Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఇంకెంత సేపు
#57
[Image: image-2025-02-22-131424907.png]

అదొక ఊర చెరువు. అ చెరువుకు అవతలొక పేట, ఇవతలొక పేట. ఆ రెండు పేటలూ ఓ  రెండు పేటల గొలుసు కోసం తెగ ఆరాట పడిపోయాయి ఒకానొక సందర్భంలో!

“యావండీ, లేవండి పాడు నిద్రా మీరూనూ. సర్పంచ్ సక్కుబాయి గారు
  నిన్నతన  రెండు పేటల బంగారం గొలుసుని  వినాయకుడి మెడలోంచి తియ్యడం మరిచిపోయి నిమజ్జనం చేసేసిందట మన చెరువులో. ఇప్పుడు  గోల పెడుతోందట ఇంట్లో. మన పని మనిషి చెబుతోంది. లేవండి తొందరగా.  ఎవరికీ తెలియకుండా దబ్బున  వెళ్లి తెచ్చేసుకుందాం.”

“చెరువులో దిగా? నాకు ఈత రాదేవ్. చస్తా!” -- “ఈ మాత్రానికే
  చచ్చిపోతారా? నేను గట్టు మీద నించి తాడేసి పట్టుకుంటానుగా.  రెండు పేటల గొలుసండీ! రెండు లక్షలుంటుంది. మీరెలాగూ చేయించి చచ్చింది లేదు. ”

తాడు, తువ్వాళ్ళూ పట్టుకుని హడావుడిగా
  చెరువు దగ్గరకు పరుగెట్టారు మొగుడూ పెళ్ళాం. వస్తూనే గతుక్కు మన్నారు. అప్పటికే పదిమంది దాకా మొగుళ్ళు   వెతికేస్తున్నారు నీళ్ళల్లో దిగి.  తాళ్లేసి లాగి పట్టుక్కూర్చున్నారు వాళ్ళ  పెళ్ళాలు గట్టు మీద.

“అయ్యయ్యో. ఆలస్యం అయిపోయిందండోయ్. దిగండి తొందరగా.” అంటూ మొగుడి నడుముకు తాడు కట్టి,
  గోచీతో నీళ్ళల్లోకి తోసేసింది పెళ్ళాం.   “ తాడు గట్టిగా పటుకోవేవ్. ఈ తాడు తెగితే  నా తాడు తెగినట్టే!” అన్నాడు మొగుడు.  “మీ తాడు తెగితే నా తాడు తెగినట్టు కాదా ఏం? దిగండి ఏం భయం లేదు.”

చెరువంతా నాచు, తూడు, గుర్రపు డెక్కాకుతో నిండి పోయి ఉంది. అడ్డొచ్చిన ఆకుల్ని, తూడుని బయటకు విసిరేస్తూ మొగుళ్ళందరూ మునుగుతూ, తేలుతూ లోపల ఏ బొమ్మ దొరికినా పుచ్చుకుని పైకి లేస్తున్నారు. దానికి గొలుసేవన్నా వేళ్ళాడుతోందేమోనని
  తడిమి చూసి, గట్టు మీదకి విసిరేస్తున్నారు. వాళ్ళకి ఊపిరి పీల్చుకోడాని క్కూడా  టైమివ్వడం లేదు పెళ్ళాలు. మళ్ళీ మునిగేదాకా కేకలు, పెడబొబ్బలు! ఒకటా రెండా? రెండు లక్షల రూపాయల గొలుసు మరి! కాస్త తాత్సారం చేస్తే వేరే వాళ్ళకి దొరికేస్తుందేమో. ‘దేవుడా దేవుడా అది మా ఆయనకే దొరకాలమ్మా, దొరికితే నీకు  ఆ రెండు పేటల్లో  ఒక పే.. కాదు కాదు ..  మా అయన  తల నీలాలిస్తాం తండ్రీ’ లాంటి వీలైన   మొక్కులు  మొక్కేసుకుంటు న్నారు  పెళ్ళాలు!

“ఒదినా. అన్నయ్య గారు లోపల బిజీ అయిపోయారు. అసలు పైకి లేవనే లేవట్లా!” - “మా వారికి జలస్తంభన విద్య తెలుసమ్మా. ఎంతసేపైనా నీళ్ళల్లో ఉండగలరు. గొలుసు దొరికాకే వస్తారు పైకి.”--

“అవునా? ఎందుకైనా మంచిది ఓసారి తాడు కదిపి
  చూడమ్మా”

“అవునూ, మనం కష్టపడి గొలుసు
  కోసం వెతుకుతున్నాం కదా. తీరా దొరికాక  సర్పంచ్  గారు

‘అది నాదీ,
  నాకిచ్చె’య్యమనదు  కదా?” --  “ అట్టెట్టా కుదురుద్దీ? ఓ సారి నిమజ్జనం చేసేక ఇంతే సంగతులు. హక్కులేం ఉండవు వాటి మీద.  మా అయన చెప్పారు.  లాయరు కదా!” -- “లాయరా? ప్లీడరు గుమస్తా అన్నారు మా అయన?”

“చీఛీ. ఇవేమిటే? ఎంత పట్టుకుని లాగినా సాగుతున్నాయి, వదలటం లేదూ!”
  “జలగలండీ! వీటి దుంపతెగా.   పీకితే  సాగుతాయే గాని వదలవు. చుట్టో  సిగరెట్టో వెలిగింఛి, ఆ నిప్పు తగిలించాలి వాటికి, నా చిన్నపుడు మా వూళ్ళో చూసా. ఉండండి.” అంటూ పెళ్ళాం గట్టు మీద మొగుడు విడిచిన ప్యాంటు జేబులోంచి అగ్గిపెట్టె, సిగరెట్టు  తీసి వెలిగించి మొగుడి నోట్లో పెట్టింది. అదికాస్తా నీళ్ళ తడికి  ఆరిపోయింది.  “ ఇలా ఇవ్వండి”  అంటూ ఆ సిగరెట్టుని లాక్కుని , తన  నోట్లో పెట్టుకుని  వెలిగించి ఓ  దమ్ము పీకింది పెళ్ళాం.  దగ్గొచ్చి ఉక్కిరిబిక్కిరయ్యింది!   నెత్తి మీద కొట్టుకుని  గట్టిగా పీల్చి, ఎర్రటి నిప్పుని జలగల  మీద పెట్టింది. వెంటనే అవి  రాలిపోయాయి. విజయ గర్వంతో ఓ చూపు చూసి,  మొగుణ్ణి  మళ్ళీ నీళ్ళపాలు చేసింది పెళ్ళాం.

“వొదిన గారూ, ఇదిగో మా ఆయనక్కూడా పాడు
  జలగలు పట్టేయి. కాస్త నిప్పు పెట్టండి” అంది ఒక పెళ్ళాం మొగుణ్ణి తెచ్చి.  అప్పటికే అరడజను జలగ బాధితులు  లైన్లో నిలబడ్డారు పీక్కుంటూ.

“సిగరెట్టు రేట్లు బాగా పెరిగాయమ్మా. జలగకి ఇరవై అవుతుంది మరి,
  ఇష్టమైతే చెప్పండి.” అంది పెళ్ళాం ఓ దమ్ము పీల్చి పొగ వొదుల్తూ. -- “ఖర్మ! ఓ పక్క రక్తం పీల్చేస్తుంటే డబ్బుకి చూసుకుంటామా, కానివ్వమ్మా” అంది బాధితుని పెళ్ళాం కొర కొరా చూస్తూ. వెంటనే పెళ్ళాం గట్టిగా దమ్ము లాగి, వరసగా ఒక్కొక్కరినీ జలగ విముక్తుల్ని చెయ్యసాగింది నిప్పు పెడుతూ.  అరగంటలో మూడొందలకు  పైగా వసూలయ్యింది!!  

ఈలోగా మొగుడు భళ్ళున నీళ్ళలోంచి లేచి, “ఏమేవ్. చూడు. ఎవడో
  నా డొక్కలో గట్టిగా తన్నేడు లోపల.” అంటూ  ఏడుపు లంకించుకున్నాడు. -- “ అవునా? మీ పక్కన దిగింది దుందుభి గారు. ఆయనే అయి ఉంటాడు. వాడి మొహం మాడిపోనూ.  బయట మిమ్మల్ని ఎదుర్కోలేక ఇలా నీళ్ళల్లో ఎటాక్ చేస్తున్నాడా పీనుగా? దమ్ముంటే బయట చూసుకోవాలి!”

“ఏవమ్మో వొళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా ఆయనకి అలా చాటుగా తన్నాల్సిన అవసరం లేదు.
  బయటే తన్నగలడు. మిలట్రీలో పనిచేసాడు. ఆ.” -- “ఏంటే  చూసుకునేది? నువ్వెంత నీ బతుకెంత?” -- “ఎవన్నావే?”  ఇద్దరు పెళ్ళాలూ జుట్టు జుట్టు పట్టుకుని తన్నుకోవడం ప్రారంభించారు!

“ఏవమ్మోయ్. మీరిద్దరూ కొట్టుకుంటూ తాళ్ళు వదిలేసారు. మీ మొగుళ్ళ సంగతి
  చూసుకోండి బుడగలొచ్చేస్తున్నాయి లోపల్నించి.” అంది పక్క పెళ్ళాం.  కొట్లాట ఆపేసి  ఇద్దరూ  మళ్ళీ తాళ్ళు పుచ్చుకున్నారు.

ఈ లోగా ఒక మొగుడు చటుక్కున నీళ్ళల్లోంచి బయటకు వచ్చి గట్టెక్కి, అటూ ఇటూ చూసాడు.
  చూసి, దబ్బున  ఒక్క దూకు దూకి,  ఇంటి వైపు పారిపోయాడు!  అతడి వెంటే అతడి పెళ్ళాం కూడా బట్టలు, తాడు పట్టుకుని పరుగెత్తింది!  అందరూ విస్తుపోయి చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు!!

“అయిపోయింది, అంతా అయిపోయింది! ఆయనకి
  గొలుసు దొరికేసింది!  అందుకే అలా పారిపోయాడు. చాల్లెండి వెతకడం.  బయటకు రండి.”

“ చూసారా ఎంత తెలివిగా అయన గొలుసు పట్టేసాడో. మీరూ ఉన్నారు ఒట్టి దద్దమ్మ. రెండు లక్షల రూపాయల గొలుసండీ” గొల్లుమని ఏడుపు ప్రారంభించింది పెళ్ళాం. ఈలోగా
  తాళ్ళు చుట్టేసుకుంటూ  పెళ్ళా లందరూ నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టసాగేరు వెర్రి మొహాల్తో గట్టెక్కుతున్న అసమర్థ మొగుళ్ళని చూస్తూ.  ఒక పెళ్ళాం అయితే చెయ్యి కూడా చేసుకుంది. 

ఆ మర్నాడు సర్పంచి సక్కుబాయి గారు రెండు పేటల వారినీ
  మీటింగుకి పిలిచింది. “మన కందరికీ  ఉపయోగపడుతుందని, చెరువును బాగు చేసుకుందామని, శ్రమ దానం చెయ్యమంటే ఎవ్వరూ ముందుకు  రాలేదు. ఇప్పుడు నా గొలుసు పుణ్యమా అని అందరూ నీళ్ళల్లో  దిగీ తూడు, నాచు తీసేసి శుభ్రం చేసేసారు చెరువుని. అందరికీ ధన్యవాదాలు! మరో విషయం. నా గొలుసు నిమజ్జనం చేసానని నేను ఎవరితో చెప్పాను? గొలుసు ఇదిగో నా దగ్గరే ఉంది. ఎవరో పుకారు పుట్టించారు  పోయిందని.  నేనైతే కాదు.  పోనీలెండి. జరిగిందేదో జరిగింది. చెరువు బాగు పడింది!”  అంది రెండు పేటల వాళ్ళూ నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తూ ఉండగా తన రెండు పేటల  గొలుసుని  జాకెట్లోకి జాగ్రత్తగా విడుస్తూ.

*****
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - రమణారావూ-తిండి పిచ్చి - by k3vv3 - 22-02-2025, 01:16 PM
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM



Users browsing this thread: 1 Guest(s)