Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 12
శంభల రాజ్యం – 12
యతిరాజు ప్రాంచద్రుద్రుడి ఆగమనం - వరుణ ప్రాకారం వైపుకు అభిజిత్  అడుగులు
 
సింహళ ఇందిరాపరిధికి వెళ్ళిపోయాక భూమ్మీద శాంతి భద్రతలకు లోటు ఏర్పడింది. సింహళ రాజుల త్యాగాలు సింహళను, సింహళ ప్రజలను సురక్షితంగా ఇందిరాపరిధికి చేర్చాయి. సింహళ రాజుల మారణహోమంలో బలి ఐన క్రూర జంతువుల అవశేషాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. అవి భూమిపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్రూర జంతువుల అవశేషాలను రాబందులు, నక్కలు, వేటకుక్కలు తినటం మొదలు పెట్టాయి. ఒక చీకటి రాత్రి పూట అలా తిన్న రాబందొకటి ఇబ్బంది పడుతూ ఒక చెట్టు మీద వాలింది. అదే సమయంలో అటు వైపుగా వెళుతున్న వలకాడు రాబందును చూసి ఆగిపోయాడు. దూరంగా ఎక్కడినుంచో వస్తున్న వెలుగులో రాబందు కళ్ళు మెరిసాయి. కానీ వేటగాడైన వలకాడికి అది చకోర పక్షిలా కనిపించింది. అంతక్రితమే అతనికి చకోర పక్షిని వేటాడి భుజిద్దామనే దుర్బుద్ధి కలిగింది. చకోర పక్షి గురించి తన గురువు గొప్పగా పొగుడుతుంటే విన్నాడు. స్వతహాగా కాముకుడు అవ్వటం చేత గురువు చెబుతున్న మాటల్లోని భావం బోధపడక పెడబుద్ధి పుట్టింది. వెన్నెలను తాగి బతికే గొప్ప జీవి చకోర పక్షి. అలాంటి చకోర పక్షిని చంపాలనే ఆలోచనే వికృతి. అందుకే ఆలోచనకు తగ్గట్టే ఇప్పుడు రాబందే చకోర పక్షిలా అతనికి కనిపించి మాయకు గురి చేసింది. వెంటనే రాబందును అక్కడికక్కడే నేలకొరిగేలా చేసి దగ్గర్లో మంట కనపడితే ఒక గుడారం వైపుగా పరుగులు తీసాడు. వేటగాడి మనసులో ఇంకా అది చకోర పక్షి అన్న భ్రమే ఉంది. గుడారం బయట నలుగురున్నారు. వారు రాత్రి వేటకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆకలి మీదున్నారు.
వేటగాడు వాళ్ళని చూస్తూ ఇలా అన్నాడు,
 
"చకోర పక్షిని తెచ్చాను", కళ్ళు మెరిసిపోతూ అన్నాడు.
నలుగురిలో ఒకడికి ముచ్చెమటలు పట్టాయి.
 
"ఏం మాట్లాడుతున్నావ్? చకోర పక్షిని పూజిస్తాం మేము. అలాంటిది దాన్ని తుదముట్టించావా. నియతి లేని నాయాల" అంటూ కళ్ళెర్రజేశాడు.
 
వాళ్ళల్లో ఒకడు అతన్ని పక్కకు తీసుకెళ్లాడు.
 
"సరిగ్గా చూడు. అది రాబందు. చకోర పక్షి కాదు. వీడెవడో మిడిమిడి జ్ఞానిలా ఉన్నాడు.
 
ఇదే మంచి అవకాశం. తిందాం పద" అంటూ ఉండగా
"ఏమయిందిరా నీకు రాబందును తింటానంటున్నావ్?" అంటూ అడిగాడు.
 
"రాబందుకు నాకు వైరం. జాతి అంటేనే పడదు. మా తాత శవాన్ని పీక్కు తిని చంపిందది. వదిలిపెట్టమంటావా? మనం వేటాడలేదు. అదే మన దాకా వచ్చింది. ఎట్టా వదలమంటావు?"
 
"వైరం వద్దురా బాబు. మంచిది కాదు. నా మాట విను", అని ప్రాధేయపడ్డాడు.
 
అంతలో మరో ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా రాబందును తినటానికే  మొగ్గు చూపారు.
 
అలా రోజు రాత్రి వాళ్ళు ఆబగా రాబందు మాంసం భుజించారు. ఇలాగే క్రూర జంతువుల అవశేషాలు తిన్న నక్కలు, వేటకుక్కలు కూడా మనుషుల వేటకు బలి అయిపోయి వారిచే భుజించబడ్డాయి. ఇలా కొన్ని నెలల పాటు సాగింది. ఇవి తిన్న వారందరు కర్కశంగా తయారయ్యారు. క్రూర జంతువు అవశేషం వారిలో విధంగా చేరిందో తెలీదు గాని ఇప్పుడు భూమ్మీద ఇలాంటి వాళ్ళే క్రూర జంతువులలా మారిపోయారు. వీరు బహు కాముకులుగా పరివర్తనం చెందారు. సత్వరజస్తమో గుణాలున్న మనుష జన్మను సార్థకం చేసుకోకుండా నిరర్థకం చేసుకునే దిశగా ఇలా వీరు భూమ్మీదున్న తక్కిన వారిని భయాందోళనలకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. వీరి వల్ల ఆడవారికి భద్రత లేకుండా పోయింది. చిన్నపిల్లలకు రక్షణ లేదు. యువకులకు దిక్కుతోచడం లేదు.
 
అలాంటి సమయంలో ఒక నాటి రాత్రి ఆకాశంలో పూర్ణ చంద్రుడు ఉండగా తెల్లటి వృషభంపై ఆసీనుడై యతిలా ఖడ్గధారియై ప్రాంచద్రుద్రుడు భూమ్మీదకు వచ్చాడు.
 
 “ ఏవం వేదా 
యోపామాయతనం వేదా 
ఆయతనవాన్ భవతి
 
అంటూ తన ప్రభతో ఒక్కసారిగా మంత్రపుష్పం అందుకుంటూ ముందుకుసాగాడా యతీశ్వరుడైన ప్రాంచద్రుద్రుడు. ప్రాంచద్రుద్రుడి నడకే ఎంతో మంది శిష్యగణాల్ని జతచేస్తూ పోయింది. మంత్రపుష్పంలోని అదే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు ఎగసిపడే అగ్నిశిఖలా వెడుతున్నాడా యతిరాజు.
 
ఆయన కళ్ళల్లోని జ్వాలలు పఠించే మంత్రాల ద్వారా బయటికి పెల్లుబుకుతూ జ్వాలాతోరణంలా ఆయన చుట్టూ ఏర్పడి భూమిపైనున్న కాలుష్యాన్నంతా తగలబెట్టుకుంటూ పోతోందా ఏమిటి అన్నంత గంభీరంగా ఉంది దృశ్యం.
 
క్రూర జంతువుల అవశేషాలు భూమిపైనున్న 108 స్థానాలను కలుషితం చేశాయి. 108 పరిసరాలలోని అసురీ శక్తినంతా తెచ్చి 108 చిత్గుహలలో బంధించాడు ప్రాంచద్రుద్రుడు.
 
సరిగ్గా తురగ ప్రాకారం ఎక్కడైతే ఉందో అంతక ముందు 108 చిత్గుహలు ఉండేవని అంతక్రితం చెప్పాను కదా", అంటూ గుర్తుచేసాడు రుద్రసముద్భవ.
 
సంజయ్, అంకితలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
 
"మరిప్పుడు 108 చిత్గుహలు ఏమైపోయాయ్ స్వామి?" సంశయిస్తూ అడిగారు ఇద్దరూ.
 
" జజీరా తన స్వార్థంతో 108 చిత్గుహలను ధ్వంసం చేసాడు. విక్రమసింహుడొక్కడే జజీరాను, అసురీ సైన్యాన్ని ఎదుర్కొని శంభల రాజ్యాన్ని ఎలా కాపాడారో ముందు ముందు మీరే తెలుసుకుంటారు", అన్నాడు రుద్రసముద్భవ.
 
అనిలుడిపై స్వారీ చేస్తోన్న విక్రమసింహుడికి ఏదో జ్ఞప్తికి వచ్చి హఠాత్తుగా ఆగిపోయాడు.
 
తురగ ప్రాకారంలో జజీరాతో తను చేసిన సంగ్రామం గుర్తొచ్చింది. తన తల్లి విజయకుమారిని కోల్పోయాడు. తనెంతగానో ప్రేమించిన మిథిలాను కోల్పోయాడు. విక్రమసింహుడిలా ఉన్న అభిజిత్ అడుగులు ఆవేశంగా  వరుణ ప్రాకారం వైపుగా పడ్డాయి. సింహదత్తుడి త్యాగంతో పావనమైన వరుణ ప్రాకారాన్ని చూడనిదే తన స్వస్వరూపం పూర్తిగా అర్థం అవ్వదు అనిపించింది అభిజిత్ కి.
 
విక్రమసింహుడి హృదయం ఆనాడు సింహదత్తుడిలానే చెమర్చింది. కానీ విక్రమసింహుడికి నాడు సింహదత్తుడి పూర్తి చరిత్ర తెలియదు. ఎందుకంటే సింహదత్తుడు నాడూ విక్రమసింహుడికి తన గురించి తాను చెప్పుకోలేదు. ఒక యోధుడి బిడ్డగానే పెరిగాడు విక్రమసింహుడు.
 
సింహదత్తుడు తన పూర్వీకులను తెలుసుకుని కార్చిన కన్నీరనే వర్షంతో తడిసిముద్దైన నేల    వరుణ ప్రాకారం.

ఇన్నాళ్టికి సింహ దత్తుడి గొప్పతనం తెలుసుకుని అడుగుపెట్టబోతున్నాడు విక్రమసింహుడైన అభిజిత్.
---
PS: Please rate the episode
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 11 - by k3vv3 - 02-01-2025, 08:45 AM



Users browsing this thread: 3 Guest(s)