Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - ఆ కొందరి వలన
#29
తారుమారు మారుతారు - బుద్ధవరవు కామేశ్వరరావు
 
[Image: image-2024-10-14-183007405.png]
"ఏం నాంచారక్కా, అందరూ ఎలా ఉన్నారు? కెనడా వెళ్లి ఓ సంవత్సరం ఉండి, మా అమ్మాయికి పురుడు పోసి, నిన్ననే వచ్చాను" నాంచారి ఇంటికి వచ్చి చెప్పింది, అదే ఊర్లో ఉంటున్న ఆమె బాల్య స్నేహితురాలు చూడామణి. "అంతా బాగానే వలన దయ ఉన్నాము దేవుని. మీ ఢిల్లీ బావగారు వెళ్లారు మొన్ననే" చెప్పింది నాంచారి. బిత్తరపోయిన చూడామణి, బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తూ, "అక్కా అదేం భాష? మళ్లీ ఓ సారి చెప్పు" అనగానే, నాంచారి రిపీట్ చేసిన ఆ పదాలు పక్కనే ఉన్న ఓ పుస్తకం మీద రాసుకుని, అర్థం చేసుకొని, "దేవుని దయ వలన అంతా బాగానే ఉన్నాము. మీ బావగారు మొన్ననే ఢిల్లీ వెళ్లారు.....అనే కదా అక్కా! నువ్వు చెప్పాలనుకున్నది" అడిగింది చూడామణి పుస్తకం, పెన్సిల్ పక్కన పెట్టి. "అర్థం సమయంలో ఔను బాగానే తక్కువ చేసుకున్నావు" చెప్పింది నాంచారి. "ఔను తక్కువ సమయంలో బాగానే అర్థం చేసుకున్నావు..అనే కదా దాని అర్థం" అడిగింది చూడామణి రాసుకున్న పుస్తకం వంక ఓసారి పరిశీలనగా చూస్తూ. "ఈ అనుమానం అనే జబ్బు ఏమిటి నీ మాటలు కదా ఎవరు ఇదేం నేర్పారు" చూడామణి వంక చూస్తూ అడిగింది నాంచారి. వెంటనే, ఆ పదాలను అటూఇటూ మార్చి నాలుగైదు సార్లు పుస్తకం మీద రాసుకున్న చూడామణి, చివరకు 'ఏమిటి ఈ మాటలు? ఇదేం జబ్బు ? ఎవరు నేర్పారు అనే కదా నీ అనుమానం'.... ఇదే కదా నాంచారక్కా నువ్వు అన్నది. ఔనక్కా! నేను ఇదే అడగాలనుకుంటున్నా. ఏడాది తర్వాత కలుసుకున్నాం. ప్రయాణం చేసి అలసిపోయాను. ఏం జరిగిందో మన మానవ భాషలో చెప్పక్కా" నాంచారి కాళ్ళ మీద పడినంత పని చేసింది చూడామణి. ఎంతో ఆశతో తనను చూడాలని వచ్చిన చూడామణిని ఇంక బాధపెట్టకూడదని నిశ్చయించుకుని, ఓ ఐదు నిమిషాలు పాటు ధ్యాన ముద్రలోకి వెళ్లి, తిరిగి వచ్చి మామూలు భాషలో చెప్పసాగింది నాంచారి. "చూడా! నీకు తెలిసిందే కదా? మీ బావగారు నెలలో ఓ పది రోజులు ఉత్తర భారతం లోనే ఉంటారని. ఓ ఎనిమిది నెలల క్రితం ఇలాగే ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందో చెబుతా విను" అని చూడామణి ని ప్లాష్ బాక్ లోకి తీసుకుని పోయింది నాంచారి. 

"ఎమండీ! ఎలా ఉన్నారు ?ప్రయాణం బాగా జరిగిందా?" అడిగింది నాంచారి ఢిల్లీ నుంచి వచ్చిన తన భర్త, అందరూ ముద్దుగా మూర్ఖ శిఖామణి అని పిలుచుకునే యమ్.ఆర్. కె. శిఖామణి ని. "కాఫీ కొంచెం బాగానే జరిగింది కానీ ముందు ప్రయాణం తగలెయ్యి" అన్నాడు శిఖామణి. ఏమీ అర్థం కాక కాసేపు జుట్టు పీక్కుంది నాంచారి. తర్వాత ఏమనుకున్నాడో కానీ, ''ఓ కాగితం మీద రాసుకుని పదాలు అటూఇటూ మార్చి చదువుకో" అన్నట్లుగా సైగలు చేసాడు శిఖామణి. ఓ పావుగంట కుస్తీ పట్టిన తర్వాత అర్థమయ్యింది నాంచారికి, అది "ప్రయాణం బాగానే జరిగింది కానీ ముందు కొంచెం కాఫీ తగలెయ్యి" అన్నారని. కాసేపటికి తేరుకుని, "ఏమండీ! ఏమిటి ఈ భాష? ఇలా మాట్లాడాలని మీకెందుకు అనిపించింది? మీకు తెలిసి కూడా మనం మాట్లాడుకునే భాషలో చెప్పకపోతే నా తల వెయ్యి చెక్కలవుతుంది, టెన్షన్ భరించలేక" అని బెదిరించింది నాంచారి. "నాచూ! ఏముంది సింపుల్, హిందీలో చూడు. కొన్ని వాక్యాలలోని పదాలు ఎలా మార్చి చదివినా ఒకే అర్థం వస్తుంది. ఉదాహరణకు "ఆప్ లోగ్ క్యా కర్తే హై" అన్నా "క్యా కర్తే హై ఆప్ లోగ్" అన్నా, అలాగే "క్యా హువా ఆప్ కో" అన్నా "ఆప్ కో క్యా హువా" అన్నా ఒకటే అర్థం వస్తుంది. అందుకే ఈరోజు నుంచి మనం కూడా తెలుగులో అలా పదాలు మార్చి మాట్లాడడం ప్రారంభిద్దాం. దీనికి తారుమారు తెలుగు అనే పేరు పెడదాం" చెప్పాడు మూర్ఖ శిఖామణి. "ఏమండీ, ఆ భాషలో అది కుదురుతుందేమో కానీ, మన తెలుగు భాషలో సాధ్యం కాదండీ. మన భాషకు ఓ వ్యకరణం, కర్త కర్మ క్రియ లాంటి బోలెడు పద్దతులు ఉంటాయి" చెప్పి చూసింది నాంచారి, శంకరాభరణం శంకర రావు గారిలా. అయినా అదేం పట్టించుకోకుండా, "ఎప్పుడో ఎవరో కరణం గారు చెప్పిన ఆ వ్యాకరణం ఇప్పటికీ మనం ఫాలో అవ్వాలని ఏముంది? మనం మొదలు పెడితే కొన్నాళ్ళకి అందరికీ అదే అలవాటు అవుతుంది. ఇప్పటి పిల్లలు చూడు ప్రేమించుకున్నాం అనడానికి బదులు లవ్వాడుకున్నాం అంటున్నారు. స్పందించారు అనడానికి ఫీలయ్యారు అంటున్నారు. మరి అవి అచ్చ తెలుగు పదాలా? అందుకే ఈ తారుమారు భాషను మనం అందరికీ అలవాటు చేద్దాం! ఇదే ఫైనల్" వితండవాదం లేవదీసాడు ఆ మూర్ఖ శిఖామణి. 

 "చూడా! అదిగో అలా మీ బావగారి కోసం ఆ తారుమారు భాష అలవాటు చేసుకున్నానే. మొదట్లో నీలాగే నోట్ బుక్ మీద రాసుకుని ఆ సంధర్భానికి తగ్గట్టుగా అర్థం చేసుకొనే దాన్ని. ఇప్పుడిప్పుడే కొంచెం దారిలో పడ్డానే" మామూలు భాషలో చెప్పింది నాంచారి. "అక్కా! మరి ఈ భాష నేర్చుకున్న మొదట్లో నీకు ఏమీ ఇబ్బందులు ఎదురుకాలేదా?" ఆశ్చర్యంగా అడిగింది చూడామణి. "భలేదానివే చూడా! చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇప్పటికీ ఎదుర్కొంటున్నా" చెప్పింది నాంచారి. "మచ్చుకు ఓ రెండు చెప్పు నాంచారక్కా!" కుతూహలంగా అడిగింది చూడామణి. "ఓ రోజు మా పనిమనిషి 'అమ్మగారూ! అన్ని పనులు చేసేసాను, ఇంకా ఏమైనా ఉన్నాయా' అని అడిగింది. దానికి నేను, మామూలు మన భాషలో "ముందు పాత గలేబులు విప్పేయ్, తరువాత ఆ కొత్త చీర అందరికీ కనబడేలా అరేయ్" అని చెప్పడానికి బదులు, "అందరికీ కనబడేలా ఆ పాత చీర విప్పేయ్ ముందు, తరువాత కొత్త గలేబులు అరేయ్" అని మా వారు చెప్పిన తారుమారు భాషలో చెప్పానే! పాపం తప్పుగా అర్థం చేసుకుంది కామోసు, ఆ రోజు నుంచి పనిలోకి రావడం మానేసిందే" ముక్కు చీదుతూ చెప్పింది నాంచారి. "అయ్యో! ఎంత కష్టం వచ్చింది అక్కా నీకు. వీలైతే ఇంకో సంఘటన కూడా.." సందేహంగా అడిగింది చూడామణి. "అలాగే మా లాండ్రీ కుర్రాడు ఓరోజు ఫోన్ చేసి 'అయ్యగారు లేరా అమ్మా? బట్టలు ఏమైనా ఉన్నాయా?' అని ఫోన్ చేసాడే నేను మన భాషలో "అయ్యగారు ఇంట్లో లేరు పాత ఫాంట్ షర్ట్ విప్పేసి పడేసారు. తీసుకుని వెళ్లు. తొందరగా రా!" అని చెప్పడానికి బదులు ఆ దిక్కుమాలిన తారుమారు భాషలో "షర్ట్ ఫాంట్ విప్పేసి రా తొందరగా, పాత ఇంట్లో పడేసారు అయ్యగారు లేరు వెళ్లు తీసుకుని" అని చెప్పానే! అంతే ఆ కుర్రాడు ఈరోజు వరకూ మళ్ళీ ఫోన్ చేయలేదే" చీరతో కంట నీరు తుడుచుకుంటూ చెప్పింది నాంచారి. "నాంచారక్కా! నీ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఇంకా కాసేపు ఉంటే ఆ తారుమారు భాష నాకు అంటుకునేలా ఉంది. అనుకోకు ఏమీ ఇంకో మళ్ళీ వస్తా సారి" అని తాను కూడా ఆ తారుమారు భాష కొంచెం అంటించుకుని అక్కడ నుంచి బయలుదేరింది చూడామణి. ***** 

ఆరు నెలలు గిర్రున తిరిగాయి. ఆరోజు చూడామణిని చూద్దామని వాళ్ళ ఇంటికి వచ్చిన నాంచారి, "ఏమే చూడా! బొత్తిగా రావడం మానేసావ్. ఫోన్ కూడా చేయటం లేదు" అడిగింది చూడామణి ని. "నీకు తెలియనిదేముంది అక్కా! ఆ తారుమారు భాషకు భయపడే దూరంగా ఉన్నాను. ఔనూ అదేంటీ నువ్వు మన భాషలో మామూలుగా మాట్లాడేస్తున్నావ్" విస్తుపోతూ అడిగింది చూడామణి. "ఓహో! అదా? అదో పెద్ద కథలే!" తెరలు తెరలుగా నవ్వుతూ చెప్పింది నాంచారి. "కొంచెం చిన్న కథగా చెప్పక్కా" వేడుకుంది చూడామణి. "సరే పద మరి ప్లాష్ బాక్ లోకి" అని గతంలోకి తీసుకుని వెళ్లింది నాంచారి. 

ఈమధ్య తరచూ శిఖామణి ఆఫీసు వాళ్లు ఫోన్ చేసి "అక్కయ్య గారూ, ఈయనతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఆయన మాట్లాడుతోంటే స్టెనోగ్రాఫర్లలా ఓ నోటు బుక్, పెన్సిల్ పట్టుకుని ఆయన వెనకాల తిరగవలసి వస్తోంది. మీరే ఏదో పరిష్కారం చూడాలి" అని కంటనీరు పెట్టుకోవడంతో దీనికి ముగింపు పలకాలని ధృడంగా నిశ్చయించుకుంది నాంచారి. ఆరోజు భోపాల్ నుంచి వచ్చిన శిఖామణి ని గుమ్మంలోనే, "మంఏడీ లోయాప్రణం అసిలపోరుయా అకుంనుటా" అడిగింది నాంచారి. తనకు తెలిసిన తారుమారు తెలుగు భాషలో పదిసార్లు ఆ పదాలను అటూఇటూ మార్చి చూసుకున్నాడు శిఖామణి. ఇంక వేరే దారిలేక "అది ఒక్క ఒట్టు భాష అయితే ఏ అర్థం ముక్క" అన్నాడు తన తారుమారు భాషలో. మళ్లీ "మంఏడీ లోయాప్రణం అసిలపోరుయా అకుంనుటా" చెప్పింది నాంచారి. బ్రష్ చేసుకుంటూ, స్నానం చేస్తూ, టిఫిన్ చేస్తూ ఆ పదాలకు అర్థం ఏమిటా అని తెగ ఆలోచించిన శిఖామణి, ఇక గత్యంతరం లేక, "ఏ భాష అది? ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు" అని ఇందాక తాను చెప్పిన తారుమారు భాషను మన తెలుగు భాషలో చెప్పి, తరువాత "నాచూ! నిన్ను తగలెయ్యా అదేం భాషే? పిశాచి భాష. ఇందాకటి నుంచి ఛస్తున్నా అర్థం కాక. మన మామూలు భాషలో చెప్పవే" భార్యను వేడుకున్నాడు శిఖామణి. "ఏమండీ ప్రయాణంలో అలసిపోయారు అనుకుంటా.... అని దాని అర్థం" మామూలు భాషలో చెప్పింది నాంచారి. "ఈ భాష ఎవరు కనిపెట్టారే? భేతాళ మాంత్రికుడు చదివే మంత్రాల్లా ఉన్నాయి. వాళ్ళ మొహాలు మండా" విసుక్కున్నాడు శిఖామణి. "మీగేలాకు కూనుడానే కొరిగాత్తస నిట్టిపెనక షత్తభాకొ గుంబాడీదాం" చెప్పింది నాంచారి, మొహం మటమటలాడిస్తున్న శిఖామణి వైపు చూస్తూ. "ఒసేయ్! చూస్తూంటే ఇదేదో నా తారుమారు తెలుగుకు పోటీగా ఎవడో తీసుకుని వచ్చిన భాషలా అనిపిస్తోంది. ఇంక నన్ను చంపక అదేంటో మన మామూలు భాషలో చెప్పి చావవే" భార్య వంక జాలిగా చూస్తూ వేడుకున్నాడు శిఖామణి. "మీకులాగే నేనుకూడా సరికొత్తగా కనిపెట్టిన కొత్తభాష, బాగుందాండీ!'.. అని దాని అర్థం. అయినా ఇదేం పెద్ద కష్టం కాదండీ. కొంచెం మెదడు పెడితే అదే అర్థం అవుతుంది" చెప్పింది నాంచారి శిఖామణి మోకాలు వైపు చూస్తూ. "ఇది ఏ భాష? కొంచెం వివరంగా చెప్పి తగలడు" విసుక్కున్నాడు శిఖామణి. "ఈ భాష పేరు మారుతారు భాష. మీరు కనిపెట్టిన తారుమారు భాషలో పదాలు అటూఇటూ మారతాయి. దాని వలన కొన్ని అనర్ధాలు, అపార్ధాలూ ఉన్నాయి. అయితే ఈ మారుతారు భాషలో ఆ పదాలలోని అక్షరాలు మాత్రమే ఇటూఅటూ మారతాయి. అంతే తేడా. మనం ఈ మారుతారు భాష కంటిన్యూ చేద్దామండీ" భర్తను ఉడికిస్తూ చెప్పింది నాంచారి. "నీకు దణ్ణమే తల్లీ, నా తారుమారు భాషా వద్దు, నీ మారుతారు భాషా వద్దు. ఒకరి భాషను చూసి వాతలు పెట్టుకోవడం నేను చేసిన తప్పు. ఈరోజు నుంచి హాయిగా మన స్వచ్ఛమైన, మనకిష్టమైన మన తెలుగులోనే మాట్లాడుకుందాం" నాంచారిని బుజ్జగిస్తూ అన్నాడు శిఖామణి. "గారసదా రిన్నికొమ జురోలు......" అని నాంచారి చెప్పబోతోంటే, "అదిగో అదే వద్దు" అన్నాడు శిఖామణి నవ్వుతున్న ఆమె నోరును సుతారంగా మూస్తూ. 

"అదిగో అలా మీ బావగారి తారుమారు భాషకి అడ్డుకట్ట వేసానే" చెప్పింది నాంచారి. "బాగుంది అక్కా! నీ మారుతారు భాషకు తారుమారు బావగారు మారతారు అన్న నీ నమ్మకం వృధా కాలేదన్న మాట" నాంచారక్కను అభినందిస్తూ చెప్పింది చూడామణి. 

***** **శుభం** *****
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - ఆదివారం అగచాట్లు - by k3vv3 - 14-10-2024, 06:33 PM



Users browsing this thread: 4 Guest(s)