Thread Rating:
  • 3 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 10
శంభల రాజ్యం – 6
విక్రమసింహుడి అంతర్మథనం
 
రుద్రసముద్భవ నేతృత్వంలో జటిల నుండి అనంతమైన చీకటి సముద్రంలోకి దూకేశారు అంకిత, సంజయ్ లు. తురగ ప్రాకారం మొత్తం ఇంకా చీకటిమయంగానే ఉంది.
 
అడుగులు అయితే పడుతున్నాయి గానీ ఎటు వెళుతున్నారో తెలియట్లేదు అంకిత, సంజయ్ లకు.
 
"అంతా చీకటిగానే ఉంది స్వామి", అన్నాడు సంజయ్.
 
"అది చీకటి కాదు. మీ కంటికి కనిపించని వెలుగు. విక్రమసింహుడి పరాక్రమాన్ని చూసిన ప్రాకారంలో శౌర్యం చూడని కన్నులు మీవి. మీకు అలాగే ఉంటుంది. అందులో మీ తప్పేం లేదు. ప్రాకార చరిత్రని తెలియజేసే  గమన వాహిని ఇక్కడొకటి ఉండాలి. దానికోసమే వెతుకుతున్నాను."
 
అంతలో అక్కడొక సుడిగాడ్పు వీచింది. అదేదో శక్తి అనిపించేలా వీళ్ళ చుట్టూతా తిరుగుతోంది. వీళ్ళకేదో చెప్పాలి అనుకుంటుందేమో అన్నట్టుంది. అలా ఒక ఐదు నిమిషాల పాటు సాగింది. రుద్ర సముద్భవ కాళ్ళ దగ్గర ఆగిపోయిన పెనుగాలి చివరికి వెళుతూ వెళుతూ   గమన వాహినిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది.
 
"ఇదే మనకు కావలసిన  గమన వాహిని. మీకీ ప్రాకారాన్ని చూపించి దిశానిర్దేశం చేసేది ఇదే", అంటూ తన రెండు చేతులతో గమన వాహినిని తీసుకున్నాడు.
 
అది పైకి చూడటానికి ఒక బంగారం దాచే పెట్టెలా ఉంది. బయటికి మెరిసిపోతూ ఉంది. రుద్రసముద్భవ గమన వాహినిని తెరిచాడు. తెరవగానే గమన వాహిని లో నుండి వెలుగులు విరజిమ్ముతూ తురగ ప్రాకార ఆవిష్కరణ వాళ్ళ కళ్ళ ముందే జరుగుతుందేమోనన్నట్టు ఒక దాని వెంట మరొకటి ప్రాకారంలో జరిగిన విశేషాలన్నీ వారి ఎదుటే తెర మీద కనిపించే బొమ్మలలా కదిలిపోతూ ఉన్నాయి. ఇదంతా చూస్తూ అంకిత, సంజయ్ లు ఆశ్చర్యపోయారు.
 
అంతలో   గమన వాహిని నుండి ఒక స్వరం వినిపించింది. చాలా గాంభీర్యం నిండిన స్వరమది.
 
"కాలగమనంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే ఎప్పటికీ చిరస్థాయిలో గుర్తుండిపోతాయి. అదేదో నిన్నే జరిగిందేమోనన్నట్టు మిగిలిపోతాయి. అలాంటి అశ్వహృదయ విద్యా ప్రదర్శన శంభల రాజ్యంలోని తురగ ప్రాకారంలో మాత్రమే జరిగింది. ఎందరో యోధులు పాల్గొన్నారు. విక్రమసింహుడు జయించి ఓడిన చోటిది. ఒక గొప్ప యోధుడు గెలిచి ఓటమితో వెనుదిరిగిన చరిత్ర ఇది. అందుకే చరిత్ర మీకు  భౌమ్యభూమిక నందు కనబడదు. ప్రాకారం ఒక యుద్ధభూమిక. భూమికలోకి మీరు అడుగుపెడితే కానీ చరిత్ర మీకు కనబడదు. భూమిక మీకు పూర్తిగా కనబడాలంటే రుద్రసముద్భవ వేసే మంత్రంతో మాత్రమే అది సాధ్యపడుతుంది", అంటూ అంతటితో స్వరం ఆగిపోయింది.
 
"స్వామీ,   గమన వాహిని   నుండి వెలువడిన కంఠం ఎవరిది?" అడిగాడు సంజయ్.
 
"గమన వాహిని ఒక సేన. సేనాధిపతి స్వరమే మీరు విన్నది", అన్నాడు రుద్రసముద్భవ.
 
"కాలం ఒక నిరంతర సంగ్రామం. సంగ్రామంలో ఎప్పటికప్పుడు గెలుస్తూ మన గొప్ప చరిత్రను కాపుడుతూ మనకందించే సైన్యమే   గమన వాహిని. సత్యం, అసత్యం అనే రెండు వర్గాల మధ్య జరిగే పోరు. కాలం అనే యుద్ధభూమిలో తలపడినప్పుడు మీకు వినబడే స్వరం ఇది", అంటూ గర్వంగా గమన వాహిని వైపు చూసాడు రుద్రసముద్భవ.
 
అప్పుడు ఒక యోధుడి ఆకారంలో గమన వాహిని సైన్యాధిపతి రుద్రసముద్భవకు నమస్కరిస్తూ కనిపించాడు. ఒక్క నిమిషం గగ్గుర్పాటుకు గురయ్యారు అంకిత, సంజయ్ లు.
 
"భౌమ్య భూమిక అంటే ఏంటి స్వామి?" అని అడిగింది అంకిత.
"భూమి నుండి వచ్చిన మీ చూపుకు అందే భూమిక. అంటే భూలోక ప్రదేశంలా కనబడే చోటు. అలాంటి భౌమ్యభూమిక లు కానివి మీకు కనబడవు. అంతా చీకటి మయంలా అనిపిస్తుంది. అందుకే ప్రస్తుతం మీ చుట్టూ పెను చీకటి నిండి ఉంది", అన్నాడు రుద్రసముద్భవ.
 
"నేనిప్పుడు మనసులో ఒక మంత్రం స్మరిస్తాను. అలా అనుకోగానే మీ చుట్టూ ఉన్న చీకటి మాయమైపోయి మీకీ ప్రాకారం అసలు స్వరూపం కళ్లముందుంటుంది. అప్పుడు ఎంతో వేగంగా అనిలుడితో వస్తున్న విక్రమసింహుడు మీకు కనిపిస్తాడు. భయపడకండి. అశ్వహృదయ విద్యలో ఆరితేరిన వాడతను. అతని గమన వేగానికి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు. మీరు తప్పకుండా భయపడతారు. అందుకే ముందుగానే హెచ్చరిస్తున్నాను", అనేసి మంత్రాన్ని మనసులో మననం చేసుకోవటానికి రెండు కన్నులు మూసి ఏదో స్మరించటం మొదలు పెట్టాడు రుద్రసముద్భవ.
 
మెల్లగా ఒక పక్క నుండి చీకటి తొలగిపోతూ వస్తోంది. చీకటి చెదరిపోతోందేమో అన్నంత వేగంతో అనిలుడిపై వస్తున్నాడు విక్రమసింహుడు.
 
అనిలుడి పరుగుతో పోటీ పడే సత్తా లేక చీకటి అమాంతం ఎగిరిపోయింది. ప్రాకారంలో మొట్టమొదటగా వారికి త్రివిక్రమ స్వరూపంలో ధీరత్వానికి ప్రతీకగా కనిపించింది అనిలుడిపై నున్న విక్రమసింహుడే. అలా మెరిసాడో లేదో అలా మాయమైపోతున్నాడు. అంతటి గమన వేగం అనిలుడిది. అలుపు లేని పరుగు. అదుపు లేని పరుగు. మెరుపు లాంటి పరుగు. మరువలేని పరుగు. అలా వెళ్ళిపోతున్న అనిలుడినీ, విక్రమసింహుడినీ చూస్తూ చూస్తూ అలా ఒకసారి ప్రాకారాన్ని చూసేసరికి అది ఎంత పెద్ద యుద్ధభూమో అర్థం అయ్యిండప్పుడు. లోకాలన్నీ పరుచుకున్నంత పెద్దగా ఉందది. అలా ఎలా నిర్మించారో అంతుబట్టడం లేదు. ఒక్కటి మాత్రం నిజం. అదొక పద్మ వ్యూహం లాంటిది. అక్కడి నుండి బయటపడటానికి గెలుపు తప్ప వేరొక మార్గం లేదు. బరిలో ఎవ్వరూ లేనప్పుడే ఇంత దడ పుట్టిస్తోందంటే అంత మంది యోధుల ముందు విక్రమసింహుడు తన పరాక్రమాన్ని ఎలా చూపించాడా, ఎలా గెలిచాడా అని అంకిత ఆశ్చర్యపోయి చూస్తోంది.
 
విక్రమసింహుడు అలా అనిలుడిపై స్వారీ చేస్తూ  ఎంత సేపు పరిగెట్టాడో తెలీదు.
 
విక్రమసింహుణ్ణి తదేకంగా అలా చూస్తున్న అంకిత, సంజయ్ లకు వారి కళ్ళ ముందే విక్రమసింహుడి చరిత్ర పరుచుకుంటోంది. తురగ ప్రాకారంలోని విక్రమసింహుడి చరిత్ర కళ్ళ ముందే ఆవిష్కృతం అయ్యే సమయం ఆసన్నమయింది. అదేంటో తెలుసుకుందామనే ఆదుర్దా ఘడియ, ఘడియకూ రెట్టింపు అవుతోంది అంకితలో.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: అదృశ్య మందిరం - శంభల రాజ్యం – 5 - by k3vv3 - 09-11-2024, 12:08 PM



Users browsing this thread: 8 Guest(s)