చి పోయారా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నారా?" తీక్షణంగా అడిగింది.
"గుర్తు చేస్తే నీ సొమ్మేం పోదుగా" ఈ సారి రామపాదం ముఖం బేలగా మారిపోయింది.
"అదే ... మొన్న గురువారం ఆ రాధిక మనింటికి వచ్చినప్పుడు....."  యింకా ఏదో చెప్పబోతుండగా ఆవిణ్ణి మధ్యలోనే ఆపేసి -
"ఎవరూ? మన ఎదురింటి డాబా యింట్లో ఉండే ఆ తెల్లగా పొడుగ్గా బూరె బుగ్గలతో కోటేరేసిన ముక్కుతో అందంగా మెరిసిపోతూ..." పరవశంగా చెప్పుకుపోతున్న మొగుణ్ణి ఒక్క గసురుతో బ్రేక్ వేసి ఆపింది సుమతి.
"ఆపండి మీ పొగడ్తలు. నేను చెప్పేది ఆ రాధిక గురించి కాదు.  మన వెనుక వీధిలో ఉండే తెలుగు టీచర్ రాధిక మేడమ్ గురించి..." విశదీకరించి, విడమరిచి, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పింది సుమతి.
అప్పటికే గాలి తీసిన బెలూన్లా ముడుచుకుపోయిన రామపాదం  "ఆ అమ్మాయా?" అన్నాడు నీరసంగా.
"అవును ఆ అమ్మాయే! ఇంకా చెప్పాలంటే చింపిరి జుట్టుతో, చికిలి కళ్ళతో, కాటుక రంగులో..." కొనసాగించింది సుమతి.
"ఇంక చాల్లే అపు నీ వర్ణన - గుర్తొచ్చింది గానీ! ఇంతకీ ఆ వెనక వీధి రాధిక వచ్చినప్పుడు నేనేం వెలగబెట్టేనో అది చెప్పు ముందు" అన్నాడు చిరాగ్గా.
"ఏమిటా? ఆ అమ్మాయి వచ్చి - 'సార్ మీరు కథలు రాస్తారు కదా. నేనూ ఓ చిన్న కథ రాశాను. చదివి ఎలా ఉందో చెప్పండి' అని అడిగితే -  పూర్తిగా చదవకుండానే కథ అసంపూర్తిగా ఉందని తేల్చి చెప్ప లేదా తమరు?"  నిలదీసింది సుమతి.
"మరి? కథ పూర్తి కాకుండా సగంలో అపేసినట్టుగా ఉంటే ఆ విషయం తెలియ చెప్పకపోతే ఎలా? యిలాంటి లోపాలు తెలియపరచకపోతే ఆ అమ్మాయి రచయిత్రిగా ఎలా రాణిస్తుందనుకున్నావు?" అన్నాడు రామపాదం.
"అదే విషయం నేనా పిల్లని అడిగితే 'మిగతా సగం కథ ఆ పేజీ వెనుక పక్క రాశాను కదా వదినా' అని నా దగ్గర ఎంతలా వాపోయిందో తెలుసా?" జాలితో కూడిన ఆ రాధిక ముఖం కళ్ళ ముందు మెదలగా మెల్లగా చెప్పింది సుమతి.
"ఏమిటీ? పేజీకి రెండో వైపున రాసిందా? అదీ సంగతి!"  అన్నాడు రామపాదం విషయం అర్థమై.
"ఆ సంగతలా ఉంచండి. మొన్నటికి మొన్న హాఫ్ యియర్లీ పరీక్షల్లో లెక్కల్లో వందకి వంద మార్కులు తెచ్చుకున్న మన పండుగాడి ఆన్సర్ పేపర్ పూర్తిగా చూడకుండానే నలభై అయిదు మార్కులేనా వెధవా అని వాణ్ణి నానా తిట్లూ తిట్టేరు గుర్తు లేదా తమరికి?" కొశ్నించింది సుమతి.
"అవును! వాడి ఆన్సర్ పేపర్ కౌంట్ చేస్తే నలభై అయిదు మార్కులే కదా వచ్చింది టోటల్?" అయోమయంగా అడిగేడు రామపాదం.
"చాల్లెండి. వాడి పేపర్ వెనుక పేజీలో మిగతా యాభై అయిదు మార్కులు ఉన్నాయన్న విషయం తమరసలు పరిశీలనగా చూసి ఏడిస్తే కదా?" అంటూ ఈసడించింది సుమతి.
"పేపర్ వెనుక వైపు రాశాడా?" ఆశ్చర్య పోయాడు
రామపాదం.

"రాయడా మరి ముందు పేజీలో చోటు సరిపోకపోతే?" నాలుగు పెద్ద సూట్ కేసులూ, రెండు బిగ్ షాపర్ సంచీలూ సర్దడం పూర్తి చేస్తూ అంది సుమతి.
సుమతి గుర్తు చెయ్యక పోయినా -  మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలూ, రామపాదం మనసులో కదలాడుతున్న సంగతులూ మరి కొన్ని యిక్కడ ప్రస్తావించుకోక తప్పదు మనకు.
ఓ సారి యిలాగే -
ఓ రచయితల సాహితీ సమావేశం ప్లస్ బహుమతుల ప్రదానోత్సవానికి  అతిథిగా పిలిచారు రామపాదాన్ని.  ఆ నాటి కార్యక్రమంలో ముందుగా సమోసా, తేనీటి సేవల అనంతరం స్టేజ్ మీద ముఖ్య అతిథి ప్రసంగం, ఆ తరువాత మరి కొందరు మైకాసురుల అధిక ప్రసంగాల అనంతరం -
రామపాదం చేతికి ఆ నాటి కార్యక్రమంలో బహుమతులు స్వీకరించవలసిన - అంతగా పేరు ప్రఖ్యాతలు లేని  ప్రముఖ రచయితల పేర్లతో నిండి ఉన్న పెద్ద జాబితా అందించ బడింది నిర్వాహకుల నుండి.
లిస్టును పై నుంచి కిందికి ఓ సారి పరిశీలించి చూశాడు రామపాదం. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు అందరూ ఆ రోజు ఆ సభలో అవార్డులూ, సన్మానాలు, ప్రశంసా పత్రాలు అందుకోవలసి ఉంది.
ఆ శుభ సమయం కోసం వాళ్ళు అందరూ స్టేజి దిగువన పిల్లా పీచూ, బంధుమిత్ర సపరివార సమేతంగా ఆత్రంగా వేచి చూస్తున్నారు. సభ నిండుగా కనిపించడం కోసం రచనలు పంపిన వారందరికీ ఆహ్వానాలు పంపబడ్డాయి. వారిలో ఎవరికి బహుమతి లేదా అవార్డు వచ్చిందో నిర్వాహకులకు తప్ప వేరే వారెవరికీ తెలియదన్న మాట.
అందుకే ఎవరికి వారు తమకు మాత్రం అవార్డు, సన్మానం తప్పదనే ధీమాలో ఉండి తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమ పేరు మైకులో వినబడగానే స్టేజి మీదకు పరుగు పెట్టడానికి రన్నింగ్ రేసుకు సిద్ధపడ్డ అభ్యర్థుల్లా ఎదురు చూపులు చూస్తూ కళ్ళకు కాయలు, చెవులకు పళ్ళు కాయించుకుంటున్నారు.
లిస్టు చూసి రామపాదం పేర్లు పిలిచిన కవులూ, రచయితలూ ఒక్కొక్కరుగా ఆనందంగా స్టేజి మీదకు వచ్చి సన్మానం, అవార్డు అందుకుని ఆనందభాష్పాలతో కృతజ్ఞతలు తెలియజేసి శాలువాలు, చెక్క ముక్క
జ్ఞాపిక,  పూలదండల బరువుతో స్టేజి దిగుతున్నారు.
ఆ లిస్ట్ లో ఉన్న వారందరి పేర్లూ పిలిచిన తరువాత రామపాదం తన ప్రసంగ పాఠం ఉన్న కాగితాల బొత్తి లాల్చీ జేబులోంచి బయటికి లాగి తన ప్రసంగం మొదలు పెట్టేశాడు.
"వేదిక మీద ఉన్న పెద్దలకూ, వేదిక ముందున్న పెద్దలూ, కవులూ, రచయితలూ, ఫోటోల వాళ్ళు అందరికీ నమస్కారం. ఈ నాటి సభలో బహుమతులూ, అవార్డులూ, సన్మానాలు అందుకున్న...." అంటూ మొదలు పెట్టబోతుండగా స్టేజి మీద ఉన్న ముఖ్య అతిధులు మరియూ స్టేజి దిగువన ఉన్న సభాసదుల్లో కలకలం, కలవరం బయలు దేరింది. తమ పేరు బహుమతి గ్రహీతల జాబితాలో ఉందని ముందుగానే పేపర్ లీక్ అయి తెలిసిపోయిన వాళ్ళు పెట్టిన హాహాకారాలు హాలు స్లాబు ముట్టేయి.
తన ప్రసంగానికి అడ్డు తగులుతున్న వారిని చూసి రామపాదం చిరాకు ప్రదర్శించి ప్రసంగం కొనసాగించబోతుండగా  - లాల్చీకి పిన్నీసుతో బాడ్జ్ గుచ్చుకున్న సభ నిర్వాహకుల్లో ఒకాయన వడివడిగా, హడావిడిగా స్టేజి మీదకు  దూసుకు వచ్చాడు. రామపాదం చెవిలో నోరు పెట్టేసి గుసగుసగా 'అయ్యా లిస్టు యింకా పూర్తి కాలేదు. బహుమతులు అందుకోవలసిన వారి జాబితా యింకా పూర్తి కాలేదు. ఇంకా సన్మానం అందుకోవలసిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. పి టి వో అనగా పేజీ త్రిప్పి చూడుడు' అని చెప్పిన మాటలు రామపాదం చేతిలో ఆన్ లో ఉన్న మైకులోకి జొరబడిపోయి హాలు హాలంతా ప్రతిధ్వనించాయి.
'పేజీ వెనుక రాశారా'  అంటూ పేజీ తిప్పి చూసి - తతిమా వాళ్ల పేర్లు చదువుతూ మిగతా కార్యక్రమం కొనసాగించి పూర్తి చేశాడు.  తరువాత తన ప్రసంగ పాఠం ఉన్న కాగితాల బొత్తి మరో సారి జేబులోంచి పైకి లాగి -
"వేదిక మీద ఉన్న పెద్దలకూ, వేదిక ముందున్న పెద్దలూ, కవులూ, రచయితలూ, ఫోటోల వాళ్ళు అందరికీ నమస్కారం. ఈ నాటి సభలో బహుమతులూ, అవార్డులూ, సన్మానాలు అందుకున్న...." అంటూ పునరుద్ఘాటించాడు ఆ నాడు.
"ఏంటలా బెల్లం కొట్టిన రాయిలా ఉలుకూ పలుకూ లేకుండా చూస్తూ ఊరుకున్నారు? యేమిటాలోచిస్తున్నారు?" అన్న భార్య కేకతో ఉలిక్కి పడి గత లోకం లోంచి ఇహ లోకంలోకి తిరిగి వచ్చాడు రామపాదం.
"సరే సరే యింక మాటలెందుకు గానీ ట్రైన్ కి టైం అవుతోంది. బయలుదేరింక" మాట మార్చేశాడు రామపాదం.
రామపాదం ఓ మోస్తరు రచయితే కాక ఓ చిన్న మాస పత్రికకు సంపాదన లేని సంపాదకుడు కూడా.  అతని భార్య సుమతి గడుసుదే కానీ వాళ్ళ అమ్మమ్మ కాలం నాటి పాత కాలం మనిషి. ఈ కాలానికి  సంబంధించిన సెల్ ఫోన్లు, వాట్సాపులు అవీ ఉపయోగించడం ఆమెకు యిష్టం లేదనే కంటే తెలియదు అనే చెప్పాలి.  
పండక్కి ఒంటరిగా రైలెక్కింది సుమతి  - రామపాదం తీసుకు వచ్చిన అరకొర సరుకులతోటే సణుక్కుంటూ. 'పత్రిక ఈ వారంలో విడుదల చెయ్యాలి. నేన్రాను నువ్వెళ్ళి వచ్చేయ్' అని రామపాదం ముందే టలాయించడంతో ఒక్కతే బయలుదేరి వెళ్ళింది అమ్మ గారింటికి సుమతి.
సుమతి పుట్టింటికి వెళ్లిన సమయంలో కట్టలు కట్టలుగా పోస్ట్ లో వచ్చిన కథలు చదివి - ప్రచురణకు సెలెక్ట్ అయిన కథలు ఫోల్డర్లలో జాగ్రత్త చేయడంలోనూ, ఎన్నిక కాని కథలను తిరుగు టపా కవర్లలో ఉంచి వెనక్కి తిప్పి పంపే పనిలోనూ బిజీ బిజీ అయి పోయాడు ఎడిటర్ రామపాదం.
ఎన్నిక కాక తిరుగుటపా కవర్లు లేని హాస్య కథలతో నాలుగు పొడి చెత్త డబ్బాలూ, పనికిరాని ఏడుపు గొట్టు కథలతో నాలుగు తడి చెత్త డబ్బాలు నిండిపోయాయి.
పది రోజుల తరువాత పోస్టులో వచ్చిన కథల కవర్లతో కలిసిపోయి వచ్చిన భార్య రాసిన కవరు గమనించి తెరిచి ఆమె రాసిన ఉత్తరం బయటికి లాగి చదవసాగేడు రామపాదం.
ఆ పేజీ నిండా వాళ్ళ పుట్టింట్లో పండగ ఎంత వైభవంగా జరుపుకున్నారో, వాళ్ల అన్నయ్యలు వదినలు, వాళ్ల పిల్లలతో తను ఎంత సరదాగా ఎంజాయ్ చేసిందో, వాళ్ళ అమ్మ ఏమేమి పిండివంటలు వండిందో నోరూరించేలా రాసి నింపేసింది శ్రీమతి.  ఉత్తరం మడిచి కవర్లో పెట్టేసి తిరిగి రచనల కవర్లు తెరిచి కథలు సెలెక్ట్ చేసే పనిలో నిండా మునిగి పోయాడు రామపాదం.
ఆ రోజు తెల్లవారు జామునే కాలింగ్ బెల్ మోగడంతో లేచి తలుపు తెరిచాడు రామపాదం నిద్ర కళ్ళతో.
ఎదురుగా  ఉగ్రరూపంలో సుమతి!
"స్టేషన్ కి రమ్మని ఉత్తరం రాస్తే ఎందుకు రాలేద"ని అరిచింది ఆవేశంగా - రెండు చేతుల నిండుగా ఉన్న నాలుగు చేతులకు సరిపడా సామాన్ల సంచులు కింద పెట్టి కందిపోయిన అరచేతులూ, వేళ్ళూ ఊదుకుంటూ.
'నువ్వు అరిస్తే ఎంత ముద్దుగా ఉంటావో తెల్సా' అని ఎప్పటిలా ఆవిణ్ణి ఉబ్బేద్దామనుకున్నాడు గానీ దానికిది సమయం కాదని తనకు తానే సర్దిచెప్పుకొని -
"పండగ ఎంత వైభవంగా జరిగిందో రాశావు గానీ ఏ రోజు ఏ బండికి వస్తున్నదీ రాయక పోతే స్టేషన్ కి ఎలా రాగలను?" తనూ అంతే అవేశంగా అరిచేడు రామపాదం 'తగ్గేదేలే' అన్నట్టుగా.
"ఆ ఉత్తరంలో రాశానుగా? ఏదీ నా ఉత్తరం?" అంటూ రామపాదం టేబుల్ డ్రాయర్ లోంచి ఉత్తరం వెతికి తీసి - "ఇదిగో ఈ రైలుకి వస్తున్నాను. స్టేషన్ కి రావలెను - యిట్లు మీ పాదదాసి అని స్పష్టంగా రాశానుగా" అంటూ పొందికైన అక్షరాల్లో రాసిన వైనం చూపించింది సుమతి.
ఆ ఉత్తరం అందుకుని పరిశీలిస్తే ఉత్తరం వెనుక వైపు స్పష్టంగా ఎప్పుడు, ఏ రైలుకి వచ్చేదీ సుమతి స్వహస్తాలతో రాసిన వివరం ఉంది.
"అదీ సంగతి. ఓ పత్రికా సంపాదకుడి భార్యవై ఉండి నువ్వు కూడా యిలా పేజీకి వెనుక వైపు రాస్తే ఎలా బంగారూ? పేజీకి ఒకవైపే కదా రాయాల్సింది. అది కథైనా, ఉత్తరమైనా, మరేదైనా పేజీకి రెండో వైపున రాసింది ఏదీ నేను చూడనని ఇన్నేళ్ళ నా సాహచర్యంలో నీకు తెలిసిన విషయమేగా?" తన తప్పేం లేక పోవడంతో బ్రతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు ఎడిటర్ రామపాదం.
చేసేది లేక గతంలో జరిగిన అనుభవాల్ని గుర్తు తెచ్చుకుని ఓ దీర్ఘమైన నిట్టూర్పు, ఓ పత్రికా సంపాదకుడి భార్యగా మెట్టినందుకు మరో గాఢమైన నిట్టూర్పు విడిచి వంట గదిలోకి వెళ్ళి గిన్నెల మీద తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది సంపాదన లేని సంపాదకుడు రామపాదం అర్ధాంగి శ్రీమతి సుమతి.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: హాస్య కథలు - దొందూ దొందే - by k3vv3 - 14-03-2025, 09:43 AM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)