Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - ఆఖరిబాగం
#66
"సరే వెళ్ళి కార్లో కూర్చో. డ్రైవర్ నిన్ను మీ ఇంటి దగ్గర్లో దించుతాడు."
సీతాపతి మౌనంగా గదినుండి బయటికి నడిచాడు.
హరికృష్ణ డ్రైవర్ను పిలిచి సీతాపతిని డ్రాప్ చేసి రమ్మని చెప్పాడు.
సీతాపతి కార్లో కూర్చున్నాడు. డ్రైవర్ రాములు కారును సమీపించి కూర్చొని...
"సీతయ్యబాబు!... బయలుదేరుదామా!..." అడిగాడు.



"ఆఁ...." హరికృష్ణ చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తున్న సీతాపతి యాంత్రికంగా పలికాడు.
అతనికళ్ళ ముందు ఒకవైపు తన తండ్రి ప్రజాపతి, మరోవైపు హరికృష్ణ నిలిచారు.



నా తండ్రి... తన స్వార్థం కోసం... ఎవరినైనా వంచిస్తాడు. ఆయనలో వున్న స్వార్థానికి స్వపర భేదం లేదు. తన పంతం నెరవేరి తన వాంఛ తీరాలి. ఆవేశంతో ఏదైనా చేస్తాడు.
మామయ్య!... శాంత స్వరూపి. స్వార్థపు చింతనకు వారికి చాలాదూరం. ఎంతో బంధుప్రీతి. అందరూ అరమరికలు లేకుండా హాయిగా కలిసి ఒకటిగా వుండాలనే తత్వం. పరమార్థమే వారి స్వార్థం.



రెండు మూడు సంవత్సరాలుగా నాన్న మనస్తత్వంలో ఎంతో మార్పు. బంధుప్రీతి నశించింది. ధనదాహం ఎక్కువైంది. దయ ధర్మాన్ని మరిచాడు. ఇతరులను ఎవ్వరినీ లెక్కచేయడు. అందరూ తన మాటను గౌరవించి వారికి తలవంచాల్సిందే. వారి క్రింద పనిచేసేవారు బ్రతుకు తెరువుకోసం వారి దాసోహం పలుకుతారు. కాదంటే వారికి మనుగడ వుండదు.



కానీ... నేను అక్క... అమ్మ... వారి పెద్దరికాన్ని గౌరవించి, వారి మాటలను వింటూ తలలు దించుకొంటున్నామంటే, దానికి కారణం వారిమీద అభిమానం గౌరవం కాదు, వారు పెద్దవారైనందున వారిని ఎదిరించడం న్యాయం కాదనేదే కారణం. మామయ్య, నాన్నగారు తూర్పు పడమరలుగా వున్నారు. రెండు దిశలు కలవవు. కలవని దిశల్లో వున్న నేను, శార్వరి కలసి ఒకటై జీవితాన్ని సాగించడం అసాధ్యం. నేను మగవాణ్ణి దేనికైనా తెగించగలను. కానీ శార్వరి ఆడపిల్ల. తనకు తల్లిదండ్రులంటే ఎంతో అభిమానం... ప్రేమ. ప్రేమ ముందు నాకు తనపై వున్న ప్రేమ ఓడిపోవలసిందే!... గెలవదు... 



బెదిరించి, బలత్కారించి శార్వరి ప్రేమను పొందాలనుకోవడం అవివేకం. అలాంటి ప్రయత్నాలు చేస్తే అవి నాలోని స్వార్థానికి నిదర్శనాలవుతాయి. లక్షణాలను ఎవ్వరూ మెచ్చరు. మనిషైనవాడు తన చర్యలను పదిమంది మెచ్చేరీతిగా ప్రవర్తించాలి. అది మానవత్వం అవుతుంది. స్వార్థ అమానుషత్వానికి నిదర్శం. నేను మంచి మనిషిగా బ్రతకాలి. మంచిపేరును సంపాదించుకోవాలి. 



నాకు శార్వరిపై వున్నప్రేమ నిజమైన ప్రేమ అయితే నేను ఆమె అభిప్రాయాన్ని ఆమోదించాలి, గౌరవించాలి. అప్పుడే నా ప్రేమ వ్యామోహం కాకుండా నిజమైన ప్రేమ అవుతుంది. మామయ్య చెప్పిన ప్రతి అక్షరం సత్యం. వారు నామేలు కోరి విధంగా చెప్పారు. వారి మాటలను పాటించాలి. ధ్యాసను చదువుపై లగ్నం చేయాలి. మంచి ఫలితాన్ని సాధించాలి అనుకొన్నాడు సీతాపతి.
రాములు వీధి మలుపులో కారు ఆపాడు.



"సీతయ్యబాబూ!.... మన ఇంటి దగ్గరకు వచ్చేశాము!"
పిలుపు విని తొట్రుపాటుతో కళ్ళు తెరిచాడు సీతాపతి. డోర్ తెరుచుకొని కారు దిగాడు.
"థాంక్యూ రాములన్న!"
"మంచిది బాబు!" చిరునవ్వుతో చెప్పాడు రాములు.
సీతాపతి తన ఇంటివైపుకు నడిచాడు. రాములు కారును ఫ్యాక్టరీ వైపుకు త్రిప్పాడు.
పరంజ్యోతి... ప్రజాపతి స్నేహితుడు. పాతిక సంవత్సరాల క్రిందట తన సోదరి లావణ్యను పరంజ్యోతికి ఇచ్చి వివాహం జరిపించాలనే నిర్ణయంతో వున్న ప్రజాపతి... తండ్రి కైలాసపతి నిర్ణయం వేరుగా వున్నందున.... వారిని ఎదిరించలేక తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక మౌనంగా వుండిపోవలసి వచ్చింది.



ప్రస్తుతంలో... పరంజ్యోతి కుమారుడు దివాక్ర్కు తన కూతురు దీప్తిని ఇచ్చి వివాహం చేయాలనేది అతని సంకల్పం. దివాకర్ చెన్నైలో చదివి, అమెరికా వెళ్ళి, నాలుగేళ్ళు అక్కడ పనిచేసి, ఎం.ఎస్ పూర్తిచేసి, చెన్నైకి తిరిగి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించాడు.



పరంజ్యోతి హోటల్ వ్యాపారి. ప్రజాపతికి ఒకే కూతురని, ఎంతో ఆస్తి వుందని, దివాకర్కు దీప్తితో వివాహం జరిపిస్తే ప్రజాపతి ఆస్తిలో సగభాగం తన కొడుక్కి సంక్రమిస్తుందనే ఆశతో ప్రజాపతికి ఫోన్ చేశాడు.
"హలో!..."
"ఎవరూ!..." ప్రజాపతి మాటలు.



"నేనురా!... పరంజ్యోతిని... ఎలా వున్నావురా!" నవ్వుతూ అడిగాడు.
"!... పరం నీవా!... బాగున్నానురా!... నీవెలా వున్నావ్!..." అడిగాడు ప్రజాపతి.
"ఆఁ... బాగున్నానురా!... నిన్ను ఒకమాట అడగాలని ఫోన్ చేశాను" అన్నాడు పరంజ్యోతి.
"చెప్పరా!... విషయం ఏమిటో!...."



"మరేం లేదురా!... నేను మీ ఇంటికి అల్లుడికి కాలేకపోయాను. నా కొడుకు దివాకర్ అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. వాడికి వివాహం చేయాలని నిర్ణయించుకొన్నాను. నీవు నీ కూతురు దీప్తిని నా కోడలుగా చేయగలవా!..." అడిగాడు పరంజ్యోతి. 
ప్రజాపతి ముఖంలో పున్నమి వెన్నెల విరిసింది. తన నిర్ణయాన్ని... తన హితుని నోట విన్నందుకు... పరమానందంతో.



"ఒరే!... పరం... నీవు అడగడం... నేను కాదనడమా!... చూడు నా కూతురు దీప్తి నీ కోడలేరా!. నేను చెన్నైకి వచ్చి మిమ్మల్ని మావూరికి వచ్చి... మా అమ్మాయిని చూచుకొనేదానికి పిలుస్తానురా!" ఆనందంగా చెప్పాడు ప్రజాపతి.



"ఒరే ప్రజా!... నన్ను పిలిచేదానికి నీవు చెన్నై రావాలా! నాకు నీమాట చాలు. నీవు రావాల్సిన అవసరం లేదు. నీవు నాకు ఎవరు? నా ప్రియమిత్రుడివి... మంచిరోజు చూచుకొని నేను మీ చెల్లెలు, దివాకర్ గూడూరు వస్తామురా! ఎప్పుడు వచ్చేదీ త్వరలో ఫోన్ చేస్తాను. సరేనా!" అన్నాడు పరంజ్యోతి. 



"ఒరే! పరం!చాలా చాలా సంతోషంరా!" ఆనందంగా నవ్వుతూ చెప్పాడు ప్రజాపతి.
ఫ్యాక్టరీ నుంచి తిరిగి వచ్చిన సీతాపతి... తండ్రి గదిలో ప్రవేశించబోయి ఆగి... వారు ఫోన్లో చేసిన సంభాషణనంతా విన్నాడు. వంటగదిని సమీపించి లోనికి చూచాడు.
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 11 - by k3vv3 - 30-01-2025, 11:48 AM



Users browsing this thread: 1 Guest(s)